ప్రత్యేకం/ కల్పనా రెంటాల

banner31

స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక - ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది. ఈ విజయోత్సవ వేళ వేదిక నేతలతో సారంగ ముఖాముఖి. 1. ప్రరవే మొదలుపెట్టి ఎంత కాలమయింది? ఈ సదస్సు లో ఎంత మంది సభ్యులున్నారు? పుట్ల హేమలత : 2008 జనవరి 10,11తేదీల్లో అనకాపల్లి లో జరిగిన చర్చావేదిక ప్రరవే' ఏర్పాటుకు నాంది పలికింది . ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి రచయిత్రుల్ని అనకాపల్లి ఆహ్వానించి రెండు రోజులు చర్చలు జరుపుకున్నాం. ఆ సభల్లో స్త్రీవాద ఉద్యమాలు , స్త్రీలకు సంబంధించి అన్ని అస్తిత్వ వాదాలను గుర్తించి కలిసి పని చేయటం, స్త్రీల పై జరుగుతున్న దాడులకి వ్యతిరేక పోరాటాలు చేయటం , రచయిత్రులంతా ఎవరి అస్తిత్వాల్ని,భావజాలాన్ని వాళ్లు కాపాడుకుంటూ ఒకే వేదికపై కలిసి పని చేయటం అనే అంశాలపై సాధ్యా సాధ్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది . అనేక చర్చలు, అభిప్రాయాల అనంతరం దామాషా పద్దతి ప్రకారం అన్ని వర్గాల నుంచి అధ్యక్షులు, కార్య వర్గ సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది . ఆ తాత్కాలిక కమిటీని ' మనలో మనం' అని పిలుచుకున్నాం . దాన్నే ' ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక'గా రూపొందించుకొని ఇప్పటి వరకు విజయ వంతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం . ఇప్పటికి ఈ వేదికలో వంద మంది వరకూ సభ్యులున్నారు. ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరింతమంది సభ్యులు పెరుగుతారు. దీని ఫలితంగా స్త్రీల సమస్యలపై మంచి అవగాహన , కార్యక్రమాలు , ఆలోచనాత్మకమైన సాహిత్యం వెలువడే అవకాశం వుంది.   2. ఇప్పటి వరకూ వేదిక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది ? మల్లీశ్వరి : 2009 జనవరి 10,11 తేదీల్లో అనకాపల్లి లో మొదటిసారిగా " సవాలక్ష సవాళ్ళ మధ్య భిన్న అస్తిత్వాలు - ఒక ఉమ్మడి ఆకాంక్ష '', '' గతానుభవాలు ఎలాంటివైనా ఆశ లెపుడూ నిత్య నూతనమే '' అన్న ఆశతో అవగాహనతో ఉత్తరాంధ్ర రచయితలు, బుద్ధిజీవులు మనలో మనం నిర్వహణ కమిటీగా ( కె. ఎన్. మల్లీశ్వరి, కె. అనురాధ, ఇ పి యస్ భాగ్యలక్ష్మి, వర్మ, నారాయణ వేణు ) ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రచయిత్రులతో సంభాషణ చేసారు. అందరి ఆలోచనలూ ఒక్కటి కావడంతో వందమందికి పైగా రచయిత్రుల చర్చల ఆలోచనల అనంతరం మనలో మనం తాత్కాలిక కమిటీ ఏర్పడి కాత్యాయనీ విద్మహే ప్రతిపాదనను అంగీకరించి ఒక సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా … [ఇంకా చదవండి ..]

అనువాద నవల/ హువాన్ రుల్ఫో-చందూ

pedro_paramo1

వచ్చే గురువారం నుంచి: మాంత్రిక వాస్తవికతకి పునాది వేసిన నవల “పేద్రో పారమొ” మీ కోసం…

పేద్రో పారమొ నవల మొదట మెక్సికో సిటీలో 1955లో ప్రచురింపబడింది.  రచయిత హువాన్ రుల్ఫో వయసు అప్పటికి ముప్పయి ఏడో, ముప్పయి ఎనిమిదో. అంతకు మూడేళ్ళ ముందు ప్రచురించబడిన కథల పుస్తకానికి లభించిన ఆదరణ అంతంత మాత్రమే. విమర్శకులు దీన్నీ పట్టించుకోలేదు. అంతకుముందు ఎన్నడూ చూడని ధోరణిలో సాగిన ఈ రచనను ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకు తెలిసి ఉండదు. ఆ తర్వాత  హువాన్ మరో ముప్పయి ఏళ్ళు జీవించినా మరే నవలా, కథా రాయలేదు. అయితే తన జీవితకాలంలోనే ఆ నవల లక్షల ప్రతులు అమ్ముడు పోవడమూ, ముప్పయి పైగా భాషల్లోకి అది అనువదించబడటమూ చూశారు. లాటిన్ అమెరికన్ సాహిత్యంలో మాంత్రికవాస్తవికతకు రూపాన్నిచ్చినవాడిగా కీర్తీ గడించారు.  స్పానిష్ సాహిత్యంపై ఎనలేని ప్రభావం చూపిన ఈ నవల ఇరవయ్యో శతాబ్దపు గొప్ప రచనల్లో ఒకటిగా పరిగణింపబడుతూంది. గాబ్రియెల్ మార్కెజ్ కు ఈ నవల ఎంతగా నచ్చిందంటే ఆయన దీన్ని దాదాపు కంఠతా పట్టారు. ఆ తర్వాత ఆయన రాసిన One hundred years of solitude నవలకు ఇది ప్రేరణ అనీ చెప్పారు. 1910-1920 మధ్య కాలంలో మెక్సికన్ విప్లవం, తర్వాత పరిణామాల నేపథ్యంగా జరిగిన కథ ఇది. కాథలిక్ మత ప్రభావమూ, అణచివేతలూ, సాంఘిక ఆధిపత్యం మారుతూ ఉన్న క్రమమూ కనిపిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత అధునికీకరణ, నగరీకరణల్లో భాగంగా గ్రామాలనుంచి పట్టణాలకు వలసలతో పాడు బడ్డ ఊరు కనిపిస్తుంది. వీటనిటి మధ్యా నిష్కృతిలేని కొన్ని ఆత్మల తాలూకు మూలుగులు వినిపిస్తాయి. ఉత్తమ పురుషకథనంలో వర్తమానంలో సాధారణంగా మొదలయ్యే కథ హువాన్ ప్రెసియాడో వల్లకాటి లాంటి ఊరు కోమలా చేరగానే మారిపోతుంది. ప్రథమ పురుష కథనంలోకీ, భూతకాలంలోకీ ఆసులో కండెలా తిరుగుతూ ఉంటుంది. కథ చెప్పే పాత్ర మారుతూ కథనం ముక్కలు ముక్కలుగా సాగుతూ తెగుతూ నడుస్తుంది. తలపోతలూ, వలపోతలూ, గొణుగుళ్ళూ, సంభాషణలూ కలగలిసిపోయి ఎవరి గొంతు ఏదో గుర్తు పట్టడానికి పాఠకుడికి సమయం పడుతుంది.  చదవడం పూర్తయ్యాక ఆ పాడుబడ్డ ఊళ్ళో సంచరించే ప్రేతాత్మల ఘోషలు పాఠకుడినీ వెంటాడుతాయి. నవలను process of elimination గా వర్ణించే హువాన్ రుల్ఫో ఈ నవల గురించి అన్న మాటలు -  "చిన్న కథలు రాయడం వల్ల క్రమశిక్షణ అబ్బింది. నేను కనపడకుండా పోవలసిన అవసరమూ, నా పాత్రల్ని వాటి ఇష్టానికి మాట్లాడనివ్వవలసిన అవసరమూ తెలిశాయి. దాని వల్ల కట్టుబడి (structure) లేనట్టుంటుంది గానీ ఉంది. అది ఏకకాలంలో జరిగినట్టే ఉండి ఏ కాలానికీ చెందని నిశ్శబ్దాలతోటీ, వేలాడే … ఇంకా చదవండి

కొత్త పుస్తకం/ ఒమ్మి రమేష్ బాబు

akkineni kutumba rao

చరిత్రకి దర్పణం “కొల్లేటి జాడలు”

కొల్లేరు చుట్టూ జరుగుతున్న రాజకీయాలు కోకొల్లలు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కొల్లేటి సమస్య మెడకి చుట్టుకున్నట్టుగా ఉంది. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో నివసించేవారికి "కొల్లేరు అభయారణ్యం పరిధి తగ్గించి.. మిగిలిన భూముల్లో మీకే పట్టాలు ఇస్తాం'' అని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు. తీరా ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయ్యేలా ఉంది. ఎందుకంటే... కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ సుప్రీం కోర్టు నుంచి రాష్ట్ర పెద్దలకు నోటీసులు అందాయి. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. నిజానికి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే సావధానంగా ఆలోచిస్తే, చిత్తశుద్ధి ఉంటే ఎంచక్కా దొరుకుతుంది. కానీ అంత ఓపిక, తీరిక, సహనం పాలకులకు ఉండటం లేదు. ఈ నేపథ్యంలోంచి చూస్తే అక్కినేని కుటుంబరావు తాజా నవల "కొల్లేటి జాడలు''కి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ నవల గురించి మాట్లాడుకోవడం సందర్భోచితం కూడా..! ప్రకృతిని నమ్ముకుంటే మనిషికి మనుగడ సమస్య రాదు. కానీ, అదే ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తే, విధ్వంస పోకడలతో పర్యావరణాన్ని నాశనం చేస్తే మాత్రం కష్టాలు తప్పవు. అక్కినేని కుటుంబరావు "కొల్లేటి జాడలు'' నవల సారాంశం ఇదే. పైకి సింపుల్‌గా అనిపిస్తున్న ఈ విషయాన్ని అర్థంచేయించడం అంత తేలిక కాదు. క్లిష్టమైన ఈ కసరత్తుని సునాయాసంగా చేస్తూ పాఠకులకు ఈ ఎరుక కలిగించగలిగారు రచయిత. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఉన్న ఆ సరస్సు చుట్టూ వందలాది లంక గ్రామాలు.. అందులో నివసించే లక్షలాది ప్రజలు.. ఇదీ కొల్లేటి సరస్సు నిజ స్వరూపం! మరి, ఆరు దశాబ్దాల క్రితపు రోజుల్లో కొల్లేరు ఎలా ఉండేది..? అక్కడి జీవకళ ఏ తీరుగా ఉట్టిపడేది..? లంకగ్రామాల ప్రజలు ఎలా బతికారు..? వారి వృత్తులు, జీవనాధారాలు ఏమిటి? కొల్లేటితో, అక్కడి ప్రజలు ఎలాంటి సాంగత్యం కలిగి ఉండేవారు? ఆ జీవనచిత్రం ఇచ్చిన సందేశం ఏమిటి..? అన్న విషయాలు విపులంగా తెలుసుకోవాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొల్లేటి జాడలు నవల చదువుకోవడం ఉత్తమం. ఈ నవల చదువుతున్నంతసేపు పాఠకులు కొల్లేటి యాత్ర చేస్తారు. అక్కడి గతంలోకి జారుకుంటారు. తలమున్కలవుతారు. నవల ముగిసే సరికి చిక్కిశల్యమవుతున్న కొల్లేటి సరస్సు వర్తమానస్థితిని తలుచుకుని నిట్టూర్పు విడుస్తారు. ఇదీ ఈ నవల ద్వారా అక్కినేని కుటుంబరావు సాధించిన … [ఇంకా చదవండి ...]

కథా సారంగ/ సాయిపద్మ

Kadha-Saranga-2-300x268

రాదే చెలీ … నమ్మరాదే చెలీ ..(అనబడు ) త్రిబుల్ స్టాండర్డ్స్ కథ

“ఎక్కడికలా వెళ్తున్నారు స్వామీ.. తమరు ? “ అరిషడ్వర్గాలను దాటి, స్వర్ణ స్వర్గ ద్వారాలను, దాటుతున్న నారదుడు ఆగి వెనక్కు చూసాడు. ద్వారకాపరి , ఎక్సేక్యూటివ్ సూట్ లో , మెడలో వో ఐడెంటిటీ కార్డ్ ఉన్న తాడు తో , ఉన్న అతన్ని విచిత్రంగా చూసాడు నారదుడు. .. ఒక్క సారిగా ఉలిక్కిపడ్డట్టు , తన వేషధారణ ను చూసుకున్నాడు. నేనే నారదుడ్ని ! గుర్తు పట్టలేదా ? “ అన్నాడు నారదుడు, సంకోచంగా .. “ అయ్యో .. గుర్తుపట్టకేం స్వామీ.. రెగ్యులర్ విజిటర్స్ లిస్టు లో మీ పేరుంది. మా డేటా చాలా ఆప్డేటెడ్ ..” గర్వంగా చెప్పాడు ద్వారకాపరి. “ డేటా.. రెగ్యులర్ విజిటర్స్ ..!” ఏదో ఆలోచిస్తూ గొణుక్కున్నాడు నారదుడు. “ ఈ మధ్య మా పద్ధతులు అన్నీ మార్చాం స్వామీ.. మీరు ఎటు వెళ్ళాలో చెప్తే , నేను లే అవుట్ డీటైల్స్ ఇస్తాను. మొత్తం తిరుగుతారా.. ఇంద్రుల వారి కార్పొరేట్ ఆఫీసు చాలా బాగా వచ్చింది లెండి.. అలాగే నరకంలో , స్వర్గంలో అన్ని క్లాసుల వాళ్ళకీ తగిన ఏర్పాట్లు చేసారు. నారదుడికి కొంచం తల తిరిగినట్టు అయి, తమాయించుకొని, తెలివిగా అడిగాడు “ అన్నీ చూస్తాను , చూడొచ్చు కదా “ రెట్టించిన ఉత్సాహంతో ద్వారకాపరి – “ చూడొచ్చు గానీ స్టేజిల వారీగా పాస్సెస్ ఉంటాయి. ఒక్క నిమిషం మా కస్టమర్ కేర్ వాళ్లకి మాట్లాడి కనుక్కుంటా ఉండండి" నారదుడి అయోమయం ఎక్కువైంది.. ఇంక పిలవకుండా, చెప్పా పెట్టకుండా వచ్చి.. నారాయణ నారాయణ అంటూ తిరగటానికి వీలు లేదా.. హ్మ్మ్.. మొన్నటిదాకా బానే ఉన్నారు కదా ఏమైంది వీళ్ళకి.. ! నారదుడి కళ్ళల్లో ఆశ్చర్యం గమనించినట్టే ఉన్నాడు అతను. చెప్పటం మొదలెట్టాడు .. “ చాలా శిక్షలకి ఇప్పుడు భయపడే పాపులూ.. స్వర్గం అంటే ఉత్సాహపడే పుణ్యాత్ములూ తగ్గిపోయారు స్వామీ.. ఆ ప్రకారం మా సర్వే లో తేలింది. యమ ధర్మరాజుల వారికి ఇది కొంచం నామోషీగా తోచి, పూర్తి వ్యవస్థాగత మార్పులు చేద్దామని అనుకున్నారు. దానిలో భాగంగా స్వర్గ నరకాల లే అవుట్ మార్చేసారు ..!” “కానీ.. ఇంత వేగంగా “– నారదుడి మాట పూర్తి అయ్యేలోగా అందుకున్నాడు అతను. మా యమ కాలం ప్రకారం పెద్ద కష్టం అవలేదులే స్వామీ.. నేను లాగిన్ అయి టైం కౌంట్ అయింది, ఎక్కువసేపు మీతో మాట్లాడితే, నా జాబు లో నాకు ఇబ్బంది .. మీకోసం అన్ని డిపార్టుమెంటుల కీ , ఆక్సెస్ తీసుకున్నాను. వెళ్తారా లోపలి? “- ముందు ఎటు వెళ్ళమంటావు నాయనా .. ఇప్పటికే నాకు, ఇక్కడ మార్పులకి తల తిరుగుతోంది, - అన్నాడు నారదుడు నీరసంగా … [ఇంకా చదవండి ...]

విహారయాత్రా స్పెషల్/ సత్యం మందపాటి

rome4

అందాల వీధులన్నీ అంతమయ్యే చోటు.. రోమ్ నగరం!

రోమ్! ఈనాటి రోమ్ నగరం! ఇటలీ దేశానికి రాజధాని! రోమ! ఇటాలియన్, లాటిన్ భాషల్లో రోముని రోమ అంటారు! ప్రపంచాన్ని ఆనాడు గడగడలాడించిన రోమన్ సామ్రాజ్యం! జూలియస్ సీజర్, మార్క్ ఆంటోనీలను తన పాదాల దగ్గర కూర్చోబెట్టుకుని ఆడించిన, ఈజిప్ట్ ఫారా క్లియోపాట్రా! క్లియోపాట్రా అందానికి బానిసగా మారిన రోమ రాజ్యం! నేను చదువుకున్న అన్ని దేశ చరిత్రల్లోనూ, నాకెంతో ఉత్సాహాన్ని కలిగించిన ఆనాటి రోమన్ సామ్రాజ్య రాజధానికి వెళ్లటం. ఒక రకంగా అదో అనిర్వచనీయమైన అనుభూతి! ౦ ౦ ౦ పది వేల సంవత్సరాల క్రితమే అక్కడ దొరికిన రాతి ఆయుధాల ఆధారంగానూ, ఇతరత్రా జరిగిన పరిశోధన ద్వారానూ, రోములో దాదాపు 14,000 సంవత్సరాల క్రితమే ఆది మానవులు వుండేవారని తెలుస్తున్నది. మనకి వున్న పురాణాల కథల లాగానే, వీరికీ ఎన్నో పురాణ కథలున్నాయి. (Roman Mythology). రోములస్, రేమస్ అనే అన్నదమ్ములు ఒక తోడేలుకి పుట్టారనీ, తర్వాత రోములస్ రేమసుని చంపి అధికారం చెలాయించాడనీ ఒక కథ వుంది. అతని పేరుతోనే ఆ స్థలానికి రోమ్ అని పేరు వచ్చి వుండవచ్చు. రోమన్ చరిత్ర చాల ప్రాచీనమైనది కనుకా, ఈ వ్యాసానికి ఆ వివరాలు అనవసరం కనుకా, ఆ వివరాలు మీ పరిశీలనకే వదిలేస్తున్నాను. ౦ ౦ ౦ మేము ఎయిర్పోర్టు నించీ హోటలుకి వెళ్ళేసరికీ చీకటి పడింది. సామాను గదిలో పెట్టి, ముందు ఆఫీసులో బల్ల వెనుక వయ్యారంగా నుంచున్న బంగారం జుట్టు సోనియాని అడిగాను, ‘ఇక్కడ దగ్గర్లో ఏమైనా ఇండియన్ రెస్టారెంట్లు వున్నాయా, అమ్మడూ!’ అని. “ఈ పక్కసందులోనే వుంది గాంధీ అని ఒక ఇండియన్ రెస్టారెంట్. బావుంటుంది” అంది సోనియా. ఆమె దగ్గరే కొన్ని మ్యాపులు, చూడవలసిన విశేషాలు, వాటి వివరాలు తీసుకున్నాం. భోజనానంతరం, తర్వాత మూడు రోజులు ఏమేమిటి, ఎప్పుడెప్పుడు చూడాలో ప్లాన్ చేసుకున్నాం. ౦ ౦ ౦ మర్నాడు ప్రొద్దున్న తొమ్మిదింటికి బయల్దేరి వాటికన్ వున్న ప్రదేశానికి వెళ్ళాం. హోటలుకి దగ్గరే. ఒక అరగంట నడక. వాటికన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. దేశంలో దేశం. ఇటలీ దేశంలోని ఒక స్వతంత్ర దేశం. రోమ్ నగరంలో వున్న ఒక చిన్న దేశం! ఇలా అనటానికే వింతగా వుంది కదూ! 109 ఎకరాల్లో, 800మంది జనాభా వున్న దేశం. కాథలిక్ క్రిస్టియన్ మతానికి రాజధాని. 1929లో ఇటలీ దేశంనించీ బయటికి వచ్చి స్వతంత్ర దేశం అయింది. ప్రతి రోజూ ప్రపంచం నలుమూలల నించీ యాత్రీకులు కొన్ని లక్షల్లో ఇక్కడికి వస్తుంటారు. మేము వాటికన్ వెళ్ళేటప్పటికి సమయం దాదాపు తొమ్మిదీ నలభై ఐదు … [ఇంకా చదవండి ...]

కైఫియత్/ సంగిశెట్టి శ్రీనివాస్

"ఐలమ్మ..ఐ లవ్ యూ..." ఐలమ్మతో కొత్తతరం ప్రతినిధి సెలవు (ఫోటో: కందుకూరి రమేష్ బాబు)

ఐలమ్మని మరిచిపోతే క్షమించదు తెలంగాణా!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొక్కవోని ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ. 40 వేల ఎకరాల విసునూరు దేశ్‌ముఖ్‌ రేపాక వేంకట రామచంద్రారెడ్డి దౌర్జన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. ఏమాత్రం సొంత భూ వసతి లేని ఐలమ్మ 40 ఊర్లపై అజమాయిషీ చలాయించే ఆసామి వెన్నులో వణుకు పుట్టించింది. 1942లో విసునూరులో దేశ్‌ముఖ్‌ హైదరాబాద్‌లో తప్ప తెలంగాణలో మరెక్కడా లేని విధంగా అప్పుడే రెండు లక్షల రూపాయలు వెచ్చించి అధునాతనమైన భవంతిని / గడీని కట్టించిండు. దీనికి అప్పటి హైదరాబాద్‌ ఇంజనీర్‌ వల్లూరి బసవరాజు సూపర్‌వైజర్‌గా వ్యవహరించాడంటే ఆ భవన ప్రాధాన్యతను, ఆయన ఆర్థిక స్థితిని అంచనా వేయొచ్చు. ఈ వల్లూరి బసవరాజు ఆంధ్రమహాసభల్లో పాల్గొనడమే గాకుండా హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశాడు. అలాంటి విసునూరు దేశ్‌ముఖ్‌ని ఎదిరించి నిలిచింది. ఈమె కుటుంబ సభ్యులు ‘సంఘం’ (ఆంధ్రమహాసభ` కమ్యూనిస్టులు)లో ప్రధాన బాధ్యులుగా ఉండేవారు. దీంతో వారితో మాట్లాడేందుకు వచ్చిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, డి.సుబ్బారావులను చంపడానికి విసునూరు గుండాలు విఫల యత్నం చేసిండ్రు. వాళ్ల ప్రయత్న విఫలం కావడం కూడా ఐలమ్మ మీద మరింత పగ పెంచుకోవడానికి కారణమయింది. 1944లో భువనగిరి ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో ప్రజాచైతన్యానికి పటిష్ట పునాదులు పడ్డ నాటి నుంచి 1946 జూలై నాలుగున దొడ్డికొమురయ్య (కడవెండి) అమరత్వం వరకు అప్పటి నల్లగొండ జిల్లా లోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోశాయి. ఉద్యమ దివిటీలయ్యాయి. పాలకుర్తి, విసునూరు, కడవెండి, కామారెడ్డి గూడెం, దేవరుప్పలలు పోరాట కేంద్రాలుగా విలసిల్లాయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు, సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచారు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథ చెబుతుండగా విసునూరు దేశ్‌ముఖ్‌ గుండాలు మిస్కీన్‌ అలీ, గుమాస్త, అబ్బాస్‌ అలీ, వుత్తాలం రామిరెడ్డి, వనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తప్పతాగిఉన్న గుండాలకు తగిన శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్‌ముఖ్‌ ప్రేరణతో పోలీసులు వనమాల వెంకడిపై హత్యాయత్నం … [ఇంకా చదవండి ...]

అద్దంలో నెలవంక/ కెక్యూబ్ వర్మ

nareshkumar

మీరు ఒకసారి ఆగి చదవాల్సిన నరేష్ కవిత!

