వ్యాప్తశక్రము

ఐదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఎవరూ ఎరిక్సన్‍తో మాట్లాడలేరు. ఏదో ఒక రకంగా చికాకు పెట్టేస్తాడు.  అంత అసాధ్యమైన శక్తి సామర్థ్యాలు కలవాడు.

తమిళం: ఎ. ముత్తులింగం 

శ్రీలంకకు చెందిన ప్రముఖ తమిళ రచయిత ఎ.ముత్తులింగం, 1937న యాళ్పాణంలో జన్మించారు. దాదాపు అరవై ఏళ్ళుగా తమిళం సాహిత్యంలో తన ఉనికిని చాటుకుంటున్న ఇతను, ఐక్యరాజ్యసమితి అధికారిగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత కెనడాలో స్థిరపడ్డారు. ఈయన రచనలకుగాను శ్రీలంక, భారత మరియు ఇతర దేశాల్లోని పలు తమిళ సాహితీ సంస్థలు పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి. ఈయన రాసిన కొన్ని కథలు తెలుగులోకి అనువాదమయ్యి “ఐదు కాళ్ళ మనిషి” అన్న పేరిట అందుబాటులో ఉన్నది.

*

ఎరిక్సన్‌ వున్నాడే, నన్ను చికాకు పెట్టడానికే పుట్టాడు. పూర్వ జన్మలో నేను చేసిన ఏదో ఒక పెద్ద పాపం వల్లే అతనితో ఈ జన్మలో ఇలా కలిసి పని చెయ్యాల్సిన ఉద్యోగంలో ఇరుక్కున్నట్టున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా అతనూ నా వెంటే తోకలా వచ్చి అతుక్కునేవాడు. 

అతను స్వీడన్ ప్రభుత్వం తరపున ఉద్యోగం చేస్తున్నాడు. మనిషి పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాడు. అతను ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినడానికి విచిత్రంగా ఉంటుంది. స్వీడిష్‍ భాషలో ఆలోచించి ఒక్కో మాటనూ ఇంగ్లీషులోకి అనువదించుకుని మాట్లాడుతాడు. కాబట్టి అతని ఇంగ్లీష్ చాలా పొడవుగా, అసలు విషయానికి రాకుండా చక్కర్లు తిరుగుతూ  సాగదీసినట్టు ఉంటుంది. ఏ విషయాన్నీ సూటిగా చెప్పడం అన్నది అతని జాతకంలోనే లేదు.

అతని వ్యవహారం ఉత్తర దిక్కయితే, నాది దక్షిణ దిక్కు. అతను నిప్పయితే, నేను మంచుని. అతను వాగుడు కాయ, నేను మితభాషిని. అతను ఎప్పుడూ కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు పరుగులు తీస్తూ ఉంటాడు. నేను అలా కాదు. అతనేమో కుళాయి తిప్పినట్టు ఆలోచనల్ని అలా వరసగా కుమ్మరించేస్తుంటాడు. నేను నింపాదిగా మాటలను ఆచి తూచి ఒక్క వాక్యం మాట్లాడటమే చాలా ఎక్కువ. ఇలా మేమిద్దరం వేరు వేరు ధ్రువాలకు చెందిన భిన్నమైన వ్యక్తులం. మమ్మల్నిద్దర్నీ దేవుడు ఎలాగో కలిపేసాడు. 

ఐదు నిమిషాలకంటే ఎక్కువసేపు ఎవరూ ఎరిక్సన్‍తో మాట్లాడలేరు. ఏదో ఒక రకంగా చికాకు పెట్టేస్తాడు.  అంత అసాధ్యమైన శక్తి సామర్థ్యాలు కలవాడు.

  * * *

మా ఇద్దరి ఉద్యోగాలూ పర్యావరణ సంరక్షణకి సంబంధించినవి. ఉద్యోగం కారణంగా మేము ఇలా తరచూ కలిసి పని చెయ్యాల్సి ఉంటుంది. ఆఫ్రికాలోని ఒక సముద్ర తీరాన ఉండే ఫైవ్ స్టార్ హోటల్‍లో ఇద్దరం విడిది చేసి ఉన్నాము.  ఒక ప్రత్యేకమైన సమావేశానికోసం మేము ఇక్కడికి ఆహ్వానించబడ్డాము. 

విషయం ఏమిటంటే స్వీడన్ దేశం 12 మిలియన్ డాలర్లను ఒక ఆనకట్ట నిర్మించడానికి కేటాయించాలి నిర్ణయించింది. ఈ ఆనకట్ట నిర్మిస్తే విద్యుత్ శక్తి ఉత్పత్తి పెరుగుతుందని, వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని దాని మూలంగా దేశం సుభిక్షం అవుతుంది అన్నదే వారి అంచనా.

అయితే పర్యావరణాన్ని పరిరక్షించే కొన్ని సంస్థలు ఈ ఆనకట్ట కడితే దాని మూలంగా ఎన్నో అనర్ధాలు రావచ్చు అని హెచ్చరించారు. వారి ఆదేశాల మేరకు మేము రంగంలోకి దిగి పరిశోధనలు నిర్వహించి 96 పేజీల నివేదికను తయారు చేశాం.

మరుసటి రోజు 9 మంది సభ్యులు గల కమిటీకి మా నివేదికను సమర్పించి ఆనకట్ట నిర్మాణం వల్ల రాబోయే సాధకబాధకాలను వివరంగా చెప్పి ఆనకట్ట  కట్టే కార్యక్రమాన్ని శాశ్వతంగా ఆపేయాలి. 

ఎరిక్సన్ నిప్పుల మీద నిలుచున్నట్టు చిందులేస్తున్నాడు. మా నివేదికను సమర్పించి ఎలాగైనా ఆనకట్ట నిర్మాణాన్ని ఆపు చేయించేయాలి అన్న ఉత్సాహం అతనిది. ఉత్సాహం ఒకటే ఉంటే సరిపోతుందా? అందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. 

మేము నివేదిక అందించాల్సిన కమిటీకి అధ్యక్షుడు ఒక విశ్రాంత జడ్జి. అనవసరమైన మాటలు ఆయనకు నచ్చవు.  అయితే, ‘సరి’ అనిపించినదాన్ని సూటిగా నిర్భయంగా చెప్పగల వ్యక్తి. మరో వ్యక్తి ఒక ఫాదర్.  ఆయనతో కూడా మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.

ఆ కమిటీలో మాకు ఉన్న ప్రధాన వ్యతిరేకి సాయత్. అతను చాలా పెద్ద ధనికుడు. ముప్పావు వంతు క్యాబినెట్ మంత్రులను చేతిలోనూ, మిగిలిన వాళ్ళను సంచుల్లోనూ పెట్టుకు తిరిగేవాడు. డబ్బు బలంతో ఆడంబరాన్ని, డంబాన్ని, దర్పాన్ని అలవర్చుకున్నవాడు. కమిటీలోని మిగిలిన ఆరుగురిని అతను కొనేశాడని పుకారు. ఈ ఆనకట్ట నిర్మాణం మంజూరైతే  దానికి సంబంధించిన అన్ని కాంట్రాక్ట్లూ ఇతను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పెట్టుబడి పెట్టిన కంపెనీలకే వస్తాయి. నిరాకరించబడితే అతనికి మిలియన్ల కొద్దీ నష్టం. 

మేము తయారు చేసిన ఆ నివేదికను ఎరిక్సన్ అతి శ్రద్ధతో మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. కొన్ని చోట్ల ఎర్ర గీతలు, కొన్ని చోట్ల పసుపు గీతలు కొన్ని చోట్ల నీలి గీతలు అని మువ్వన్నెల జండాలాగా గీసి పెట్టాడు. 

గదంతా సిగరెట్ పొగ, బీర్ సీసాలు, కట్టలు కట్టలుగా ఫైల్స్. పీకల దాకా బీరు,  పొగే కాదు, నా మీద కోపాన్ని కూడా నింపుకుని ఉన్నాడు. కారణం ఏమిటంటే మరుసటి రోజు నివేదిక సమర్పణ గురించిన హడావిడేమీ లేకుండా నేను హాయిగా న్యూస్ పేపర్ చదువుతూ ఉండడమే. 

ఎరిక్సన్‍కి గుడ్-నైట్ చెప్పి పడుకోడానికి ‌సన్నర్థం అయ్యాను. అతను “ఏంటి వైడి(YD) ఎనిమిదింటికి పడుకో బోతున్నావా? రేపు పొద్దున 9:00కి కదా మన సమావేశం? ఇంకా ఎన్నో రిఫరెన్స్ లు తయారు చేసుకోవాల్సి ఉంది కదా?” అని అన్నాడు. (వైద్యనాథన్ అని మా వాళ్ళు  పెట్టిన అందమైన పేరును ఇతను పలకడానికి అనువుగా ఉండాలని వైద్ది అని పిలుచుకోమని చెప్పాను. దాన్నీ కూడా పలకలేక మరింతగా కత్తిరించి YD అని పిలుస్తున్నాడు ఈ వెధవ).  

నేను “ఎరిక్సన్ రేపు ఉదయం 8:00 కి ఇక్కడ కలుసుకుందాం. మనం నివేదికను ఎలా సమర్పించాలి అన్న దాన్ని ఒక సారి అంతా సరిచూసుకుందాం. భయపడడానికి ఏమీ లేదు” అన్నాను. 

ఎరిక్సన్ కణ కణలాడే నిప్పులాగా రగిలిపోతున్నాడు “ఏడుమంది ఒక పక్షాన.  ఫాదర్ ఒకాయన్ను  మాత్రమే మనం నమ్మొచ్చు. మనకు కచ్చితంగా అపజయమే, సందేహమే లేదు. నువ్వు వెళ్లి ఆనందంగా శయనించు నాయనా” అన్నాడు తీవ్రమైన ఆవేశంతో. 

నేను ఇలాంటి అగ్నిపర్వతాలను ఎన్నింటిని చూడలేదు అనుకుంటూ గబగబా నడిచి నా గదికెళ్ళి పోయి హాయిగా నిద్రపోయాను.

 * * *

మరుసటి రోజు పొద్దున ఆరింటికే నా గది తలుపును దబ దబమని బాదాడు, ఎరిక్సన్. నేను ఎప్పటిలాగే ఆ సమయానికి స్నానాదులు, పూజా కార్యక్రమం ముగించి చివరిగా గాయత్రి జపిస్తున్నాను. అతను ఆపకుండా తలుపు తడుతూనే ఉన్నాడు.

నేను గాయత్రి ముగించి తలుపు తీశాను.  

ఎరిక్సన్ టిప్-టాప్‍గా రెడీ అయ్యి వచ్చాడు. మేము అల్పాహారం ముగించి ఒక్కసారి మా నివేదిక సమర్పణా విధానాన్ని  రిహార్సల్ చేసుకున్నాం. 

నేనన్నాను, “ఎరిక్సన్, ఇవాళ జరిగే సమావేశం మూడు గంటల కంటే ఎక్కువ  సాగకూడదు. కమిటీ అధ్యక్షుడు తన నిర్ణయాన్ని ఇవాళే ప్రభుత్వానికి  సమర్పించేయాలి. మన నివేదిక మీద ఇవాళ ప్రశ్నల శరపరంపర  కురిపించేస్తారు. అందునా నివేదిక మొదటి పేజీలోనే మూడు వివాదస్పద అంశాలు ఉండటంతో చాలా ప్రశ్నలే వస్తాయి. నువ్వు ఏమాత్రం నిరుత్సాహపడిపోకు. నువ్వు సంయమనం పాటిస్తూ నీ తెలివితేటలు అన్నిటిని ప్రదర్శించి సమాధానాన్ని పొడిగించి చెప్తూ కాలయాపన చెయ్యి. తొందరేమీ లేదు. నీ జవాబులు ముగిసే సమయానికి నేను లేచి అందుకుంటాను” 

“ఏం వైడీ? అంతేనా?” అన్నాడు. 

“ముమ్మాటికీ అంతే”

నెత్తిన చేతులు పెట్టుకొని తల వెనక్కి వాల్చి ఆకాశాని కేసి చూస్తూ దేవు‍డ్ని ప్రార్థించాడు  ఎరిక్సన్. 

  * * *

సమయం తొమ్మిది కావస్తుంది. ఎరిక్సన్ రెండు చేతుల్లోనూ కట్టలు కట్టలుగా పుస్తకాలు, నివేదికలు, ఫైళ్ళు తీసుకొచ్చి ప్రదర్శనకు పేర్చినట్టు టేబుల్‍మీద పేర్చాడు. నేను నాలుగే నాలుగు పేపర్లను ఒక ఫైల్‍లో పెట్టుకుని వచ్చాను. 

సాయత్ ఆర్బాటంగా గట్టిగా మాట్లాడుతూ లోపలికి దూరాడు. అతని వెంటే నలుగురు గబగబా వస్తున్నారు. సభాధ్యక్షుడు  లేచి నిల్చుని మరీ అతనికి గౌరవ మర్యాదలుట్టిపడేట్టుగా అభివాదం చేసాడు. మేము కూడా నమస్కరించాము.

అధ్యక్షుడి చిరు ప్రసంగానంతరం, ఎరిక్సన్ తన వాదనను ముందు ఉంచాడు.

మొట్టమొదటగా ఎరిక్సన్ “ఈ ఆనకట్టను నిర్మిస్తే 47 వేల ఏకరాలు నీటిలో మునిగిపోతాయి” అని తన నివేదికలో ఉన్న అంశాన్ని తెలియజేశాడు.

సాయత్ వెంటనే తన ప్రతికూల వాదనను తెలియజేసే విధంగా, “ఇదో పెద్ద పనికిమాలిన వాదన. 47 వేల ఎకరాలు అన్నది శుద్ధ తప్పు. అసలు దీనికి మీ దగ్గర సర్వే ఆధారాలు ఉన్నాయా”  అని అడిగారు. 

ఎరిక్సన్ తనదైన శైలిలో సూటిగా సమాధానం చెప్పకుండా పొడిగించుకు పోతున్నాడు. బూమరాంగ్ లాగా అతని వాదనలన్నీ మళ్ళీ మళ్ళీ, మొదలెట్టిన చోటికే వచ్చి పడుతున్నాయి.  అయినా అతను ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా  తన వాదనను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతలో సభలో ఉన్న ఇతర సభ్యులు తమకు తెలిసిన సమాధానాలు చెప్పడం మొదలుపెట్టగానే వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  ఇలా ఒక ముప్పావు గంట సమయం గడిచిపోయింది.

అప్పుడు నేను ఎరిక్సన్‍కు సైగ చేసి లేచి “పదిహేనేళ్ళ  క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ బృందంలో అధ్యక్షులు వారు కూడా ఒక సభ్యుడుగా ఉండేవారు. అప్పటి నివేదికలో 47 వేల ఎకరాలు అని ప్రస్తావించినట్టు చూశాను” అని చెప్పి ఎరిక్సన్ తెచ్చిన ఫైళ్ళను, పుస్తకాలనూ వెతికే నెపంతో చెల్లాచెదురుగా చేసేసి కొన్ని నిమిషాలు గడిపేసి “ఆహ్… ఇదిగో దాన్ని నకలు” అని నేను తీసుకెళ్లిన ఫైల్ నుండి ఒక కాగితాన్ని తీసి ఇచ్చాను. అధ్యక్షుడు దాని అందుకుని చూసి తల ఆడించి ఆమోదం పలికారు. 

సాయత్ ఆ కాగితాన్ని తీసుకుని పరిశీలనగా చూసి టేబుల్ మీద విసురుగా పెట్టేశాడు. ఇతరులు ఆ కాగితాన్ని అందుకుని పైకి కిందకి ఊపుతూ పరీక్షగా  చూస్తున్నారు. 

ఎరిక్సన్ మళ్లీ తన వాదాన్ని అందుకున్నాడు. అయితే మూడో నిమిషమే సాయత్ నుండి మరో ఆటంకం వచ్చింది. 

“116,000 మంది తమ నివాస స్థలాలు కోల్పోతారు అని అంటున్నారు కదా. మరి ప్రభుత్వం వారందరికీ కొత్త ఇళ్ళు కట్టిస్తామని చెప్తోంది కదా. ఇందులో మీకేంటి  ఇబ్బంది?” అని అడిగాడు. 

ఎరిక్సన్ దీనికి సమాధానం చెప్పసాగాడు. అనుకున్నట్టే ఈ జవాబు కూడా చేంతాడులాగా సాగుతూ ఉంది. అధ్యక్షులు నీళ్ళు తాగారు.  ఫాదర్ ఆవలించారు. సాయత్ ఇరువైపులా తలను ఊపుతూ ఉన్నాడు.

ఆ సమయంలో నేను కలగజేసుకుని “అధ్యక్షా, గౌరవనీయులైన మన ముఖ్యమంత్రివర్యులు, శ్రీ సాయత్‍గారు, తదితరులు, గత ఏడాది మే నెల 20వ తారీకున స్వీడన్  వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించుకున్నాము. ఆ ప్రాంతపు వాసులను అక్కడినుండి తరలించడం వల్ల కలిగే సామూహిక ఇబ్బందులు కొత్త ఇళ్ళు నిర్మించి ఇవ్వడంతో తీరేవి కావు. ఈ విషయాన్ని స్వీడన్ ప్రభుత్వం కూడా రాతపూర్వకంగా అంగీకరించింది”  అని చెప్పి ఆ లేఖయొక్క నకలుని ముందుంచాను. ఉత్సాహంగా అందరూ ఆ లేఖను పరిశీలనగా చదివారు.

ఇప్పుడు అధ్యక్షులవారికి ఎరిక్సన్ వాదన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇంతలో రెండు గంటల సమయం గడిచింది. మిగిలిన సమయంలో ఎరిక్సన్ చెప్పవలసిందంతా చక్కగా బల్ల గుద్దినట్టు చెప్పాడు. ఇప్పుడు ఎవరూ అతనికి ఎలాంటి ఆటంకాలూ కలిగించలేదు. 

ఎరిక్సన్ తన వాదనను ముగించాక అధ్యక్షులు ఇంకెవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నారా అని అడిగారు. 

నా దగ్గర మరో ఆయుధం ఉంది. ఇదే చివరిది. నేను “అధ్యక్షా, అందరూ అలసిపోయిన ఈ సమయంలో కాలయాపన చేయకుండా నేరుగా విషయానికి వస్తాను. ఏ పని మొదలుపెట్టినా అందులో మంచీ చెడులు రెండూ కలిసే ఉంటాయి. లాభాలు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పనిని పూర్తి చేయడానికి పూనుకుంటాము లేదంటే దాన్ని ఆపి వేయిస్తాం. 

ఈ ఆనకట్ట వల్ల మనకు అదనంగా విద్యుత్ ఉత్పత్తి, నీటిపారుదల సౌకర్యము, ఎన్నో వందల గ్రామాలకు తాగునీటి సదుపాయం కలుగుతుంది. అంతేకాకుండా తరచూ వచ్చే వరదల వల్ల కలిగే నష్టాలను కూడా అరికట్టవచ్చు.  ఇన్ని లాభాలు ఉన్నాయన్నది నిజమే. 

అయితే దీనివల్ల కలిగే నష్టాలేంటన్నది కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. 116,000 మంది వారి నివాసస్థలాల నుంచి వేరే చోటుకు తరలివెళ్ళడంవల్ల కలిగే సామూహిక నష్టాలు, అటవీ నిర్మూలనం,  జలచరాదుల, జంతువుల వలస ఆగిపోవడం, నదిలో నీటి ప్రవాహం తగ్గడం వల్ల నీటిలో ఒండ్రు మట్టి శాతం తగ్గి క్రమేణా నేల యొక్క సారం నశించి ఆశించినంత మేరకు వ్యవసాయ ఫలితాలు దక్కవు. ఇవన్నీ నష్టం కలిగించే పర్యవసానాలు. 

ఈ నివేదికలో 46వ పేజీలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం లాభాలు 370 పాయింట్లు అయితే నష్టాలు 520 పాయింట్లు ఉన్నాయి.

అయితే ఈ లెక్కల్లో మేము ఒక పెద్ద తప్పు చేశాను. ఈ ఆనకట్ట నిర్మాణం చేపట్టబోయే ఈ ప్రాంతంలో 16 రకాల ప్రత్యేకమైన జంతు జాతులు నివసిస్తున్నాయి. ఇవి ప్రపంచంలో మరి ఎక్కడా లేని జంతు జాతులు. ఈ ఆనకట్ట నిర్మించినట్టయితే ఈ జంతు జాతులు పుట్టుపూర్వోత్తరాలు లేకుండా నశించిపోతాయి.

ఈ జంతు జాతులకు పాయింట్‍లతో ఎలా లెక్క ఘటించాలి? అలా లెక్క ఘటించడం అన్నది మానవ సాధ్యమైన పనేనా?. 

దేవుడు ఈ జంతువులను సృష్టించాడు.  అవి ఎన్నో కోట్లాది సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాయి.  అయితే ఇకపైన అవి అక్కడ జీవించే సాధ్యాసాధ్యాలు దేవుడి చేతుల్లో కూడా లేదు. అది మన 9 మంది చేతుల్లో మాత్రమే ఉంది”  అని ముగించాను. 

సభలో మౌనం. సాయత్ మొఖం తెల్లబోయి దిగ్భ్రాంతి చెందిన వాడిలాగా మారింది. ఫాదర్ ముఖంలో చిరునవ్వు. 

అధ్యక్షులవారు ఐదు నిమిషాలు అనంతరం తన తీర్పును ఇచ్చారు. 

“స్థిరమైన వాదనల‌ను, తగిన ఆధారాలతోనూ పరిశీలించాక ఈ ఆనకట్ట నిర్మాణం మానవాళి అభివృద్ధికి యోగ్యమైనది కాదని తేటతెల్లమయింది. కాబట్టి దీన్ని విరమించుకోమని ప్రభుత్వానికి సూచనలు అందించడం మన బాధ్యతగా భావిస్తున్నాను.”

 * * *

 బయటికి రాగానే ఎరిక్సన్ నన్ను వాటేసుకుని అమాంతం పైకి ఎత్తేశాడు. 

“ఎలా చేసావు వైడీ? ఎలా చేసావు!”  అని ఆపకుండా ప్రశ్నల వర్షం కురిపించేశాడు. 

నేను “కచ్చియప్పర్‌కు ధన్యవాదాలు” (Thanks to Kacchiyappar) అని అన్నాను. 

“ఎవరా కచియాపార్” అని నసపెట్టసాగాడు. 

నేను తర్వాత నింపాదిగా చెప్తాను అని తప్పించుకున్నాను. 

ఆ రోజు సాయంత్రం మళ్ళీ నా గది తలుపు కొట్టాడు ఎరిక్సన్. నేను సంధ్య వార్చడం పూర్తిచేసుకుని తలుపు తెరవగానే నన్ను బలవంతంగా చేయి పట్టుకుని తన గదికి తీసుకెళ్ళాడు. 

సోఫాలో చతికిల పడ్డాడు.  నన్ను కూర్చోమన్నాడు. 

రూమ్ సర్వీసుకు ఫోన్ చేసి బీర్లు ఆర్డర్ చేశాడు. రూమ్ సర్వీసునుండి ఒక అమ్మాయి అడుగులో అడుగులేసుకుంటూ బీర్లు తెచ్చి పెట్టింది. గదంతా కలియజూసుకుంటూ వెళ్ళిపోయింది. ఎరిక్సన్ కళ్ళు ఆమెను అనుసరించి కొంచం దూరం వెళ్ళి వెనుతిరిగాయి. 

బీర్ ఒంపుకుని చప్పరిస్తూ ఆస్వాదించాడు. నన్ను చూసి ”ఎవరా కాచపా, ఇప్పుడు చెప్పు” అన్నాడు. వాడి ఆసక్తి బీరు నురుగలా పొంగుతోంది. 

నేను “కాచపా కాదు, కచ్చియప్పర్. ఇది నీకు అర్థం కాదు. ఇది మా ఆచారవిచారాలు, మా మత సంబంధమైన  సిద్ధాంతాలు తెలిసినవారు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. కాబట్టి నేను నీకు చెప్పినా అర్థం కాదు. సమయం వృధా. వదిలేయ్” అన్నాను. 

ఎరిక్సన్ “ఏ విషయమైనా చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే అర్థమవుతుంది. చెప్పేవాడు సమర్థవంతుడైతే వినేవాడు అర్థం చేసుకోగలడు. నువ్వు చెప్పాల్సినదంతా చెప్పు. నేను ఎంత అర్థం అయితే అంత అర్థం చేసుకుంటాను.” అని సవాలు చేస్తున్నట్టు పట్టుబట్టాడు. 

కాలు మీద కాలేసుకుని, బీర్ తాగుతూ స్కంద పురాణం పుట్టుపూర్వోత్తరాలు వినడానికి సన్నద్ధమైన మొట్టమొదటి మనిషి వీడే అయుంటాడు అని నేను మనసులో అనుకుంటూ చెప్పసాగాను. 

“కచ్చియప్పర్ అనే ఒక భక్తుడు స్కందపురాణం అనే మహా కావ్యాన్ని తమిళంలో రచించాడు. దాన్ని మొదటిసారి పండితుల మధ్య అరంగేట్రం చేసినప్పుడు, లక్ష పద్యాలు ఉన్న ఆ కావ్యంలో మొదటి పద్యంలో మొదటి పంక్తిలో మొదటి సమాసంతోనే చిక్కు వచ్చి పడింది. నిజానికి చాలా పెద్ద చిక్కే అని చెప్పాలి. అయితే కచ్చియప్పర్ దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదాంట్లోనే ఉంది కిటుకు. వీళ్ళు ఇలా లక్షపద్యాలలోనూ తప్పులను పట్టుకోవడంమీదే దృష్టిపెడితే కావ్య పఠనం సంపూర్ణం కాదని పసిగట్టి, ఆ మొదటి ప్రశ్నకే బలమైన సమాధానం ఇస్తే గాని మళ్ళీ మళ్ళీ ప్రశ్నలు రావు అనుకున్నాడు. ‘దేవుడినే తప్పు పట్టేంతటి ఘనులా మీరు? నేను నిమిత్త మాత్రుణ్ణి. ఈ కావ్యాన్ని నా చేత రాయించింది సాక్షాత్తు ఆ కుమారస్వామి’ అని చెప్పి సభలో ఉన్న వారికి కచ్చియప్పర్‌ మీద విశ్వాసం కలిగేలా చేసుకున్నాడు(The credibility is established).” 

ఆ తర్వాత కచ్చియప్పర్ మిగిలిన పద్యాలు అన్నిటిని ఎలాంటి అడ్డు ఆపు లేకుండా చదివి వినిపించి భావం చెప్పి విజయవంతంగా కావ్య అరంగేట్రం పూర్తి చేశాడు. 

నా అభిప్రాయం ఏంటంటే  అలాంటి క్లిష్టమైన ఒక మాటను కచ్చియప్పర్ కావాలని మొదటి పద్యంలో పెట్టాడు అన్నది.  లేదంటే లక్ష పద్యాలున్న కావ్యంలో మొదటి పద్యంలో మొదటి పంక్తిలోనే ఇలాంటి క్లిష్టమైన సమాసంతో ఎవరైనా మొదలుపెడతారా?”

“వైడీ, ఇది వినడానికి ఆసక్తిగా ఉంది. ఏంటి ఆ మాటలో ఉన్న సమస్య? వివరంగా చెప్పు” అన్నాడు ఎరిక్సన్. 

తొండనాడులో ప్రసిద్ధి కాంచిన కంచి మహానగరంలో కాళహస్తియప్ప అనే శివాచార్యులకు జన్మించిన పుత్రుడు కచ్చియప్పర్. కచ్చియప్పర్ తన ఐదవ ఏటే విద్యాభ్యాసం మొదలు పెట్టి తమిళం మరియు సంస్కృత భాషలను  అధ్యయనం చేశాడు. 

ఒకరోజు స్కందకోట సుబ్రమణ్యస్వామి ఇతని కలలో  ప్రత్యక్షమై ”భక్తుడా, నువ్వు నా చరితమును స్కందపురాణం అన్న పేరుతో తమిళ భాషలో మహాకావ్యంగా రూపుదిద్దుము. కావ్యానికి మొదటి పంక్తిని ‘వ్యాప్తశక్రముల్గలవాని జ్యేష్ఠజుఁడు మయూర వాహనపువాని యగ్రజుఁడు కరిముఖుని గొలిచి’ ఈ పంక్తితో మొదలు పెట్టు” అని చెప్పి అదృశ్యమయ్యాడు. 

ఆ విధంగానే స్కంద పురాణాన్ని రోజుకు వంద పద్యాలు చొప్పున రచించి కావ్యాన్ని సుసంపూర్ణం చేశారు కచ్చియప్పర్. 

ఈ కావ్యాన్ని పండితుల సభలో ప్రవేశపెట్టి అరంగేట్రం చేయడానికి తమిళ కవి పుంగవులకు, వేదవేదాంగ పండితులకు, ‘దేవార తిరువాచక’ పఠన శిరోమణులకు, ఇతర పెద్దలకు తాళపత్ర ఆహ్వానం పంపించి సభకు ఏర్పాటు చేశాడు. 

ఆ శుభదినాన స్కందకోట సుబ్రమణ్యస్వామి ఆలయంలోని సభా మధ్యమున తాను రచించిన స్కందపురాణ మహాకావ్యంలోని తొలిపద్యాన్ని  అందుకున్నాడు. 

‘వ్యాప్తశక్రముల్గలవాని జ్యేష్ఠజుఁడు మయూర వాహనపువాని యగ్రజుఁడు కరిముఖుని గొలిచి’ అని చదివి, వ్యాప్త+దశ+కరములు కలిగియున్న శివుడి జ్యేష్ఠ కుమారుడు, నెమలి వాహనంమీద తిరిగే కుమారస్వామికి అగ్రజుడూ అయిన ఏనుగు ముఖము గలవాడిని కొలిచి’ అంటూ తాత్పర్యార్థం చెప్పసాగాడు. 

అప్పుడు ఆ సభలో ఉన్న ఒక వృద్ధ పండితుడు లేచి “ఆపు, ఆపు… వ్యాప్త+దశ+కరము అన్న పదాలను కలిపితే వ్యాప్తశక్రము అన్న సమాసం ఎలా వస్తుందీ?. అసలు సంధి ఎలా కుదురుతుందీ? ఆదిగాగల తొల్కాప్పియం మొదలుకొని నేటిదాక ఉన్న ఏ వ్యాకరణ గ్రంథంలోనూ తమిళభాషలో ఇలాంటి సంధి సమంజసమని చెప్పలేదే. ఈ వ్యాకరణ సూత్రం ఎక్కడుందీ? ఇలాంటి ఒక సంధి అసంభవం” అని అన్నా‍డు. 

కచ్చియప్పర్, దిగ్బ్రాంతి చెంది “ఇది స్వయంగా కుమారస్వామి వారే అందించిన పంక్తి కదా దీనికి కూడా వ్యాకరణ సూత్రాలు ఉంటాయా?”  అని అడిగాడు. 

అప్పుడా ఆ వృద్ధ పండితు‍‍డు చిరునవ్వు నవ్వి “నీకు ఆ తొలి పంక్తి అందించిన కుమారస్వామే స్వయంగా వచ్చి నేనే అది అందించాను అని చెప్తే అప్పుడు అంగీకరిస్తాం. అలా లేనిచో మరి ఏదైనా వ్యాకరణ సూత్రం ఆధారంగా చూపించినా ఒప్పుకుంటాము లేదంటే కావ్యాంగీకార ప్రవేశం చేయడానికి వీలు లేదు” అని అన్నా‍డు. 

అప్పుడు అక్కడ ఉన్న పండితవర్గం రెండు జట్లుగా విడిపోయి ఎవరికి తోచిన దాన్ని వారు సమర్థించుకుంటూ వివాదంలోకి దిగారు. ఆ రోజులో ముప్పావు వంతు గడిచిపోయింది. అప్పుడు కచ్చియప్పర్ “దీనికి పరిష్కారం రేపు తెలుస్తుంది”  అని చెప్పి సభను ముగించాడు కచ్చియప్పర్. 

కచ్చియప్పర్ సుబ్రహ్మణ్యస్వామి దగ్గరికి వెళ్లి “తండ్రీ, నేను నీ ఆదేశం మేరకే కదా స్కందపురాణం రచన మొదలుపెట్టాను? నువ్వు అందించిన పంక్తికే వంకలు పెడుతున్నారే? ఎందుకు ఇలా జరిగింది? ఇది నీకు న్యాయమా?”  అని మొరపెట్టుకున్నాడు. 

ఆ రాత్రి కుమారస్వామి అతని కలలో ప్రత్యక్షమై ”కచ్చియప్పా, భయపడకు. చోళ దేశంనుండి ఒక యువ పండితుడు రేపు వస్తాడు. అతని వల్ల సభలోని సభ్యులందరి సందేహమూ నివృత్తి అవుతుంది” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

మరుసటి రోజు సభ ఏర్పాటయింది. అప్పుడు చోళ దేశంనుండి వచ్చిన ఒక యువ పండితుడు సభ ముందుకు వచ్చి ‘వీరచోళియం’ అన్న వ్యాకరణ గ్రంథంలోని ఒక  పద్యాన్ని చూపించి వ్యాప్త దశ కరము అన్న మాటలు కలిపినప్పుడు ‘వ్యాప్తశక్రము’ వలె మారుతుంది అని నిరూపించాడు. ముందు రోజు ఆక్షేపించిన పండితులు ఆ గ్రంథం అందుకుని చదివి చూసి అంతా సరిగానే వుంది అని అంగీకరించారు. 

అనంతరం కావ్య ప్రవేశాంగీకార పఠనం పునఃప్రారంభమయింది. సభలోని పండితులకు కచ్చియప్పర్ మీద  గౌరవ మర్యాదలు భక్తి భావనలు పెరిగిపోయాయి. 

అక్కడి నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా కచ్చియప్పర్ స్కందపురాణాన్ని అర్ధతాత్పర్యాలతో వివరించి సంపూర్ణం చేశా‍డు.

 * * *

ఎరిక్సన్ కథనంతా ఆస్వాదిస్తూ ఎంతో శ్రద్ధగా విన్నాడు.  పడి పడి నవ్వాడు. “మీ కచ్చియప్పర్ చాలా గొప్పోడే. మనం ఇకనుండి దీన్ని  ‘కచ్చియప్పర్ ఎత్తుగడ’(The kacchiyappar’s strategy) అని పిలుచుకుందాం” అని అన్నాడు. 

నేను నవ్వుతూ “సరే”నన్నాను. 

“ఏయ్! వైడీ, ఆస్ట్రేలియాలో జరిగే సమావేశానికి నువ్వూ వస్తున్నావు కదా? అక్కడ కూడా ఇదే ఎత్తుగడని ప్రయోగిద్దాం. అందరూ ఆశ్చర్యపోతారు” అని అన్నా‍‍డు.

“ఒక ఎత్తుగడని ఒక్కసారి ప్రయోగించవచ్చు, లేదా రెండోసారి కూడా సమయోచితంగా ప్రయోగించవచ్చు. మూడోసారికి శత్రువు అప్రమత్తుడౌతాడు. ప్రతిసారీ అవసరాలనుబట్టి కొత్త ఎత్తు గడలను తయారు చేసుకోవలసిందే. స్కందపురాణం కాకుంటే దాని అబ్బలాంటిది శివ పురాణంనుండి తీసుకోవడమే. ఏదో ఒక ఎత్తుగడ దొరక్క పోతుందా?” అని అన్నాను. 

“అదీ నిజమే” అన్నాడు ఎరిక్సన్. 

* * *

‘తికటచక్కరం’ అన్న అరవ కథకు అనువాదం ఇది – ఈ కథ తికటచక్కరం(1995) అన్న కథా సంపుటంలోనిది.  

అవినేని భాస్కర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు