బుల్ డోజర్లను అడ్డుకుంటున్న కలం

కొన్ని వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి, కఠోరంగా ఉంటాయి. కాని కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలకు కారణాలు అన్వేషించే వారు వాస్తవాలను జీర్ణించుకోక తప్పదు. కారణాలను అన్వేషించలేని వారు ఎప్పటికీ భావోద్వేగాలకు గురవుతూనే ఉంటారు. తీవ్రమైన పరిభాషలో దూషిస్తూ, నిందిస్తూ ఉంటారు. నినాదాల వల్ల విప్లవాలు రానట్లే,  దూషణలు,నిందల వల్ల ఒరిగేదేమీ ఉండదు.  కాకపోతే నినాదాలు చేసే వారు, దూషించే వారు సంతోషిస్తారు. ఒక వాస్తవాన్ని తీవ్రంగా వ్యతిరేకించినంత మాత్రాన, అలా వ్యతిరేకించిన వారందరూ పరస్పరం ప్రశంసించుకున్న మాత్రాన ఆ వాస్తవం మారదు. ఏ పరిణామాన్నైనా శాస్త్రీయంగా విశ్లేషించి పరిస్థితి ఆరోగ్యకరంగా మార్చేందుకు ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ఒక రచయితకు ఉంటుంది. అలాంటి రచయితల్లో కె. శ్రీనివాస్ ఒకరు. కొన్ని దశాబ్దాలుగా ఆయన ఈ పని చేస్తూనే ఉన్నారు.

ఆలోచించడమే కాదు, వినూత్నంగా ఆలోచించడం శ్రీనివాస్ లక్షణం. రచించడమే కాదు,  విశిష్ట శైలిలో రాయడం ఆయన ప్రత్యేకత. ఒక అంశాన్ని ఈ కోణంతో కూడా చూడవచ్చునా అని అచ్చెరువు పొందేలా చేయడం ఆయన విశిష్టత. అక్షరానికి నగిషీలు చెక్కి, కత్తిలా పదునుగా మార్చి నెత్తుటిలో అద్ది కాగితంపై అందంగా పరిచే అతి కొద్ది మందిలో ఆయన ఒకరు. ఆయనలో భావోద్వేగాలు వాక్యం వాక్యానికీ తన్నుకు వచ్చినా, వాటిలో తనను తాను కొట్టుకుపోకుండా మనను కూడా వాటిలో బంధించి చూడాల్సిన చూపును అందించగలడు.

కె. శ్రీనివాస్ ది చిక్కదైన వాక్యం. ప్రతి అక్షరానికీ బరువు ఉంటుంది. ఆ అక్షరం పదమయ్యే సరికి అది మరింత దట్టమవుతుంది. ఆ పదాలు వాక్యమయ్యే సరికి ప్రతి వాక్యమూ బరువెక్కి పోతుంది. మొత్తం వ్యాసం చదివాక ఏదో గాఢత మనలోప్రవేశించినట్లు, ఒక విషాద సంఘటనను చూసిన తర్వాత అది మనసు లో పేరుకుపోయినట్లు అనిపిస్తుంది. జరిగిన సంఘటనలను విశ్లేషించే సందర్భంలో ఆయన కవిలా రాసేందుకు పూనుకున్నా వాక్యం కవిత్వాన్ని ఛేదించుకుని పుట్టిన నూతన శిశువుగా మారుతుంది. “నెత్తుటి వెల్లువలో ముగ్ధత్వం కొట్టుకుపోయినా సరే, ఆ అమాయకతను కీర్తించాలి. ఎండమావి అని తెలిసేదాకా దాహం తీర్చిన ఆశను గుర్తించాలి. సంకెళ్ల మధ్య మందహాసాలను, ఉక్కుపాదాల కింద చెక్కుచెదరని చిరునవ్వును, మృత్యువు చెంత మనోధైర్యాన్ని నిలుపుకున్న ధీరులందరిలో నిలిచి వెలుగుతున్న అమాయకత్వాన్ని గౌరవించాలి” అని అంటాడు ఆయన ‘సంభాషణ’లో.

శ్రీనివాస్ తాజాగా వెలువరించిన  ‘బుల్ డోజర్ సందర్భాలు’ ఒక వర్తమాన హీన  చరిత్ర. పార్లమెంట్ భవనాలు, అంబేద్కర్, గాంధీ  విగ్రహాలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు కాలేవు. వాటిని నిర్మించిన వారు, వాటి ముందు మోకరిల్లిన వారు కూడా ప్రజాస్వామ్య పరిరక్షకులు కారు. రాజ్యాంగం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం. నేడు నరరూప రాక్షసులు ప్రజాస్వామ్యం, స్వేచ్చ గురించి మాట్లాడుతున్నారు. సంపదను కొందరికి దోచి పెట్టి అందరి మేలు చేస్తున్నట్లు నటిస్తున్నారు. శ్రీనివాస్  వీరందరి మధ్యా సంచరిస్తూ అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు కనపడుతూ అక్షరంలో మాత్రం తన్ను తాను దాచుకులేక పెటిల్లున విరుచుకుపడతాడు ఈ వ్యాసాల్లో.

అసలీ వ్యాసాలకు బుల్ డోజర్ సందర్భాలు ఎందుకు పెట్టారు?  “బుల్ డోజర్ కేవలం నేలను సంపన్నుల కోసం చదును చేసే యంత్రం కాదిప్పుడు. అది పరిగణనలలో పరాయిగా మారిపోయిన మనుషులను వారి నివాసాల్లోంచి పెకిలించి, నిరాశ్రయులను చేయగల అద్భుత మంత్రం. గురిపెట్టిన ప్రజల గుండెల్లో భయాన్ని రోడ్డు రోలర్ గా  పరిగెత్తించగల అద్భుత తంత్రం. విభజనకు విద్వేషానికి ఇనుప పోత పోస్తే , అది అట్లా దొర్లుకుంటూ చదును చేసుకుంటూ పోతుంది. నేరం ఎవరిదన్న విచికిత్స అక్కర్లేదు.  బుల్ డోజర్ స్పర్శ సోకిన వాడే నేరస్తుడు. సందేశం అందింది కదా? ఇవాళ జెండాపై కపిరాజు లేడు. బుల్ డోజర్ ఉంది” అంటాడు శ్రీనివాస్. బుల్ డోజర్ అన్ని వ్యవస్థలనూ కూలద్రోస్తున్న ఒక వ్యక్తికి, అతడిని మోస్తున్న వ్యక్తులకు, ప్రశ్నించిన వారి గొంతు నొక్కేస్తున్న శక్తులకూ ప్రతీక.  ‘చరిత్ర గుండెల్లో బుల్ డోజర్’ అని ఆయన మరో చోట అంటారు.  చరిత్రను వక్రీకరిస్తూ కులోన్మాద వ్యవస్థను, మత ఆధిపత్యాన్ని భారతీయ ప్రజాస్వామ్య పరంపరగా ప్రశంసిస్తున్న వారి చరిత్ర హీనత్వాన్ని బట్టబయలు చేస్తారు. ‘హిందూ నాస్తికులు హిందువులు కారా?’ అని చరిత్ర చదువుకొమ్మని చెబుతారు.

సిద్దార్థుడు బుద్దుడుగా మారిన బోధగయ ప్రవేశంలో ఆసీనుడై ధ్యానముద్రలో ఉన్న నరేంద్రమోదీ- ‘ఒక చారిత్రక వైచిత్రి, ఒక దిగ్భ్రాంతికర నన్నివేశం’ అంటాడు కెఎస్. మోదీ బుద్దుడిగా మాత్రమే కాదు, అనేక వేషాలు ధరించాడు. దేశమంటే మట్టి కాదోయ్ అన్న గురజాడ ప్రవచనాలూ చదివాడు.  మోదీ బుద్దుడూ, కృష్ణుడూ ఒకటే అంటే చప్పట్లు చరిచిన వారున్నారు. కృష్ణుడు హింసను ప్రబోధిస్తే బుద్దుడు శాంతిని ప్రబోధించాడు కదా, ఇద్దరూ ఒకటే ఎలా అవుతారు? అన్నది ఒక ప్రశ్న.

కె. శ్రీనివాస్ ఎప్పుడూ ప్రశ్నలను సంధించకుండా ఊరుకోలేదు. ‘బంగ్లాదేశ్ లో ఇస్లాం మత ఛాందస వాదులు లౌకికవాదులపై, హేతు వాదులపై దాడులు చేయడానికీ, భారత దేశంలో సాంస్కృతిక టెర్రరిస్టులు చేస్తున్న దానికీ తేడా ఏమున్నది?’ అని ప్రశ్నిస్తారు. ‘ అణిగి అణిగి ఆరిపోయిన ఆశలను కూడగట్టుకుని శ్రమలో పునీతమైన బౌద్దిక తరం రోహిత్ వేముల లాంటి స్టార్టప్ లను బతికి బట్టనిస్తావా నరేంద్రమోదీ?’ అని నిలదీస్తాడు. అంబానీలు అదానీలు నోట్ల రద్దు సమర్థించేసరికి ఇంతకీ నల్లధనం ఎవరి వద్ద ఉన్నదని సామాన్యుడు అయోమయంలో పడిపోయాడంటాడు.’ ప్రధాని ఫకీర్ అయితే పదిలక్షల విలువైన సూటెందుకు?’ అని ఎవరో అడుగుతాడని తానే అడుగుతాడు. ‘దౌర్జన్యాలకు భయపడి సజ్జనులు సుభాషితాలు మింగితే మనకేదీ గతి?’ అని వాపోతాడు. అన్నీ వేదాల్లో ఉన్నాయష అని చెప్పుకునే ఛాందసులు ‘వైద్య విద్య సిలబస్ ను రద్దు చేసి పిండాన్ని ముక్కలు చేసే వందమందిని పుట్టించే టెక్నాలజీ ఏమిటో విద్యార్థులకు నేర్పండి. రావణ విమానాలు ఉండగా, రాఫెల్ విమానాలెందుకు?’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తాడు.

70 ఏళ్లు రాజ్యాంగంలో ఉన్న అధికరణ దేశద్రోహకరమైనది అవుతుందా? ఏవో మాయమాటలు చెప్పి మెజారిటీ సాధించగానే దేశ ప్రజల అతలాకుతలం చేయగలిగే అధికారం వస్తుందనుకుంటున్నారా? తాను చదివిన, తెలుసుకున్న, భాగమైన , రచించిన చరిత్రను వరవరరావు మరిచిపోగలరని ఎవరైనా అనుకున్నామా? వాస్తవ వైరుధ్యాలను కప్పిపుచ్చడం, అబద్దపు వైరుధ్యాలను ఎగదోయడం ఒక విధానంగా అమలు జరుగుతున్నప్పుడు ప్రజలు ఈ కల్లోల కాలాన్ని ఎట్లా నిర్వహించాలి?ఉద్వేగ రాజకీయ వెల్లువలపై స్వారీ చేస్తూ పెను పర్యవసానాలుండే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుంటూ వెడుతున్న ఒక తీవ్ర జాతీయ ప్రభుత్వానికి కళ్లెం వేయగల ధైర్యాన్ని న్యాయవ్యవస్థ ప్రదర్శించలేదా? కౌరవ సభలో కనీసం భీష్మ ద్రోణుల మాదిరి అసమ్మతిని బలహీనంగానైనా వినిపించలేదా? రాజకీయ సామాజిక భావాల కంటే మత భావాలే మన దేశస్థులను ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయనుకోవాలా?84 ఏళ్ల బక్కపలచని పెద్ద మనిషి నుంచి ఏ ప్రమాదం ఆశించాలని బెయిల్ ఇవ్వకుండా నిరాకరించారు?ఏ అదానీ, అంబానీలకు ప్రదానం చేయడం కోసం అడవి బిడ్డలకు అండదండలు లేకుండా చేయడం? అని అనేక ప్రశ్నలు ఈ పుస్తకం అంతటా మనకు కనిపిస్తాయి.

శ్రీనివాస్ నిరంతర ఆశా జీవి. ‘అవతలి గట్టు కనిపించడం లేదు. నిరవధిక రాత్రి.’ అంటూనే ‘ఎంతటి హాస్యాస్పదమైనవైనా, ఎంతటి హేయమైనవైనా, బూటకపు వైనా, జరుగుతున్న పరిణామాల నడుమనే, అందుబాటులో ఉన్న అవకాశాల మధ్యనే ప్రజలు ప్రత్యామ్నాయాలను నిర్మించుకోవల్సి ఉంటుంది’ అంటారు.ఏ ప్రత్యామ్నాయమో చెప్పకపోయినా మనిషి మనిషిలా జీవించే సమాజాన్ని ఆయన ఆశిస్తున్నారని ప్రతి సందర్భంలోనూ అర్థమవుతుంది. ‘దుఃఖిద్దాం, దుఃఖించండి, ఇంత హీనంగా ఉన్నందుకు. ఇత దీనంగా మారినందుకు, మన చేతులకు ఎవరో నెత్తురు పూస్తున్నందుకు’ అని   బాధపడుతూనే ‘ద్వేషం దేశ పతాక కాకుండా’ చూసుకోవాలని హెచ్చరిస్తారు. ‘బడులలో  వెలివాడలు  వెలయకుండా స్వేచ్చాలోచనలు వెల్లి విరిసేలా ఏం చేయగలమో చేద్దాం’ అని చెబుతారు. ‘అలముకుంటున్న చిమ్మ చీకటిలో,చూపు బతికి బట్టకట్టాలంటే, ఒక మహా ప్రయత్నమే జరగాలి. అనేక అస్తిత్వాల ఆకాంక్షలను, ప్రజాస్వామ్యాన్ని, సమానత్వ కాంక్షను, మంచిచెడ్డల విచక్షణ నిచ్చే సిద్దాంతాన్ని కలిపి కుట్టిన తరంతో అడుగులు కలపడమే నేటి ప్రత్యామ్నాయం’ అని సూచిస్తాడు. ‘విడదీసే వాళ్లకు విడిపోని వారే జవాబు’ అని స్పష్టం చేస్తారు.’నియంతలనైనా, ద్వేషకారులనైనా సామాన్యులు తమ స్వహస్తాలతో గద్దె నెక్కించగలరని గ్రహిస్తే,  ఆ ప్రమాదాన్ని ఎట్టా నివారించాలో అర్థమవుతుంది’ అంటారు.

అర్థమయ్యే క్రమం ప్రారంభమైందని నాకనిపిస్తుంది. ఈ ప్రారంభంలో శ్రీనివాస్ లాంటి వారి పాత్ర విస్మరించదగింది కాదు. ‘జర్నలిజం మునుపెన్నడూ లేనంత సంక్షోభంలో ఉన్నది’ అన్న వాక్యంతో ఆయన ఈ పుస్తకాన్ని ప్రారంభించారు కాని నింగి నేల మీద పడకుండా కాపాడేందుకు యత్నించే శ్రీనివాస్ లాంటి వారు ఉన్నంతకాలం జర్నలిజం తన సంక్షోభాన్ని తానే పరిష్కరించుకుంటుంది.

(బుల్ డోజర్ సందర్భాలు – కె.శ్రీనివాస్ . వెల రూ.250. ప్రతులకు మలుపు బుక్స్, నల్లకుంట, హైదరాబాద్-500044. ఫోన్ -6305991831)

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మిత్రుడు శ్రీనివాస్ రాసిన “బుల్ డోజర్ సందర్భాలు” చాలా చక్కగా విశ్లేషించారు మంచి మిత్రుడు కృష్ణుడు. చాలా మంచి విశ్లేషణ

  • చరిత్ర ఎప్పుడూ అధికారం ఉన్న వాళ్ల మాటే వింటుంది. వాళ్లదే చరిత్రగా చెలామణి అవుతూ ఉంటుంది. కానీ చూసే చూపు ఉండాలే కానీ ఆ చరిత్ర నిర్మాణంలోని రహస్యాల నిండా దాహం, దోపిడి, అధికార తాపత్రయం వంటివే ఉంటాయి. మనిషిని మనిషిగా కాకుండా ఓ ఓటరుగా, తమ భావజాలానికి కొమ్ము కాసేవాడిగా తయారుచేసే తెలివి పాలకవర్గానికి వెన్నెతో పెట్టిన విద్య. మతం, కులం, దేశభక్తి, ప్రాంతం.. ఏదైతేనేం అధికారవర్గం దోపిడికి ఉపయోగించుకునే వర్తమాన రాజనీతి. సమోన్నత సమాజాన్ని కలగంటోన్న వర్తమాన దార్శనికులు శ్రీనివాస్ గారు. పుస్తకం గురించిన విశ్లేషణ భావుంది. అలాగే ఎవరైనా ఈ పుస్తకంలోని కవితా వాక్యాలను విడమరచి, విశ్లేషణ చేస్తే రచయితలోని… కవిత్వం, శైలి, శిల్పనిర్మాణ వ్యూహాలు తెలుసుకోవచ్చనుకుంటాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు