కాలం గడవాలి

కాలం గడవటం ముఖ్యం
బాల్యం నుండి ఈనాటి వరకూ..
నక్షత్రకాంతి నింగి నుండి దూకబోవటం,
పూలరంగులు భూమి నుండి ఎగరబోవటం ముఖ్యం
సూర్యకాంతి పగలల్లా ప్రపంచం మీద ఆడుకోవటం,
చంద్రకాంతి చీకటితో దాగుడుమూతలు ఆడటం ముఖ్యం
నదులు ప్రవహించటం, పిట్టలు పాడటం
చెట్లు ఎదగటం, జీవులు నడవటం ముఖ్యం
కాలమిలా గడుస్తుంది
ఇంద్రధనువు వచ్చి, వెళ్ళినట్టు,
పూలు పూచి, రాలినట్టు,
నువ్వూ, నేనూ చిరునవ్వో, కన్నీరో రాల్చినట్టు
యుగాలు మాయమవుతాయి
గగనంలోని ఇంద్రధనువులా,
గాలిలో కరిగిన పిట్టకూతలా ,
కాలంలో మునిగిన గాయాల్లా, బాధల్లా, భయాల్లా
మాయమవుతున్న యుగాలని
చూస్తూ, ప్రేమిస్తూ, నిర్వేదిస్తూ
నువు మాత్రం మిగులుతావు
తారలు రాలిపోయాక మిగిలిన ఒంటరి గగనంలా
బహుశా, ఎప్పటికీ
బహుశా, కాలం లేని దేశంలో
*

బివివి ప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.