ప్రేమ చూపులు

‘తాత వైపు కి కాళ్ళు జాపకురా. బుద్దిలేదు?’  నిద్ర లో శవం వైపు కాళ్ళు జాపి కూర్చున్న పిల్లాడికి మందలింపు.

‘చిన్నపిల్లాణ్ణి కూర్చోబెట్టడం మనతప్పు.  లోపలికి పోయి పడుకోరా. పెద్దవాళ్ళం మేమున్నాంగా’   చిన్నపిల్లాణ్ణి లోపలికి పంపేసింది జయ.  కజిన్ వైపు తిరిగి

‘నువ్వూ పడుకో అక్కా కాసేపు నీ కొడుకు పక్కనే.  నే కూర్చుంటాలే. సమయానికి పరిగెట్టుకుంటూ వచ్చావు, అది చాలు’. ’ అని పిల్లాడి తల్లిని కూడా పంపేసింది.

రెండే శరీరాలు మిగిలాయి ఆ గదిలో.   జయ తండ్రిది, జయది.  ఒక దాంట్లో పూర్తి ప్రాణం పోయింది, రెండో దాంట్లో సగం ఆ శవంచుట్టూ తిరుగుతోంది.

ఎవరూ లేరని చూసి తండ్రి శవం వైపు కాళ్ళు జాచి కూర్చుంది నేలమీద.  స్కూలు కెళ్ళే చిన్నపిల్లగా ఉన్నప్పుడు కావాలని పొగరుగా తండ్రి ఒళ్ళో కాలు పెట్టి  తంతూ కూర్చోవడం గుర్తొచ్చింది. తండ్రి ఒక్కోసారి పుస్తకంలోంచి తలెత్త కుండా  ప్రేమగా తన కాలు పిసగడం కూడా.

‘ఒంటరిగా ఎంతకాలం ఎందుకుంటావే అంటూనే ఉన్నావు నాన్నా.  ఇప్పుడేకదా నేను ఒంటరిని అయింది ’ అనుకుంది.

స్నేహితులూ, కొంతమంది బంధువులూ మాత్రమే వస్తారు పొద్దున్నే. ఈలోపు  ఆఫీసు మెయిల్ చెక్ చేసి ఓ వారం అందుబాటులో ఉండనని అందరికీ చెప్పాలి అనుకుంది లాపటాప్ బాగ్ దగ్గరికి లాక్కుంటూ. కనీసం ఓ ఇరవై మెయిళ్ళయినా పంపాలి అని లెక్కేసుకుంది.

పావుగంటలో అన్ని మెయిళ్ళూ పంపేసింది.

వెనక్కి జారగిల పడి ఓ చిన్న కునుకులాంటిది తీసింది.  కలత నిద్రలో గుర్తొచ్చింది, తండ్రిఫోన్ లో  ఆయన స్నెహితులు ఉంటారనీ వాళ్ళకి కూడా చెప్పాలనీ.  దూరంగా చార్జింగ్ లో పెట్టిఉన్న తండ్రి ఫొన్ కనపడింది.  తెచ్చుకుని ఓ సారి తండ్రి పాస్ కోడ్  గుర్తుతెచ్చుకుని ఓపెన్ చేసింది.   అన్ని పేర్లూ చూసి ఫోన్ చెయ్యాల్సిన నంబర్లు పేపర్ మీద రాసుకుంది, పొద్దున ఎవర్తో నన్నా వీళ్ళందరికీ చేయించాలి అనుకుంది.

అప్పుడు గమనించింది, వాట్సాపు, ఫేస్బుక్కుల్లో   బోలెడు నోటిఫికేషన్లు ఇంకా చూడనివి.  మనం పోయినా మన ప్రొఫైల్స్ అలాగే ఉండిపోతాయా ? బహుశా ప్రపంచంలో అతిపెద్ద స్మశానం ఫేస్బుక్కే అయుంటుంది! ఆలో చిస్తూ ఫేస్బుక్ ఓపెన్ చేసింది.  అసలెప్పుడూ తండ్రి ఫేస్బుక్ ఎకౌంట్ వాడిన గుర్తేలేదు తనకి.  ఇన్ని మెస్సేజిలేంటి?

జయకి అర్థం కాలేదు.

‘గీతా ఉన్నావా?  రెస్పాన్స్ ఇవ్వవేమిటి?’ మెసెంజర్ లో నాలుగు కొత్త మెసేజిలు. స్క్రోల్ చేస్తూ పోతే రోజూ మాట్లాడుతున్నట్టు తోస్తోంది.   గీత ఎవరో అర్థం కాలేదు.  ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ లో ఏదో పెయింటింగ్ ఉంది. ఎందుకు తండ్రి ఈ గీత ఎకౌంట్ లో లాగిన్ అయ్యాడు? అంతా అయోమయంగా ఉంది తనకి.  కొంచెం ముందుకీ వెనక్కీ స్క్రోల్ చేసి చూసింది మెస్సేజెస్ ఏవున్నాయా అని.

‘ఢిల్లీలో దిగిన హోటల్ ‘ అని రాసి ఒక ఫొటో.

‘మీ ఫోటో చూపించరు కదా’ అని కామెంట్ ఎవరో రమేష్

‘మన ఫొటోలెస్ ప్రొఫైల్ పాలసీ మర్చిపోకండి ‘ గీత

ఆ ముచ్చట్ల కన్నా ఆ ఫొటో మీద జయ చూపు ఆగిపోయింది.  ఆ హోటల్ తను ఢిల్లీలో క్రితం నెల దిగిన హోటల్.

తాను తన తండ్రికి వాట్సాప్ లో పంపిన ఫొటో ఇక్కడ ఈ గీత ఎవరో దిగినట్టుగా పోస్ట్!

ఆ సస్పెన్స్ వీడటానికి ఎక్కువసేపు పట్టలేదు జయకి.  ఈ గీత చేశానని చెప్తున్న పన్లన్నీ తను చేసినవీ, చేస్తున్నవీ.  ఎక్కడా మనిషిఫోటోలేదు. ఈ గీత అనేపేరుతో తన ప్రొఫైల్ ని తండ్రి నడిపిస్తున్నాడని అర్థమయింది.

ఎందుకిలా ?

తలెత్తి తండ్రి శవం వైపు చూసింది.

“ఏంటి నాన్నా ఇది. ఒక్కళ్ళుంటేనే ఏకాకి. మన్నిదరం కలిసి ఒంటరితనాన్ని అనుభవించాం. ఇందులో కూడా నీకు రహస్యాలా?” అని పైకే అంది, సన్నగా గొణుగుతూ. అప్పటిదాకా మొండిగా యాంత్రికంగా అన్ని పన్లూ చేసుకుంటూ వచ్చిన ఆమెకి ఒక్కసారిగా దుఃఖం  పొంగుకొచ్చింది. ఒంటరిగా ఉందేమో హాయిగా ఏడ్చేసింది, ఓ చెయ్యి తండ్రి తలమీద పెట్టి. ‘నాట్ ఫెయిర్ నాన్నా” అంటూ

******

తండ్రి పోయిన ఐదోరోజు. ఖాళీగా మిగిలిపోయిన ఇంట్లో ఒక్కతే జయ. ఒంటరితనం తెలిసొస్తోంది. పనిమనిషి ఇల్లూడుస్తున్న చప్పుడు వినపడుతోంది. కాళ్ళు ముందున్న టేబుల్ మీద పెట్టి టి.వి ఆన్ చేసింది.  ఇంకో రెండ్రోజులు, తర్వాత మళ్ళీ ఆఫీస్. కావాలనే తనకోసం ఓ రెండ్రోజులు కేటాయించుకుంది.  ఆఫీసు వాళ్ళుకూడా దేనికోసమూ ఫోన్ చెయ్యకుండా వదిలేశారు.

ఎప్పుడో కానీ తనకి టి.వి పెట్టుకునే అవసరం ఉండేది కాదు.  తండ్రి ఏ తెలుగు వార్తా చానలో చూస్తూ ఉండేవాడు.  కూతురు రాక గమనిస్తే వెంటనే ఇంగ్లీషు వార్తా చానళ్ళకి మార్చేవాడు అప్రయత్నంగా.   జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి చూసే తెలుగు చానెల్ పెట్టింది.  ఆ న్యూస్ రీడర్   మాట్లాడుతుంటే తండ్రి ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది.

లేచి వెళ్ళి తండ్రిఫోన్ తెచ్చుకుంది.

ఫేస్ బుక్ ఓపెన్ చేసి గీత ప్రొఫైల్ చూడడం మొదలు పెట్టింది. ఓ యాభై మంది ఉన్నారు కనెక్షన్స్ లో.  ఆఖరి పోస్ట్ చూసింది. ‘డాడ్ హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యాడు. తిరిగొచ్చేదాకా ఆఫ్ లైన్ ‘.  కింద సింపతీ కామెంట్స్.  తను హాస్పిటల్ కి వెళ్తూ తనే పోస్ట్ చేశాడన్న మాట.  తిరిగొస్తాననుకుంటూ, నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్ళి తిరిగిరాలేదు.

మెసెంజర్ ఓపెన్ చేసి చూసింది. ఈ రమేష్ ఎవరో, గీతతో ఇంత  చాటింగ్ జరుపుతున్నాడు.  దాదాపు ప్రతిరోజు వీళ్ళ మధ్య ఏదో సంభాషణ జరుగుతూనే ఉంది.

‘నాన్నకి ఎలాఉంది? హాస్పిటల్ నించి ఇంకా రాలేదా?’ అంటూ దాదాపు ప్రతిరోజూ తన నించి మెస్సేజ్ ఉంది.  మెస్సేజిలన్నీ ఎక్కువ తెలుగూ, అక్కడక్కడా ఇంగ్లీషు కలగలిపి ఉన్నాయి.

ఎవరీ రమేష్ అని ప్రొఫైల్ చూసింది. విశాఖపట్నం. ఏదో ఎన్.జి.ఓ లో పని చేస్తున్నట్టున్నాడు.  పూవులూ, పళ్ళూ, జంతువులూ ఫొటోలు. ఎక్కడా అతగాడి ఫొటో లేదు.

మళ్ళీ గీత ప్రొఫైల్ చూసింది. ఒక్క తన పేరు జయ, తను పనిచేస్తున్న కంపెనీ పేరు తప్పా అన్నీ తనగుర్తులే.  ఊరు, ఉద్యోగం, పుట్టినరోజు, తన ఇష్టాఇష్టాలూ అన్నీ.

స్క్రోల్ చేసి చూసింది.  ఓ రెణ్ణెల్ల క్రితం

గీత

ఆఫీస్ లో ప్రెజర్ ఎక్కువగా ఉంది. టీంలో ఇద్దరు మానేశారు ఈవారం.

రమేష్

అవునా. టేక్ కేర్!

గీత

మీ రెలా ఉన్నారు

రమేష్

‘బంతి చెట్ల సీజన్ అయిపోయి ఎండిపోయాయి. అన్నీ పీకేయాలి. కాఫీ తాగాక మొదలెట్టాలి. గంటపని ‘

 గీత

ఎన్ని నెలలు ఉంటాయి బంతి పూలు?’

రమేష్

ఓ మూడు నెల్లు. సంక్రాంతికి పీక్ సీజన్.

గీత

మీ పని బాగుంది. హాయిగా పూలల్లో, చెట్లల్లో ఉంటారు

రమేష్

ఎవరో ఒకళ్ళు దేశానికి సంపాదించి పెట్టాలికదా. మీరాపన్లో ఉండండి

రెణ్ణెల్లక్రితం రాత్రీ పగలూ తన పడ్డ కష్టం గుర్తొచ్చింది. ఈ రమేష్ ఎవరోగానీ విషయం చేరిపోయింది, ఈ గీత ద్వారా.

ఆ రమేష్ కి వెంటనే నిజం చెప్పి, ఆ గీత అనబడే ముసలాయన పోయాడని చెప్పేద్దామనిపించింది.  ఫోన్ తీసి టైప్ చేసింది. కానీ పంపించలేక పోయింది.  ఎలాగూ లేని గీతతోనే ఇన్నాళ్ళూ మాట్లాడుతున్నాడు.  ఇప్పుడీయనకి ఈ సంగతి తెలియడం అవసరం లేదనిపించింది.  టైప్ చేసిన మెస్సేజ్ డిలీట్ చేసి ఫోన్ పక్కన పెట్టేసి టి.వీ మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నం చేసింది.

ఓ అయిదునిమిషాల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఫోన్ చేతిలోకి తీసుకుని ఇంగ్లీషులో టైప్ చేసింది.  మళ్ళీ ఒకసారి చదివి అనుకుంది, పైన గీత పేరుతో తండ్రి రాసిన ఇంగ్లీషుకీ తన కార్పొరేట్ ఇంగ్లీషుకీ తేడా స్పష్టంగా తెలుస్తోంది. మళ్ళీ దాన్ని డిలీట్ చేసి, ఇంగ్లీషూ తెలుగూ కలిపి మార్చి  రాసి  పంపించేసింది.

 

గీత

రిటర్న్ డ్ ఫ్రం హాస్పిటల్.  డాడ్ నో మోర్. అయిదో రోజు.  అన్ని రిట్యువల్స్ అయిపోయాయి.  సారీ మెస్సేజ్ పెట్టే టైం దొరకలేదు

ఓ పావుగంట తర్వాత రెస్పాన్స్ వచ్చింది

రమేష్

అయ్యో. అంత సీరియస్ అని చెప్పలేదు మీరు. సారీ‘ 

గీత

ప్రాబ్లెం ఉందని తెలుసు కానీ ఇంత సడన్ గా జరిగిపోతుందనుకోలేదు. చక్కగా మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్ళి, నాలుగ్గంటల్లో వెంట వెంటనే మారిపోయింది సిట్యుయేషన్

 రమేష్

ఆఫీస్ కి వెళ్తున్నారా?’

 గీత

లేదు సోమవారం నించీ, ఇంకో రెండురోజులు

 రమేష్

మీరు ఏ బిజినెస్ ట్రిప్పో వెళ్ళుంటారనుకున్నాను. రెస్పాన్స్ లేకపోతే  ’

  గీత

ఐ విష్ దట్ వజ్ ద కేస్ ‘ 

 

ఎప్పట్నించో పరిచయమున్నట్టు సాగిపోయింది సంభాషణ. పోతూనే ఉంది…

******

గీత

‘రేపు లండన్ వెళ్తున్నా. వారం రోజులు ‘

రమేష్

‘ఆల్ ద బెస్ట్. నేను కూడా చాలా బిజీ. మునిసిపల్ స్కూల్ కి పెయింటింగ్ వేస్తున్నాం. ఎవరో ఎన్నారై డబ్బులు పంపాడు. ‘

 గీత

మీరే వేస్తారా?’

 రమేష్

చెయ్యగలిగిన పనికి ఖర్చెందుకు.

 గీత

టైం సేవ్ అవుతుంది కదా

 రమేష్

సేవ్ చేసి? ఇంతకంటే ముఖ్యమైన పనేముంటుంది?’

గీత

సంపాదన?’

 రమేష్

‘తెలియనట్టు కొత్తగా అడుగుతారేంటి? ఉంటానికి ఇల్లుంది. రెండుపూటల తింటానికి ఎంత కావాలి? ఆమాత్రం ఏం చేసినా దొరుకుతుంది.  మూడు ట్యూషన్లు ఇప్పుడు ఇంకో ఆరుగురొస్తానంటున్నారు. అంతకంటే సంపాదన మీద టైం వేస్ట్ చెయ్యను ‘ 

 గీత

సంపాదన మీద టైం వేస్ట్ చెయ్యను అన్నమాట నాకు చాలాసేపు గుర్తుంటుంది

******

రమేష్

బిజీనా?’

 గీత

పర్లేదు చెప్పండి

రమేష్

మళ్ళీ మా అమ్మ నా పెళ్ళి పేరుతో గొడవ చేసింది‘ 

 గీత

చేసుకోవచ్చుగా

 రమేష్

‘కొత్తేముందండీ! పెళ్ళితో వచ్చే బాధ్యతలు నేనెక్కడ మొయ్యగలను? జీవితం తక్కువ బరువుగా ఉండాలినాకు. మీరేమో ఏ కమిట్ మెంట్ వద్దనుకున్నారు ‘

 గీత

మా నాన్న ఉండగా చాలాసార్లు ఆ మాటే చెప్పాను.  అవునూ, కమిట్ మెంట్, బాధ్యతలూ రెండూ ఒకటే కాదా?’

 రమేష్

‘కాదు. నాకు బాంక్ బాలన్స్, నెల ఖర్చులూ చూసుకునే ఓపిక లేదు. కమిట్ మెంట్ అంటే ఒకళ్ళకే అంటుకుపోవాల్సి రావడం జీవితమంతా’

 గీత

ఏంటి నాకు చాలా అఫైర్లు ఉన్నాయనుకుంటున్నారా? LOL’ 

 రమేష్

‘మీరు ఇంతకుముందు చెప్పినమాటలే మీకు చెప్తే ఇలా అర్థంతీస్తే ఎలా? మీరే చెప్పాలి ఎన్ని అఫైర్స్ ఉన్నాయో ‘

 గీత

ఆ టాపిక్ వదిలేయండి. మీ అమ్మగారికి అర్థం అవటం కష్టమే. తర్వాత మాట్లాడదాం. ఆఫీస్ కాల్ వస్తోంది

******

రమేష్

కనకాంబరం పూలు ఫొటో పెట్టాను చూశారా?’

 గీత

లేదు. ఇప్పుడే చూస్తా

 రమేష్

చాలా పూసింది. అమ్మతో దండ కట్టించా

 గీత

ఫొటో చూశాను. చాలాబాగున్నాయి. దండ కట్టించి ఏంచేస్తారు? పూజకా?’

 రమేష్

లేదు ఓ చిన్నమ్మాయి అడిగింది వెళ్ళి ఇవ్వాలి. సైకిల్ తీసుకు బయలు దేరాలి

 గీత

ఎవరా అమ్మాయి? ఎక్కడా?’

 రమేష్

‘మీకు వైజాగ్ తెలుసా? ఓ రెండు కిలోమీటర్లుంటుంది ఇక్కడికి. ఎవరో చిన్న పిల్ల, పెద్ద పరిచయం లేదు.  గవర్నమెంట్ స్కూల్లో కెళుతూ కనకాంబరాలు బేరమాడి కొనలేక మానేసింది. అది చూసి నేనే ప్రామిస్ చేశా మా చెట్టు పూలు తెచ్చిస్తానని ‘

 గీత

మిరే కొనివ్వలెకపోయారా అప్పుడే? ఇప్పుడిక్కణ్ణించి తీసుకెళ్ళకపోతే

 రమేష్

ఆ ఆలోచన రాలా… పూలు కొనుక్కోవడమేమిటి?’

******

గీత

రమేష్ ఎక్కడున్నారు? అంతాబానే ఉందా? మెస్సేజేం లేదు?’

******

గీత

‘???’

******

గీత

అంతా బానే ఉందికదా? ‘

******

రమేష్

గీతగారు. సారీ రెండు వారాలు నా అదుపులో లేవు

 గీత

క్షేమంగా ఉన్నారు కదా? ఏమయింది

 రమేష్

అమ్మకి బాలేదు

 గీత

అయ్యో

 రమేష్

ఎప్పుడూ అడగుతాననుకోలా. మీరు వైజాగ్ రాగలరా?’

సారీ. నా దగ్గరనించి ఊహించి ఉండరు. అయినా మీరు రావడం అవసరం

 గీత

అవును నేను ఊహించలేదు ఇలా మీదగ్గర్నించి పిలుపొస్తుందని. ఇదేదోనొ పిక్చర్, నో ఫోన్ స్నేహం కదా? ఏ కమిట్ మెంట్, రెస్పాన్సిబిలిటీస్ లేని  మరోప్రపంచపు స్నేహం కదా?’

 

రమేష్

‘కమాన్ గీతా. మీ వెటకారం అర్థమవుతోంది. కానీ మీరు వస్తే మీకే కొన్ని సంగతులు అర్థమవుతాయి. అవ్వాలి. ఇదిగో నా పిక్చర్ పెడుతున్నా చూడండి ‘

గీత

ఏంటో ఇవ్వాళ చిత్రంగా ఉంది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లా.  సాయంత్రం చెపుతా. అమ్మగారు మాత్రం జాగ్రత్త

రమేష్

థాంక్యూ

******

ఫ్లైట్ దిగి ఊబర్ ఎక్కింది. వైజాగ్ రోడ్లమీద కారు పరిగెడుతోంది. లొకేషన్ ప్రకారం వెళ్తోంది కారు. ఏమాత్రం పరిచయం లేని ఊరు జయకి.  ఆమెకే అర్థం కావట్లేదు అసలు తానెందుకు ఆ ప్రయాణం చేస్తోందో.

కొంచెం ఊరికి బయటగా ఉన్న ఇంటి ముందు ఆగింది కారు. చుట్టూతా కొత్తగా అపార్ట్మెంట్లు లేస్తున్నట్టున్నాయి. బహుశా ముందుతరంనించి వచ్చిన ఇల్లనుకుంటా,  చిన్న ఇంటి చుట్టూ బోలెడు స్థలం.  తాను ఫొటోల్లో చూసిన పూల చెట్లూ, కొమ్మలూ, ఆకులూ!  రియలెస్టేట్ ఇంకా మింగేయని స్థలం. రియలెస్టేట్ ఇంకా మింగలేకపోయిన మనుషులున్న ఇల్లయుండాలి.

“రమేష్ గారేగా.” అంది జయ కారుని చూసి బయటకు వచ్చిన మనిషిని చూసి.

“థాంక్స్ ఫర్ కమింగ్ గీతగారూ. ప్లీజ్ కమిన్” అంటూ లోపలికి తీసుకెళ్ళాడు.

“మీ అమ్మగారెక్కడా? హాస్పిటల్ లోనా?” కలియజూస్తూ అడిగింది జయ.

“ముందు మీరు ఫ్రెష్ అవండి. కాఫీ చేస్తాను. తర్వాత మాట్లాడొచ్చు” అంటూ సమాధానం కోసం చూడకుండా ఓ టవల్ ఇచ్చి వాష్రూం చూపించాడు.

కాఫీ ఓ సిప్ చేశాక అంది గీత

‘చెప్పండి రమేష్ మీ అమ్మగారెక్కడ? నేనెందుకున్నానిక్కడ?’

రమేష్ వెనక్కి కూర్చున్నవాడు ముందుకు జరిగి గీత వైపు చూస్తూ అన్నాడు.

“ఎలా మొదలెట్టాలో తెలీట్లేదు. ముందు మా అమ్మ సంగతి. ఆమె చనిపోయి పదిహేను రోజులయింది.”

“అయ్యో మరెందుకు చెప్పలా?”

“మిమ్మల్ని పిలిచింది అమ్మగురించి కాదు. మీరెలా తీసుకుంటారో తెలీదుగానీ, నా పేరు రమేష్ కాదు,  మురళి ‘

‘వాట్?’

“మీరు ఇన్నాళ్ళూ చాట్ చేసింది రమేష్ అనే ఒక ఫేక్ ఐడితో.  అదిగో పోయిన మా అమ్మచేసిన నిర్వాకం ఇది”  ఫోటోలో ఉన్న తల్లివైపు చూపించాడు.

అవాక్కయి చూస్తోంది జయ.  ఆమె భావం తెలియలేదు మురళికి.

“క్షమించండి.  ఇది మీరెలా తీసుకుంటారో తెలీదు. మా అమ్మ పోయిన తర్వాత ఇది గమనించి నేనే ఆ సంభాష ణ సాగిస్తున్నా రెండు వారాలనించీ. మా అమ్మ వాడిన తెలుగు కూడా నాకు సరిగా రాదు”

షాక్ లోంచి తేరుకున్న జయ ఒక్కసారిగా గట్టిగా నవ్వడం మొదలెట్టింది. మురళి కేమీ అర్థం కాలేదు.

జయ నవ్వడం ఆపి అడిగింది.

“ఈ విషయం చెప్పడానికి నన్ను హైదరాబాద్ నించి వైజాగ్ రప్పించాలా? అదే మెస్సెంజర్లో చెప్పేయొచ్చు. నా ఫోన్ నంబర్ తీసుకుని చెప్పొచ్చు. అసలు ప్రొఫైలే డిలీట్ చేసి పారేయొచ్చు కదా”  ఆఖరిమాట ఆంటున్నప్పుడు అప్రయత్నంగా ఆమె గొంతు వణికింది.

“మొత్తం చాట్ అంతా నేను పది సార్లు చదివాను. అలా డిలీట్ చేసేలా లేదు. ఫోన్ లో చెపితే నమ్ముతారనిపించలా. అందుకే రమ్మన్నా.   మా అమ్మ ఎలాచేసిందో తెలీదు.  నాకు సమాంతర ప్రపంచంలోంచి  ఒకళ్ళని తీసుకొచ్చి స్నేహం సాధ్యమని చూపించింది. అది ఒదులుకో బుద్దికాలేదు”

ఓ నిమిషం ఇద్దరూ మాట్లాడలేదు.

‘నేను గీతని కాదు, జయని.  మీరు చాట్ చేసింది నాతో కాదు, మా నాన్నతో.  మీకు ఈ విషయం తెలిసిపోయింది కదా? అందుకే రమ్మన్నారా’   తలవంచుకుని అడిగింది జయ మెల్లగా

అతని మొహంలో ఆశ్చర్యం కనపడలా. ఏదో భారం దిగినట్టు మొహం పెట్టి అన్నాడు

‘తెలిసిపోయింది అనలేను గానీ, గట్టి అనుమానం మాత్రం వచ్చింది. మీ భాష, చాట్ చేసే టైం అన్నీ మారాయి, మీ నాన్నగారు పోయాక. అందుకే రమ్మన్నాను. ఏం సాధించడానికో నాక్కూడా తెలీదు ‘

మళ్ళీ మౌనం. జయ చేతిలో ఉన్న కాఫీ పూర్తి చేసింది రెండుగుక్కల్లో.  కిందపెట్ట పోతున్న కప్పుని లేచి అందుకున్నాడు మురళి.  వంటగదిలో పెట్టడానికి కదలబోయాడు.  అతడి చెయ్యిపట్టుకుని ఆపింది జయ.  కళ్ళలోకి చూస్తూ అంది

‘పెళ్ళిచూపులకి ఒప్పుకోవట్లేదని మనవాళ్ళు మనకి ప్రేమచూపులు ఏర్పాటు చేసినట్టున్నారు.  మనం ఇక ఇక్కడితో ముగించడమేనా?’

ఆమె కళ్ళలోకి ఓ నిమిషం అలాగే చూస్తూ నిలబడ్డాడు.  ఈమె ఇంత బేలగా మాట్లాడగలదా అని ఆశ్చర్యపోయాడు.   చెయ్యి వదిలాక వంటాగదిలోకి వెళ్ళి కాసేపటి దాకా బయటికి రాలా.  అతను బయటికి వచ్చేటప్పటికి తలవంచుకుని ఫోన్ లో పైకీ కిందకీ ఏదో స్క్రోల్ చేస్తూ కూర్చుంది. అతడి రాకని గమనించి తలపైకెత్తింది సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టుగా.  దగ్గరగా వచ్చి అన్నాడు, స్థిరంగా!

‘కుక్కర్ ఇపుడే పెట్టాను. భోజనం త్వరగా చేసి బయటపడదాం.  వైజాగ్ అందాలు చూపిస్తాను.  ప్రేమ పక్షులు వాలే కొమ్మలు అని ఏదో కవిత్వం  చదివిన గుర్తు. ఆ కొమ్మలేవో వెతుకుదాం, మనిద్దరికీ తెలియని అడవికదా అది ‘

*

అక్కిరాజు భట్టిప్రోలు

3 comments

Leave a Reply to Anil అట్లూరి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సారీ, అక్కి !
    Disappointed!
    Why?
    గీత ప్రొఫైల్ లోకి జయ దూరి రమేష్ తో సంభాషణ సాగించడం దగ్గిర మొదలయ్యి… విశాఖ లో ఊబర్ ఎక్కడం తో కధ ఎక్కడికి వెళ్తుందో ఊహ కి అందింది! చి న

  • గుడ్ వన్ .. అక్కి గారు.. చాలా రోజులకి ఎలాంటి భావజాలాలు లేని హాయి అయిన కధ చదివాను.. predictable కానీ బావుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు