గుట్టల్లేవు చదరం చేసారు. భౌగోళిక పరిస్థితులు మారాయి. వలస పల్లె ను కబళించింది. ప్రపంచీకరణ సరళీకరణ పల్లె వృత్తులను చిదిమాయి . కంచెల్లేవు. కామంచి పూలు లేవు . రియల్ ఎస్టేట్ లో కాంక్రీట్ జంగిల్ అయిపోయాయి. డొంక ల్లేవు . గునుగు పూలు లేవు . గడ్డి మందుతో కలుపు మొక్కల్లేవు. ఖుష్కి నేలలోని కట్లపూలు గోరింట పూలు గద్ద గోరింట పూలు రోకలి బండ పూలు సోంపు పువ్వు కానరాట్లేదు. బతుకమ్మలోకి తంగేడు స్థానాన్ని బంతి ఆక్రమించింది. నాడు బంతి దీపావళి తర్వాతే పూచేది.మూడొంతుల తంగేడు నేడు ఒక్క వరుసకే పరిమితమై పోయింది. నేటి తరానికి తంగేడు ప్రత్యేకత నే తెలియ కుండా పోయింది. తంగేడు చెక్కను ఇనుము ఉక్కు తయారు లో, తోలు శుభ్రపరచుటలో వాడే వారు.గునుగు పూలు ఎక్కడో ఒకచోట కనిపిస్తున్నాయి. తంగేడు గునుగు కి నీటిని శుభ్రపరిచే గుణం ఉంది.
మహాలయ పెత్రమాస నాడు ప్రారంభమయ్యే ఎంగిలి పూల బతుకమ్మ మొదలు మిగిలిన ఎనిమిది రోజులు అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానే బియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నముద్దల బతుకమ్మ లను ప్రతి ఊర్లో సంస్కృతి సంప్రదాయాలకి ప్రతీకగా బతుకమ్మ ఆడే రోజులు పోయి మొక్కుబడిగా మొదటి రోజు సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా మాత్రమే బతుకమ్మ ఆడే రోజులు వచ్చాయి. వరల్డ్ రికార్డ్స్ కోసం సాంస్కృతిక విధ్వంసం జరుగుతుంది. చప్పట్లు కొడుతూ వంగుతూ లేస్తూ తమ గొంతుల కోరస్ తో పాడే పాటల జీవం కాలక్రమేణా కనుమరుగై పోతుంది. ఉత్తరాది మార్వాడీ కోలాటం బతుకమ్మ లోకి ప్రవేశించింది.
డిజె శబ్దాల లొల్లిలో ఏం పాటలు ప్లే చేస్తున్నారో ఏం ఆటలు ఆడుతున్నారో నేటి తరానికే తెలుసు. ద్వందార్థ పాటలు మోగుతుంటే బతుకమ్మ చుట్టూ చిందులేస్తుంటే తలదించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.బతుకమ్మ పాటల్లోని మాధుర్యాన్ని ఇప్పుడు గుర్తించుట లేదు. నాటి ఆ సాహిత్యం తెలంగాణ గ్రామీణ బతుకుల్లోంచి వ్యథల్లోంచి పుట్టుకొచ్చినవి.ప్రాంతానికి సంబంధించిన వనరుల మధ్య బతుకమ్మ రూపు దిద్దుకునేది. బతుకు అమ్మా! అని దీవించే పండుగ పిచ్చి పిచ్చి గెంతులతో తన విశిష్టత ను కోల్పోతుంది. నిన్నటి తరం చెప్పాలని చూసినా చీపురు పుల్లలా తీసి పడేస్తున్న నేటి తరం.
సద్దుల బతుకమ్మ అనగానే ఆడబిడ్డల ఆనందం పెల్లుబుకుతోంది. బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురుచూసే ఆడపిల్లలు తెలంగాణ అంతటా అగుపిస్తారు. అత్తారింటి నుండి అమ్మ గారింటికి తప్పకుండా పయనమయ్యే పండుగ బతుకమ్మ.ఇల్లంతా బూజు దులిపి ఇంట్లోని అన్ని గోడలు ఎర్రమట్టి తో అలికి తెల్ల సున్నం తో నిలువు గీతలు బొట్లు పెట్టి అందంగా తీర్చిదిద్దేది. పేడ తో వాకిలి ముస్తాబు చేసేది. ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనంలో ఆప్యాయతలు కొరవడిపోయాయి. పొద్దున్నే తలంటుకుని ఉపవాసంతో నిష్ఠ తో అన్నదమ్ములు ఎక్కడెక్కడో తిరిగి తిరిగి తెచ్చిచ్చిన పూలను ఒద్దికగా బతుకమ్మ ను పేర్చే అమ్మాయిలు ప్రతి ఇంటి లోగిలి లో కనిపించే వారు. సాలె మగ్గాల పై నేచిన చీరల అందాలతో పల్లె మురిసేది. డప్పులు ఇంటింటికీ వెళ్లి బతుకమ్మ కు సాదర ఆహ్వానం పలికేది. డప్పులతోనే జానపద గీతాలు సృష్టించ బడేవి. ఆ నైపుణ్యం నేటి తరానికి రుచించట్లేదు.నేడేమో డప్పులు బొడ్రాయి కాడి నుండి చెరువు దాకా వెళ్తున్నాయి.
ఈ పండుగ వేళకి ఈ ప్రాంతంలోని ఎర్ర నేల దుబ్బ చెలక ఇసుక నేలలో నాలుగు చినుకులు రాలగా పండి చేతికొచ్చే మొక్కజొన్న జొన్న నువ్వులు పెసర సజ్జ లతోనే నైవేద్యం పెడతారు. పెసర ముద్దలు సజ్జ ముద్దలు ప్రతి ఇంటా ఇష్టంగా తినేవారు.
ఈ నేలన పుట్టిన బతుకమ్మను బతుకమ్మలా పూజించి ఆడి పాడి నీటిలో వదిలి మరుసటి యేడు దాకా ఆశతో నిరీక్షించాలి. పాశ్చాత్య పోకడలతో మన బతుకమ్మను కించ పరచరాదు. ఉత్తరాది సంస్కృతి ని స్వీకరించి మన సంస్కృతి ని చంపరాదు. గొంతు గొంతు కలవాలి. సమిష్టి గేయాలు గాయాలను మాన్పాలి. ఒకరికొకరు అండగా ఉండాలి.
*








Add comment