లవ్ ఇన్ పీసెస్

“అయినా ఒక డేటింగ్ యాప్‌లో తగిలినవాడివి. నువ్వేంటో, ఎలాంటివాడివో తెలుసుకోకుండా ఎలా నిన్ను కలవడం?” కనుబొమ్మలెగరేసింది.

1.

అతను రావడమే చుట్టూ చూసి కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గరికెళ్ళి కూర్చొని ఫోన్ తీసి టైమ్ చూశాడు. కాసేపు చుట్టూ గమనించాడు. మళ్ళీ ఫోన్లో పడిపోయాడు.

స్వైప్ లెఫ్ట్.. స్వైప్ లెఫ్ట్.. స్వైప్ రైట్.. లెఫ్ట్.. లెఫ్ట్.. రైట్. రైట్. రైట్.

చూడండి నేనెలా తయారయ్యానో. ఇటు చూడండి. నా కళ్ళలోకి చూడండి. ఏం కనిపిస్తోంది? కామమా? కామం కాక ఇంకేం కనిపిస్తుంది!

ఫ్రెండొకడు చెప్తే టిండర్ అని ఈ డేటింగ్ యాప్‌కి సైనప్ చేసి రెండు వారాలుగా వాడుతున్నా. రోజులో చాలాసేపు ఇదే పని. నచ్చితే రైటుకి స్వైప్ చెయ్యడం, నచ్చకపోతే లెఫ్టుకి. ఇంతమంది అమ్మాయిలున్నారా ఇక్కడ అనిపిస్తుంది గానీ రెండు వారాలకి గానీ ఒక మ్యాచ్ కుదర్లేదు. నాకు నచ్చిన అమ్మాయికి నేను కూడా నచ్చితే మ్యాచ్. ఇవ్వాళ ఇప్పుడు ఈ కాఫీ షాపులో ఇద్దరం కలుసుకుందామని అనుకున్నాం. నాలుగున్నరకి అని చెప్పా. నాలుగు గంటలకే చేరుకున్నా.

ఈ ఖాళీ సమయంలో నేనేం చెయ్యాలి? మెనూ చదువుకోవచ్చు. సోషల్‌మీడియా స్క్రోల్ చేస్కోవచ్చు. లేదంటే ఏదైనా ఆలోచించుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నా?

ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చాక మాట్లాడాలి. మాటల్లో పడి దగ్గరవ్వాలి. ఇద్దరికీ ఒకరికొకరం నచ్చాలి. ఆ తర్వాత జరగాల్సింది ఇక్కడ్నుంచి ఇలాగే, ఈ రాత్రికే జరిగిపోవచ్చు. లేదా రేపు అనుకొని మళ్ళీ కలిస్తే జరగొచ్చు. లేదా ఇంకెప్పుడైనా జరగొచ్చు. అసలేమీ జరగకుండా మళ్ళీ కలవకుండా కూడా ఉండొచ్చు.

నన్ను చూడండి! ఈ అమ్మాయిని ఇంకా కలవకముందే వేరే అమ్మాయిలని చూస్తున్నా. ఇది కామమే?

వెయిట్. ఈ అమ్మాయి వస్తున్నట్టుంది. గాడ్! ఇంత అందంగా ఉందేంటి? నేను మళ్ళీ మాట్లాడతా.

అతను ఫోన్ పక్కనపెట్టి లేచి ఆ అమ్మాయికి షేక్‌హ్యాండ్ ఇచ్చి కూర్చోమంటూ కుర్చీ చూపించాడు.

“హాయ్! ఎవరితో మాట్లాడుతున్నారు ఇందాక?”

“నేనా?”

“మరి నేనా?”

“మీతోనే.”

“ఏదీ, నేనింకా రాకముందునుంచే?”

“అంటే వస్తే ఏం మాట్లాడాలా అని”

“శ్రీ” అని నవ్విందామె.

“రాహుల్. ఇప్పుడైనా పూర్తి పేరు చెప్పరా?”

“రా?”

“మీరూ.. రా..”

“నువ్వూ.. వా..?”

“సరే, పూర్తి పేరు చెప్పవూ..”

“తెలుసుకొని ఏం చేస్తావోయ్?”

“ఆ పేరు పెట్టి పిలుస్తాను”

ఆమె చిన్నగా నవ్వేసి, అప్పుడే మెనూ కార్డు చదివేస్తోంది.

“ఏం చెప్పను?”

“హాట్ చాక్లెట్. నాకు”

“చిన్నపిల్లల కాఫీ అది”

అతను చిన్నగా నవ్వాడు.

“సరే, ఇద్దరికీ అదే చెప్తా”

వెయిటర్ని పిలిచి ఆర్డర్ చెప్పేశాక, అతనివైపు చూస్తూ, “ఎందుకలా కంగారుగా ఉన్నావు? ఆర్ యూ ఓకే?” అనడిగింది.

“నో, ఆల్ ఓకే”

“అయితే చెప్పూ.. ఫోన్లో ఏం మాట్లాడవా? నేరుగా కలిసి మాట్లాడితేనే మాట్లాడినట్టా?”

“అలాగనేం లేదు”

“అయినా ఒక డేటింగ్ యాప్‌లో తగిలినవాడివి. నువ్వేంటో, ఎలాంటివాడివో తెలుసుకోకుండా ఎలా నిన్ను కలవడం?” కనుబొమ్మలెగరేసింది.

“ఇప్పుడు కలిసావుగా..”

“చెప్పు.. ఏం మాట్లాడతావో చూద్దాం”

“మీ అంత అందమైన అమ్మాయిని నేనింతవరకూ ఎప్పుడూ…”

“అబద్ధం”

మీరే చూడండి, నిజం చెప్తున్నా అబద్ధమనేసి ఎలా ఆపేసిందో.

“సరే.” అన్నాడతను అలిగినట్టుగా.

“ఇదేనా నేను రాకముందు ప్రాక్టీస్ చేసినది?”

“అయ్యో, మిమ్మల్ని చూడగానే అనిపించిన విషయం చెప్తున్నా. కావాలంటే వీళ్ళని అడిగి చూడండి”

“ఎవర్ని?” అతడి వైపు వింతగా చూసిందామె.

దొరికిపోయానా?

“హిహి. నన్నే. నన్నే మళ్ళీ అడిగి చూడండి. నా కళ్ళలోకి చూసి చెప్పండి”

గట్టిగా నవ్విందామె. కాఫీ రాగానే స్నాప్‍చాట్ కోసం ఒక ఫొటో తీసుకొని, తాగడం మొదలుపెట్టింది. అతను ఆమె వంకే చూస్తూ నవ్వుతున్నాడు.

“ఎంతమందికి చెప్పావోయ్ ఈ మాట?”

“నీకు మాత్రమే”

“మళ్ళీ అబద్ధం”

“అయితే నేను ప్రేమించిన అమ్మాయిలందరికీ”

“ఇడియట్”

ఆమె తన కుడిచేత్తో కాఫీ కప్పు పట్టుకొని ఎడమచేతిని అతనికి దగ్గరగా జరిపింది.

చెయ్యి పట్టుకోమంటున్నదా?

ఎవరో పిలిచినట్టు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి ఆమె చెయ్యి పట్టుకున్నాడతను. ఆమె చిన్నగా నవ్వింది.

“ఏంటి నీ ఉద్దేశం?”

“అంటే?”

“ఏం చెయ్యాలని..”

అతనేమీ మాట్లాడకుండా ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకొని ఆడుకుంటున్నాడు. అరచేతి మీద ఏదో రాసినట్టు గీస్తున్నాడు.

ఆమె ఒక్కసారిగా ఏదో ఆలోచనలో పడ్డట్టు ముఖం పెట్టింది. అతను వెంటనే తన చేతుల్ని వెనక్కి లాక్కున్నాడు.

“సారీ, యూ ఓకే?”

“ఐయామ్ ఫైన్. ఏదైనా చెప్పు..”

“ఏదైనా అంటే?”

“ఏదో ఒకటి”

“ఉమ్. ఇంటినుంచి ఇక్కడికి నడిచొస్తున్నా. ఒక బైక్ మీద వెనకాల కూర్చున్న అమ్మాయి – భార్య అయి ఉండొచ్చు, ముందున్నతడ్ని ఎందుకో గిచ్చింది. ఇద్దరూ నవ్వుకున్నారు. కొంచెం ముందు ఒకతను తన పక్కనే ఉన్న అమ్మాయికి కోన్ ఐస్‌క్రీమ్ అందిస్తున్నాడు. ఒక జంట రోడ్డు మీద చాయ్ తాగుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఒకిద్దరు నాకెదురుగా చెయ్యీ చెయ్యీ పట్టుకొని నడిచొస్తున్నారు. ఈ దారంతా మిమ్మల్నే తలుచుకున్నాను”

“మీరు?”

“సరే, నిన్ను”

ఈసారి ఆ అమ్మాయే అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది.

“ఇది కూడా అబద్ధమే కదా?”

అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు.

“కాదు”

ఆమె చిన్నగా నవ్వింది.

ఇద్దరూ కాఫీ తాగడమయ్యాక – “నీకేం చెయ్యాలో తెలీదు కదా?” అందామె.

ఏం మాట్లాడుతోంది ఈ అమ్మాయి?

“అంటే?” అనడిగాడతను.

“అంటే నన్ను కలవాలనుకున్నావు గానీ ఏం చెయ్యాలో తెలీదు కదా?”

“నిజం చెప్పాలంటే, నిజంగానే తెలీదు”

“పిచ్చి. బయటికెళ్దామా? కాసేపు అలా నడుద్దాం”

ఇద్దరూ ఆ కాఫీ షాపు బయటికొచ్చి నడక మొదలుపెట్టారు. అతను ఆమె చేతిని తగలకుండా నడుస్తున్నాడు. ఆమె మూడుసార్లు చూసి, నవ్వి అతని చేతుల్ని పట్టుకుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.

మమ్మల్నిద్దర్నీ ఇలా చూస్తే ఇవ్వాళే పరిచయమైనవాళ్ళని ఎవ్వరూ అనుకోరు. కదా!

“ఏమన్నావు?”

“ఏమీ లేదే?”

“ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడతావు ఒక్కోసారి”

అతను చిన్నగా నవ్వి, “ఇదిగో, ఆ కమాన్ నుంచి లోపలికెళ్తే ఫస్ట్ రైట్ మూడో బిల్డింగ్ నేనుండే ప్లేస్” అన్నాడు.

“తీసుకెళ్తానంటున్నావా?”

అందుకే అన్నానా? నిజంగా నాకు అంత ధైర్యముందా? ఇంతకుముందు ఏ ప్రేమలోనూ లేని ధైర్యం.

“నీ ఇల్లెక్కడ?”

“ఇక్కడికి కిలోమీటరు దూరం”

“అక్కడివరకూ రానా?”

“ఇక్కడే వదిలేసి పోదామనుకున్నావా?”

“సారీ, నేనలా అనలేదు”

“సరే, నేనైతే ఇంటివరకూ రమ్మంటాను”

ఇంటివరకూ వెళ్ళాక ఇంటికి రాకుండా ఉండను మరి! అని చెప్తాను. మీరేమంటారు?

అవీ ఇవీ మాట్లాడుకుంటూ ఇద్దరూ ఆ కిలోమీటర్ దూరం నడిచేశారు. ఆమె ఇల్లొచ్చేసింది. అతను అన్నట్టే అడిగాడు – “ఇక్కడ్నుంచే వెళ్ళిపోవాలా?”

“ఇంట్లోకి రావొచ్చు”

“ష్యూర్?”

సరిగ్గా వారం తర్వాత. వాళ్ళిద్దరూ మొదటిసారి కలిసిన కాఫీ షాపు దగ్గరే.

“రేప్పొద్దునకి నాతో ఎందుకు పడుకున్నానా అనుకోవచ్చు నువ్వు. మళ్ళీ కలవకూడదని కూడా అనుకోవచ్చు”

ఆ అమ్మాయి మాటలు గుర్తుచేసుకుంటున్నాడతను.

“నేనేమీ అలా అనుకోను. అయినా ఇదెంత బాగుందో తెలుసా?”

“ఇదే మాట పొద్దున చెప్తావా?”

“వారం తర్వాత అడిగినా చెప్తా”

“అయితే సరిగ్గా వారం తర్వాత కలుద్దాం. అదే కాఫీ షాపు దగ్గర. ఇవ్వాళ కలిసిన ఎగ్జయిట్మెంట్ ఉంటుందో ఉండదో చూద్దాం. ఈ వారం రోజులు మనం మాట్లాడుకోవద్దు. అయినా నెంబర్ కూడా లేదు కదా. టిండర్లో కూడా ఇప్పుడే అన్‌మ్యాచ్ చేస్తా. చూద్దాం”

చూద్దాం. ఆ అమ్మాయి నాలుగ్గంటలకి అంటే మూడున్నరకే వచ్చి కూర్చున్నా చూడండి. ఇదీ కామమే?

అతను నాలుగు కాగానే ఆ అమ్మాయిని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. డోరు వైపే చూస్తూ కూర్చున్నాడు.

ఆ అమ్మాయి అకస్మాత్తుగా నేరుగా కిచెన్ నుంచి అతని దగ్గరికొచ్చింది.

“నాలుగంటే మూడున్నరకే రావాలా?”

అతను ఏమీ అర్థం కానట్టు చూశాడు.

“నేను మూడుగంటలకే వచ్చి కూర్చున్నా. అసలు మనం ఎందుకిలా చేస్తున్నాం?”

అతను నవ్వాడు.

“నవ్వకు ప్లీజ్”

అతను ఆమె చేతుల్ని దగ్గరికి తీస్కొని, “నేను ప్రతిరోజూ నీ ఇంటివైపొచ్చా”

“నువ్వు కూడానా?”

“నువ్వు కూడానా?”

ఇద్దరూ సిగ్గుపడ్డారు. నవ్వుకున్నారు. ఏదో ఆర్డర్ చెప్పి తాగేసి మళ్ళీ ఇంటికి నడక మొదలుపెట్టారు. ఈసారి అతను తన ఇల్లిక్కడే రైటుకి తిరిగితే మూడో బిల్డింగ్ అని చెప్పకుండా వెంట తీసుకెళ్ళాడు.

ఇద్దరూ మళ్ళీ అవే కబుర్లు చెప్పుకుంటారు. జరగాల్సిందీ అలాగే జరిగిపోతుంది. కాసేపటికి మనమెందుకిలా కలవాలి? అని బాధపడతారు. తెల్లారిపోతుంది. ఆ అమ్మాయి లేచి తన ఇంటికి వెళ్ళిపోతుంది.

మీకేమనిపిస్తోంది? ఇదంతా కామమే కదా?

3.

ఇప్పుడు నేనేమీ మీ మాట వినను. ఇది కచ్చితంగా ప్రేమే. ఈసారి నెల తర్వాతే కలుద్దామని చెప్పింది తను. మొదటిసారి కలిసినట్టే తయారయ్యా. నెల రోజులుగా ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్నా. ఇది ప్రేమ కాక ఇంకేంటి?

అతను నాలుగంటే మూడింటికే బయల్దేరి ఆ కాఫీ షాపు దగ్గరికి చేరుకున్నాడు.

అదే కార్నర్ సీటు. ఆ అమ్మాయి అప్పటికే అక్కడ కూర్చొని ఎదురుచూస్తోంది. అతను దగ్గరికెళ్ళాడు. ఆమె కళ్ళలోకి చూశాడు.

“ఊర్నించి నేరుగా ఇక్కడికే వచ్చా, మళ్ళీ లేటయిపోవచ్చని”

అతనామె చేతిని తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు.

“ఇప్పుడొద్దు. ఏడుపులన్నీ రాత్రికే” అందామె నవ్వుతూ.

“ఎలా ఉన్నావు?”

“నువ్వడుగుతున్నావా ఈ మాట?”

అతను నవ్వాడు.

“చెప్పు, టిండర్లో కొత్త డేట్స్ ఏమైనా దొరికాయా?”

“నిన్ను కలిసిన రోజే అన్ఇన్‌స్టాల్ చేశా” అన్నాడతను.

ఈ అమ్మాయికెలా చెప్పాలి – నాకు తన మీద ప్రేమైందని. తనూ నన్ను ప్రేమిస్తోందా?

ఆ అమ్మాయి చిన్నగా నవ్వి – “ఏం చెప్పను?” అంది మెనూ చూస్తూ.

“నీకెలా చెప్పాలో తెలియడం లేదు”

“పర్లేదు, హాట్ చాక్లెట్కి నేనేమీ అనుకోను”

“అది కాదు”

“మరింకేంటి?”

“నేన్నిన్ను చాలా మిస్సయ్యా. ప్రతిరోజూ. చెప్పాలంటే ప్రతిక్షణం”

“ఇదే. ఇదంతా ఇప్పుడొద్దన్నానా?”

“సరే” అని ఊరుకున్నాడతను.

“ఒరెయ్ బాబూ.. ఇలారా. నన్ను ముద్దు చెయ్”

ఇలా అడిగిన తర్వాత నేనేం చేస్తాననుకుంటున్నారు? ఈ సగం తాగిన కాఫీని ఇక్కడే ఇలాగే వదిలేసి తన ఇంటికెళ్ళిపోయి తన దేహాన్నంతా ఆక్రమించేసుకొని..

ఛ! నేనేం చేస్తున్నా?

అతను ఆ అమ్మాయి నగ్నదేహమ్మీది పుట్టుమచ్చలేవో లెక్కబెడుతూ – “నేను నీకు ఏదైనా చెప్పాలనుకున్నా నీకది వినాలని లేదు కదా?” అన్నాడు.

“నీ మాటలు వినడానికి కాకపోతే నీకంటే ముందే పరిగెత్తుకుంటూ వచ్చి ఎందుకుంటాను చెప్పు? నీ ఒళ్ళో ఇలా వాలిపోయి నువ్వేవో కబుర్లు చెప్తావని ఎందుకు ఎదురుచూస్తుంటాను చెప్పు?”

అతను చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. దూరంగా ఎటువైపో చూస్తున్నాడు.

“సరే, ఇటు చూడు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. మనిద్దరి మధ్య ఉన్నదేంటి?” అనడిగింది ఆ అమ్మాయి.

ఇంత ఇష్టంగా కలుసుకుంటూ ఇంకా మనిద్దరి మధ్యన ఉన్నదేంటని అడుగుతోంది చూడండి ఈ అమ్మాయి!

“ప్రేమ”

“ప్రేమా ఇది?”

మరేంటి కామమని చెప్తుందా? ఇప్పుడు కూడా!

“నేన్నీతో కలిసి బతకాలనుకుంటున్నా – లైఫంతా”

“కలిసి బతకడానికి ఇది సరిపోదు”

“మరింకేం కావాలి?”

“తెలిస్తే నేనెందుకు ఇలా ఉంటాను?”

“అంటే నాతోనా?”

“బంగారూ.. నీతో కాదు. నేనెందుకిలా తయారవుతాను”

“అయితే నా మీద ప్రేమ లేదా?”

“ఇది ప్రేమో కాదో నాకు తెలీదంటున్నా”

“వదిలేసిపోతావా?”

ఆ అమ్మాయి నవ్వింది.

“ఇంకెవరైనా ఉన్నారా?”

నేను ఈ ప్రశ్న అడగకుండా ఉండాల్సింది కదా! ఛ!

“ఎందుకలా అనుకుంటావు?”

“సారీ..”

“ఇలారా..” అతడ్ని దగ్గరికి తీసుకొని ఒక ముద్దు పెట్టింది.

“ఈ ప్రేమల్ని నమ్మలేంరా. ఇది ప్రేమో కాదో తెలియనప్పుడు నేనింకేం చెప్పగలను?”

“నేను ఎదురుచూస్తాను”

“చూడొద్దు.”

అతను ఏదో గుర్తొచ్చినవాడల్లే లేచి ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు చిన్నప్పుడు జడరిబ్బన్లు వేసుకునేదానివా?” అనడిగాడు.

“జడ రిబ్బన్లా?” అనడిగిందామె అతడ్ని దగ్గరికి లాక్కొని మెడ చుట్టూ చేతులు వేసి.

“అవును”

“స్కూలుకి రోజూ వేసుకెళ్ళేదాన్ని. ఎందుకు?”

“ఆ ఫొటో ఏమైనా ఉందా?”

“వెతకాలి”

“ప్లీజ్”

ఆ అమ్మాయి తన ఫోన్లో దాచిపెట్టుకున్న పాత ఫోటోలన్నీ వెతికి తీసి చూపించింది.

“ఎంత బాగున్నావో కదా!”

ఆ అమ్మాయి సిగ్గుపడుతూ నవ్వింది.

“ఏదేమైనా బాల్యమే” అన్నాడతను.

“అంటే?”

“బాల్యమే జీవితం అనిపిస్తుంటుంది. ఆ తర్వాత ఊరికే బతికేస్తుంటామంతే”

ఆ అమ్మాయి అతని చేతిని దగ్గరికి తీసుకొని ఒక ముద్దుపెట్టింది.

నేను ఈ మాట అనకుండా ఉండాల్సింది కదా!

 

5.

ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై అప్పుడే ఐదు నెలలు గడిచిపోయాయి.

“ఇది ప్రేమే అయితే మనం పెళ్ళెందుకు చేసుకోకూడదు?” అనడిగాడతను.

“పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావురా”

పోనీ మీరైనా చెప్పండి! ప్రేమయ్యాక ఇంక మిగిలింది పెళ్ళే కదా!

“ఎవరితో మాట్లాడుతున్నావు?”

“నీతోనే. నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదా?”

“ఇప్పుడు అదంతా ఎందుకు? ఇద్దరం బాగున్నాం కదా?”

“అందుకే పెళ్ళి చేసుకుందామంటున్నా. ఇద్దరం కలిసి బతకొచ్చు”

“ఇప్పుడైనా నువ్వో నేనో మూవ్ ఇన్ అయితే కలిసే బతకొచ్చు”

“మరి పెళ్ళి?”

“ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది?”

ఏమవుతుంది అంటుంది చూడండి ఈ అమ్మాయి! తను నిజంగానే నన్ను ప్రేమిస్తోందా? మా ఇద్దరి మధ్యన ఉన్నదేంటి?

6.

“నిన్నిలా అల్లుకొని నీ పక్కన కూర్చొని నీకేవేవో కబుర్లు చెప్తూ, ఏమీ లేకపోతే నిన్ను ఊరికే ఇలా చూస్తూ బతికెయ్యొచ్చు” అందామె అతడ్ని గట్టిగా అల్లుకొని.

“ఐలవ్యూ” అని ఆమె చెంపల్ని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ, “నీకు ఆకలిగా ఉందా?” అనడిగాడతను.

“లేదు. ఏ?”

“నాకుంది. ఏదైనా వండిపెట్టనా?”

“ఓ. వండిపెడితే మాత్రం హాయిగా తింటా” అందామె నవ్వుతూ.

“అయితే చూస్తుండు” అని కిచెన్లోకి వెళ్ళిపోయి వంట మొదలుపెట్టాడతను. ఒక గంటసేపు చిన్నపాటి సర్కస్ చేసి అన్నం పప్పు ఆమ్లెట్ చేసుకొచ్చి ఆమె ముందు పెట్టాడు.

“ఈ అన్నం పప్పుకేనా సార్ మీరింత హంగామా చేసింది?”

“ఏం వండామన్నది కాదు మేడమ్, ఇదంతా మీకోసం చేశానన్నది గమనించాలి మీరు”

“బాగుంది”

“తిని చెప్పండి”

ఆమె అన్నం పప్పు కలుపుకొని ఒక ముద్ద తిని అతని వైపు కన్నార్పకుండా చూసింది. ఏంటన్నట్టు కనుబొమ్మలెగరేశాడతను.

“ఇంత బాగా వండితే కష్టమండీ”

అతనామె పెదాలకొక ముద్దు పెట్టి, “దీన్నెమంటారో తెలుసా?” అన్నాడు.

“ఏమంటారు?”

“అన్నం ముద్దు”

“పిచ్చి” అని నవ్విందామె.

“ఈ సాకు సరిపోతుందా మరి?”

“దేనికో”

“మేడమ్‌ని పెళ్ళికి అడగడానికి”

“రోజూ వండిపెడతానంటే..”

“పెడతా”

“బాగా చూస్కుంటావా నన్ను?”

“నిన్ను నేను, నన్ను నువ్వు. చూస్కుందాం”

“పెళ్ళయ్యాక అందరు మగాళ్ళలా మారిపోవు కదా?”

“అందరు మగాళ్ళంటే ఎవరు?”

“అమాయకుడిలా నటించకు. సరే, ఎప్పుడు చేసుకుందాం?”

“రేప్పొద్దున?”

“రేప్పొద్దున్నా?”

“ఆ! పెద్దమ్మ టెంపుల్‌కి వెళ్ళిపోయి చేసుకుందాం”

“మరి ఇంట్లోవాళ్ళకి?”

“ఫోన్ చేసి చెబ్దాం”

“ఫ్రెండ్స్‌కి?”

“డిన్నర్ పార్టీ ఇద్దాం”

ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని గట్టిగా నవ్వుకున్నారు.

“నీకొకటి చెప్పనా?”

“ఏంటి?”

“అసలు పెళ్ళంటే ఏ రకంగానూ ఇష్టం లేని నేను, నువ్వు నన్ను పెళ్ళికి ఇంకోసారి ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో”

“అప్పుడు నువ్వే అడగొచ్చుగా?”

ఆమె అతడ్ని దగ్గరికి లాక్కొని, “నేనడిగితే ఏమవుతుందంటే..” అంటూ అతడి ముఖమంతా ముద్దులుపెట్టసాగింది.

కాసేపటికి అతనూ ఆమె చేసినట్టే చేసి, “చెప్పవు కదూ..” అని నుదుటన ఒక ముద్దుపెట్టి చిన్నగా నవ్వాడు.

ఈ క్షణం మమ్మల్ని చూస్తే మీకేమనిపిస్తోంది?

 

7.

“ఈ ఆకాశమంతా పరుచుకున్న చుక్కల్ని చూస్తే నీకేమనిపిస్తుంది?” అతని ఒడిలో వాలిపోయి కళ్ళలోకి చూస్తూ అడిగిందామె.

“మనమెంత చిన్నవాళ్ళమో కదా అనిపిస్తుంది” అన్నాడతను.

“చిన్నవాళ్ళమంటే?”

“ఇన్ని వేల కోట్ల నక్షత్రాల్లో ఒక చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఒక చిన్న గ్రహమ్మీది జీవులం మనం. మనిద్దరం ఇలా కూర్చొని ఇంత విశాలమైన ఆకాశాన్ని చూస్తుంటే అసలు దేనికైనా అర్థముందా అనిపిస్తోంది”

“మనిద్దరి ప్రేమకి కూడానా?”

అతనామెని మరింత దగ్గరికి తీసుకొని, “మనం కలిసి బతకడానికి ఏం కావాలని?” అన్నాడు.

“నువ్వుంటే చాలు. మనకసలు పిల్లలు కూడా వద్దు. ఇద్దరమే కలిసి బతికేద్దాం” అందామె.

“నువ్వు వద్దంటే వద్దు”

“అలా ఎలా ఒప్పుకుంటావు? నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా?”

“పిల్లలంటే ఎవరికిష్టం ఉండదు?”

“మరి?”

“అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది – దిస్ వరల్డ్ ఈజ్ సో క్రూయల్ అని. పుట్టినదగ్గర్నించి అన్నింటికీ పరుగు. ఎంత దూరమని పరిగెడతాం చెప్పు! ఇంత దూరం వచ్చేశాక మిగిలిందేంటి? శూన్యం, ఒంటరితనం”

“నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు?” అతడి నుదుటిమీద ముద్దుపెడుతూ అందామె.

“సారీ! ఇలా అనిపించింది చెప్పా. ఎందుకు ఇలాంటి ప్రపంచంలోకి ఒక కొత్త జీవిని పట్టుకొచ్చి ఇన్నిన్ని సంవత్సరాలు ఒంటరిగా పోరాడమని కోరడం”

“ఇలారా. నా దగ్గర దాక్కో. నీకు నేనున్నారా బంగారూ..”

అతను చిన్నగా నవ్వాడు.

“అయితే అందుకేనా ఆరోజు ఆ మాటన్నావు?”

“ఏం మాట?”

“బాల్యమే జీవితమన్నావు కదా! ఆ తర్వాత ఊరికే బతికేస్తామంతేనని”

“నీకది గుర్తుందా?”

“పర్లేదు, నేనేమీ తప్పుగా తీసుకోలేదు”

“బాగుండేది కదా చిన్నతనమంతా. దేంతోనూ గొడవ లేదు. చిన్నచిన్నవి కూడా చెప్పలేనంత ఆనందాన్నిస్తాయి. ఎప్పుడేం జరిగినా అమ్మ దగ్గరికెళ్ళి దాక్కోవచ్చు. ఆ రోజులు ఎప్పటికీ రావు. అందుకు అనిపిస్తుంది బాల్యమొక్కటే జీవితమని”

“నీకొకటి తెలుసా – ఈ కాలమనేది ఒక భ్రమ. మనం ఇదే కాలాల్ని దాటుతూ ఇంత దూరం వచ్చేశాం అనుకుంటాం గానీ ఈ అనంత విశ్వంలో ప్రతిదీ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటుందంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద యూనివర్స్. మనిద్దరం కలవడం, కలిసి బతకడం, చనిపోవడం అన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. మనమింకా అక్కడికి చేరుకోలేదంతే. నువ్వు చెప్తుంటే నాకు నీ బాల్యాన్ని చూసి రావాలని ఉంది. నువ్వే అంటున్నావుగా అదే నీ జీవితమని. అక్కడా నీతో బతకాలి”

“ఎలా?”

“నీ బాల్యాన్నంతటినీ లెక్కలేనన్ని కబుర్లుగా చెప్పు, వింటూనే ఉంటా. నాకు నీదనుకున్న ప్రతిదీ కావాలి”

“ఇద్దరం పిల్లలమైపోదాం”

“అప్పుడింక మనకు పిల్లలతో పనేముంది?”

 

 

“నీకిది చెప్పడం మరిచిపోయా – చిన్నప్పుడు వారానికి రెండు రోజులు మా ఇంటివైపుకు కూరగాయల బండాయన వచ్చేవాడు” అతను ఈ మాట చెప్పడం మొదలుపెట్టగానే ఆమె అతనికి దగ్గరగా వచ్చి కూర్చుంది.

“అమ్మ కూరగాయలేవో కొంటుంటే నేను ఆమె కొంగుపట్టుకొని అటూ ఇటూ తిరుగుతుండేవాడ్ని. ఆయన కూరగాయలు జోకి కవర్లలో వేస్తుంటే, నేను చాటుగా ఉండి ఒక్కో టమాటానో, ఆలుగడ్డనో నా జేబులో వేసుకునేవాడ్ని”

“దొంగ”

“దొంగనే మరి! ఇంట్లోకొచ్చాక అమ్మకు ఆ దొంగతనం చేసిన కూరగాయలు ఇచ్చేవాడ్ని. ఒక పావుకిలో అయినా వచ్చుండవా! అమ్మ తిట్టేదనుకో. అలాగని నేను ఈ పని ఆపనూ లేదు”

“తప్పు కదా!”

“తప్పే అనుకో”

“ఇలాంటివి ఇంకెప్పుడూ చెయ్యకు, సరేనా?”

“అప్పుడెప్పుడో చేసిందిది”

“అయితే మాత్రం ఇప్పుడు బాధపడవా?”

“బాధపడి ఏం చేద్దామని?”

“ఏం చెయ్యలేకపోయినా కొన్నింటికి బాధపడాలి. మనం గతాన్ని తల్చుకునేది ఇందుకే కదా – ఇప్పుడేమీ మిగల్లేదని బాధపడటానికో, అప్పుడిది చేశానని పశ్చాత్తాప్పడటానికో”

“ఇలాగైతే ఒక విషయానికి మాత్రం నేనెప్పుడూ బాధపడుతుంటా”

“ఏంటది?”

“చిన్నప్పుడు మా ఇంటిదగ్గర ఒక బంకపండ్ల చెట్టు ఉండేది. నీకవి తెలుసో లేదో తియ్యగా ఇంతే ఉండేవి. మేం పిల్లలమంతా తెంపుకొని తినేవాళ్ళం. మాకు అందకపోతే రాళ్ళతో కొట్టేవాళ్ళం. ఒకసారి ఇలాగే నేను రాయితో కొడితే పండ్లగుత్తితో పాటు ఆ రాయి కూడా వెళ్ళి రోడ్డు పక్కకే ఉన్న కారు మీద పడింది. ఆ కారు అద్దం పగిలింది”

“ఆ తర్వాత?”

“తర్వాతేంటి అప్పటికప్పుడే అందరం పారిపోయి మంచాల కింద దాచుకున్నాం. నేను చీకటిపడేదాకా బయటికే రాలేదు. రాత్రిపూట వచ్చి చూస్తే ఆ కారు లేదు. హమ్మయ్యా అనుకున్నా. కానీ ఆ తర్వాతి రోజు తెలిసిందేంటంటే రాము అని నా ఫ్రెండొకడు దొరికితే వాడ్ని పాపం పిచ్చిపిచ్చిగా కొట్టారంట. నేనెళ్ళి సారీ చెప్తే, వాడు ‘పోనీలేరా’ అన్నాడంతే. చిన్నదో పెద్దదో తెలియదు గానీ ఇది గుర్తొచ్చినప్పుడల్లా నా వల్ల వాడు దెబ్బలు తిన్నందుకు బాధ కలుగుతుంది”

“ఇలారా” అని అతనికొక ముద్దు పెట్టిందామె.

“ఆ రాము ఇప్పుడు ఎక్కడున్నాడు?”

“తెలీదు. మేం ఆ కొన్నాళ్ళకే వేరే ఊరెళ్ళిపోయాం”

“వెతికిపడదామా? నీతో పాటు నేనూ వస్తా. ఊరికనే తనని కలిసి ఇదంతా గుర్తుచేద్దాం. అప్పుడైనా నువ్వు తేలికపడతావేమో”

“నీకివన్నీ చెప్పుకుంటుంటే నువ్వు లేకుండానే ఇంత కాలం బతికానా అనిపిస్తోంది”

“పిచ్చి”

అతను తన రెండు చేతులతో ఆమె ముఖాన్ని దగ్గరికి తీసుకొని చిన్నగా నవ్వాడు.

 

9.

“మనిద్దరికి ఒక పాపనో బాబో పుడితే ఎంత బాగుంటుంది!” పార్కులో ఆడుకుంటున్న పిల్లల్ని చూపిస్తూ అందామె.

“ఏం మాట్లాడుతున్నావు?”

“నిజంగానే నాకు పిల్లల్ని కనాలనుంది”

“నీకేమైంది బంగారూ..”

“చెప్తున్నానుగా?”

“అదే, ఇంత సడెన్‍గా ఏంటిది?”

“సడెన్‍గా అనేం లేదు. చాలా రోజుల్నించి ఆలోచిస్తున్నా. ఇంతకుముందు నేనే పిల్లలొద్దన్నాను. ఇప్పుడు కావాలనిపిస్తోంది. ఏం చెయ్యను?”

“నీకు నా మీద ప్రేమ తగ్గింది కదా?”

“నువ్వెప్పుడూ ఎందుకిలా మాట్లాడతావు?”

“మరేంటిది – ప్రేమ మీద నమ్మకం లేదంటావు, ప్రేమిస్తావు; పెళ్ళి అవసరం ఏముందంటూనే పెళ్ళి చేసుకుందామన్నావు; ఇప్పుడు పిల్లలు..”

“నేనడిగానా పెళ్ళి చేసుకుందామని? ఒక్కసారి గుర్తుచేసుకో”

“సరే, నేనే అడిగాను. నువ్వూ కోరుకున్నావుగా?”

“నువ్వడిగేవరకూ నేనామాట చెప్పానా?”

“ఇప్పుడేమంటావు?”

“నాకు నీతో కలిసి ఒక బిడ్డని కనాలని ఉంది.”

“పిల్లలొద్దు అని నువ్వన్నప్పుడు అది నీ చాయిస్. నేనూ ఒప్పుకున్నా. ఇప్పుడు కావాలన్నప్పుడు కూడా నేను ఒప్పుకోవాలి కదా?”

“ఒప్పుకోవచ్చుగా. బంగారూ.. ప్లీజ్. నీ మీద ప్రేమ తగ్గడమనేది జరగదు. జస్ట్ మనిద్దరికి ఒక పాపో బాబో ఉంటే వాళ్ళని చూసుకుంటూ బతికెయ్యొచ్చు” అందామె అతని చెయ్యి పట్టుకుంటూ.

అతను నవ్వి ఊరుకున్నాడు.

మీరే చెప్పండి! ఇప్పుడు నేనేం చేస్తాను?

 

10.

ఇప్పుడే వస్తానని చెప్పి బయటికెళ్ళినతను ఎంతసేపటికీ రాకపోవడంతో ఫోన్ చేసి చూసిందామె. రింగవుతోంది గానీ ఏ రెస్పాన్స్ లేదు. తన ఆఫీస్ పనులన్నీ పూర్తి చేసుకొని ల్యాప్‍టాప్ పక్కనపెట్టి అతనికోసం ఎదురుచూస్తోందామె.

అలాగే కొన్ని గంటలు గడిచిపోయాక మెల్లిగా ఇంటికొచ్చాడతను.

“ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావు?” అని గట్టిగా అరిచిందామె.

“నాకేం చెయ్యాలో తెలియట్లేదు”

“ఇప్పుడేమైందని?”

“ఇక్కడ బతకడం ఎంత కష్టమోనని మనమే అనుకుంటూ ఉంటాం కదా! ఒక కొత్త జీవిని ఈ ప్రపంచానికి పట్టుకొచ్చి ఈ బాధలన్నీ పడి, చదివి, ఉద్యోగం సంపాదించి, డబ్బులు సంపాదించి.. ఎందుకు బతుకుతున్నామో తెలియని బతుకు బతికి నిరంతరం దేనికోసమో పోరాడి..”

“ప్రపంచం ఎప్పుడూ అలాగే ఉంది బంగారూ. మనమే బతకడం ఎలాగో నేర్పించేద్దాం. మనిద్దరం మొదటిసారి కలిసిన రోజు గుర్తుందా? వి వర్ బ్రోకెన్ పీపుల్. అసలు మనం ఇంతదూరం వస్తామని ఆరోజు అనుకున్నామా?”

“లేదు”

“మరి? ప్రేమ అంతేనేమో. ఇప్పుడు చూడు.. నీతో పిల్లల్ని కనాలనే దాకా వచ్చా”

అతను చిన్నగా నవ్వి ఆమె పెదాల మీద ఒక ముద్దు పెట్టాడు. ఆమె పొట్ట మీద చెయ్యి పెట్టి, “ఈజ్ దిస్ మై బేబీ?” అన్నాడు.

“అప్పుడే?”

ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

“నువ్వు కూడా కావాలనుకుంటే!” అందామె అతని కళ్ళలోకి చూస్తూ.

మీకేమనిపిస్తోంది? ఇక్కడిదాకా వచ్చాక కూడా మిమ్మల్ని ఇలా అడగడానికి నాకు సిగ్గుండాలి. కదా?

ఇక్కడ –

“ఈ ప్రేమల్ని నమ్మలేంరా. ఇది ప్రేమో కాదో తెలియనప్పుడు నేనింకేం చెప్పగలను?”

“నేను ఎదురుచూస్తాను”

“చూడొద్దు.”

పోనీ ఇక్కడ –

“మరి పెళ్ళి?”

“ఇప్పుడు పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుంది?”

లేదంటే ఇక్కడ –

“అసలు పెళ్ళంటే ఏ రకంగానూ ఇష్టం లేని నేను, నువ్వు నన్ను పెళ్ళికి ఇంకోసారి ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎన్ని రోజులుగా ఎదురుచూస్తున్నానో”

“అప్పుడు నువ్వే అడగొచ్చుగా?”

ఆమె అతడ్ని దగ్గరికి లాక్కొని, “నేనడిగితే ఏమవుతుందంటే..” అంటూ అతడి ముఖమంతా ముద్దులుపెట్టసాగింది.

ఇక్కడే ఎక్కడో ఒక దగ్గర నేనిది ఆపేసి ఉండొచ్చు కదా?

“ఏది?” అందామె అతడ్ని అల్లుకొని కూర్చుంటూ.

*

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Another path breaking storytelling Mallikarjun. The fourth wall breaking technique is so wonderfully executed in the story. Love how you maintained the course and end of the story for the readers to guess while it still seems a linear story. Looking forward for more from you.

  • యువ రచయిత వి. మల్లికార్జున్ గారు ఆయనదైన శైలిలో ‘Breaking the fourth wall’ technique ని ఈ కథలో వాడిన విధానం నన్ను ఆకట్టుకుంది.

    ఇది వరకు దీన్ని సినిమాల్లో మాత్రమే చూసిన నాకు ఒక కథలో చదవడం ఇదే మొదటిసారి. సాధారణంగా shock factor కోసం ఒకటి రెండు సార్లకంటే ఎక్కువ వాడని ఈ technique ను, మల్లికార్జున్ గారు సునాయాసంగా సొంత పద్ధతిలో ఈ కథలో అనేక చోట్ల ఉపయోగించటం ప్రశంసనీయం.

    ఇక కథ విషయానికి వస్తే శ్రీ-రాహుల్ జంట పరిచయం అయిన వెంటనే నచ్చేసారు నాకు. అలా ఎందుకని ఆలోచించలేదు కూడా. కథ చదువుకుంటూ ముందుకి వెళ్ళిపోయాను.

    ఇక పాఠకులకు చివర్లో కొత్త ధోరణిలో open ending సూచించిన పద్ధతి కూడా చాలా బావుంది. More than anything, it is a testament to the author’s willing of not being afraid to take bold risks in storytelling.

  • Attention span 10 seconds ki padipoyina ee kaalam lo plot based kakunda, kevalam dialogue heavy conversation tho inni lines chadivinchav ante.. daniki karanam, crisp and no-nonsense dialogues matrame… Well done mitrama.

    Chapters perige koddi, dialogues length, topic’s intensity perigindi, matching to the emotional bond between the two.

    Baane rasav Bro.. All the best

  • ఈ కథ వర్తమానంలో బతికేవారి కొత్త నిర్వచనం, మే బీ రిఫ్లెక్షన్!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు