శ్రావణ మాసం

 కొన్ని చినుకులు… పసుపు… పేరంటం…
అగ్రహారం మీద శ్రావణ మేఘం కమ్ముకుంది. ఎర్రటి ఎండ వెళ్లిపోయి నాలుగు చినుకులు పడగానే.. మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది. వర్షం పిలుస్తున్నట్లుగా ఉంది. అగ్రహారంలో అందరి ఇళ్ల ముందు వర్షపు చినుకులు లేలేతగా పడుతున్నాయి. ఒక ఆనందపు హరివిల్లు ఏదో అందరి మనసులలో విచ్చుకుంటోంది. అగ్రహారానికి ఎండ వేడిమి తెలీదు. ఏసీలు, కూలర్లు అగ్రహారానికి పరిచయం లేదు. తల పైకెత్తి చూస్తే రెండు అంతస్థుల గిడుగు రామారావు గారి మేడ మీద నలుపు.. తెలుపుల మబ్బులు ఆవరించి ఉన్నాయి. నాలుగు చినుకులు పడగానే ఇంటి పెరట్లో ఆరేసిన తువ్వాళ్లు, లుంగీలు, చీరలు, బనీన్లు తమని లోపలికి తీసుకుని వెళ్లమని పిలుస్తున్నాయి. అగ్రహారంలో ఆడపిల్లలు తమ పరికిణీలను రెండు కాళ్ల మధ్య పెట్టుకుని పైనుంచి చిరు జల్లులు పడుతూండగా తలలు కాసింత వంచుకుని కుడి చేయిని తలపై పెట్టుకుని పెరట్లో ఆరేసిన బట్టల్ని హడావుడిగా లోపలికి తీసుకుని వెళ్తున్నారు.
ఇంకా ఎండాయో లేదో తెలీక డాబాల మీద… ఇంటి ముంగిట ఇత్తడి గిన్నెలలోను, డేగిసాల్లోనూ ఎండ బెట్టిన మాగాయి, మెంతికాయ ముక్కల్ని గబగబ లోపలికి తీసుకుని వెళ్తున్నారు.
శ్రావణ మేఘం అగ్రహారాన్ని రహస్యంగా… మెలి మెల్లిగా ఆవరించుకుంటోంది.
మేఘానికి అగ్రహారం ఆలంబనగా ఉంది…
మేఘానికి అగ్రహారం తోబుట్టువుగా ఉంది….
మేఘానికి అగ్రహారం పేరంటంలా ఉంది….
మేఘం అగ్రహారాన్ని తనలోకి తీసుకున్నట్టుగా ఉంది….
అగ్రహారామే మేఘాన్ని ఆహ్వానించినట్లుగా ఉంది….
శ్రావణ మాసం అగ్రహారం నుదిటి కుంకుమ…
శ్రావణ మాసం అగ్రహారం ఆడపడచుల కాళ్ల పారాణి..
శ్రావణ మాసం అగ్రహారానికి వాయినం…
****           ****         ****               ****
శ్రావణ మంగళవారం. అత్తవారింట్లో కొత్తగా కాలు పెట్టిన మా ఆడపడుచులు అగ్రహారానికి వచ్చారు. అగ్రహారం అంతా పేరంటాల సందడి. ఆది, సోమవారాలలోనే పేరంటపు పిలుపుల సంరంభం ప్రారంభమయ్యేది. తనతో పాటు ఇద్దరు, ముగ్గురు స్నేహితురాళ్లో, తోబుట్టువులనో తీసుకుని మా ఆడపడుచులు ఇంటింటికీ వచ్చి నుదుటిన కుంకం బొట్టు పెట్టి పేరంటానికి పిలిచే వారు. ఒకటి, రెండు చోట్ల ఇంట్లో వాళ్లు లేకపోతేనో, విధి వశాత్తు ఆ ఇంటిలో ముత్తయిదువలు లేకపోతేనో, ఆ ఇంటి సింహద్వారపు గడపకి బొట్టు పెట్టి “శ్రావణ మంగళవారం నోము…మా ఇంటికి పేరంటానికి రండి” అంటూ ఆహ్వానించే వారు.
ఇది ఒక ఉత్సవం.  ఒక వేడుక.. ఒక ఆనందం…
అగ్రహారపు ఆడపిల్లలు వెన్నెలలోనే కాదు.. శ్రావణ మాసం సాయం సంధ్య గోథూళి వేళల్లో తిరుగాడే అందమైన అక్షరాలు.
ఆషాఢ మాసపు చివరి వారం… శ్రావణ మాసం మొదటి వారంలో ఆకాశంలో చిరు జల్లులతో పాటు లేలేత ఎండ ఆగ్రహారాన్ని నారింజ రంగులోకి మార్చేసేది. అగ్రహారం పిల్లలు “ఎండా వానా కుక్కల నక్కల పెళ్లి” అంటూ పాటలు పాడుకుంటూ కాలానికి ఎదురెళ్లేవారు.
శ్రావణ మంగళవారం నోము నోచుకోవడం కొత్త పెళ్లి కూతుళ్ల సంప్రదాయం. నుదిటన కుంకుమ కలకాలం ఉండాలని, తన కుటుంబాన్ని ఆది దేవత మంగళగౌరి చల్లగా చూడాలని అగ్రహారం ఆడపడుచులు భక్తితో, శ్రద్ధతో చేసే నోము.
ఈ క్రతువుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పూజకు ఎంతో పవిత్రత ఉంది. సోమవారం సాయంత్రానికే ఇంట్లో మగవాళ్లు మంగళగౌరి వ్రతానికి కావాల్సిన సరంజామా ఇళ్లలో చేర్చేవారు. పూలు, అరటి పళ్లు, తమలపాకులు, వక్కలు సిద్ధం చేసే వారు. వాయినంలో ప్రధానమైన  పచ్చి సెనగలు సోమవారం రాత్రే తీసుకువచ్చి నీళ్లలో నానపెట్టేవారు. ఆ నీళ్లలో కాసింత పసుపు కూడా కలుపుతారు. ఇలా చేయడం వల్ల ఆ సెనగలకు శుభప్రదం చేకూరుతుందనేది నమ్మకమైతే, మరోవైపు వర్షాకాలంలో ప్రబలే బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండేందుకు ఆ పసుపు మేలు చేస్తుందనేది వైద్య శాస్త్రపు రహస్య సందేశం.
శ్రావణ మంగళవారం ఉదయమే తలారా స్నానం చేసి పట్టుచీరతో మెరిసిపోయే వారు మా ఆడపడుచులు. పిండివంటలు కూడా సిద్ధం చేసేవారు తల్లులు, పెద్ద వారు. అనంతరం మంగళగౌరి పూజ ప్రారంభమవుతుంది. తమలపాకులో పసుపు వినాయకుడు, మంగళగౌరిని తయారు చేసి వాటికి పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమతో వినాయకుడిని, మంగళగౌరిని పూజిస్తారు. ఈ పూజ ముగిసిన తర్వాత శ్రావణ మంగళవారపు అసలైన క్రతువు ప్రారంభమవుతుంది. బియ్యపు పిండి, ఆవునెయ్యితో ప్రమిదలు తయారు చేస్తారు. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి, వొత్తులు వేసి జ్యోతులు వెలిగిస్తారు. కొత్తగా పెళ్లి అయిన ఆడపడుచు అయితే ఐదు జ్యోతులు వెలిగిస్తారు. రెండో సంవత్సరం నోము నోచుకునే వారు పది జ్యోతులు… అలా ఐదు సంవత్సరాల వరకూ జ్యోతులు పెంచుకుంటూ చివరకు 25 జ్యోతులతో ఈ నోము నోచుకుంటారు. జ్యోతులు వెలిగించిన తర్వాత కుడిచేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకుని, అట్లకాడకు ఆవు నెయ్యి రాసి, దానికి కంకణంకడతారు. ఇలాంటి కంకణాలను అమ్మవారికి, నోము చేసుకుంటున్న వారు,  బుట్ట వాయినం తీసుకునే ముత్తయిదువుకు కడతారు. కంకణం కట్టి సిద్ధం చేసిన అట్లకాడను వెలిగించిన జ్యోతులపై ఉంచి మంగళగౌరి వ్రత కథను చదువుకుంటారు. ఈ కథ పూర్తి అయ్యే వరకూ ఆ అట్లకాడ జ్యోతుల మీద కాలుతూనే ఉంటుంది. జ్యోతుల వెలుగుతో ఆ అట్టకాడ కాటుకలా నల్లగా చిమ్మ చీకటిలా మారుతుంది. ఆ కాటుకను కళ్లకు పెట్టుకుంటారు నోము నోచిన వాళ్లూ… సాయంత్రం పేరంటానికి వచ్చేవాళ్లు. ఈ కాటుక ముందు ఐశ్వర్యారాయ్  ఐటెక్స్ కాటుక దిగదుడుపు. అంత వరకూ వెలిగించిన ఆ జ్యోతుల దీపం కొండెక్కగానే వాటిని నోము నోచుకునే వారే తినాలి. అందులో కూడా ఆరోగ్య రహస్యం ఇమిడి ఉండడం విశేషం. సాయంత్రం వరకూ పేరంటం ఉండదు. ఈలోగా నోము నోచుకున్న వారు ఆకలికి ఆగలేరని ఓ ముత్తయిదువుకు ముందుగా బుట్ట వాయినం ఇస్తారు. ఇందులో ఆకులు, వక్కలు, సెనగలు, పసుపు, కుంకుమ, పళ్లు ఆమెకు ఇచ్చి ఆమెను మంగళగౌరిలా తలుస్తారు. ఆ బుట్ట వాయినాన్నే సాయంత్రం జరిగే పేరంటంలో అందరికి పంచుతారు.
శ్రావణ మంగళవారం పేరంటం అంటే నలుగురు మహిళలు కూర్చుని కుళాయి దగ్గర కబుర్లు చెప్పుకోవడం కాదు. తమ పిల్లల చదువుల గురించి, వారి పెళ్లి సంబంధాల గురించి కలబోసుకోవడం. అగ్రహారం కుటుంబాల్లో సుఖాలని, కలతలని పంచుకోవడం. తమకున్న నగ నట్రాని పది మందికీ చూపించి మురిసిపోవడం.
“ఇదీ మెడ్రాస్ లో ఉంటున్న మా పెద్దాడు వాడి తొలి జీతంతో కొన్నాడు. సెలవు పెట్టీ మరీ కంచి వెళ్లి కొన్నాడు. చంద్రకాంతం రంగు అంటే నాకిష్టమని వాడికి తెలుసు. అందుకే ఈ రంగు కొన్నాడు” అని చెప్పుకోవడం.
అంతే కాదు. “ఇదిగో అమ్మాయి. కాళ్లకు పసుపు రాసేప్పుడు కాస్త చూసుకుని రాయి. జరీ అంచుకి పసుపు అంటుకుంటే  పోదు” అని కాసింత జాగ్రత్తలు చెప్పడం.
నేల మీద చాపలు పరిచి చుట్టూ కూర్చున్న అగ్రహారం అమ్మలు, ఆడపడుచులు సరదగా వేళాకోళాలాడుకోవడం.
” మొన్నామధ్య దక్షిణామూర్తి వీధిలో కనిపించింది మీ ఆఖరిది. చక్కగా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. దానికి సంబంధాలు చూస్తున్నారా… మా అన్నయ్య కొడుకున్నాడు. మీకభ్యంతరం లేకపోతే నే మాట్లాడతా”
“అయ్యో… అభ్యంతరమా… భలే వారే. మీ అన్నయ్య గారంటే నాకూ అన్నయ్యే. ఆయనతో ఓ మాట చెబుతా” ఇలాంటి సమాధానాలు.
“ఇది మా చెల్లెలు కూతురు. హైడ్రాబ్యాడ్ లో ఉంటారు. మొన్ననే వచ్చింది. అక్కడ డిగ్రీ చదువుతోంది. అన్నట్లు సంగీతం కూడా నేర్చుకుంటోంది”
“అవునా.. ఏది పిల్లా ఓ కీర్తన అందుకో”
ఒక్క కీర్తనతో ఆ హైడ్రాబ్యాడ్ చిన్నది ఆ వారం అగ్రహారంలో ఆడవాళ్లు మెచ్చిన హీరోయిన్.
” కాలికంతా పసుపు రాయకండి. జెస్ట్ బొటనవేలికి రాయండి. దిస్ ఈజ్ గుడ్. బట్ కాలంతా అయిపోతుంది”
“భలే దానివే. వేలుకి రాసుకుంటావా. ఇంకా నయం గోరుకు రాయమనలేదు. ఇది మన సంప్రదాయం. సిటీ గోల ఇక్కడికి వచ్చేస్తోంది”  ఓ పెద్దావిడ మందలింపు.
“ఇదిగో… ఏవండీ… మీరు పట్టాభి వీధి వారే కదా… మీ అబ్బాయి ఇసాపట్నంలో వుద్యోగం అట కదా.  మావాడు చెప్పాడు. మా చెల్లెలు విజయవాడలో ఉంటోంది. మా మరిది తాశీల్దారు. బాగానే వెనకేశాడు. దాని కూతురు కుందనపుబొమ్మ. ఒక్కతే కూతురు. కొడుకు. వాళ్లూ మీ ఇంటి కొద్దావనుకుంటున్నారు. పిల్లనివ్వడానికి అడిగేందుకు ”
“అవునా… కుందనపు బొమ్మలు మాకొద్దులేమ్మా… మామూలు అమ్మాయి చాలు.  తాశీల్దారు గారు కూతురు. మా మాట ఏమి వింటుంది. అయినా… పేరంటానికి వచ్చి ఇవన్నీ ఎందుకూ…”
ఇలా ఉంటాయి అగ్రహారంలో పేరంటాలు.
ఒక ఇంట్లో పేరంటం ముగించుకుని హడావుడిగా మరో ఇంటికి… అక్కడి నుంచి మరో ఇంటికి… ఇలా అగ్రహారం అంతా శ్రావణ మంగళవారం సాయంత్రం పట్టు చీరలు, పరికిణీలు కట్టుకున్న రామచిలకలు తిరుగుతున్నట్లుగా ఉండేది. శ్రావణ మంగళవారం వచ్చిందంటే అగ్రహారంలో కుర్రాళ్లు అరుగులకు అతుక్కుపోయే వారు. అగ్రహారం మీద ఓ కన్ను వేసే వారు. ఊరికి అటు వైపున్న వేరే ప్రాంతాల కుర్రాళ్లు సైకిళ్ల మీద వచ్చి మా ఆడపడుచులను అల్లరి చేస్తారనే జాగరుకతతో. ఈ జాగ్రత్తలో భాగంగా చిన్నా చితకా గొడవలూ అయ్యేవి. ఇవి ఆ వీధి పెద్దల దగ్గరికి వెళ్తే “అయినా బామ్మల అగ్రహారానికి మీకేం పనిరా. అక్కడికెందుకు వెళ్లారు ” అనే వారు ఆ పెద్దలు.
ఇది అగ్రహారం మీద ఆ వైపు వారికి ఉన్న గౌరవం.
పేరంటం ముగిసిన తర్వాత  రాత్రి  ఏ తొమ్మిదింటికో ఇళ్లకు చేరే వారు ఆడవారు. వాళ్లు అలా రావడం ఆలస్యం పేరంటంలో ఇచ్చిన సెనగల్లో వేసిన కొబ్బరి ముక్కల్ని మాలాంటి మగ పిల్లలు ఆ వాయినంల్లోంచి ఏరుకుని  తినేవాళ్లం.
శ్రావణమాసం అంతా సెనగలతో చేసిన వంటలతో అగ్రహారం కారంగా ఉండేది. సెనగలతో చేసిన వంటల్లో పాఠోళికే అగ్ర తాంబూలం. పాఠోళీ అంటే సెనగలతో ఓ వంటకం కాదు. శ్రావణ మాసపు అద్భుతం. ఇది గోదావరి జిల్లాలకే పరిమితమైన వంటకం. ముందుగా సెనగలని నానపెట్టాలి. వాటి తొక్కలు వలిచిన తర్వాత పచ్చి మిరపకాయలు, జీలకర్ర కలిపి రుబ్బుతారు. ఈ రుబ్బడంలో కూడా అగ్రహారం మహిళలు తమ చాకచక్యం చూపించే వారు. మరీ మెత్తగా రుబ్బితే పాఠోళి పాడవుతుంది. అందుకే కాస్త బరకగా రుబ్బుతారు. అంటే విడివిడిగా అన్నమాట.  మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకుతో  పోపు సిద్ధం చేసుకుంటారు. ఆ పోపులో అంతకు ముందే సిద్ధమైన సెనగల ముద్దని కలుపుతారు. ఆ ముద్దని విడివిడిగా అయ్యే వరకూ వేయిస్తారు. ఇదే పాఠోళి అంటే. శ్రావణ మంగళవారం తర్వాత వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో అగ్రహారం వీధుల్లో తిరిగే వారికి ఈ పాఠోళి వాసన తగిలి అగ్రహారం స్వర్గానికి ముఖద్వారంలా భ్రాంతి గొలిపేది. అ పాఠోళికి ఇద్దరు తమ్ముళ్లు కూడా ఉన్నారు. వారే మగాయి పచ్చడి,  వంకాయి పచ్చి పులుసు. ఆ తర్వాత స్ధానం తెల్ల వంకాయలతో చేసిన అల్లం పెట్టి సెనగలు కలిపిన ముద్ద కూర. చిరు జల్లులు పడుతూంటే వేయించిన కారపు సెనగల్ని అగ్రహారంలో మగవారు అరుగుల మీద కూర్చుని ప్రపంచ రాజకీయాలు చర్చిస్తూ తినే వారు.
***                            ***                       ***
శ్రావణ మాసం చూస్తూండగానే ఇట్టే గడిచిపోయేది. ఇంటికి వచ్చిన ఆడపడుచుల్ని తనతో తీసుకువెళ్లేందుకు అగ్రహారానికి వచ్చే వారు అల్లుళ్లు. అల్లుళ్లు వచ్చిన రోజు నుంచి పిల్ల వెళ్లిపోతుందనే దిగులు అందరినీ ఆవరిస్తోంది. ఆగ్రహారంలో రోడ్డు మీదకి వచ్చిన మగవారి ముఖాల్లో సంతోషం కనపడేది కాదు.  కుర్రాళ్లలో నెల రోజుల క్రితం నాటి హుషారూ కానరాదు. ఇక ఇళ్లల్లో తల్లుల సంగతి సరే సరి. అగ్రహారం అంతటా ఓ వర్షించడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి మబ్బు తునక ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ తిరుగుతూండేది. ఓ వెలితి అందరిని వెంటాడేది.
శ్రావణ శుక్రవారం పూజలు ముగిసాయి. శనివారం నుంచే అల్లుడు, కూతురు ప్రయాణాలకు సిద్ధం అవుతున్నారు. అంత వరకూ ఖాళీగా ఓ మూల నక్కిన ట్రంకు పెట్టెలు బట్టలతో నిండు చూలాలిలా మారుతున్నాయి. గోనె సంచుల్లో కొబ్బరి కాయలు, అప్పుడే పెట్టిన ఆవకాయ, మెంతికాయ, మగాయి ఉరగాయల్ని, కడుపు చలవ కోసం చేసిన చలివిడిని తల్లులు క్యారేజీల్లో సర్దుతున్నారు.
“ఇంటికి వెళ్లగానే ఊరగాయలు జాడీల్లో సర్దేసుకో తల్లీ. ఇందులోనే ఉంచేస్తే స్టీలు క్యారేజీలు పాడవుతాయి. అన్నట్లు నీళ్లు తగిలించకమ్మా. ఏటికేడాది ఊరగాయలు బూజు పట్టేస్తాయి. ఎప్పటికప్పుడు అల్లుడిగారికి ఏం కావాలంటే ఆ ఊరగాయ తీసి వేరే ప్లేటులోనో, గిన్నెలోనో తీసుకోమ్మా” అని జాగ్రత్తలు చెబుతున్నారు.
రిక్షాలు వచ్చాయి. ఓ రిక్షాలో సామాన్లు. మరో రిక్షాలో కూతురు, అల్లుడు బస్టాండికి బయలు దేరుతున్నారు. ఒకటి రెండు రోజుల తేడాలో అగ్రహారం అంతా ఇలాగే ఉంది. రిక్షాల వెనుక లూనా మీదో, బజాజ్ ఛేతక్ మీదో తలిదండ్రులు బస్టాండ్ కి బయలు దేరారు. తమ్ముళ్లు, అన్నలు వాళ్ల సైకిళ్ల మీద బస్డాండ్ కి చేరుకుంటున్నారు.
సాయంత్రం ఐదు గంటలు. హైదరాబాద్ బస్సు సిద్ధంగా ఉంది. అలాగే మరో సమయానికి మరో బస్సు. సీన్ మాత్రం ఒక్కటే.
ముందే రిజర్వేషన్ చేయించుకున్న బస్సులో కిటికీ పక్క సీట్లో కూతురు కూర్చుంది. కింద కిటికీ పక్కన తల్లి నిలబడి జాగ్రత్తలు చెబుతోంది. బస్సుప్రధాన ద్వారానికి దగ్గరగా అల్లుడు, మామగారు మాట్లాడుకుంటున్నారు. బావమరదులు బస్సు ఎక్కి కళ్లలో నీళ్లు తుడుచుకుంటూ అక్కతో మాట్లాడుతున్నారు. అక్క పరసులోంచి పది రూపాయల నోటు తీసి భర్తకు కనపడకుండా జాగ్రత్తగా తమ్ముడికి ఇస్తోంది. “వద్దు అక్కా. నాన్నగారు తిడతారు”
“పరవాలేదులే. ఏమైనా కొనుక్కో. బాగా చదువుకో. అల్లరి తగ్గించు. ఫ్రెండ్స్ తో తిరుగుతూ నాన్న చేత దెబ్బలు తినకు. సెలవులకి నా దగ్గరికి వద్దువుగానిలే” ఊరడిస్తున్న అక్క.
***                          ***                           ***
బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. డ్రైవర్ తన సీట్లో కూర్చున్నాడు. కండక్టర్ బస్సు చివరి సీటు దగ్గరికి వెళ్లి టిక్కట్లు సరి చూసుకుంటున్నాడు.
అల్లుడు బస్సు ఎక్కేశాడు. బావమరుదులు బస్సు దిగేశారు.
నాన్న బస్సు కిటికీ దగ్గరకొచ్చాడు. కిటికీలోంచి చేయి కింద పెడితే నాన్న చేయిని అందుకుని ” జాగ్రత్త అమ్మ. ఏదైనా పనుంటే వెంటనే కార్డు ముక్క రాయి. వచ్చేస్తా. అల్లుడు మంచి వాడు. బాగా చూసుకో” ఈ మాటలు నూతిలోంచి వస్తున్నట్లుగా ఉన్నాయి.
“నాన్నా మందులు వేసుకోండి. వేళకి తినండి. సిగరెట్లు తగ్గించండి. అమ్మ చాదస్తం. పట్టించుకోకండి. చూడాలనిపిస్తే వెంటనే వచ్చేయండి” ఈ మాటలు విన్న నాన్న
“నువ్వు “ఆడ”పిల్లవిరా. “ఈడ” పిల్లవి కాదు”
బస్సు బయలు దేరింది. చేతులూపుతూ బస్టాండులోనే ఉండిపోయారు ఆ దంపతులు, తోబుట్టువులు.
“ఆ కళ్లు తుడుచుకోండి. ఇంకెంత మరో మూడు నెలల్లో సంక్రాంతి. అప్పుడు వస్తుందిలెండి. నే రాలేదు మీ ఇంటికి. ఇది అలాగే” అంది ఆ ఇల్లాలు.
***                     ***                             ***
అగ్రహారం అంతటా గంభీర వాతావరణం.
అగ్రహారం  అంతటా గుండెలు పిండుతున్న బాధ
అగ్రహారం అంతటా పేగు కదిలిన చిరుశబ్దం
అగ్రహారం అంతటా మబ్బులు పట్టి కళ్లల్లోంచి కురుస్తున్న శ్రావణ మేఘం.
( ఇది నా సహచరి ఈశ్వరికి పేరంటం అంత ప్రేమతో)
*

ముక్కామల చక్రధర్

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చ‌క్ర‌ధ‌ర్ గారూ…
    మీ ర‌చ‌న‌లు అద్భుతం…
    ఇంత‌కు మించి ఇంకేమీ రాయ‌లేక‌పోతున్నాను..
    ప‌టేల్ మ‌ధుసూద‌న్ రెడ్డి, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, క‌వి, ర‌చ‌యిత‌

  • అగ్రహారంలో శ్రావణమాసాన్ని నయననందంగా దృశ్యికరించావు బుజ్జి. మరిన్ని మంచి జ్ఞాపకాలతో అందర్ని అలరించాలని కోరుకుంటున్నాను.

  • తాసిల్దారు బాగానే వెనకేశాడు. వెనకేయకపోతే తాసిల్దార్ ఏ ( టైప్ లొ సంధి కలవ లేదు ) కాదు. అప్పుడూ ఇప్పుడూ అంతే

    శ్రావణ మాసం., కాలేజి లొ చదివే వయసు కుర్రాళ్ళకి పండగే. ఎవరు లోకల్స్ ఎవరు ఏలియన్స్ నిర్ణయించు కోవడం తోనే సరి పోయేది.
    అలాగే సంక్రాతి వెళ్ళగానే, సావిత్రి వ్రతం చేసే కొత్త పెళ్లికూతుళ్ళతో అగ్రహారం కళ కళ లాడేది
    As usual, చాలా బాగా చిత్రీ కరించావు
    అభినందనలు

  • Pindesaaru… maa akkani dimpina rojulu gurtotchayi…Sravana masam…chanividi…patholi ..ivi veru cheyyaleni padalu …Sravana masam ante Agraharam mottam pavithram ga …ninduga vundedi …as usial ga Agraharam theesukellipoyaru malli

  • చాలా బాగుంది అయ్యా..ఎప్పటి లాగే కూచిమంచి అగ్రహారానికి తీసుకు పోయావు…శ్రావణమాసం కళ్ళకు కట్టినట్టు చూపించారు అదే చడివించావు ..ఇంకోటి మరిచావు వెండి buckets తీసుకుని వెళ్ళేవారు బకెట్ నిండా శెనగలు..శెనగలు మధ్యలో కొబ్బరి తో పాటు చలిమిడి వుండలు..అబ్బ వాటి రుచే వేరు…. వరలక్ష్మి వ్రతం జరింగిది అంటే. పొట్టనిండా….పిండి వంటలు..
    బాగుంది…చాలా బాగా హృదయా

  • శ్రావణ మేఘం జల్లు కురియగా….

    శ్రావణ మాసం ఆగడాలను, అల్లరిని, ఆప్యాయతలను, సందడిని, పేరంటాలను, చిరు జల్లుల ఆప్యాయతలను, మమతల మాధుర్యాలను చక్కగా వర్ణించారు. అభినందనలు.

  • బుజ్జిగాడికి “A well beginning is half completion” అనే సూత్రం బాగా పాటిస్తూ “మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది.” “వర్షం పిలుస్తున్నట్లుగా ఉంది.” “ఒక ఆనందపు హరివిల్లు ఏదో అందరి మనసులలో విచ్చుకుంటోంది.” లాంటి మాటలతో ప్రారంభం చేసి పాఠకుడిలో ఆశక్తి కలిగించడమే కాకుండా కొత్త రచయితలకు కూడా ఆదర్శంగా నిలుస్తాడని అనిపిస్తుంది. సనాతన హైందవ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల వారి కట్టుబాట్లు, పద్దతులు బాగా చక్కగా వివరించాడు “బుజ్జిగాడు”. “ సాయంత్రం పేరంటానికి వచ్చేవాళ్లు. ఈ కాటుక ముందు ఐశ్వర్యారాయ్ ఐటెక్స్ కాటుక దిగదుడుపు” ఇంకా “మంగళవారం తర్వాత వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో అగ్రహారం వీధుల్లో తిరిగే వారికి ఈ పాఠోళి వాసన తగిలి అగ్రహారం స్వర్గానికి ముఖద్వారంలా భ్రాంతి గొలిపేది.” లాంటి వర్ణనలతో ఒక ప్రత్యేకత కలిగి అవి “చక్రధర్ మార్క్” అనుకోనే విధంగా వున్నాయి. శ్రావణ మంగళవారం పేరంటంలో మహిళల కబుర్లు
    చాలా చాలా సహజంగా వున్నాయి. అలాగే ముక్తాయింపు కూడా అతి సహజంగా వుండి నా కళ్ళు చెమ్మగిల్లాయి.

  • అగ్రహారంలో శ్రావణమాసాన్ని నయననందంగా దృశ్యికరించావు
    .ఎప్పటి లాగే కూచిమంచి అగ్రహారానికి తీసుకు పోయావు…శ్రావణమాసం కళ్ళకు కట్టినట్టు చూపించారు.

  • బుజ్జీ
    ఇన్నాళ్లు మాటల మాంత్రకుడు ఎక్కడో భీమవరం లో పుట్టాడు అనుకున్నాం
    అక్కడే కాదు మా ఇంటి వెనకాల కూడా మరొకరు పుట్టాడు అనేలా వ్రాస్తున్నావు
    నీ కథనం, మెమరీ అద్భుతం.
    ఇల్లాగే వుండాలి అని కోరుకుంటూ
    నాగేంద్ర ప్రసాద్ పొడూరి

  • తుషారాల తుంపర, జడివానల పరంపర, 🌹మేఘాల మోహరింపు, తడి మబ్బుల తరలింపు ❤️ ఆకాశమంతా శ్రావణ మాసానికి అన్నీ సిద్ధం అవుతూ🌹మాలక్ష్మి లందరూ కుచ్చిళ్ళు తడవకూడదని శ్రమ పడుతూ🌹పేరంటానికి పిలిచిన ఇళ్లకు వెడుతూ🌹సగం తడిసీ తడిసిన పట్టుచీరలతో గబగబా అంగలు వేసుకుంటూ🌹శ్రావణ మేఘాల బరువును కొలమానం చేసుకుంటూ🌹 శనగలు వాయినం కొంగులో సద్దుకుంటూ🌹కాటుకలను దిద్దుకుంటూ🌹కుంకుమ బొట్టును సరిచేసుకుంటూ🌹 వీధులన్నీ గజ్జెల గలగలతో గంటలు కొట్టేస్తుంటే…….మాలక్ష్మమ్మ..మా ఊరిలోనే ఉండిపోయినంత ఆనందం.🙏🌹ఉషారం🚩………అన్న మన కూచిమంచి వారి అగ్రహారపు శ్రావణమాసం కళ్ళకు కట్టినట్టుగా రాసావ్…అద్బుతం….ఈ ఆనందంలో నా అభిప్రాయం.

  • చక్రధర్ గారు ….ఆ పేరంటం లో నేనే ఉన్నానా అన్నంత ఫీల్ కలిగించేరు …… ధన్యవాదాలు

  • Atydbhutam sahaja yadardha varnana atyanta aadi antya mahaadhutamaina nija rachana hrudayamantasampoornamga aakattukoni aakarshinchi Hrudaya nivedana hai jeevana sailini aavishkarinchina Ghantanu sampoornam ga santarinchukunna o rachayita mahaanubhaava mahaneeya mahitatma neekide sampoorna Hrudayapoorvaka abhivaadamu

  • బుజ్జీ కధనం చాలా బాగుంది,శ్రావణమాసపు సందడిలో ఏదీమరచిపోలేదు. పేరంటాలహడావిడి కళ్ళకు కనబడింది. మనం వీధుల్లోకాసిన కాపలా గుర్తుకోచ్చింది. మంగళవారం నోమునోచిన వాళ్ళకన్నా నోమును బాగా వర్ణించావు. క్రింది కోటాప్రసాద్గారు నేను కధచదివేడప్పుడు అనుకున్న చాలా భావాలని ఆయన రాసారు అందుకనే కోన్నిటిని నేను వ్రాయలేదు. అభినందనలతో…..వెంకు

  • శ్రావణమాసం కథ అద్భుతంగా ఉంది. ఇంత అందంగా ఉండే శ్రావణమాసాన్ని మనం శనగల్ని మించి ఆస్వాదించలేదే అని చాలా వెలితిగా ఉంది. ముక్కామల మార్కు పెళ్లి సంబంధాల కబుర్లలో వినిపించినా, ఎప్పుడూ ఉండే అద్భుత వాక్య ప్రయోగాలు లేకపోవడమే ఈ కథకి ప్రత్యేకత. కవులు, రచయితలు ధన్యజీవులు. 🙏🙏🙏

    • “మట్టి చిత్రమైన వాసనతో మాట్లాడుతున్నట్టుగా ఉంది.” I missed to pay special attention to this vaakya prayogam. Hats off!!! Also, “ఈ పాఠోళి వాసన తగిలి అగ్రహారం స్వర్గానికి ముఖద్వారంలా భ్రాంతి గొలిపేది”

  • చక్రధర్ గారు మీ కథ చద్వుతుంటే, కోనసీమ ఆ గ్రహరం వీదిలోంచి నదిచివెళ్తున్న అనుభూతి కల్గించింది. హృదయాన్ని తాకిన కథ. అభినందనల తో…

  • Very nicely written. Having lived in Kuchimanchi Agraharam, I can relate it to very well.

  • కథ చాలా బావుంది. ఆచార వ్యవహారాలు , ఆనాటి పద్ధతులు , పాఠోళీ , వంకాయ పచ్చడి , ఇత్యాదివి ఇంకా నీకు గుర్తుండవు చాలా ఆనందం గా ఉంది. వాస్తవికతకు దగ్గరగా ప్రకృతి ని వర్ణన బావుంది. అమ్మలక్కలు , పేరంటాలు సూపర్ వర్ణన. ఇలాగే మరెన్నో కధలను పాఠకులకందిస్తూ , నీవు సూర్యుని వలె మరింత ప్రకాశవంతమై ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. శుభం భుయాత్….కృష్ణా రావు.

  • అగ్రహారంలో శ్రావణమేఘం కథ కేన్వాసుమీద అందంగా చిత్రీకరించి బహుమతిగా అందజేసారు. చాలా హృద్యంగా నిజం అంత కమ్మగా అందించారు…ఆశ్వాదన మా వొంతు…
    చక్కగ విశిదపరిచారు…,అగ్రహారంలో శ్రావణమాస హడావిడి…
    హార్టు టచీ…గ …రాసారు సార్ !

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు