అదో సుప్త చైతన్యం
చరిత్రలో మొలకలెత్తిన
సరికొత్త అధ్యాయం
కోట్ల నోట్ల కట్టల నగిషీలు
తులాభారాలు
తూగుటుయ్యాలలు పట్టుపరుపుల
సోయగాలు
అత్తరుల పొత్తాలు, విలాసవనాలు
విరియని దాంపత్య జీవనం
వికసించదు
అక్కడ మగాడు పద్మవ్యూహంలో
చిక్కుకొన్న పగాడు.
అయిదంకెల కొలువుల జాతరలో
వెలిగే నక్షత్రాలపై తప్ప
ఆమ్నెస్టీ చూపని రాతి గుండెలవి
తోడు లేని జీవితం
తాటితోపుల్లో చెట్లకు మల్లే
దిగులు జాడలవుతున్నాయి
నిశ్చలన లో చనాల్లో
సూర్యోదయమయింది
పనికిరాదన్న తుక్కు నేటి మేటి
అగ్రవ్యాపార వస్తువయింది.
అనాథశరణాలయాలు
ఆపన్నుల కరచాలనంతో
భాగ్యశీలుర భాగస్వామ్యంతో
అపూర్వ ఆత్మగౌరవ సంకేతమై
ఆత్మీయ సంగమ కేతనాలయ్యాయి.
తోడు నీడగా నడిచే
జెన్జీ యువత
మోధోమథన సంపన్నత
అనాథను అనురాగ సంద్రంగా
తీరిచిదిద్దిన నవోన్మేష వసంతం
జీవితాల్ని
అంకెలతో కొలిచి ప్రస్థానించే
సంపన్నతే లెఖ్కలకు మూలధనమన్న
మరీచికల వెంట పయనించే
మనోభావాలకు గొడ్డలిపెట్టు
అతడు కట్టే తాళి
ఆమె మెడకు అలంకారం కాదు
ఈ సమాజ వ్యవస్థకు ఉరితాడు
రామపాదం తగిలి
రాయి ఆడది అయితే
ఆమె అడుగుల సవ్వడితో
ఆ ఇల్లు జాగృత జీవనవేదం అయ్యింది!
*








Add comment