కవిత్వం కొన్ని సార్లు అలవాటుగా చదివేస్తూ పోలేం. అక్కడక్కడా కొద్ది సేపాగి మనల్ని మనం తడుముకుంటూ దాగి వున్న కాసింత నెత్తుటి గాయపు తడిని స్పర్శిస్తూ ఒక్కో పాదం అంచునుండి కిందకు పోగలం. వెళ్తూ మరల పైకి ఒకసారి చదవాలనిపిస్తుంది. చదివి కనుల తడిని తుడుచుకోబుద్ధి కాదు. అలాంటి కవిత్వం ఈ మధ్య యువ కవి కెరటం నరేష్ కుమార్ రాస్తున్నాడు. కవిసంగమం ద్వారా పరిచయమయిన ఈ అబ్బాయి కవిత్వం తనలాగే నిటారుగా నిబ్బరంగా మనముందు నిలిచి వుంటుంది. చాన్నాళ్ళుగా కవిత్వం చదువుతున్న మీరు, రాస్తున్న మీరు ఒకసారి ఆగి చదవాల్సిన కవిత్వం నరేష్ కుమార్. వ్యక్తిగత పరిచయంలోనూ తన నవ్వు వెనక వుండే ఒక విషాదపు జీర ఈ కవి అక్షరంలో కూడా ఒదిగి వుంటుంది. ధిక్కార స్వరంలా గర్జించేటపుడైనా ఒక మార్థవం మూర్తీభవించడం గమనించవచ్చు. ప్రతి పాదంలోనూ స్వేచ్చగా ప్రతీకలకోసం తపన పడకుండా ఒక్కో పదం అల్లుకుపోతూ సూటిగా సరళంగా హృదయాన్ని తాకేట్టు చెప్పడం నరేష్ కవిత్వంలో మనకు ఎరుకవుతుంది. ఇది ఇప్పుడు రాస్తున్న యువ కవుల ధారగా మనం గుర్తించ వచ్చు. కవిత్వాన్ని సుళువుగా నిస్సంకోచంగా నిర్భయంగా రాస్తున్న నేటి యువకవితరంలోని వాడిగా ఇటీవల 'వాకిలి'లో వచ్చిన ఈ కవిత చదివి మరొక్క మారు అందరం చదువుదామని ఈ పరిచయం.   నిరాసక్తం ఎందుకు వెలిగించి ఉంటారు ఎవరైనా ఆ దీపాన్ని..!? కంటి కొలకుల్లో మసిని తుడిచి వెచ్చని వెలుతురు స్రవించేలా .... జిగటగా కారే వెలుతుర్లో చేతిని ముంచాక స్వచ్చమైన చీకటితో మనసుని కడిగేసి ఎవరో వెలిగించే ఉంటారు ఆ దీపాన్ని.. ఎవరివో కొందరు బాటసారుల నిర్నిద్రా సమయాల నిరాసక్త నిరామయపు నిశ్శబ్దాన్ని కరిగించి కర్పూరపు పొడిగా రాల్చుకున్నాక స్వచ్చంగా స్వేచ్చగా వెలుగుని ఎగరెసేందుకు వెలిగించి ఉంటారు కొన్ని … [ఇంకా చదవండి ...]

‘పాఠక’చేరి/ భవాని ఫణి

index

సింహాసనాల వింతాట

ఎన్నో రాజ్యాలు , ఎందఱో రాజులు , రాజ్యం కోసం వాళ్ళు చేసే రాజకీయాలు , వేసే ఎత్తులు, తీసే ప్రాణాలు, చేసే త్యాగాలు ఇవన్నీ ఎన్నో కథల్లో కథనాల్లో చదువుతూ ఉంటాం . "A game of thrones" కూడా అటువంటి రచనే అయినా ఒక కొత్తరకమైన ప్రాచీన జీవన విధానాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది . ఇందులో కొంత మాయాజాలం కూడా ఉంటుంది సుమా అని చిన్న క్లూ ఇస్తూ అదేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తిని కలిగిస్తూ ఆద్యంతం చదివేలా చేస్తుంది . అద్భుతమైన కథనం మనల్ని మంత్రం ముగ్దుల్ని చేసి చెయ్యి పట్టుకుని ముందుకి నడిపిస్తుంది . (కొంత అడల్ట్ కంటెంట్ ఉంది కనుక పిల్లలకి నిషిద్ధం .) అదే George R. R. Martin రాసిన "A Song of Ice and Fire "సిరీస్ . ఇవి మొత్తం ఏడు పుస్తకాలట. ప్రస్తుతానికి ఐదు మాత్రమే పబ్లిష్ అయ్యాయి. అందులో మొదటిది 'A Game of Thrones ' లో ఏముందో చూద్దాం . ముందుగా కథ ఒక పెద్ద గోడ తో ప్రారంభమవుతుంది . పురాతన, మానవేతర జాతులనుండి రక్షించుకోవడం కోసం వేల సంవత్సరాల కి పూర్వం, వందల మైళ్ళ దూరం పాటు ఉత్తర దిశగా కట్టబడిన గోడ అది . అంతరించి పోయిందనుకున్న 'అదర్స్' అనబడే ఓ అనాగరిక పురాతన జాతి ఉంది ఉందంటూ ముందుగా ఒక చిన్న ఆధారాన్ని చూపించి కథలోకి తీసుకెళ్తాడు రచయిత . కథ వింటర్ ఫెల్ అనే ఒక రాజ్యం లో ప్రారంభమవుతుంది . ఒక్కో అధ్యాయం ఒక్కో పాత్ర దృక్పథం లో సాగుతుంది . అది వారి వారి అంతరంగాల్ని మనకి చూపడంతో పాటు కథని కూడా ముందుకి నడుపుతూ ఉంటుంది . ఉత్తర దేశానికి అధిపతి అయిన లార్డ్ Ned Eddard Stark కి ముగ్గురు అబ్బాయిలు (Robb ,Bran, Rickon), ఇద్దరు అమ్మాయిల(Sansa ,Arya )తో పాటు ఒక bastard son (Jon Snow )కూడా ఉంటాడు . వీళ్ళకి ఒక dire wolf కి చెందిన ఆరు పిల్లలు దొరుకుతాయి . సరిగ్గా వాళ్లకి సరిపోయేలా నాలుగు మగ,రెండు ఆడ … [ఇంకా చదవండి ...]

గాజు కెరటాల వెన్నెల/ మైథిలి అబ్బరాజు

munier_1886_05_one_more_please_wm

ఒకరికొకరు

అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ రెండు కుటుంబాలకీ చాలా కాలం కిందట ఏదో దెబ్బలాట అయింది. అది ఎందుకో కూడా ఎవరికీ గుర్తు లేకపోయినా అదొక అలవాటుగా వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరితో ఇంకొకరు మాట్లాడుకునేవారు కాదు. కానీ జాక్, జోకోసా లకి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం. గొర్రెలని కాస్తూ ఒకే పెద్ద మైదానం లోకి ఇద్దరి మందలనీ నడిపించి అలిసిపోయేదాకా ఆడుకుని అప్పుడు చెట్ల నీడలలో నిద్రపోయేవారు. ఆ మైదానం లో ఒక ఫెయిరీ ఉంటుండేది. వీళ్ళిద్దరినీ చిన్నప్పటినుంచీ గమనించేది. వాళ్ళ ముద్దు ముఖాలూ మంచి పద్ధతులూ ఆమెకి నచ్చేవి. వాళ్ళిద్దరినీ కాపాడే బాధ్యత తీసుకుని అప్పుడప్పుడూ కేక్ లు, రుచి అయిన ఆహారం , అందేలా చేసేది. వాటిని చూసి వాళ్ళిద్దరూ తినేయకుండా అవతలివారికి ఇచ్చేసేవారు. అంత ప్రేమ ఇద్దరిదీ. వాళ్ళు పెరిగి పెద్దయాక ఒక మధ్యాహ్నం విరగబూసిన ఆపిల్ చెట్టు కింద ఫెయిరీ వాళ్ళకి మొదటిసారి కనిపించింది. ఆకు పచ్చని దుస్తులు వేసుకుని పూల కిరీటం పెట్టుకుని సన్నగా పొడుగ్గా చక్కగా ఉన్న ఆమెని చూసి ముందు ఇద్దరూ విస్తుపోయారు. అయితే ఆమె తీయగా మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్ళ భయం పోయింది. వాళ్ళిద్దరూ తనకి ఎంతో నచ్చుతారనీ కనబడకుండా వాళ్ళకి తినుబండారాలు ఇచ్చినది తనే అనీ ఆమె చెప్పాక ఇద్దరూ ధన్యవాదాలు చెప్పారు. ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫెయిరీ వెళ్ళబోతూ '' మళ్ళీ కనిపిస్తాను '' అని చెప్పి, '' నన్ను మీరు చూడలేనప్పుడు కూడా మీతోనే ఉంటాను '' అని కూడా హామీ ఇచ్చింది. తనని చూసిన సంగతి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించింది. ఆ తర్వాతి రోజులలో తరచు ఆమె వాళ్ళని కలుసుకునేది. చాలా విషయాలు నేర్పేది. తన లోకపు అద్భుతాలని తెచ్చి చూపేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె అంది- '' నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాను కదా. బదులుగా నాకొక చిన్న పని చేసిపెట్టండి. నాకు బాగా ఇష్టమైన నీటి ధార ఉంది, తెలుసు కదా. రోజూ తెల్లవారక ముందే లేచి మీరిద్దరూ దాని చుట్టూ చప్టాని శుభ్రం చేయండి. నీరు ప్రవహించటానికి గులక రాళ్ళు అడ్డు పడితే తీసేయండి. ఎండుటాకులో తీగలో ఉంటే ఏరివేయండి. మీరు ఈ పనిని ఆలస్యం లేకుండా, అశ్రద్ధ చేయకుండా చేస్తే అది మీరు నాకు చెప్పే కృతజ్ఞతగా అనుకుంటాను. ఈ మైదానం లోకల్లా ఆ జలధార లో నీరు స్వచ్ఛంగా , తీయగా ఉన్నంతకాలమూ … [ఇంకా చదవండి ...]

‘పురా’ గమనం/ కల్లూరి భాస్కరం

STUDIES IN ANCIENT GREEK SOCIETY

యజ్ఞమూ…మాంత్రిక వాస్తవికతా…

యాజుడు ద్రుపద దంపతుల చేత పుత్రకామేష్టి చేయించాడని అన్నప్పుడు… నా కిక్కడ జార్జి థాంప్సన్ ను తీసుకు రావలసిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది. నిజానికి ఆయన్ను తీసుకురావడం ఇంత అలవోకగా జరగాల్సింది కాదు. కానీ ఆయనను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాలంటే అందుకు చాలా వ్యాసాలు తీసుకుంటాయి. అదే ఒక పెద్ద గ్రంథం అవుతుంది. అలాగని పూర్తిగా వాయిదా వేసే అవకాశమూ కనిపించడం లేదు. కనుక థాంప్సన్ అనే సముద్రంలోకి దూకడం అనివార్యమవుతోంది. త్వరగానే పైకి తేలడానికి ప్రయత్నిస్తాను. నేను చాలా ఏళ్ల క్రితం మాంత్రిక వాస్తవికత (Magical Realism) మీద థాంప్సన్ రాసిన ఒక చిన్న పుస్తకం చదివాను. ఎంత థ్రిల్లయ్యానో చెప్పలేను. నృత్యం, కవిత్వం, సంగీతం, నాటకం మొదట ఒకటిగా ఎలా ఉండేవో, క్రమంగా ఎలా విడిపోయాయో అందులో ఆయన రాశారు. నేను థ్రిల్ అవడానికి అదొక కారణమైతే, మన సంస్కృత, దేశీయ నాటకాలు, ఇతర దృశ్య రూపాలు, జానపద కళల పరిణామ క్రమానికి కూడా ఆయన పరిశీలన యథాతథంగా అన్వయించేలా ఉండడం అంతకంటే పెద్ద కారణం. థాంప్సన్ తనకు బాగా తెలిసిన గ్రీకు, ఇతర యూరోపియన్ సంప్రదాయాల గురించే రాశారు తప్ప మన సంప్రదాయం ఆయనకు అంత బాగా తెలుసునని చెప్పలేం. కానీ ఆ పుస్తకం అద్దంలో మన సంప్రదాయాన్ని కూడా చూసుకోవచ్చు. ఆ పుస్తకం నా దగ్గరనుంచి ఎలా మాయమైందో తెలియదు. దాని కోసం ఎంతో గాలించాను. దొరకలేదు. నెట్ లో వెతికాను. కనిపించలేదు. మరింత గట్టిగా శోధిస్తే కనిపించేదేమో తెలియదు. ఈ లోపల ఆయన రాసిన మరో పుస్తకం దొరికింది. దాని పేరు, STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AGEAN. రాంభట్ల గారు ఒకటి, రెండు విషయాలలో జార్జి థాంప్సన్ పేరు ప్రస్తావించడంతో వాటి గురించి ఉంటుందనే కుతూహలంతో ఆ పుస్తకం తెప్పించుకున్నాను. కానీ రాంభట్ల పేర్కొన్న సమాచారం అందులో దొరకలేదు. ఆయనకు సోర్సు చెప్పే అలవాటు లేకపోవడం ఓ సమస్య. కానీ పై పుస్తకంలో నేను పోగొట్టుకున్న పుస్తకంలోని విషయాలు కొంతవరకు ఉన్నాయి. ఇందులో THE ART OF POETRY పేరుతో ఒక అధ్యాయం ఉంది. దాని ప్రారంభంలోనే నాకు ఇంకో ఆశ్చర్యం. కవిత్వం పుట్టుక, దాని స్వభావాల గురించి చెప్పడం ఈ అధ్యాయంలోని విషయమనీ, దానిని ఒక సైంటిఫిక్ అంశంగా తను చర్చించబోతున్నాననీ ఆయన అంటారు. కవిత్వాన్ని కవిత్వం కోసమే ఆస్వాదించి ఆనందించేవారికి ఈ రకమైన పరిశీలన అంత సమంజసంగానూ, ఆకర్షణీయంగానూ కనిపించకపోవచ్చనీ, కానీ నిజానికి శాస్త్రీయదృక్పథం నుంచి … [ఇంకా చదవండి ...]

వీక్లీ సీరియల్/ కోసూరి ఉమాభారతి

egire-pavuramaa-10

‘ఎగిరే పావురమా!’ – 10

సినిమా కథ మొదట్లో అంతగా అర్ధం కాలేదు. సినిమాలో ఓ కొండంత మీసాలవాడు అనాధ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చుకొని, కొన్నాళ్ళు సాకిన తరువాత వాళ్ళని అవిటిగానో, మూగగానో, గుడ్డివాళ్లగానో చేస్తాడు. ఆ తరువాత ఇక వాళ్ళని బిచ్చగాళ్ళగా మార్చి, ఆ అవిటోళ్ళతో బిక్షాటన చేయించే యాపారం మొదలెడతాడు. ఆ మీసాలాడి నుండి తప్పించుకొని పారిపోయిన ఇద్దరబ్బాయిల కథే ఆ సినిమా. నాకు అస్సలు నచ్చలేదు. సినిమా అయ్యాక ఇంటికెళ్ళినంత సేపూ సినిమాలో నాకు నచ్చని ఆ మీసాల వాడి కథే గుర్తుండిపోయి చాలా విసుగ్గా, కోపంగా అనిపించింది. “ఏమో గుబులుగా ఉన్నావే గాయత్రి? సినిమా నచ్చలేదా? అడిగింది కమలమ్మ. నా ఆలోచనలో నేనున్నాను. “ఏం సినిమానే పాడు సినిమా. అట్టా ఏడన్నా జరుగాతాదా?” అన్నాడు రిక్షా నడుపుతున్న గోవిందు, మాకు వినబడేలా ఓ మారు ఎనక్కి తిరిగి.. “పిచ్చోడా, విజయవాడ లాంటి నగరాల్లో అవిటి యాచకుల నెలసరి సంపాదన నాలుగైదు వేల రూపాయలంట. ఈ రోజుల్లో బతుకుతెరువు కోసం యాచించే వాళ్ళు, వడ్డీలకి అప్పులిచ్చే స్థాయిలో ఉండారంట. అందుకే ఈ సినిమాలో మల్లేనే ఇట్టాంటివన్నీ నిజంగానే జరుగుతున్నాయిరా,” అంది కమలమ్మ పెద్దగా గొంతెత్తి, గోవిందుకి వినబడేలా. “సరేలేవే అక్కా, ఇట్టాంటి సినిమా సూపించాలా ఏంది?” విసుక్కున్నాడు గోవిందు. “పోనీలే గాని, ఆ సినిమాలో అమ్మాయి కంటే మన గాయత్రి ఎంతో అందంగా కళగా ఉందా లేదా? నువ్వు సెప్పు. నాకైతే, సినిమా యాక్టర్ కంటే గాయత్రి సక్కంగా ఉంది. వైద్యం చేయించి నడక వచ్చేస్తే,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా.... అవసరం లేని మాటలు ఆమెకి అలవాటే అని చిరాగ్గా అనిపించింది. “అరేయ్ గోవిందు, ఈ సారి మన కొత్తపాక సూపెట్టాల గాయత్రికి,” అంది మళ్ళీ పెద్దగా...నవ్వుతూ కమలమ్మ. రద్దీ లేని దోవవడంతో ఆమె గొంతు ఆమడ దూరానికి వినబడుతుంది.... “సర్లేవే, ఓ తడవ ఆదివారం అట్టాగే సూపెడదాములే,” అన్నాడతను. మరి కాసేపటికి, నన్ను కొట్టాంలో వదిలెళ్ళారు కమలమ్మా వాళ్ళు. సినిమా గురించి తెలీజెయ్యాలని తాత కోసం చూస్తే, నులక మంచం మీద అటు తిరిగి తొంగొనున్నాడు. నేనొచ్చేవరకు కాసుకొని ఉండకుండా తొంగున్నాడని కాస్త బాధేసింది. తాతకి ఇష్టంలేని మనిషితో తిరగడం నాకూ కష్టంగానే ఉంది. ‘తాతకి కమలమ్మ మీద కోపం పోతే బాగుణ్ణు’ అనుకుంటూ సినిమా గురించే ఆలోచిస్తూ నేనూ పక్క మీద చేరాను. ** పొద్దున్నే గుడికి బయలుదేర బోతుంటే తాత కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయాడు. దగ్గు, వాంతులు … [ఇంకా చదవండి ...]

దృశ్యాదృశ్యం / కందుకూరి రమేష్ బాబు

drushya drushyam 48

De-framing స్వేచ్చ!

పక్షిని చూస్తే మనసు తేలికవుతుంది. ఒక్కోసారి అలా ఎగురుతున్న పక్షితో చూపును పరిగెత్తిస్తే మనసూ తేలికవుతుంది. కానీ, చూపు మధ్యలోనే తప్పిపోతుంది. లేదా ఆ పక్షి మధ్యలోనే మనల్ని తప్పుకుని మాయమైతుంది. మళ్లీ వట్టి ఆకాశమే మిగులుతుంది. అయితే, సాధారణ దృష్టి కన్నాకొంచెం స్పందించే హృదయంతో చూస్తే ఏదీ తప్పిపోదనిపిస్తుంది. నిదానంగా పరికిస్తే, ఇష్టంగా పయనిస్తే, మనసు పక్షితో కవిత్వమై కొన్ని చరణాలైనా అలా గుండెల్లో గంతులేస్తుంది. అలాంటి ఒకానొక చరణం ఈ చిత్రం. అయితే, కెమెరా కన్ను తాలూకు చూపు ఇది. చిత్రం - ఒక్క పక్షి కాదనే ఈ దృశ్యాదృశ్యం. +++ మళ్ళీ చూడండి. ఈ ఛాయాచిత్రాన్నిచూస్తూ ఉండగా మనం పక్షిని మాత్రమే చూడం. ఆకాశమూ దృశ్యం అవుతుంది. అదే ఈ చిత్రం. పక్షి, ఆకాశమూ కాకుండా ఆ నల్లటి నలుపులో ఉన్నదేమిటి? అది భవనం. అదీ కానవస్తుంది చిత్రంలో. అదే ఈ చిత్రం. అవును. ఎగిరే పక్షి...ఎగరని ఆకాశమూ...నిశ్చలమైన ఆ భవనపు ఆర్చీ-ఇవన్నీ స్థిరంగా ఉండగా మనసు అలవోకగా గంతులేస్తుంది. అప్పటి రెక్క విప్పిన క్షణం కూడా ఈ ఛాయాచిత్రం. ఇక దృశ్యాదృశ్యం... +++ చిత్రమేమిటంటే ముందు పక్షి లేదు. ఆకాశమే ఉంది. ఆకాశంతోపాటు ఒక్కోసారి ప్రతీకాత్మకం ఇంకేమైనా ఉన్నయా అని వాటిపై దృష్టి పడినప్పుడు ఆ ఎగిరే పక్షి తట్టింది. ముందు గుంపులుగా వచ్చాయి. చేయలేకపోయాను. క్షణంలో పారిపోయాయి. వేచి ఉన్నాను. ఈసారి రెండు పక్షులు..జంటగా వచ్చి అటొకటి, ఇటొకటి వెళ్లాయి. తీశాను. కానీ, నచ్చలేదు. మళ్లీ వేచి ఉన్నాను. ఒక పక్షి వచ్చింది. మొదట్లో తీశాను. అదలా వుంచి, ఆ పక్షే ఇలా మధ్యలోకి వచ్చేదాకా వేచి ఉండి తీశాను. అదే ఇది. ఇంకో చిత్రమూ చేశాను. ఆ పక్షి చివరిదాకా వెళ్లాక తీశాను. ఆ తర్వాత ఆగిపోయాను. పక్షి లేదు. బహుశా అదే పక్షి స్వేచ్ఛ. చిత్రం. అది నా కెమెరా ఫ్రేంలోంచే కాదు, కెమెరా వ్యూ ఫైండర్ గుండా చూస్తుండగా, ఈ భవనం ఫ్రేంలోంచీ పోయింది. నేను బయటకు వచ్చి ఆకాశంలోకి చూస్తే కూడా కానరాలేదు. అది ఎటో అదృశ్యమైంది. అదే దృశ్యాదృశ్యం. మన ఫ్రేంలోంచే కాదు, దృష్టి పథంలోంచి వెళ్లిపోవడమే స్వేచ్ఛనా? అవుననే అనిపిస్తుంది. అందుకే ఆ చిత్రమూ నచ్చింది. తీయలేని ఆ ఛాయ... అదెంత స్వేచ్ఛ! చిత్రమూ!! +++ ఇట్లా, ముందు మొదట్లో ఒకటి చేశాను. మధ్యదాకా వచ్చాక ఒకటి చేశాను. చివరికి వెళ్లాక ఒకటి చేశాను. చేయడం ఒక … [ఇంకా ...]

ఈవారం కబురు/ సిక్కోలు బుక్ ట్రస్ట్

Invitation

సిక్కోలు బుక్ ట్రస్ట్ “మన ప్రపంచం” ఆవిష్కరణ

ప్రకటన / వంగూరి ఫౌండేషన్

chitten raju

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో లండన్ లో నాల్గవ ప్రప్రంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్),  "యుక్త" (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి సంయుక్త నిర్వహణలో  "నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" రాబోయే సెప్టెంబర్ 27 -28, 2014 తారీకులలో లండన్ మహా నగరంలో జరగబోతోంది.    ఐరోపా ఖండంలో తొలి సారిగా  తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్న ఈ మహా సభలలో వక్తలుగా పాల్గొని, తమ రచనలను, సాహిత్య పాటవాన్ని సహా సాహితీవేత్తలతో పంచుకోమని ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఐరోపా ఖండ వాసుల్ని వంగూరి ఫౌండేషన్  సాదరంగా ఆహ్వానిస్తోంది. . పూర్తి వివరాలు ఇందుతో జత పరిచారు.     వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ఇది వరలో నిర్వహించిన మూడు ప్రపంచ సాహితీ సదస్సులు, ఇతర సాహితీ సమావేశాల వివరాలు ఈ క్రింది లంకె లో చూడగలరు.  http://koumudi.net/images/telugusadassulu.gif … [ఇంకా చదవండి...]