మనలో ఉండే ఒంటరి ఆత్మల ఘోష

రచయిత్రి స్వతహాగా కవయిత్రి కావటంతో కథలు వచన కవిత్వంలా సంబంధిత ప్రపంచ సారాన్ని, మనిషిని అంటి పెట్టుకున్న దుఃఖాన్ని, సందేహాలను, సందిగ్థాలను ప్రశ్నిస్తూ, తిప్పి తిప్పి చూపిస్తూ సాగిపోతుంటాయి.

స్వాతి కుమారి “అరసున్నా” కథల పుస్తకం “ఒక పబ్లికేషన్స్” నుంచి ఈ ఏడాది విడుదలయ్యింది. గత పదమూడు ఏళ్ళ నుంచి రాసిన పదహైదు కథలు ఈ అరసున్నా కథా సంపుటిలో ఉన్నాయి. నాకు స్వాతి తన కవిత్వం ద్వారా పరిచయం. మళ్ళీ ఇప్పుడు తన కథలు చదవడం గొప్ప అనుభూతి. 2012 లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన తన “వాంఙ్మూలం” కథ చాలా రోజులు నన్ను వెంటాడింది. అనేక ప్రశంసలు కూడా అందుకుంది ఆ కథ .
                     మనలో ఉండే ఒంటరి ఆత్మల ఘోషను తన తాత్విక అక్షరాల ప్రవాహంలో తడుపుతారు రచయిత్రి. ఈ పుస్తకంలోని కథలన్నిటితో మనం మమేకమవుతాము. మన సొంత లేక చూసిన అనుభవాలు, వెలితి, దిగులు, సుఖం, దుఃఖం, వాటి గురించిన చింతన అలా సాగుతూ ఉంటుంది. ఆటవిక మనిషి కోరుకునే ఒంటరితనం, దేనికో అర్థం కాని భయం, ఒకరితో ఉండటం, ఒకచోట ఉండటం అర్థం కాని విషయాలుగా అవస్థ పడటం, పెనుగులాట కనిపిస్తుంది. పిల్లల పట్ల, ముసిలివాళ్ళ పట్ల, పిచ్చోళ్ళ పట్ల, ప్రకృతి పట్ల, బతికున్న వేదనాభరిత ఆత్మల పట్ల అనంతమైన జాలి కనిపిస్తుంది ఈ కథల్లో. ఏమి కావాలో తెలియనితనం, క్షణ క్షణం మారుతున్న మనుషులను, వారి ప్రవర్తనలను, కంపు కొట్టే వారి ‘ఈగో’లను ప్రశ్నిస్తూ, తడుతూనే ఉంటుంది రచయిత్రి . పచ్చినిజాలు అలా చదువుతుంటే సినిమా బతుకులు, సినిమా డైలాగుల నుంచి బయట పడి కొత్త భాష, భాషకు అసలైన నిర్వచనం విన్న రిలీఫ్ వస్తుంది.
                  ప్రేమల భిన్న పార్శ్యాలు, దాని చుట్టూ మనుషులు ఆడే ఆటలు కనిపిస్తాయి ఈ కథల్లో. మనవంతుగా కథను కొనసాగించటమో లేదా ముగింపునివ్వటమో చేయమని కూడా అడుగుతాయి ఆ కథలు. ‘వాఙ్మూలం’ , ‘అరసున్నా’ ‘జీవనసంధ్య’, ‘ఇక్కడేఉన్నందుకు’, ‘చెరువు-చింతచెట్టు’ లాంటి ఎన్నో కథలు చింతనతో అలరింప చేస్తాయి. స్వాతి కథల్లోని పెద్దరికం నెత్తినేసుకుని, అనుభవాలతో తాత్విక ప్రశ్నలు వేసుకుంటూ, జవాబులు ఇచ్చుకుంటూ సాగిపోయే పాత్రలు కొన్నైతే, ఇప్పుడే జీవితం చూస్తూ నలిగిపోయే స్త్రీ పురుష పాత్రలు మరి కొన్ని . రచయిత్రి స్వతహాగా కవయిత్రి కావటంతో కథలు వచన కవిత్వంలా సంబంధిత ప్రపంచ సారాన్ని, మనిషిని అంటి పెట్టుకున్న దుఃఖాన్ని, సందేహాలను, సందిగ్థాలను ప్రశ్నిస్తూ, తిప్పి తిప్పి చూపిస్తూ సాగిపోతుంటాయి.
                       ఆమె వాక్యాలను ఇక్కడ ముందే పెడితే పాఠకులు మొదటిసారి చదివే అనుభవాన్ని మిస్ అవుతారని పెట్టటం లేదు . ఎప్పుడైనా కాస్త సాంత్వన కోసమో , అనుమాన నివృత్తి కోసమో మనకి నచ్చిన పుస్తకాన్ని తిరగేస్తాము. ఎన్నిసార్లైనా చదివే పుస్తకాలవి. అలాంటి పుస్తకాలలో స్వాతి “అరసున్నా” కూడా చేర్చవచ్చు. చివరగా స్వాతి తన ముందుమాటలో రాసుకున్న కొన్ని వాక్యాలతో ముగిస్తాను .
                       “కాలం గడుస్తున్న కొద్దీ జీవితానికి అర్థం తెలిసినట్టే ఉన్నా పూర్తిగా ఎరుకలోకి రాదు. ప్రేమ దక్కినట్టే ఉన్నా మనసు నిండేంత తృప్తి కలగదు. నొప్పి మానిపోయినట్టు ఉన్నా ఏ మూలనో భాధ కాస్త సలుపుతూనే ఉంటుంది. ఈ కథలన్నీ వెలుగుతూ ఆరుతూ ఉండే మిణుగురుల్లా అసంపూర్ణతలోనే సత్యాన్ని వెతుక్కుంటాయి . అందుకని ఈ పుస్తకానికి ‘అరసున్నా’ అనే పేరు నప్పుతుంది”
*

కిరణ్ కుమారి, బి.

2 comments

Leave a Reply to Ushajyothi Bandham Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు