మోజు

థ చదవడం మొదలెట్టే పాఠకులకు చిన్న వివరణ. నాగరికత ఛాయా మాత్రంగా కూడా ప్రసరించని మారుమూల పల్లెలు, గూడేలు తెలుగుదేశంలో చాలా ఉన్నాయి. ఆయా ప్రదేశాల్లో ప్రజలకి టార్చి లైటు చూసినా, ట్రాన్సిస్టర్‌ చూసినా ఒక వింతే! అలాంటి పరిసరాల్లో ఈ కథ జరిగిందని గమనించ ప్రార్ధన.

పొయ్యి రాజేసింది ముత్యాలు. కుండలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టింది. బియ్యం కడిగి తీసుకొచ్చేలోగా పొయ్యి ఆరిపోతోంది. విసుక్కుంటూ గొట్టంతో ఊదుతూ పొయ్యి మండించడానికి ప్రయత్నం చెయ్యసాగింది. పొయ్యి ఒక్కపట్టాన అంటుకోవడం లేదు. పొగకు ఉక్కిరిబిక్కిరయి ముత్యాలుకి విపరీతమైన దగ్గు వచ్చింది. కళ్లల్లో నీళ్లు కూడా తిరిగాయి.

‘‘బావ్‌!’’ అకస్మాత్తుగా వెనుక నుండి వినబడిన కేకకు ఉలిక్కి పడి వెను తిరిగింది.

వెనక నవ్వుతూ పోచమ్మ నిలబడి ఉంది.

‘‘నువ్వా? అదురుకున్నా గదా!’’ కోపం ప్రకటిస్తూ అంది ముత్యాలు.

‘‘నేనే! ఇంకెవరకున్నావ్‌? ఏం! పట్నం బాబుననుకున్నావా ఏంది?’’ పకపక నవ్వుతూ పక్కనే కూలబడింది పోచమ్మ.

‘‘ఛీ, ఊకో, ఏమి మాటలయ్యి?’’

‘‘ఏం మాటలా? నేను చెప్పేదింటే నువ్వే మురుస్తవు.’’

‘‘ఏందది,’’ మోచేయి కంటిన మసి తుడుచుకుంటూ అంది ముత్యాలు.

‘‘ఆ దొర నేను నీళ్లకెళ్లి వస్తుంటే తోవలో కలిసిండే! కలిసి నన్ను చూసిండు. నేను కూడ చూసి నవ్వినా. దగ్గర కొచ్చిండు. వచ్చి నవ్విండు. నా పేరడిగిండు. సెప్పినా, అయినాక…’’

‘‘అయినాక…’’ కుతూహలం ఎక్కువయింది ముత్యాలుకి.

‘‘నీ పేరడిగిండు. నాకు తెలుసే. నీ గురించే అడుగుతుండని. అయినా కూడ మల్లా తెలవనట్టే ఎవరూ అని అడిగినా. అప్పుడు ఆయన సెప్పిండు. నీ యెంబడి ఎర్రపిల్ల కట్టెలకు వస్తది సూడు- ఆ పిల్ల.

‘‘ఎవరూ! ముత్యాలా! అని అడిగినా.

‘‘ఓ! ముత్యాలా, పేరు మంచిగా వుందే,’’ అనిండు.

‘‘ఏం దొరా ఏం పని? నేను మల్లా అడిగినా, ఏం లేదని నవ్వుకుంటూ పోయిండే! ఇంకేం ఆ దొర నీ ఎంబడి పడ్డాడు. ఇప్పుడు నీదే ఆలచం’’ వ్యంగ్యంగా నవ్వింది పోచమ్మ.

‘‘ఛీ నేనంటే ఏమనకున్నవే! చప్పుడు చెయ్యక కూచో,’’ గుడ్లెర్రజేసింది ముత్యాలు.

‘‘నన్నెందుకే, నా మీద కస్సుమంటవు? ఆయనేదో నీమీద కన్నేసిండని సెప్పినా! అంతేగా? ఆయనకేం తెలుసు నువ్వు అగ్గిలాంటి దానివని. నేనేమో మంచిగుండని ఆ దొరంటపడ్డా. ఆయనేమో నీయెంట పడ్డాడు. ఆ దొరే నన్ను గిట్లని పిలిచిండుంటే?’’

‘‘పోవే! పాడు మాటలవీనూ, నువ్వూను. అంత ఇదున్నదానివయితే చేసుకున్న మొగుడ్ని ఎందుకిడిసి పెట్టినావే? వానియెంబడే పోకూడదూ?’’

‘‘థూ! వాడు మొగడా? వట్టి చాకానోడు. ఆడికీ, పట్నంబాబుకీ పోలీకా? ఆ బాబు అందమే అందం. ఆ పొడుగు లాగూ, పొడుగు సేతుల అంగీ. ఆ పద్ధతే వేరుగుంటుంది,’’ తన్మయత్వంలో మునిగిపోతూ అంది పోచమ్మ.

‘‘ఇంతకీ నువ్వెందుకొచ్చినా వీడికి?? వాని మాటలు చెప్పడానికొచ్చినావ్‌. నీకేం పనిలేదా యింక,’’ విసుక్కుంది ముత్యాలు.

‘‘అయ్యో, పట్నం బాబు మాటల్లోపడి యాదిమర్సినా. జరంత ఉప్పుంటే పెడతావ్‌,’’ నాలిక్కరుచుకుంది పోచమ్మ.

ఉప్పు తీసుకుని పోచమ్మ వెళ్లిపోగానే ముత్యాలు మనసంతా పట్నంబాబు ఆలోచనలతో నిండిపోయింది.

పట్నంబాబు తన పేరడిగి కనుక్కున్నందుకు ఆమె మనసెందుకో తెలియని పులకరింతతో నిండిపోయింది.

ఆ దొర ఈడికొచ్చి నెలయితుంది. ఆ బాబు సర్కారోడట. ఈ అడవికంతా మాలిక్‌ అంట. తన మావ చెప్పిండు. ఇంతకుముందుకు లెక్క ఎవళ్లు బడితే ఆళ్లు కట్టెలు కొట్టకూడదంట. మొదట్ల ఆ దొర యేసం చూసి గెట్లనో అనిపించింది. అంగీ దాక అయితే తనకు తెలిసిందేగాని ఆ లాగు చాల మంచిగుంటది. పొడుగ్గా కాళ్ల దాంక ఉంటది. ముంగల రెండు కీసలు (జేబులు), యెనక రెండు కీసలు కూడా ఉన్నయ్‌. అంగీ లోపలేసుకుని తోలు పటకా కట్టుకుని ఆ బాబు నడుస్తుంటే సూడ ముచ్చట యింది. తన గూడెంలో వాళ్లంత ధోతులే కడతరు.

ఆ బాబు పొడుగులాగుందే సూడు! దాన్నేమంటరని తన మావనడిగింది. మావ సెప్పిండు. ఏదో పెంటంటారంట!

ఏమి పెంటో? అంత మంచిగున్నదని పెంటంటరేంటి? తన కాపేరు గెట్లనో అనిపించింది.

‘ఔ! నిజమే! ఆ బాబు సూపు గెట్లనో ఉంటది. కట్టెలు ఏరనికి అడవికెళ్తే కండ్లలోకి చూస్తడు. తనకి ఇసిత్రంగా గుండె జల్లుమంటది.’

అన్నం మాడిన వాసన రాగానే ఉలిక్కిపడి ఆలోచనల్లో నుండి తేరుకుంది ముత్యాలు.

‘‘ఆయన గొడవలోపడి అన్నం చూసేదే మరిసిపోయినా! అంత మాడి పోయింది,’’ తనను తాను తిట్టుకుంది.

ఆ రాత్రి మావ పక్కలో అతని గుండెల మీద తలవాల్చి పడుకున్న సమయంలో అంది ముత్యాలు.

‘‘మావ!’’

‘ఉ’ కొట్డాడు సైదులు

‘‘ఊ కాదు నే సెప్పేది ఇను,’’ అతడ్ని తట్టి,లేపుతూ అంది ముత్యాలు.

‘‘ఇంటున్నా! సెప్పు,’’ ముత్యాలును మరింత దగ్గరకు లాక్కుంటూ అన్నాడు సైదులు.

‘‘మరి… నువ్వు…’’ ఎలా చెప్పాలో అర్థంకాక ఆగిపోయింది ముత్యాలు.

‘‘ఏంటది? చెప్పు.’’

‘‘మరి నువు కూడ ఒక పెంట కుట్టించుకోవద్దా? చాల మంచిగా ఉంటది,’’ తన మనసులో మెదులుతున్న కోరికను బయటపెట్టింది ముత్యాలు.

బిగ్గరగా నవ్వాడు సైదులు.

‘‘ఆ ఇరుకు బట్టల ఏం సుఖముందే! ఈ ధోతిలో చూడు ఎంత సుఖముందో? అయినా అవన్నీ మనకెందుకే గూడెంలో ఉండెటోళ్లకు? అవి ఆ పట్నం దొరలకే మంచిగుంటది. బాగా పొద్దయింది పండుకో,’’ అంటూ అటుపక్కకు వత్తిగిల్లాడు.

ముత్యాలు మనసు ఏదో తెలియని అసంతృప్తితో మూల్గింది. ఏదో అనబోయి సైదులు అప్పటికే నిద్రలోకిి జారుకోవడం గమనించి మౌనంగా ఊరుకుంది. తనూ కళ్లు మూసుకుని నిద్రకుపక్రమించింది. మధ్య రాత్రిలో ముత్యాలుకి మెలుకువ వచ్చింది. చుట్టుపక్కలు పరిశీలనగా చూసి, ‘ఓ అంతా కలేనా?’’ అనుకుంది. కలలో సంగతులు స్పుÛరణకు తెచ్చుకుంది.

కలలో తను, పట్నంబాబు పల్లకిలో ఎల్తున్రు. తనకు సిగ్గొచ్చె, నెత్తొంచుకని కూర్చుంది. ఆ దొర తన చెంప మీద చిటికేసి ముంగలకొచ్చి ముద్దెట్టుకోబోయిండు. అప్పుడు తనకు మేలుకొచ్చింది.

అదంతా తల్చుకునేసరికి ముత్యాలుకు ఏదో తెలియని సిగ్గు ముంచుకొచ్చింది. కల అలా అసంపూర్ణంగా ముగియడం మాత్రం చాలా వెలితిగా అనిపించింది. ఎంత వద్దనుకున్నా ఆమెను పట్నంబాబు ఆలోచనలు పట్టి లాగసాగాయి. ఇక ఆ రాత్రి ముత్యాలుకు నిద్రపట్టలేదు.

ఆ మర్నాడు అడవిలో ఎండు పుల్లలు ఏరుకోవడానికి వెళ్లింది ముత్యాలు. పుల్లలేరుతుందన్న మాటేగాని ఆమె చూపులు పట్నంబాబు కోసం వెదుకుతూనే వున్నాయి. ఆమె నిరీక్షణ వృధా కాలేదు. పట్నంబాబు ఎప్పుడు వచ్చాడో ఒక చెట్టు పక్కగా నిలబడి తనవంక చూస్తూ వుండడం ఆమె చాలాసేపటి వరకు గుర్తించలేదు. అతడ్ని చూడగానే గుండెలు వడిగా కొట్టుకున్నాయి. తల తిప్పేసుకుంది. ఏదో వీపుకు తగలగానే చూసింది. ద్రాక్షపండు. నవ్వుతున్నాడతడు. ద్రాక్షపండు అందుకుని అప్రయత్నంగానే వెనక్కి తిరిగి చూసింది. కొంటెగా నవ్వింది ముత్యాలు. ఆ మాత్రం చాలతనికి చొరవ చేసుకోవడానికి. ముత్యాలు దగ్గరగా వచ్చి చెయ్యిపట్టుకున్నాడు.

ముత్యాలు వదిలించుకోబోయింది. అతడు వదల్లేదు.

‘‘నీపేరు ముత్యాలు కదూ?నువ్వు నిజంగా ముత్యానివే,’’ అంటూ దగ్గరకు లాక్కోబోయాడు.

ముత్యాలు మొఖం సిగ్గుతో ఎర్రబారింది.

‘‘వద్దు,’’ అంటూ గట్టిగ విదిలించుకుని పరుగు తీసింది.

ఆ రాత్రంతా మళ్లీ నిద్రలేదు ముత్యాలుకి. పక్కనే నులకమంచం మీద పడుకుని నిద్రపోతున్న సైదులును చూస్తుంటే ఆమెకు యెక్కడో కలుక్కుమంది.

‘తనంటే పాణం పెడతడు మావ. తను మాత్రం కావాలని సైదులుని మనువాడలేదూ? పరాయి మొగాడంటే తనకెప్పుడు మనసు కలగలే. ఆమెకు రోషయ్య గుర్తుకొచ్చాడు. గూడెంలో రోషయ్య పెద్ద గుండా. ఆడంటే అందరికీ బయం. ఎవరూ లేంది సూసి ఒక దినం గుడిసెలో జొరబడ్డడు. అప్పుడు తను కొడవలుచ్చుకుని వాన్ని బయటికి ఎలగొట్టింది. గూడెంలో వాళ్లంత చాల కుషీపడ్డరు. అప్పటిసంది తనకి నిప్పని పేరిచ్చిండ్రు. అసువంటిదాన్ని తనకి ఎందుకిట్ల ఔతున్నది? పట్నంబాబు మీద ఎందుకిట్ల మనసు పోతుంది? ఏంది కారణం? ఔ! గంతే!!’ తెల్లారేదాక ఇలాంటి ఆలోచనలతోనే సతమతమయి పట్నంబాబు పొందుకోరె మనసుతో రాజీపడక తప్పలేదు ముత్యాలుకి.

ఙ          ఙ          ఙ

‘‘అమ్మా! నాలుగు దినాలా! నేనుండలేనబ్బ! నాకు భయమేస్తది,’’ మొరాయిం చింది ముత్యాలు.

‘‘అదేందే! ఈ తడ అంతా చింతపండుకు బాగా పైసలొత్తయి అంటున్రు. మల్ల పోపోతే ఎట్ల? పట్నంల నాలుగుదినాలుండాలి ఎట్లన్న. అయినా, నీకెందుకే భయము? నువ్వు నిప్పులాంటిదనివని యాది మరిసిపోయినావా?’’ సర్ది చెప్పాడు సైదులు.

ఆ ప్రాంతంలో చింత చెట్లెక్కువ. సైదులు చింతపండు చవగ్గా కొని పట్నం తీసుకువెళ్లి అమ్ముతుంటాడు. సైదులు పట్నం వెళ్తున్నాడన్న విషయం ముత్యాలుకి లోలోపల ఆనందాన్నే కలిగించింది. పట్నంబాబుతో కలయిక కోసం ఆమె మనసు మరింతగా ఉరకలు వేసింది. పైకి మాత్రం దిగులు ప్రదర్శించింది.

మరోమారు ధైర్యం చెప్పి సైదులు పట్నం వెళ్లిపోయాడు.

ఆరోజంతా అడవిలో పట్నంబాబు కోసం కలియతిరిగింది. కాని అతని జాడే లేదు. నిరాశగా ఇంటికి చేరుకుంది. చాల భారంగా ఆ రాత్రి గడిపింది.

మర్నాడు ఉదయం ఏవో మాటల మధ్య పట్నంబాబు గురించి కదిపింది పోచమ్మ దగ్గర.

‘‘ఆ దొర పట్నం ఎల్లిండట. రెండు మూడు దినాలదాంక రాడంటనే,’’ పోచమ్మ మాటలు వినగానే కృంగిపోయింది ముత్యాలు.

‘యింక మూడు దినాలైతే సైదులు కూడ వస్తడు? మరప్పుడెట్ల?’ పగ్గాలు పడేకొలదీ ఆమె కోర్కెలు మరింతగా విజృంభించి ఆమెను మరింత పిచ్చిదానిగా చేయసాగాయి.

మరో రెండురోజులు చాల అసహనంగా గడిపింది. మూడోరోజున పట్నంబాబు తారసపడగానే ఆమె ఆనందానికి అవధుల్లేవు. రివ్వునపోయి అతని ముందు నిలిచింది.

ముత్యాలును చూడగానే కొంటెగా నవ్వాడతడు. ఏమనాలో తోచక అలాగే నిలబడిపోయింది ముత్యాలు.

అడవిలో అప్పుడే చీకటి చుట్టూ అలుముకుంటోంది. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు.

‘‘ఏం చిలకా? ఏమిటి విషయం?’’ ముత్యాలు చెయ్యి పట్టుకుని లాగాడతడు. అభ్యంతరం చెప్పలేదు ముత్యాలు. అతని కౌగిట్లో ఇమిడిపోతూ, ‘‘ఈ రెండు దినాలసంది బాగ నిన్నే చూస్తున్న అక్కడ ఇక్కడ దొరా! ఎక్కడ కనబడలేదు,’’ అంది.

‘‘ఇప్పుడొచ్చానుగా! నా కోసం అంత పరితపించిపోతున్నావన్న విషయం తెలిస్తే అసలు వెళ్లేవాడినేకాను,’’ కౌగిలి మరింతగా బిగిస్తూ అన్నాడు.

‘‘ఇప్పుడొద్దు. బాగా పొద్దు మీరినాక అందరు పండుకున్నంక రా! మా మావ కూడా లేడు. మా గుడిసె యాడుందో…’’

‘‘తెలుసు. నీ గుడిసె నాకు తెలుసు. అందం ఎక్కడుంటుందో తెలుసుకోలేని వెర్రివాడ్ని కాను. రాత్రికి వస్తాను,’’ ముద్దు పెట్టుకుని వదిలేసాడు.

గువ్వలా పరుగెత్తింది ముత్యాలు. ఆమె మనసు పరవశంతో పరవళ్లు తొక్కు తోంది. గుడ్డి దీపం వెలుగులో అద్దం ముందేసుకుని ముస్తాబు అవసాగింది. కొప్పులో పూలు పెట్టుకుని విసురుగా లేచేసరికి కాలు తగిలి అద్దం పగిలిపోయింది.

‘పెద్ద అద్దం పట్కరమ్మని మావకు చెప్పింది తను. తెస్తడో లేదో? ఎప్పుడూ మరస్తనే ఉంటడు,’ విసుక్కుంది. ఆ తర్వాత పగిలిన అద్దంలోనే తన అందాన్ని మరోమారు చూసుకుని మురిసిపోయింది ముత్యాలు.

గంటలు గడిచేకొద్దీ ముత్యాలు గుండెలు మరింతగా కొట్టుకోసాగాయి. ఏమాత్రం అలికిడయినా పట్నంబాబేనేమోనని ఉలిక్కిపడసాగింది. అతని రాక కోసం యెదురు తెన్నులు కాస్తూ మెలుకువగానే ఉంది.

అర్ధరాత్రి దాటిం తరువాత గుడిసె తలుపులు తోసుకుని లోపలకు ప్రవేశించిన పట్నంబాబును చూడగానే ఆమెలో రక్తం వడిగా ప్రవహించింది. తెలియని మైకం ఆవరించింది.

చిన్నగా నవ్వుతూ ఆమె సరసనే నులకమంచం మీద చోటు చేసుకున్నాడతడు. ముత్యాలును దగ్గరకు లాక్కున్నాడు. అతని మీద వాలిపోతూ, ‘‘ఇది మంచిగుంది,’’ అంది ముత్యాలు.

‘‘ఏమిటి?’’

‘‘ఇదే ఈ పెంట చాల మంచిగుంది,’’ అతని పేంటును తదేకంగా చూస్తూ అంది ముత్యాలు.

ఫక్కున నవ్వాడతడు. ‘‘పెంట కాదు. దీన్ని పేంటంటారు. ఏదీ అను పేంటు,’’ అన్నాడు నవ్వాపి.

ముత్యాలు సిగ్గుతో ముకుళించుకుపోయింది. ‘‘అనమంటుంటే? పేంటు,’’ ఒత్తి పలికాడు.

‘‘పేంటు,’’ గొణిగింది ముత్యాలు.

‘‘ఏం వేసుకుంటావా నా పేంటు?’’ ఆమెను ఆక్రమించుకుంటూ అడిగాడు.

ముత్యాలు జవాబివ్వలేదు. ఆమెకు మాట్లాడే అవకాశమూ ఆపై అతడివ్వ లేదు. మరికొన్ని నిముషాల తర్వాత బట్టలు సర్దుకుంటూ అతడన్నాడు- ‘‘ఇక నేను వెళ్లనా?’’

కళ్లు విప్పలేదు ముత్యాలు.

‘ఊ’ అని చిన్నగా మూల్గింది.

అతడు వెళ్లిన కొద్ది క్షణాలకు భారంగా కళ్లు తెరిచింది. మరోమారు బాధగా మూల్గింది. అతనితో అనుభవించిన సుఖం తాలూకు తీయని నిట్టూర్పు కాదది. ఆమె ముఖంలో తీరని అసంతృప్తి ద్యోతకమవుతోంది. ఆమెలో రగిలిన వేడిని చల్లార్చడంలో అతడు పూర్తిగా కృతకృత్యుడు కాలేకపోయాడు.

ఆ క్షణంలో ఆమె కళ్లముందు సైదులు మెదిలాడు. మావతో తాను దినం అనుభవించే సుఖంతో పోల్చి చూస్తే పట్నంబాబు పొందులో తను పొందిన ఆనందం ఏపాటిదో ఆమెకు తెలిసింది. నిప్పులాంటిదని పేరు తెచ్చుకున్న తను చెడి బావుకున్న దేమిటన్న భావన మనసులో మెదలగానే గుండెల్ని ఎవరో పట్టి పిండుతున్నట్లు అనిపించింది ముత్యాలుకి. బాధగా కళ్లు మూసుకుంది.

కీచుగా గుడిసె తలుపు తెరచుకుంది. చిన్నగా కళ్లు తిప్పింది ముత్యాలు. మసక వెలుతురులో గుమ్మం దగ్గర పేంటు తొడుక్కున్న ఆకారం. పట్నంబాబు మళ్లీ ఎందుకు వచ్చిండా? అని ఒక క్షణం ఆలోచనలో పడింది. దగ్గరైన ఆకారాన్ని పోల్చుకుని క్షణకాలం ఆమె గుండె ఆగిపోయింది. అతడు సైదులు. ముందుకు వంగి అంటున్నాడు.

‘‘ఏం మేలుకొచ్చిందా? పట్నంల చింతపండు మంచిగానే అమ్ముడుపోయింది. నిన్ననే వస్తుంటికాని ఈ పేంటు దిక్కెళ్లి ఆలచమయింది. నీకిష్టమయిందని కుట్టించుకున్న. పైసలయినయనుకో! అయినా మంచిగ కుట్టిండు. ఈ గూడెంల పేంటు తొడుక్కున్నోడిలో నేనే మొదాలు. ఆ పట్నంబాబు బాబులా లేనూ? మంచి గుందా?’’

పేంటును చూసుకుని మురిసిపోతున్న సైదులు ముత్యాలు ముఖంలో మారుతున్న రంగుల్ని గమనించే పరిస్థితిలో లేడు.

ముత్యాలు పెదవి విప్పి పలుకలేదు.

‘నీకన్యాయంసేస్తి మావా! చెయ్యరాని పని చేసినా, నువ్వు ఒక గంట మొదలు వచ్చుంటే ఎంత బాగుంటుండె? నీ నిప్పు బొగ్గయి పోయిందని ఎట్టా చెప్పేది మావా,’ ఆమె హృదయం మాత్రం మూగగా రోదించింది.

స్వాతి మాసపత్రిక

విజయ్ ఉప్పులూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు