మాలక్ష్మి పంచాయితీ

1

‘‘కాలెత్తి పిలిస్తే ఏ కుక్కయినా వొచ్చి కూడుతది. నువ్వు పెద్ద మొగోణివి. నువ్వూ నీ యాపారం. నా జీవితాన్ని నాశనం చేసేసినావురా నా బట్టా’’ అంది మాలక్ష్మి.

ఆ మాటకు వెంగల్రావుకు కోపం నశాలానికెక్కింది. కుర్చీలోంచి లేచి చెప్పు చేతిలోకి తీసుకొని ఆమె జుట్టుపట్టి వొంచి వీపు మీద యిష్టమొచ్చినట్టు కొడుతున్నాడు. ఆమె మాట ఎవరికి నచ్చుతది? ముఖ్యంగా ఆమె మాటలు ఏ మగాడికి యిష్టమనిపిస్తాయి? వెంగల్రావు మగాడే కాదన్నట్టు మాట్లాడే సరికి అక్కడున్న వాళ్లకీ కోపం వొచ్చింది. సెంద్రెయ్య ఆమె మాటలకు ఏమనాలో తెల్వక మౌనంగా వున్నడు.

వెంగల్రావు దెబ్బలకు తోలు మండినట్టుంది. ఆమె యింకా బూతులు అందుకుంది. ఆ యింటి చుట్టూ వున్న నాలుగిల్లకూ ఆమె అరుపులు వినిపిస్తున్నయి. కానీ యెవరూ ఆ యింటి వైపు రావడానికి యిష్టపడుత లేరు. ఆమెను యింకా నాలుగు తన్నాలని అనుకుంటున్న సంసారులు కూడా వున్నారు.

ఈ దొంగనంజె వల్ల మమ్మల్ని కూడా తప్పుగా అనుకుంటున్నారు. దీనికి దినం పెట్టా అనుకుంటా బిందెలో నీళ్లు మోసుకుంటా రుసరుసలాడుతా పోయింది పక్కింటి పార్వతమ్మ.

ఆ మాటలిన్న మాలక్ష్మికి అహం దెబ్బతిన్నది.

‘‘తిప్పులాడుతందమ్మా పత్తిత్తు పార్వతమ్మ. ఎవడికీ కొంగుపరువ కుండానే యిద్దరిని కన్నవానే లంజెదానా? నీ జోలికొత్తినా. నీ ఊసుకొత్తినా. నామీద పడియాడుత్తారేందే ముండలారా. పిల్లగాళ్లు బడికి పోంగానే మొగణ్ని పక్కలోకి రాకపోతే పచ్చిబూతులు తిట్టే పార్వతమ్మ నాకు నీతులు చెప్తాంది. వొళ్లు తిమ్మిరెక్కితే నీ మొగన్ని పిలుస్తావే. నాకెక్కితే నేను పిలువొద్దా. ఆడు ముండమోపిలా ముడుసుకపంటే నేను సప్పిడి కూడుతిని బతుకాలా? నా తెరువొస్తే సిగగోసి సీరెత్త నంజిముండలారా?’’ అని రాగమెత్తుకుంది.

వెంగల్రావు ఏమీ సెయ్యలేక. నోరు ముయ్యవే లంజిదానా. నీ మూలంగా నా పరువు బజారు పాలయ్యింది అని రుసరుసలాడుతున్నడు.

‘‘నన్ను సుఖపెట్టలేని నీ పరువెందుకు? నీ కాసులెందుకురా నా బట్టా. ఓ సెంద్రెయ్య. ఈ నా బట్టతో నేను బతకలేను. మూడుముల్లేసి తోలుకొచ్చింది మొదలు. నన్ను ముట్టుకున్నది లేదు. సంసారం చేసింది లేదు. కడుపుల ఓ కాయ కాయకపోతే అది నా తప్పా. నా తల్లిగారు నన్నే తిట్టే. సుట్టుపక్కలున్న నా బట్టలంతా నన్ను గొడ్రాలని ఆడిపోసుకోబట్టే. మల్లేషుగాడు మొదటిసారి నన్ను తాకె. నేను మడిషినని నాకు తెలిసేట్టు చేసే. నాకు నువ్వే న్యాయం సెయ్యాల. నన్ను ఈ మొగతనం లేని మడిషి కాడ వుండమంటే నేను వుండను. గంజో కలో తాగి ఆ మల్లేషుతోటే కలిసి బతుకుతా’’ అని జుట్టు ముడేసుకుని నేల మీన కూసున్నది.

ఆ మాటలకు మల్లేషు తలకొట్టుకున్నడు. ‘‘యేందమ్మా నువ్వు మాట్లాడేది? యాడికి నువ్వొచ్చేది? నీకు నాకే సంబంధం లేదు. నాకు పెళ్లాం వుంది. పిల్లలున్నరు. హమాలీ పని చేసి బతికే నాకు యింకోదాన్ని సాదే శక్తి లేదు. నన్ను వొదిలిపెట్టు’’ అన్నడు మల్లేషు.

వెంగల్రావుకు కడుపు రగలిపోతంది. ‘‘నోర్ముయ్యరా నీతిలేని కుక్కా. నా పెళ్లామే దొరికిందా నీకు? బెజవాడలో ఎంతమంది ఆడిలంజెలు లేర్రా లంజెకొడుకా. నా బంగారం లాంటి పెళ్లానికి ఏ మందు పెట్టినవురా’’ అని లేచి చెప్పు తీసి రెండు దెబ్బలేసిండు.

సెంద్రెయ్య వెంగల్రావు చేతిలోంచి చెప్పు గుంజి యిసిరేసిండు. దూరంగా నూకేసిండు. మాట్లాడకుండా కూసోమని గద్దించిండు.

‘‘తప్పు నీ గుద్దల పెట్టుకొని వాణ్ణి కొడుతావేందయ్యా? డబ్బులున్నాయనే బలుపా? బలుపు గిలుపు మొత్తం పులుసుకారుద్ది జాగ్రత్తా’’ అని సెంద్రెయ్య ఉగ్రుడయ్యిండు. వెంగల్రావు అశక్తుడిలా కుర్చీలో కూలబడి యేడుత్తా వుండు.

‘‘ఆడిదానిలెక్క యేడ్వకు. నీ యింటిది తప్పు చేసింది నిజమే. కానీ తప్పు చేసేట్టు చేసింది నువ్వు. మార్కెట్లో ఎన్ని దుడ్లు సంపాయించినవో లెక్క చూసుకున్నవు సరే. ఎన్ని బత్తాలు కొన్నా, ఎన్ని బత్తాలు అమ్మినా అని లెక్కలు రాసుకున్నవు బానేవుంది. కానీ నీ పెళ్లాం సంతోషంగా వుందా లేదా అని యెన్నడన్నా పట్టించుకుంటే ఈ పరిస్థితి వొచ్చేదా?’’ అని సెంద్రెయ్య గట్టిగా అడిగిండు.

ఆ ప్రశ్నకు రోషమొచ్చింది వెంగల్రావుకు. ‘‘యాం తక్కువ చేస్తిని దానికి? జాస్తిగా బంగారం కొని పెడితిని. నగలు సేపిత్తిని. పట్టుచీరెలు కొనిత్తిని. బీరువా తాళమే దాని బొడ్లో సెక్కితిని. యింకేమి కావాలా ఆ ముండకు? నీతిలేని ముండఅది. నా బంధువుల ముంగట నన్ను యెదవను చేసిందియ్యాలా’’ అని మల్లా ధారలుగట్టిన కండ్లను తుడుచుకుంటూ రోదించిండు.

‘‘నోర్ముయ్యరా ఆడంగి నాయాలా. నా తల్లిగారికి డబ్బుల్లేకనా? గోదావరి వొడ్డుకు పాతిక యెకరాల ఆసామి నా తండ్రి. నువ్వు కొనిచ్చేది యాంది? ఒక్క మాట మా నాయిన్ని అడిగితే కిల బంగారం కొనిత్తడు. తినడానికి తిండి లేకనో, కట్ట పట్టుబట్టల్లేకనో నీకు యిచ్చి కట్టబెట్టలేదురా నన్ను. నువ్వేదో మొగోనివని చేసిండ్లు నీకు. యిగో సెంద్రెయ్య విను. మొదటిరాత్రి ముండమోపిలా గుర్రుపెట్టి నిద్రపోయిండీ మొగోడు. మూడు రాత్రులూ తిని తొంగోడం తప్పా మీద సెయ్యేసింది లేదు ఈ నా బట్టా. నేను నిలదీస్తే నా కాళ్ల మీద పడి బోరునేడ్చే. నాకు మగతనం లేదు. బయటికి నువ్వు చెప్పొద్దు. లేదంటే గోదాట్లో దూకి సత్తా అని నా గొంతు నొక్కిండు యీ నంజెకొడుకు. యియ్యాల నీతులు మాట్లాడుతండు.

పెళ్లయి పదేళ్లయినా పిల్లలేకపోతే తోటి కోడండ్లు, ఆడబిడ్డలు నాదే తప్పని ఆడిపోసుకోబట్టే. పెళ్లికో పేరంటాలకో పోతే గొడ్రాలని నన్ను అశుభం అని దూరం పెట్టబట్టే. నాదా తప్పు. ఆ ముండలకు నా భర్తకు మగతనం లేదని చెప్పి అరవాలని యెన్నిసార్లు అనిపిచ్చిందో నీకు యెట్లా సెప్పేది సెంద్రెయ్యా? ఈ పదేళ్లలో అన్నీ సంపుకొని వుంటిని. అవమానాలు భరిస్తిని. జ్వరమొచ్చి వారం రోజులు మంచంల పడుంటే ఈ మొగోడు ఒక్కరోజన్నా ఒంట్లో యెట్లున్నాదని అడక్కపాయే. అయినా ఎన్నడన్నా తప్పు చేసినానా? పతివ్రతలకే పతివ్రత అని నెత్తిన పెట్టుకున్న లంజెలంతా యియ్యాల నన్ను చూసి తూ అని ఊయబట్టే. యెందుకు? ఈ మల్లేషు వల్లా. మాలచ్చుమమ్మా ఒంట్లో యెట్లా వుంది? సేటమ్మా తింటిరా? సేటమ్మా బాగున్నరా అని మాట కలిపే. ఆ మాటలకు నా మతి తప్పింది. అవును. నేనే ఆడి యెంట పడ్డా. కొంగుపరిచి రమ్మన్నా. ఆడి వల్లనన్నా నా కడుపులో ఓ నలుసు పడితే తప్పేందని అనుకున్నా. గొడ్రాలిగా సచ్చిపోవడం కన్నా మల్లేషుతో ఓ బిడ్డను కంటే తప్పేందని అనుకున్నా. వాడొద్దుద్దు అన్నడు. ఆడిదానిలా నేను అలాంటోణ్ణి కాదన్నడు. కానీ, వాడు మగాడని గుర్తుకొచ్చేలా నేనే చేసినా. అట్లా యెన్నిసార్లు నా మొగనికి గుర్తు చేయాలని చూసానో ఎట్లా చేప్పేది? కానీ ఆడికి ఒంట్లోనే శక్తి లేదు. అందుకే ఆ నా బట్ట గుర్రుపెట్టి పనుకుంటడు. కానీ మల్లేషుగాడు మగాడు.

ఇప్పుడు విను. చెవులు తెరుచుకొని యిను వెంగల్రావు, ఓ నా మగతనం లేని మగడా. నీకు నేను తప్పు చేసానని అనిపిత్తే నన్ను వొగ్గేయి. నీకు మగతనం లేదని, అందుకే నన్ను వొగ్గేసిండని అందరికీ చెప్తా. యిప్పుడు నా కడుపులో పెరుగుతున్నది మల్లేషుగాడి బిడ్డని నలుగురికీ చెప్తా. యేమి చేసుకుంటావో నీయిష్టం’’ అని తుపుక్కున నేల మీద ఊసి గోడకు వీపు ఆనించి కూలబడ్డది. మాలక్ష్మి మాటల్లో బెదిరింపు వుంది. అంతకు మించి నిజాయితీ వుంది. సెంద్రెయ్యకు ఆమె పట్ల సానుభూతి కలిగింది. మాలచ్చిమిని చూస్తంటే సెంద్రెయ్యకు శారద యాదికొచ్చింది. తను కూడా యిట్టాగే తెగించేది. ఆడది తలుసుకుంటే యావైనా సేత్తదదని తెలుసు తనకు. ఈ ఆడోళ్లంతా ఒకేలా వుంటారా? కోర్కెలను చంపుకోని ఆడిదే లేదా? ఒంటి సుఖం కోసమో పిల్లల కోసమో మొగోని ఇజ్జతి తీడానికి సయితం యెనుకాడరే వీళ్లు అనుకున్నడు మనసులో. కానీ ఆ మాట బయటికి అనలేకపోయిండు.

ఎవరూ ఏమీ మాట్లాడేక పోయిండ్లు. మల్లేషు బిత్తిరోడిలా సెంద్రెయ్యకేసి సూత్తండు. వెంగల్రావు తలొంచుకొని నేలకేసి సూత్తండు. యిక సెంద్రెయ్య లేచి తువ్వాల భుజం మీన యేసుకున్నడు. మాలక్ష్మికేసి చూసిండు. ఆమె చెంపలపొంటి నీళ్లు కృష్ణానదిలా పారుతున్నాయి.

‘‘సూడు సేటమ్మా, తప్పంతా నీదే. నీ మొగనికి నిజంగానే మగతనం లేకపోతే అది నీకు తెలిసిన నాడే యిడిసిపెట్టాల్సి వుండే. యిడుపు కాయితం రాసుకొని, యింకోణ్ణి పెండ్లి చేసుకుంటే పోయేది. కానీ, ఆయన కాళ్లు పట్టుకున్నాడనో, యేడ్చిండనో నువ్వు గమ్మునున్నవు. ఎవరికి నష్టం జరిగింది? నీ బతుకే నాశనమైంది. యిప్పుడు సూడు, నిప్పులాంటి మాలచ్చిమేంది యిట్టా నీళ్లలా మారిపోయిందని అందరూ నీ గురించే అనుకోవట్టిరి. సరే, అయిపోయిందేదో అయిపోయింది. నీ మొగన్ని నువ్వు భరించక తప్పదు. మల్లేషుతో కలిసి బతుకుడు కష్టం. ఆనికో పెళ్లాం వుంది. ఇద్దరు పిల్లలున్నరు. నీ మొగన్ని వొదిలేసి వస్తే నిజంగానే నీ మొగని పరువు నాశనం అవుద్ది. ఆడు యే కాల్వల్నో దునికి సచ్చిండనుకో, నింద నీ మీకే వొత్తది. ఆలోచించు’’ అన్నడు సెంద్రెయ్య. మాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా నేల చూపులు సూత్తంది.

‘‘సూడు సేటు, అసలు తప్పంతా నీదే. నువ్వే ఆమె బతుకును బండపాలు చేసినవు. సిగ్గుండాలె నీకు. సరే, అయిపోదిందేదో అయిపోయింది. నువ్వే సూసీ సూడనట్టు వుండాలె. ఆడిది బజారెక్కి నోరిప్పితే పోయేది నీ పరువే. కాబట్టి, సేటమ్మను తిట్టుడు కొట్టుడు చెయ్యకు. యెట్టాగూ నీ పెళ్లాం నీళ్లు పోసుకున్నది. అందరినీ పిలిచీ పండుగ సెయ్యి. నీ ఆస్తికి ఒక వారసుడు వొత్తండని వాళ్లు సంబుర పడుతరు. నీ భార్య గొడ్రాలు కాదనీ, నువ్వు ఆడంగోనివి కాదని నలుగురికీ తెలుత్తది. దాని వల్ల నీకే గౌరవం. నా మాటిని, వేరే బజారుకు యిల్లు మార్చు. ఈ యిల్లు అమ్ముకుంటావో, కిరాయికే ఇచ్చుకుంటావో నీ యిష్టం. కానీ, యిక్కడ మాత్రం వుండొద్దు. ఇవ్వాల నుంచి మల్లేషు నీ యింటి వేపు కన్నెత్తి సూడడు. ఆడు నీ దగ్గర ఈపూట నుంచే పని చేయడం లేదు. ఇక్కడ జరిగిన ఈ యిగురం ఎవ్వరికీ సెప్పకు. మొగోని విలువ ఆడిదాని మాట మీదనే నిలబడుతది. తొందరపడి మీ ఆలుమొగలు ఈదిల పడకుండ్లి’’ అని మల్లేషును తీసుకొని బయటికొచ్చిండు. వెంగల్రావు చాలా సేపు అలా కుర్చీలోనే కూచున్నడు. మనసుల అలజడిగా వుంది తనకు. లేచి మంచంలో వెన్ను వాల్చిండు.

*

జిలుకర శ్రీనివాస్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ బాగుంది జిలుకరా!
    చాలా సెన్సిటివ్ అంశం. ఊర్లల్లో ఎన్నో కథలుంటాయి ఇలాంటివి. రాయడానికి ఎవరికీ చేతకాదు. రాస్తే స్త్రీలను అవమానించినట్లు ఎక్కడ అనిపిస్తుందోనని భయమేస్తుంది. నా మనసులోనూ రెండు మూడు కథలు మెదిలాయి. కానీ రాయలేను. వారి తాలూకు పాత్రలింకా బతికున్నారు..
    సెంద్రయ్య లెక్క సూటిగా తీర్పు లిచ్చేవారు తక్కువ. సెంద్రయ్యకు బాధితుల జీవితాలు ఎంతగనమో తెలుసు అనడానికి ఈ తీర్పు ఒక గవాయి. అంత తెలిసిన సెంద్రయ్య ఒకచోట స్త్రీల గురించి అలా తక్కువ చేసి ఆలోచిస్తాడనుకోను.

    • Thank you sky. అందరిలో ఏదోఒక స్థాయిలో స్త్రీల పట్ల చిన్నచూపు ఉంటుంది. సెంద్రెయ్య ఒక పరివర్తన సంధి దశలో వున్నాడు. అన్ని పాత భావాలు ఒకేసారి పోవు. అవి తొలిగిపోయే సమయం ఒకటి వస్తది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు