రెంట్ హౌస్

    “ఆ మూట అక్కడ పెట్టకు కిటికీ పక్కన. వానొస్తే యిబ్బంది. తడిచిపోతాయి. యిదిగో యీ మూలపెట్టు. బెటర్. వింటున్నావా? నిన్నే. యెందుకా యియర్ఫోన్స్ యెప్పుడూ అట్లా చెవులకు అంటిపెట్టుకుని. వేలాడుతూ. నువ్ మారవ్”

“కాల్, సొంగ్స్ యేం కాదులే. జస్ట్ అట్లా వుండిపోయాయ్”

“యేంటో నువ్వు”

“యేంటసలు నీ బాధ. చేస్తున్న కదా చెప్పింది. యెందుకట్లా విసుగుతో మాట్లాడ్డం. వుండాలి కొంచెం ఐనా”

“చేసే పనులన్నీ యిట్లా యేదీ పట్టింపు లేనట్టు. పైనుంచి యీ కోపం. నన్ను అనడం కాదు యెట్లా బిహేవ్ చెయ్యాలో నేర్చుకో ముందు”

“యూ బిచ్. నన్నే అంటావా” అని తన గొంతు అట్లా గట్టిగా నలుపుతూ వుంటే “దయా.. దయాకర్. ద..యా..కర్” అంటూ నన్ను మంచం మీద నుండి తోస్తే తల నెలకు కొట్టుకుని లేచి కూర్చుని.

మంచం మీద వనజ. తను అట్లా సగం నగ్నంగా వుండి భయం భయంగా నన్ను చూస్తూ. క్రూర జంతువుని చూసినట్టు. ఛా. యీ కలలు.

నేనట్లా మోకాళ్ళ మీద కూర్చుని యేడుస్తూ వుంటే తనొచ్చి నన్ను దగ్గర్కి తీస్కుని. చల్లగా వున్న మార్బుల్స్ మీద యెడ్చీయెడ్చీ నిద్రపోయీ.

*

పొద్దున. బాల్కనీలో నుండి చల్లని గాలి. కొంచెం కొంచెం చలికాలపు యెండ మొదలయ్యింది రావడం. యెక్కడి నుండో పావురం యింకా యేవో పేరు తెలియని పక్షుల అరుపులు. మనసేమీ పోవడం లేదు వాటి మీదకి. రాత్రి కల వొక్కటే యింకా మెదడులో. మర్చిపోలేని సంఘటనలాగా కల యింకా గుర్తొస్తా వుంది.

వరుసగా యిది మూడో కల యీ నెలలో. మొదటిది సముద్రంలోకి చిమ్మచీకట్లో వెళ్తున్న కల అది. దాని గురించి నేను అంతగా దిగులు పడలేదు కానీ నిద్ర లేచాక వొక అంధకారం యేర్పడింది నా చుట్టూ. కానీ రెండో కల నన్ను వెంటాడే కల.

అట్లా నడుస్తూ మట్టిరోడ్డు మీద. యెవరూ లేని ఆ దారి. యింకా కొంచెం ముందుకు వెళ్తే రెండు పక్కలా చెట్లు ప్రత్యక్షం అయ్యాయి. పచ్చగా కాకుండా రంగురంగుల చెట్లు. నడుస్తూ వున్నాను. చాలా దూరం నడుస్తూ ఆయాసం లేకుండా వొక్క మనిషి లేకుండా ముందుకు వెళ్తా వున్నాను. మట్టిరోడ్డు ఆగిపోయింది. యెదురుగా పెద్ద కొండ నల్లగా పెద్ద నీడ అట్లా ముందు నిలబడ్డట్టు. కొండ యెక్కసాగాను యెవరో ఆజ్ఞాపించినట్టు కిందకు చూడకుండా. కొండ పైకి అంచుకు చేరుకున్నాను. చుట్టూ అసలేం లేదు. శూన్యం. దూరంగా అసలు చూస్తే నేను నడికి వొచ్చిన దారి కూడా లేదు వింతగా. మాయ చేసి దాన్ని యెవరో కనబడకుండా చేసినట్టు. అక్కడ అంతా నది యెండిపోయి నీటి చారల గుర్తులు మాత్రం కనబడ్డాయి. పైకి వొకసారి చూసి కళ్లు మూసుకున్నాను. వెనక నుండి యెవరో తోసేసినట్టు కిందకు దూకేసాను. యిళ్లంతా పగిలిపోయే అరుపు కల నుండి మెళుకువలోకి వొచ్చి.

వనజ నా మెడనంతా చుట్టుకుని ఆపుతూ “యేమీ కాలేదు నీకు కల అంతా కల, బయపడకు” అంటూ నన్ను గట్టిగా పట్టుకుంది. తనని అట్లా చూస్తూ తన వొళ్లోనే నిద్రలోకి వెళ్లిపోయాను.

వనజ రెండు కాఫీ మగ్స్ తీస్కుని వొచ్చి పక్క కూర్చుని “యెక్కువ ఆలోచించకు. కంగారు పడకు. యిదిగో కాఫీ” అంది.

తీస్కున్నాను. ఆగు అని హాల్లోకి వెళ్ళి సిగరెట్ హాష్ ట్రే తో వొచ్చింది. అంటించి కాఫీ సిప్ చేసాను.

“గిరి కాల్ చేసాడు యిందాకా. వూర్లో యేదో గొడవ అన్నాడు. చిన్నదే. నీతో మాట్లాడాలీ అంటే మళ్ళీ చెయ్యమని చెప్పాను” అంది వనజ కాఫీ సిప్ చేస్తూ లేచి సగం తెరిచి వున్న బాల్కనీ కిటికీలు మొత్తం తెరుస్తూ.

గాలి యింకా యెక్కువ రాసాగింది. యెండ కూడా కొద్దికొద్దిగా పెరగసాగింది. యిందాకా వున్న పక్షుల అరుపులు లేవు అంతగా.

“టిఫిన్ అయ్యాక మాట్లాడుతా గిరితో” అన్నాను.

ఓకే అన్నట్టు చూసి చిన్న స్మైల్ యిచ్చింది వనజ.

లేచాను. వనజను హగ్ చేస్కుని “లవ్ యూ” అన్నాను.

“సరే సరే పద లేట్ ఔతుంది ఆఫీసుకి. ఫ్రెష్ అప్ ఐ రా. నీకు యిష్టమైన దోశా రెడీ చేస్తా” అని హాల్లోకి వెళ్లిపోయింది.

*

ఆఫీస్. ఇన్ టైమ్. ఔట్ టైమ్. ఫైల్స్. సిగ్నేచర్స్. లంచ్ తరువాత బయట టీ షాప్ దగ్గర ఆఫీఫ్లో వాడ్నీ వీడ్నీ సొంత భాషలో అమ్మనా బూతులు తిట్టి మళ్ళీ ఆఫీస్లో అడుగు పెట్టి పోష్ యింగ్లీశ్లో చక్కగా అసలేం తెలియని అమాయకుల్లా యీ మనుషులు. కార్పొరేట్ అఫ్ఫైర్స్. శనివారపు సెక్స్ నైట్. ఆదివారపు రాత్రి వీడ్కోలు.

యెవరిలో కలవని నన్నువింతగా చూసే యీ జనాల నుండి యేటన్న దూరంగా పారిపోతే బాగుండు అనిపిస్తుంది.

గిరి కాల్ పొద్దున ‘విషయం విని నువ్ యెక్కువ కంగారు పడకురా. చిన్న మామ నిన్ను చూడాలి అంటున్నారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది ఆయనది. సో దయాకర్ని చూడాలి రమ్మనండి. లేదా నేనే సిటి వెళ్ళి చూస్తా అని పట్టుమీద వున్నారు. యెప్పుడు వొస్తావ్ అని చెప్పామంటావ్’ అని.

బాధ. కూర్చున్నా కానీ స్పృహ తప్పినట్టు అనిపించింది. అసలేం జరుగుతోంది నాతో. నాకే యెందుకు. “సాయంత్రం యింటికి వెళ్ళి కాల్ చేస్తా” అని కట్ చేశాను.

సాయంత్రం  అయ్యింది. బేగంపేట్ రోడ్ ట్రాఫిక్లో యిరుక్కుపోవడం అలవాటు అయ్యింది. రేడియో కూడా. అన్నీ ఆడ్స్. అది కొనండి యిది కొనండి అని. చిన్న పిల్లలు అడుక్కుంటూ, డోర్ గ్లాస్ ని అట్లా టకటకా కొడ్తూ దీనంగా. అవతలి రోడ్ మీద నడిచే జనాల కాళ్లమీద పడుతూ ఇంకో చిన్న పిల్లల సమూహం.

కార్ పార్క్ చేసి లిఫ్ట్ ధగ్గర నిలబడి చూస్తే దూరంగా వాచ్మన్ కూతురు బొగ్గుతో సిమెంట్ నెల మీద యేదో వింత బొమ్మ గీస్తూ నన్ను చూసి నవ్వింది. ఆమాయకపు నవ్వు. ఫ్లోర్ బటెన్ నొక్కి మళ్ళీ చూశాను తనని. నన్ను చూసి “లిఫ్ట్ ఖరాబ్ ఐన్ది సార్” అంది.

“ఓహ్ ఔనా…” మళ్ళీ మెట్లవైపు నడుస్తూ వెనక్కి తిరిగి “నీ పేరు?” అనడిగాను. చెప్పలేదు. చిన్నగా నవ్వి యింట్లోకి పరిగెత్తింది. నేను మెట్లెక్కాను.

తలుపు తెరిచే వుంది. పవర్ పోయినట్టుంది. తలుపు నుండి సాయంత్రం యెండ సోఫా మీద పడుకున్న వనజ మీద. బంగారు రంగు వనజ సోఫాలో నిధ్ర. తనని నిద్ర లేపడం వొద్దు యేం కలలు సృష్టించుకుందో ఆ దయగల కనుల్లో. డ్రెస్ చేంజ్ చేస్కుని ఫ్రెష్ ఐ వొచ్చి చూస్తే యింకా కలలుకంటూ వుందనుకుంటా… నాకెందుకు రావు యిట్లా కలలు. ప్రశాంతమైన కలలు. గొప్ప అనుభూతి యిచ్చే కలలు. నన్ను నేను ధ్వంసం చేస్కునే కలలే అన్నీ. నన్ను నేను కోల్పోవడం జరిగేవే అన్నీ. వొంటరి అంతం.

పవర్ వొచ్చి ఫాన్స్ స్టార్ట్ అయ్యింది సడన్గా. టక్కున లేచింది వనజా. నన్ను చూసి కొంగుతో నుదుటి చెమటలు తుడుచుకుని “టీవీ చూస్తూ అట్లా నిద్ర… పవర్ యెప్పుడు పోయిందో తెల్యకుండా?” అనీ యింకేదో చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే దగ్గరగా వెళ్ళీ తన నుడిటిమీద కిస్ చేసి హగ్ చేస్కుని అట్లా గట్టిగా హద్దుకుని.

డోర్ బెల్ చప్పుడు.

కొరియర్. బరువుగా వున్న చిన్న గొదుమరంగు బాక్స్. యేమై వుంటుంది.

యీ కలలవల్ల చాలా భయాలు అంతే.

***

దూరంగా కిచెన్ నుండి “చాయ్ పెడుతున్నా. ఆ రాయడం ఆపితే కొంచెం మాట్లాడాలి” అని నా భార్య మహిమ.

యిప్పుడేం టెండర్ వేస్తుందో. రాస్తున పేపర్స్ పక్కకు పెట్టి “ షుగర్ కొంచెం తక్కువెయ్…” అన్నాను.

చాయ్ పట్టుకొనొచ్చి నా పక్కనే చాపమీద కూర్చుంటూ అన్నది “పక్కిళ్లు రెంట్ కి వుందంట. సింగల్ బెడ్ రూమ్. చాలా బాగుంటుంది. ఆరువేలే. తీస్కుందామా?” అని.

“ఊ…” అన్నాను.

“ఊ యెంటి? సరే అను. కుట్టీకి యేడేళ్లు నిండుతై. యింకా యెన్ని రోజులుందాం యీ చిన్న యిరుకు గదిలో? యిల్లు తీస్కుందాం. పోతే మళ్ళీ దొరకడం కష్టం అంతా తక్కువలో”

“సరే. దీపావళికి బోనసొస్తే అడ్వాన్స్ కట్టేద్దాం”

“అమ్మయ్యా… పొయ్ వాళ్ళకు చెప్పేస్తా దీపావళికి దిగిపోతామ్ అని”

“వెంటనే పొయ్ చెప్పేయ్. నేను కథ రాస్కోవాలి. మంచి మూడ్ లో కథ రాస్తుంటే చెడగొట్టినవ్ పెద్ద సీరియస్ మ్యాటర్ ఐనట్టు”

“యేం రాతలో యేమో. నెలకు రెంట్ పైసల్ కూడా రానిరాతలో యెందుకు రాస్తవో యేమో…” అని వెళ్లిపోయింది మహిమ.

 

నేను పేపర్ప్యాడ్ తీస్కుని మళ్ళీ కథ రాయడం మొదలుపెట్టాను.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం

విజయ్ కుమార్ ఎస్వీకే

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిద్రలేవగానే పరుపు కింద వెతుక్కుంటే చాకలెట్లు లేవు. బహుశా నేను కలలో ఆ చాకలేట్లు తీసుకున్ననా. ఏమో. మళ్లీ మళ్లీ వెతికాను. అనేక చోట్ల వెతికాను. దొరకలేదు. అది కలలో తీసుకొన్న విషయం అని బలవంతంగా నేర్చుకోవాలి.
    పసి ప్రాయం ఎంత అమాయకమైనదో రచయితల అంతరంగమూ అంతే. పేదరికం మన వాస్తవికత. రచయితలు మర్చిపోయినంతగా ఎవరూ ఈ విషయాన్ని మరిచిపోలేరు. అది వాళ్ళ ఔన్నత్యం, వైకల్యం కూడా.
    ఇటువంటి హృదయాన్ని ఒక చిన్న కథలో ఆవిష్కరించాలి అన్న ఆలోచనే వింతైనది.ఈ మధ్య ఇలాంటి సారూప్యత గల అంశాలు కార్టూన్లుగా కూడా చాలా తక్కువే. చిన్న కథలో చదవడం బాగుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు