అసలైన ‘ముల్కీ’

‘నిండు నిమ్మల్లకింద-నిమ్మల్లకింద…అగజూడె గోపెమ్మా-ఆహాఁ…గొల్లవారి మందా అగజూడే గోపమ్మా’. అనే జానపద బాణీలో రాసిన ‘పండు వెన్నెల్లలోన-వెన్నెల్లలోన పాడేటి పాటలేమాయె? మన పల్లెటూరిలోన ఆడేటి ఆటలేమాయె..?‘, ‘ధగధగ మెరిసె పొద్దుపొడుపులా… భగభగమండే తెలంగాణరా’ అంటూ తెలంగాణ గ్రామీణ సంస్కృతిని, పోరాటాన్ని తెలంగాణ ఉద్యమ కాలంలో ‘ధూం ధాంలో భాగంగా ఊరూరికీ తీసుకుపోయిన ప్రజా వాగ్గేయకారుడు, ప్రజానాట్య మండలి గొంతుక, పాటల సైనికుడు మహమ్మద్ నిసార్ (1962-2020).

ముల్కీ

అసంఘటిత కార్మికుల మీద, వృత్తిదారుల గురించి, ప్రపంచీకరణ విధ్వంసం మీద కొన్ని వందల బతుకు పాటల్ని రాసిన విలక్షణ కలం నిసార్ ది. నిసార్ కవి, గాయకుడే కాదు కథకుడు కూడా. నిసార్ రాసిన ఒకే ఒక్క కథ ‘ముల్కీ’. ఈ ఒక్క కథలోనే తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, మత సామరస్యాన్ని అత్తరులా పరిమళించి చూపాడు. ఈ కథ మొదట 2004లో స్కైబాబ సంపాదకత్వంలో వెలువడిన ‘వతన్’ ముస్లిం కథా సంకలనంలో ప్రచురింపబడింది.

గ్రామాల్లో హిందూ ముస్లిం కుటుంబాల మధ్య సంబంధాలు స్నేహాన్నిదాటి ఎలా హృదయానుబంధాలుగా వెలసి, వారంతా ఒకే కుటుంబీకులుగా మసలుతారో, ఉపాధికోసం వున్న వూరు విడిచిపెట్టినా పీర్ల పండగనాడు కుటుంబమంతా అక్కడికి వచ్చి గడపడం మహమ్మద్ అబ్బాస్ కొడుకులకు అలవాటు. ఒక పీర్లపండుగనాడు తమ పల్లెకు వచ్చిన ఆ కుటుంబంతో మహమ్మద్ అబ్బాస్ నెపంగా అక్కడి పెద్దలు రెండు మతస్థుల మధ్యగల ఆలాయి బలాయిని మరోమారు నెమరువేసుకోవడమే ఈ ‘ముల్కీ’.

తెలంగాణలోని ఏ గ్రామమైనా భారత దేశానికి ప్రతిబింబంలా ఉంటుంది, భిన్నత్వంలో ఏకత్వం దానికి ప్రాణం. ముఖ్యంగా గంగా జమున తెహజీబ్ తెలంగాణ సంస్కృతిలో భాగం. కుల మతాలకు అతీతంగా ప్రజలు వావి, వరసలు పెట్టుకొని ఎంతో ఆత్మీయంగా జీవిస్తుంటారు. హిందూ, ముస్లింల సఖ్యత నిత్య జీవితంలో ఎంతో మానవీయతను ప్రదర్శించి ఆదర్శతను చాటుతుంది. మొహర్రం (పీర్ల పండుగ)లాంటి పండుగల్ని ముస్లింల కంటే ఎక్కువగా హిందువులే జరుపుకుంటారంటే అతిశయోక్తి కాదు.

ఆశన్న, ఊశన్న (హసన్, హుసేన్) అనే పేర్లు చాలా మంది హిందువులు కూడా పెట్టుకుంటారు. చాలా గ్రామాల్లో పీరీల పండుగకు హిందువులే పీరీలను ఎత్తుకొని గ్రామంలో ‘సవారి’ తిప్పుతారు. పీర్లకు దట్టీలు కట్టి, కుడుకలు, గాజు, పువ్వుతో సంప్రదాయబద్ధంగా అలంకరిస్తారు. 10 రోజుల పాటు ముస్లింలతోపాటు హిందువులు సైతం భక్తి శ్రద్ధలతో ప్రార్ధనలు నిర్వహిస్తారు. పీర్లను ప్రతిష్టించిన అషుర్‌ ఖానా ముందు గుండ్రంగా అలావా నిర్మించి, అందులో అగ్ని గుండాలు ఏర్పాటు చేసి చుట్టూరా తిరుగుతూ పాటలు పాడుతూ అసైదులా ఆటలు ఆడతారు.

సంతాప దినాలు ముగిసిన అనంతరం పీర్లను గ్రామంలోని ప్రధాన వీధుల్లో మేళతాళాల మధ్య ఊరేగించి చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా కుల మతాలకు అతీతంగా ముస్లింలు, హిందువు కలిసి జరుపుకునే మొహర్రం పండగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ‘రో రో కహెతీతీ ఖాసింకి దులహన్! చుడియా మై బాదానే న దూంగీ! ఏక్ దో దిన్ కి హు మై సవాగిన్ చుడియా మై బాదానే నా దూంగీ!’ అని పాడుకుంటూ పోతుంటారు.

ఆలావా ఆడేటప్పుడు కూడా ‘తల్లల్లో ఆయిలో! దుంబోలికే! ఆయాసో! దూలో! ఏక్ మారీ!’ అని పాడుకుంటూ ఉత్సాహంగా ఆలావా చుట్టూ తిరుగుతుంటారు. అయితే విచిత్రం ఏంటంటే పీరీలు ‘ఇల్లిల్లు తిరిగినా మాదిగిండ్లకు పోవు. ఆసలు మాదిగోళ్ళు డప్పు కొట్టకుంటే పీర్ల పండుగే లేదు. కాదు. అల్వా ఆడాలన్నా, సిగం రావాలన్నా, సవ్వారి లేవాలన్నా, ఊరు తిరుగాలన్న అంతా డప్పులతోనే పనాయే. మరి ఆ డప్పులోళ్ల ఇంటి ముందల్కి సవార్లు పోయే రివాజు మా ఊర్లే ఎందుకు లేదో నాకు సమజు గాదు’ అని కథకుడు వాపోతాడు. ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు ‘ముల్కీ’ కథలో కనిపిస్తాయి.

శతాబ్దాలుగా హిందూ ముస్లింల ఐక్యత ఇలాగే కొనసాగింది కానీ ఆఖరు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పీరియడ్ లో రజాకార్ల పీడనలో ముస్లింలు తాము రజాకార్లం కాదని, ఈ దేశ మూల వాసులమని నిరూపించుకోవడం చాలా కష్టమైంది. ‘సంగం’ ప్రతినిధులు ఊళ్లెకు ఎవరు కొత్తగా ముస్లింలు వచ్చినా అతడ్ని పట్టుకొని నిలదీసేవారు. తాను రజాకార్ మనిషిని కాదని రుజువులు చూపించి నిరూపించుకోవడానికి తల ప్రాణం తోకకొచ్చేది.

దీంతో ఊళ్లోని ముస్లింలంతా పొట్ట చేతపట్టుకొని చెట్టుకొకడు, పుట్టకొకడు చెల్లాచెదురయ్యేవారు. ఇదే సమయంలో నిజమైన ‘ముల్కీ’ని తెలంగాణ పల్లీయులు ప్రాణమిచ్చి కాపాడుకునేవారు. తుర్కోళ్లు లేకుంటే ఊరికి బర్కతుండదని, తురుకోళ్లు లేకుంటే ఊరంతా దోడుదోడుగుంటదని ‘సంగ’పోళ్లను ఎదిరించి మరీ ముస్లింలను అక్కునజేర్చుకునేవారు. ఈ పచ్చిపచ్చి ఆత్మీయతంతా ఈ ‘ముల్కీ’ కథలో చాలా హేతుబద్దంగా రికార్డ్ అయింది.

కథ మొహర్రం తొమ్మిదో రోజుతో మొదలై పదవ రోజుతో ముగుస్తుంది. అంటే కథా కాలం కేవలం ఒక్క రోజే. అయితే ఈ మధ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, సంగం క్రియాశీలత, రజాకార్ల అరాచకత్వాలు, పల్లె ప్రజల ఆత్మీయతానురాగాలు, పీరీల ఊరేగింపు… ఎన్నో దృశ్యాలు మన ముందు సినిమా రీళ్లలా కదిలి పోతాయి. నిజానికి హిందువుల జీవితాలు ముస్లింలతో ఎంతో పెనవేసుకొని ఉంటాయి. మసీదుకు పోయి పిల్లలకు జడుపు మంత్రాలు వేయిస్తుంటారు, తాయత్తులు కట్టిస్తుంటారు. పిల్లలు కానీ ఆడవాళ్ళు పిల్లలు కావాలని పీరీల ముందు పబ్బతి పట్టి వరాలు కోరుకుంటారు. హలాల్ చేయిస్తుంటారు. ఇట్లా అదొక సాంస్కృతిక అనుబంధం. ఇదంతా కథలో చాలా నేర్పుగా కూర్చాడు కథకుడు.

సాధారణంగా చారిత్రక కథలు రాస్తున్నప్పుడు అది కథగా కాక వ్యాసంలా మారిపోతుంది. కానీ నిసార్ ఈ ప్రమాదాన్ని చాలా ఒడుపుగా దాటుకొని కథంతా మనస్సుకు హత్తుకునేలా రాశాడు. కథంతా మౌఖిక శిల్పంలో సాగుతూనే ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ లో కూడా నడుస్తుంది. కొంత మంది ముస్లిం కథకులు కథకు ముస్లిం ఫ్లేవర్ తీసుకు రావాలనే ఉబలాటంతో కావాలని ఉర్దూ పదాలు వాడి పాఠకులకు దూరమౌతుంటారు. కానీ ఈ కథలో నిసార్ చాలా జాగ్రత్తగా అవసరమున్న దగ్గరే ఉర్దూ పదాలు వాడడం వల్ల కథకు ఆనాటి వాతావరణాన్ని కల్పించినట్లు అయ్యింది.

ఊరి నిండుగానే కాదు మన గుండె నిండా కూడా పీరీల పండుగ అలవా గుండం లాగే ఎగిసి పడుతుంది. అయితే ‘నా చిన్న తనాన కోమటోల్ల అరుగుల కాడ చిలుకల పేర్లు, కుడుకలు కొనేటోల్లు గుంపులు గుంపులు గుండెటోల్లు. చిన్న పిల్లల మెడల నిండా చిలుకల పేర్ల దండలు కనిపిచ్చేవి. పడుసు పోరగాండ్లు పడుసు పిల్లలకు వరుసలు కలిసినోళ్ళు పరాష్కాలాడుకుంట పోటీలు పడి కుడుకలు ఇప్పిచ్చేది. ఊర్లే ఉన్న పడుసోళ్ళంతా కోమటోళ్ళింటికాడ జాతర లెక్కుండేది. ఇప్పుడా దుకాన్లు లేవు. ఆ జనాల్లేరు. ఆ జోరు లేదు, ఆ మజా లేదు’ అని రాను రాను పండుగ ఎంత యాంత్రికంగా తయారయిందో చూసి తల్లడిల్లి పోతాడు కథకుడు.

కాలం ఎంత మారినా, పండుగ రూపు రేఖలు ఎంత మారినా, పరిస్థితులు ఎంత మారినా ముస్లింల మాయిముంత మాత్రం ఈ దేశంలోనే ఉందని ముస్లింల పౌరసత్వానికి ఒక గట్టి హామీనిచ్చి ముగుస్తుందీ కథ.

(8 జూలై 2020న కరోనా బారిన పడి అకాల మరణం పొందిన వాగ్గేయకారుడు నిసార్ కు అశ్రు నివాళి)

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

29 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుత విశ్లేషణ సర్!!👌👍💐
    మీరు ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ..రవీందర్ బూర.

  • నిసార్ కథ మీద ఇమ్మిడియేట్ గా నీ కాలమ్ లో రాయడం చాలా బాగుంది శ్రీధర్! ముల్కి గొప్ప కథ. నిసార్ ఉంటే మరిన్ని కథలు అందించేవాడేమో! విశ్లేషణ బాగుంది.

    • చాలా చక్కని విశ్లేషణ.’ ముల్కీ’ కథను సరియైన సమయంలో అందించడం.. నిసార్ నిబద్ధతను , తెలంగాణ మీది మమకారాన్ని, వారి దిశా సంకేతాలను తెలియజేస్తున్నది. కళ్ళకు కట్టినట్టుగా వివిరిస్తూ.. విశ్లేషించడం ళ్రీధర్ గారి సాహిత్య సామర్థ్యం ప్రస్ఫుటమవుతోంది. వారికి హృదయపూర్వక అభినందనలు💐💐💐🙏

    • చాలా చక్కని విశ్లేషణ.’ ముల్కీ’ కథను సరియైన సమయంలో అందించడం.. నిసార్ నిబద్ధతను , తెలంగాణ మీది మమకారాన్ని, వారి దిశా సంకేతాలను తెలియజేస్తున్నది. కళ్ళకు కట్టినట్టుగా వివిరిస్తూ.. విశ్లేషించడం ళ్రీధర్ గారి సాహిత్య సామర్థ్యం ప్రస్ఫుటమవుతోంది. వారికి హృదయపూర్వక అభినందనలు💐💐💐🙏

  • మంచి విశ్లేషణ సర్..

    పీరీల పండుగ ద్వారా ఇపుడు కనుమరుగవుతున్న ఆనాటి సంస్కృతిని,ఆనాటి సామాజిక జీవన చిత్రణనను తెలియ జేప్పే లాగున్న ముల్కీ కథను చక్కగా వివరించారు..💐💐💐💐

  • మీరన్నట్లు ఫ్లాష్ బాక్ టెక్నిక్ తొ కథ బాగా నడిపారు. లోతైన సమీక్ష, ముఖ్యంగా కొన్ని ఎలా రాయలో indirect గా చెప్పారు. నిసార్ గారి కి నివాళి.

  • అవును శ్రీధర్ చారిత్రక విషయాలను రాసేప్పుడు కథనం లో మార్పులుంటాయి..వ్యాసరూపం సంతరించుకుంటుంది.. దాన్ని అధిగమించింది ముల్కీ కథ.. మంచి విశ్లేషణ. అభినందనలు

  • మంచి కథను గొప్పగా విశ్లేషించారు శ్రీధర్. అభినందనలు.
    రామా చంద్రమౌళి

  • నిసార్ సార్ ముల్కీ కథ ఇప్పటి అవసరాన్ని చెప్పింది సార్ .గ్రామీణ ప్రాంతాలలో హిందూముస్లిం ఐక్యతను,వాళ్ళ మధ్య పెనవేసుకున్న అనుబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన వ్యాసం సార్ .ముల్కీ కథలోని భాష మీద,సాంస్కృతిక నేపధ్యం మీద మీరు రాసిన విషయాలు చాలా పరిశోధనాత్మకంగ ఉన్నాయి సార్ .

  • తెలంగాణ లో హిందూ , ముస్లిం ల ఐక్యత ను తెలిపే నిస్సార్ గారి కథ చాలా బాగుంది…. మీకు ధన్యవాదాలు….

  • మీ సూక్ష్మ విశ్లేషణ బాగుంది అన్న గారు అభినందనలు💐

    • తెలంగాణ గంగా జమున తెహజీబ్ సంప్రదాయాన్ని మరొక్కమారు కళ్ళముందు ఉంచారు అన్నయ్య.
      ఇక్కడి ప్రజల ఆత్మీయతలు, అనురాగాలు
      ఒకరి కష్టాలను ఇంకొకరు పంచుకునే స్వభావ సుగంధం ఎంతో గొప్పవి. ఆ సుగంధాన్ని ప్రతి యదకు పూసిన కథను అందించారు. మీ విశ్లేషణ చదివాక ఆనాటి పల్లెతల్లి గుర్తుకువచ్చింది

  • పీర్ల పండుగ మాదిగ వాడలోకి రాని కోణాన్ని, వాస్తవాన్న వెలిబుచ్చిన కథ రాసిన కీ. శే నిసార్ బాయ్ కి విమర్శ ద్వారా మరోసారి వెలుగు లోకి తెచ్చిన వెల్దండి అన్నకు, ప్రచురించిన సారంగం మాసపత్రికకు కృతజ్ఞతలు

  • తెలంగాణ గంగా జమున తెహజీబ్ సంప్రదాయాన్ని మరొక్కమారు కళ్ళముందు ఉంచారు అన్నయ్య.
    ఇక్కడి ప్రజల ఆత్మీయతలు, అనురాగాలు,
    ఒకరి కష్టాలను ఇంకొకరు పంచుకునే స్వభావ సుగంధాన్ని ప్రతి యదకు పూసిన కథను అందించారు. మీ విశ్లేషణ చదివాక ఆనాటి పల్లెతల్లి గుర్తుకువచ్చింది.

  • మల్కికథా విశ్లేషణ చాలాబాగుంది.ప్రత్యక్షంగాకథనుచదివిన అనుభూతి మిగిల్చింది.నిసార్ గారిరచన లోని విశేషాలను,తను చెప్పదలచుకున్న అంశాలను ఏ మాత్రం భావం చెడకుండా అందించారు.మీ విశ్లషణ ద్వారానేనుమంచి మంచి కథలు చదవడమే కాక రచనా శిల్పం లోని మెళకువలను తెలుసుకోగలుగుతున్నాను .నాకు చాలా ప్రయోజనకరంగా ఉంటున్నది.అందుకు మీకు ధన్యవాదాలు.మీ కృషి కి అభినందనలు.

  • శ్రీధర్ గారూ! ఒక మంచి కథను, ఒక మంచిమనిషి వ్రాసిన కథను మీరు విశ్లేషణ చేసిన తీరు చాలా బాగుంది. తెలంగాణ గుప్తనిధి లాంటి సాహిత్యాన్ని వర్తమాన సమాజానికి గుర్తు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆత్మీయత ఒక అంతర్భాగం అని తెలియజేసే ‘ ముల్కీ’ కథ నిస్సార్ భాయ్ లాంటి వాళ్లు తెలంగాణ గుప్తనిధులని కూడా వెల్లడిస్తుంది.
    నిస్సార్ భాయ్ కి నివాళులు…!

  • An excellent review on “Mulki” exposing the inner feelings and efficiency of the writer in making historical event as an interesting story. A good tribute to the departed writer Md Nissar, the ‘ soldier of folk songs’. Sincere appreciation to Dr Veldandi Sridhar.

  • ఇప్పుడు మనచిన్నతనాన్నిగూర్చి చెప్పాలంటె ఎన్కట అనాలి నా చిన్నతనంలో కూడా పీర్లపండగ కాని పెండ్లిల్లఊరేగింపుకాని దసరాపండగలుగాని జరిగితే ఊరంతటికి ఉండేది ఆసంబురం అందుల అందరు పాల్గొనేటోల్లు అదిఊరుమ్మడిబతుకు కులం మతం లేదు గిర్పటికికూడా జాన్పాడు సైదులు కందూరు ఎక్కువగ మనోల్ేజేస్తరు వాల్ల పేర్లు మనమే ఎక్కువగపెట్టుకుంటం. ఈ పీర్ల పండగ కూడామనమేజేస్తం ఇదంత మల్లొక్కసారి గుర్తుజేసినవ్ నిస్సార్గారి నివాలిలో ముల్కి విశ్లేషణబాగుంది గా ఎన్కటితీర్గ రోజులు మల్లొస్తె బాగుండు ఇది అత్యాస దురాస తీరదు ఇంత అయినా నీవు ఇంకా ఎత్తుకు ఎదగాలని నిండార కోరుకుంటు🙏🙏🙏🙏🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు