విమర్శకులు నిరంతర విద్యార్థులు కావాలి

వెనక నుంచి చదివినప్పుడు ఆ కథను ఎక్కడ ఆపేశాడు అనేది నాకు అర్థమవుతుంది. అక్కడ ఆపాల్సినటువంటి విషయం దగ్గర ఆపాడా లేదా ఇంకా ఎక్స్టెండెడ్ పోయెమ్ లాగా, ఎక్స్టెండెడ్ స్టోరీ లాగా ఆయన అక్కడ ఇంకా రాస్తున్నాడా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మొదలు నుంచి ఆ కథ చదవాలా వద్దా అని నిర్ణయం అయిపోతుందన్నమాట.

   అందరికీ నమస్కారం. విమర్శ మీద ఇటువంటి సదస్సు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి ‘హోరు’ సంస్థ నిర్వాహకులకు అభినందనలు. ఇప్పటి తరం ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? కవిత్వం ఎట్లా ఉంది? లేదా కథపై ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? వాటి మీద విమర్శలు ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవటానికి కొత్త తరాన్ని ఎప్పటికప్పుడు కలుసుకుంటూ ఉండాలి అనేది నాకు కలిగే ఒక అభిప్రాయం. ఇట్లా ఇవాళ మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు విన్న ఉపన్యాసాల ద్వారా కూడా కొన్ని కొన్ని విషయాలు అర్థం చేసుకోగలిగాను. మిత్రులు నేనెప్పుడో రాసిన కవిత్వం గురించి రాసిన మాటల గురించి ప్రస్తావించారు. అవి నాకు చాలా ఇష్టమైన మాటలు. ఎందుకంటే- నా ప్రతిపాదన ఏమిటంటే –

కవిత్వం దినచర్య కాదు, కవిత్వం హృదయ చర్య. 

కేవలం మనం ఒక టైం టేబుల్ వేసుకుని, లేదా దినచర్యగా భావించి రోజూ ఒక కవిత రాద్దాం, కనీసం రెండు రోజులకైనా ఒక కవిత రాద్దాం, ఏడాది తిరిగేటప్పటికి ఒక పుస్తకం వేసేద్దాం అని ఉత్సాహపడటం అనేది సహజం. అట్లా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు తెలిసినవాళ్లు.  ఒకానొక సమయంలో నాకంటే బాగా సీనియర్ కవిమిత్రుడు బజార్లో కనపడి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ‘నేను తాజాగా రాసిన కవిత మీకు వినిపిస్తాను’ అని వినిపించాడు. అభినందించాను. ఆ సమయంలో ఆయన ఒక గమ్మత్తైన విషయం చెప్పాడు. రోజూ పది గంటలకి యూనివర్సిటీకి  వెళ్ళాలి కాబట్టి కాలకృత్యాలు అయిపోయిన తర్వాత ఒక తెల్ల ఠావు తీసుకుని దానిమీద – ఒక రూళ్లకర్ర చూపించాడు – ఆ రూళ్లకర్ర తోటి ఒక ఇరవై గీతలు గీస్తాడు. ‘దానిమీద ఇరవై లైన్లు లేదా ఇరవై రెండు లైన్లు కవిత రాస్తాను, అందులో ఒక్క లైన్ అయినా సరే బాగుంది, అద్భుతంగా ఉంది అనిపిస్తే అది – ఆ కవిత సార్థకమైనట్టే అని భావిస్తాను, ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళిపోతాను’ అని చెప్పాడు. ఆ రూళ్లకర్ర  కొంచెం దూరంలో ఉంచాడు కాబట్టి అంతవరకి వదిలేశాను అనిపించింది. అంటే అంత మామూలు విషయమా కవిత్వం రాయటం అంటే? చాలా మామూలు విషయమా? ఒక్కొక్క కవిత రాస్తుంటే – అది మరణ వేదనలో పునర్జన్మ.

‘కవిత్వమై జీవిస్తాను/ జీవితాన్ని కవిత్వీకరిస్తాను/ నేను కవిత్వం కానప్పుడు మరణిస్తాను’ – అంతే. అది అంతా ఒక నిష్ఠ, ఒక జీవిత నిష్ఠ. ఎట్లయితే ఒక గొప్ప వ్యక్తికి ఉంటుందో అట్లానే కవులకు కూడా అట్లాంటి గొప్ప నిష్ఠ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఆ వస్తువులో నువ్వు తాదాత్మ్యం చెందకుండా, ఆ వస్తువు నీలో లీనం కాకుండా నువ్వు ఎట్లా కవిత్వం రాయగలవు? ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుంది. న్యూస్ పేపర్ లో చదువుతాం. బాధ కలగవచ్చు. లేదా ఒక భావం కలగవచ్చు, దుఃఖం కలగవచ్చు. అవన్నీ వాస్తవం. కానీ అది మాత్రమే నేను ఒక గొప్ప కవిత రాయటానికి లేదా గొప్ప కథ రాయటానికి చాలదు. దానికి చాలా చాలా పదార్థం – చాలా మానసికమైనటువంటి వ్యధ లేదా వేదన లేదా బాధ లేదా పెయిన్ అనేది చాలా అంతరాంతరాల్లో ఉండాలన్నమాట. అది అనుభవించినప్పుడు – కేవలం బాహ్య సమస్యలను నువ్వు అర్థం చేసుకోవటం, తేలిగ్గా వాటిని నువ్వు కవిత్వీకరించు అనేది కుదరదు. అట్లా కవిత్వీకరించటానికి కవితాభావనకు సంబంధించినటువంటి అనేకానేక ద్రవ్యాలు కూడా నీకు తర్వాత అవసరం అవుతాయి. 

తర్వాత ఏది కవిత్వం కాదు, ఏది నేను అకవిత్వంగా రాస్తున్నాను అనే వివేకం చాలా అవసరం. అందుకని నా స్వానుభవం ఒకటి చెపుతా. మేము ఎంఏ చదివేటప్పుడు మా ప్రొఫెసర్ గారు – మరి అప్పట్లో ప్రొఫెసర్లు అంటే చాలా భయం – వాళ్ళ చేతిలో మార్కులు కూడా ఉంటాయి. మా క్లాసులో ముప్పై తొమ్మిదిమంది ఉండేవాళ్ళం. ఆయన ఒకరోజు ఒక పద్యం చెప్పారన్నమాట క్లాసులో. ‘తెలతెలవార లేచితిని, తెల్లని ఇడ్డెను లారు మెక్కితిన్…’ అని మొదలుపెట్టారు. చంపకమాల పద్యం. ’ఈ పద్యంలో ఏమున్నది విశేషం చెప్ప’మన్నారు. ఒక కుర్రాడు లేచి ఇందులో హాస్య రసం ఉందని, ఇంకో అతను చాలా స్వభావోక్తి ఉందని, మరొకళ్లు ఇంకేదో ఉపమాలంకారం ఉందని. ఇట్లా ముప్పై ఎనిమిది మంది కూడా చెప్పేశారన్నమాట. ‘ఏం శంకర్రావ్! నువ్వేం చెప్పలేదేమి’టని అడిగారు. నేను లేచి, ‘సార్ అందులో ఏమీ లేదండీ’ అన్నా. ఆయన బల్లమీద ఒక్క చరుపు చరిచి, ‘శభాష్! నువ్వు నా శిష్యుడివి’ అన్నారు. అంటే ఏది కవిత్వం కాదు, ఏది కవిత్వం అనేది మనం అర్థం చేసుకోవటం కూడా చాలా అవసరం.  దీనికి ఒక మార్గం నేను ఏం చూస్తాను అంటే – నాకైతే నేనే రాసుకొని పగలల్లా చాలా కష్టపడి రాసి, అర్ధరాత్రి లేచి మళ్ళీ చదువుకొని, హాయిగా సంతోషంతో దాన్ని నేనే బుక్ వేసుకొని, ఆవిష్కరణ పెట్టుకొని – అది వేరే విషయం. అది కాదు. వీలైతే మీరు రాసినటువంటి కవితలు – లేదా ఒక పుస్తకం వేయబోయే ముందు – మీ స్నేహితులకి, సహృదయులు అయినటువంటి మీ స్నేహితులకి, మీకంటే ఇంకా కాస్త తెలివైనటువంటి వాళ్ళకి, మీకంటే ఇంకాస్త విమర్శ జ్ఞానం కలిగిన వాళ్ళకి మీరు గనుక అందచేస్తే లేదా చదివి వినిపిస్తే అది చాలా ఉపయోగపడుతుంది. నాకట్లా ప్రారంభంలోనే మంచి అనుభవం దొరికింది అన్నమాట. 

‘స్తబ్ధత-చలనం’ కవితలు రాసే తొలి రోజుల్లో – వచన కవిత్వం రాసిన తొలి రోజుల్లో – ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఆ ముగ్గుర్లో ఒకాయన ఇంగ్లీష్ ఎం.ఏ., ఇంకో ఆయన తెలుగు లెక్చరర్, మరొకాయన కెమిస్ట్రీ లెక్చరర్. ఆదివారం కూర్చునేవాళ్ళం. నేను తాజాగా రాసిన ఒక కవిత తీసుకొని వెళ్ళేవాడిని. వెళ్తే ఆయన ఆ మూలనుంచి, ఈయన ఈ మూలనుంచి, ఇంకో ఆయన ఇంకో మూలనుంచి దాన్ని చీల్చి చెండాడేవాళ్లు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత బాధ కలిగేది. అసలు ఈ కవిత రాయనేల? రాసితిని పో! వారికి చూపనేల? అనిచెప్పి చాలా విచారం కలిగేది. అయితే తర్వాత తర్వాత నాకు అర్థమయ్యేది. ఓహో! దీని వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇక్కడ ఈ వాక్యం అనవసరం కదా! ఎక్కడ ముగియాలో అక్కడ ముగిసిన తర్వాత అదనంగా ఒక వాక్యం చెప్పాను. కాబట్టి సవరించుకోవాలి. కవిత్వం కానీ, కథ కానీ ఎక్కడ ముగించాలి అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలా చాలా ముఖ్యమైన అంశం. మొదలు పెట్టటం ఎంత ముఖ్యమో, దాన్ని ముగించటం అంతకంటే ముఖ్యమైంది. 

కథా సాహితి సంపాదకత్వం ఒక వ్యవహారం ఉంది కదా నాకు. ఆ వ్యవహారంలో నేను పాటించే ఒకానొక – ఒకానొక సూత్రం ఏమిటంటే, ఒక కథను వెనక నుంచి చదవటం! వెనక నుంచి చదివినప్పుడు ఆ కథను ఎక్కడ ఆపేశాడు అనేది నాకు అర్థమవుతుంది. అక్కడ ఆపాల్సినటువంటి విషయం దగ్గర ఆపాడా లేదా ఇంకా ఎక్స్టెండెడ్ పోయెమ్ లాగా, ఎక్స్టెండెడ్ స్టోరీ లాగా అక్కడ ఇంకా రాస్తున్నాడా అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మొదలు నుంచి ఆ కథ చదవాలా వద్దా అని నిర్ణయం అయిపోతుందన్నమాట. 

అలాగే శీర్షిక చదవంగానే దాన్ని బట్టి వెంటనే ఆ వస్తువు అంతా మనకు సూచనప్రాయంగా అర్థం కావాలి. నాందీ ప్రస్తావనల్లో మాదిరిగా ఒక సూచన మనకు అందాలి. ఒక చచ్చు శీర్షికను పెట్టాం అనుకో, ఇక పాఠకుడికి దాని మీద ఏం ఆసక్తి ఉండనే ఉండదు. కాబట్టి శీర్షికను బట్టి కూడా ఒక సూత్రాన్ని అందుకొని, పాఠకుడు ఆ కవితలోకి, లోలోపలికి వెళ్లిపోతాడు. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా కవిత్వం గురించి మనం ఆలోచించినప్పుడు దాని ప్రారంభం, తర్వాత ముగింపు – ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అని నాకు అనిపిస్తుంది. అయితే ఇది చెప్పినంత తేలికా? కాదు. 

కవిత్వం రాయటం ఎంత కష్టమో దాన్ని విలువ కట్టటం కూడా అంతే కష్టం. అయితే ఈ విలువ కట్టేటటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. ఆ అనేక అభిప్రాయాలు తప్పు కాకపోవచ్చు. నీకు నువ్వు గొప్పగా రాశావు అని నువ్వు అనుకోవచ్చు. నేను అనుకున్నాను అట్లాగే – ఈ మధ్యనే కథ ఒకటి (స్పర్శ) రాసి ప్రకటిస్తే, చాలా బాగా రాశాను అని చెప్పి ఎంతో మంది పొగుడుతూ చెపుతూ ఉండగా, దాంతోనే నాకు కూడా, ఆ బాగానే ఉంది అనుకున్నా. ఒక విమర్శ కూడా వచ్చింది. 

ఇక్కడే ఇంకో గమ్మత్తు  ఏంటంటే, రచయిత తాను సృష్టించినటువంటి పాత్రలతో తాదాత్మ్యం చెంది,  అది నిజ జీవితంలోని పాత్రగా తనొక కల్పనా లోకంలో భావిస్తాడు. అది ఒక కవితా కళా రహస్యం. అది అతని జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. అతని జీవితంలో అతని కళ్ళముందు లేదా మానసిక ప్రపంచంలో ఆ పాత్ర కనబడుతుంది. వాటితో సహజీవనం చేస్తాడు, వాటితో సంఘర్షిస్తాడు లేదా వాటి అభివృద్ధి క్రమంలో వాటిని ఇట్లా మారిస్తే బాగుంటుంది, అట్లా మారిస్తే బాగుంటుందని చెప్పి వాటితోనే తను మాట్లాడుతూ వాటిని మార్పులు చేస్తూ ఉంటాడు. ఇట్లానే నేను కూడా ఆ కథారచనలో ఒక పాత్ర – మణిమాల అనే పాత్రతో ప్రేమలో పడ్డాను. అంటే ఇట్లా – ఇది కూడా ఒక రచనా రహస్యం. అట్లా మహానుభావులు ఎంతో మంది ఉన్నారు, దొస్తోయెవ్‌స్కీ లాంటి వారు. ఒక స్టేట్ ఆఫ్ డెలిరియంలో కూడా వాళ్ళు వాళ్ళ పాత్రలతో మాట్లాడటం,  వాటితో వ్యవహరించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండే ఒక విశేషం. 

అయితే ఇప్పుడు మళ్ళీ నా కథలోకి వస్తే, ఇంత నేను బాగా రాశానని బుజం తట్టుకుంటూ ఉండే సమయంలో శ్రీరామ్ పుప్పాల, ‘ఏంటి సార్! ఈ కథ చదివి ఒకాయన చాలా బాధపడ్డాడు’ అని చెప్పి ఇట్లా మాట్లాడాడు. అంటే, ఏంటబ్బా, నేను పొరపాటు రాశానా అని చెప్పి, నా పాయింట్ ఇది, నేను చెప్పదలుచుకున్నటువంటి పాయింట్ ఇది అని చెప్పి నేను కొంత ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవాల్సి వచ్చింది. చెయ్యాలి. ఎందుకంటే ఆ పాఠకుడు లేదా ఆ విమర్శకుడి యొక్క అభిప్రాయం వేరు, నా అభిప్రాయం, చదివి అంగీకరించినటువంటి పాఠకుల యొక్క అభిప్రాయం వేరు. కాబట్టి అనేక అనేక భిన్నాభిప్రాయాలు – ఈ భిన్నాభిప్రాయాలను కూడా స్వీకరించేటటువంటి సహృదయత రచయితలో ఉండాలి అని కూడా నేను చెపుతున్నా. అసహనం అనేది రచయితలో ఉండటం మంచిది కాదు. ఎంత దారుణంగా విమర్శించినా కూడా సహించు. అయితే ఇదే సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, విమర్శ ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా ఉండరాదు. అది ఆ వ్యక్తిని బాధించినట్లుగా ఉండగూడదు, హేళన చేసినట్లుగా ఉండగూడదు. నువ్వు ఎంత తీవ్రంగా అయినా ఆ సబ్జెక్టు మీద విమర్శించు. ఇట్ షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆ విషయం మేరకు మాట్లాడాలి, విషయేతరం మాట్లాడకూడదు. వేదిక మీద కూడా అంతే. అట్లానే విమర్శలో కూడా. ఆ విషయంలో ఉన్నటువంటి లోపం ఏంటో నువ్వు చెప్పు, అంతే!

 నా అనుభవం ఇక్కడ మళ్ళీ నేను రిలేట్ చేసుకుంటా. ‘ఆధునికత-అత్యాధునికత’ అని, నా మంచి మిత్రుడే (అఫ్సర్) ఒక విమర్శ గ్రంథం రాశాడు. దాంట్లో ఆధునిక కథ కొడవటిగంటితోనే అంతం అయిపోయింది. మరి 1980 తర్వాత ఒక అత్యాధునిక దశ వచ్చిందని చెప్పి – ఇట్లాంటి కొన్ని ప్రతిపాదనలు చేశాడు. విప్లవ కవిత్వం కూడా 80 తోటి ఆగిపోయింది అని ప్రతిపాదన చేశాడు. వాటిని నేను తీవ్రంగా ఖండించాను. 1980 తర్వాత ఇదిగో, ఈ ‘భారమితి’ వచ్చింది, ఈ ‘లాల్ బనో గులామీ ఛోడో బోలో వందేమాతరం’ దీర్ఘ కవిత వచ్చింది, లేదా వరవరరావు ‘సముద్రం’ వచ్చింది. ఇట్లాంటి ఉదాహరణలన్నీ కూడా నేను చూపించాను. అట్లానే కథ కూడా. కొడవటిగంటి తర్వాత వచ్చిన ఎంతో మంది గొప్ప రచయితలు ఉన్నారు కదా. కేతు (విశ్వనాథరెడ్డి) లాంటి  వాళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళే కదా! కాబట్టి అలాంటి ‘హేస్టీ కన్క్లూజన్‌కి రాకూడదు’ అని చెప్పి నేను రాశాను. రాయటంలో తప్పు ఏమీ లేదు కానీ దానిలో నేను కొంత హేళన, కొంత తీవ్రమైన పదజాలం వాడటం జరిగింది. తర్వాత ఇద్దరం కలిసి పాల్గొన్న వరంగల్ సభలో నేను నా పశ్చాత్తాపం ప్రకటించాను. 

ఈ పశ్చాత్తాపం అనేది కూడా – రచయితల్లో గాని వ్యక్తుల్లో గాని – చాలా చాలా అవసరం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు చూడండి. రాజకీయ రంగంలో ఎన్నెన్ని దుర్మార్గాలు చేసి జైలుకెళ్లిన వాళ్ళు కూడా, ఏ ప్రశ్న అడిగినా కూడా ‘గుర్తు లేదు, మర్చిపోయాను, లేదా దీంతో నాకు సంబంధం లేదు’ – అంతే. ఓరి నీ దుంప తెగ! అంటే నువ్వు చేసినటువంటి దుర్మార్గాన్ని – ఏదో ఒక స్థాయిలో నేను పొరపాటు చేశాను అంటే ఏం? మహాత్మ గాంధీ అంతటివాడు, ‘ఐ హావ్ కమిటెడ్ హిమాలయన్ బ్లండర్స్’ అన్నాడు. ఏమి? ఒక్క మాట ఒప్పుకోవటానికి ఏమైంది నీకు? హాన్స్ క్రానే అనే దక్షిణ ఆఫ్రికా క్రికెట్ కెప్టెన్, ‘నేను మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాను’ అని చెప్పి చివరకు ఒప్పుకున్నాడు. కానీ మన భారత కెప్టెన్ మాత్రం ఒప్పుకోడు, ఇప్పటికీ ఒప్పుకోడు. చెయ్యలేదా అంటే చేశాడు. అందులో ఏం సందేహం లేదు. అనేక దుర్మార్గాలు చేస్తారు కానీ పశ్చాత్తాపం అనేది మాత్రం ఉండదు. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే మనం సాహిత్యానికి కూడా అన్వయించుకున్నట్లయితే సాహిత్యరంగంలో కూడా అది అవసరం. 

అలాగే నేను చేసినటువంటి ఒక పొరపాటు – ‘తిరుప్పావై’ మీద – ఒక గొప్ప రచయిత, కవి వాటి మీద వ్యాఖ్యానం చేస్తే అందులో ధ్వని, వ్యంగ్యం వేర్వేరు, ఇది సాహిత్య విద్యార్థులకు తెలుసు, అదీ ఇదీ అంటూ ఆయన రాశాడు. ‘చినుకు’ పత్రికలో దాన్ని నేను చీల్చి చెండాడాను. మనకెంత అజ్ఞానం ఉందో అది తెలుసుకోవటమే జ్ఞానం అని చెప్పి నేను తీవ్రంగా రాశాను. నేను రాసిన దాంతో విభేదం ఏం లేదు నాకు ఇప్పటికి కూడా. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, ‘అరే! ఒక గొప్ప రచయితని, ఎంతో కృషి చేసినటువంటి రచయితని నేను ఎందుకు గాయపరిచాను’ అని బాధ కలిగింది. కాబట్టి నువ్వు వ్యక్తిని గాయపరచకుండానే, ఆ రచయితని గాయపరచకుండానే అతని విషయాన్ని గురించి నువ్వు విమర్శించవచ్చు, అందులో ఏం అభ్యంతరం లేదు. అందులో అసౌకర్యం ఏం లేదు. అది చాలా నీ సహృదయతకి, నీ ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం. 

అట్లా మనకు వెనక ఎన్నో ఉదాహరణలు కనపడతాయి. కట్టమంచి రామలింగారెడ్డిని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ చీల్చి చెండాడాడు. (రంగనాథ రామాయణ కర్తృత్వ విషయంలో). మూడు రోజులు ఆయన మాట్లాడలేదంట. ఆయనే (రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ) చెప్పాడు, బెంగుళూరు మహా సన్మానసభలో. తనను పోషించిన వాడు, తనను కాపాడిన వాడు, తనను ఎంతో అభిమానించిన వాడు, వేమన మీద బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయించినవాడు అయిన కట్టమంచి అంతటి మహా విమర్శకుడు, ‘వికృతి లేని పాత్రములు జడ తుల్యములు’ అని అద్భుతమైన సూత్రీకరణ చేసినటువంటి వాడు ఏదో ఒకటి రాస్తే దానిని ఈయన చీల్చి చెండాడాడు అంటే ఎంత సాహసం కావాలి? ఈ సాహసం కూడా విమర్శకుడికి చాలా అవసరం అని నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఈ సాహసంలో ఎక్కడ కూడా వ్యక్తిగతంగా వాళ్ళని గాయపరచాల్సిన అవసరం లేదు. అది నా ఉద్దేశం. 

తర్వాత ఇక్కడ ఇంకొకటి. విమర్శలో భాషకు సంబంధించిన తీవ్రత గురించి నేను చెప్పాను కదా! ఇంకో గమ్మత్తు ఏంటంటే చేరా గారితో ఒకసారి నాకు వివాదం ఏర్పడింది. ఏమన్నారంటే ఆయన నేను ఒక వ్యాసం ఏదో రాస్తూ దాంట్లో కొంచెం కవితాత్మకమైన భాష వాడాను. దాన్ని ఉద్దేశించి అన్నారో లేకపోతే అంతకుముందు వాళ్లు రాసినటువంటి దాన్ని ఉద్దేశించారో, మొత్తానికి చేరా ఆ తర్వాత ఒక వ్యాసంలో – చేరాతల్లో – ఏమన్నారంటే, ‘కవిత్వాన్ని గాని, దేనినైనా గాని విమర్శించేటప్పుడు సరళమైనటువంటి వాడుక భాషే ఉండాలి, ఉంటే బాగుంటుంది, కవితాత్మకమైనటువంటి భాష మంచిది కాదు’ అని చెప్పి ఆయన అట్లా రాసుకుంటూ వచ్చాడు. మళ్ళీ దానికి సమాధానం రాశాను. అది సరైనటువంటిది కాదు. ఎందుకంటే నువ్వు ఒక గొప్ప కవితను ఛేదించాలి అనంటే, దాని లోలోపలికి నువ్వు దూసుకుని వెళ్ళాలి అనంటే, దాని అంతరార్థం నువ్వు బాగా విడమర్చుకొని చెప్పాలి అనంటే ఒక్కొక్కసారి కవితా వాక్యం కూడా అవసరమవుతుంది. కవిత్వం ద్వారా కవితాకళ ద్వారా నువ్వు ఆ కవిత్వాన్ని ఛేదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కవితా శైలి అనేదానికి విమర్శలో ఎలాంటి అడ్డంకి ఉండనే ఉండదు. గొప్ప గొప్ప విమర్శకులు అద్భుతమైన శైలిలో రాస్తారు. అద్భుతమైన శైలీ విన్యాసం ఉంటుంది. అందులో కవితా కళ ఛాయలు ఉంటాయి. కాబట్టి అవేవీ కూడా విమర్శలో నిషేధం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను.  కాబట్టి ఆ వస్తువు నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఎలాంటి శైలి తీసుకుంటే బాగుంటుంది. సర్కాస్టిక్‌గా నువ్వు రాస్తావా? లేదా సరళంగా రాస్తావా? లేదా మరో పద్ధతిలో నువ్వు సీరియస్‌గా రాస్తావా అనేది ఆ వస్తువును బట్టి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా భావించాలి అని నేను భావిస్తున్నాను.

తర్వాత మరొకటి ఏంటంటే ఇందాక అభ్యాసము, అధ్యయనం అనే మాటలు కూడా వచ్చాయి. అవి నాకు బాగా ఇష్టమైన మాటలు. ఎందుకంటే కవి అయినవాడు ఏ పుస్తకం చదవకుండా అయినా సరే, కవిత్వం రాయొచ్చు. ఏం సందేహం లేదు. అయితే దాని విలువ ఏంటి అనేది వేరే విషయం. దాని స్థాయి ఏంటి అనేది వేరే వేరే ప్రమాణాల్ని బట్టి నిర్ణయించబడుతుంది. కానీ విమర్శకుడైనటువంటి వాడికి అధ్యయనం అనేది చాలా చాలా అవసరం అని చెప్తాను. ఏదైనా సరే నీకు తెలిసినంత వరకు చదువు. చదవాలి. అది కేవలం సాహిత్యమే అని నేను చెప్పటం లేదు. రోజుకు ఆరేడు డిటెక్టివ్ నవలలు… నమిలిన రోజులున్నాయి.  అట్లాంటివి మన రచనా నైపుణ్యాలకు ఉపయోగపడతాయి. ఇతర సామాజిక శాస్త్రాల పరిచయం కూడా విమర్శకుడికి అవసరమే. మార్క్సిజం, ఎగ్జిస్టెన్సియలిజం లాంటి వాదాలూ తెలుసుకోవాలి. అవి ఆధారంగా ‘సాహిత్యం-మౌలిక భావనలు’లో కొన్ని కాన్సెప్ట్స్ – వస్తువు, రూపం, అవిచ్ఛిన్నత, అశ్లీలత మొదలైనవి మొదటిసారిగా నిర్వచించి అన్వయించాను. ‘స్త్రీ పురుష లైంగిక సంబంధాన్ని కించపరచటమే అశ్లీలత’ అని నా నిర్వచనం. ఆ దారిలో విమర్శ సాధనాల సృష్టి, అన్వయం ఇప్పటికీ జరగటం లేదు. ఆపైన ఇటీవల జిగ్మంట్ బౌమన్ (పోలిష్ ప్రొఫెసర్) రాసిన ‘లిక్విడ్ మోడర్నిటీ’ భావనని ’ద్రవాధునికత’గా తెలుగులోకి తెచ్చి, మన సమాజానికి అన్వయించాను. ఇట్లా విమర్శకుడు నిరంతరం నేర్చుకుంటూ, కొత్త కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్స్  తెలుసుకుంటూ ఉండాలని భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.

(‘హోరు’ సంస్థ నిర్వహణలో, 12 అక్టోబర్ 2025 బెజవాడలో జరిగిన ‘ఈ తరం కవిత్వ విమర్శ’ సదస్సులో చేసిన ప్రసంగం)

పాపినేని శివశంకర్

2 comments

Leave a Reply to ఎడిటర్ Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి వ్యాసం. శివశంకర్ గారు చేసిన ఈ సూచనలు కవులకూ కథకులకూ విమర్శకులకూ సంపాదకులకూ ఎంతో ఉపయుక్తం.

    సారంగ సారథులు చేసిన ఈ మంచి పనికి వారికి అభినందనలు మరియు ధన్యవాదాలు

    వీలైతే వ్యాసం పూర్తి పాఠాన్ని fb wall పై కూడా ప్రకటించండి.

    • “వీలైతే వ్యాసం పూర్తి పాఠాన్ని fb wall పై కూడా ప్రకటించండి.” మంచి సూచన! కానీ, సారంగ పెట్టుకున్న నియమం ప్రకారం ఒక వారం తరవాత ఎక్కడైనా షేర్ చేయవచ్చు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు