వెంటాడిన ” ప్యాంట్ “

కథను ముందుకు నడపడంలో అంతర్మథనానికి గురయ్యాను. కథ నడక పాత్రలకే వదిలిపెట్టాను. ఒక రకంగా నా ప్రమేయం లేకుండానే పాత్రల స్వభావం ప్రకారమే కథ ముందుకు సాగింది.

రచయితనైనా తను రాసిన కథల్లో నచ్చిన కథను చెప్పమని అడిగితే-

అది క్లిష్టమైన సమస్యే! ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడడానికి నేనూ పరిపరి విధాల ఆలోచించవలసి వచ్చింది.ఎంతో తర్జనభర్జన తరువాత నాకిష్టమైన అన్ని కథల్లోంచి “మోజు” కథను “నాకు నచ్చిన కథ”గా పరిచయం చెయ్యడానికి ఎంచుకున్నాను.

ఈ కథే ఎందుకంటే…..కథతో పాటు నేను వెల్లడించే ఈ కథకు చెందిన పూర్వాపరాలు కూడా పఠితలకు ఆసక్తికరంగా ఉండొచ్చనే భావన నాకు కలగడమే!

ఈ కథకు బీజం పడింది 1977 ప్రాంతంలో! ఒక శుభోదయాన ప్రముఖ రచయిత,అప్పటి “ఆంధ్రజ్యోతి వార పత్రిక” ఎడిటర్ స్వర్గీయ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారితో కథల గురించి చర్చించే భాగ్యం నాకు కలిగింది.ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే – “కథ రాయాలంటే సరైన ఇతివృత్తం దొరకలేదు అని వాపోయే వాళ్ళను చాలామందిని చూసాను. మంచి ఇతివృత్తం లభిస్తే మంచిదే!లేకున్నా- కథ రాయడం తప్పనిసరి అయిన పరిస్థితిలో అందుబాటులో ఉన్నకథా వస్తువుతో కథ రాయడానికి పూనుకోవడమే”అని.

నేను అర్థం కానట్టు చూసాను.

తిరిగి ఆయనే చెప్పారు- “ఉదాహరణకు ఈ కిటికీ కర్టెన్ మీదరాయొచ్చు….ఈ తలుపు మీద రాయొచ్చు…..ఈ టీపాయ్ మీద రాయొచ్చు….ఆట్టే మాట్టాడితే…..మీరు వేసుకున్న ప్యాంటు మీద కూడా రాయొచ్చు!”

“అదెలా?” అంటూ నేను నవ్వేసాను.ఆయన ముక్కు మీదకు జారిన కళ్ళజోడు లోంచి నా వైపు సీరియస్ గా చూసి- “నేను చాలా మారుమూల పల్లెల్లో తిరిగిన రోజులున్నాయ్! అలాంటి కొన్ని చోట్ల పంచెలు మాత్రమే కట్టుకునే జనం ప్యాంటు వేసుకున్న వాళ్ళను విడ్డూరంగా చూసేవాళ్ళు.ఈ వివరం చాలదూ….అలాంటి పల్లె జనం మీద కథ రాయడానికి?” అన్నారు. నేను ఆలొచనలో పడ్డాను.ఇంతలో వేరే ఎవరో రావడంతో మా సంభాషణ వేరే విషయాల మీదకు మళ్ళింది.

ఆ తర్వాత శర్మ గారి నుంచి సెలవు తీసుకుని వెళ్ళానే గాని చాలా రోజుల వరకూ “ప్యాంటు” కథాంశం నన్ను వెంటాడుతూనే ఉంది. ఎలాగైనా ప్యాంటు మీద కథ రాయాలనే పట్టుదల పెరిగింది.కాని కథ ఎలా మొదలెట్టాలీ…..ఎలా కొనసాగించాలీ….ఎలా ముగించాలీ అన్న విధానం అంతుపట్టలేదు.రోజులు గడిచే కొద్దీ నాలో అసహనం పెరిగిపోసాగింది.

మార్గం తోచినట్టే అనిపించి అంతలోనే కనుమరుగై పొయేది.ఐనా నేను పట్టు వీడలేదు.

ఏ మాత్రం తీరిక దొరికినా నా ఆలోచనలు”ప్యాంటు” చుట్టూ పరిభ్రమించేవి.అంతకు మునుపు నేనెప్పుదూ శారీరక సంబంధాల నేపథ్యంలో కథ రాయలేదు. ఇప్పుడు ఈ అంశం ఆధారంగా ప్యాంటు కథ రాస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నా మదిలో మెదిలింది.అంతే!నా ముందున్న చిక్కు ముడులన్నీ విడిపోయి కథ నా ముందు నిలిచిన భావన కలిగింది.ఇక రాయడానికి ఉపక్రమించాను. ముందుగా కథ జరిగే చోటు తెలంగాణ లోని ఊహాజనితమైన మారుమూల గూడెం గా ఎంచుకున్నాను.

ఇక పాత్రధారులూ వరుసగా ఊహా యవనికపై ప్రత్యక్షమయ్యారు.నాకు తెలంగాణా యాస రాదు కనుక ఇద్దరు మిత్రుల సాయం తీసుకున్నాను.

ముత్యాలు పాత్రను సెక్స్ కోసం అర్రులు చాచే స్త్రీ గా మలచడం నా ఉద్దేశ్యంకాదు.అది ఆ పాత్రకు ద్రోహం చెయ్యడమే అవుతుంది.మరి ముత్యాలు పట్నం బాబుతో ప్రేమలో పడిందా?పాత్ర స్వభావం ప్రకారం దానికి ఆస్కారమే లేదు.మరైతే ఆమె పట్నం బాబు ఆకర్షణకు లోనై అతని పొందు కోరిందా? అదీ కాకుంటే…. అతనికి లొంగిపోవడానికి దోహదం చేసిన బలీయమైన అంశం ఏమిటి?

ఇక్కడే ముత్యాలు పాత్ర చిత్రణ నాకు సవాలుగా మారింది. కథను ముందుకు నడపడంలో నేను అంతర్మథనానికి గురయ్యాను.ఇక కథ నడక పాత్రలకే వదిలిపెట్టాను. ఒక రకంగా నా ప్రమేయం లేకుండానే పాత్రల స్వభావం ప్రకారమే కథ ముందుకు సాగింది.కథ ముగింపులో కూడా ముత్యాలు అంతరంగం అంతకు మించి విడమర్చి ఆవిష్కరించడం సబబు కాదనిపించింది. అందుకే ముత్యాలు మానసిక సంఘర్షణకు చెందిన అవగాహన పాఠకుల విచక్షణకే వదిలి పెట్టాను.

ఈ కథ అచ్చయ్యాక నేను మునుపు రాసిన కథలకంటే మిన్నగా ఈ కథకు పాఠకులనుంచి ప్రశంసలు,మన్ననలు లభించాయి.

కొసమెరుపు:

ఈ కథ “స్వాతి మాస పత్రిక”లో అచ్చయ్యాక పురాణం గారిని కలిసినప్పుడు ప్యాంట్ మీద “మోజు” అనే కథ రాసానని చెబితే,నావైపు అశ్చర్యంగా చూసారు.చిన్నగా నవ్వి ఆ కథ చదువుతాను అని చెప్పారు.కొన్నాళ్ళ తర్వాత తిరిగి కలిసినప్పుడు- “మీ “మోజు” కథ చదివా! బాగుంది. “మోజు” టైటిల్ నచ్చి నేనూ ఈమధ్య “యావ”అని ఒక కథ రాసాను”అని నవ్వుతూ చెప్పారు.

విజయ్ ఉప్పులూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు