పులినెత్తురు

1

పులినెత్తురు

బడి కెళ్ళాను
పులి వచ్చింది
నాన్నా పులి అని అరిచాను
పులి పారిపోయింది
గుడి కెళ్ళాను
పులి వచ్చింది
నాన్నా పులి అని అరిచాను
ఈసారి కూడా
పులి పారిపోయింది
అడవి  కెళ్ళాను
పులి వచ్చింది
నాన్నా పులి అని అరిచాను
నాన్న రాలేదు
చేతిలోని కొడవలితో ఎగబడ్డాను
పులి చచ్చింది
ఇప్పుడు నా కవిత్వం
చెరసాల గోడల మీద
పులినెత్తురు పులుముకుంటుంది…!

2

ఆశలింకా సజీవంగానే వున్నాయి

అక్కడక్కడా
కొన్ని దీపాలు
రహస్యంగా వెలుగుతూనే
వున్నాయి
ఊరి మధ్య
ఎత్తైన కోటగోడల మీద
వడగళ్ల వాన
కురుస్తూనే వుంది
చనిపోయిందనుకున్న నది
మళ్ళి  మళ్ళీ ఉప్పొంగి
సముద్రంతో తలపడుతోంది
ఎక్కడి నుంచో
పేరు తెలియని ఒక పిట్ట
నిషిద్ధ గీతం ఆలపిస్తుంది
ఇంత మౌనంలోనూ
చీమ చిటుక్కుమన్న
అలికిడి వుంది
అలజడి వుంది
ఈ చీకటేమీ శాశ్వతం కాదన్న
ధ్యాస వుంది
రేపటి కిరణాల్ని ఇవ్వాలే హత్తుకునే
స్పర్శ వుంది
అంతకంటే
నా కోసం పేనుతున్న
ఉరితాడు మీద
అంతులేని ప్రేమా వుంది..!
*
చిత్రం: స్వాతి పంతుల

సాబిర్

2 comments

Leave a Reply to గిరి ప్రసాద్ చెలమల్లు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పులి నెత్తురు పులుము కుంటుంది

  • చెరసాల గోడలమీద పులి నెత్తురు పులుముకుంది.
    బాగుంది. మంచి కవిత. అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు