దిష్టితాడు

ఇంటి ముంగిట ఆవుల గంటలు
లయబద్ధంగా మోగుతుంటే
గేదెలు కునుకుతూ నెమరు వేస్తుంటే
దూడల అమాయక కళ్లల్లో
పల్లెటూరి ఉదయం
పసితనమై మెరిసేది!
నులక మంచంపై దర్జాగా కూర్చున్న
తాతయ్య ముడతల చేతుల్లో..
ఆ నల్లటి దిష్టితాడు
చిన్ని నమ్మకపు దారమయ్యేది
ఊరి పశువుల మెడల్లో
అది ముడిపడగానే
ఏదో అదృశ్య కవచం
నీడలా ఆవరించేది
ప్రతీ ఇంటి నమ్మకం బంధించబడినట్టు
దిష్టితాడు ఇచ్చిన చేతికి
ఎవరో దోసెడు శనక్కాయలు
మరెవరో కొన్ని కొబ్బరికాయలు…
తాతయ్య చేతివృత్తికి దక్కిన కానుకలు
మా బాల్యంపై కురిసిన
చిన్న చిన్న పండగ చినుకులు!
ఖణఖణ మండే కట్టెల పొయ్యిపై
మంగలంలో ఇసుకేసి
శనక్కాయలు వేయించేది అమ్మమ్మ
ఆ పొగవాసనతో
అనుబంధాల పరిమళం కలసి
ఇల్లంతా గుప్పుమనేది!
గోడల మీద కదిలే నీడల సాక్షిగా
మేమంతా చుట్టూ చేరి ఎగబడేవాళ్లం
“వేడి… వేడి… చూసి తినండిరా!” అంటూ
అమ్మమ్మ దోసిళ్లతో మా ఒడిలో వడ్డిస్తుంటే…
చేతులు బొగ్గుల్లా నల్లబడేంతగా
వాటిని ఒలుచుకు తింటూ
చివర్లో నోట్లో వేసుకునే ఆ చిన్న బెల్లం ముక్క…
ఓహ్… అది నాలుకకు తీపి మాత్రమేనా?
అమ్మమ్మ చేతుల వెచ్చదనం
ఆ ఇంటి ఆత్మీయత
మా బాల్యపు నవ్వులన్నీ
తీపిగా కరిగిపోయేవి!
ఇప్పుడూ ఆవులున్నాయి
పసి దూడలూ ఉన్నాయి…
అంగట్లో రంగురంగుల
దిష్టితాళ్లూ దొరుకుతున్నాయి
మంగలం నిండా
మా బాల్యాన్ని వండి వడ్డించిన
అమ్మమ్మ ఆత్మీయత ఎక్కడ?
దిష్టితాడులో మమకారాన్ని ముడివేసిన
తాతయ్య చేతులెక్కడ?
కరిగిపోయిన కాలం
తన చీకటి పొరల్లో ఆ రోజులను దాచేసిందా?!
మిగిలింది ఇక
ఒక ప్రాణం లేని దిష్టితాడు
కొన్ని తీపి జ్ఞాపకాలు
తిరిగిరాని ఆ పల్లెటూరి బాల్యం!!
*

వైష్ణవి శ్రీ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తిరిగిరాని బాల్యమే కాదు నేటి తరానికి దక్కని నాటి ఆప్యాయతలు! ఎందుకో తేడా సుస్పష్టం
    కవిత బాల్యాన్ని తట్టింది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.