ఒక బంధం కొన్ని సవాళ్ళు

ఈ కథలో ‘భావాలను వలయం’గా నిర్మించి కథ చెప్పడం వల్ల భిన్న సందర్భాల్లో యువతీ యువకుల ప్రేమలు ఎలా ప్రభావితం అవుతాయో చెప్పడం కొత్తగా ఉంది.

వ్వన ప్రేమల్లో బలమైన ఆకర్షణ ఉంటుంది. స్త్రీ-పురుషులు తమకు తాము స్వయంగా ఒక బంధాన్ని ఏర్పరచుకున్నప్పుడు, దాని వల్ల సంభవించే పరిణామాలు వారి కుటుంబ, సమాజ జీవితాలను ప్రభావితం చేస్తాయి.ఈ పరిణామ దృశ్యాన్ని, ఆధునికత పల్లె చిత్రాన్ని, పల్లెటూరి మనుషుల నైతికతను, విలువలను తారుమారు చేసిన వైనాన్ని అస్సామి గ్రామీణ వాతావరణంలో లక్ష్మీనందన్ బోరా గారు ‘గంగా చిల్ నీర్ పాఖీ’అనే నవల రాశారు. దీనిని తెలుగులోకి అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి తెలుగులో ‘గంగాతీరపు పక్షి రెక్కలు’పేరుతో అనువదించారు.

ఈ కథకు ఎన్నుకున్న అంశం సాధారణమైనదే కానీ స్త్రీ శారీరక పవిత్రత అంశానికి, నాటి అస్సామి కుటుంబ క్షేమానికి మధ్య సంబంధం ఉందనే నమ్మకం నాటి రోజుల్లో బలపడి ఉంది. ఈ కథలో ఎక్కడా ఎవరూ, ఎవరిని ఏ విషయంలో బలవంతపెట్టలేదు. కానీ ఈ కథలో ‘భావాలను వలయం’గా నిర్మించి కథ చెప్పడం వల్ల భిన్న సందర్భాల్లో యువతీ యువకుల ప్రేమలు ఎలా ప్రభావితం అవుతాయో చెప్పడం కొత్తగా ఉంది.

అస్సామి సోనాయి తీరంలో జీవించే ప్రజలు “కుటుంబ దర్శన సారం”ను నమ్ముతారు. “పురుషుడు విపత్తులతో కూడిన తన దైనందిన జీవితం గడపటానికి పవిత్రతతో పాటు గృహిణి మీద ఆధారపడి ఉంటాడు. ఇలాంటి స్త్రీలు పవిత్రమైన మనసుతో జీవితం గడిపితే,ప్రేమ వ్యాపారంలో దిగకుండా ఉంటే స్త్రీ  శీల సంపదను ఆధారంగా చేసుకుని క్షణక్షణం విపదగ్రస్తుడైన పురుషుడు కులాన్ని ఉద్దరిస్తాడు. ఇదే సోనాయీ తీరపు పురుషుని “కుటుంబ దర్శన సారం.”దీన్ని నమ్మే ఈ ప్రజలు ఏ స్త్రీ ప్రేమలో పడినా లేక వివాహం తర్వాత ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నా, ఆ కుటుంబంలో పురుషులకు సంభవించే ఆపదలకు ఆమెను కారణంగా భావిస్తారు.

ఈ కథలో ముఖ్యపాత్ర వాసంతి. ఆమె అన్న భోగరామ్ తండ్రి మరణించాక కుటుంబ బాధ్యతను తీసుకుంటాడు. బట్టలు, జనుము అమ్మడం లాంటి వ్యాపారాలు చేసే ఆయన జీవితం అంతా నాగరికత ఆ గ్రామంలోకి ప్రవేశించి రోడ్లు, వంతెనలు రావడంతో మందగిస్తుంది. పెద్ద బట్టల షాపులు రావడం, అలాగే జనుము ఇంటికి వచ్చి తక్కువ రేటుకి తీసుకునే   దళారులు రావడంతో ఆయన జీవితం చిన్నాభిన్నం అవుతుంది. ఆయన ఇంటికి వచ్చిపోయే పొరుగు గ్రామం డాక్టర్ అయిన ధనుంజయ్ అంటే వాసంతికి ఇష్టం ఏర్పడుతుంది. అతను ఆమెని ప్రేమిస్తాడు. కుటుంబ ఆర్ధిక స్థితి చితికిపోయి ఉన్న భోగరామ్ పూర్వీకులు స్వాతoత్ర్య సంగ్రామంలో పాల్గొనడం వల్ల, ఆ కుటుంబ పేరు బలంతో గెలవాలనుకున్న ఓ రాజకీయ నాయకుడు అతన్ని డబ్బుతో ప్రలోభపెడతాడు. అలా ధనవంతుడిగా మారతాడు భోగరామ్. ఆ క్రమంలో పొరుగురి ధనుంజయ్ రాజకీయాల వల్ల విరోధి అవుతాడు. ధనుంజయ్ తో కలిసి లేచిపోవడానికి సిద్ధపడిన వాసంతి తన కుటుంబ పరువు కోసం ఆగిపోయి అన్న తెచ్చిన సంబంధం చేసుకుంటుంది.

ఈ కథలో వాసంతితో పాటు ప్రాముఖ్యత ఉన్న పాత్ర భోగరామ్. అతనిలో వచ్చిన మార్పులు మొత్తం వ్యక్తి స్వభావ తీరుతెన్నులను చిత్రించే క్రమం.వికలాంగ స్థితిలో ఉన్న వ్యవసాయం, వ్యాధిగ్రస్తమైన దేశపు పరిస్థితి,గ్రామ జీవితపు మితిమీరిన ఓర్పు,సరిక్రొత్త జీవితపు విలువలు,పరిస్థితులు, అతనిలోనే ఇంకో కొత్త వ్యక్తి జనించేలా చేశాయి. ధనం పెరగడం అతనిలో ఓ రకమైన స్వేచ్చను ఇచ్చింది.ఆ స్వేచ్చ అతన్ని దేనికైనా తెగించేలా,అలాగే దేన్ని లెక్కచేయకపోవడాన్ని,ఎవరికి భయపడకుండా ఉండటాన్ని బలపరిచింది.ఒక్కసారిగా ఎన్నికల సమయంలో రాజకీయనాయకుడికి ప్రచారం చేయడం,అతను గెలవడం,భోగరామ్ ను ధనవంతుడిని చేశాయి.ఆ ధనం అతని విలువలని,నైతిక జీవితాన్ని కూడా చిందర వందర చేసింది. అతను పరస్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటాడు,మందుకి బానిస అవుతాడు,భార్యను లెక్క చేయడం మానేస్తాడు. వాసంతికి అన్నలో వచ్చిన మార్పులని గమనిస్తూనే ఉంది. పురుషుని నైతిక స్వేచ్చకు లేని హద్దులు స్త్రీ నైతికతకు ఆపాదించబడటం సమాజంలో నాటి నుండి నేటి వరకు ఉన్న  జీవితచిత్రానికి దర్పణంగా నిలుస్తుంది.

వాసంతి, ధనంజయ్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నా, ఈ ఇద్దరి ప్రేమ భావనలో వ్యత్యాసం ఉంది. ధనంజయ్ ఆమెకు వివాహం కానంతవరకు ఆమెను తనతో తీసుకువెళ్ళే ప్రయత్నం చేశాడు. దాని వల్ల ఎక్కడి నుండో ఒంటరిగా వచ్చి వైద్యుడిగా తనకు వచ్చిన మంచి పేరు పోతుందని తెలిసినా దానికి తెగిస్తాడు.  వాసంతికి వివాహమై, భర్తకు ఈ ప్రేమ గురించి తెలిసి, బాధతో అతను ఏమి పట్టకుండా రోడ్డు మీద వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ కు గురై మరణిస్తాడు. అప్పటికే గర్భవతి అయిన ఆమె కడుపులో బిడ్డ మీదా ప్రాణం పెంచుకున్నా, మృత శిశువు జన్మిస్తుంది. ఆ సమయంలో ఆమె దాదాపు ఆహరం మానేస్తుంది. ఆ సమయంలో ఆమెను ధనుంజయ్ చూడటానికి వస్తాడు. ఆమె అతనితో వెళ్ళిపోతే బావుంటుందని అనుకుని అతనికి వర్తమానం పంపితే, అతను ఆ ఊరే వదిలి వెళ్ళిపోతాడు.

వ్యక్తి నైతికత మనిషి స్వభావసిద్ధమైనది కాదు. అది ఎక్కువగా వ్యక్తి భయాలు-అభద్రతల ప్రభావం వల్ల పని చేస్తూ ఉంటుంది. సమాజంలో కుటుంబ యజమాని సాధారణంగా మగవాడు కనుక, అతని మీదా ఆధారపడే స్త్రీల లక్ష్యం అతని క్షేమం కోసం తపిస్తూ, తమ ఆధారపడే తత్వానికి ప్రతిగా కఠిన నైతికతను పాటించడం ఒక రకమైన కృతజ్ఞత, బాధ్యతగా ఈ నేపథ్యంలో స్త్రీలు భావించి ఉంటారని అనిపిస్తుంది ఈ నవల చదువుతూ ఉంటే. అందుకే భోగరామ్ ప్రవర్తన మారినా, అతన్ని భార్య కూడా అడగలేకపోయింది.

అలాగే ఈ నవలలో ఇంకో కోణం వ్యక్తి తన నైతికత ఆవరణలో వచ్చే మార్పులకు తగినట్టు ఉండే ప్రాంతంలోనే ఉండాలనుకుంటాడు. భోగరామ్ దీనికి అసలైన నిదర్శనం. అందుకే అతని అవినీతి, ఆ పల్లె వాతావరణం హర్షించని చర్యలు అతను చేసినప్పుడు, జైలులో ఉండాల్సి రావడం జరిగాక, అక్కడ నుండి పట్టణంకు మారిపోతాడు.
సమాజంలో నైతికతకు ప్రామాణికత అంటూ ఉండదు. క్రమేపీ పూర్వపు నైతికత విరుద్ధత వర్తమాన జీవన శైలిగా కూడా మారడం జరుగుతుంది. దాని స్థానంలో మనిషి తన భయాలకు పరిష్కారంగా కొన్ని నైతిక విలువలను  ప్రతిపాదించడం అన్న క్రమం కొనసాగుతూ ఉంటుంది. సాహిత్యంలో కొన్ని రచనల్లో ఈ నైతికత ఏదో ఒక రూపంలో ప్రతిఫలిస్తుంది.ఈ నైతిక చలన దర్శనమే ఈ ‘గంగాతీరపు పక్షి రెక్కలు.’

*   *  *

రచన శృంగవరపు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు