మనకే తెలియని మన కథ 

పాణి శికారి అనే పేరుతో ఈ మధ్యే ఒక నవల వెలువరించాడు. ఒక సంచార జాతి కి చెందిన మనుషుల జీవితాల్ని కథాంశంగా తీసుకుని నవలని అల్లుకుంటూ పోయాడు పాణి. మన దేశంలో నీలి శికారీలవంటి అనేక సంచార జాతులకు చెందిన మనుషులున్నారు. వీళ్ళని పూసలవాళ్ళుగానో, గువ్వలోళ్ళు, జాతావులు, చెంచులు, ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. మిగతావారికిమల్లే వీళ్ళకూ బంధుత్వాలు, బాధ్యతలు, చరిత్ర, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అన్నీ ఉంటాయి. ఊరిబయట ఖాళీ స్థలాల్లో, రోడ్ల పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకుని బ్రతుకును వెళ్ళదీయడం గమనిస్తుంటాం. కొంతమంది అక్కడక్కడా స్థిరపడి ఉన్నారు. పళ్ళు గారపట్టి, జుట్టు కత్తిరించుకోకుండా, సరైన బట్టలు వేసుకోకుండా వాళ్ళదొక లోకంలా ఉంటారు.

పాణి సరిగ్గా కర్నూలు జిల్లాకు చెందిన అటువంటి శికారీ తెగ గురించి ఈ నవల రాశాడు. పాణి అంటేనే ఎవరికైనా ఎంతో జఠిలమైన విప్లవ రాజకీయ విషయాలను తనదైన భాషలో వ్యాసాలు, సంపాదకీయాలు రాసే వ్యక్తిగా గుర్తుకొస్తాడు. మార్క్సిస్టు మేధావి వర్గంలో ఒకడిగా మసలుతుంటాడు. విరసం బాధ్యుడు. భావజాల పరంగా అందరికీ కొరుకుడు పడడు కూడా. అటువంటి పాణి ఈ నవల్లో గొప్ప జీవద్భాషని ప్రయోగిస్తాడు. అచ్చంగా వాళ్ళమధ్య తిరుగాడిన మనిషికిమల్లే పాత్రల్ని నడిపిస్తాడు. ఒక డొక్కోడు, నానా, గుమ్లి, రానూ, సవాస్సింగు– అందరూ వాళ్ళ వాళ్ళ సహజమైన భాషలో మాట్లాడుకుంటారు. మనం మొదట్లో ‘కొంతంటే కొంతే’ ప్రయాస పడాలి. ఆ తర్వాత కథ దానంతట అదే అదే మనల్ని తనలోకి తీసుకెళ్తుంది. రాయలసీమ కథకుల్ని ఒకందుకు మెచ్చుకుని తీరాలి. భాషలో అక్కడ వస్తున్న వైవిధ్యం మరెక్కడా రావట్లేదు. కాసిన్ని జిల్లాల సీమలో ఎన్నో యాసలు ఉన్నాయన్న సంగతి స్పష్టంగా చెబుతున్నారు. మారుతి, వెంకట కృష్ణ, భారతి, ఝాన్సీ, సురేంద్ర – ఇదొక పెద్ద చిట్టా అవుతుంది. కాసిన్ని కిలోమీటర్ల దూరానికే భాష మారిపోతున్న అవగాహన కలుగుతుంది మనకి.  కర్నూలు జిల్లా మాండలికంలో కథ నడుస్తుంది. సారాయి కాయడం, ధియేటర్ల వద్ద బ్లాకు టికెట్లు అమ్మడం, కుందేళ్ళను, అడవి పందుల్ని వేటాడ్డం లాంటి పనులు చేసే ఈ తెగ భాషను ఆవిష్కరించడంలో పాణి సఫలీకృతం అవుతాడు.

అయితే కథాగమనంలో వచ్చే అనేక సందర్భాలను ఒకదానికొకటి అతికేప్పుడు, కథా సంవిధానానికీ; ఆ తెగ భాషనే వాడ్డం మనల్ని ఆశ్చర్యపరిచే విషయం. రచయిత వ్యాఖ్యానాలకి (narration) అది అనవసరం. మామూలు భాష వాడవచ్చును. గతంలో అల్లం రాజయ్య లాంటివాళ్ళ భాష విషయంలో విరసం చేసిన చర్చ గుర్తుంచుకోదగ్గది. బూతులు మాట్లాడ్డం శికారీలకు సహజమైనప్పటికీ కొన్ని పదాల వాడుకని పాణి పరిహరించవలసింది. లంజ, దెంకపోవడం లాంటివి అంత ముఖ్యం కాదు. అయితే దేహ భాషని వాడ్డంలో, స్త్రీలని తిట్టు పరికరంగా చూడ్డంలో శికారీలూ మినహాయింపు కాదని తెలుస్తుంది. భాషా వికాస పరంగా శికారీల డిక్షన్ ని పాణి గొప్పగా కథలోకి ప్రవేశపెడతాడు. అదొక అనుభవమే తప్ప మాటల్లో చెప్పడం కుదరదు.

కథ నడకలో కొంత నెమ్మది ఉంది. బహుశా అది ఒక కొత్త జీవితావిష్కరణ జరుగుతున్న క్రమంలో రచయిత ప్రతీ చిన్న పరిశీలననీ వదల్లేక పోవడం వల్ల కావొచ్చు. కానీ ఎక్కడా విసుగు పుట్టదు. ఆసాంతమూ ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా గుమ్లీ తన భర్త డొక్కోడు రానూని రెండో పెళ్ళి చేసుకోదలిచినప్పుడూ, సవాస్సింగు తో కలసి షాహూ కుందేళ్ళ వేట ఘట్టము, సారా కాంట్రాక్టర్ కేశవులు గౌడ్ తో శికారీల గొడవలు, శ్యామూ చావు, నానా వేరొక స్త్రీతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పటి అమాయకమైన భయం, ఇవన్నీ శికారీలను సరిగ్గా అర్ధం చేసుకునే వీలు కలిగిస్తాయి. మనుషుల్ని ప్రేమించడం ఎలాగో పాణి చెప్పకనే చెబుతాడు. కథను దృశ్యమానం చెయ్యడంలో రచయిత కష్టం తెలిపే సంభాషణల్ని పొదువుకున్న నవల శికారి. చాలాచోట్ల కళ్ళు చెమరుస్తాయి. గుండె చిక్కడుతుంది. ఇలాంటి రచనలవల్ల పాలక వర్గాలకు కినుక కలగడానికీ ఒక కారణం ఉంటుంది. జన సామాన్యానికి విస్మృత వర్గాల ఎరుక కలిగించడంలో పాణి వంటి రచయితలు తమ పని తాము సమర్థవంతంగా చేస్తారు. సాహిత్యానికుండే సామాజిక ప్రాధాన్యం తెలిపే విధంగా దోపిడీ వర్గాలతో శికారీల సంఘర్షణని ఈ నవలలో పాణి అద్భుతంగా చిత్రిస్తాడు. గేర్లో తాగేందుక్కూడా సారాయి వండుకోనివ్వనప్పుడు బట్టీ పెట్టేందుకు శామూ సిద్దపడటంలో శికారీల చైతన్యం ఉంది. శామూ చావుక్కూడా వెనుకాడడు. అతనిలో కథానాయకుడి లక్షణాలు మెరుపులా తళతళలాడుతాయి. శికారోల్లలో కాస్తంత చదువుకున్న శామూ చనిపోవడం మనల్ని చాలా బాధిస్తుంది. భరించలేం. అయితే సారాయి కోసం ఇంత దూరం వెళ్ళాలా అనిపిస్తింది కానీ అది వాళ్ళ సాంస్కృతిక జీవనంలో ఒక ముఖ్య భాగంగా ఆలోచిస్తే కాదనలేం. అన్ని సామాజిక దృక్పధాలూ ఒకే రీతి ఉండవు.

మామిడి వనం పక్క ఒక కొనాకు చెట్లలో శికారోల్ల గుడి విషయమై దేవసహాయంతో గొడవ పడేందుకు సిద్దపడ్డంలో కూడా శికారోల్ల పోరాట ప్రేమ ఉంది. కానీ వీళ్ళు అంతే భయస్తులు కూడా ! ఆచార వ్యవహారాలకి భయపడతారు. ఈ తెగలో గోత్రాల వివరాలూ, పూజారుల పద్దతి, ఇంటి దేవతల పూజాదికాలను పాణి పరిశోధనాత్మకంగా రాశాడు. వివాహమూ, జంటలు విడిపోవడమూ, పరిహారాలూ, కొరడా దెబ్బలు ఇంకా వీళ్ళలో ఉన్న అసమ స్వభావాన్ని తెలియజేసినప్పటికీ స్త్రీల విషయంలో తెగ కట్టుబాట్ల గురించి పాణి చూపిన శ్రద్ద ప్రశంసనీయమైనది. మిగతా నాగరిక సమాజాలలో లేని స్త్రీ స్వేచ్చ శికారీలలో ఉంటుంది. తినడం, నచ్చినట్టు తాగడం, ఇష్టప్రకారం మగవానితో కలసి బ్రతకడం లాంటివి బాగా చిత్రించాడు పాణి. గుమ్లీ, లీల, చెమ్మి, అనర పాత్రల స్వభావం చాలా స్పూర్తివంతంగా ఉంటుంది. లీల శామూని మరచి కొట్కూరోల్ల సంబంధాన్ని చేసుకోవడం పాఠకులు ఒప్పుకుంటారు. ఉద్వేగమే కాదు, వాస్తవికత ప్రాధాన్యమిది. చెమ్మి పట్ల మద్దిలేటి ప్రవర్తన నచ్చక గేర్లో వాళ్ళందరూ అతన్ని గుట్టు చప్పుడు కాకుండా చంపేయడం సాహసం. ఆత్మగౌరం ప్రకటించడంలో ప్రాముఖ్యత ఇది. అనర మాదిగ కులస్తుడైన బజారితో జీవితం పంచుకోవడం శికారీల్లో మామూలు నిర్ణయం కాదు. ప్రగతిశీల ప్రజాస్వామిక ప్రవర్తనకు అద్దం పడుతుందిది.

అలాగే అలాంటి కులాంతర వివాహం మూలాన బహిష్కరణకు గురైన అనరకు సహాయం చేయడంలో డొక్కోడి తెగువా సామాన్యమైనది కాదు. ఈ సన్నివేశం శికారి నవలని శిఖరానికెత్తేస్తుంది. నవల చివార్న బజారిని బల్లారి పున్నమి జాతరలో శికారోల్లు కలుపుకుంటారు. ఎంత ఔదార్యం ? ఎంతో చదువుకుని కూడా ఇతర కులాలవారిని తమ కుటుంబాలలో కలుపుకో లేక మధనపడే అనేక కులాలవారింకా ఈ సమాజంలో ఉన్నారు. అందుకు ఉన్నత, బహుజన, దళిత, మైనారిటీ అన్న భేదం లేదు. కనుక శికారీలపరంగా అది చాలా గొప్ప విషయం. అధ్యయనలేమి వల్ల దూరం నుంచి చూస్తే ఈ సంచార జాతుల పట్ల నాగరికుల అభిప్రాయాలు సరైనవిధంగా ఉండవు కానీ వాళ్ళతో కలసి మెలసి తిరిగితేనే ఇవన్నీ అర్ధమవుతాయి. పాణికి శికారీలతో స్నేహం కుదిరింది. కట్టమీద నానాని తప్పక కలసి ఉంటాడు. ఉప్పూకారం కలిపిన ఆమాంసం ముక్క తిన్నాడో లేదోగానీ, కుందేళ్ళ వేటకి తనూ తోడు వెళ్ళి ఉంటాడు. ఒక చుక్క వాళ్ళ సారాయి తాగి ఉంటాడు. ఈ కథంతా కర్నూల్లోని రాజకీయాల చుట్టూ తిరుగుతుంది. బంగారిపేట రియల్ ఎస్టేట్ దందాను వివరిస్తుంది. ఎన్ టీ రామారావ్ ప్రభుత్వంలో అవకతవకల్ని, ప్రజా ప్రతినిధుల దళారీతనాన్నీ ఎండగడుతుంది. మూర్తిగారి నోట్సు ఈ నవలకి ఎంతో మేలు చేసింది. ప్రచురణకర్తగా మూర్తి గారు తన పని చాలా బాగా నిర్వర్తించాడు.

ఇక నవల ముగింపు ఆశ్చర్యం వేస్తుంది. తేలిగ్గా నచ్చదు కూడా. రేపు ఏం జరుగుతుందో తెలియని శికారీలు కడుపునిండా తిని తాగి మామిడివనంలో బల్లారి పున్నమి నాడు ఒళ్ళలసిపోయేట్టు ఆడతారు. ఎడం దిక్కుండే శికారోల్ల పాత గుడేమయింది. కొత్త గుడి కూడా నేల మట్టమైపోతుందా ? వాళ్ళింకా సారాయి వండుతున్నారా ? శికారోల్లు బీసీలా ? ఎస్టీల్లో కలపడానికి ప్రభుత్వానికెందుకు ఇబ్బంది ? వీళ్ళల్లో చదువూ, ఉద్యోగాలు చేస్తున్నవారున్నారా? ఈ నవల ముగింపు కాలం (2006) నుండీ ఇప్పటిదాకా పాణి కర్నూల్లోనే నివసించినప్పటికీ కథని అర్ధాంతరంగా ఆపేసినట్టుగా అనిపిస్తున్నది. ప్రతీ కథా ఇంతేనేమో? అనేక నూతన విషయాల వల్ల చదివింపజేస్తుంది. ఉద్వేగపరుస్తుంది. వదిలేసిన ఖాళీల వల్ల దు:ఖం కలిగిస్తుంది. శికారీల అంతర్బాహిర ఒరిపిడిలో పాఠకుల్ని కదిలించివేసే సన్నివేశాలు ఎంతో దిగులు మిగులుస్తాయి. సామాజిక రాజకీయ స్థితిగతులల్లో ఏమీ మార్పు వచ్చి ఉండదు. ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయం జరుగుతున్న ఈ కాలంలో బ్లాక్ టికెట్ల ఆదాయం లేనేలేదు. ఈ లాంటివారిని మల్టీప్లెక్స్ ల దరిదాపులకే రానివ్వరు. ఇప్పుడు శికారీలేం పని చేస్తున్నారు ? పాణి ఉన్నదున్నట్లు చిత్రించడంలో నూరు శాతం కన్నా ఎక్కువే విజయం సాధించాడు. చిత్రణ దాటి ఈ నవల కలిగించిన భావ సంచలనాలేపాటివో చూడాలి. అందుకే ముగింపు ప్రాధాన్యం ఎక్కువ ఉంటుందని భావిస్తాను.

పాత్రల మధ్య చతురత కన్నా నిజాయితీ ఎక్కువ కావడాన కథలో ఉన్న ఒక విధమైన అసంతృప్తి చాప కింద నీరల్లే పారుతుంది. బహుశా అది శికారోల్ల పట్ల పాణి హృదయస్పందన కావచ్చు. శికారీల జీవిత చిత్రణలోని సహజత్వం పాణి చేసిన వర్ణనల్ని, చర్చల్ని అధిగమిస్తుంది. సమర్ధించను గానీ, బ్రిటీషు వాడు వీళ్ళని ఎందుకు నేరస్తుల జాబితాలో ఉంచాడో హేతుబద్దంగా తర్కిస్తే బాగుండేది. ఇప్పటికీ వాళ్ళనలానే చూడ్డంలో మార్పు రాలేదని రచయిత ఒప్పుకోవడం గమనించాలి. దొంగతనాల విషయంలో ఇప్పటి ప్రభుత్వం వీళ్ళనెలా పరిగణిస్తుందో, అందుకు స్వరాజ్యం  వచ్చిన తరవాత  మార్పులేమిటో చర్చించాలి. మనమందరం జైభీం సినిమా కూడా చూశాం. వాళ్ళకీ ఒక ఆధార్ నంబరు, రేషన్ కార్డూ ఉన్నాయోలేదో తెలియాలి. సంచార జాతుల నుండి ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యోనో ఎంపీ నో ప్రతినిధుల సభకి వెళితే బాగుణ్ణు. ఇవీ నవల చదివాక ముప్పిరిగొన్న ఆలోచనలు. ఏమో ? ఎన్ని సాధ్యపడేనో గానీ, ఇప్పుడు నేను బయట ఇలాంటివారిని చూసినప్పుడు నా చూపులో వచ్చిన మార్పును నేనే అనుభవించగలను. నాకే కాదు శికారీ నవల చదివిన వాళ్ళందరికీ, ఆ మార్పు తప్పక తెలిసివస్తుంది. పాణికో గట్టి కౌగిలింత.

శికారి (నవల) రచన : పాణి, పేజీలు: 130, వెల : రూ. 150, ప్రతులకు: తుంగభద్ర ప్రచురణలు, 9440205303

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బంగారిపేట శికారోళ్లతో బ్లాక్ టిక్కెట్ల సంబంధం… హాస్పటల్లో వాళ్లు పేషెంట్లగా ఉన్నప్పటి సంబంధం…
    రాజకీయాల్లో వాళ్లను ఉపయోగించుకోవడానికి కర్నూలులో ప్రత్యక్ష సాక్షి! ఈ నవల 2024 లిస్టులో చేరింది. తప్పక చదవాలి!

  • శికారి నవల గురించి వినటమే కానీ సమీక్ష ద్వారా కథ,పాత్రలు తెలుసుకునే వీలు కలిగింది.అయితే నేరేటర్ కూడా మాండలీకం లో మాట్లాడితే చదువరికి కొంచెం తికమకే

  • పాణి గార విరసం కొసం రాసిన వ్యాసాలు అరుణతార, కొలిమి లొ ఎన్నొచదివి వాటి నుంచి ఎన్నొ తెలుసుకున్నాను.

    ఇప్పుడు శ్రీరామ్ గారి మంచి వివరమయిన శికారి నవల పరిచయం ద్వారా పాణి గారు నవల కూడా ఎంత బాగా రాస్తరొ కూడా తెలిపారు. వెంటనే కొని చదవాలని అనిపించింది. ఏక్కడ దొరుకుతుందొ తెలుసు కొని చదువుతాను.

  • పాణి గారు రాసిన నవల శికారి ను చలా బాగా పరిచయం చెసారు శ్రీరామ్ పుప్పాల గారు. వెంటనె కొని చదవాలి.

  • శికారి నవలా పరిచయం బాగుంది శ్రీరామ్ గారూ, చదవాలనిపించేలా ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు