చీకట్లలోంచి పలకరించిన శ్రీకాంత్ కవిత

యిక ఇప్పటికిదే కవిత్వమంటూ ఒక అద్దాన్ని చేతికిస్తే ఎవరైనా కాదని ఎలా అనగలరు?

           సాయంత్రం. వాకిలి ముందరంతా రావి ఆకులు. రాలి పడినవి. లేదా ఎవరో రాల్చేసినవి. కొన్ని నా చెట్లలోవి. కొన్ని పక్కవాళ్ళవి. ఎండిపోయీ ముట్టుకుంటే చిట్లిపోగలిగేంత మృదువయీ తేలికయీ యింకాస్త పారదర్శకమయీ గాలికి గలగలమంటూ ఎగిరి పడుతూ పడి లేస్తూ పలకరించేవారు లేక అలా కొన్ని కుప్పలుగా కొన్ని ఒంటరిగా. రావి ఆకులు. దారి చేసుకుంటూ గదిలోకెళ్లాను లేదా దారి చేసుకుంటూ గదిలోంచి బయటికొచ్చాను. మధ్యలో ఎపుడో శ్రీకాంత్ కవితొకటి చదివాను.

నడిరాతిరి. నిద్రలోంచి వులిక్కిపడిలేచి చూస్తే పక్కన అమ్మలేదు. కొన్ని క్షణాల మౌనం తర్వాత నేనిక పిల్లాడిని కానని తెలివొచ్చి..తెలిసొచ్చి.. మళ్లీ మౌనం. ఇంకాస్త గాఢమైన మౌనం. ఉన్నట్టుండి ఆకలయింది. చుట్టూ చూశాను. ఎవరన్నా, “పోయి అన్నం తిను” అంటారేమోనని.. ఎవరూ లేరు..ఎవరో కాదు అమ్మ లేదు. అప్పుడు మొదలైంది చీకటి. అప్పుడే. కారు నల్లటి చీకటి. ముఖాన్ని చేతులలో దాచుకున్నా ఆగకుండా, బొట్లుబొట్లుగా మొదలై ధారగా కురుస్తూ చీకటి.. ఎక్కడిదీ చీకటి.. ఎవ్వరిదీ చీకటి.. అతనిదా.. నాదా అతనిలోని నాదా నాలోని అతనిదా.. తెలీలేదు. తెల్లవారింది. వేకువ మీద ఎండిన కన్నీటి చారలు. ఏమీ ఎరగనట్టు కాగితాల మీద అతని కవిత.

ఒక మండువేసవి. ఒక మిట్టమధ్యాహ్నం. నీళ్లకుండకోసం వెతికాను. దొరకలేదు. మీకెప్పుడైనా ఎదురయిందా వేసవి? మీరెప్పుడైనా వెతికారా నీళ్ళకుండ కోసం? మీకు దొరికిందా? అతనికీ దొరకలేదేమో! దాహంతో దారులు మర్చిపోయీ దేహం ఆర్చుకుపోయీ ఏవో అనుకుని మరింకేవో చేసుకుని పసిపిల్లల నోటి ప్రశ్నల్లో మలినపడుతూ పసిపిల్లల చేతిస్పర్శల్లో తేటపడుతూ పసిపిల్లల లేతనవ్వుల్లో పునర్జన్మిస్తూ అలా నిశ్చలమైపోయీ.. కన్నీరు కారుస్తూ.. కనబడకుండా తుడిచేసుకుంటూ మండుటెండల్లో నీళ్ళకుండకోసం వెతుక్కుంటూ..వెతుక్కుంటూ.. మనం..నేను.. అతను.. కవిత.

యిక, ఆమె. ఒక్కమాటైనా మాట్లాడకుండా ఒక్క చెంపదెబ్బయినా వేయకుండా అతనిని ప్రేమిస్తూ అతనికోసం రొట్టెలు చేస్తూ అన్నం వండుతూ అతనికోసం నగ్నమవుతూ అతనికోసం గాయమవుతూ తెగిన వక్షోజమవుతూ నెత్తురవుతూ కన్నీరవుతూ ఒంటరి రాత్రులవుతూ అంతా కవిత్వమవుతూ కవిత్వమంతా ఆమే అవుతూ అతనికొక వరమై ఒక శాపమై భరించలేని ప్రేమై నొప్పై ఆదిమ ప్రశ్నై అనాది శోకమై చివరికిట్లా నాలో నేనూ ఒక అతనినే అన్న ఎరుకై..యిలా నేనూ అతడినే అన్న ఎరుకై.

(కొన్నాళ్లుగా చదువుతున్నానీతని కవితని. మిరుమిట్లు గొలిపే చీకటి లాంటి కవిత. గోడలపై తారట్లాడే నీడలాంటి కవిత. జీవితంలోని మెత్తదనాన్నీ ఆ మెత్తదనాన్ని అనుభవించలేని అశక్తతనీ గుర్తుచేసే కవిత. మూడొందల పేజీల్లో రెండొందల పది శకలాలై పరచుకొన్న కవిత. శ్రీకాంత్ లేదా I అనబడే కవిత. మాట్లాడేందుకిక మాటలు లేకా కార్చేందుకిక కన్నీరూ చాలక యింత కవిత్వం నేనేం చేసుకోనూ అనిపించేంతటి కవిత. ఎలా రాస్తాడీయన? అంత గాఢంగా! తీవ్రమైన నొప్పిలోంచి వచ్చే మూలుగులాగా! నిజాయితీ కలిగిన ఒక ఒప్పుకోలులాగా! అపరాధ భావమేదో వెన్నంటి తరుముతూ ఉంటే ఇక పారిపోలేక ఎదురుపడి పలికే ఒక బోల్డ్ కన్ఫెషన్ లాగా.. ఎలా రాస్తాడీయన?

ప్రశ్నల్లోంచే చదువుకున్నాను. అన్ని వాక్యాలకూ అన్ని పదాలకూ అన్ని దృశ్యాలకూ ఏవేవో నేపధ్యాలు అల్లుకున్నాను. ఊహించుకున్నాను. ఏవేవో అర్థమయ్యాయి. ఏవేవో కొత్త ప్రశ్నలు మొలిచాయి. ఎన్నెన్నో ఆలోచనలు ఊరికే అట్లా గాలికి రేగిపోయాయి. పదేపదే వలయాలు వలయాలుగా విస్తరిస్తూ ఒడ్డున విరిగిపోయే ముఖశకలాల కలబోతే జీవితమంటూ యిక ఇప్పటికిదే కవిత్వమంటూ ఒక అద్దాన్ని చేతికిస్తే ఎవరైనా కాదని ఎలా అనగలరు? నేను మాత్రం ఇంకేం చెప్పగలను? )

*

నవీన్ కుమార్

12 comments

Leave a Reply to Solomon Vijay Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

    • Beautiful పరిచయం నవీన్ 👍👍
      రాసినవేవైనా రాసేవరకే తనవి, రాశాక తనవి కావంటాడు. తను లేనంటాడు. (ఈ మాట రాసేవాళ్లకు అందరికీ వర్తిస్తుంది అనీ అంటాడు) రాసినవన్నీ మనకిచ్చి నిజంగానే తను ఉండడు.. అదే శ్రీకాంత్ !?
      ఇక అతని పాఠాలు (అతను తన సృజనలను కవితలుగా కాక texts అని చెప్పుకోవడానికే ఇష్టపడతానంటాడు) పాఠకుడిలో alchemist లా పనిచేస్తాయి.

      • సోలోమాన్ అన్నా.. I agree. శ్రీకాంత్ ఇంటర్వ్యూ కూడా దానికదే ఒక masterpiece. చలం యోగ్యతాపత్రం లాగా ఈ ఇంటర్వ్యూ కూడా నిలిచిపోతుంది individual గా. అన్నట్టు, వాకిలి కోసం ఆ ఇంటర్వ్యూ చేసింది ఈ సారంగాధిపతే 😊

  • అమ్మ లేనప్పుడు వచ్చిన చీకటిని ,చీకటిలోంచి వెలుతురై వచ్చిన ఈ కవితను మాకు అందించిన విధానం ఎంత అద్భుతమో అన్న.శ్రీకాంత్ సార్ కవితల్లో లిప్తకాలం నాకు బాగా ఇష్టం అన్న….

  • చెప్పగలవు. ఇంకాస్త రాయాల్సింది నవీన్. నీ వాక్యాలు చదివిస్తాయి.

    • అవునన్నా.. ఇంకా చాలా రాయొచ్చు. అయితే, చదివాక నా అనుభూతిని మాత్రమే పంచుకోవాలనుకున్నాను, మిగతా వేటి జోలికీ పోకుండా.. అందుకే చిన్నగా వచ్చిందేమో.. but thank you 😊 will keep in mind..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు