చదువు/ఆన్వీక్షికి ఉగాది నవలల పోటీ ఫలితాలు

దివే వాళ్ళు లేకుంటే రాసేవాళ్ళు ఎందుకు రాస్తారు?

తెలుగులో ఒక పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం కష్టమైపోయింది. ఇది నిజం. ఇప్పుడు చాలామంది తెలుగులో మొదటి ఎడిషన్ అంటే రెండొందల కాపీలు ప్రింట్ చేస్తున్నారు.  అదే మలయాళంలో ‘ఆడు జీవితం’ నవల ఇప్పటికి 150 ఎడిషన్స్ ప్రింట్ అయ్యాయి. ‘ఒరు సంకీర్తనం పోలే’ అనే నవల లక్షల కాపీలు అమ్ముడైంది. ‘రాం కేరాఫ్ ఆనంది’ అనే నవల గత రెండు నెలల్లో లక్షన్నర కాపీలు అమ్ముడైంది. ఇవి అప్పుడప్పుడూ జరిగే ‘ఔట్ లయర్స్’ కింద తీసేసి పక్కన పెట్టినా, మలయాళంలో, తమిళ్, కన్నడలో తెలుగులో ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు. పోనీ తెలుగులో చదివేవాళ్ళు లేరా అంటే, మొన్నీ మధ్యన వచ్చిన బ్రహ్మానందం గారి అత్మకథ ఎన్ని వేల కాపీలు అమ్మామో మాకు తెలుసు. రాం గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ ఎన్ని వేల కాపీలు అమ్ముడయ్యాయో తెలుసుకున్నా, ‘ఇకిగాయ్’, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’, ‘శివ ట్రైలజీ’ లాంటి పుస్తకాలు పదివేలకు పైగానే అమ్ముడుపోయాయి. మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి, చివరకు మిగిలేది పుస్తకాలు నెలకి 500 కాపీలు పైగానే అమ్ముడవుతాయని ఒక అంచనా. ప్రతిలపి లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలో కొన్ని కథలు లక్షమందికి పైగానే చదివిన సందర్భాలూ ఉన్నాయి. మరి వీరంతా తెలుగు చదివేవాళ్ళే కదా? మరి ఇంతమంది చదువరులు ఉండగా పుస్తకాలు ఎందుకు అమ్ముడు పోవడం లేదు అనేది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే క్రమంలో పుట్టినవే ఆన్వీక్షికి, చదువు.

ప్రపంచ వ్యాప్తంగా పుస్తకాల కొనుగోళ్ల విషయంలో ఉన్న ఒక అంచనా ప్రకారం, 35% పుస్తకాలు నవలలు, 20% పుస్తకాలు సెల్ఫ్ హెల్ప్, 10% పుస్తకాలు బయోగ్రఫీలు, 10% చిన్న పిల్లల పుస్తకాలు, 10% నాన్ పిక్షన్ పుస్తకాలు అమ్ముడుపోతుండగా మిగిలిన పుస్తకాలన్నీ కలిపి మరో 15% అమ్ముడుపోతున్నాయి. ఇది మరీ ఖచ్చితమైన లెక్క కాకపోయినా, చిట్టచివరి 15%లో ఉండే కథలు, కవితలు లాంటి పుస్తకాలే ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా వస్తున్న పుస్తకాలు. తెలుగులో రచయిత అంటే అత్యధికంగా కథల సంపుటి లేదా కవితలు రాసే వాళ్లే మనకి అత్యధికంగా కనిపిస్తారు. మరి ప్రపంచ వ్యాప్తంగా పాఠకులు మొగ్గు చూపుతున్న ఇతర పుస్తకాలు వదిలేయడం వల్లనే మనకి పాఠకుల లేమి అని అర్థం చేసుకోడానికి పి.హెచ్.డిలు చెయ్యక్కర్లేదు. అత్యధిక పాఠకులను ఆకర్షించగలిగే నవల అనే ప్రక్రియను మనం పక్కన పెట్టి, ఇప్పుడు పాఠకులు లేరని బాధపడడంలో అర్థమే లేదు.

ఇది సమస్య.

దీనికి పరిష్కారం ఒక్కరి వల్ల కాదు. ఒక్క రోజులో అవ్వదు. రెండున్నర దశాబ్దాలుగా మనం వదిలేసిన దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే క్రమంలో మేము మొదటి అడుగు వేద్దామనుకున్నాం. అలా మొదలైందే ఉగాది నవలల పోటీ. మాకు వీలైనంతలో భారీ పారితోషకం అందచేస్తూ, రచయితలను నవల వైపు మళ్ళించాలనే ప్రయత్నంలో ఈ పోటీ ప్రకటించాం. దాదాపు ఆరు లక్షల రూపాయల ప్రైజ్ మనీతో ఇంతవరకూ తెలుగులో నవలలపోటీ జరిగినట్టు మాకైతే తెలియదు. ఈ పోటీకి మేము అనుకున్నదానికంటే మంచి స్పందనే లభించింది. కానీ ఎక్కువ శాతం పాతకాలపు కథలే వచ్చాయి. ఆ విషయాలన్నీ ఇంతకుముందు మరొక వ్యాసంలో పంచుకున్నాం. ఇప్పుడు నవలలపోటీ ఫలితాల విషయానికి వస్తే …

ఈ నవలలపోటీలో పాల్గొన్న చాలామంది రచయితలతో మేము ఫలితాలు ప్రకటించకముందే సంప్రదించి వారి నవలలు ఎడిట్ చేస్తే బాగవుతాయి అనుకున్న చోట వారి చేత రీరైట్ చేయించడం జరిగింది. దానికి కొంతమంది స్పందించలేదు. చాలామంది సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు ఫలితాల ప్రకటించిన తర్వాత కూడా వీలైనంత రీవర్క్ చేయించి, ఆ తర్వాతే పుస్తకాలను ప్రచురించే ఆలోచనలోనే ఉన్నాం. ఈ పోటీలో గెలుపొందిన రచయితలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటారనే అనుకుంటున్నాం.

ఈ పోటికి పంపించిన నవలల్లో మాకు వీలైనన్ని ఎక్కువ నవలలను పబ్లిష్ చేసే క్రమంలో గతంలో ప్రకటించిన నియమ నిబంధనలకు ఆతీతంగా ఈ ఫలితాలు ప్రకటిస్తున్నాం. ఎలాగైనా తెలుగు నవలకు మళ్ళీ పునర్వైభవం తీసుకు రావాలన్నదే మా ఆకాంక్ష.

బహుమతులు గెలుచుకున్న రచయితలకు అభినందనలు.

కడలి, సుదర్శన్ ఆన్వీక్షికి ద్వారా రచయితలయ్యారు. వారిద్దరూ ఈ రోజు రెండు వివిధ విభాగాల్లో మొదటి బహుమతి అందుకున్నారు. ఇది ఆన్వీక్షికి విజయంగానే మేము చూస్తున్నాం. మొదటి బహుమతి, రెండవ బహుమతి అని కాదు కానీ ఓవరాల్‌గా మేము బహుమతికి అర్హమైన నవలలను స్వీకరించడానికి పెట్టుకున్న విధి విధానాల్లో ముఖ్యమైనది – ఈ నవల కొత్త పాఠకుడిని ఆకర్షించగలదా? అని.

కడలి తన నవల ‘చిక్ లిట్’ ద్వారా ఒక అవసరమైన ఒక అర్జెంట్ వాయిస్‌ని ప్రస్తుత ప్రపంచానికి వినిపించే ప్రయత్నం చేసింది. సుదర్శన్ ఒక వెబ్ సీరీస్ ‌కి సరిపోయేలా ‘అనుకోకుండా’ అనే అద్భుతమైన థ్రిల్లర్ రాసి ఆశ్చర్యపరిచాడు. రంగస్థలం నేఫథ్యంలో వచ్చిన కెవివి సత్యనారాయణ నవల ‘యవనిక’ మాకు బాగా నచ్చింది. ఈ నవల కొన్నేళ్ల ముందొచ్చుంటే మనం మరాఠీ సినిమాని రీమేక్ చేయడం కాదు, మన సినిమానే ఇంకెవరో రీమేక్ చేసుకుని ఉండేవాళ్ళు. బెజ్జారపు వినోద్ కుమార్ రాసిన థ్రిల్లర్ నవల ఊహకందని ట్విస్ట్‌లతో నడుస్తూ, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ ‌లాంటి టెక్నాలజీలు కథనంలో వాడడం నచ్చింది.

కుమార్ యశస్వి రాసిన ‘వేసవి కూలీ’ మా అందరికీ బాగా వచ్చిన నవల. పాతికేళ్ళు కూడా నిండని ఈ రచయితకు ఇది మొదటి నవల. అయినా ఒక రోజులో జరిగే జీవితాన్ని కథనం చేయడంలో అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అలాగే మరో ముగ్గురు యువరచయితలు – ప్రసాద్ సూరి (24), భవ్య శర్మ (21), మొహమ్మద్ గౌస్ (26)  – సాధన చేస్తే భవిష్యత్తులో మంచి నవలలు రాయగలిగే సామర్థం కలిగి ఉన్నవాళ్లే. వీరందరికీ ఆలవిల్లి (సత్తూరు) నిర్మలా దేవి పురస్కారాల అందచేస్తున్నాం.

జోగిని వ్యవస్థ మీద సంధ్యా విప్లవ్ రాసిన ‘త్రికాల’, స్టూవర్ట్ పురం గురించి ఇంతవరకూ ఒక అథెంటిక్ డాక్యుమెంట్ లేని లోటు తీరుస్తూ సలీం రాసిన ‘లోహముద్ర’, మారుతున్న మానవ సంబంధాల్లో ఉన్న కాంప్లికేషన్స్‌ని కొంత మెలోడ్రామాతో రాసిన తటవర్తి నాగేశ్వరి నవల ‘ప్రేమే నేరమా?’ ఎంతో అవసరమైన పుస్తకాలు అనిపించాయి.

కృష్ణ కిశోర్ రాసిన ‘రుద్ర రుధిరం’  ఒక మంచి ఫాంటసీ థ్రిల్లర్. టైం ట్రావెల్ ఉంటుంది కానీ సైన్స్ ఫిక్షన్ కాదు. సుగుణా రావు నవల ‘పైనల్ డయాగ్నాసిస్’ చివరి పేజీ దాకా ఎంతో అసక్తికరమైన మలుపులతో సాగింది. ఎనిడ్ బ్లైటన్ సృష్టించిన ‘ఫేమస్ ఫైవ్’ లాగా కొయిలాడ రామ్మోహన్ రావు ‘ఎదురులేని ఏడు’ చిన్న పిల్లలు చదువుకోదగ్గ మంచి నవల.

అజ్ఞాతవాసి (సింహప్రసాద్), బుట్టబొమ్మ (సాయిరాం ఆకుండి), అన్వేషణ (శిరంశెట్టి కాంతారావు), ఆపరేషన్ రెడ్ (పాణ్యం దత్తశర్మ), అదృశ్య సంకెళ్లు (జయప్రకాశ్ సొంటి), కలిసుందాం కడదాకా (బొంతా లక్ష్మీ గాయత్రి),  తోకలేని పిట్ట (పుల్లా రామాంజనేయులు), దేవుడి మొర (ఆకురాతి భాస్కర్ చంద్ర), నాలో ఉన్న ప్రేమ (స్వప్నప్రియ గంజి), నియాంపురం (రాజా నరసింహ), బిట్టు దేవత (చంద్రశేఖర్ ఆజాద్), బ్లాక్ ఎండ్ వైట్ (వాణిశ్రీ), శృంగార యాత్ర (వి. రాజారాంమోహన్ రావు), సాలెగూడు (పివివి సత్యనారాయణ) నవలలు కొన్ని అవసరమైనవి, కొన్ని వినోదాత్మకమనవి కూడా ఉన్నాయి. ఈ నవలలు కూడా చదువులో ఈ బుక్స్ గా ఉంటాయి. రచయితల ఆసక్తిని బట్టి కొన్ని ప్రింట్ చేసే అవకాశం కూడా ఉంది.

మాకు వచ్చిన వందకు పైగా నవలల్లో ముప్ఫై నవలలు ప్రచురించి, రచయితలను నవల వైపు ప్రోత్సాహించాలనే మా ఈ ప్రయత్నం.

ఈ నవలలన్నీ ఎడిటింగ్, లే అవుట్, ప్రూఫ్ చేయడానికి చాలా సమయం పడ్తుంది. కాబట్టి ఈ నవలలు పబ్లిష్ చేయడానికి మరో మూడు నాలుగు నెలలైనా పడ్తుంది. అది కూడా ఒకేసారి అన్ని నవలలు కాకుండా డిశెంబర్ కల్లా అన్ని పుస్తకాలూ అచ్చు వేయాలనేదే మా ప్రయత్నం.

ఈ నవలలపోటీలో యువ రచయితలకు బహుమతులు అందచేసి వారిలో ఉత్సాహం నింపిన శ్రీనివాస్ ఆలవిల్లి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ నవలల పోటీ నిర్వహించడంలో సహకరించిన మిత్రులు, రచయితలకు మా కృతజ్ఞతలు.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు.

*

వెంకట్ శిద్ధారెడ్డి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నమస్తే sir,
    నవలల పోటీ నిర్వాహకులకు, విజేతలకు అభినందనలు..
    ‘yavanika’ అనే కన్నడ సినిమా, రంగస్థల నాటక నేపథ్యంలో వచ్చింది. అది ఈ నవల ఒకటేనా?
    నా సందేహం అడిగే సాహసం చేసినందుకు క్షంతవ్యూరాలిని🙏🙏

    • పేరు ఒకటైతే సినిమా నవల ఒకటే అవుతాయా? అంటే అలా అడగడంలో మీ ఉద్దేశం ఏమిటి?

  • మంచి ప్రయత్నం చేశారు. ఈ సారి ఇలా చేసినప్పుడు పాత కొత్త రచయిత లని మేళవించండి.
    నా అబ్జర్వేషన్ ప్రకారం తెలుగు వారు కొని పుస్తకాలు చదవరు. ఫ్రీ యాక్సెస్ వున్నవన్నీ చదువుతారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు