మా అమ్మ గడుసుదనము

ప్పుడు నేను ఐదవ తరగతి చదువుతున్నాను

ఓరోజు పొద్దున్న మా అమ్మ పొయ్యిదగ్గర కూచొని వంట చేస్తోంది. నేను కల్లానికి కోళ్లు పట్టుకెల్లి వొదిలేసి, కాళ్లూచేతులు కడుక్కుని వచ్చి అప్పుడే వంటింట్లో పీటమీద కూచున్నాను.

“కళ్లంలో అయితే గింజా గిట్టయినా ఒక పురుగూ పుట్టయినా దొరుకుతాయి వాటికి” అని మా అమ్మ రోజూ కోళ్లను కల్లంలో ఒదలమని చెప్పేది. ఉదయాన్నే ఒదలడం, సాయంత్రం కొంచెం చీకటి పడ్డాక కోళ్లన్నీ ఒకదగ్గర చేరితే పట్టుకుని యింటికి తీసుకు రావడం చేసేవాన్ని. అప్పట్లో నాకది రోజువారి డ్యూటీ

“కుష్ణా.” పిలిచింది అమ్మ.

“ఏటమ్మా!” అడిగేను

“సింగారపోలి అప్పలనరసమ్మ పిన్ని, ఆలింటికెల్లి మజ్జిక తేవాలి నాయనా!” అంది . అప్పలనరసమ్మ పిన్ని తెలుసు, అప్పుడప్పుడు మాఇంటికి వొస్తుండేది.పొలం పనులకు పిలవడానికి.

“ఆలిల్లు నాకు తెలీదు” అనేశాను

“తెలీడాకేట్నేదు. కొత్తీదికి ఇలా తిరుగుతామా! అక్కడే కుడిపక్క రెండు పెంకుటిల్లుంటాయి. అందులో ఆ కుడిపక్కది కాకుండా ఆ ఎడంపక్కదే ఆలిల్లు” అంది.

నాకు అర్దమయింది, గానీ వెళ్ల బుద్ది కాలేదు. నాకు సిగ్గెక్కువ. తెలిసినోలు తప్ప మరెవలి తోనైనా మాట్లాడాలంటే మొగమాటం.

“నాకు తెలీదు” అనేశాను

“అలాగంటే ఎలాగ నాయనా!..మీ అయ్యకు కడుపులో మంట అంతండు కాదా!..సల్లందిలో మజ్జిగేసుకుంతే కసింత తగ్గుతాది” అంది .

మాకు ఒక ఆవు వుంది, కానీ అప్పుడది చూలుతో వుంది. కాబట్టి మా ఇంట్లో మజ్జిగ లేదు.

“నాయన్నాయన..మా నాయనవు కాదూ!” బతిమాలుతోంది

నాకు ఎంతకీ వెళ్లబుద్ది అవ్వడంలేదు

“ఆలకి.. నాను తెలీదు, నువ్వెవులి బాబువిరా! అని అడుగుతారు..నాకు సిగ్గు..” అనేసాను

“అడిగితెంది, నాను రెడ్డోలి బాబునని సెప్పలేవేటి.. నోరులేదా!”.. మా అమ్మకి కోపమొచ్చేస్తోంది.

“ఉహు.. నానెల్లను” అనేశాను మళ్లీ

“ఎల్లనంతే ఎలాగరా! అన్నీటికి నేనొక్కదాన్నే ఎలాగ సచ్చీది!..మీ అయ్య యికన సల్లంది కొస్తాడు. నాకా వంట యింకా అవ్వలేదు. అవతల పొద్దెక్కిపోతంది, పొలానికెల్లాలా” చిరాకు పడుతూ పొయ్యిలో ఒక చెక్కపేడు పెట్టి చుట్టూ రెండు పిడకలు యిరిసి పొయ్యినిండా దోపి

“ఆ ముంతిలా పట్రా! అని కేకేసి, ఆ ఇత్తడి ముంతతో పాటు నన్నూ లాక్కొని ఎల్లింది. తలుపు దగ్గరగా చేరేసి.

మా అమ్మ అన్నమాట నిజమే, తెల్లారి కోడికూసిన ఏలకి లెగిసి, తిన్నగా కల్లానికెల్లి, సాలలో పేడలు తీసి, సాల దొడ్లు తుడిసి, యింటికొస్తాది. బింది పట్టుకుని సెరువుకెల్లి పశువులకు కుడితి గోలెంలో రెండుబిందెలు నీలుపోస్తాది. రాంభజన కాడ నూతికెల్లి ఆరేడుకుండలు ఉప్పు నీలు తెచ్చి మాకు మండువలోని గోలెంలో పోస్తాది. ఆ తరవాత వూరవతల డుర్రోలి పొలం లోని మంచినీల నూతికెల్లి, రెండుసార్లు రెండు దొంతులు మంచినీలు తెస్తాది. అప్పుడు పొయిలో అగ్గేసి ఆపూటకి వంట వండుతాది.

ఓపక్క పొయ్యిల అగ్గేసే కూరలు కోస్తాది. చారుకి కూరకి తాలింపు అమురుస్తాది.  అలా అన్నిపనులూ ముగించి మాకు సల్లందులొడ్డించాక, రోజూ ఉడుకునీలు స్నానము చేసి దేముడికి దీపంపెట్టి, ఆదరా బాదరా యింతతిని పొలానికి పరిగెడతాది. ఒక్కోసారి కూలి పనికెల్లేటప్పుడైతే నిండారా తినకుండానే, గిన్నెతో గెంజి మాత్రమే నిలబడే తాగేసి పారిపోయేది.

(నేను హై స్కూలుకివెళ్లేక అందరికన్న నేనే ఆఖరున తలుపులు వేసుకొని వెళ్లే వాన్ని. అందరూ ముందుగానే పొలలకు పనులకు వెళిపోయేవారు. ఎలిమెంటరీ  స్కూలు కెల్లేటప్పుడు నేనూ మా సీతప్ప ఇద్దరమూ ముందుగా వెళిపొయే వాళ్లము.)

“నేను కల్లానికి కోలు పట్టుకెల్లేదేటి?” నేనూ పనిచేసానన్నట్టు సొడిగాను.

“ఆ.. గొప్ప పనిచేసావునే.. పదా.. ఈవేళ నేనొచ్చి ఆలిల్లు సూపెట్టి, ఆలకి నిన్నొప్ప జెప్పేస్తాను. రేపుట్నుంచి రోజూ నువ్వేతేవాలి. కాదు కూడదు అన్నావంటే రెండు గూబలు పట్టుకోని ఎత్తేస్తాను” అని కొపంతో గట్టిగా చెప్పింది.

అలాగే నన్నట్టు తలూపేను. అప్పుడు కాదు అన్నానా! అమ్మ చెయ్యి చెక్కపేడయిపోద్ది. నావీపు విమానం మోత మోగిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు.

ఇద్దరము తిన్నగా వెళ్లాము.

అమ్మతల్లి గుడిదాటి, కూరాకుల వీధి దాటి, కొత్తీది వెళ్లాము. మెదట్లోనే వాళ్ల ఇల్లు. మావూరు పల్లెటూరే అయినా చాలా పెద్దూరు.

“అమ్మీ అప్పలనరసమ్మా! రేపుట్నించి యిడిగో మా కుష్ణొత్తాడు. మాకు రోజూ ముంతడు మజ్జికియ్యమ్మా, నిన్న అనుకున్నాము గదా! వారంకైతే వారంకి, నెలకైతే నెలకి..ఎలగైతే అలగే నీకు డబ్బులిచ్చేత్తాను.”  అని నన్ను చూపించింది మా అమ్మ.

అప్పలనరసమ్మ పిన్ని ముఖం యిబ్బందిగా పెట్టింది.

“సిన్నప్పా!  నీకిత్తానన్నాను, ఆ మాట నిజమే గానీ.. ఆపాత వోడికలోలు ఎవులూ ఒగ్గనేదు ఏటిసెయ్యడుమూ!” అని నానుస్తోంది.

“అదేటే అలాగంతావ్!.. నిన్నపొద్దోయికి యిప్పుడికి మారిపోనావేటి!?”. అంది

“అదికాదు సిన్నప్పా! ఆ బోగెర్ల అప్పలసామాలు వారం నుంచి రావడం నేదు. వాడకం మానీసినారు గావాల, నీకిత్తాన్లే అని ఒప్పీసుకున్నాను. తీరా తెల్లారేసరికి ఆ మానిక్కిమమ్మొచ్చి కూకుంది.

“అత్తెరి బబ్బా..మాకునేదనేస్తావా..! ఎలా గొప్పుకుంతాను. ఏనాటినుంచి నీకాడ వాడకం పెట్టాము. మొన్న అఠత్తుగా వూరెలిపోయి రాలేకపోనాం గానీ, అని దీర్గాలు తీసింది. మరి తప్పలేదు. ఆలు వాడకం ఏనాట్నుంచో వున్నాది మరి” అని చెప్పి కాసేపు ఆగి

“నీ కివ్వాలంతే మరి ఉండదు సిన్నప్పా. మరేమనుకోకు” అని తేల్చేసింది.

“అమ్మమ్మా!.. అలగనీకు. మీబావకి తెల్లారేసరికి కడుపుల మంటంతండు. తల్తల్లీ! ఎలగో యివ్వాల. తప్పదు. యింకొక్కాడ ఒట్టుకెల్లరాదా! అంతావు. తాగడమ్మీ! మీబావ అప్పలనరసమ్మ కాడికెల్ల నేప్పోనావా! అంతాడు. నీకాడైతే సుబ్బరంగుంతాది, సిక్కగుంతాది మజ్జికి అంతాడు. మరెక్కడ తెచ్చినా ఒప్పుకోడు.” అంది.

అప్పలనరసమ్మ పిన్ని మొగమాటం పడిపోయింది.

“సిన్నప్పా! ఇప్పుడు ముంత బేడకిస్తన్నాను.”  ముంత నింపి చేతిలోపెడుతూ అంది

“అలగేలే, నువ్వెలగంతె అలగే అంతన్ను.. కాదంతానేటి!? దానికేటి నలుగురికి యిత్తాన్నావు గదా! నా కొక్కదానికి ఏరే రేటెడతావేటి!” అనేసింది మాఅమ్మ.

“మరేట్నేదు సిన్నప్పా! అంతకు ముందు ఆరుమాసాల కిందట, నువు పట్టు కెల్లినప్పుడు ముంత పదిపైసల్లెక్క పట్టుకెల్లావు గదా! అలాగే అనుకుంతావేటో! అని సెప్తున్నాను. ముందే సెప్పాలి గదా!” అంది.

“నేదునే, ఎల్లపొద్దు ఒకటే రేటు ఉండిపోద్దేటి!?” అనీసింది మాఅమ్మ.

నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. ఎక్కడా మాఅమ్మ బేరమాడకుండా వుండదు. అలాగని అడ్డకుపడ్డా అందుగానీ,పేదగోపారంగా మాట్లాడి పావలాకాడ ఓపరకైనా తగ్గించమని అంటాది. ఇక్కడ మాత్రం ఆయమ్మ ఎలాగంతే అలాగే ఒప్పీసు కొంటోంది.

“రేటెక్కువంతే ఏలొప్పీసుకున్నావ్, మరెవులికాడ దొరకనట్టు” తిరిగొస్తున్నపుడు దారిలో అడిగేను.

“ఆలెవుల్దగ్గర బాగోదునేరా!” అనేసింది.

“మొదట, లేదు.. సాల్దు అనీసింది గదా! మల్లెలాగ ఇస్తాదమ్మా! అడిగేను.

“అదంతా నాటకం.రేటుపెంచడానికి..” అంది. నేను ఆశ్చర్యపోయాను.

యింటి కొచ్చేసరికి మాఅయ్య పొయ్యదగ్గర కూకోని అగ్గి ఎగేస్తున్నాడు. సీకటి తోటే నెగిసి పొలానికెల్లి వొచ్చాడు.

“ఎక్కడికెలిపోనారు..పొయ్యొగ్గేసి!?” అడిగాడు.

“యిదిగో మజ్జిక్కెల్లాము కొత్తీది, ఈడ్నెల్లమంతే ఎల్లాడుకాడు” అన్నాది మాఅమ్మ.

“ఓ..ఓ అంతదూరమేలెల్లారు” అన్నాడు.

“కడుపుల మంట అంతనవు, మజ్జికుంతే బాగున్ను అన్నావు. మరి ఎల్లకుంట ఎలాగొత్తాది” అన్నాది మాఅమ్మ.

“అన్నాన్నే.. ఇక్కడెక్కడ దొరకదా!”  అన్నాడు

మా అయ్య మాటవిని నేను ఆశ్చర్యపోయాను. మా అయ్యే అక్కడ తెమ్మన్నట్టు అమ్మ చెప్పింది కదా! ఆలోచిస్తున్నాను. అలా చూస్తూ ఉండిపోయాను.

“ఎంతదూరమైనా.. ఎల్లాల. ఎల్లకపోతే వల్లగాదు. అప్పలనరసమ్మని ఆపాటి ఈపాటి మంచి చేసుకోవాల. అది మేస్త్రమ్మ గదా! నెలకి నాలుగోర్లూ దాని దగ్గర పనుంతాది. ఆ సేరీకాసి పోలీది పనులు, ఆ బొబ్బిలి ఎలమదొర్ల పనులు ఉంతాయి. మనుసుల్లి బెత్తాయించి చేయిస్తాదా! కాసింత దాందగ్గర నోటి మంచుంతే, పూటకీ పందొరుకుతాది. మనకాసి పనులెక్కడివి. వానొత్తే వడవడ గాలొత్తే గడగడా, మనకాసి పని. ఆ సేరీపొలాన నిత్తెమూ బోరింగులు పారుతుంటాయి. ఇన్ను మున్నూరు గాలమూ పనే. ఆపాటి నోటి మంచుంతే అమ్మీ పనుంతే పిలే అని ఒక మాటంతే  రేపు పిలుత్తాది.” అంది అమ్మ.

మా అయ్య అవునన్నట్టు నిళువుగా తలాడించేడు.

మా అమ్మ గడుసు ఆలోచనలు తెలిసి

“హమ్మ!” అనుకుని నోరుని కలిపి ముక్కుమీద వేలేసుకున్నాను.

***

రెడ్డి రామకృష్ణ

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పూట గడవడం కోసం ఇలాంటి గడుసు ఆలోచనలు కేవలం ఒక్క అమ్మలకు మాత్రమే తెలుసు అనుకుంటా. రెడ్డి రామకృష్ణ గారు చాలా బాగా రాశారు.

  • లౌక్యం పేరు కూడా ఈ కథకు సరిపోతుందని అనిపిస్తోంది నాకు… ధన్య వాదాలు

  • అమ్మ గడుసు తనమే అమాయకపు తండ్రులకి పిల్లలకి లైఫ్ అండ్ networking skill guru.

    • Vijaya Kumari గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు