వెంకటేశ్వరోపాఖ్యానం

దయం 7 గంటలు..

“లతా! ఒక రెండు రూపాయలివ్వవే! కనమాషి(కనక మహాలక్ష్మి) గుడికెళ్లి వేసొస్తా” అడిగాడు వెంకటేశ్వర్రావు.

“ఎందుకు? అందులో రూపాయి పెట్టి దాసు కొట్లో టీ తాగడానికేనా?” నిష్టూరంగా అడిగింది లతమ్మగారు.

“నమ్మకపోతే పో! ఔనే! నేనొక దొంగముండా కొడుకుని. మా అమ్మొక దొంగముండ” అని తనని, తనను కన్న అమ్మని తిట్టుకుంటూ గుమ్మం దాటి గుడి వీధి దారి పట్టాడు. అడుగులు విసురుగా పడటంతో నెర్రెలు పడిన భూమిలాంటి ఆయన మడమల్లోంచి రక్తం పొంగుకొస్తోంది. అదేమీ పట్టనట్టు కంకర రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఆయనకి చెప్పులేసుకునే అలవాటు లేదు.

పొద్దున్న వెంకటేశ్వర్రావ్ మొదటగా కుర్పం మార్కెట్ వెనక నల్లావారి విఘ్నేశ్వరుడి గుడికెళ్ళి కొబ్బరినీళ్ల తీర్థం తీసుకోవాలి. తరవాత వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పక్కన శివాలయానికెళ్లి నాలుగు వేళ్ళు అందేంత నుదుటిని విబూదితో నింపేయాలి. ఆ తరవాత సీహార్స్ జంక్షన్ పెద్దాంజనేయస్వామి గుడికెళ్ళి ఒక తమలపాకులో సిందూరాన్ని కట్టాలి. అక్కడ్నుంచి పూర్ణామార్కెట్ చిన్న ఆంజనేయస్వామి గుళ్లో ఉంటే వడ లేదా అప్పం ప్రసాదం పెడితే తినాలి. ఆఖర్న బురుజుపేట కనకమహాలక్ష్మి గుడికెళ్ళి ఎండుఖర్జూరం పరిమాణాన కుంకం మెత్తుకోవాలి. చివరిగా పచ్చిపులుసు వేంకటసన్నయ్య కొట్లో పోకచెక్క అరువడిగి బుగ్గన చప్పరిస్తూ ఇల్లు చేరాలి.

మధ్యాహ్నం 12:30..

టేకు బల్ల మీదకొచ్చి కూర్చున్నాడు వెంకటేశ్వర్రావ్. కోడలు అప్పటికే కంచంలో భోజనం, చెంబుతో నీళ్లు పెట్టేసింది. కాళ్ల తడి ఆరేలోపు చేతులు కడిగేసాడు. వెంటనే టెలిఫోన్ పక్క గూట్లో కరెంట్ బిల్లు అందుకున్నాడు.

“స్రవంతీ డబ్బులిస్తావా? కరంటాఫీసుకి వెళ్ళాలి”.

“ఈ ఎండన పడి ఎందుకు? చల్లబడ్డాక వెళ్లచ్చు కదా మోయ్ గారు” అంది.

“ఇవాళ్టి పని ఇవాళవ్వడానికి ఎండేమిటి? కొండేమిటి? అయినా గవర్నమెంట్ బిల్స్ ఎక్కువ కాలం పెండింగ్ ఉండకూడదమ్మా! ఆ టెలిఫోను బిల్లుకి కూడా రేపెళ్లాలి” అని డబ్బులు తీసుకుని బయల్దేరిన మనిషి ఓల్డ్ పోస్టాఫీస్ విక్టోరియా బొమ్మకి ఎదురుగుండా ఉన్న కరంటాఫీస్ క్యూలో నిలబడ్డాడు.

మధ్యాహ్నం 2:45..

వెంకటేశ్వర్రావు ఒంటి కన్ను రాక్షసుడు. చిన్నప్పుడు ఆటలమ్మ వచ్చినప్పుడు దోబూచాటలో ఒక కన్నెత్తుకెళ్లిపోయింది. మిగిలిన ఆ ఒక్క కన్నూ డేగ కన్నుతో సమానం. వీధి అరుగు మీద కూర్చుని ఆ చివరి నుంచి ఈ చివరిదాకా వచ్చేపోయేవాళ్ళ మీద నిఘా పెడతాడు. లతమ్మగారిని ఎరిగినవారెవరైనా వస్తే తరిమెయ్యడం ఆయన ప్రథమ కర్తవ్యం. లతమ్మ ఆయన్ని తిట్టుకునే సవాలక్ష కారణాల్లో అది ప్రథమ కారణం.

వెంకటేశ్వర్రావ్ అరుపులతో కుర్చీలో కునుకు తీస్తున్న లతమ్మగారు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి వీధిలోకి వెళ్ళింది. అప్పటికే ఆయన ఎవరికో వీడ్కోలు చెప్తూ, వీధి చివరకి తిట్లదండకంతో సాగనంపుతున్నాడు.

“ఎవరూ? ఒచ్చారూ?”

“ఎవత్తో పేదరాసి పెద్ది! ‘లతెమ్మెగేరున్నారా?’ అనుకుంటూను”.

“నా కోసం ఎవరు ఇంటికొస్తే నీకేవయ్యా? వాళ్ళ మీద పడేడుస్తావ్?”

“అడ్డవైన వాళ్ళు వచ్చి వెధవ సోది పెడితే నాకొళ్లు మంట సుమీ! ఆ!”

“వాళ్ళు నాకోసం వస్తే నీకేం మాయరోగమో?”

“వస్తే బానే ఉన్ను! ఆ ఒచ్చిన నళినియో, మూలా రవణమ్మో ‘ఏమిటే లతా? ఏవొండింది మీ కోడలీరోజు? అసలు సరిగ్గా వండుతోందా? లేక..’ అని పిచ్చిముండా వాగుడు వాగితే నాకు చిర్రెత్తుకొస్తుంది. నా కోడలు ఏవొండితే దానికెందుకుటా?”

“ఏదో బాగు కోసం అడుగుతార్లే!”

“బొక్క బాగు. దానికి నా కోడల్ని తిడితే వినాలని కోరిక. ఆ..! నిన్న ఆ కాంట్రాక్టర్ పెళ్ళాం వచ్చి ‘మా అబ్బాయి జున్నుపాలు తెచ్చాడు. నెలకోసారైనా జున్నొన్డుకోకపొతే వాడుండలేడు. రేపు వేరే దేశం వెళ్తే ఎలా బతుకుతాడో’ అని వెధవ డచ్చీలు, డాబులూను. డబ్బుందని పొగరు”.

“వాళ్లకుంది, చెప్పుకుంటారు. నువ్వేం ఊడబొడిచావని? వయసులో ఉన్నప్పుడు ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నా పెద్దకొడుకు స్కూలుకి వెళ్తూ ట్యూషన్లు చెప్పుకుంటూ పోషించాడయ్యా నిన్ను. సిగ్గులేకుండా అది మేస్తూ మళ్ళీ మాట్లాడుతున్నావు”.

“మా నాన్న రామచందర్రావ్ గారు పీవీజీ రాజుగారి దివాన్ కాబట్టి, నేను ఉద్యోగం చేస్తే నామోషీ అని నన్ను చేరనివ్వలేదు. వాళ్లూ, వాళ్ల వెధవ చాదస్తాలూనూ”.

“ఆ! వాళ్ళ చాదస్తాలను తిట్టుకుంటూనే నీ చావు దగ్గరకొచ్చేదాకా కూర్చో ఇంకలాగ”.

“నిన్ను అంటగట్టినందుకు వాళ్లననుకోకపోతే ఇంకెవర్ననుకోవాలి?” గొణుక్కుంటూ వీధరుగు మీదకొచ్చి కూర్చున్నాడు. మళ్లీ కాలు మీద కాలు. మోకాలి మీద రెండు చేతులేసుకుని మళ్ళీ అదే గస్తీ.

సాయంత్రం 4 గంటలు..

సెయింట్ ఆలోసియస్ స్కూల్లో రెండో గంట మోగింది. పిల్లలందరూ మూటలోంచి జరిపడ్డ అల్లికాయల్లాగా గేటు వైపుగా పరుగు తీశారు. అక్కడే మాలీ పక్కన నిలబడి పిల్లల్ని పరీక్షగా చూస్తూ ఈయన కూడా నిరీక్షిస్తున్నాడు. ఎప్పటికైనా ఆ చూపుకి దొరక్కుండా తప్పించుకొని వెనకనుంచి వచ్చి తమాషా చేయాలని కార్తిక్ కోరిక. అది ఇవాళా నీరుగారిపోయింది.

తనని పసిగట్టేసి ఇక్కడున్నానన్నట్టుగా చెయ్యూపాడు వెంకటేశ్వర్రావు. మనవడి బ్యాగు లాక్కొని తన వీపుకి తగిలించుకున్నాడు. ఎడమ చేతిలో వాటర్ బాటిల్‌ని, కుడిచేత్తో మనవడి చేయిని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ నాలుగడుగులు వేయగానే వెనక నుంచి “ఏరా బాలాజీ! పాపం మూసిలాయనతో నీ బ్యాగ్ మోయిస్తున్నావ్. సిగ్గు లేదా?” అన్నాడు అనురాగ్ పక్కనుంచి రివ్వున హెర్కులిస్ బజ్ సైకిల్తో దూసుకెళ్తూ. విననట్టుగా ఎటో చూశాడు కార్తిక్. వాడి కనుబొమలు, ముక్కు ఏకమైపోయినంత ముక్కోపం వచ్చింది. ఉడుకుమోతు మొహం పెట్టుకొని ఇంటికొచ్చిన వెంటనే లతమ్మగారికి ఫిర్యాదు ఊదేశాడు.

“ఏవయ్యా! ఎందుకయ్యా పిల్లాడినలా రొష్టు పెడతావు?”

“నేనేమీఁ అన్లేదు సుమీ! వాడు నీకేం చెప్పాడో మరి”.

“వాడి పుస్తకాలు వాడినే మొయ్యనివ్వకూడదూ? నీకెందుకా గోల?” అంది లతమ్మ విసుక్కుంటూ.

“వాడెవడో వాగింది చెప్పాడా? అవునే! మోస్తాను. ఆ వెధవలకెందుకుటా? నా మనవడు నా ఇష్టం. బ్యాగ్ ఏం ఖర్మ! వయసు మీద పడింది గాని లేపోతే వాడినే మోసేవాడ్ని” అని నిష్కల్మషంగా చెప్పేసి అరుగు మీద స్తంభానికి జాలబడి మనవడి కోసం ఎదురుచూస్తున్నాడు.

బట్టలు మార్చుకుని, పౌడర్రాసుకుని, బ్యాగేసుకొచ్చిన కార్తిక్‌ని మళ్ళీ ట్యూషన్ దగ్గర దింపే డ్యూటీ ఇప్పుడు. ఏమాత్రం ఆలోచించకుండా మళ్ళీ కార్తిక్ చేతిలోంచి బ్యాగు లాగేసుకున్నాడు. పళ్ళు బిగించిన కార్తిక్‌కి మళ్ళీ ప్రైవేటులో కూడా ఎదురయ్యే పరాభవం తలుచుకుంటుంటే ఏడుపొచ్చేలా ఉంది. నిస్సహాయంగా చిరాకుపడుతూ ఇల్లు వదిలాడు.

మనవన్ని దిగబెట్టి తిరిగొచ్చిన వెంకటేశ్వర్రావ్ ఇంట్లోకైనా వెళ్లకుండా, పెండింగ్ ఫైల్లాగా గుమ్మంలోనే కూర్చుని కూనిరాగం తీస్తున్నాడు. గుమ్మం మొదట్లో ఉన్న లతమ్మగారిని పలకరించనైనా లేదు. ఆవిడా తలెత్తి చూడనైనాలేదు. పాడైపోయిన బల్బుల పైన అల్లికతో బాతులను ఎలా తయారుచెయ్యాలో పక్క వీధి సృజనకు నేర్పించడంలో నిమగ్నమై ఉందావిడ.

కాసేపటికి పక్క సందు బాపిరాజుగారొచ్చి ఇవతల స్తంభానికి ఆనుకుని కూర్చోబోతూ వెంకటేశ్వర్రావ్‌కి ఒక నవ్విసిరాడు. ఏదో సంభాషణకి నాంది పలుకుదామనే చివురాశతో. ఆ నవ్వు కరిగిపోడానికి ఆట్టే సమయం పట్టలేదు.

“కూర్చుంటే కూర్చున్నారు. చుట్ట మాత్రం కాల్చకండి.‌ నాకా కంపంటే పరమ అసహ్యం” అంటూ కుండబద్దలు కొట్టేశాడు వెంకటేశ్వర్రావు. దెబ్బకి జేబు వైపు వెళ్తున్న చేతిని చొక్కా దులుపుకున్నట్టు తమాయిన్చుకుని అటువైపు తిరిగిపోయారు బాపిరాజుగారు.

సాయంత్రం 5 గంటలు..

“అమ్మా, స్రవంతీ! ఐదయింది. పాల డబ్బా ఇస్తే నేనెళ్లి కార్తిక్‌కి ఇచ్చేసొస్తాను” అన్నాడు వెంకటేశ్వర్రావ్ పాతికేళ్ళు పైబడిన తన హెచ్ఎంటీ వాచీకి కీ ఇచ్చుకుంటూ.

చిన్న స్టీల్ క్యారేజీ డబ్బాలో మాల్టోవా తీసుకొచ్చి అందించింది స్రవంతి. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాగా ఆగకుండా సోల్జర్‌పేట వైపు పరుగులాంటి నడక లంఘించుకున్నాడు.

‘షరీఫ్ మంజిల్’ అనే భవంతి ముందు ఆగి, వేలాడుతున్న గొలుసు గొళ్లాన్ని తలుపుకు పెట్టి మూడుసార్లు కొట్టాడు.

“బాలాజీ! లుక్స్ లైక్ యువర్ గ్రాండ్‌ఫాదర్ ఈజ్ హియర్ ఫర్ యూ” అని లోపల్నుంచి ఆంగ్లో ఇండియన్ టీచర్ గొంతు వినిపించింది. వెంటనే పిల్లల నవ్వులు వినిపించాయి. తలుపు తెరుచుకుంది. విసుగు మొఖంతో కార్తిక్ తలుపు తీసాడు.

“ఎందుకు తాతా? ఇంటికొచ్చి తాగుతా కదా! నా పరువు తీస్తున్నావ్” ముళ్లలాంటి తన స్నేహితుల చూపులు, నవ్వులు గుచ్చుకుంటుంటే వెనక్కి చూసుకుంటూ అయిష్టంగా క్యారేజీ తెరిచాడు. ఎలాగోలా ఆ పాలను గొంతుకలో పోసి, క్యారేజీ తాత చేతిలో గుచ్చాడు.

“అబ్బా! అంతా మీగడే” అని పళ్లలో ఇరుక్కున్న మీగడని పక్కనున్న మొక్కల్లోకి ఉమ్ముతూ ఆయన మొఖంమీదే తలుపేసేసాడు.

ఐదున్నర అవ్వగానే వసారాలోకి నడుస్తూ “అమ్మా స్రవంతీ! కాఫీ ఇస్తావా? తాగేసి మా బాస్‌ని కలిసొస్తాను” అని కోడలిని అడిగాడు వెంకటేశ్వర్రావ్. ఐదు నిమిషాల తరువాత అగ్నిపర్వతం లాంటి కాఫీ వంటింట్లోంచి వచ్చింది. ‘నా వేడికన్నానా?’ అని వెక్కిరిస్తున్నట్టు ఒక్క గుక్కలో దాన్ని కడుపులోకి పోసేసుకున్నాడు. వెంటనే ఆయన అడుగులు పోర్ట్ వెంకటేశ్వరస్వామి గుడివైపు పడ్డాయి.

సూర్యుడు అస్తమిస్తూ ఉండగా పోర్టుని ఆనుకుని ఉన్న ఆ గుడి మెట్లెక్కుతూ అలసిన సూర్యుడికి వీడుకోలివ్వడం ఆయనకి అలవాటు. గుళ్ళో ప్రతి దేవుడినీ పరామర్శించాక కాసేపు భాష్యంగారితోను, రాంబుజ్జిగారితోను కబుర్లు చెప్పుకున్నాడు. ఆయన బయల్దేరదామని లేవగానే నల్లపంతులు గారు లోపల్నుంచి దద్దోజనం, చెక్కర పొంగళి ఉన్న విస్తరాకు పొట్లం ఆయన చేతిలో పెట్టారు. దాన్ని మడిచి పట్టుకెళ్లబోతుంటే మరో కవర్ చూబిస్తూ “ఇంటికి వేరే ఉంది లెండి. ఇదిక్కడ కానిచ్చేయండి” అన్నారు.

వెంటనే ఆకులో ఆఖరి మెతుకు కూడా మిగలకుండా నాకేశాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా డాక్టర్ కుచెల్రావ్ ఎదురయ్యారు.

ఆయనతోపాటు కాసేపు పిచ్చాపాటి కబుర్లు చెప్పి ఓ రవంత ప్రసాదం ఆయనకిచ్చి సెలవు తీసుకున్నాడు వెంకటేశ్వర్రావ్.

సాయంత్రం 7 గంటలు..

గుమ్మంలో పాదం పూర్తిగా మోపకుండానే “అమ్మా స్రవంతీ! ఇదిగో గుళ్లో ప్రసాదం ఇచ్చారు. గిన్నెలు తీసుకొస్తే అందులోకి సర్దేస్తాను” అని కేకేశాడు. రెండు స్టీల్ గిన్నెలు తీసుకొచ్చిన స్రవంతితో “దారిలో కుచెల్రావ్ కనపడితే కొంచెం ప్రసాదం ఇచ్చానమ్మా” అని లెక్కలు అప్పజెప్తున్నాడు. పక్కనుంచి వింటున్న లతమ్మగారు ఒక్కసారిగా విరుచుకుపడింది.

“ఈ రోజు ఏ రోగం అని కలిశావ్? వందసార్లు చెప్పాం నేను, రామం. ఆయనని కలవకు, ఆ నాటుమందులు వాడకు, నీ ఒంటికి పడవు అని. నువ్వేమో వినవు”.

“నాకే మాయరోగాలూ లేవే! నాకేదైనా నలతగా ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారే చక్కగా మందిచ్చేవారు. ఇప్పుడితను. హస్తవాసి కూడా మంచిదని చూపించుకుంటూ ఉంటాను. ఈ రోజు ఆయనే ఎదురొచ్చాడు. నేనేమీ ఆయన క్లీనిక్కి వెళ్ళలేదు”.

“సర్లే! నువ్వూ నీ అబద్ధాలు. ఎందుకొచ్చిన చవక వైద్యం. సంచి లాభం చిల్లు దొబ్బిందని, లేని రోగాలు కూడా తిరగమోత పెడితే చూసే దిక్కులేదు. పైగా చేతిలో రూపాయి లేదని ప్రసాదం ఫీజుగా చదివించొచ్చావా? సిగ్గు లేకపోతే సరి”.

“నేనేమీ దొంగబద్ధాలు ఆడటం లేదు సుమీ! మా బాసే సాక్షి. కావాలిస్తే రేపు ఆయన దగ్గరకెళ్లి నువ్వే అడుగు”.

“నువ్వు పెట్టిన ప్రసాదం తిన్న ఆయన నీ చిలక పలుకులు తప్ప ఇంకేం పలుకుతాడు. ఇంక చాల్లే ఆపు”.

“సరిలేవే! నేనూ, నా దేవుడూ అబద్ధం ఆడితే సర్వనాశనం ఐపోతాం” అని గట్టిగా లెంపలేసుకున్నాడు.

“మధ్యలో ఆ దేవుడేం చేశాట్టా?” అని అంటున్న లతమ్మగారి మాట పూర్తిగా నోరు దాటాక ముందే అక్కడ్నుంచి నిష్క్రమించాడు.

రాత్రి 8:30

అప్పుడే ట్యూషన్లు చెప్పుకొని ఇంటికొచ్చిన కొడుకుని “ఇదిగో రామచెందర్రావ్” అని పిలిచాడు. తండ్రంతటి వాడవ్వాలని తండ్రి పేరు పెట్టుకున్నాడు కొడుక్కి. రామం మళ్లీ ఎక్కడికో వెళ్లాలని లూనా తాళాలు వెతుక్కుంటున్నాడు. వెంకటేశ్వర్రావ్ పిలిచాడని అతని ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని కళ్లింకా గూళ్లను సవరించడం ఆపలేదు. ఈలోపు ఆ పెద్దాయన బీటలు పడిన పాత సిమెంటు గచ్చుని చూస్తూ “జుత్తు బాగా పెరిగిపోయింది. తిరపతెళ్లి ఐదు నెలలౌతోంది. టిక్కెట్టుకి సరిపడా డబ్బులిస్తే రేపెళ్దామనుకుంటున్నాను. ఏమంటావ్?” అన్నాడు.

వెంటనే రామం వెతుకులాట ఆపేసి “మొన్నే కదండీ వెళ్లారు? దేవుడి విషయంలో ఇలా అంటున్నానని కాదు. ఎన్నిసార్లు వెళ్తే వద్దంటాడు? ఒక్కర్నీ పంపించడం నాకు నచ్చట్లేదు. మీకా వయసు పైబడుతోంది. టిక్కెట్టు డబ్బులు తప్ప రూపాయి కూడా ఎక్కువ తీసుకెళ్లరు. మాకేమో మీరు తిరిగొచ్చేదాకా భయం. ఈ మనిషి ఎలా వస్తాడా అని? అవసరమా? రోజూ ఊళ్ళో గుళ్ళు చుట్టపెడుతోంది చాలదా?”

“ఎందుకు? దమ్మిడీ గుండుకు ఏగాణీ క్షవరం? అయినా ప్రయాణానికి తప్ప డబ్బెక్కడ అవసరం? ఫ్రీ దర్శనం, ఫ్రీ భోజనం, ఫ్రీ కల్యాణకట్ట, గుళ్ళోనే నిద్ర. ఇహ ఖర్చెక్కడిది?” గద్దించాడు వెంకటేశ్వర్రావ్.

“ఏదైనా ఇబ్బందొస్తే?”

“ఏవీ రాదు. బాసే ఉన్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటాడు. అయినా ఆయనకి జుత్తు బాకీపడ్డానని అడిగా అంతే! అంతగా ఇష్టం లేకపోతే చెప్పు. ఆ పోర్టు వెంకటేశ్వరస్వామి గుళ్ళోనే ఈ పట్టబుర్ర మీద నాలుగు తెల్లెన్ట్రుకలూ ఇచ్చేస్తాను. ఆ నీలాదేవేమీ తప్పెట్టుకోదులే”.

“అది కాదండీ..” అని కొడుకు చెప్పేలోపే లోపలికెళ్లి కాళ్లు కడుక్కుని మళ్ళీ గుమ్మంలో తిష్ట వేసాడు.

రాత్రి 9:30..

ఇంట్లోంచి కుక్కర్ విజిల్స్ వినపడిన ఇరవై నిమిషాలకి “మోయ్‌గారూ! వంటయిపోయింది భోజనంకొచ్చేయండి” అని స్రవంతి పిలుపుతో మళ్ళీ అరుగుమీంచి గుమ్మంలోకి అడుగుపెట్టాడా పెద్ద మనిషి. ముందు పళ్లలో కొన్ని ఊడిపోయి ఉండటంతో చేత్తోనే గట్టిగా పిసికేసుకుని ముద్దల్ని కలుపుకొని నాలికతో నోట్లోకి లాగి మింగేయడానికి పదినిమిషాలు కూడా పట్టలేదు.

తినేసి చెయ్యి తొలిచేసాక “ఇదుగో స్రవంతీ! నేనెళ్లి పడుకుంటాను. సరేనా?” అని సెలవు తీసుకుని మూడంతస్తులూ ఎక్కాడు.

రాత్రి 10:15..

డాబా గదిలోకి వెళ్లి గూట్లో గండుపిల్లిలా ఎదురుచూస్తున్న ఎవర్రెడీ రేడియోని ట్యూన్ చేసేసరికి ‘ఇష్’ మంటూ శబ్దం చేసింది. నాలుగు దెబ్బలేసేసరికి అది వివిధ భారతికి తగులుకొంది. గది బయట వరండాలో చిరిగిన చాప పరుచుకున్నాడు. నల్లబొగ్గులో నానుతున్న తలగడా సర్దుకుని ఒంటి మీద దుస్తులన్నీ తీసేసి తలారదిక్కున ఆ రేడియో పెట్టుకొని ఆకాశంలోకి చూస్తున్నాడు.

“రేపు ఒకటో తారీకు గుళ్ళకి మనియార్డర్లు కట్టడానికి స్రవంతిని డబ్బులడగాలి. టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌కి వెళ్లి బిల్లు కట్టాలి. కార్తిక్‌కి రేపట్నుంచి పరీక్షలు కాబట్టి ఒక్కపూటే స్కూలు. వాడిని తీసుకురావడానికి ఇంటి దగ్గర్నుంచి ఎప్పుడు బయల్దేరాలి? సాయంత్రం పూర్ణామార్కెట్‌కి వెళ్లి కూరగాయలు కూడా తేవాలి”. ఈ దూరాలను నక్షత్రాలతో పోలుస్తున్నట్టు గాల్లో వేళ్ళు తిప్పుతూ, లెక్కలు వేసుకుంటూ నోరు తెరుచుకుని ఎప్పుడు నిద్రపోయాడో ఆయనకే తెలీదు.

*

కదిలించే అంశాలు లేకపోతే  రాయలేను

* హాయ్ కార్తిక్! మీ గురించి చెప్పండి.

హాయ్! నా పూర్తి పేరు పులిపాక బాలాజీ కార్తిక్(పుబాకా). మాది విశాఖపట్నం. పుట్టింది, పెరిగింది, చదివింది.. అంతా అక్కడే! ప్రస్తుతం స్వీడన్‌లో ఉన్నాను. ఇక్కడ ఒక బ్యాంకులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను.

* చిన్నప్పటి నుంచి పుస్తకాలు బాగా చదివేవారా?

మొదట్నుంచీ తెలుగు భాష మీద చాలా ఇష్టం ఉంది. కొంచెం పెద్దయ్యాక అది అభిలాషగా మారింది. అందుకు ముఖ్య కారణం సినిమాలో పాటలు, డైలాగులు. వాటి గురించి మా అమ్మతో చర్చించేవాడిని. భాషను అంత బాగా వాడి మాటలు, పాటలు రాయడం నాకు అబ్బురంగా అనిపించేది. చాలామంది చదివినట్టే చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర మాసపత్రికలు చదివేవాణ్ని. కాస్త పెద్దయ్యాక మధుబాబు గారి నవలలు ఇష్టంగా చదివాను. ఆ తర్వాత సినిమా ప్రముఖుల ద్వారా బాపు రమణల రచనల గురించి తెలుసుకుని మొదటిసారి ‘మిథునం’ పుస్తకం కొన్నాను. అది ముళ్లపూడి వెంకటరమణ గారు రాశారన్న ఆలోచనతోనే కొని చదివాను.

* అదేంటి?

అవును! అప్పటికి నాకు శ్రీరమణ అనే రచయిత ఉన్నారని, ఆయనే ఆ కథలు రాశారన్న సంగతి తెలియదు. చాలాకాలంపాటు అవి ముళ్లపూడి వెంకటరమణ గారే రాశారని అనుకున్నాను.

* పాఠకుడి ఉన్న మీరు రచయితగా ఎలా మారారు?

తెలుగు బాగా రాయగలనన్న నమ్మకం ఏర్పడ్డాక చిన్నచిన్న కవితలు, పాటలు రాసి ఫేస్‌బుక్‌లోని కొన్ని గ్రూప్స్‌లో షేర్ చేశాను. ఆ తర్వాత ఒకటి, రెండు చిన్న కథలు రాశాను కానీ ఆ తర్వాత చదివితే అవి నాకే నచ్చలేదు. నేను కథలు రాయలేనేమోనన్న ఆలోచనతో ఎక్కువగా ప్రయత్నించలేదు.

* ‘వెంకటేశ్వరోపాఖ్యానం’ మీ తొలి కథ కదా! దాని నేపథ్యం చెప్పండి.

ఇది మా తాతగారి కథ. ఆయన గురించి రాసిన కథ ఇది. నేను ఏడో తరగతిలో ఉండగా ఆయన మరణించారు. ఒక రోజులో గంటల ప్రకారం ఆయన ఏం చేసేవారో నాకు బాగా గుర్తుంది. అదే కథగా రాశాను. ఆయనది నికార్సయిన జీవితం. దేనికీ చింత లేదు. దేనిపైనా అపరిమితమైన ఆశ లేదు. దేవుడి మీద ఆయనకున్న భక్తి విచిత్రమైనది. వెంకటేశ్వర స్వామిని ఆయన ‘బాస్’ అనేవారు. కథలో ఒకచోట “నేనూ, నా దేవుడూ అబద్ధం ఆడితే సర్వనాశనం ఐపోతాం” అని అంటారు. దేవుడి మీద ఎంత ప్రేమ లేకపోతే ఆయన నోటి వెంట అలాంటి మాట వస్తుంది! దేవుణ్ణి తన సాటి మనిషిగా ఆయన స్వీకరించిన పద్ధతి ఇప్పుడు తల్చుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది.

* ఇటీవల కాలంలో బాగా పుస్తకాలు చదువుతున్నారు కదా! ఎవరి కథలు మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయి?

నేను చదివింది తక్కువే! ఇంకా చాలా చదవాలి. చదివినంత వరకూ మధురాంతకం నరేంద్ర గారి కథన శైలి చాలా నచ్చుతుంది. ఆయన కథను కూర్చే విధానం అద్భుతం. గొల్లపూడి మారుతీరావు ‘జజుమురా’ కథ‌లో గాఢత చాలా బాగుంటుంది. వంశీ గారి ‘మా పసలపూడి కథలు’, బాపు రమణల ఆత్మకథ ‘కోతికొమ్మచ్చి’ చాలా నచ్చాయి.

* ముందుముందు ఎలాంటి కథలు రాయాలని ఉంది?

నన్ను కదిలించే అంశాలు లేకపోతే నేను రాయలేను. వాటినే కథా వస్తువులుగా తీసుకుంటాను. పాఠకులపై గాఢమైన ముద్ర వేసే కథలు రాయాలని ఉంది.

*

పుబాకా

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చక్కటి నేరేషన్ తోపాటు హాస్యం కూడా బాగా పండింది. ఇది అనుభవజ్ఞుడైన రచయిత రాసి ఉంటాడనుకున్నాను కానీ యువ రచయిత తొలి కథ అంటే ఆశ్చర్యం కలిగింది. తొలి కథ హిట్. ఇక మీరు అలా రాస్తూ పోవచ్చు.

    • 🙏😊🙏 ధన్యవాదాలు . ఖచ్చితంగా మరిన్ని కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తాను

  • బాలాజీ కార్తీక్ గారూ! మీ వేంకటేశ్వర్రోపాఖ్యానం కథ చదివాను, చాల బావుంది, ప్లీజ్ కీప్ ఇట్అప్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు