దక్షిణాంధ్ర దారి దీపాల వెలుగు

క్షిణాంధ్రము అంటే ఏ ప్రాంతం?.. అన్న ఆలోచన కలగడం అతి సహజం! దక్షిణ భారతంలో తెలుగు మాట్లాడే వారు ఉన్న ప్రాంతాన్నంతా దక్షిణాంధ్రప్రాంతం అంటారు. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలుగా నున్న ప్రాంతాలలోనే గాక భారతదేశమంతటా తెలుగు మాట్లాడే వారి సంఖ్య తక్కువేమీకాదు. . భారత దేశపు దక్షిణ ప్రాంతంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఎంత అన్న విషయం ఈనాటి మనకు తెలుసా?

స్వతంత్రం తరవాత  దేశ భాషగా ఏది ఉండాలి అని ఆలోచించినప్పుడు, దేశంలో ఎక్కువమంది మాట్లాడే వంగ భాష గాని, తెలుగు భాషగాని తగినవి అన్నది అప్పటి కొందరి విజ్ఞుల అభిప్రాయం. వంగ రాష్ట్ర విభజన తరువాత, ఎన్నోమాండలికాలను కలుపుని ఏర్పడిన హిందీ భాషకన్నా, అత్యంత ఎక్కువమంది మాట్లాడే తెలుగు భాషకు రాజ్యభాష కాగలిగిన అర్హత ఉన్నదని చెప్పిన ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి.ఎన్. అన్నాదురై గారి అభిప్రాయం గమనింపదగినది. కాని రాజకీయాలు ఎప్పటికీ చాలా బలవత్తరమైనవి. భాషాప్రయుక్త రాష్ట్ర విభజనసమయంలో, ఆంధ్రరాష్ట్రం చుట్టూ కొన్ని ప్రాంతాలు… ఉదాహరణకు బళ్ళారి, హోసూరు తో బాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలూ గంజాం జిల్లా ..ఇలా చెప్పు కుంటూ పోతే బాధను మిగిల్చే…. ఎన్నో తెలుగు ప్రాంతాలు ఇతర రాష్ట్రాలలో కలుపుబడినాయి అన్న సత్యాన్ని మనమెరుగుదుము.

ఇప్పటి తమిళనాడులో స్వతంత్ర  సమయంలో 49 శాతం తెలుగు వారు ఉండేవారు అన్న సత్యం మనకు జ్ఞాపకంలో ఉందా!? అయితే ప్రస్తుతమున్న తమిళనాడు రాజధాని మదరాసు నగర నిర్మాతలు తెలుగు వారు అని గాని, మదరాసు నగర నిర్మాణంలో కీలక పాత్రను పోషించిన వారు తెలుగు వారేనన్న సత్యంగాని ఇప్పటి తరానికి తెలుసా? భాష, సంస్కృతి, పత్రికలు, ముద్రణాలయాలు, సాహిత్యం, పుస్తక విక్రయ శాలలు, మతము, నాటకరంగం, సినిమారంగం …ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సాంస్కృతికాంశం లోనూ తెలుగువారి ముద్ర ప్రధానంగా ఉందని మనకు గుర్తు ఉందా?అంతెందుకు?

తమిళనాడుముఖ్య మంత్రులలో తెలుగు వారి సంఖ్య ఎంతో మన జ్ఞాపకంలో ఉందా!? ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని వారు మదరాసు నగరానికే వచ్చేవారు. మదరాసు తెలుగునగరం అనే నమ్మేవారు. కాని ఆయా భాషలను మాట్లాడే వారి సంఖ్యను బట్టి ఏర్పడిన రాష్ట్ర విభజన సమయంలో, అత్యంత పెద్దదిగా ఏర్పడవలసిన ఆంధ్రరాష్ట్రాన్ని చుట్టూ ఉన్న తెలుగు ప్రాంతాలను తెగగొట్టి వేరే రాష్ట్రాలతో కలుపుతూ ఏర్పరచడం, ప్రళయ కావేరీ వంటి ప్రాంతాలతో బాటు, దక్షిణ ప్రాంతంలో ఎంతోమంది తెలుగు వారిని పోగొట్టుకోవడం …. ఇవన్నీ రాజకీయ వాదుల కుతంత్రాలకు , తెలుగు వారి అలసత్వానికి నిదర్శనం. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న తెలుగు మాట్లాడే వారి సంఖ్య భారత దేశంలోనూ, భారత దేశానికి అవతల కలిపి 18 కోట్లను మించి ఉన్నాయి అంటే గర్వపడవలసిన అంశమే! ఈ అన్ని విషయాలను, తెలుగు వారి భాషా సంస్కృతులను అన్వేషించి ఒకచోట గుదిగ్రుచ్చిన పరిశోధ నాత్మక గ్రంథమే …

ఈ “దక్షిణాంధ్ర దారిదీపాలు”. ఈ పుస్తకంలోని అంశాలనుబట్టి ఈ పుస్తకాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిది క్రీ. శ. 14, 15 వ శతాబ్దాలలో అక్కడ విరిసిన తెలుగు సాహిత్యం, ఆ ప్రాంతాన్ని ఏలిన తెలుగువారు అన్న అంశాలు. రెండవది, తమిళనాడులో నివసించిన తెలుగు వారు వివిధ రంగాలలో ప్రజలకు అందించిన సేవ, మదరాసు నగర నిర్మాణంలో తెలుగు వారి పాత్ర, సాహిత్య, సాంస్కృతిక, కళా సేవలలో … …ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సాంస్కృతిక రంగాలలో తెలుగు వారు అందించిన సేవ…అన్నది ద్వితీయవిభాగం. మూడవది, ప్రస్తుతం ఉన్న మదరాసు నగర సాంస్కృతికాంశాలు, కొందరు తెలుగుపెద్దలలో మిగిలిఉన్న మదరాసును గురించిన పాత జ్ఞాపకాలు..

దాదాపు 660 పుటలున్న ఈ బృహద్గ్రంథంలో తెలుగు రాష్ట్రాలనుండి దక్షిణ భారతం వరకు గల తెలుగు మహనీయుల వెలుగుజాడలు గ్రంథస్థం చేయబడినాయి. అయితే ఇదే సమగ్రం అని సంపాదకులు కూడా చెప్పలేదు. 2018 లో మొదటగా 35 మంది తెలుగు ప్రముఖులను గూర్చి ఒక పుస్తకాన్ని వెలువరించిన సంపాదకులు డా. నాగసూరి వేణుగోపాల్ గారు 2025 లో మొత్తం యాభై ఎనిమిది మంది తెలుగు ప్రముఖులను గూర్చి, దక్షిణాంధ్ర ప్రాచీనతను తెలిపే అంశాలను గూర్చి, నాలుగు దశాబ్దాల క్రిందటి మదరాసును గురించి, తాము ఉద్యోగించిన కాలంలో తాము చూసిన మదరాసును గురించిమాత్రమేగాక అమూల్య అనుబంధం అంటూ మరికొన్ని విలువైన అంశాలను చేర్చి మొత్తం 85 … (58 +06+09+12) విలువైన వ్యాసాలను ఈ గ్రంథంలో అందించారు.

ఇంకెవరైనా ఔత్సాహికులు పూనుకుంటే మరిన్ని వివరాలు వెలుగు చూడవచ్చు అన్న ఆశాభావాన్ని వెలువరించారు. ఇంతటి బృహత్తరమైన కృషి చేసిన నాగసూరి వారు, ప్రచురణకర్తలు బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్, గుంటూరు వారు, వ్యాస రచయితలైన దాదాపు యాభైమంది, ఇంకా తమ జ్ఞాపకాలను పంచుకొన్న ఇతరులు … అందరూ చిరస్మరణీయులే!

ఈ గ్రంథం లోని ఒక్కొక్క మహనీయుని స్మరించవలసిన అవసరం ఉంది. అయితే అది మరొక గ్రంథమంత విస్తారతను పొందగలదు. ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే, దాదాపు ఇరవై రంగాలకు చెందిన ప్రసిద్ధులను గురించిన వ్యాసాలున్న ట్లుగా గుర్తించగలం. ఈ వ్యాసాలను పరిశోధనాత్మకంగా అందించిన రచయిత(త్రు)లందరూ అభినందనీయులు. మొదటగా దక్షిణాంధ్రప్రాంతంలో తెలుగువారి ఉనికిని, చారిత్రక ప్రాచీనతను తెలిపే వ్యాసాలను(పుటలు..467-508) పరామర్శిద్ధాము. దక్షిణ భారతదేశంలో చెంజి దుర్గాధిపతిగా మహమ్మదీయుల విజృంభణను అరికట్టిన యోధుడు, చిత్తూరు జిల్లాలోని నారాయణవనం జన్మస్థలంగా కలిగిన వారు, తిరుమల రంగనాయక మండపంలో ప్రవాసంలోనున్న శ్రీ రంగనాథుని, అనేక శ్రమదమాదులకోర్చి, శ్రీరంగంలో పునఃప్రతిష్టించిన వారు అయిన తెలుగు రాజు గోపదండనాయకుడు “సింధుమతీ విలాసం”అనే రెండు ఆశ్వాసముల తెలుగు ప్రబంధాన్ని వ్రాసిన వారుకూడా! వీరిని గూర్చిన వివరాలు, తమిళ ప్రాచీన గ్రంధాలలోనూ, శ్రీరంగనాయకుల ఆలయశాసనాల్లోనూ ఉన్నందున తెలుగు వారికి సుపరిచితుడు కారు. ఎవరైనా పూనుకొని “కోయిల్ ఒళుగు” వంటి తమిళ ప్రాచీన గ్రంథాలను, సంస్కృతంలో నున్న వారి దానశాసనాలను పరిశీలిస్తే మనం మరిచిపోయిన ఒక తెలుగు యోధుని.. దక్షిణాంధ్రను ఏలిన ఒక తెలుగు కవిని గుర్తించగలం.

చంద్రగిరి రాజధానిగా వెలిసిన విజయనగర సామ్రాజ్యం నుండి తన రాజ్యం మధురను స్వతంత్రరాజ్యంగా ప్రకటించు కున్న తిరుమల నాయకుడు(పుటలు: 475-485) కూడా స్వేచ్చా జీవిగా బ్రదుక దలచుకొన్న తెలుగు రాజు. జీవితాంతం యుద్ధాల తోనే గడిపినా,అతడు తెలుగ్ భాషతోసహా, అన్ని భాషలలో.. అందరికీ విద్య అవసరమని స్థాపించిన పాఠశాలలు, కట్టించిన భవనాలు,ముఖ్యంగా మధుర లోని తిరుమల నాయకుని మండపం వంటివి, ఆనాటి ఒక తెలుగు రాజు కీర్తికి నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. విజయనగరరాజులకు మరొక సామంత రాజ్యమైన తంజావూరును పాలించిన తెలుగు రాజులను గురించి ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.

శ్రీకృష్ణ దేవరాయలను ఇటు సాహిత్యంలోనూ, అటు శౌర్యంలోను తలపింపజేయు రాఘునాథ నాయకుల(పుటలు:486-492)కాలంలోని తెలుగు భాషాప్రాచుర్యాన్ని గూర్చి చెప్పడానికి వారి కావ్యాలు, వారి ఆస్థాన పండితులు,ఆస్థాన కవయిత్రుల కావ్యాలే చాలు! ఎన్నో కొత్త రాగాలను సంగీతానికి జతచేసిన రఘునాథనాయకుడు తెలుగు రాజు కావడం గొప్ప విషయం. మధుర చొక్కనాథ నాయకుని పట్టమహిషి , భర్త మరణం తరువాత, తమ పూర్వీకుల వలె సహగమనం చేయక, పసివాడైన వారసుని ఒళ్ళోకూర్చుండబెట్టుకొని రాజ్యమేలిన వీరవనిత, (పుటలు:492-500)మంగమ్మ! సత్రాలను కట్టించడం, చెరువులను త్రవ్వించడం,కవులను,కళాకారులను పోషించడం, మతసహనం కలిగి ఉండటం, శత్రు రాజులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడటం,తనకన్నా బలవత్తరులైన శత్రువుతో రాజనీతిజ్ఞతతో సంధిని చేసికోవడం వంటివి ఆమె వీరత్వానికి ప్రతీకలు కాగా, మాతృభాషాభిమానంతో తెలుగులోనే వేయించిన శాసనాలు పరిశోధకులకు విలువైన ఆకరాలు. భారత దేశంలో తెల్లదొరతనాన్ని ఎదురొడ్డి పోరాడిన తొలియోధుడు,వీరపాండ్య కట్టబొమ్మన్ గా ప్రసిద్ధి కెక్కిన కట్ట బ్రహ్మన్న (పుటలు:501-506), పడమటి కనుమలలోని కొండల్లో చెక్ డ్యాములు కట్టి, వృధాగా ప్రవహిస్తున్న నీటిని దారిమళ్లించి, పంటపొలాలకు అందించిన ఎద్దులప్ప(పుటలు:507- 508)కూడా తెలుగు వారే!

పదునాల్గవశతాబ్దంలోనే దక్షిణ భారతంలో తెలుగు వారి చారిత్రక, సాంస్కృతిక అంశాలను విపులంగా చర్చించే యీ వ్యాసాలు ఇటువంటి చరిత్రను అన్వేషించాలన్న కృషికి నాందిగా నిలుస్తున్నాయి. ఇక ఆధునిక కాలంలో,ముఖ్యంగా మదరాసు నగరంలోనే నివసించి,తెలుగు భాషకు సేవజేసిన వారిని గూర్చి ఎన్నో విలువైన అంశాలను చెప్పే అద్భుతమైన వ్యాసాలు మొత్తం 58 చదివి తీరవలసినవే! మొదటి మూడు వ్యాసాలు అత్యంత విలువైన కావలి వెంకట బొర్రయ్య, కావలి వెంకట లక్ష్మయ్య, కావలి వెంకట రామస్వామి సోదరులు చేసిన సేవలకు సంబంధించినది.

కల్నల్ కాలిన్ మెకంజీ, దక్షిణ భారత దేశ చరిత్రకు సంబంధించిన చరిత్ర సంస్కృతులను సేకరించి నిర్మించిన కైఫియత్తుల కృషిలో పై ముగ్గురు పండితసోదరుల కృషి అనన్య సామాన్యం. సంస్కృత, తమిళ, తెలుగు, కన్నడ మొదలుగా వివిధ భాషలలోని1568 వ్రాత ప్రతులు, 2070 స్థానిక పురాణాలు, వృత్తాంతాలు, 8076 శిలా శాసన ప్రతులు,79 దేశ పటాలు, 2630 చిత్ర పటాలు, 6218 నాణేలు, 106 విగ్రహాలు, 40 పురాతన వస్తువులు … మొదలైనవి వీరు సేకరించిన విలువైన చారిత్రక సామగ్రి. అమరావతి బౌద్ధ స్తూపాన్ని మొదటగా గుర్తించిన మెకంజీకి సాయపడిన ఈ సోదరుల కృషి అనన్య సామాన్యం. భారత దేశంలో మొదటి ఇండో ఆంగ్లియన్ రచయిత, మొదటి శాసన పరిష్కర్త’, మొదటి ‘నాణెశాస్త్రజ్ఞుడు’, మొదటి దేశపట నిర్మాణ నిపుణుడు, మొదటి పరిశోధక చరిత్రకారుడు… ఇలా ఎన్నింటిలోనో మొదటి వ్యక్తిగా ఉన్న కావలి వెంకట బొర్రయ్య గారు, సంస్కృతంలో, తెలుగులో స్వయంగా కవి. కైఫియత్తుల లోని ఆధారాలతో హిస్టారికల్ కలెక్షన్ ఆఫ్ మైసూర్ ను, విజయ నగర సామ్రాజ్య చరిత్రను, శ్రావణ బెళగొళ జైన పండితులతో చర్చించి, జైన సంప్రదాయం పై ఒక గ్రంథాన్ని, చెన్న పట్నం లో ఐరోపీయుల చరిత్ర…వంటి నాలుగు చారిత్రిక గ్రంథాలను ఆంగ్లభాషలో 1800 – 1803 .. మూడు సంవత్సరాల కాలంలో రచించారనడం అద్బుతమైన విషయం.

1797 లోనే ‘A Memoir on the Hill of the Northern Circars’ & ‘An Account of Boyawar of Bedar tribe’ అన్న రెండు రచనల వలన భారత దేశపు మొదటి ఇండో – ఆంగ్లియన్ రచయితగా గుర్తింపును పొందినవారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది వారి సాధనలలో ఒక 30 శాతాన్ని మాత్రమే! తక్కిన ఇద్దరు కూడా తెలుగు భాషకు చేసినసేవను, రచించిన కావ్యాలను గూర్చి చదివి తీరవలసినదే!అందులో కావలి వెంకట రామస్వామి, ఆ రోజులలోనే తన కుమార్తెను కూడా చదివించి, స్త్రీ విద్యా ప్రాధాన్యాన్ని గుర్తించారనడం స్మరించుకోవలసిన అంశం. తొలిసారిగా తెలుగులో అచ్చుయంత్రాన్ని నెలకొల్పి, ఎన్నో ప్రాచీన సాహిత్య గ్రంథాలను ముంద్రించిన వావిళ్ల రామస్వామి (పుటలు: 96-100) గారు, ఇంటింటా గ్రంథాలయం పేరిట పుస్తకాదీపాలను వెలిగించిన ఎం. ఎస్. రావు(పుటలు: 397-407)గారు, మూడు దశాబ్దాల కాలంతెలుగు పుస్తకాలకు మద్రాసు చిరునామాగా రాణి బుక్ సెంటర్ ను నడిపిన అట్లూరి చౌదరాణి (పుటలు:435-442) గారు తెలుగు వారే!

ఎక్కడో అమెరికాలో 1875 లో తలెత్తిన ‘దివ్యజ్ఞాన సమాజం’ 1979 లో భారతదేశానికి తరలివచ్చి,1882 లో మదరాసులోని అడయార్ లో థియోసోఫికల్ సొసైటీ పేర స్థాపించడానికి ప్రధాన కారకులైన …”దివ్యజ్ఞాన తారక రాజయోగ ప్రవీణులు శ్రీయుతులు తల్లాప్రగడ సుబ్బారావు (పుటలు: 137-147)గారు తెలుగు వారే! శ్రీలంక బౌద్ధుడు, అనగారిక ధమ్మపాలుని చే కలకత్తాలో స్థాపింపబడిన “మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా”మద్రాసు శాఖకు అధికార ప్రతినిధిగా ఉండిన వారు, 1916 లో తాను రాసిన “వాటీజ్ బుద్ధి జం” గ్రంథం అప్పటి జెకొస్లవేకియా తొలి రాష్ట్రపతి అయిన జీన్ మసరిక్ ద్వారా జెక్ భాషలోకి అనువాదం అయి, వెంటనే జర్మన్ భాషలోనికి కూడా అనువదింపబడిన ప్రశస్తిని కలిగిన వారు, తమ మరొక గ్రంథం “ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం” ద్వారా డా.బి.ఆర్. అంబేడ్కర్ ను సైతం ప్రభావితం చేసిన వారు, బౌద్ధధర్మ ప్రభావం చేత కుల వాచకమైన తమ పేరులోని ‘నాయుడు’ అన్న పదాన్ని తొలగించుకున్న ప్రొఫెసర్ పోకల లక్ష్మీనరసు (పుటలు:148-157) గారు, మద్రాసులో తమిళులుగా గుర్తింబడినా, మదరాసు క్రిష్టియన్ కళాశాలలో డిగ్రీలో రెండవ భాషగా తెలుగును చదువుకున్న అచ్చమైన తెలుగు వారే!

అలాగే తెలుగు వారు మరిచిపోయిన వాగ్గేయకారుడు, అల్లూరి వెంకటాద్రి స్వామి గారు, తిరువయ్యారులో వాగ్గేయకారులు త్యాగరాజుల వారికి సమాధిని నిర్మించిన.. కర్ణాటక సంగీతానికి ఆయువు పట్టు .. అయిన బెంగుళూరు నాగరత్నమ్మగారు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న సంగీత విద్వాంసులు ద్వారకా, పార్థసారథి దాపతులు,కందుకూరికి సాయపడిన హరిదాసు, కారుపల్లి శివరామదాసు గారూ….వీరందరూ తమిళనాట నివసించిన అచ్చమైన తెలుగు వారే.

మదరాసు తొలి మేయర్ గా ఎన్నో సంవత్సరాలు చేసి, సున్నితంగా ముఖ్యమంత్రి పదవిని తిరస్కరించిన పిట్టి త్యాగరాయ శెట్టి గారు, మదరాసులో పాఠశాలలు,కళాశాలలు నిర్మించినవారు, మ్యూజిక్ అకాడెమీ స్థాపకులు, టి.నగర్ అనగానే గుర్తొచ్చే పానగల్ రాజావారు….ఒమండూరు వారు,పూసపాటి వారు, సి,నరసింహం గారు పొట్టిశ్రీరాములు భావనా సంరక్షకులు వై. ఎస్.మూర్తి గారు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరోమహానుభావులు… మదరాసు నగర నిర్మాణంలో ప్రధాన పాత్రను పోషించిన తెలుగు వారు .. ఒక్కరా ఇద్దరా..లెక్కకు మిక్కిలి.

తెలుగు భాషోద్యమ కారులు,సాధు వరదరాజు పంతులు గారు, తెలుగు ప్రాచీనత్వాన్ని నిర్ణయించడంలో ఉపయుక్తమైన పుస్తకాన్ని అందించిన కె.ఎస్.కోదండ రామయ్య గారు, బి .ఎస్. ఆర్. కృష్ణగారు, ముసునూరి జగన్నాథరాజా గారు, వి.కె.డబ్ల్యూ. పుష్పరాజ్ గారు, పెరిశేట్ల భాస్కరుడు.. ఇలా ఎందరినో ఈ గ్రంథం ద్వారా స్మరించుకోగలం. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను పొందిన తొలి మహిళ ఆచంట రుక్మిణమ్మగారు, తొలి మహిళా వైద్యురాలు, క్యాన్సర్ ఆ స్పత్రి నిర్మాత ముత్తులక్స్మీ రెడ్డి గారు…ఇంకా వివిధ వైద్య రంగాలలోకృషి చేసిన పెక్కులు వైద్యులు… ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లను ఇవ్వడమే మిగులుతుంది.. ఏ విషయాన్నైనా దాని సమగ్రసౌందర్యాన్ని ఆస్వాదించాలంటే.. ఎక్కడో ఒకచోట ఆపక తప్పదు. ఒక వ్యాసంతరువాత ఒక ఒక వ్యాసాన్ని చదువు తుంటే అంతులేని ఆనందాన్ని, విస్తారమైన ఆలోచనలను, మన తెలుగువారి అలసత్వం పట్ల కొంత విచారాన్ని కూడా కలిగించే ఈ పుస్తకం ఒక్క మదరాసునగరం లోని తెలుగు వారి జీవనాన్ని గూర్చి మాత్రమే గాక, విజయనగర రాజుల కాలంలో ను దక్షిణాంధ్రగా పిలువబడుతున్న ప్రాంతాలకు సంబంధించిన చారిత్రికాంశాలను స్మరించడంతోబాటు

ఇప్పటి మదరాసు లోని ప్రజల జీవన సంస్కృతినిగూర్చికూడ స్మరిస్తూంది. ఈ పుస్తకాన్ని చదవడం ప్రారంభించగానే, మనం ఎన్నో తరాలకు చెందిన వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న అనుభూతికి లోనవుతాము. విజయనగర సామంత రాజు, చంద్రగిరి రాజు అయిన మాదిరాజు పేరు మీద మాదిరాజు పట్టణంగా నిర్మింపబడి, వాడుకలో మదరాసు పట్నంగా మార్పుచెందింది, అన్న సత్యాన్ని తెలుపుతున్న (పుట:76) ఈ పుస్తకంతో బాటు మనమూ మదరాసు పట్నం పేరుమార్పులకు లోనైన స్థితిగతులను చూసి అబ్బురపడతాం!

ఎన్నో రంగాలలో తెలుగువారి ప్రథమ కృషిని గుర్తించి ఆనందానికి లోనవుతాము. అతి విస్తారంగా ఉన్న (ఉండిన) తెలుగుమాట్లాడే నేలను చూసి సంతోషంతోబాటు, భాషాప్రయుక్త రాష్ట్ర విభజనలోతెలుగు భాషకు జరిగిన అన్యాయానికి దుఖాన్నికూడా …. ఒకే సమయంలో పొందుతాము. నిస్సహాయతనుండి బయటపడి, గడచిన చరిత్రలోని మాధుర్యానికే పరిమిత మవుదామని నిర్ణయించుకుంటాము. ఇప్పటి వారితో వ్యాసాలను రాయించడమేగాక, ప్రాచీన పత్రికల నుండి, శ్రీ తిరుమల రామచంద్ర వంటి పండితుల పుస్తకాలనుండి కూడా వ్యాసాలను సేకరించి, కొందరు ప్రముఖుల జ్ఞాపకాలలో మదరాసు నగరాన్ని గురించి… కొన్ని శతాబ్దాల క్రిందటి తెలుగుమాట్లాడే రాజ వంశాలను గురించి, ఇప్పటి తమిళనాడులో మిగిలి ఉన్న తెలుగువారి సంస్కృతిని గురించి,….ఇలా ఎన్నో వ్యాసాలను కూడా సేకరించిన,కొన్నిటిని తాము రాసిన డా. నాగసూరి వారి అలుపెరుగని కృషికి అబ్బురపడ కుండా ఉండలేము. ఇంతమంది కృషిని గూర్చి ఒకేచోట చదివిన అందమైన అనుభవాన్ని చాలకాలం మరిచి పోలేము కూడా! వెరసి రెలుగు సాహిత్యవనానికి అదనంగా ఒక పరిమళభరితమైన గ్రంథపుష్పాన్ని అందించిన వారికి, తెలుగు వారం కృతజ్ఞతలను తెలుపకుండా ఉండలేము.

*

రాయదుర్గం విజయలక్ష్మి

2 comments

Leave a Reply to రాయదుర్గం విజయలక్ష్మి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాధ్యమైనంతలో డా రాయదుర్గం విజయలక్ష్మి గారు సమగ్రంగా సమీక్షిస్తూనే సంపాదకుల ఆలోచనలతో సహానుభూతి చెందడం హృద్యంగా ఉంది.

    ధన్యవాదాలు, కృతజ్ఞతలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు