తంతు

రుడపురాణం మైకులోమోత ,చెప్పేవాడి కుత్తుకలో కూడా బెరుకు భయం,పెద్ద మూకుడులో కరుగుతా,కాలుతా ఎలుగుతున్న వత్తి,బొంగరాలు తిరుగుతా వాసన కక్కుతున్న సాంబ్రాణి కడ్డీలు,

ఆరగా ఆరగా ఎసే సాంబ్రాణి పుగ,గులాబీ రెక్కలని చావంచి రేకులనీ గాజుమూత పెట్టెపైన పోసి,పెట్టెమూత లోనికకి చూసి,సాంబ్రాణి పుగకి కళ్ళు నులుపుకుంటా, ఏడుత్తా అక్కడ కూసున్నన్నామె మాపెద్దాము(పెద్దమ్మ).అందరూ తన్ని చూసి పోతన్నారు. పెద్దాము నోటికి పైట కొంగు అడ్డం పెట్టుకోని మెత్తగా ఏడుత్తా,చెమట పట్టిన  గాజు పెట్టెపైన అప్పుడప్పుడూ పైటతో తుడుత్తా.

పెట్టెలో పొనుకున్నమొగుడి  శవం ఎంక చూత్తా పెట్టెని తడుముతుంది .వచ్చిపోయే వాళ్ళ వంక చూత్తా …ఇన్నేళ్ళ కాపరం ఇవరాలు,ఏన్నడూ మొగుడి మాటకి ఎదురు చెప్పని వైనం,ఆమడిసికి సేసిన శాకిరి,చెడిపోయిన మూత్రపిండాలు,తిప్పకవచ్చిన హాస్పటళ్ళు,పెట్టిన పత్తెంఅన్నం,చేసిన సంసార పత్తెం,వాలులోకి రాని షుగరు జబ్బు,బొట్టూ,గాజూ,పూసా లేకుండా లోకానికి అవుపడని తనం,మొగుడికి అనుకూలంగా గొంతు అడిచ్చిన సంగతులు  అన్నీ…అయినోళ్లకాడ చెబుతా ఉంది.ఇది మాపెద్దయ్య శవం దగ్గర నడుత్తున్నది.ఆయనకి ఉండ ముగ్గరు సంతానం తనివితీరా శవాన్ని చూసి యాడవటం పక్కన ఉంచి,వచ్చినాళ్ళకి టీలు,టిఫినులు చూత్తా,ఉండ ఒక్క కొడుకూ…అదే మా అన్నాయి,పీనిగని వలికిలిలోకి (శ్మశానం)సాగనయంపే పనులు చూత్తన్నాడు.పక్కనే నీళ్ళుకాసుకునే పొయ్యిలో ఆరిన కట్టెలు ఇంటికి రేగుకంప కొట్టిన సంగతులు చెపుతున్నట్టుగా ఉంది.

పెద్దాముకి కొత్త కోక కట్టారు.గాజులు ఏశారు,ముడిలోపూలు,నొసటన బొట్టూ,మెడలో రెండుపేటలబంగారపు నాన్తాడు,దానికి కట్టిన తాడుకు పచ్చిపసుపు రాసారు,రెండువరసల నల్లలు…  అన్నీ ఏసే అప్పుడికి ఏదో వింత అందం పెద్దాములో.అంత బాద లోనూ  వచ్చినోళ్ళతో …

పదేళ్ళు మూత్రపిండాల జబ్బుకి సేవజెసినా ఉపయోగం లేకపాయ …ఇంకో రెండేళ్ళు బతికితే ఆయన పాతిన మావిడిమొక్క కాయలు తినేవాడు… అని ఎవురికోచెప్పి ఏడుపు ఎత్తుకుని ఆపి… ఆయన కళ్ళ అద్దాలు తెచ్చి మోకానికి పెట్టమని కోడలికి చెప్పి, ముక్కు గట్టిగా చీది,ఇంకా మసక జోడు కొత్త  మాయలా ఆంటన్నది.

                                                      ***

       గుంటూరు నించీ గెంటన్నర దారిలో ఆఊరు,అది మాఅయ్య అన్నదమ్ముల ఊరు,మేనత్త అంజమ్మదీ అదే ఊరు.ఆఊరికి ఇల్లిటం(ఇల్లరికం)వచ్చింది.దాన్ని కమ్మపాలెం అంటారు.మాఅయ్య పెద్ద అన్నయ్య…అంటే మా అయిదుగురు తాతల కుదురులో మొదటి తాత మొదటి కొడుకు,అంటే మాఅయ్యల తరాల్లో పెద్ద మడిసి సచ్చిపొయ్యాడు…మాచిన్న నాయనమ్మ మాటల్లో చెప్పాలి అంటే…

“వొంటిని ఇడిసి పెట్టాడు,వొళ్ళువొదులుకున్నాడు” ఆ,ఈ …వదులుకోటం ఏందో,యాడో…అర్ధం గాలా.కొన్నిరోజులు తట్టలా…ఓ పది సావులకి పొయ్యినాక గాని…మాడుకి ఎక్కలా.

చుట్టుపక్కల ఊర్ల నించీ మాబలగం అందరూ వచ్చారు,నేనూ రాగానే పెద్దాముని చూసి వాటేసుకుని బ్యార్ మన్నా.కొన్ని కొన్నిటికి కట్టలు కట్టలేము,గుడ్ల నీళ్ళు కూడా అంతే,కట్టలు తెంచుకోని పిలవని చూట్టాలకి మలిగా(మల్లే)వచ్చే.కళ్ళు తుడుచుకోని నిలబడి చుట్టూ చూత్తె బోలెడు మంది జనం.అందరి మొకాలూ బిగదీసుకోని,ఒక్కరికి గూడా వదులు మొఖం లేదు…ఆడోళ్ళు అసలు నవ్వగూడదు,సావుకొంపలో ఎకిలినవ్వులు,నవ్వులు ఎన్డీ అని తిడతారు.పెద్దయ్య వయసు ఎనభైపైనే.ఎందుకు అంతగా ఇసారంగా ఉండాలో అర్ధంగాలా…అమ్మో ఈ మాట పైకి అంటే నా గొంతు పిసికి,పెద్దయ్యతో పాటు పండ పెడతారు.పెద్దమ్మ,ఇద్దరుఆడపిల్లలు అయిన విజ్జక్క,సుజా పెద్దయ్యని తిప్పని హస్పటళ్ళు లేకపాయ,చూపించని చేపించని వైద్యం,వాడని మందులూ లేవు,సక్కగా చూసుకున్నారు,కొడుకు బంగారంఎన్ని డబ్బులు పోశాడో,అయినా గుండె ఆడలా.మడిసి సావు ముదిమిలోనే గదా వచ్చేది.పండగ లాగా నవ్వుతా తుళ్లుతా ఎందుకు పంపమూ…చేసుకోము.

“సావు అంటే పొడుగాటి నిదర గదా,పొద్దున్నే పాచి మొఖం,పెంట ముడ్డి, మడ్డి చమురు,ముడ్డి గుడ్డా…తుడవటం,కడగటం,రాయటం,చుట్టటం ఏమీ ఉండదు…ఎంత సుఖం”,అని గొనుక్కుని,సుట్టూఉండ  అందరి మొకాలు చూశా…ఇష్టం ఉండా ఏడుపు రాని మొకాలు,ఇష్టం లేకపోయినా ఏడిసే మొకాలు,ఎడవకపోతే బాగోదని ఏడిసే మొకాలు,నీళ్ళు రాకపోయినా కళ్ళు వొత్తుకోని దవడలు కదిలిచ్చే వాళ్ళు.

అన్ని మొక్కళలూ చూత్తా  ఉండా…ఎన్ని ఏశాలు తోలు మోకాలకి.

“మధూ టిఫిను తిన్నవా అని విజ్జక్క,

మధూ టిఫిను తిన్నవా అని సుజా,

మాయ్ టిఫిను తిన్నవా అని అన్నాయి,

పిన్నీ తిన్నావా అని విజ్జక్క కూతురు స్రవంతి”.

లాక్కెల్లి చేతిలో నాకు అసలుకి నచ్చని ఉప్మా పెట్టింది సుజాత…బాబో ఉప్మా ఇదో సావు అనుకున్నా.. చేతిలో బాధ…ఉప్మా బాధ.పొట్టలో ఆకలి బాధ,బతుక్కి చావు బాధ.

“సచ్చినోళ్ల సావు బాధ ఒక ఏపున ఉంటే,మరేదాలు చేయలేక సావటం ఈమద్దెల మొదులయ్యింది,ఎంత దెగ్గర చుట్టం అయినా,చుట్టరికం లేక పోయినా శవం ఊళ్ళోఉంటే…ఏ ఇంటిలోనూ నిప్పుముట్టేదికాదు,ఇప్పుడు ఉండ బీపీలకి,చెక్కరి రోగానికి,తినక తప్పటంలా…అనుకుంటా టిఫిని ప్లేట్ అందుకున్నాడు ఒక మడిసి.ఇది ఇని…

“ఈయనకి వొళ్ళు కాదు…మెదడు అంతా చెక్కరి జబ్బే”అనుకున్నా.

ఇంతలో…

“సాకలి ఎక్కడ సాకలి అని అరుపులు …”ఈ సాకళ్ళకి బతుకంతా కులం తప్ప పేర్లు లేవా…”.

“సాకలి ఎక్కడ…పీనిగని లేపి కుర్సీలో కూసో పెట్టాల,పనుకున్న పరుపు,దిండూ,దుప్పటీ తియ్యాల…దీపం పక్కకి జరపాల,సాకలి వచ్చిందా…సాకలీ దాని మొగుడూ ఇద్దరూ వచ్చారా”అని అరుపులు,

అంతలో…

సన్నటి సరివిబాదు లాంటి వొళ్ళు,కర్రపేళ్ళ చేతికి కాసిని మురికి గాజులు,ఎవురిదో సరి చేసి తొడుక్కున్న రైక…”కులానికి కుడి పైట,వెలియాలికి ఎడమ పైట”అన్నట్టు కుడి పైట చీర,లోతుకి పోయిన కళ్ళు,

యాడా కాకి కండకూడా లేని వొళ్ళు,మెడలో పసుపుతాడుకి ముడులు…ఒట్టి ముడులే,పిచ్చికతోక జుట్టు ముడి…ఈట్టా  వొచ్చి నిలబడింది ఓ మడిసి…ఎనకాలే దబాదబా,గబాగబా…బులుగూ టినోపాలు పెట్టిన తెల్ల గుడ్డల్లో ఒక మొగమడిసి వచ్చి నిలబడ్డాడు.

గుంపులో ఎవురో…సాకలోళ్ళు వచ్చారు “ఇంకేంది ఆలిసిం కానీయ్యాల అన్నారు”. అప్పుడు అందరిలో గొంగడి పురుగుల మాదిరి కదిలిక వచ్చింది.

ఆఇద్దరూ కలిసి శవం కడతానం కోసం కుర్చీ ఏసీ దాని మీద తెల్ల బట్ట పరిసి కూసో పెట్టారు.

ఒక్కొక్కరే వొచ్చి శవానికి చివరి తానానికి తయారు జేశారు,పెద్దాముని శవం తలకి నూనె రాయమంటే “మొదటిసారి మొగుడికి తల దువ్వింది గుర్తుకు వచ్చింది అనుకుంటా …కుప్పకూలి పోయింది.అదైర్యపడితేఎట్టా మొకం చూసుకో, మొకం మళ్ళీ దొరకదు…కాటికి పోయే శవం మళ్ళీ ఎనిక్కి రాదు”అంటన్నారు చుట్టూ జనం.

అందరూ పొసూకుంకం,పువ్వులూ,సాంబ్రాణి ఏసీ,ఆర్తికప్పూరం,కొబ్బెరికాయలు కొట్టి,పాడెకి కట్లు బిగిచ్చి …ఎత్తన్ది ఎత్తన్ది అని ఎత్తారు…ఒకేసారి కొన్నిగొంతులు గట్టిగా”ఓ”ఏడవటం మొదులు పెట్టారు…

నల్లనిప్పుకుండలో నించీ వచ్చే సన్నటి పుగ తోడుగా,శవం పూలు సల్లిచ్చుకుంటా,ఏమీ పట్టకుండా ఎల్లిపోయింది…ఎవరో పెద్దాముని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకపోయ్యారు…ఎవురో బుజం మీన చెయ్యి ఏసి

బతికిన బొమ్మలాగా లోనికి నడిసింది.

“జీవితం పంచిన చేదు గానీ పెద్దయ్య పంచిన తీపి గానీ పెద్దాముకి  సరిపోయినట్టు లేదు “అనుకున్నా.మళ్లీ ఎవరో…

“సాకలి ఏదీ ”

“సాకలి యాడ”

“సాకలోడు ఏడి “.కేకలు,అరుపులు.

“సాకలోళ్లు ఏరి …ఆ దీపం,దానిమీద బోల్లఏసిన బుట్ట,పీనుగని పొనుకేసిన బొంత, దిండూ, సాప,అన్నీ ఎత్తకపొమ్మనండి…మరిసిపోయాం,ఒళ్ళుకడిగిన కుర్చీ కూడా ,ఇంటోకి తేబాకండి…కీడు”అంటన్నారు.

ఆ సాకలి  ఆటిని చూసి ఇసుక్కుంది ఎందుకు ఈ చెత్త అని గొణిగింది…ఆయమ్మి మొగుడు ఉరిమిచూసి “కానీ”అన్నాడు…గొనుగుతా  అన్నీ తీసి అక్కడ మెల్లా అంతా బాగు చేసింది.కాటికి శవాన్ని కాల్చటానికి

పోయినాళ్ళు  తిరిగి వచ్చారు,వాళ్ళ తానాలకి ఉడుకు నీళ్ళు తోడి తుండు గుడ్డలు,బట్టలు ఇచ్చారు…చిన్నదినం అయ్యి  ఎటాళ్లు అటు సర్దుకున్నాక డబ్బులు తీసుకోని, సాకలి అతను తలపైన దిండు దుప్పటీ బొంత ,కుర్చీ…ఆయమ్మి చేతిలో మిగిలిన కూటి గిన్నెతో దారిన పడ్డారు.ఆయమ్మి  మాత్రం గొణుగుడు అపలా…ఆ గొణుగుడులో కూడా తేడా ఉంది…పళ్ళు బిగిచ్చి చీదర గొనుగుడు,గొంతు లోపలనించి ఖళ్లె తెచ్చుకుని ఖేరించి,ఖాండిరించి ఉసినట్టుగా బిగ్గర గొణుగుడు.

***

      పదకొండో నాడు  దినం అని పిలుపులు…ఆడపిల్లులూ ,దాయాదులు పొద్దున్నే పోతే బాగోదని,పెద్దాము పసుకుంకాల మొకం సూడాలని ముందునాడే  రమ్మన్నారు…ఒకరోజు ముందే ఊరుకి పొయ్యాము .

దూరపు నీలపాలోళ్ళు (చుట్టాలు )ఒక్కొక్కరే చేరుకుంటున్నారు.అందరి నోళ్ళల్లో ఒకటే మాట…”గాజూ,పూసా తీసినాక సూడకూడదని ముందే వచ్చాము” అని .మాటల్లో ఒక పెద్దామె  చెపుతుంది …సాకలిని ఏకున్జావునే రమ్మనిచెప్పమని…కాదు చుక్క పొడుపుకే…తొలిజావుకి ముందే అని ఒకరూ…గాజు పూసా తెంచి పొయ్యటమే కాదు,తెల్లకోకా రైకా చాకలే చూట్టాల అని ఒకరూ”ఇట్టా మాటలు …ఒకరు పొయ్యి చివరిగా పెద్దాముకి పట్టుకోక కట్టి,పూలుపెట్టి,మోకానికీ కాళ్ళకి పసుపు పూసి,పారాణి పెట్టి,నొసట బొట్టు,చేతికి గాజులు,మెడలో రెండుపేటల నల్లలు అన్నీ ఏసి కూసో పెట్టారు.

బయట  దినం కూటికి తెచ్చిన మేకలు ఒకే పనిగా అరుపు…ఆటిని దూరంగా కట్టేయండి…తెల్లరికే కూర ఆవుతయ్యి…అని ఎవురో అన్నారు…పెద్దయ్య దినానికి పంచటానికి తెచ్చిన గిన్నెలు దాటుకుని వచ్చి ఒక్కోక్కరూ పెద్దాముకి గాజులు తొడిగి ఎల్లారు…ఇంతలో ఎవరో మొగాళ్ళు “ఆడంగులు కబుర్లూ,ఏడుపులూ ఆపి నిద్దర్లకి  పడండి…పొద్దున్నే లెగాల…”అరుపు.

“సాకళ్ళకి మొన్ధు సీసాలు పంపండి,లేకపోతే రేపు రారు,ఆళ్ళతో సావు,కీడు పనులు ఎవరు చేత్తారు”.అందరూ పక్కలు ఎక్కారు.

***

నిద్దరలో ఒక్కతూరిగాఉలిక్కిపడ్డా.సన్నగా ఏడుపులు చెవున పడతా ఉండయ్యి…అది పెద్దాము గొంతు కాదు…మరి ఎవురిదా అని సుట్టూ చూసా…ఇంకా అందరూ సోయలేని పడకలో ఉండారు,కళ్ళు నులుసుకుని  చూసా…మద్దినాల ఇన్న సాకలమ్మి గొంతు…పక్కనే మొగుడు…వాళ్ళు కిటికీ అసంట పక్కా,నేను లోపల ఉండా…మాటలు ఇనపడతన్నయ్యి.

“ఛీ.ఛీ.ఇదేం బతుకు,నాబతుకు పాడుగాను,ఇంకా నాకీ చెరలు ఏంది…నీకు(మొగుడిని చూత్తా )ఎన్నేళ్ళకి ఇవరం(బుద్ది)వచ్చుద్ది…ఈజనాలు ఎప్పుడు మారేనో,నువ్వు ఎన్నడు తెలుసుకుంటావో…నేసచ్చిన తరవాతే ఈపీడ ఇరగడ అయ్యేది …ఈ తెంచి పొయ్యటాలు ఏందో,ఈ బతుకు ఏందో,ఈ బాధలు ఏంది…ఈ ఆడవాళ్ళకి మిగిలిన కాలం అంతా గాజూ పూసా వద్దు అని బద్దలు కొట్టే ఖర్మ నాకేందో”అని గొణుగుతుంది.

“మూసుకుని పని చెయ్యే ముండా,నొరెత్తితే తంతా,తొందరగా కానిచ్చి రాయే లంజా…ఏకున్ఝామున ఈపు పేలాలా,మూడు ఏలు డబ్బులు,తెంచిన పుస్తెలు,నీబాబు ఇత్తాడా,ఈతూరిఅన్నా బంగారం ఎత్తకరా,లేదా…నాచేతులో సావే నీకు…పోవే…ఫో…ఫో …”అని ముందుకి ఒక్కనెట్టు నెట్టాడు…నోటికి నూలు చీరె అడ్డం పెట్టుకుని ఏడుత్తా ముందుకు నడిసింది.కొద్దిగా దూరంగా నిద్ర పోతన్న శరీరాలని దాటుకుంటా

ఆయమ్మి…వోళ్ళ మాటలు ఇంటా నేను…

“నన్నుఆయమ్మి  గొంతు మోపుతో కట్టి పడేసినట్టు పడేసింది…ఆగొంతులో కోపం…కుత్తికలో విసుగు,ఇసురు,తిరగపడటం…అన్ని తీరులుగా ఆగొంతు ఎట్టా నాకు ఇనపడతంది…ఈయమ్మిని బయటకి తోడాల…

ఆయమ్మిలోకి,నేను దూరాలి…నాలోనికి  తీసుకోవాల.

                                                            ***

             ఆయమ్మి పలసబడే చీకట్టొ దొడ్డి సందులో నించీ లోపలికి పొయ్యి గాజూ పూసా తీసి,బయటకి వచ్చింది…కండలేని నొసల మీద చెమట్లు కాలవ కట్టి పారినయ్యి,ముడుచుకున్న పైటతో రుద్ది

రుద్ది అద్దుకుంటన్నది,ప్యారీ(ప్రహరీ)గోడ చాటు నించీ మొగుడు “ఏయ్”అన్నాడు,ఇటే…ఈడ…అన్నాడు.

అటుచూసింది ఆయమ్మి …గ్లాసు అందిచ్చాడు…గటగటా తాగింది…నీళ్లేనా,ఇంకెందోనా…అది ఆయమ్మి బాదావాద్రి(బాధదాహం)అనుకున్నా…నోరు తుడుసుకుంది.రవ్వంత సేపు ఊపిరి లాక్కుంది.ఇంతలో

“ఏయ్….ఒసే…ఏమేమి ముట్టినయ్యి “.అతని పీకలోఆత్రం.

“ఏంది ఇచ్చేది…ఏమీ ఇయ్యలా,ఈయ్యాలరేపూ ఓళ్ళుగూడా పీనాసిమంద అయితిరి,మూడువేలు డబ్బులు అడిగావు కదా,అయ్యే ఇచ్చారు ఇంకాఎంత ఇత్తారు,నీకు అది సాలదా,నీతాగుడుకి నాకండలు కాక,పీనిగలని

కూడా వదలవు…పద పద,తెల్లరితే ఏటికి ఏల్లటానికి పిండాకూడు ఉడకెయ్యటానికి  రావాల…ఛీ మావసాల(మాంసము) మీద చిల్లర ఎరుకునే బతుకాయ “.

ఒసే”నల్లలో,పుస్తెలో,చుట్లో,ఇవ్వని కమ్మోళ్ళు ఎవరుంటారే మురికి ముండా,పొద్దున్నే అబద్దాలు ఆడతన్నావు…పొద్దుపొడుపు చూడకుండా ఆబద్దాలు అడితే  నోట పురుగులు పడిపోతావు ముండా”అన్నాడు మొగుడు.

“నేను ముండ మోత్తే తెంచటానికి ఒక్క బూలోక పెతివ్రతా రాదు…ఈ తెంచిపోసిన నొళ్ళు ఒకళ్లు రారు…సచ్చిన నోళ్ళు గూడా లెగిసి రారు గానీ పా…”అని ముందుకు నడిచింది.

“ఎంటే ఎక్కువ వాగుతున్నావు ఇంటికి పద నీసంగతి చెపుతా”,అని దారిన పడ్డారు.ఆ యమ్మి మాటలు ఇన్నాక…దినం అయినంక ఈ యమ్మిని కలిసే గుంటూరు పోవాల అని తీర్మానం సేసుకున్నా.

***

“అమ్మా”అన్నా,

“ఎవురమ్మ,యాం గావాలా”అంది,

“నువ్వే అమ్మా”అన్నా,

“నేనా”,నువ్వు ఎవురమ్మా,ఎవురు అనుకోని ఎవురిని పిలిశావో”

“నిన్నే అమ్మా,నువ్వే కావాల”,

“ఏవురమ్మా,నిన్ను ఎప్పుడూ సూడలా,ఏఊరు,అయినా ఓసాకలీ,వసే సాకలీ అని పిలిపించుకోటం అలవాటు అయ్యి…అమ్మా అంటేనూ”…

“నీతో మాట్లాడాల ఒకపూట మీఇంటికి వచ్చేదా,నిన్ను యాడ కలవాల,అదే…నేను…నిన్న సచ్చిపొయ్యిన ఆయన తమ్ముడి కూతురిని.”

“మా ఇంటికా…అని నోరు తెరిచి…మీఇళ్ళలో ఆడోళ్ళు మాఇళ్ళకి రారు  అమ్మా…

మేమే మీ ఇళ్ళకి వచ్చి గుడ్డలు ఉతుక్కి ఎత్తక ఎలతాము,కూటికి బోచ్చతో మద్దినాల వత్తాము.”

“కానీ నేను వత్తా అమ్మా…లేపోతే  బయటయాడన్నా కలుద్దాము.”

“నన్ను కలిసేది ఏంది…మీవోళ్ళు చూత్తె లేనిపోయిన కొలుపు పెడతారు,వద్దు తల్లో నీకోదండం”.అంది.

“అమ్మా అట్టా అనమాక …నీతో మాట్టాడాల…రెండురోజుల్లో ఎటుసుట్టాలు అటుపోతారు …మావాళ్ళుకూడా కీడుఅని బయలుకి రారు…అన్నా”.

“ఇసయం ఏంది…నన్ను కలిసేది ఏందో…నేను సాకలినే గానీ ,వాతప్పు మడిసిని గాను…ఎవురికీ ఎవురితో ఊళ్ళో సావాసాలు కలపను.”

“నాకు కావాలీ అంటే పట్నంలో సావాసాలు లేవా…నేనూ తప్పుడు పనులకి నిన్ను వాడిక కోసం రాలా…మట్టాడాల అంతే.”

గొణుక్కుంది,ఆలోచించింది…నోరు తెరిసింది “పెద్దరోడ్డుని ఆనుకుని,ఊరికి ఉత్తరపు పక్కన,బడికాడ మీపొలాలు పక్కనే మాది ఎకరం ఉండాది,దాంటో కలుపు తియ్యాల,పొద్దుటాల  మించీ ఆడే ఉంటా.రా”,

అంది.

“ఎల్లుండి పొద్దున్నే వత్తా ఆడే ఉండు”అని చెప్పి ఎనిక్కి తిరిగా.

***

    దినం రోజు హడాదుడి,పిండం ఉడకేసుకుని అందరూ సాకలాయనతో కలిసి ఏటికి ఎల్లారు…సాకలామె దొడ్డో  తెల్లకోక అడ్డం కట్టింది…అందులో పెద్దాముని కూసో పెట్టింది…పీట ఏసి గెన్నెలో జీలకర్ర పోసింది…

ఏటికి పొయ్యినోళ్ళు వొచ్చి పొత్తర్లు పరిచి బియ్యం,కూరకాయలు,చింతపండు ఎండుమిరగాయలు,గుమ్మడి కాయ,ఉల్లి పాయలు అన్నీపెట్టారు,బస్తా సోనామసూరి బియ్యం పొత్తర్లకి పట్టినయ్యి.పెద్దయ్య  బంగారపుఉంగరం మెరుపు పెట్టి బేపనాయనకి దానం ఇచ్చారు…ఆవు దానం లెక్కలో  వెయ్యి రూపాయలు…అన్నీ ఇచ్చి పిండ పెట్టి …అన్నాయి పిండాన్ని అవుకి పెట్టాడు.

అందరిమీనా పులునీళ్లు చల్లాడు బాపనాయన.తంతు ముగిసింది.

ఒక్కొక్కరే వరసగా పొయ్యి  జీలకర్ర నోట్లో ఏసుకోని పెద్దాము  మొఖం చూసి ఇసంటకి వచ్చితుహుక్ తుహుక్ అని ఊశారు,పుట్టింటోళ్ళు  ఏసినగుడ్డ తీసి చీరచుట్టారు…ఇక వాకిట్టొముగ్గు,దీపం,పూజ,వేసుకోవచ్చు అన్నాడు అయ్యోరు .అందరూ తిళ్ళకి  పడ్డారు…చాకలి మోగుడు పెళ్ళాలు కిందపడ్డ అచ్చింతలు గుడ్డతో తుడిచి,అంతా కడిగి మెల్లా అంతా బాగు చేసింది,

అంతలో పెద్దాము సుజాని పిలిసింది…చెపుతుంది…

“అమాయ్  సుజాతా ఇట్టారా…సాకలిని పిలువు నిన్నటాలమిన్చీ(నిన్నటి వేళనించీ)నాతోనే ఉంది…నాలుగు మెతుకులన్నా కడుపులో ఏసుకుందో లేదో…అందరూ దాన్ని చాకిరీతో సంపారు…పంచటానికి తెచ్చిన గిన్నెల్లోనించీ ఓగిన్నె ఎత్తకరా…మిగిలిన యాటకూర ఏసుకురా…చెపిచ్చిన లడ్డుల్లోనించీ ఒక డజనుతే…సాకలి జోడీకి  తెచ్చిన బట్టలు గూడా కలిపి నాముందు ఇవ్వండి…ఇంకా రెండు గిన్నెలు అడిగినాలేదు అనబాకండి…మనోళ్ళకి తక్కువ అయితే రేపు పేటనించీ తెచ్చుకోవచ్చు.”

“మాకు తెలుసులే అమ్మా…నువ్వు కాత్తె ఆగు,దినం అయ్యి రెండు గెంటలు కూడా కాలా,సుసినోళ్లు నవ్వుకోరూ  “అని అరిసింది సుజా.

“చాకలి రుణం ఎంత పెట్టినా తీరదు,వాళ్ళ శాకిరీకీ ఇలవ కట్టలేము…మనసావుతోనే వోళ్ళకీ మనకీ రుణం తీరేది,ఎకూఝామున  గాజూపూసా తీసేతప్పుడు నాబాధ పంచుకుని వాటేసుకోని ఏడిసింది,కాపారానికి వచ్చినకాడినించీ మురికి అంతా ఎత్తి పోసింది అదే…అదే కదూ…”అనిచెపుతా  గొంతు బొంగురు పోతే కళ్ళు తుడుచుకుంది పెద్దాము.

చాకలి వచ్చి అన్నీ తీసుకుని “బాధపడమాకు,ముందుముందు ఒంటిరి బతుకు …బాధలు అన్నీ చీర కొంగుకీ,మంచానికే…బయటకి చెప్పుకోటానికి పెనిమిటి లేడు”.అని కళ్ళు తుడుచుకుంది.

ఎల్లే తప్పుడు పెద్దాము “అన్నీ జాగర్తగా దాసుకో…మొగుడికి చూపిచ్చబాక,వాడు అసలే తాగుబోతు”.

ఆమాట విననట్టే ఎందుకో ఇచ్చినయ్యి చేత పట్టుకుని విసవిసా ఎల్లిపోయ్యింది…మొగుడు వాకిట్టొనే ఎదురొచ్చి  డబ్బులు గుంజుకున్నాడు…ఆ గుంజుడికి సాకలమ్మి తూలి పడబోయింది.డబ్బులు జేబులో పెట్టుకోని

ఇంటికి పా…నే కొద్దిగా తాలి వత్తా అని రోడ్డున పడ్డాడు.

ఎవురో అంటన్నారు “ఆ డబ్బులు అన్నీ తాగి గానీ కొంపకి  చేరడు అని.”

***

   అంత అగ్గులూ(ఎండలు)లేవు…అంత సలీ లేదు,పిల్ల పైర్లు,పొలాలు పసికిరి పచ్చగా ఉండయ్యి,గెట్లమీన పెదుగుతున్నగెరిక ,చిన్నచిన్న సాళ్ళు,చెప్పులు చేత్తో పట్టుకోని నడుత్తా ఉంటే కాళ్ళకింద నలుగుతున్న మట్టిగెడ్డలు…పొలం ఎంక చూసా…ఎందుకో  మెట్టపొలం అందం మాగాడికి ఉండదు అనిపిచ్చింది.తను చెప్పిన గుర్తుల పొలం ఇదే అని నమ్మకం కుదిరినాక చుట్టూ తేరి పార చూసా…

“ఈడ ఉండాను,ఇటు…ఇటురా”…

మాట ఇనపడ్డ ఏపు చూసా…దూరంగా ఎండకివానకీ  తడిసి ఎండి ముడుసుకు పోయిన గోతం మూటకి మల్లే ఆయమ్మి అగుపడింది.అంతలోనే తనే…

“అయినా నాతో ఏంది పని,లేని పోయింది నడక రాక పడితే”అంది.తన మాటలు ఇంటా…

మావాళ్ళ పొలం దాటి ఆయమ్మి పొలంలోకి అడుగు పెట్టా…తన పొలం తేరి పార చూసా…సుబ్బరంగా ఎక్కడా కసువు గానీ పిచ్చి మొక్కలు గానీ లేవు”నీ పొలం పెళ్ళి కూతురు చెల్లిలా ఉంది”అన్నా,ఆ చిన్నం అంత మాటకే పక పకా నవ్వింది.

“వారంలో ఆరురోజులు సాకిరేవు పని…మద్దినాల వరికీ(వరకు)చేత్తన్నా…మద్దినాల మించీ పొలం పనికి వత్తా…ఇయ్యాల నువ్వువత్తాను అన్నావు అని పొద్దున్నే వొచ్చా…మాపిటేల ఉతుక్కి పోతా”,అంది.

ఆమాట ఈమాటా అయినాక చిన్నంగా అడిగా…”అమ్మా నిన్నూ,నీబతుకూ ఇనాలని ఉంది చెపుతావా,నాకు కాసిని  అడగాలని ఉంది,పంచుకుంటావా”అన్నా.

“నా దెగ్గర ఏమి ఉంటయ్యి తల్లీ పెద్దగా సదువూ,సందే లేనోళ్ళం…”

“సరే నేను అడిగిన ఇసయాలకి సమాధానం చెబితే సాలు”.

నా మొకం కల్లే తేరిపార చూసింది గానీ ఉలకూ పలుకూ లేదు …ఇక నేనే నోరు తెరిచి అడిగా…

“అమ్మా నిన్న జరిగిన తంతు …గాజూపూసా తెంచె తప్పుడు ఎందుకు మందు తాగావు,పుస్తెలు తీసేఅప్పుడు ఎందుకు నిన్ను నువ్వు తిట్టుకున్నావు,పెద్దాము తాళిబొట్లు,నల్లలు ,చుట్లు  ఇత్తే ఇవ్వలేదు అని నీమొగుడికాడ అబద్దం ఆడావు గదా…ఇన్నిఅబద్దాలు ఎందుకు ఆడావు,నీమొగుడి చేతిలో తన్నులుగూడా తినబొయ్యావు,ఇంతాచేసి బంగారం ఏసుకున్నావా అంటే మెడలో పసుపు తాడు తప్ప దానికి చిన్నంపుస్తె  గూడా లేకపోయే …”అన్నా.

బిత్తరపోయ్యింది …తడబడింది,బిత్తరి చూపులు చూత్తా  చెయ్యి వొణుకుతా ఉంటే కొడవలిముక్కుతో మట్టిగెడ్డలు చితగొట్టింది,గుప్పెటతో కలుపుమొక్కలు పైపైన తెంపింది.కొద్ది మౌనం తరవాత…

“నువ్వెందుకు చూసా తల్లో…నన్ను కలుపుతీసుకోనియ్యి బోలెడు కలుపు పెదిగింది”అన్నది

“అట్టా అంటావా,నేను కూడా ఆడదాన్నే కదా,ఉండలేక అడిగా…చెపితే తెలుసుద్ది గదా.”

“ఆడ మగా అని కాదు…నేనూ,ఆ సముద్రాల తల్లీ ఒకటే…మా గోల ఎవురికీ అర్దంగాదు…పంచుకోలేరు,నాతో పాటే నాబాధ కట్టెల్లో కలవాల మట్టిలో కలిసి పోవాల”.కొమ్మలు కశ కసా ఇరగ కొట్టింది.

“అట్టా అనుకోమాకు అమ్మా…నాకు చెప్పు”అన్నా.

“ఈ అమ్మ అనే కేకఉంది చూశావూ బలే ముండమోపిడి,ఎవురిని అయినా పడేసిద్ది…అమ్మ…అంటే బతుకంతా లొంగి గొడ్డు లాగా ఉండటమే తల్లా  …అమ్మ అనే కదా ఆడదాన్ని గొడ్డు బతుక్కి బండలు బరువులు కట్టి నూకితిరి…నువ్వూ అదే పిలిత్తివి.”అనుమానంగా అపనమ్మకంగా నామొకం చూత్తా  మొదులు పెట్టింది.

“మాది ఈఊరికి రెండుఊర్ల అసంటగా ఉండపల్లె..మాకులపోళ్ళ కొంపలు డజను…అందరూ మానాయనమ్మ బలగమే..ఒక పూరి కొంప మానాయనమ్మది.మోతుబరులు డిప్పలో ఏసింది ఎత్తుకోని,ఏటా ఇచ్చేవడ్డు తీసుకోని,మోతుబర్లు పెట్టిందితిని,లగ్గాల్లో తద్దినాల్లో ఇడిసిన గుడ్డలు,కొబ్బిరి చిప్పలు,కూడు తెచ్చుకు కడుపుకి ఏసుకోటం…పెద్ద మడిసి అయి,తీసేసిన గుడ్డలూ,పురిటి తానాల చీరెలూ,ఒకటా రెండా మాబతుకులు మైల సంతలో,రోత మాయముంతలు పూడిసి పెట్టటమే పని.

రెండు ఎకరాలు పొలం చెక్క ,ఊళ్ళో సగం సాకిరేవు,ఇత్తడి ఇస్త్రీ పెట్టెలు రెండు ఉండయ్యి అని…మళ్ళీ ఇట్టాంటి సంబందం కొంప దొరుకుద్దా అని, నన్ను ఈఊరికి పదేళ్ళ వయసులో ముడేసి తోలారు.రైతులు ఇచ్చిన తెల్ల నూలు కోకతో పెళ్ళికూతురుగా ఈఊరికి అడుగుపెట్టి నాలబైఆరు ఏళ్లు అయ్యే.

గడపచాటున నెల రోజులు ఉండనీకపోతిరి”.అని కాళ్ళు కొద్దిగా ముందుకీ వెనక్కీ కదిలిచ్చి ఇసురుగా గజిబిజిగా కలుపు కెలుకుతా ఉంది.మాటకీ చూపుకీ తేడా లేకుండా ఎటో చూత్తా ఉంది.

“నీళ్లు ఒక్క గుక్క ఎయ్యి”…అని సీసా ఇచ్చా.ఒక్క గుటక ఏసీ ఎటో చూత్తా మొదులు పెట్టింది.

ఒకసారి పేటలో సినిమాకి పోయి వత్తాఉంటే ఒక ఆసామి

“సాకలోడి పెళ్ళానికి మరుగు ఏందిరా…ఎవురి మురికి వదిలిచ్చటానికి అయినా అదే గదూ…గిద్దలో పెట్టి అరగిద్ద మూతేసి ఎన్నాళ్ళు ఉంచుతా “అని ఒకటే గోల…నా పాలిట కొన్ని కొంపలు పడ్డయ్యి…

పొద్దున్నే ఇడిసిన మూటలు తేవాల,తెల్లయ్యి,రంగుయ్యి ఏరాల,ఉడకబెట్టి ఉతకాల…ఆరేయ్యటం,పొది(ఎవరయ్యిఅళ్ళకిమడతలు)పెట్టటం…మజ్జలో ఇంటిఇంటికీ ఎల్లి కూడూ కూరలు ఆడుక్కుని రావాల…

అన్నీ అయ్యి ఇంటికి వచ్చే యాలకి ఇస్త్రీ గుడ్డలు పందేరాలు…రోసిపొయ్యి (అలిసి)ఎల్లను అంటే ఈపి పగిలేది”.అన్నది

కాసేపు ఏమీ మాటలు లేకుండా,కోడవలితో గెడ్డలు చిదుముతా,కలుపు కెలుకుతా,ఒకసారి మోకానికి చెయ్యి అడ్డంపెట్టుకోని పొద్దువంక చూత్తా,పని మొదులుపెట్టింది.

“నోరు తెరిచి చెప్పొచ్చు కదా “అని మనసులో అనుకున్నా.

“పొద్దు పోయింది కదా నువ్వు పోకపోతే మీఓళ్లు ఎతుకుతా వత్తారు…సాకలి దానితో సావాసం ఏంది అంటారు”అంది.

చీకట్లు కమ్ముతుంటే  ఇంటి దారి పట్టా…

ఇంటికి ఎల్లాక అందరూ ఎగబడ్డారు.”యాడికి  పొయ్యావు,ఏజాము అయినా రాకపోతే ఫోను చేద్దాము అనుకుంటన్నాము..”,అని అనుమానంగా నాఎంక చూశారు.

గుంటూరు పొయ్యాక  పనుల్లో పడతాను…ఈవాతావరణం మళ్ళీ చిక్కదు.అందుకే చాకలిఅమ్మి ఎనకాల పోయి మన పొలాలు చూసి వచ్చా…రేపుగూడా ఎలతా…”అని ముగిచ్చా.

“మాయ్  తిని పొనుకో “అని అన్న …

“అట్టనే అన్నాయి ” అని తిని మంచానికి పడ

***

మూడో రోజు పొద్దున్నే మల్లా చేల పక్కకి పొయ్యా…

“అమ్మా ఏంది  కబుర్లు తిన్నావా”.అన్నా.

“తినాలిగా అమ్మా…కడుపు నింపుకోవాల,కడుపు ఖాళీ చేసుకోవాల,గుడ్డ ఉతుక్కోవాల,ఊళ్ళో వాళ్ళ మురికి గంగపాలు చెయ్యాల…సచ్చే దాకా ఇయ్యి తప్పవు”.అనుకుంది.

“నాకు ఇయ్యాల ఒక మాట చెప్పు…పెద్దయ్య దినం ముందురోజు,గాజూ పూసా తెంచిపోసినప్పుడు పెద్దమ్మ బంగారు నల్లలూ,పుస్తెలు,మట్టెలు ఇత్తె…నీ మొగుడికి ఇవ్వలేదు అని ఎందుకు అబద్దం చెప్పావు…

పైగా ఇన్నేళ్ళ కాపరంలో అతను నీమాటకి ఇలవ ఇవ్వకుండా…ఇచ్చే ఉంటారు నువ్వే అబద్దాలు ఆడతన్నావు అని ఏమిటికి  అన్నాడు…నిన్ను చూత్తే వంటిమీన చిన్నం బంగారం కూడా లేదు…ఎట్టా పుట్టిన దానివి అట్టనే ఉండావు. వొంటి మీన నూలుగుడ్డ తప్ప తన్నినా కానీ రాలదు.”

“ఏదో అడిగావు కాబట్టి  చెపుతున్నా పతిదీ అడిగితే నీకు ,ఇనె గుండెలు ఉంటే నాకు చెప్పే గుండె ఉండొద్దు.గుండెలు రాళ్ళు కావాల,జ్ఞాపం(జ్ఞాపకం) అయితే గురుతు తెచ్చుకోని చెప్పఒచ్చు,

మోసి మోసి చెప్పేయి  చేసేపనులు…”అని మాటలు ఆపేసింది.చెట్టు నీడన కూలబడి దిక్కులు చూత్తన్నది,లెగిసి కోసిన పనలు మేత మోపు కట్టింది…మోపు నెత్తికి ఎత్తమని సైగచేసింది.ఊరు దారి పట్టింది..

గొణుగుతా “ఇయ్యాలకి ఓపిక లేదు కానీ రేపు రా చూపిత్తా…అదే చెపుతా,నీకు ఏదన్నా చెప్పాలి అంటే నాకు నేను చెప్పుకోవాలి గా “అని గొణుగుతా ఎల్లిపోయింది.

సాకలి అమ్మి అర్ధం కాలా,భూమి,సముద్రాల తల్లీ ఎవురికీ అర్ధం కారు.అనుకోని ఇంటికి పూయా.

***

పొద్దున్నే ఉడకొట్టిన నాగలి మాదిరి  ఊగుతా ఆయమ్మి కాడికి  పొయ్యా…నన్ను తెరిపార జూసి

“నన్ను ఇబ్బంది పెడతా,నువ్వు నేను చెప్పేయి ఇని మనుసుని ఇబ్బందుల్లో పెట్టుకునేది ఎందుకు”.అంది.

“అమ్మా నేను ఏటికీఎరవను …బెదురు గొడ్డును గాను,భయపడను…అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటతా…ఒకరవ్వ గుండెలు గట్టిగా ఉండయ్యి.”

ఆయమ్మి చిన్నగా మోదులు పెట్టింది,

“మా అత్త కాటికి పొయ్యిన కాడి నించీ తెంచిపొయ్యటం నాపాలట పడింది…ఈఊళ్ళో అందరూ నేను ఎరుగుండ మడుసులే…ముడేసిన దాన్ని కాల్చుకు తినే వాళ్ళే…మోసకారి కోవిటి,కుళ్లిన రాజకీయనాయకుడు,ఆచారం అని చీదరించే బాపనోళ్ళు,బలిసిన కమ్మలు,పొగరుబోతు రెడ్లు,నాయుళ్ళు,ఒకళ్ళా,ఇద్దరా…ఈ కులాల్లో మగోడి గుట్టు తెలియని సాకలి ఉండదు,ఆళ్ళకి సచ్చినప్పుడు చాకిరి చేత్తా,

పీనిగ మోకాలు చూత్తే రొచ్చు,రోత తప్ప ఏదీ గుర్తుకు రాదు…బతికి ఉండగా వచ్చావా,ఒంటో బాగలేదా,ఒకముద్ద తిను,ఇవ్వాళ గుడ్డలు ఉతకొద్దులే…అని అనని జన్మలు…సరే చాకిరీఅంటే

పీనుగులకి చేత్తాము,తప్పదుగా,లేకపోతే సాకలి మాన్యం కూడా లాక్కున్టారు…నేను ఎదురు తిరిగితే నా మొగుడూ,కొడుకూ కూడా వోళ్ళ పక్కే…ఊరంతా ఒక తాటి మీదకీ వత్తారు.ఈళ్లు శని,కీడు అనుకునే గాజుపూసా,మెట్టెలు సూత్రాలు,పూలు పసుకుంకాలు మేమే ఎందుకు తియ్యాల,ఎందుకు తెంచి పొయ్యాల…పెట్టుకునేతప్పుడు నన్ను అడిగి దిగేసుకున్నారా…దిక్కుమాలిన సంత…అని గస పోసుకుంటా…మాకూ మా బతుకులకీ మైల మాత్రం అంటించవచ్చా…వాళ్ళూ ఇసిరిన ముస్ఠి  బంగారపుముక్కలు అమ్ముకోని తినాలా అని ఇసురుగా చేతులు పైకి ఎత్తి …ఈచేత్తో ఎన్నోసావులు చేశాను,ఎన్నో బొట్లు తెంచాను…

ఆఖరికి ఇదిగో ఈకాడిగట్టుకి అవతల ఉండే చిన్ననాటి నాసావాసగాడు…మా ఊరినించీ ఇల్లిటం వచ్చాడు…బతుకంతా కలిసే పెరిగితిమి…పొలంపని కూడా  కలిసి బొదుళ్లు చేసుకునేవోళ్ళం…అద్దానతరంగా ఆ మడిసి పోతే…మడిసిని చూసి ఏడవటానికిలేదు…ఆపీనిగ పనులూ నేనే సెయ్యాల…ఆపెళ్ళాం పుస్తెలు నేను తెంచి పొసెతప్పుడు నరకం జూసా….తెంపేతప్పుడు…ఒకరిని పట్టుకోని ఒకరం శోకాలు పెట్టుకున్నాము…ఆమె గూడా నగలు ఇచ్చింది…ఒక్కటంటే ఒక్కటి కూడా నాఅవసరానికి వాడుకోలా…పేణాలమీదకి వచ్చినా వాడలా…అయ్యి నేను కరిగిచ్చి నగలు చెపిచ్చుకోటమా…ఇదిగో నామెడలో నూలు బొందు…దానికి నేనే పేనిఏసుకున్న వొట్టిముళ్ళు…”అని ఆపి నీళ్ళు తాగింది.

“ఏందమ్మా నీకు నేను సెప్పేది…బలిసినోళ్ల బంగారురేకులు ముట్టుకున్న ఈచేతులతో ఏనాడూ సుకంగా కూడుతినలా…తినను గూడా”…ఆయమ్మిచూపు శూన్యంలోకి పొయ్యింది.

కూసేపుటికి కొడవలి చేత్తో పట్టుకోని కదిలింది…ఆయమ్మి నడకలో,ఆఅడుగుల్లో తిరస్కారం,ఆకదలిక కొన్ని తరాలకి ఏసిన ప్రశ్నకి మల్లిగా  ఉంది…అప్పుడు నోరు తెరిసింది …

“దడుసుకోకుండా నాఎమ్మిట రా…వలికిలల్లోకి (శ్మశాననికి)పోదాం…బతికిఉండ మడుసులు చేసిన అన్యాయం సూద్దువు,దాసిన(దాచిన)పోసూ కుంకాల మురికి జూడు …సెవాలకి బయపడక్కరలేదు…

అయ్యి లెగిసి తుమ్మవు,మడుసుల మనసులు కొరకవు”.అని కదిలింది.ఆయమ్మి ఎనక…ముందు కాలాలలో కాలే  శవం లాగా నడిశా…

శ్మశానంలోకాలతన్న కాష్టాలు,కొద్దిగా అసంటగా చింతచెట్టు,ఎన్ని వందల ఏళ్ళో …దానికింద ఇరిగిన సమాధిగుంట…దాని పైన కాసిని ఎనికలు(ఎముకలు),చెత్తా పిచ్చి కసువు ,ప్లాస్టిక్ కాయితాలు,

సంచులుగుడ్డలూ కప్పి ఉండయ్యి…ఐదు నిమాషాలు  కష్టపడి అన్నీ కొడవలితో లాగింది…నాపరాయి ఉంటే పక్కకి జరిపింది…లోపల మట్టి కుండ…కుండకి మూత…మూత తీసింది.

“సూడు…సూడు…బాగా సూడు,గుడ్లు పేలతయ్యి”,అంది.

కుండ లోపల చూస్తే …నోట మాట రాలా…కళ్ళు పేలిపోతయ్యి అనుకున్నా…

“బంగారం ,బంగారం,బంగారం…”

సూత్రాలు,సూత్రాలు…తాడుకి దండలా గుచ్చిన సూత్రాలు…నల్లపూసలు,మెట్టెలు…ఎన్నో…ఎన్నెన్నో,ఇన్నేళ్లుగా శెవాలు చేసిన ఆరాచకాల బంగారు దండలు.

గొంతులో నించీ ఒక్కసారిగా భళ్ళున వాంతి…ఎన్ని వాంతులో,లోకం పైన.

ఆమె పాదాలు చూడలేక క్షమించమని ఆడగలేక …ఎనక్కి తిరిగి ఇంటికి ఎట్టా చేరానో.

***

 

మన్నెం సింధుమాధురి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘సాకలి ఆడదానికి మరుగు ఏంది’, అన్న ఆడదికి సాంఘిక దురాచారాల మీద ఉన్న అవగాహన మోసకారులకి, కుళ్లిన రాజకీయనాయకుడు,ఆచారం అని చీదరించే వాళ్ళకి, బలిసిన వారికి, పొగరుబోతు నాయళ్ళాకి ఇతరులకి లేకపోవడం ఒక పెద్ద విషాదం!

    గుంటూరు మాండలికాన్ని భలే పట్టుకున్నదీ కథకురాలు. పుట్టిన రోజు శుభాకాంక్షలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు