‘స్మైల్’ ఒక చెరిగిపోని చిరునవ్వు!

ఎందుకో జీవితాన్ని తలుచుకున్నప్పుడల్లా ఖాళీ సీసాలు గుర్తుకు వస్తాయి.ఖాళీ సీసాలను చూసినప్పుడల్లా స్మైల్ గుర్తుకు వస్తాడు.

అర్థ స్వప్నాలు, అర్థ సత్యాలు
చుట్టుకు గడిచిపోతాయి వ్యర్థంగా జీవితాలు

ఎంత బాగా చెప్పాడు స్మైల్! ఏ  స్వప్నమూ పూర్తిగా ఫలించదు. ఏ సత్యమూ పూర్తి సత్యం కాదు.

ఇప్పుడు ఇక్కడ లేడు. ఎప్పుడో పోయాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం హైదరాబాద్ లో కలిశాము. కుతుబ్ షాహీ సమాధుల్లో తిరిగాము. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. 80వ దశకంలో స్మైల్ లాంటి ఉన్నత వ్యక్తులను కలుసుకున్న అనుభవం నాది. స్మైల్  ఎన్నో ఫోటోలు తీశాడు. అతడు  కవి, నాటక రచయిత, కథకుడే కాదు, మంచి ఫోటోగ్రాఫర్ కూడా! అతడి కవిత్వమూ,కథలూ చదివితే దృశ్యాలు మన ముందు నడుస్తున్నట్లనిపిస్తుంది.

ఇంధ్ర ధనుస్సు వేళ్ల చివర రెపరెపమన్నట్లుండేది తూనీగ తోకపట్టుకున్నప్పుడు …

మేఘాలు మొహాలు చూసుకునే పచ్చటి చెరువు…

ఇలా ఎవరు రాయగలరు.. స్నైల్ లా!

తెలుగు సాహిత్యంలో ఒక తుఫానులా వచ్చి, అంతే తుఫానులా నిష్క్రమించిన స్మైల్ ఒక విభిన్నమైన కవి. అతడి సమకాలికులకంటే భిన్నం. ఇప్పటి కవులకంటే ఇంకెంతో భిన్నం. ఎవరితోనూ పోల్చలేం.

కాని అతడికి కాలంతో సమానంగా, కాలానికి అతీతంగా నడవడం తెలుసు. అతడిని చాలా మంది మరిచిపోయి ఉంటారు. కాని కాలం అతడిని మరిచిపోదు..
గాలి గాయపడుతుందని ఆకు రాలదు
నేల నొచ్చుకుంటుందని మొక్క మొలవదు;
అలా అనుకుంటాం
అయినా ఏదీ ఆగదు

ఆ మూలన ఒకడు
మృత్యు నైశిత్యపు వులితో శిలలు చెక్కుతుంటాడు
నచ్చీ నచ్చక వీర్యాండపు బండలమీద పగలగొట్టి
మళ్ళా మళ్ళా చెక్కడం మొదలెడ్తాడు
విషాద గీతాలాలపిస్తాడు

విదూషకుడు వినోదానికి
గెంతులేస్తూ
వంకర టింకర పాటొకటి పాడ్తుంటాడు
యుగాలుగా యిదే ఎడతెగని ధారంటాడు.
దొర్కింది తినండి తాగండి
సుఖంగా నిద్ర పొండంటాడు

అసలు ఎవడికి వాడే అంతవరకూ
స్వీయ శవవాహకుడంటాడు.

ఒకడు

కంట ఆశా నక్షత్రం మెరుస్తాడు
చేతిలో చలచ్ఛలన జీవన కేతనంతో
కాదిది కాదిదంటూ
కేకై నింగికి లేచి మోగుతాడు

మరొకడు అతని కంఠనాళానికి గాలం వేసి
నేలకి లాగుతుంటాడు.

ప్రపంచపు అనేకానేక వికృత రణగొణ ధ్వనులు ముంచెత్తుతున్నా
ఒక కేక ఒక సజీవ గీతమై సంగీతమై
సుసందేశమై సుభిన్న ఆలోచనై
నా
మనసు మెదడుల గట్లను కోసుకు లోపలికెళుతుంది.

ఓ పువ్వు పూస్తుంది
జీవితం సంపన్నమౌతుంది
అర్ధవంతమై సాగుతుంది

ఆ ఒఖడి వల్లే!

అవును ఏదీ ఆగదు. అసలు ప్రపంచమంతా నిత్య ప్రసవ వేదన. ఒక మృత్యు మహోత్సవం. స్వీయ శవవాహకుల నేల ఇది. అయినా  స్నైల్ స్వప్నించినట్లు కేకై నింగికి లేచి మోగుతాడు ఒకడు.

ఆ ఒఖడు స్మైల్ !

త్రిపురనేని శ్రీనివాస్ సాల్వడార్ డాలీ చిత్రంతో స్మైల్ ‘ఒఖడే’ కవితల చిరుసంకలనం తెచ్చేంతవరకూ అతడు తన కవితల్ని అచ్చువేసుకోలేదు.

భారతి పత్రికలో స్మైల్ రాసిన ‘వల’ అనే కథ  లో కొన్ని దశాబ్దాల క్రితమే  ప్రచురించినప్పటికీ వివాహ వ్యవస్థపై లేవనెత్తిన ప్రశ్నలద్వారా  ఆయన సృష్టించిన ప్రకంపనలు ఇప్పటికీ ఆగిపోలేదు.  ఖాళీ సీసాలు, సముద్రం,సిగరెట్, పృథ్వి వంటి కథలూ జీవితంలో నిత్య దరిద్రాన్నీ, మన వ్యవస్థ దౌర్భాగ్యాన్నీ, మనుషుల జీవన్మరణ పోరాటాన్నీ, స్త్రీ స్వేచ్చా పిపాసను  చిత్రిస్తాయి.

విశాఖపట్నం కెజీహెచ్‌ ఆసుపత్రి ముందు  ఖాళీ సీసాలు అమ్ముకునే  మహిళల దుర్భర జీవనాన్ని తన కథా వస్తువుగా ఎంచుకుని రాసిన కథ కథకుడి మనసు వాక్యాల్లో ప్రవహిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఉస్మానియా అయినా కెజి హెచ్ అయినా ఏ ఆసుపత్రైనా ఒకటే కదా! ఈ రోగిష్టి ప్రపంచంలో పేదరికం అన్నిటికన్నా పెద్ద రోగం. ప్రాణం కోసం కొట్టమిట్టాడుతున్న జీవులను చిత్రిస్తూ స్మైల్  ఖాళీసీసాలకే ప్రాణం పోశారు

స్మైల్ అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. స్మైల్  అసలు సిసలైన, అచ్చమైన తెలుగు రచయిత.

కరుగుతున్న కాలాన్ని చిత్రించిన సాల్వడార్ డాలీ మీద స్మైల్ రాసిన కవిత్వం ఒక దృశ్య కావ్యం.

జ్ఞాపకం వస్తావు డాలీ,

గడియారం కరిగి ప్రవహిస్తూ..

– అని ప్రారంభించి

ఓ తుమ్మ ముల్లు శూన్యంలోకి
కలుక్కున దిగబడినట్టు
నిటారుగా నిలుస్తుంది.
ఓ కన్నీటి చుక్క
దుఃఖపు పావురమై
అశాంత గీతాలు ఆలపిస్తూంటుంది

అని ఒక బాధా చిత్రాన్ని లిఖిస్తాడు.

నువ్వూ నాకు నీలానే
అర్ధం అయీ అవవు
జీవితం లాగే
శాశ్వతంగా జీవితం లాగే
శాశ్వతం లాగే

అని తాత్విక చింతనలోకి వెళిపోతాడు.

స్మైల్ కు ప్రతి ఏడాదీ ఒక కొత్త సముద్రం.

ఆవిడ కౌగిల్నీ పిల్లల నవ్వుల పూరేకుల్నీ
సిగరెట్లనీ, విస్కీ సీసాల్నీ, పేకముక్కల్నీ
రహస్య సుఖాల జిలుగు దారిలో
మంచి కవిత్వాల కాయితాలనీ
స్నేహితుల ఆప్యాయపు వేళ్ళ కొసల్నీ
అభాగ్యుల జాలి చూపుల చూరు చివర్లనీ
పట్టుకుని మూడొందల అరవై అయిదు కల్లోల సముద్రాల్ని
ఈదాలి మళ్ళా
నేను

అని కొత్త సముద్రంలోకి మననూ ఈదమని పంపిస్తాడు..

చడీ చప్పుడు లేకుండా కింద పడిపోయేది అక్కయ్య జడలోంచి రాలిన కనకాంబరం మల్లెలు, రెండోక్లాసు నుంచి మూడోక్లాసుకి ఎగిరినప్పట్లా దుమ్ములో చిలుంపట్టిన బేడ బిళ్ళ , తూనీగలు పట్టుకుని చంపే పిల్లవాడి క్రౌర్యం  స్మైల్ కవితల్లో మనకు తచ్చాడుతాయి

 

రమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు –

వూరికినే గది చుట్టూ చూస్తా
నా బూతులు మా మూలుగులు
అర్థం పర్థం లేని మా మాటలు
గోడ మీద ఆ రెండు బల్లుల్లా
అంటుకుపోయి అలా అలా కదుల్తున్నట్టు –
నవ్వొస్తుంది.
సీలింగ్ ఫ్యాన్ స్టీల్ కంట్లో
నా అర్ధ నగ్న శరీరం మసగ్గా గిరగిరా –

ఆవిడ
గోడవైపుకు తిరిగి చీర కట్టుకుంటూ –
ఛాతికే తప్ప
వీపుకేం సిగ్గుండదేమో వీళ్ళకి
నవ్వొస్తుంది.

ప్రేమించేసుకున్నాం కదా
ప్రపంచం కావాలిప్పుడు

యుగయుగాలుగా గాలికి తెరిచే వుంచినట్టు
గది తలుపుల్ని కాస్త దోరగా తోసి
కిటికీల్ని బార్లా తీసి
ఆకాశాన్ని వెలుగు వాసనల్నీ గదిలోకి
ఆహ్వానించి
తల దువ్వుకుంటోందావిడ –
అద్దంలోంచి అలవోగ్గా చూస్తూ.

ముసిముసి నవ్వుల్లో తేలుతున్న
లంగరేసిన పడవే ఆవిడ

తల దువ్వుకుంటోంది
ఏం జరగనట్టు
అసలేం జరగనట్టు
సెలవుల మధ్యాహ్నపు ఆటల్లో పిల్లల
అల్లరి యేం విన్పించనట్టు
అసలేం జరగనట్టు

ఈ కవితను చదివిన వారెవరైనా తమ ఒక మధ్యాహ్నపు అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని పెదాలపై దరహాసం లిఖించుకోకుండా ఉంటారా?

రెప్పలు మూయని కళ్ళు వెయ్యి చావులు శపించాయో.
హాయి హాయిగా వున్న గాలికి, పల్చ పల్చగా వున్న ధూళికి, పచ్చపచ్చగా వున్న చెట్లకి, వెచ్చవెచ్చగా వున్న ఎండకి, దూరంగా హోరు హోరుగా వున్న సముద్రానికి, పైడి మీద బోర్లించిన మూకుడు సమాధి ఆకాశానికి తెలిసి వుండాలి”.

అని రాసిన స్మైల్ కవితా వాక్యాలు అతడి ఒక కథకు ముగింపు!

‘స్మైల్ ది  ముస్లిం అభివ్యక్తీకరణ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన రచనలు, ఆలోచనా విధానం మొత్తం  సమాజంలో ఇమిడిపోయాయి. ఆయన కథలు, కవితలు చదివితే ఒక రావిశాస్త్రి లాగా, ఒక బీనాదేవి లాగా సమాజాన్ని లోతుగా అధ్యయనం చేసినట్లు అనిపిస్తాయి. ఇస్మాయిల్ , వజీర్ రహ్మాన్, కౌముది, దేవీ ప్రియ, దిలావర్ వీరందరినీ కేవలం ముస్లిం కవులు అని ఎవరని అంటారు?   ఆ తర్వాత కూడా ఎందరో ముస్లిం తెలుగు కవులు ప్రతిభావంతంగా రాశారు కాని స్మైల్ తరం కవులు వేరు!  వారిలో ఒక్కొక్కరికీ ఒకో విశిష్టమైన శైలి.

అయితే రాను రానూ సమాజం సంక్లిష్టమవుతూ, మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్న తరుణంలో కవులు ఒక వైఖరి తీసుకోవాల్సి వచ్చింది. తమ అస్తిత్వానికే ఎదురవుతున్న సవాళ్లను ప్రశ్నించాల్సి వచ్చింది.

అందుకే  స్మైల్ చెప్పాల్సిన సమయంలో తాను చెప్పకుండా ఉండలేకపోయారు. ఒక అస్తిత్వ హననాన్ని సహించలేకపోయారు. ‘కౌన్ సునే ఫర్యాద్? కౌన్ కరే ఇన్సాఫ్?’ అని అజా( అనే గుజరాత్ ముస్లిం కవిత్వ సంపుటికి స్మైల్ రాసిన ముందుమాట చదివితే ఆయన ఒక ప్రపంచ మానవుడుగా జరుగుతున్న వాటిని ప్రశ్నిస్తున్నట్లనిపిస్తుంది. సల్మాన్ రష్డీ మతాన్ని రెచ్చగొడుతూ రాయడం ఎంత తప్పో, అతడిని చంపేందుకు ఫత్వాను జారీ చేయడం కూడా అంతే తప్పు అని నిర్ద్వంద్వంగా చెప్పిన స్మైల్ మతాన్నివ్యక్తిగత విశ్వాసంలా ఉండనివ్వమన్నాడు!

అర్థ సత్యాలు, అర్థ స్వప్నాల ప్రపంచంలో చుట్టూ ఖాళీ సీసాల మధ్య విహరిస్తున్న నాకు  స్మైల్ ఆదర్శం!

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు