“వాష్…”

పొద్దున్న ఎనిమిదింటికే చుర్రుమన్న ఎండ, పదకొండయ్యేసరికి బుర్రలని రామకీర్తన పాడించేంత వర్రగా అయింది.

ఎక్కడో నిలకడగా మోగుతున్న డప్పుల శబ్దం దూరంనుంచి గాల్లో అలలుగా తేలి వస్తోంది. ఆకాశంలోకి దూసుకెళ్తున్న తారాజువ్వలు చిన్న చుక్కల్లా మెరిసిన అరక్షణం తర్వాత పేలిన చప్పుడు చెవులకి చేరుతోంది. పేలిన చోట పుట్టుకొచ్చిన తెల్లటి పొగ మేఘం తొందరగా కొట్టుకుపోతోంది.

‘ఇక్కడ కార్లు కడిగేదెక్కడండీ?’ ఒకళ్ళిద్దర్ని అడిగి దారి తెలుసుకోవలసి వచ్చింది. రాజధానిలో స్థిరపడ్డ గత మూడు దశాబ్దాల్లోనూ, రెండు-మూడేళ్లకోసారి ఈ వూరికి వచ్చినా, ఇటువైపు రావాల్సిన పని పడలేదు నాకు. అయితే ఈసారి అరువు తీసుకున్న ఫ్రెండు కారుని కడిగించడానికి, కొత్తగా వెలిసిన ఈ పేటలో ‘కార్ వాష్’ కోసం వెతకాల్సొస్తోంది.

సదుద్దేశాలున్న కొందరు డాక్టర్లు కలిసి ఇక్కడకు దగ్గరలో ఒక పెద్ద ఆస్పత్రి కట్టి, దాదాపు ఉచితంగా వైద్యసేవలని అందించడం మొదలుపెట్టడంతో, వూరి చివరున్న ఈ ప్రాంతపు దశ మారింది.  ఒకటి-రెండేళ్ళలో ఆస్పత్రి చుట్టుపక్కల్లోని గుడిసెల స్థానే బీదల కోసం ఒక కాలనీ కట్టించింది ప్రభుత్వం. మరి కొన్నాళ్ళకి, దానికి కొద్ది దూరంలో ఏదో ఫాక్టరీ మొలిచింది. చీకటి పడ్డ తర్వాత మనుషులు నడవడానికి జంకే ఒకప్పటి మట్టిదార్లే, ఇప్పుడు తారురోడ్లయి ఈ ‘పేట’ని వూరి దగ్గరికి తెచ్చాయి. కొత్తవీ పాతవీ రకరకాల వ్యాపారాలు, మనుషులని చేరవేస్తూ రొదగా తిరిగే ఆటోలు, కాబ్ లు, చిన్నా పెద్దా బళ్ళు, లారీలు…  సందడి పెరగడానికి పెద్దగా సమయం పట్టలేదు.

అభివృద్ధి! అది వస్తోంటే వద్దనేదెవరు? కరెక్టేగానీ ఆ మధ్య ఒక పెద్దాయన ఏదో మాటల మధ్య, ‘ఎవరికోసం అభివృద్ధి?’ అనడిగాడు… అదేం ప్రశ్నో!

దారి కనుక్కుంటూ ఒకటి రెండు మలుపులు తిరిగి, కారుని పెద్ద షెడ్డులాంటి ‘కార్వాష్’ లోకి తిప్పాను. బేరం కుదిరింది. కారుని కడిగే ప్రక్రియ మొదలయింది. కడిగే ఇద్దరు తప్ప మరెవరూ లేరు ఆ షెడ్ లో. పక్కనే  సిమెంటుతో గుమ్మాలూ కిటికీ ఫ్రేములూ వగైరాలని తయారు చేసే షాపులో పనులు జరగడం కనిపిస్తోంది. ఎండకి జడిసి రోడ్డుమీద జనం పల్చగా…

నాలుగు ఫుట్‌మాట్లనీ కార్లోంచి బయటికి తీసి, ప్రెషర్ హోస్‌తో కడుగుతున్నాడు ఒకతను.

షెడ్ ముందర విశాలంగా పరుచుకున్న జాగాలో కాస్త దూరంలో, కొత్తగా కట్టినట్లు కనిపిస్తున్న కాలనీ ఎండలో తళతళమంటోంది. “ఇదేం కాలనీ? కొత్తగా కట్టారా?” కారు తుడుస్తున్న అతన్ని అడిగాను.

“సిడ్ కో కాలనీ అండి. కంపినీ వోల్లే కట్టిచ్చారు. సాలా పెద్దదండి. ఎయ్యి పైనే గడప. ఆటన్నిట్లోనూ ఆ కంపెనీలో పన్జేసే వోల్లే.”

‘సిడ్ కో’ కంపెనీయా?” అడిగాను – ‘పేరెప్పుడూ వినలేదే’ అనుకుంటూ.

“అవునండి. కొత్తది.”

డప్పుల మోతా, జువ్వల ప్రేలుళ్ళూ అంతే దూరంలో వినిపిస్తున్నాయి. అరగంట గడిచి, ఎండ వేడి మరికొంత పెరిగింది.

ఫోమ్ తో ఒకసారీ, నీళ్ళతో రెండుసార్లూ కడిగి, కారుని షాపు ముందరి ఖాళీ జాగాలోకి తీసుకెళ్ళి నిలబెట్టారు.  అయ్యో – ఎండలో కారు వేడెక్కుతుందని సణుక్కున్నా, చేయగలిగిందేమీ లేక షెడ్డు చూరు కిందకొచ్చి నిలబడి, కారుకి జరుగుతున్న సేవని చూస్తున్నాను.

రెండడుగులు కారు వైపుకి వేశాను. చుర్రుమంటూ పలకరించింది ఎండ. డప్పుల మోత ఇప్పుడు దగ్గర పడుతోంది. కొద్దిసేపట్లో, గుంపు మధ్యలో మోసుకు రాబడుతున్న పాడె, శవాన్ని కప్పిన తెల్లగుడ్డ మీద దట్టంగా దండలు, గులాబీపూలు… ముందుగా డప్పుల వాళ్ళు, వాళ్ళ వెనుక పాడెని మోస్తున్న గుంపు స్పష్టమయ్యారు. గుంపుకి ముందు నడుస్తున్న ఒకతను పెద్ద సైజు తారాజువ్వలు ముట్టించి గాల్లోకి వదులుతున్నాడు. పాడె మీద స్త్రీ శవం. నల్లటి జుట్టు. చిన్న వయసేనేమో…

గుంపు వెంట కొందరు బైకుల మీదా సైకిళ్ళ మీదా వస్తున్నారు. గుంపులో, తెల్ల పంచె మాత్రం ధరించి, భుజం మీద వేసుకున్న తువ్వాలు మీద కుండని పెట్టి మోస్తున్న ఒకతను, నిప్పుల గుండంలా కాలుతున్న ఆ రోడ్డుమీద చెప్పులు లేకుండా  నడవలేక పోతున్నాడు. ఇంతలో ఎవరో తన చెప్పులు విడిచి అతనికి ఇచ్చారు. అతను తొడుక్కుని మళ్ళీ నడక ప్రారంభించాడు. ఓ కుర్రాడు గుంపు వెనక్కి పరుగున వెళ్లి, బండి మీద వస్తున్న ఒకతన్ని అడిగి చెప్పులు తీసుకొచ్చి, ఇతనికి ఇచ్చాడు. గుంపు కదులుతూనే ఉంది. కారుని తుడుస్తూ ఆగిన కుర్రాళ్ళతోబాటు నేనూ చూస్తున్నాను, వీలైనంత నిర్లిప్తంగా.

ఎప్పుడొచ్చి నా పక్కన నిలబడ్డాడోగానీ, ఒక ముసలాయన, తలకి చుట్టుకున్న గుడ్డని విప్పి మళ్ళీ గట్టిగా చుట్టుకుంటూ, ఆ గుంపుని చూస్తూ కాస్తంత దిగులుగా అన్నాడు.

“ఈ కొత్త కాలనీ కట్టినాక, పోయిందెవుళ్లో యేందో యేవీ తెలీట్లేదండీ…”

* * *

శ్రీనివాస్ బందా

పుట్టిందీ పెరిగిందీ విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటున్నప్పుడే, సైన్యంలో చేరవలసివచ్చింది. ఆ యూనిఫారాన్ని రెండు దశాబ్దాల పైచిలుకు ధరించి, బయటికి వచ్చి మరో పదకొండేళ్లు కోటూబూటూ ధరిస్తూ కార్పొరేట్‌లో కదం తొక్కాను. రెండేళ్లక్రితం దానికి కూడా గుడ్ బై చెప్పి, గాత్రధారణలు చేస్తూ, కవితలు రాసుకుంటూ, అమితంగా ఆరాధించే సాహిత్యాన్ని అలింగనం చేసుకుంటూ ఢిల్లీలో నివసిస్తున్నాను.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు