చేపల బజార్

క మహా సముద్రంలో ఒక మహా మత్స్యం ఉంది. మనుషుల లెక్కల ప్రకారం ఆ చేప వయస్సు 300 సంవత్సరాలు. అయితే  ఆ ప్రత్యేకమైన చేపల లెక్కలు మనకి తెలియదు .కానీ ఆ మహా మీనముల దృష్టిలో అది మరీ ఎక్కువ వయస్సు కాదు .మధ్య వయస్సులో ప్రవేశించింది అంతే .కానీ కొద్ది కాలంలోనే అది జీవితంలో ఎప్పుడూ చూడని మార్పు చూసింది .నిజానికి సముద్రం చాలా కాలం నిశ్చలంగా ప్రశాంతంగా ఉండేది. తన పిల్లాపాపలతో మనవళ్లతో ఆ చేప హాయిగా జలకాలాడేది. ఆ సముద్ర గర్భంలో కిందికి మీదికి హాయిగా ఈదేది . అది  కేవలం చేపల సామ్రాజ్యం, .జలజీవుల దేశం .
   అయితే కాలం మారిపోయింది. చేపల జీవితంలో కలికాలం ప్రవేశించింది. భూమి మీద నివసించే స్థన్య జీవి అయిన రెండు కాళ్ల జంతువు, కొద్ది సంవత్సరాల లోనే ఎప్పటికంటే బలపడింది .మనిషి అనే ఆ స్థల చర జంతువు ఎన్నో ఎన్నో కొత్త వస్తువులని ప్రయాణ సాధనాలని కనుగొంది. అంతవరకు స్థలచరాలు అడుగుపెట్టడం వీలు కాని ఆ నిశ్చల సముద్ర ప్రాంతంలోకి మానవ పశువు అడుగుపెట్టింది. ఒక పెద్ద ఓడ అక్కడికి ప్రవేశించింది .క్రమేపి అనేక నౌకలు…… నిజానికి సైంటిస్టులు మొదట అక్కడికి వచ్చారు. జీవ వైవిధ్యం పై పరిశోధనలు సాగించారు. వాటి వయస్సు జీవితం వగైరా అన్నీ పరిశోధించారు గ్రంథస్తం చేశారు. వీడియోలు తీశారు .దాంతో వేటగాళ్లు రానే వచ్చారు .సుదీర్ఘకాలపు ప్రశాంతత కాస్తా చెదిరిపోయింది. చేపల జలచరాల జీవితం అల్లకల్లోలమైంది. పెద్ద చేపతో పిల్ల చేప అంది ” మనం ఎప్పుడూ ఎరగని జంతువులు మన స్థానాన్ని ఆక్రమించాయి. బంధువులు మిత్రులు ఎందరో మాయమయ్యారు. చిన్న తమ్ముడు కనబడడం లేదు. నీరు కూడా ఇదివరకు అంతటి స్వచ్ఛతను కలిగి లేదు. మనం మరోచోట తరలిపోవడం మంచిది. మన పూర్వీకులు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు అని తాత చెప్పేవాడు .మళ్లీ మనం వెళ్లవలసిన సమయం వచ్చింది.”
                              పెద్ద చేప అంది  “నేను రాను బతికినా చచ్చినా ఇక్కడే. ఈ నీళ్లలోనే .ఇక్కడే నేను హాయిగా ఈదగలను. అసలు వేరే చోట నీళ్లు ఉంటాయా ఉండవా అవి ఎలా ఉంటాయో తెలీదు.”
    దాని మాటల మధ్యనే దాని నోట్లో ఒక ప్లాస్టిక్ బాటిల్ ఇరుక్కుంది దాని వయస్సులో పావు వంతు కూడా బతకలేని ఒక స్థల జంతువు (మనిషి) నిర్లక్ష్యంగా విసిరిన బాటిల్ అది .ఇంతలో ఆకాశo నుంచి జిగటగా రంగుగా ద్రవం వర్షించటం మొదలైంది. ఆ స్వచ్ఛ సముద్రంలోకి కూడా అది కురిసింది .సముద్రస్వరూపమే మారిపోయింది. ఇదంతా మానవ జంతువు చేసిన పనుల ఫలితమే. దానినే అభివృద్ధి అని మనిషి పిలవడం మొదలుపెట్టాడు. ఆ సముద్రంలోని చేపలు కూడా మానవ చేష్టలని తమ జీవితంలో భాగంగా భావించటం మొదలుపెట్టాయి. ఒకరోజు వేటగాళ్లు రాకపోయినా చేపలు బెంగ పెట్టుకుంటున్నాయి .మనుషుల రాక కోసం అటు ఇటు అల్లకల్లోలంగా ఈదుతున్నాయి. సముద్రాన్ని కలచి వేసే మానవ ప్రవృత్తికి అవి అలవాటు పడ్డాయి. ఆ ప్రత్యేకమైన కల్లోలం కోసం ఆ జలచరాలు అన్నీ ఎదురు చూస్తున్నాయి .ఇప్పుడా సముద్రం చేపల బజారుగా మారిపోయింది అక్కడనుండి మానవ చట్టాల ప్రకారం, చట్ట విరుద్ధంగాను కూడా పెద్ద ఎత్తున జలచరాలు ఓడలలో తరలిపోయేవి .టూరిస్టులు వేటగాళ్లు వచ్చినప్పుడల్లా రకరకాల వస్తువులు ప్లాస్టిక్ బాటిల్స్ తో పాటు సముద్రం నిండిపోయేది .వాటి వల్ల చేపలు గాయపడేవి. రోగగ్రస్తo అయేవి. కానీ ఆ చేపలు జలచరాలు కూడా బజారు జీవితానికి అలవాటు పడ్డాయి. బజారు కోలాహలానికి మత్తిల్లాయి. అందుకే ఒక్కొక్కసారి చేపలు గుంపులుగా వలల్లోకి వచ్చి స్వయంగా ఇరుక్కుంటున్నాయి .ప్రాణార్పణ చేస్తున్నాయి. వేటగాళ్లు ఆశ్చర్యపోయేవారు. మొదట చేపలు పట్టడానికి చాలా కష్టపడవలసి వచ్చేది. అవి వలలోంచి నేర్పుగా అలవోకగా జారిపోయేవి .కొన్ని వలలు తెంచేసేవి దానివల్ల చాలా నష్టం వచ్చేది. దాంతో వేటగాళ్ళు చేపల్ని బూతులు తిట్టేవారు. కానీ విచిత్రం ఇప్పుడు చేపలు వలల్ని వెతుక్కుంటూ ఒకదాన్ని ఒకటి నెట్టుకుంటూ స్వయంగా చిక్కుకుంటున్నాయి .స్వయంబందీలు అవుతున్నాయి. ఇంకా విడ్డూరం ఏమిటంటే చేపల్ని తినడానికి వచ్చే సముద్రపు పక్షులు కూడా వలలో తమ కాళ్ళని ఇరికించుకుంటున్నాయి .తోలినా పోవటం లేదు. క్రమేపి ఆ పక్షులని కూడా అమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు వేటలో నైపుణ్యం గల వాళ్ళ అవసరం కూడా పోయింది. అవంతట అవే జీవులు అభివృద్ధి వలయంలోకి వచ్చి బందీలు అవుతున్నాయి .పోటీ పడుతూ ప్రాణార్పణ చేస్తున్నాయి .ఇలా బందీలు కావడం కోసం చిక్కు పడిపోవడం కోసం ప్రాణార్పణ కోసం జీవులు తహతహలాడుతున్న సమయంలోనే అనుకోని విరామం వచ్చింది. వేట ఆగిపోయింది .జనసంచారం పూర్తిగా నిలిచిపోయింది .సముద్రం నిశ్చలంగా మారింది. కాలం వెనక్కి తిరిగింది. వందల సంవత్సరాలుగా జీవిస్తున్న వృద్ధ మత్స్యం ఆశ్చర్యపోయింది .సంతోషపడింది. మంచి కాలం మళ్ళీ వచ్చిందని మత్స్యావతార పురుషుడైన దేవదేవుని మొక్కింది ,నీటిలో కిందికి పైకి మునకలు వేస్తూ..
 కానీ పిల్ల చేపలు ముసలి చేపని వేళాకోళం చేశాయి. ఈ నిశ్శబ్దం భరించరానిది ఎలా ఏ కోలాహలం లేకుండా ఎన్నేళ్లు బతికి ఏం లాభం. ఇదే నీరు ఇదే గాలి ఇవే జలచరాలు. ఏముంది జీవితం ఆ వేగంలో కోలాహలంలో చనిపోయినా  పర్లేదు .ఇలా కాలం నెమ్మదించటం ఎంత విసుగు. మళ్లీ ఆ రెండు కాళ్ళ జంతువులు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు మళ్లీ కాలం వేగం పుంజుకుంటుందో సముద్రం అల్లకల్లోలమవుతుందో అని ఎదురు చూడడం మొదలుపెట్టాయి .సముద్ర జీవులు కూడా తమ చూపుకి అందినంతమేరా వలల కోసం వెతుకుతున్నాయి కానీ అలికిడి లేదు. ఎందువల్ల ఏం జరిగింది అసలు? ఒక సూక్ష్మ క్రిమి కారణంగా ఆ ద్విపాద పశువులు రోగగ్రస్తం అయ్యాయి .అనేక నాగరిక పశువులు చనిపోయాయి. మనుషులు ఇల్లు కదలడం మానేశారు. అంతట నిశ్శబ్దం అలుముకుంది. ఎంతో గొప్ప కోలాహల పూరితమైన నాగరికతని నిర్మించిన ఆధునిక జీవి తన నాగరికత అనే వలలోనే బందీ అయి పడి ఉన్నాడు. దాంతో ఆ సుదూర సముద్రం నిశ్శబ్దంలోకి జారుకుంది .డైనోసార్ లాంటి బృహత్ జంతువులు భూమిని ఏలుతున్న కాలంలో చిన్న జీవులు బిక్కు బిక్కుమంటూ జీవించాయి. తన భారీ కాయం వల్లనే డైనోసార్సు ఉత్పాపాన్ని తట్టుకోలేక అంతరించాయి. మనుషులు సూక్ష్మజీవుల దృష్టిలో డైనోసార్స్ లాంటివారు. మనిషి మైక్రోస్కోప్లోంచి సూక్ష్మజీవుల ప్రపంచాన్ని చూసి దిగ్భ్రాంతి చెందాడు కానీ సూక్ష్మజీవుల  గెరిల్లా దాడుల నుంచి మనిషి తప్పించుకోలేడు. అదే జరిగింది మానవ జగత్తు కొన్ని సంవత్సరాలపాటు స్తంభించిపోయింది .భూగోళమంతా నిశ్శబ్దం రాజ్యం చేసింది .నీటిపై నేలపై శాంతి తాండవించింది .వృద్ధ మత్స్యమాత అంది “ఇలాగే శాంతిగా జీవిస్తే సరిపోతుంది .పరుగు పెట్టి ఏం చేస్తారు. ” అంది వృద్ధ మాత.
 కొత్త తరం జల చరాలు అన్నాయి “పరుగు పెట్టి ఏం చేస్తామని కాదు .పరుగులోనే ఏదో తెలియని మజా వుంది. అసలు మానవులని చూస్తుంటే ఏదో తెలియని మత్తు ఆవరిస్తుంది .వల లోకి వేగంగా వెళ్లి చిక్కుకోవాలన్న తహతహ మొదలవుతుంది “
పెద్ద చేప  విసుగుగా  అంది.
” మరి ఎందుకు చిక్కుకోలేదు పీడా పోయేది .నాకు ఎప్పుడూ అలా అనిపించదు.   వల చూస్తే కంపరం అని రుసరుసలాడింది ముసలి చేప.
” నువ్వు ముసలి దానివి. కాలం చెల్లిన దానివి .కాటికి కాళ్లు చాపిన దానివి .నీకు అలాగే ఉంటుంది. నేను ఒకసారి  వలలో పరవశంతో దూకిన దానినే. నేను మరీ చిన్నదానినని మనిషి విసిరి కొట్టాడు కానీ ఆ మత్తు నాకు బాగా గుర్తుంది .ఈసారి మళ్లీ వలలో చిక్కితే మనిషి వదలడు కమ్మని మృత్యువు రుచి చూపిస్తాడు .నేను పెద్ద అయ్యాను కదా మరి”
    ముసలి చేప మనసులో అనుకుంది పూర్వం గాలానికి ఆహారo లాంటిది ఉంచి మనుషులు చేపల్ని పట్టుకొని చంపేవారు .జీవిత ఇచ్ఛ లో చిక్కి చేపలు చచ్చిపోయేవి. కానీ ఇప్పుడు మృత్యువు కోసం చేపలు గుంపులు గుంపులుగా పరుగు పెడుతున్నాయి. కారణం వాటికి మానవ సావాసం వల్ల మతి తప్పింది. మనిషి బందిఖానా ని స్వేచ్ఛ అని భ్రమిస్తాడు. మృత్యువుని జీవితంగా ప్రేమిస్తాడు  పతనాన్ని అభివృద్ధిగా ప్రేమిస్తాడు. విషాన్ని అమృతంగా భ్రమిస్తాడు భ్రమనీ భ్రమణంగా భ్రమ పడతాడు .తన భ్రమలోనే చివరికి అంతరిస్తాడు సముద్ర ఉపరితలం మీద వలలు విసురుతూ జీవితపు జూదరులు మళ్లీ వచ్చారు, చేపలు ఎదురీదుతూ వెళుతున్నాయి మృత్యువువైపు.
 పెద్ద చేప భారంగా నిట్టూర్చింది.
*

రాణి శివశంకర్ శర్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు