బాధలు పాతవే కానీ.. గాయాలు కొత్తవి!

పురాణగాథల్లో తలవంచుకు నిలబడ్డ స్త్రీలను మందరపు హైమవతి తన కవిత్వంలోకి ప్రవేశపెట్టి, వారికి సరికొత్త వ్యక్తిత్వాలను కట్టబెడతారు. ధైర్యవంతులుగా వర్తమాన సమాజానికి పరిచయం చేస్తారు. ధర్మరాజు, సిద్ధార్థుడు వంటివారిని దోషులుగా నిలబెడతారు. మహిళల ఆత్మాభిమానానికి విలువనివ్వని నేరంపై కేసులు పెట్టి, బోనెక్కిస్తారు.

‘‘స్త్రీలకి శరీరాలుంటాయి నిజమే కానీ

వాటికి బిగిస్తారు ఇనుప కచ్చడాలు

స్త్రీలకి గర్భాశయాలుంటాయి కానీ

వాటిని మారుస్తారు/ అండపిండాల మృత్యుకుహరాలుగా’’.

మూడున్నర దశాబ్దాలుగా మహిళా సమస్యలపై పదునైన స్వరాన్ని ఎక్కుపెట్టిన సృజనశీలి మందరపు హైమవతి. ‘‘సూర్యుడు తప్పిపోయాడు’’ సంపుటితో కవిత్వంలో తన ఉనికిని బలంగా చాటుకొని, ‘‘నిషిద్ధాక్షరి’’తో స్త్రీవాద కవయిత్రిగా ప్రత్యేక ముద్రను సొంతం చేసుకున్నారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత 57 కవితలతో ‘‘నీలిగోరింట’’ సంపుటిని ప్రకటించారు.

తాజా కవితాసంపుటిలోనూ తొంభై శాతం కవితలు స్త్రీ గురించే మాట్లాడతాయి. మహిళల మనోభావాల గురించే చర్చిస్తాయి. కాలం అత్యాధునిక వేషం ధరించినా, సాంప్రదాయిక ఛాదస్తాలు మాయం కాలేదు. పురుషాధిపత్యం పట్టు సడలించలేదు. కట్టుబాట్ల పేరిట మహిళను తొక్కిపట్టే కుట్రలు కనుమరుగు కాలేదు. బాలికలు, యువతులు, పడతులు, ఆఖరికి వృద్ధ మహిళలు సైతం వివిధ రూపాల్లో వేధింపులకు గురవుతున్నారు. అధికారాలు, చట్టాలు, నియమనిబంధనలు నిలువుగుడ్లేసి చోద్యం చూస్తున్నాయి.

ఈ పరిస్థితులకు అతీతంగా స్త్రీ తన ప్రయాణం సాగిస్తూనే ఉంది. చదువులో అగ్రభాగాన నిలుస్తోంది. జ్ఞానంలో సవాలు విసురుతోంది. ఉద్యోగాల్లో సింహభాగం ఆక్రమిస్తోంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తోంది. అయినా, ఆగడాల నుంచి తప్పించుకోలేకపోతోంది. ఆధునిక యుగంలో మనుషులు ‘కదిలే కరెన్సీ వృక్షాలయ్యాక’ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. ఆ అదృశ్యహింస తాలూకు భిన్న పార్శ్వాలను మందరపు హైమవతి తన కవితల్లో ఆవిష్కరించారు. దోపిడీ రూపాలను వివరించే ప్రయత్నం చేశారు. అరాచక మూలాల గుట్టు విప్పి, అందుకు కారణమైన వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అక్షర శస్త్రాలను మహిళల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేశారు.

పురాణగాథల్లో తలవంచుకు నిలబడ్డ స్త్రీలను మందరపు హైమవతి తన కవిత్వంలోకి ప్రవేశపెట్టి, వారికి సరికొత్త వ్యక్తిత్వాలను కట్టబెడతారు. ధైర్యవంతులుగా వర్తమాన సమాజానికి పరిచయం చేస్తారు. ధర్మరాజు, సిద్ధార్థుడు వంటివారిని దోషులుగా నిలబెడతారు. మహిళల ఆత్మాభిమానానికి విలువనివ్వని నేరంపై కేసులు పెట్టి, బోనెక్కిస్తారు.

‘సీతంటే కష్టాల కడలిలో పడవ, కన్నీటి కొలనులో కలువ’ అంటూ చరిత్రను వక్రీకరించే వర్ణనల్ని చెరిపెయ్యాలంటారు. సీతను ‘ఆత్మగౌరవ గీతం’గా అభివర్ణిస్తారు (అసహన వచనాలు). సత్యభామ, ముక్కుతిమ్మన, రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మి, కాళిదాసు, శంకరాచార్య, రాముడు వంటి పురాణపాత్రలు ఈమె కవిత్వంలో సందర్భానుసారంగా ప్రత్యక్షమవుతాయి.

*****

హైమవతి కవిత అత్యంత సహజంగా, నిరాడంబరంగా, మనసు విప్పి మనతో మాట్లాడుతున్నట్లుగా ప్రారంభమవుతుంది.

‘‘ఒంట్లో బాగా లేదని చెప్పినంత తేలిగ్గా

మనస్సు బాగా లేదని చెప్పలేం గదా’’… ఇదీ ‘కరిగి – కన్నీరై’ కవిత ప్రారంభం. అట్లా అని అది అలా సాదాసీదాగా ముందుకు సాగదు. ఒక్కో భావాన్ని ముట్టించుకుంటూ, ఒక జ్వాలలా విప్పారుతుంది. అవమానాల గాయాల ఆనవాళ్లను విప్పుకొంటూ, చింతల మొసళ్ల చిరునామాలను చాటుకొంటూ పకడ్బందీగా పైకెదుగుతుంది. ‘‘నిరలంకార జీవన వచనానికి/ నిసర్గ కవితా వర్ణాన్నద్ది’’ తన కవితాప్రస్థానాన్ని ప్రత్యేకంగా చాటుకుంటారు మందరపు హైమవతి.

‘బాధలు పాతవే కానీ/ గాయాలు కొత్తవి’ అంటూ ప్రారంభమవుతుంది ‘‘వంచనా శిల్పం’’.

ఆధునిక అవసరాలు, సాంకేతిక ఆవశ్యకతలను అందుకోటానికి అమ్మాయిలు నైట్‌డ్యూటీ చేయక తప్పని స్థితి. అయితే, అదే అదనుగా భావించి విరుచుకుపడే మగాంధులు ఆమె సంకల్పాన్ని ఛిద్రం చేస్తున్నారు. చూసే చూపు ఆధునికం కాకుండా, మనసు లోపలి పాపాగ్ని చల్లారకుండా వర్తమాన నేరాలను అరికట్టలేమని చెబుతారు కవయిత్రి. లక్ష్మణరేఖలు అతిక్రమించటం, మనుస్మృతులు ధిక్కరించటం, జ్ఞాననేత్రాలు తెరవటం కూడా ఆడవారి తప్పేనన్న వ్యవస్థీకృత అభిప్రాయాన్ని ‘‘తప్పులన్నీ మావే!’’లో గట్టిగా ఖండించారు.

కవయిత్రి దిగులంతా ఆచూకీ లేకుండా నమోదవుతున్న అరాచకాల గురించి. వేటగాళ్ల ఉనికి లేకుండా, రాలిన పూలను తొక్కేసిన పశువులగిట్టల జాడలులేకుండా రహదారుల పుస్తకాలపై వార్తలుగా మారుతున్న ‘రక్తసిక్త కవితల’ గురించి. ఆ దుఃఖాన్ని వ్యక్తీకరించే భాష తన దగ్గర లేదని బాధ పడుతున్నారు. ఆ ‘‘దిగులు’’ను రూపు కట్టించేందుకు ‘‘నిక్కమైన ఒక్క అక్షరతారకను కోసుకొచ్చి/ మనసు గుమ్మానికి తగిలించలేకపోతున్నా’’నని ఆవేదన చెందుతున్నారు.

పేదరికం అంగట్లో సరుకైంది. అమ్మకం కొనుగోళ్ల వ్యవస్థలో అద్దెకో గృహంలా అద్దెకో గర్భం కూడా మను(నీ)గడలోకి వచ్చింది. మరోవైపు, ఆకలి విసిరే పులిపంజా దెబ్బలకు అమాయక బాలికలతోపాటు ఒంటరి మహిళలెందరో బలవుతున్నారు. ‘కాల్ మనీ వ్యాపారుల’ కోరల్లో చిక్కి శల్యమవుతున్నారు. ‘మహిళల మానని గాయాల మౌనభాష తెలీని కసాయిల’ దోపిడీకి గురవుతున్నారు. ఈ దుర్భర స్థితిని ‘‘తాకట్టు పెట్టిన తనువు’’లో హృదయవిదారకంగా చిత్రించారు. ‘‘తాకట్టు పెట్టే బిందెలు చెంబుల జాబితాలో/ నా తనువెప్పుడు చేరిందో అర్థం కాదు’’ అని తలపోసే మహిళ గుండెఘోషను ఆర్తిగా అక్షరీకరించారు.

అన్ని రంగాల్లోనూ మహిళలు దీటుగా రాణిస్తున్నా, ఆర్థికపగ్గాలు మాత్రం ఇప్పటికీ మగాడి చేతుల్లోనే ఉన్నాయి. అటెండర్ భార్యయినా, గజిటెడ్ ఆఫీసర్ భార్యయినా; రైతు భార్యయినా, రాజు భార్యయినా చేతిఖర్చుల కోసం కూడా భర్తను అడగకతప్పని వర్తమాన ఆర్థిక అసమతౌల్యాన్ని హైమవతి గట్టిగా ఖండించారు. ‘‘ఎ.టి.ఎం. కార్డు శాశ్వత చిరునామా/ ఎప్పుడూ మా ఆయన జేబే’’నంటూ సగటు మహిళ మౌనరోదనతో ‘‘నెలకోసారి’’ కవితను ప్రారంభిస్తారు.

స్త్రీ జీవితం చాలావరకు వంటింట్లోనే గడిచిపోతుంది. జీతం, సెలవుల ఊసేలేని అనివార్య విధి నిర్వహణ అది. చిన్నప్పుడు భయపెట్టిన దయ్యాల కథల్లా, పెద్దయ్యాక మహిళను వెంటాడే పీడకల వంటిల్లు. మున్నూటరవై అయిదు రోజులూ ఆ చెరసాలలోనే మగ్గిపోతూ, సమయానికి అన్నీ అమర్చుతున్నా కుటుంబసభ్యుల ఎత్తిపొడుపు మాటలు ఎలా బాధిస్తాయో ‘‘వంటింటి సూర్యోదయాలు’’లో ఆవిష్కరించారు.

స్త్రీ సమస్యలు మినహా మందరపు హైమవతి ఇతర అంశాలను ప్రస్తావించలేదని చెప్పటానికి లేదు. ఇతరత్రా సామాజిక సంక్షోభాల మూలాల్లోకి చొచ్చుకుపోయి, వాటిని తన కవిత్వంలో ప్రదర్శనకు పెట్టారు. గాయాల గురించే కాకుండా, అసలు శరీరానికి అవసరమైన స్పర్శ గురించి కూడా మాట్లాడారు. ఆ సుకుమార భావనల్ని అంతే పరిమళభరితంగా ‘‘చంద్రశాల’’లో కవిత్వీకరించారు. కవయిత్రికి మగవాడి పట్ల అంతా ద్వేషమే లేదు. అతడి నిష్కల్మష పలకరింపు, నిస్వార్థ నిగారింపు, ప్రేమపూరిత లాలింపు ఆమెకు చాలా ఇష్టం. ‘‘ప్రభాత సమయాలను/ ప్రాణవంతం చేయడానికి’’ ఒక్క పలకరింపు చాలంటారు. ఆత్మీయ మిత్రుని ఒక చిన్న మాట చాలంటారు.

నిజానికి, కవయిత్రి మౌలిక దృష్టి చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈమెకు నది కూడా ‘‘కొత్త పరికిణీ అంచులు కొంచెం/ పైకి పట్టుకొని నెమ్మదిగా నడిచే బాలికలా’’ కనిపిస్తుంది. చీరకుచ్చెళ్ల పింఛం అందంగా విప్పుకొని గబగబా అడుగులు వేసే ఆధునిక యువతిలా కనిపిస్తుంది. అదే నది ఆగ్రహించినప్పుడు ‘‘కట్టుకొన్న మొగుడైనా కానివాడైనా/ నిందాబాణం గురిచూసి విసరినపుడు/ ఆగ్రహించిన స్త్రీలా’’ కనిపిస్తుంది. ఆ నది సాగరంలో కలిసేటప్పుడు ‘‘నిండు జీవితం గడిపిన మహిళలా ప్రశాంత రాగంలా’’ వినిపిస్తుంది.

ఏవేవో వంకలతో మహిళను తొక్కిపెడుతున్న వ్యవస్థపై ప్రశ్నల బాంబులు విసరటానికి కవయిత్రి ఏమాత్రం వెనకాడరు. అడగాలనుకున్న దాన్ని నిస్సంకోచంగా అడిగే తీరుతారు. అవ్యవస్థ తాలూకు అందవికారాన్ని మన మనసుల్లోకి బట్వాడా చేసే తీరుతారు. సంపుటి ద్వారా ఈ మేరకు హైమవతి (@ 9441062732) సంపూర్ణ విజయం సాధించారు.

 *

ఎమ్వీ రామిరెడ్డి

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కటి సమీక్ష

    కవయిత్రి కి రామిరెడ్డి గారికి అభినందనలు

  • నా పుస్తకం నీలి గోరింట మీద శ్రీ ఎంవి రామిరెడ్డి గారి రివ్యూ ప్రచురించినందుకు ప్రచురించినందుకు ధన్యవాదాలు.

  • గత 30 ఏళ్లుగా స్త్రీవాద కవయిత్రిగా అద్భుతమైన కవిత్వాన్ని రాస్తున్న మందరపు హైమావతి గారి కవిత్వాన్ని గొప్పగా విశ్లేషణ చేశావ్ రామిరెడ్డి

  • ప్రముఖ కవయిత్రి మందరపు హైమవతి గారి
    నీలిగోరింట కవితలపై M.V.రామిరెడ్డిగారు
    sameeksha చాలా చక్కగా ఉంది.
    కవయిత్రి నిష్కర్ష భావాలను,కవితలను మళ్ళీ
    చదివిన ఆనందం కలిగింది.
    థ్యాంక్యూ

  • రెడ్డిగారూ, హైమవతి గారి కవితా సంపటిలోని కవితలను పరిచయంతో పాటు అందులోనే కొన్ని కవితల విశ్లేషణను బాగా వివరించారు. చాలా సంతోషం. ఈమధ్యనే మీరు సాత్య ప్రస్థానం నవంబర్ సంచికలో అరసం గుంటూరు శాఖ వారు ప్రచురించిన కథా సంపుటాలను సమీక్షిస్తూ వ్రాసిన సుదీర్ఘ వ్యాసం చదివి సంతోషపడి రెండు విడతలుగా 20 సంపుటాలు తెప్పించుకొన్నా. మిగిలిన 23 సంపుటాలు త్వరలోనే తెప్పించుకొని. మీకు ధన్యవాదాలు
    వేలూరి కృష్ణమూర్తి, మైసూరు
    94489 77877

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు