స్వప్నం మరణించినప్పుడు

స్వప్నం మరణించినప్పుడు

నీకోసం నువ్వో గుప్పెడు కలల్ని ఒక సంచిలో నింపుకుని
ప్రయాణం మొదలు పెడతావు.
పక్షి గుడ్లలాంటి సున్నితమైన కలలవి !
రేపటి రోజున నిన్ను పక్షిలా మార్చి నింగికి ఎగరేసుకుపోయే
శక్తివంతమైన కలలూ అవే !!

బరువుగా అనిపించిన ప్రతీసారి
చెయ్యి మార్చుకుంటూ మోస్తూనే వుంటావు.
అప్పుడప్పుడూ అవి పదిలంగా వున్నాయో లేదో అని,
తడిమి తడిమి చూసుకుంటూనే వుంటావు.

నువ్వు కన్న కలల్ని నిజం చేసుకోడానికి
చెమట దేహాన్ని రోజూ పిండుకుంటూనే వుంటావు.
నిదురలో వచ్చిన కలలు కావవి
నిదురపట్టనివ్వని కలలు !!

ఒకానొక దశలో.. ఆ కలలు నిన్ను బతికించే
ప్రాణవాయువులా మారిపోతాయి.
నిన్ను నడిపించే తెల్లరక్తకణాలవుతాయి.
నిన్ను నువ్వు చెక్కుకోడానికి ఉపయోగపడే పనిముట్లవుతాయి.
నీ ఆశావాదపు హృదయంమీద అద్దుకున్న
ఆకుపచ్చని సంతకాలవుతాయి.
అంతెందుకు ,నీ యావదాస్తీ అవే అనిపిస్తాయి.

అనేకానేక సంఘర్షణలను నీకు కానుకగా సమర్పించుకున్న కలలు!
లెక్కకందని అవమానాలమధ్య నువ్వు పేనుకున్న కలలు!
నీ ప్రశ్నార్థకపు ఉనికిని కొందరి ముఖాలమీద ఆశ్చర్యార్థకంలా మార్చుకోడానికి
నీ ఆలోచనల కొలిమిలోంచి పుట్టిన పదునైన ఆయుధాల్లాంటి కలలు!!

నీలాగే ఎవరి కలల్ని వాళ్ళు మోసుకుపోతుంటే ఎంత బావుణ్ణు?

ఊహూ…

నీ కలలు సాకారమయ్యే కనుచూపుమేరలోనే
నీ చుట్టూ పెద్ద వ్యవస్థ ఏర్పడిపోతుంది.
నీ కలల్లోకి వాళ్ళ కలలు వేళ్ళూనుకోడం
అప్రయత్నంగా జరిగిపోతుంది.
రైలు దిగిన ప్రయాణికులు తమతమ సామాన్లన్నీ కలాసీకి అప్పగించినట్టు,
అందరి కలలూ నీకు అప్పజెప్పి వడివడిగా నడుచుకుంటూ పోతుంటారు.

నీ తలమీద, నీ భుజాలపైనా, నీ రెండు చేతుల్లోనూ మోయలేనంత బరువు.
అయినా నవ్వుతూ మోసుకెళ్లి ఎవరి సామాన్లని వాళ్ళకి భద్రంగాఅందజేశాక
నీ చిన్న సంచి గుర్తొస్తుంది.
వెనక్కి వచ్చి దారంతా వెతుక్కుంటావు.
చివరికి ఏదో ఒక ఫ్లాట్ ఫాం మీద ప్రయాణికుల కాళ్ళకింద
నలిగిపోయి, మాసిపోయి, ఓ మూలకి తన్నబడిన
నీ సంచి కనబడి కళ్ళు మెరుస్తాయి.
అమాంతం చేతుల్లోకి తీసుకుని ఆశగా తెరిచి చూస్తే..
ఆకాశంలోంచి కిందపడి చిట్లిపోయిన వడగళ్ళలా..
శకలాలు శకలాలుగా నీ కలలు !!

మరణించిన తల్లి స్తనాలమీద
పాలకోసం ఏడుస్తున్న పసిపిల్లాడిలా నువ్వు !!!

*

భాస్కరభట్ల

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • కలలు ఎప్పుడూ ఊహకు అందనంత కాలం బాగుంటాయి.
      అద్భుతంగా వ్రాశారు…

  • మరణించిన తల్లి స్తనాలమీద
    పాలకోసం ఏడుస్తున్న పసిపిల్లాడిలా నువ్వు !!! మంచి వాక్యం మొత్తం కవితను symbolise చేసింది సార్.

  • మరణించిన తల్లి స్తనాలమీద
    పాలకోసం ఏడుస్తున్న……
    ఆద్యంతమూ బాగుందండీ. అభినందనలండీ

  • కలలో పుట్టిన భావుకత… కళ్ళకు కట్టినట్టు ‘కవి’పించారు
    చివరి మాట కన్నీరు తెప్పించింది రవి గారు…. 🙏

  • మరణించిన స్వప్నానికి కూడా మీ కలం తో ప్రాణం పోస్తారు.
    నా స్వప్నాన్ని తాకింది . ధన్యవాదాలు భాస్కర భట్ల జీ🙏💐

  • నీలాగే ఎవరి కలల్ని వాళ్ళు మోసుకుపోతుంటే ఎంత బాగుండు……తమదైన వాటిని మోయడం కూడా బరువుగా భావించే మనుషులున్న సమాజం కదా…
    మరణించిన తల్లి స్తనాల మీద…….ఎంతటి కష్టాన్నైనా చెప్పుకునేంత ప్రేమ పంచే వ్యక్తి ఒక్క అమ్మే కదా…ఎందరివో తీరని కలలకు ప్రతిరూపంగా ఉంది మీ కవిత.

    సుధారాణి(సుధా మైత్రేయి)

  • Hrudhayantharalamlo ennonno kalalu podivi pettukuni saage jivtha prayanam.. Aneka haddhulatho Agamyagocharamga migilipothundhi ane ee kavitha.. Kavitha kadhu o jeevana thathvikata.. Mallimalli chadhuvuthunnakoddhi.. Na kalala sanchi inka na chethullone undhi.. Nenu dhanni eppatiki vadalanu anela biggaraga aravalanipinchindhi.. Inka inka chadhuvuthunte.. Mose baruvulenni meedha padda vatini akkade pathesi.. Na kalala sanchithone nenu sagutha ani gattiga palakalanipinchindhi…

    Very inspiring sir.. Na lifenu nake kallaku kattinatlu rasaru.. Heartfully tqs u sir nannu nene thelusukunela chesinandhuku

  • ‘నిదురలో వచ్చిన కలలు’ ‘నిదుర పట్టనివ్వని కలలు’గా పరిణామం చెందిన క్రమం కవిత్వంలో పదునుగా అల్లుకుపోయింది. ఆఖరికి అవి చిట్లిపోయిన వడగళ్లుగా, శకలాలు శకలాలుగా విడిపోయి; మనిషి ఆశను ఎట్లా భగ్నం చేస్తాయో అక్షరీకరికంచిన తీరు అభినందనీయం. భాస్కరభట్ల గారూ, మీ కవితాయానం కొనసాగించండి.
    – ఎమ్వీ రామిరెడ్డి

  • నీ కలల లోకి ఇతరుల కలలు జొరబడి వేళ్లూనుకొని చివరకు నీ కలని ధ్వంసం చేసే అంత వికృత వ్యవస్థ బాగా చిత్రీకరించారు .ఇతరుల కలలను మోస్తూ …వాటిని తీరాన్ని దాటించే మీరు …మీ కలలను పొదుగుకోలేని దైన్యం.. మరణించిన తల్లి స్తన్యం. ఒళ్ళు జలదరించేలా ఇతరులు మనపైన మోపే బరువును గుర్తు చేశారు. కలలు మనకు మిగిలిపోవు కలిమి కదా ..ఆ కలలు కూడ దోచుకునే దొరలను దూరం పెట్టాలి. చందమామతో సంబరాల రాంబాబు పెట్టుకున్న మొర గుర్తుకు వచ్చింది. “ఇంటిలోన నేను ఒంటి గాడిని అందరికీ సేవలు చేయ రేయి పగలు తిరగాలి. ఇంటి మీద నీవు ఒంటి గాడివి అందరికీ వెన్నెల పంచ రేయ్ ఎంత తిరగాలి”. అద్భుతమైన కవిత రాశారు. రాస్తూనే ఉండండి ప్లీజ్

  • మన కలలలోకి ఇతరుల కలలు వేళ్లూనుకుని మన స్వప్నాలను ధ్వంసం చేసే దైన్యం… మరణించిన తల్లి స్తన్యం. ఇతరుల చొరబాటు గుర్తెరగపో తే మన కలలను పొదుగుకోలేక పోగొట్టుకుంటాము. సరిగ్గా హెచ్చరించారు. మంచి కవిత రాశారు సార్ ధన్యవాదాలు .రాస్తూనే ఉండండి ప్లీజ్

  • “నీ కలల్లోకి వాళ్ళ కలలు వేళ్ళూనుకోడం
    అప్రయత్నంగా జరిగిపోతుంది”
    ……… ఈ వాక్యం అనుభవం లోకి వచ్చినప్పుడు నేను పడిన వేదన గుర్తొచ్చింది … అద్భుతం !
    Nice in coherence!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు