చావు చుట్టూ నడిచే బతుకు కథ

 మనిషితో మతం పెనవేసుకుపోయే ఉంది ప్రపంచమంతా. భారతదేశంలో కులం కూడా అంతే!

మనిషి నుంచి మతాన్ని లేదా కులాన్ని విడదీయడం సాధ్యంకాదని నిరూపణ అవుతూనేవుంది.  మతం అంటే నమ్మకం. దేవుడితో ముడిపడిన నమ్మకం. ఆ నమ్మకం మీద ఆధారపడే మనిషి నడవడికను నియంత్రించడానికి మతమూ, కులమూ ప్రయత్నించాయి. బోధనలతో మొదలైన ఆ ప్రయత్నం, ఒక అధికారకేంద్రంగా మారడం మొదలయ్యాక మతం తీరునే మార్చేసింది. మతం మనిషిని నిర్దేశించడం మొదలుపెట్టింది. రాజ్యాలూ, రంగులూ వేరైనట్టే మతాలు కూడా వేరయ్యాయి. ‘మా మతం గొప్పది’ అని మొదలైన ప్రచారం, ‘మా మతం మాత్రమే గొప్పది’ అని ప్రకటించుకోవడంతో వాదవివాదాలు పెరిగాయి. ఘర్షణలు, యుద్ధాలు.. మతవ్యాప్తిలో అనివార్యం అయ్యాయి. భారతదేశంలో ఆధిక్య హిందూ మతం, కులాన్ని ఆయుధంగా మలచుకుంది. కులాలమధ్య అంతరాలు సృష్టించింది.

సుదీర్ఘకాలం భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటీష్‌ ప్రభువులు, తమ వెంట తెచ్చుకున్న క్రైస్తవాన్ని తమ బంగ్లాలకే పరిమితం చేయలేదు. హిందూమతం బలంగా వేళ్లు నాటుకున్న చోట, క్రైస్తవం చొరబాటు తొలుత అంత తేలిక కాలేదు. కులం అందుకు అవకాశం ఇచ్చింది. అట్టడుగుజాతి మనుషులుగా వివక్షకు, హింసకు గురవుతున్నవారు ఊపిరిపీల్చుకోవడానికి క్రైస్తవం దారి చూపింది. కులం పేరుతో మనిషి అస్తిత్వాన్నే అవమానించే స్థితిలోంచి బయటపడడానికి మతం ఊతంగా మారింది. క్రైస్తవంతో పాటూ ఇస్లాం కూడా భారతదేశంలో ఇందుకు ఉపయోగపడింది. అయితే, మతం మారినంత మాత్రాన కులం మాయం కాలేదు. పేరు మాత్రమే మారింది. కులంతో పాటూ ముడిపడ్డ ఆచారవ్యవహారాలన్నీ మతంలోకీ జొరబడ్డాయి. మతాన్నే అవి ప్రభావితం చేశాయి.

నచ్చిన ఒక కథ గురించి రాయడానికి నిజానికి ఇంత అవసరం లేదు. కానీ, కథ నచ్చడానికి కారణమే ఇది అయినపుడు నేపథ్యాన్ని విస్మరించలేము. ఇండ్ల చంద్రశేఖర్‌ రాసిన ‘దేహయాత్ర’ కథ చదివినపుడు, పాత్రలూ, స్వభావాలూ, కథన నైపుణ్యం కన్నా ఎక్కువగా కథ వెనుకవున్నదేన్నో వెతుకులాడేలా నన్ను లాక్కువెళ్లింది. 2019లో ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ‘దేహయాత్ర’ కథ అచ్చయింది. ‘కథ 2019’లో కూడా ఉంది.

ఈ కథ చదువుతున్నపుడు శ్రీలంకలో నాకు ఎదురైన ఒక అనుభవం గుర్తుకువచ్చింది. శ్రీలంకలో మూడు మూలజాతులవాళ్లు ఉన్నారు. వారిలో రెండుజాతులవాళ్లు  మాట్లాడే భాష తెలుగు. అహికుంటికలు అని వీరిని పిలుస్తారు. జిప్సీలుగా ముద్రపడ్డ వీరు కోతులు, పాములు ఆడిస్తారు. వీళ్లని కలుసుకోవడానికి మధ్యలంకలోని దీవరగమ అనే ఊరికి నా మిత్రులు స.వెం.రమేశ, అడపాల సుబ్బారెడ్డితో కలిసి వెళ్లాను. అహికుంటికలు మాత్రమే ఉండే ఊరు అది. మేము వెళ్లిన రోజున ఆ ఊళ్లో ఒకరు చనిపోయారు. ఎత్తుబడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము కూడా హాజరయ్యాం. క్రైస్తవ సంప్రదాయంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులోనే ప్రార్ధనలు చేస్తున్నారు. తెలుగులోనే కీర్తనలు పాడుతున్నారు. నిజానికి అహికుంటికలకు సొంత ఆచారవ్యవహారాలున్నాయి. అడవులకు దూరమై, నగరాలను ఆశ్రయించి బతకడానికి అలవాటుపడ్డాక వీరు మతాన్ని ఆశ్రయించారు. ఎక్కువమంది క్రైస్తవాన్ని, కొందరు బౌద్ధాన్ని స్వీకరించారు. ఎందుకు? అని అడిగితే వాళ్లు చెప్పిన సమాధానం- స్మశానం కోసం అని. పుట్టుకలు, పెళ్లిళ్లు, పండగలకు సమస్య రాలేదు కానీ, చావుకి పెద్ద చావొచ్చిపడింది. ఎక్కడ పూడ్చాలి అనేది సమస్య. క్రైస్తవులకి స్మశానాలున్నాయి. బౌద్ధఆచారాలు పాటించే సింహళులకూ స్మశానాలున్నాయి. తెలుగుమాట్లాడే అహికుంటికలకు సొంత స్మశానాలు లేవు. చనిపోతే పూడ్చడానికి  చోటు కావాలి కాబట్టి ఒక మతాన్ని స్వీకరించాల్సి వచ్చింది.

‘దేహయాత్ర’ కథ కూడా ఒక చావు చుట్టూనే నడుస్తుంది. చచ్చిపోయింది సినజాలయ్య నాయన. పెళ్లాం, కూతురు, అమ్మ, బంధువులు..అందరూ ఏడుస్తున్నారు, ఒక్క సినజాలయ్య తప్ప. తండ్రి చావుకన్నా పెద్ద సమస్యే అతని ముందు ఉంది. క్రైస్తవంలోకి మారిన మాదిగకుటుంబం వాళ్లది. క్రైస్తవ ఆచారాల ప్రకారమే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊళ్లోవున్న చర్చి పాస్టర్‌ వచ్చాడు. స్మశానంలో గుంత తవ్వుతున్నారు. సాగనంపడానికి ఇబ్బందేమీ లేదు. కానీ, తండ్రి ఆఖరి కోరికను తీర్చాలనుకున్నాడు సినజాలయ్య. అదే ఇప్పుడు పెద్ద చిక్కుతెచ్చి పెట్టింది. ఊళ్లో యాబై ఏళ్లుగా క్రైస్తవం వుంది. వాళ్లది బాప్టిస్టు సంఘం. చర్చి కట్టుకున్నారు. ప్రార్థనలు చేసుకుంటున్నారు. కొత్తగా పెంతకోస్తు సంఘం వాళ్లు వచ్చారు. ఊళ్లోంచి ఒకరూ ఇద్దరూ వాళ్లదగ్గరకి వెళ్తున్నారు. సినజాలయ్య నాయనకూడా పెంతకోస్తు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసివస్తున్నాడు. బాప్టిస్టు సంఘం పాస్టరు దీన్ని తప్పు పట్టాడు. వ్యతిరేకించాడు. యాబై ఏళ్లుగావున్న ఊరికట్టు తప్పుతుందేమో అని కొందరు భయపడ్డారు. అయితే కొత్త సంఘాన్ని అడ్డుకోవడానికి పెద్దలు అంగీకరించలేదు. ఊళ్లో చీలికలు, గొడవలు వద్దన్నారు. బాప్టిస్టు సంఘం పాస్టరుకి ఊరిపెద్దలమీద అందుకే కోపం. పెంతకోస్తు సంఘం వాళ్లు తాళిబొట్టు వేసుకోరు. బాప్టిస్టు సంఘమోళ్ల ఇళ్లలో చావులు జరిగితే దినాలకు రారు. గొడవలుపడి కొట్లాడుకునేదానికన్నా ప్రార్ధనలకి వెళ్లి రానీ అనుకున్నారు పెద్దలు. అయితే, సినజాలయ్య నాయన చావుతో పెద్ద సంకటమే మొదలైంది.

‘పెంతకోస్తు సంఘమోళ్లుతో భూస్థాపితం చేపిచ్చుకోవాలనేది’ సినజాలయ్య నాయన చివరి కోరిక. కొడుకు తీర్చాలి కదా. ఆ సంగతే చెప్పాడు అతను.  ‘యే సంఘమోల్లయినా పార్థన చేసేది యేసుక్రీస్తుకే కదా. మన పాస్టరే మీ నాయన్ని భూస్థాపితం చేస్తాడులే’ అని కులపెద్దలు మంచిగా చెప్పారు. సినజాలయ్య మాత్రం తండ్రి ఆఖరికోరిక తీర్చాలనే పట్టుదలతోనే ఉన్నాడు. కానీ ఉడుకునెత్తురుండే కుర్రోళ్లు ఊరుకోరు కదా..‘ఇప్పుడు మన పాస్టరు పార్థన చేసి పెట్టిలో పెడితే చచ్చిపోయిన మీ నాన్న లేచొచ్చి నిన్ను చెప్పుతో కొడతాడా?’ అని నిలదీశారు. కొందరు సినజాలయ్యనే సమర్ధించారు. కొందరు వ్యతిరేకించారు. గొడవ ముదురుతూ ఉంది. ఎప్పుడూ చర్చికి వెళ్లని శేకరుకి కోపం నసాళానికి అంటింది. ‘కమ్మగా కలిసున్న పల్లెను కాజేస్తున్నారయ్యా ఈ పాస్టర్లు’ అనేశాడు. గొడవ ఇంకా పెద్దదయ్యింది. ఏదీ తెగలేదు. గొడవ సద్దుమణగలేదు. ఈలోగా జరగాల్సింది జరిగిపొయ్యింది.

ఊరిజనం లేకుండానే, తప్పెట్లు కొట్టకుండానే, సువ్వాయిలు కాల్చకుండానే. పూలు చల్లకుండానే పెంతకోస్తు సంఘమోల్లు పని కానిచ్చేశారు.  ఈ సంగతి తెలిసి ఊరు ఉడికిపోయింది. ముందు బాప్టిస్టు సంఘం పాస్టరు ప్రార్ధనే చేసి మూడుసార్లు మట్టివేశాకే, పెంతకోస్తు సంఘమోళ్లు మిగతా కార్యక్రమం పూర్తి చేశారు. ‘చచ్చిన మనిషిని రెండుసార్లు బూడ్చిపెట్టిన ఘనత మన పల్లెకే దక్కుతుంది సూడు’ అని ఎగతాళిమాటలంటూ ఉండగా శేకరు వెర్రి కోపంతో ఇంతలావు కంకర్రాయిని ఇస్సిరి నూకాడు. అది దూరంగా ఆపివున్న పాస్టరు బండికి తగిలి అద్దం బద్దలయింది. ఇదీ కథ.

కథ ప్రారంభమే,  ఫలానా  వ్యక్తి చనిపోయాడు అని గాక, ‘మనిషి చచ్చిపోయాడు’ అని మొదలు పెడుతాడు రచయిత. ఇక్కడే అంతరాల పట్ల ఆయనకున్న వ్యతిరేకత, అసహనం వెల్లడవుతాయి. కథను పాస్టరు అద్దం బద్దలవడంతో ముగిస్తాడు. నిజానికి బద్దలైంది బండి అద్దం మాత్రమే కాదు. పల్లెజీవనం. ఒకసారి బద్దలయ్యాక అద్దం అతుక్కోనట్లే, జనం కలిసిమెలిసి జీవించలేరు.  హిందూమతంలో ఉన్నట్టే అన్ని మతాల్లోనూ అంతరాలున్నాయి. అంతరాలు ఎక్కడ ఉన్నా అవి మనిషిని ధ్వంసం చేస్తాయి.  ఆ విధ్వంసం మొదలైందని చెప్పిన కథే ‘దేహయాత్ర’. ప్రకాశం జిల్లాలోని దళితపల్లెల మాండలిక యాసతో కథను అద్భుతంగా నడిపారు ఇండ్ల చంద్రశేఖర్‌. హిందూ ఉన్మాదాన్నుంచి బయటపడడానికి దళితులు ముస్లీంలుగా మారిన పరిస్థితులను ‘ఇల్లాంటి తవ్వాయి వస్తే’ అనే కథలో 1934లోనే వెల్లడించారు శ్రీపాద. మతం మారినా కులం వదలదు. పాలననూ, మతాన్నీ కలిపి దేశంలోకి చొప్పించిన బ్రిటీషు దొరలు, భారతదేశంలోని కులాన్నుంచి మాత్రం క్రైస్తవాన్ని కాపాడుకోలేకపోయారు. కమ్మక్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, మాలక్రైస్తవులు, మాదిగ క్రైస్తవులు, యానాది క్రైస్తవులు..ఇప్పటికీ అంతరాలు అంతం కాలేదు. క్రైస్తవంలో ఉన్న అంతరాలకు ఇవి తోడయ్యాయి. మనిషిని చంపేస్తున్నాయి. ఇండ్ల చంద్రశేఖర్‌ బాధపడి, ‘దేహయాత్ర’లో కథగట్టి చెప్పింది ఇదే.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇండ్ల చంద్రశేఖర్ రాసిన దేహయాత్ర కథను చాలా బాగా విశ్లేసించారు ఉమామహేశ్వరరావు గారు.

  • బావుంది విశ్లేషణ.మనుషుల మధ్య విభజనకు మూలాలు మతవిశ్వాసాల్లోనే ఉన్నాయి.ఉన్న స్థితిని నేరుగా చూడకుండా మత విశ్వాసం సేదతీరుస్తుది. దీనికి మరో పార్శ్వంగా మతాన్ని ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితులను చాలా బాగా వివరించారు. మంచి పరిచయం. ఉమాగారికి అభినందనలు.

  • అవును మతం మారినా కులం కలిగించే అంతరాలను బాగా చూపిన కథ దేహయాత్ర. పటిష్టమైన నేరేషన్ తో రచయిత ఇండ్ల చంద్రశేఖర్ మనిషిలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తాడు.🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు