సూపర్ ఫాస్ట్ రైటర్

ప్పుడు దివాళా తీస్తుందో తెలియని ఓ ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేసే అప్పారావ్, ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అన్న టెన్షన్ తట్టుకోలేక “స్వచ్ఛంద పదవీ విరమణ” చేశాడు. ముందస్తు ప్రణాళిక౦టూ ఏదీ లేకపోవడం వల్ల ఇంట్లో ఖాళీగా ఉండలేక కొన్నాళ్ళు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో విహారయాత్ర చేసి, అక్కడి స్వయం ప్రకటిత మేధావులపై చిన్నపాటి పరిశోధన కూడా చేశాడు. అడపాదడపా ఒకటి, రెండు పోస్టులు కూడా సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ క్రమంలోనే అతనిలో ఉన్న రచయిత మేల్కొన్నాడు. సోషల్ మీడియాలో రాసేవారికన్నా తను రెండాకులు ఎక్కువే నమిలి మింగేయగలనని, అవసరమైతే ఉమ్మేయగలనని కూడా తీర్మానించుకున్నాడు. పైగా ఎప్పుడూ లంచాలు తీసుకునే సహోద్యోగి శేషాచలం తనకన్నా ఏడాది ముందు వి.ఆర్.ఎస్. తీసుకుని ‘చెప్పుడు మాటలు వినకూడదు’ వంటి నీతివాక్యాలని కథలుగా మార్చి పత్రికల్లో వేసుకుంటున్నాడు. ఆఫీసులో కథలు చెప్పి అందరికన్నా ఎక్కువగా సెలవులు పొందిన అనుభవం ఉన్నందున కథలు రాయడానికి తనకే ఎక్కువ అర్హత ఉందని భావించిన అప్పారావ్ కథలు రాయడం మొదలుపెట్టాడు.

తన కథల్ని ఆ పత్రికకి, ఈ-పత్రికకి పంపి సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేక, శేషాచలం కథల పుస్తకం కన్నా ముందుగానే తన పుస్తకం రావాలన్న కసితో సొంతంగానే అచ్చువేయించాలని కలలు కన్నాడు. వాటితో పాటే ఆ పుస్తకం వెయ్యి కాపీలు అమ్ముడుపోవడం, వివిధ సాహితీ సంస్థలు సన్మానాలు, సత్కారాలు చేయడం కూడా ఆ కలలకి తోడుగా ఉంటాయని కనేశాడు.

ఓ ముహూర్తాన అర్ధాంగితో అతని కోరికని గోముగా విన్నవించాడు. “మీరు మొదలుపెట్టిన కథల్లో ఒక్కటైనా ముందు పూర్తి చేయండి. ఆ తర్వాత పెట్టుబడి పెట్టేవాళ్ళు ఉంటే లక్షణంగా ముద్రించుకోండి. నేనేమైనా వద్దన్నానా?” అని నవ్వుతూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది. రిటైర్మెంట్ తరువాత తన పప్పులేవీ వంటింట్లో కాదు కదా, చివరికి ప్రెషర్ కుక్కర్‌లో సైతం ఉడకట్లేదన్న నిజాన్ని గ్రహించాడు.

ఆర్థిక వ్యవహారాలన్నీ అర్థాంగే చూసుకోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయత వల్ల తన కళ, కలగానే మిగిలిపోతుందా? అని వ్యాకులపడుతున్న సమయంలో, ఎవరో ఢిల్లీకి చె౦దిన ఇద్దరు బెస్ట్ సెల్లర్ రచయితలు “సూపర్ ఫాస్ట్ రైటర్” అనే వర్క్.షాప్ నిర్వహిస్తున్నారని, అందులో “ముప్పై రోజుల్లో పుస్తకం రాసి, అచ్చువేసుకోవడం ఎలా?” అన్న విషయంపై చర్చించేందుకు హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకొని తన పేరు రిజిస్టర్ చేసుకున్నాడు.

కార్యక్రమం జరిగే రోజు దగ్గరికొస్తున్నకొద్దీ ఎస్ఎంఎస్‌లే కాకుండా, “మీకోసం ఎదురుచూస్తున్నాం” అంటూ, “మీ పేరున సీటు పక్కన పెట్టాం” అంటూ లొకేషన్ లింక్‌తో సహా వస్తున్న వాట్సాప్ సందేశాల వరదకు భయపడి, చెప్పిన సమయం కన్నా పదినిమిషాలు ముందుగానే వెళ్ళాడు. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఒక అమ్మాయి లక్షణంగా స్వాగతం పలికి, అప్పారావ్ వచ్చినట్టుగా సంతకం చేయించుకుంది.

“నా సీటు నంబర్?” అని అప్పారావ్ స్టైల్‌గా అడిగాడు.

“హాలు ఖాళీగానే ఉంది, ఎక్కడైనా కూర్చోవచ్చు” అని ఇంగ్లీష్‌లో విన్నవించడంతో ఉత్సాహం నీరుగారి లోపలికెళ్ళాడు. ఆ తరువాత అరగంటకి ఒక మోస్తారుగా హాలు నిండినట్టుగా కనిపించడంతో, ఆ ఇద్దరు రచయితలు స్టేజ్ మీదకు వచ్చారు. వారి వెనక కొన్ని పుస్తకాలు చిన్న చెక్క అల్మారాలో నిలబెట్టి ఉన్నాయి.

“నిజానికి మేమిద్దరం రచయితలం కాదు. పుస్తకాల్ని ముద్రించే పబ్లిషర్లం. మేం కూడా తలా ఒక పుస్తకం రాశాం అనుకోండి, అది వేరే విషయం! ఇక్కడున్న పుస్తకాలన్నీ మేం ముద్రించినవే! ఇప్పుడు నా మిత్రుడు ముందుగా మాట్లాడతాడు, నేను చివర్లో వస్తాను” అని ఆంగ్లంలో చెప్పి స్టేజ్ దిగాడు వాళ్ళిద్దరిలోని కుర్ర రచయిత.

స్టేజ్‌పై మిగిలిన సీనియర్ రచయిత, “మీలో ముప్పై రోజుల్లో పుస్తకాన్ని ప్రచురించాలి అని అనుకుంటున్నది ఎవరో చేతులెత్తండి” అని అనడంతో, “హాండ్సప్” అన్నంత కంగారుగా అందరూ చేతులెత్తారు.

“గుడ్! ఇప్పుడు మీ పక్కన ఉన్న వ్యక్తికి కాబోయే పబ్లిష్డ్ రచయితగా షేక్ హ్యాండ్ ఇవ్వండి” అన్నాడు.

బాగానే ఉత్సాహపరుస్తున్నాడు అనుకొని, ఇటు పక్కన చూశాడు అప్పారావ్. ఇక్కడెవరూ లేరు. అటు పక్కన చూశాడు. ఒక సీటుకు అవతల ఉన్న అతను అప్పారావ్.ని చూశాడు. ఓ లిప్తకాలం పాటు ఒకర్నొకరు కాస్త అనుమానంగా చూసుకున్నాక చేతులు కలుపుకున్నారు.

“మీకో సంగతి తెలుసా? రచయిత కావాలని కలలుకనే ప్రతి వంద మందిలో కేవలం ఇద్దరు మాత్రమే రాస్తున్నారు. మరో విషయం ఏంటంటే పుస్తకాలు కొంటున్న వారిలో కేవలం 30% మంది మాత్రమే చదువుతున్నారు. మిగతా 70% మంది కేవలం వాటిని కొని భద్రంగా దాచుకుంటున్నారు అని గూగులమ్మ చెప్తోంది. కాబట్టి మీరు రాయాలనుకున్నది రాసేయండి, ఎలాగో కొన్నవారిలో 70% మంది చదవరు కదా!” అని ఫక్కున నవ్వాడు సీనియర్ రచయిత.

అందరూ ఘొల్లుమని నవ్వారు. కాసేపు ఆయన అలా నవ్వించి, టీ బ్రేక్ అయ్యాక కలుద్దాం అని ముగించాడు.

అక్కడ సమోసాలు, బిస్కెట్లు, టీ కూడా ఉంచడంతో “ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్‌.షాప్ పెట్టి ఉచితంగా ఇవన్నీ ఇస్తున్నారంటే, సంథింగ్ ఈజ్ దేర్!” అనుకున్నాడు అప్పారావ్.

బ్రేక్ తర్వాత కుర్ర రచయిత ఛార్జ్ తీసుకొని స్టేజ్ పైకి వచ్చి, “నేనూ నా భార్య, అంటే మీకు రిసెప్షన్‌లో కలిసిన అమ్మాయి కలిసి ఫిట్‌నెస్ మీద ఒక పుస్తకం రాశా౦. అది ఒక ఈ-కామర్స్ సైట్లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. మీరు పుస్తకం రాసి మాకివ్వండి, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించండి. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ముద్రించి, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా విడుదల చేసి బెస్ట్ సెల్లర్‌గా మేం నిలబెడతాం” అన్నాడు.

అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. అప్పారావ్.కి కూడా తప్పలేదు.

ఇంతలో అప్పారావ్ పక్కన ఉన్నాయన లేచి, “ఫిక్షన్ రాసే వారికి కూడా మీరు హెల్ప్ చేస్తారా? అంటే కథలు, నవలలు రాసేవారి కోసం?” అనడిగాడు.

“ఐయాం ఎక్స్‌.ట్రీంలీ సారీ! మేం కేవలం నాన్-ఫిక్షన్‌లో మాత్రమే నిష్ణాతులం. ఫిక్షన్ గురించి మాకస్సలు అవగాహన లేదు” అని బదులిచ్చాడు.

అప్పటిక్కానీ తను సరైన వర్క్‌షాప్‌కి రాలేదని అర్థ౦ అయ్యింది అప్పారావ్.కి. అయితే ఫ్రీగా సమోసాలు ఎందుకు పెట్టారో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఆగిపోయాడు.

ముప్పై రోజుల్లో పబ్లిష్డ్ రైటర్ అవ్వాలనుకుంటున్న వారిని స్టేజ్‌ పైకి రమ్మని ఆహ్వానించాడు కుర్ర రచయిత. అందరూ వెళ్లి స్కూల్ మొదలయ్యేముందు చేసే ప్రార్థనలో నిలబడ్డట్టుగా బుద్ధిగా నిలబడ్డారు. అందరితో కలిపి గ్రూప్ ఫోటో దిగేందుకు ఉపక్రమించారు ఆ రచయితల ద్వయం. కెమెరామెన్ “స్మైల్ ప్లీజ్” అనగానే సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తారని గుర్తొచ్చిన వాళ్ళు అసంకల్పిత ప్రతీకారచర్యగా నవ్వేశారు.

ఆ తర్వాత మైక్ పట్టుకొని “ముప్పై రోజుల్లో పుస్తకం రాయడం ఎలాగో ఈ వర్క్‌.షాప్‌లో వివరించడం కుదరదు. అందుకు మీరు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. బ్రేక్‌ఫస్ట్, బఫే మీల్స్, స్నాక్స్, హై-టీ అన్నీ కలిపి ఒక ఫైవ్ స్టార్ హోటల్లోని ఏసీ హాల్లో ప్రోగ్రాం పెట్టుకుందాం. నేను పుస్తకం రాయకముందే రెండు లక్షల రూపాయలు ఎలా సంపాదించానో అక్కడ వివరిస్తాను. ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించే ముంబైకి చెందిన పేరుమోసిన రచయిత ఒక్కొక్కరికీ పదిహేను వేలు తీసుకుంటారు. మరీ నేను ఎంత తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు?” అన్నాడు కుర్ర రచయిత.

కొంతమంది “పదివేలు” అంటూ అరిచారు. ఇంకొంత మంది “ఐదువేలు” అంటూ నినదించారు. కుర్ర రచయిత, సీనియర్ రచయిత బిగ్గరగా నవ్వి, “మేము మాత్రం పదివేలు కాదు, ఐదు వేలు కాదు, స్పెషల్ ఆఫర్ కింద కేవలం రెండువేల ఐదు వందలు మాత్రమే తీసుకుంటాం. మీ ఫోన్లకి సందేశం రూపంలో వచ్చిన కూపన్ కోడ్ ఎంటర్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆ కోడ్ ఈ సమావేశం ముగిసేలోపు అంటే ఇంకో పదిహేను నిమిషాల్లో ఎక్స్‌పైర్ అవుతుంది. కాబట్టి తొందరగా పే చెయ్యండి” అన్నారు.

అప్పటికే స్టేజ్ పైకి ఎక్కిన దాదాపు వంద మంది ఫోన్లను తీసి, ఎక్కడ కూపన్ కోడ్ వెళ్ళిపోతుందో అని భయపడి ఆగమేఘాల మీద పే చెయ్యడం మొదలుపెట్టారు. ప్రోగ్రాం మొదలుపెట్టక ముందే రెండున్నర లక్షలు అక్కౌంట్లో జమ చేయించుకున్న ఆ రచయితల మార్కెటింగ్ నైపుణ్యానికి కిందనున్నవారు ఆశ్చర్యపోయారు.

ఉచిత సమోసాల వెనకున్న అసలు కథ అర్థ౦ చేసుకున్న అప్పారావ్ ధైర్యంగా లేచి, “పుస్తకం ముద్రించేందుకు మీ ప్రాసెసింగ్ ఫీజు ఎంత?” అనడిగాడు.

“ఒక్క పది నిముషాలు ఆగండి… చెబుతా” అన్నాడు కుర్ర రచయిత.

స్టేజ్‌పైనున్న వాళ్ళు అందరూ డబ్బులు చెల్లించారు అని నిర్ధారించుకున్నాక, గొంతు సవరించుకొని “మీరు పుస్తకాన్ని వర్డ్‌ఫైల్‌లో టైప్ చేసి పంపితే చాలు. దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి, అవసరమైన చోట ప్రొఫెషనల్ ఎడిటర్లతో మార్పులు చేర్పులు చేయించి, అందమైన కవర్ డిజైన్ చేయించి, వాటి మీద మీ ఫోటో ముద్రించి, వెనకాల మీ ఫోన్ నంబర్, అడ్రస్, అన్నీ సోషల్ మీడియా చిరునామాలు ముద్రిస్తాం. ఎందుకంటే ఇక నుంచీ మీ పుస్తకమే మీకు విజిటింగ్ కార్డ్. ఆ తర్వాత వాటిని అన్ని వెబ్‌సైట్లలో అమ్మకానికి ఉంచుతాం. అందుకు గాను మీ పుస్తకంలో ఉన్న పేజీలను బట్టి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది” అన్నాడు.

“అంటే, ప్రి౦టింగ్ ఖర్చులు కలుపుకొని చెబుతున్నారా?” అన్నాడు అప్పారావ్ అమాయకంగా.

“కాదండి. ప్రింటింగ్ ఖర్చులు వేరే. ఇది కేవలం మా ఫీజు” అని ముగించి వెళ్ళిపోయాడు.

దాంతో అందరూ ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు. స్టేజ్ పైన ఉన్నవాళ్ల మొహాల్లో రక్తపు చుక్క లేదు.

అప్పారావ్.కి ఒక సీటు తర్వాత ఉన్నాయన మెల్లిగా అప్పారావ్. వైపు వంగి చెప్పడం మొదలు పెట్టాడు, “రచయిత కావాలన్న ఆశ ఉన్నవాళ్ల దగ్గరి నుంచి పెట్టుబడి డబ్బులు తీసుకొని పుస్తకంగా ముద్రిస్తారు. దాన్ని వీళ్ళ మనుషుల ద్వారానే ఎక్కువ కాపీలు ఓ వారం వ్యవధిలో ఆన్.లైన్లో ఆర్డర్ చేస్తారు. దాంతో అదున్న భాష, వర్గం, జానర్‌లలో కలిపి ఒక్క రోజు అమ్మకాల్లో మొదటి స్థానంలోకి వచ్చినా, ఆ తరువాత ఆ పుస్తకాన్ని ఆ వెబ్.సైట్‌లో బెస్ట్ సెల్లర్‌గా అట్టపై ముద్రించి మార్కెటింగ్ చేస్తారు. ఈ విజయాన్ని ఎరగా చూపించి అదే రచయితకి కాస్త తక్కువ ధరకు కొన్ని వందల కాపీలు అంటగడతారు. వాటిని అతను తన సర్కిల్.లో రచయితగా పేరు తెచ్చుకునేందుకు ఉచితంగా ఇస్తూ చలామణీ అవుతాడు. ఈ పబ్లిషర్ల వల్లే తన కోరిక నెరవేరిందని భావిస్తాడు. ఒకవేళ పుస్తకం బాగా అమ్ముడుపోకపోతే వీళ్ళకు వచ్చే నష్టం శూన్యం. ఎందుకంటే పెట్టుబడి రచయితది కాబట్టి! అనుకోకుండా పుస్తకం హిట్ అయితే వాళ్ళకి విపరీతంగా లాభాలొస్తాయి. కానీ రచయితకు న్యాయంగా ఇవ్వాల్సిన రాయాల్టీ ఇవ్వరు. ఎన్నిసార్లు అడిగినా పుస్తకాలు అమ్ముడు పోలేదనే చెప్తారు. ఇది నాకూ, నా స్నేహితులకు అనుభవమైన విషయం” అని ముగించాడు.

లాజిక్కంతా అర్థ౦ చేసుకునేసరికి అప్పారావ్ మతిపోయింది. ఇంటికి వచ్చేశాడు. ఇలా అయితే కుదరదు అనుకొని కొన్నాళ్ళు గమ్మున ఉన్నాడు. సూపర్ ఫాస్ట్ రైటర్ల నుంచి డిస్కౌంట్ లభించే కూపన్ కోడ్, ఆ భారీ వర్క్.షాప్ జరిగే వరకు వస్తూనే ఉంది. అప్పారావ్ ఆ ఎస్ఎంఎస్ వచ్చినప్పుడల్లా కిసుక్కున నవ్వుకునేవాడు.

ఎలా తెలిసిందో ఏమో కానీ, ఒక రోజు ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియా టీం నుంచి ఫోన్ వచ్చింది. “సోషల్ మీడియాలో మీరు రాసిన పోస్టులు చూశామండీ! మాకూ మీలాంటి వాళ్ళే కావాలి. నిజమా, అబద్ధమా అన్న విషయం పక్కనపెట్టి  అవాకులు చెవాకులూ పేలుస్తూ, ఉన్నవీ లేనివీ సృష్టించి రాయాలి. సొంత పార్టీకి మేలుచేసే పోస్టులు ఎక్కువ రాయకపోయినా ఫర్వాలేదు కానీ, అధికార పార్టీకి కీడుచేసే పోస్టులు విరివిగా రాయాలి” అని అవతలి వ్యక్తి వినయంగా చెప్పాడు. పైగా ఇంటినుంచే పనిచేసే వెసులుబాటుతో పాటు, ఐదంకెల జీతం కూడా ఆఫర్ చేశాడు. కొద్ది క్షణాలు ఇది కలా? నిజమా? అని అర్థమవక సతమతమైన అప్పారావ్, కథలు రాయడం కన్నా ఇది ఏమాత్రం తక్కువ కాదని ఎగిరి గంతేసి ఒప్పేసుకున్నాడు.

ఒక నెల జీతం అందుకోగానే శేషాచలానికి ఫోన్ చేసి, తను చెప్పే ఇతివృత్తంతో తన పేరుతో కథలు రాసి పెట్టాలని, ఒక్కో కథకి పత్రికల వాళ్లు ఇచ్చినదానికన్నా రెట్టింపు పారితోషికం ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. అప్పారావ్ అనూహ్యమైన ఎదుగుదలకు కారణమేంటి? అని అర్థం అవక తలపట్టుక్కూర్చున్నాడు శేషాచలం.

*

రాస్తూనే ఉంటాను: అరుణ్

* హాయ్ అరుణ్! మీ గురించి చెప్పండి.

హాయ్! మాది నిజామాబాద్ జిల్లాలోని అభంగపట్నం. పదో తరగతి వరకు పక్కనే ఉన్న నవీపేటలో చదివాను. ఆ తర్వాత నిజామాబాద్‌లో డిప్లమో, ఇంజినీరింగ్ చేశాను. ప్రస్తుతం జోగిపేటలో ఉంటున్నాను‌. కంటెంట్ రైటర్‌గా పని చేస్తున్నాను.

* మీ కథల ప్రయాణం ఎలా మొదలైంది?

నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి. ఎప్పటికైనా సినిమా దర్శకుణ్ని కావాలని కోరిక. డిప్లమో చదివే టైంలో విపరీతంగా సినిమాలు చూసేవాణ్ని. ఆ టైంలో నాకు తోచినట్టు సొంతంగా సినిమా స్ర్కిప్ట్‌లు రాసుకునేవాణ్ని‌. అప్పటిదాకా దినపత్రికల్లో వచ్చే కథలు చదవడం తప్ప నేను కథలు రాయాలని అనుకోలేదు. చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగంలోకి వెళ్లడం అంత సులభంగా కాదని అర్థమైంది. ఆ టైంలో నాకు తోచిన కథలు రాయడం మొదలు పెట్టాను. మూడు నెలల్లో దాదాపు 20 కథలు రాసి రకరకాల పత్రికలకు పంపాను. తిరిగి వచ్చేశాయి. చివరికి 2007 జనవరిలో నవ్య వారపత్రికలో ‘పిల్లి పోయి ఎలుక వచ్చే డాం డాం డాం’ అనే కథ ప్రచురితమైంది. ఇప్పటికి 15 కథలు అచ్చయ్యాయి.

* చాలా ఏళ్ల నుంచి రాస్తున్నారు. మరి 15 కథలే రాశారెందుకు?

మొదట్లో చాలా ఉత్సాహంగా కథలు రాశాను. ఆ తర్వాత పెళ్లయి, కుటుంబ బాధ్యతలు పెరగడంతో 2009 నుంచి 2019 దాకా రాయలేదు. దాదాపు పదేళ్ల పాటు కథలకు దూరంగా ఉన్నాను.

* మళ్లీ కథలెప్పుడు మొదలు పెట్టారు?

2018లో నిజామాబాద్‌లో సెల్‌ఫోన్ దుకాణదారులు ఒక పెద్ద ర్యాలీ చేశారు. ఆన్‌లైన్ అమ్మకాల కారణంగా తమ వ్యాపారాలు నష్టపోతున్నాయని, వాటిని ఆపాలని డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ మార్కెట్ అనేది చాలా పెద్ద వ్యవస్థ. దాన్ని నిరోధించడం వారి వల్ల కాదు. అయినా ఒక ఆలోచనతో వారంతా కలిసి ర్యాలీ చేయడం నాలో ఆలోచన రేపింది. ఆ నేపథ్యంలో ‘మినుకుమనే ఆశలు’ అనే కథ రాసి తెలుగు వెలుగు మాసపత్రికకు పంపాను. 2019లో ఆ కథ ప్రచురితమైంది. దానికి పాఠకుల నుంచి చాలా స్పందన వచ్చింది. నేను నిజామాబాద్ నేపథ్యంలో కథ రాసినా గుంటూరు, విజయనగరం జిల్లాల నుంచి కూడా చాలా మంది ఫోన్ చేసి అభినందించారు. ఈ మధ్య కూడా ఒకరు ఫోన్ చేసి ఆ కథ గురించి మాట్లాడారు. ఆ ఉత్సాహంతో మళ్లీ కథలు రాయడం మొదలైంది.

* ముందు ముందు ఎలాంటి కథలు రాయాలని ఉంది?

ప్రస్తుతం నవల రాసే ప్రయత్నంలో ఉన్నాను. వీటితోపాటు సినిమా స్క్రిప్ట్‌లూ రాసుకుంటున్నాను. కథలు రాయడం మాత్రం ఆపను. రాస్తూనే ఉంటాను.

*

అరుణ్ కుమార్ ఆలూరి

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • థాంక్యూ కిరణ్ విభావరి గారు 💐

    • కథ చదివి స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు 💐

    • 😍 థాంక్యూ వెరీ మచ్ బ్రో 💐

  • A very beautiful story. It looks like a screenplay writing. Wit in the story is powerful and awesome. Keep writing, Arun.

    • 😍 Thanks a ton Srinivas garu. Much obliged for your feedback. 🙏😊💐

  • ఆన్ లైన్ పబ్లిషింగ్ మోసాల వెనుక చాలా సీక్రెట్స్ చెప్పావు బ్రదర్. గుడ్. కీపిటప్

    • 😍 థాంక్యూ సో మచ్ బ్రదర్ 😊💐

  • కథ చాలా బాగా రాశారు బ్రదర్. ప్రచురణ సంస్థల ఆన్‌లైన్ మోసాల గురించి సూపర్ ఫాస్టుగా చెప్పారు. రచయితలకు జరుగుతున్న మోసాల గురించి చక్కని కథ రాశారనిపించింది. సమోసాల వెనుక రెండు వేల ఐదు వందల కామెడీ బాగుంది. రచయిత అవడం అంత ఈజీ కాదు, పుస్తకాలు ముద్రించుకోవడమూ అంత ఈజీ కాదని చెప్పారు. అభినందనలు అరుణ్ భాయ్.

    • ధన్యవాదాలు సంఘీర్ భాయ్ ❤️ Delighted for the feedback 💐😊

    • థాంక్యూ సో మచ్ సార్ 💐😍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు