గృహప్రవేశం

ఇదంతా ఆలోచిస్తుంటే పెళ్లిళ్ల వల్ల ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి కలిగే లాభాలే ఎక్కువేమో అనిపిస్తుంది. భార్య తెచ్చే కట్నం, సంపాదించే జీతం, పుట్టే సంతానం, భార్య వల్ల వచ్చే ఆస్తి..అన్నీ భర్తకి, తన కుటుంబానికి కలిగే లాభాలే కదా?

శ్విన్‌తో నిన్న నా పెళ్లిచూపులు జరిగాయి. ఇద్దరం కాసేపు విడిగా మాట్లాడుకున్నాం. అశ్విన్ వెళ్లినప్పటి నుంచీ అమ్మవాళ్ళు అతని గురించి చాలాసేపు చెప్పారు. ‘మంచివాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా ఆస్తిపరులు, హైదరాబాద్‌లో ఉండరు, పెళ్లయ్యాక అత్తమామల పోరు లేకుండా మీ ఇద్దరే హాయిగా ఉండొచ్చు. ఇప్పటికే లేట్ అయిపోతుంది’ అని సతాయిస్తున్నారు తప్ప నాకు అశ్విన్ నచ్చాడా, లేదా అని ఆలోచించుకునే టైం ఇవ్వట్లేదు. అందుకే ఆఫీసు టైంలో పని పక్కన పడేసి మరీ, నా మనసులోని గందరగోళానికి ఓ స్పష్టత తీసుకురావాలని అనుకున్నాను.

అశ్విన్ సీఏ చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి అరవై వేల జీతం. నా జీతం కంటే ముప్పయ్ వేలు ఎక్కువ. చూడటానికి బావున్నాడు. మా ఈడుజోడు బావుంటుందని అమ్మావాళ్ళు అన్నారు. చెడు అలవాట్లు, దుబారా చేయటం లాంటివి లేవు. ఇల్లు కొనటమే తన లక్ష్యం అని సూటిగా చెప్పాడు. ఇల్లు కొనటం తప్ప వేరే ధ్యాసే లేనట్టు, ఇంటి గురించే ఎక్కువసేపు మాట్లాడాడు. తను కొనబోయే ఫ్లాట్ ఇద్దరి పేర్ల మీద తీసుకుని, ప్రతినెలా ఈఎంఐ ఇద్దరం కలిసి కట్టేద్దాం అన్నాడు. నా గురించి, నా ఇష్టాల గురించి ఏమీ తెలుసుకోవాలి అనుకోలేదు. ‘చాలా క్యాలికులేటెడ్గా ఉండే వ్యక్తి’ అనిపించాడు. లోన్ కలిసి కట్టేద్దాం అనటంలో తన ఉద్దేశం ఏంటి? నా జీతం మీద తనకు హక్కు ఉంది అని చెప్పటమా? లేదా పెళ్ళికి ముందే నాకు ‘మన’ అన్న ఫీలింగ్ తీసుకురావాలనా? ఏంటో..ఈ అబ్బాయి అర్థమైనట్టే ఉన్నాడు కానీ, ఏమీ అర్థం కావట్లేదు. చాలా అయోమయంగా ఉంది.

ఈ గందరగోళం గురించి అమ్మకి చెప్తే “అబ్బాయి ఆస్తులు కొంటా అంటే మంచిదే కదే!” అంది. “అది కాదమ్మా! నా ఇష్టాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చూపించలేదు” అన్నాను. “నీ బొంద! మొగవాళ్ళు అంతేనే! మీ నాన్న నన్ను పెళ్లి చేసుకుని పాతికేళ్ళు కావొస్తోంది. నాకు ఏ స్వీట్ ఇష్టమో ఆయనకి ఈ రోజుకీ తెలియదు. నెలవారీ ఖర్చులు పోగా ఎంత మిగలాలో గుర్తుంటుంది కానీ, నాకు జిలేబీలు కాదు, మడతకాజా ఇష్టమని మాత్రం తెలుసుకోలేకపోయారు. ఆయన జిలేబీలు తెస్తూనే ఉన్నారు, ఏ స్వీట్ అయితే ఏముందిలే అని నేను తింటూనే ఉన్నాను. మీ నాన్నే కాదు, మా నాన్న కూడా అంతే! నేను నీలానే మా అమ్మని ‘నీకు ఏం ఇష్టమో నాన్నకి ఎందుకు చెప్పవే?’ అని అడిగితే, మన ఇష్టాలేంటో తెలియటం వల్ల వాళ్ళకి పైసా లాభం లేదుఅని చెప్పింది. ఇప్పుడు నీకు అదే చెప్తున్నా. పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి అశ్విన్‌ని పెళ్లి చేసుకో!” అంది. మగవాళ్లంతా అంతే అని, మా తాత, నాన్నల తప్పేమీ లేదన్నట్టు చాలా సాధారణంగా మాట్లాడింది. ఆడవాళ్ళ ఇష్టాయిష్టాలకి పైసా విలువ లేదని మా అమ్మకి నేర్పించిన మా అమ్మమ్మ మీద పీకల దాకా కోపం వచ్చింది. అయినా మా అమ్మ, అమ్మమ్మలకి ఆ ఉద్దేశాన్ని బలపరిచింది మా తాత, నాన్నే కదా?

ఇదంతా ఆలోచిస్తుంటే పెళ్లిళ్ల వల్ల ఆడవాళ్ళ కంటే మగవాళ్ళకి కలిగే లాభాలే ఎక్కువేమో అనిపిస్తుంది. భార్య తెచ్చే కట్నం, సంపాదించే జీతం, పుట్టే సంతానం, భార్య వల్ల వచ్చే ఆస్తి..అన్నీ భర్తకి, తన కుటుంబానికి కలిగే లాభాలే కదా? కూతుళ్లని కని, పెంచి, చదివించిన తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం ఒక్కటే మిగులుతుందేమో!

అశ్విన్ గురించి ఏం ఆలోచించావ్ అని నాన్న అడిగితే ఏం చెప్పాలో అనే సందిగ్ధంతో తల పగిలిపోతోంది. కొంచెం టైం తీసుకుంటా అని నాన్నకి చెపుదాం అంటే, “ఇప్పటిదాకా ఐదు సంబంధాలు తెస్తే అన్నీ వద్దన్నావ్. ఇక ఇదే ఆఖరిది. ఇంతకంటే మంచి సంబంధం నేను తీసుకురాలేను” అని పెళ్లిచూపులకు ఐదు నిమిషాల ముందు ఇంటి పైకప్పు విరిగిపోయేలా నాన్న అరిచిన అరుపులు నా చెవిలో ఇంకా మారుమోగుతున్నట్టే ఉన్నాయి. ఇంతలో నేను కూర్చున్న మీటింగ్ రూమ్ డోర్ ఎవరో కొట్టారు. నేను నా డైరీ మూసేసి ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నట్టు నటించడం మొదలుపెట్టాను.

తలుపు తీస్కుని రెండు కాఫీ కప్పులతో లోపలి వచ్చింది మాయ. “అమృతా! బిజీయా? డిస్టర్బ్ చేశానా?” అని అడిగింది.

“లేదు మాయా! రా కూర్చో!” అన్నాను.

“పొద్దున్నుంచి చూస్తున్నా, ప్రపంచంలో భారమంతా నువ్వే మోస్తున్నట్టు దీర్ఘాలోచనలో ఉంటున్నావ్. ఏమైంది? నిన్నటి పెళ్లిచూపుల గురించేనా?” అడిగింది మాయ.

“అవును! అశ్విన్‌తో మాట్లాడాను. అశ్విన్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ కజిన్స్ అందరూ ఇప్పటికే ఇళ్ళు కోనేస్కున్నారు. కానీ అశ్విన్ మాత్రం ఇంకా కొనలేదు. దీంతో వాళ్ళ నాన్న అతణ్ని చేతకానివాడిలా చూస్తున్నాడని అతను బాధపడటమే గుర్తొస్తోంది. ఈ రోజుల్లో ఒక్కళ్ళ జీతంతో ఇల్లు కొని ఈఎంఐ భారం భరించలేరు కదా! అందుకే ఉద్యోగం చేస్తున్న నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడేమో అనిపిస్తోంది. పెళ్లిచూపుల్లో ఓ అమ్మాయితో ఫస్ట్ టైం మాట్లాడుతూ ‘నీ జీతంతో ఈఎంఐ కట్టాలి’ అని అలా ఎలా చెప్తాడే?” ఉక్రోషంగా అన్నాను.

“ఇవేం పెళ్లిచూపులే? ఎక్కడా వినలేదు!” అని కాఫీ తాగుతూ అంది మాయ. నేను దిగాలుగా కూర్చున్నాను.

“తను అనుకున్నవన్నీ చెప్పాడు సరే, నువ్వు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలని అనుకున్న విషయం చెప్పనిచ్చాడా? లేక ఇల్లు, ఈఎంఐ అని చెప్పి వెళ్ళిపోయాడా?” అంది మాయ.

“చెప్పా! ఆ విషయంలో మాత్రం ఎంకరేజింగ్‌గానే మాట్లాడాడు. నా ఇష్టాలకి, అభిప్రాయాలకి గౌరవం ఇస్తానని చెప్పాడు” అన్నాను.

“పోనీలే ఆ మాటైనా అన్నాడు, అదే పదివేలు” అంది మాయ.

“పెళ్లయ్యాక ఇద్దరం కలిసి సరదాగా, సంతోషంగా ఉండాలి అనుకోకుండా, ఇల్లు కొనాలనే పిచ్చేంటో అతనికి..” దిగాలుగా అన్నాను.

“నువ్వే అన్నావ్ కదా, వాళ్ళ నాన్న అతణ్ని చేతకానివాడిలా చూస్తున్నాడని. అమ్మాయిలకి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అని ఎలాగైతే చుట్టూ ఉన్న సమాజం ఒత్తిడి పెడుతుందో; అబ్బాయిలకి ఆస్తులు సమకూర్చుకోవాలనే ఒత్తిడి ఉంటుంది. మా హజ్బెండ్‌ని చూశా కదా, ఇల్లు కొనేదాకా చాలా టెన్షన్ పడ్డాడు” అంది మాయ. ఇంతలో మా చెల్లి అనిత ఫోన్ చేసింది. మాట్లాడటం ఇష్టం లేక కట్ చేస్తుంటే మళ్లీ మళ్లీ కాల్స్ చేస్తూనే ఉంది.

“అన్నిసార్లు ఎందుకు చేస్తుందో, మాట్లాడొచ్చు కదా?” అంది మాయ.

కాల్ లిఫ్ట్ చేసి “ఆఫీస్‌లో ఉన్నప్పుడు కాల్స్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను?” అని కోపంగా అన్నాను. మా చెల్లితో మాట్లాడి పెట్టేసేవరకు మాయ కాఫీ తాగుతూ కూర్చుంది. కాల్ కట్ చేశాక “అశ్విన్ మా నాన్నకి కాల్ చేసి, నేను నచ్చానని, నాకు తను నచ్చితే ఓకే అని చెప్పాడట. పెళ్లి ఖర్చులన్నీ అన్ని వాళ్లే పెట్టుకుంటారని అన్నాడట. కట్నం లాంటివి తనకి ఇష్టం ఉండవని చెప్పాడట. నా ఉద్దేశం కనుక్కోమని మా నాన్న అనితని కాల్ చేయమన్నారు” అన్నాను.

“ఆ ఇల్లు కొనే గోల తప్ప, ఓవరాల్‌గా మంచోడిలానే ఉన్నాడే! ఆలోచించు” అని చెప్పి బయటకి వెళ్ళిపోయింది మాయ. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆలోచించాను. చెడు అలవాట్లు ఉన్నవాళ్ల కంటే, ఆస్తులు కొనాలి అనుకోవటం మంచిదే కదా! ఎప్పటికైనా పెళ్లిచేసుకోక తప్పదుగా! దేవుడిని తలుచుకుని ‘నాకు ఓకే అని నాన్నకి చెప్పు’ అని మా చెల్లికి మెసేజ్ చేశాను.

మూడు నెలల తరవాత మా పెళ్లికి ముహూర్తం కుదిరింది. మూడు నెలలు ఉందన్నమాటే కానీ, ఆఫీస్ పనులతో పాటు పెళ్లి పనులు చూసుకుంటూ రెండు నెలలు మాకు తెలియకుండానే గడిచిపోయాయి. ఈ రెండు నెలల్లో అప్పుడప్పుడూ అశ్విన్, నేను ఆఫీస్ అయ్యాక డిన్నర్‌కి వెళ్లి చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇంటి భోజనం మిస్సయ్యే ఎంప్లాయిస్‌కి మంచి భోజనం అందించాలనే నా క్లౌడ్ కిచెన్ ఆలోచన చెప్తే, చాలా బావుందని అశ్విన్ మెచ్చుకున్నాడు. పెళ్లయ్యాక హనీమూన్‌కి ఎప్పుడు వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి అనే కాకుండా, పెళ్లయిన ఐదేళ్ల తర్వాతే పిల్లల్ని కనాలని అశ్విన్ ముందే ప్లాన్ చేసేశాడు. వాళ్ళ నాన్న ఒత్తిడి వల్లే ఆస్తులు సంపాదించాలని అశ్విన్ అనుకుంటున్నాడని తన మాటలు వింటే అనిపించేది. తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎదిగిపోయారని, తను ఇంకా మొదటి మెట్టు దగ్గరే ఉన్నాడనే నిరాశ అతనిలో కనిపించేది. ఇద్దరి కలలు నెరవేర్చుకోడానికి కలిసి కష్టపడాలని అనుకున్నాం.

మా పెళ్లికి ఇంకో నెల ఉందనగా, ఆఫీస్‌లో నేను ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్‌కి ఇంటర్వ్యూలు మొదలవుతున్నాయని తెలిసింది. పోయిన సంవత్సరమే నాకు ప్రమోషన్ రావాల్సింది. కానీ నా బదులు రోజూ ఆఫీస్ అయ్యాక తనతో కలిసి పార్టీ చేస్కుంటూ కష్టపడిన శశాంక్‌ని ప్రమోట్ చేశాడు మా మేనేజర్. శశాంక్ చాలా తెలివిగా ప్రమోషన్ తీసుకుని, ఆరు నెలలు పని చేసి, పెరిగిన శాలరీ పే స్లిప్స్ సమకూర్చుకుని, మరింత ఎక్కువ జీతానికి వేరే కంపెనీకి చెక్కేశాడు.

శశాంక్ స్థానం ఖాళీ అవ్వటంతో ఆ సీనియర్ అనలిస్ట్ రోల్ మళ్లీ ఓపెన్ చేశారు. శశాంక్ వెళ్లినప్పటినుంచి తన పని కూడా నేనే చేస్తున్నాను. సీనియర్ రోల్‌కి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. ప్రమోషన్ ఎలాగైనా రావాలని ఈసారి మరింత గట్టిగా ప్రిపేర్ అయ్యాను. పెళ్లి పనులు తనే చూసుకుంటూ, నన్ను డిస్టర్బ్ చేయొద్దని వాళ్ళ అమ్మవాళ్ళకి కూడా చెప్పి అశ్విన్ నన్ను చాలా ప్రోత్సహించాడు. ఇంటర్వ్యూ ముందు వరకు టెన్షన్ పడినా ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గానే సమాధానాలు చెప్పాను. రిజల్ట్స్ రావటానికి కనీసం నెల సమయం పడుతుందన్నారు.

పెళ్లి రోజు దగ్గర పడుతోంది. పెళ్లి చేసుకుంటున్నాననే సంతోషం కంటే, ఇంటర్వ్యూ గురించే ఎక్కువ టెన్షన్ పడుతున్నాను. రేపటి నుంచి పది రోజులు లీవ్ తీసుకున్నాను. మాయ వచ్చి “ఇప్పుడైనా ఆఫీస్ పని మాని, పెళ్లికి రెడీ అవుతావా? లేక లంచ్ బ్రేక్‌లో అశ్విన్‌ని పిలిచి ఇక్కడే తాళి కట్టించుకుంటావా?” అని నవ్వుతూ అంది.

“ఆపవే బాబూ! ఈ ఇంటర్వ్యూ ఏమవుతుందా అనే టెన్షన్‌లో నేనున్నాను. నీ జోకులకి నువ్వు కూడా రావట్లేదు” అన్నాను.

“వస్తుందిలే! అయినా అంత టెన్షన్ దేనికి?” అంది మాయ.

“మా ఇంట్లోవాళ్ళకి పెళ్లి ఖర్చులు బాగానే అయ్యాయి!” అన్నాను.

“అదేంటి? అశ్విన్ పెళ్లి ఖర్చులు అన్ని తనే పెట్టుకుంటా అన్నాడు కదా?” అనుమానంగా అంది మాయ.

“మా నాన్న ఊరుకుంటాడా! ‘మొగపెళ్లి వాళ్లతో ఖర్చులు పెట్టిస్తే మాటొస్తుంది’ అని అన్ని ఖర్చులూ తనే పెడుతున్నారు” అన్నాను.

“పెద్దవాళ్లంతే!” అంది మాయ.
“ఈ ప్రమోషన్ వస్తే ప్రతినెలా నాన్నకి కొంత డబ్బు ఇవ్వాలి. పెళ్ళికి బాగా ఖర్చుచేస్తున్నారు” అన్నాను.
“ఇస్తే ఇవ్వు కానీ, స్వానుభవం కొద్దీ ఓ సలహా ఇస్తాను. ప్రమోషన్ వచ్చి జీతం పెరిగిన విషయం కొంతకాలం అశ్విన్‌కి కానీ, మీ నాన్నకి కానీ చెప్పకు. నీకంటూ కొంత డబ్బు దాచుకో! ఫిక్స్‌డ్ డిపాజిట్టో, సిప్ ప్లానో మొదలుపెట్టు. మన దగ్గర డబ్బుంటే కొండంత ధైర్యం వస్తుంది. అవసరమైనప్పుడు ఎవరి దగ్గరా చేయి చాచకుండా చేస్తుంది” అంది మాయ. నేను మాయ మాటలకి అవాక్కయ్యి చూస్తుంటే “నాకు నీతో ఉన్న చనువు వల్ల ఇదంతా చెప్పాను. ప్లీజ్, నీకంటూ కొంత డబ్బు దాచుకో! ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పుడు అర్థం కాదు” అని చెప్పి వెళ్ళిపోయింది.

మాయ చెప్తుంటే ‘సరే’ అని తలూపాను కానీ, భార్యాభర్తల మధ్యలో దాపరికాలు ఉంటే ఏం బావుంటుంది? అయినా నాకు ప్రమోషన్ వస్తే అశ్విన్‌తోపాటు మా ఇంట్లో అందరూ సంతోషిస్తారు, కాబట్టి అందరికీ చెప్పాలని అనుకున్నాను. నాకు ప్రమోషన్ వచ్చిందని తెలిశాక, అశ్విన్ కళ్ళలో ఆనందం చూస్తానని అనుకుంటుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.

మా పెళ్లి జరిగి సరిగ్గా నెల రోజులయ్యింది. నేను అశ్విన్ హనీమూన్ కోసం ఊటీకి వచ్చాం. ఊటీలో ఐదు రోజులు ఒక రిసార్ట్‌లో ఉండి టీ గార్డెన్, నీలగిరి కొండలు, రోజ్‌ గార్డెన్..ఇలా చాలా ప్రదేశాలు చూశాం. హైదరాబాద్‌కి వెళ్లిన వారం తరువాత కొత్త ఇంటి రిజిస్ట్రేషన్ ఉంది. అందుకే మేము ఊటీలో ఉన్నా సరే, హోమ్‌లోన్ వాళ్ళు అశ్విన్‌తో మాట్లాడుతూనే ఉన్నారు. ఓ కాల్ మాట్లాడిన తర్వాత అశ్విన్ దిగులుగా, బాల్కనీలో టీ తాగుతున్న నా దగ్గరకి వచ్చాడు. “అమృతా! చిన్న ఇబ్బంది వచ్చింది. నిన్ను కలవకముందే ఇంటికి అడ్వాన్స్ కట్టాను కనుక నా ఒక్కడి పేరు మీదే లోన్ పేపర్స్ తయారు చేశారంట. నీ పేరు యాడ్ చేయటానికి వాళ్ళు ఎంత ప్రయత్నించినా సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఇల్లు నా ఒక్కడి పేరు మీదే రిజిస్టర్ చేయించాలంటున్నారు” అని చెప్పి మళ్లి ఫోన్ వస్తే కంగారుగా వెళ్ళిపోయాడు. అశ్విన్ చెప్పిందేదీ నాకు నమ్మశక్యంగా అనిపించలేదు. నన్ను కలవకముందే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు, ఇద్దరి పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించలేడని పెళ్ళికి ముందే తెలియదా? తెలిసి కూడా ఈఎంఐ భారం తనొక్కడే భరించలేదు కనుక, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడా? అశ్విన్ నాకు అబద్ధం చెప్పాడన్న ఆలోచన నన్ను తీవ్రంగా బాధపెడుతోంది. ఏవేవో నెగటివ్ ఆలోచనలతో నాకు ఆందళనగా అనిపించి అమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను.

 

“రిజిస్ట్రేషన్ పేపర్లలో ఇద్దరి పేర్లు లేకపోతే ఏమవుతుందమ్మా! భర్త ఆస్తి మీద భార్యకి కాక ఇంకెవరికి హక్కు ఉంటుంది చెప్పు? అయినా నువ్వు అశ్విన్‌ని పెళ్లి చేసుకుంది ఇల్లు నీ పేరు మీద పెడతాడని కాదు కదా!” అని సర్ది చెప్పింది.

నిజమే! పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడుచేసుకోకూడదు అనుకుని “ఏం కాదులే! ఎవరి పేరు ఉంటే ఏంటి!” అని అశ్విన్‌తో చెప్పాను. కొంతసేపటికి హోమ్‌లోన్ అప్రువ్ అయ్యిందని, హైదరాబాద్ వెళ్లిన వారానికి రిజిస్ట్రేషన్ అవుతుందని, రిజిస్ట్రేషన్ అయ్యాక ఇంటీరియర్స్ మొదలుపెడతారని చాలా సంతోషంగా చెప్పాడు.

పెళ్లయినా దగ్గర నుంచి ఇచ్చిన నా ఇంటర్వ్యూ రిజల్ట్స్ వచ్చాయేమో ఫాలో అప్ చేయమంటున్నాడు అశ్విన్‌. ‘సరే’ అని తలూపుతున్నా కానీ, ఎక్కడ నాకు ప్రమోషన్ రాలేదనే వార్త వినాల్సి వస్తుందో అనే భయంతో ఎవరినీ కనుక్కోలేదు. మేము హైదరాబాద్ బయలుదేరే ముందురోజు సాయంత్రం జోరుగా వాన పడుతుంటే, అశ్విన్ నేను బాల్కనీలో కూర్చుని వేడిగా టీ తాగుతూ మా కాలేజీల్లో చేసిన అల్లరి పనులు గురించి మాట్లాడుకుంటున్నాం. “అవును! అడగటం మర్చిపోతున్నా నీకు ప్రమోషన్ వస్తే జీతం ఎంత పెరుగుతుంది?” మామూలుగా అడిగాడు అశ్విన్.

“ఏమో తెలియదు. ఏం..ఎందుకు?” అన్నాను.

“ఏం లేదు. నీకు పెరిగే జీతం బట్టి మన ఇంటి లోన్ తొందరగా కట్టేయటానికి ప్లాన్ వేసుకోవచ్చు కదా!” అన్నాడు.

“ఆలు లేదు..చూలు లేదు..కొడుకు పేరు అదేదో అన్నాడట నీలాంటివాడే!” నవ్వాను.

“ప్లానింగ్ ఉండాలోయ్! డబ్బుల విషయాలలో ముందుగా ఆలోచిస్తే ఈ ఇంటిలోన్ కట్టేసి, ఇంకో ప్రాపర్టీ గురించి ఆలోచించు” టీ తాగుతూ అన్నాడు.

“ఇంకో ప్రాపర్టీ ఏంటీ?” కంగారు గా అడిగాను.

“మా అన్నయ్య రెండో ఇల్లు కోసం చూస్తున్నాడు. ఆ రెండో ఇంటితో వచ్చే రెంట్‌తో మొదటి ఇంటి ఈఎంఐ కడతారట. అప్పుడు ఒక్క ఈఎంఐ కడుతున్నట్టు ఉంటుంది కానీ, చివరికి రెండు ఆస్తులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇదే ట్రెండ్. మనమూ అదే ఫాలో అయిపోవటమే” అన్నాడు అశ్విన్.

“రెండో ఇంటికి డౌన్ పేమెంట్ ఎలా కడతాం?” అర్థంకాక అడిగాను.

“మన ఖర్చులు తగ్గించుకుంటే సరి, సేవింగ్స్ అవే అయిపోతాయ్” అన్నాడు. నేను ఏమీ మాట్లాడక ఊరికే ఉన్నాను.

“ప్రమోషన్ సంగతి తెలియదన్నావ్! సరే, కనీసం ప్రతి సంవత్సరం పెరిగే జీతం ఎంత పెంచుతారో తెలుసా? లేక అది కూడా తెలియదా?”ఎగతాళిగా అడిగాడు.

చెప్తే ఇంకెన్ని లెక్కలు వేస్తాడో అని ఇబ్బందిగా నవ్వి ప్లేట్‌లో ఉన్న పకోడీ తీస్కుని తింటూ వానని చూస్తూ కూర్చున్నాను. అంతలో అశ్విన్‌కి ఏదో ఫోన్ వస్తే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు మాయ ప్రమోషన్ వస్తే ఎవరికీ చెప్పొద్దు అని ఎందుకు అన్నదో ఇవాళ అర్థమైంది.

ఇంటీరియర్స్ పూర్తయ్యి మేము గృహప్రవేశం చేయడానికి మధ్యలో మూడు ఈఎంఐలను ఇద్దరం కలిసి కట్టాం. లోన్ తొందరగా క్లియర్ అయిపోవాలని ఎక్కువ ఈఎంఐ కట్టేలా బ్యాంకుతో మాట్లాడాడు అశ్విన్. నాకు వచ్చే ముప్పై వేలలో పాతిక వేలు అశ్విన్‌కి ఇచ్చి, మిగిలిన ఐదువేలలో సర్దుకోవటం కష్టంగా ఉంది. ప్రమోషన్ వస్తే బావుండు అని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను.

దాదాపు 150 మందిని గృహప్రవేశానికి ఆహ్వానించాడు అశ్విన్. అంతమంది ఎందుకు సింపుల్‌గా చేసుకుందామంటే, మనం కొన్నట్టు అందరికీ తెలిస్తే నలుగురిలో మన గౌరవం పెరుగుతుందని నచ్చచెప్పాడు. గృహప్రవేశం రోజు అందరూ ఇల్లు బావుందని మెచ్చుకుంటుంటే అశ్విన్ తెగ సంతోషపడిపోయాడు. ఇల్లు బాగా లోపల ఉందని, మెయిన్ రోడ్ మీదకి ఉంటే ఇల్లు అమ్మే రోజు ఎక్కువ డబ్బులు వచ్చేవని మా మామగారు అనేసరికి అశ్విన్ చిన్నబుచ్చుకున్నాడు. అశ్విన్‌ని వాళ్ళ మేనమామ పిలిచి “ఏరా! అమృత కూడా ఉద్యోగం చేస్తుంది కదా! రెండు జీతాలు వస్తున్నాయ్, ఇంకేం..లోన్ తొందరగా తీరిపోతుందిలే!” అన్నాడు.

“ఛఛ! అమృత డబ్బులు నేను తీసుకోను మావయ్యా! లోన్ అంతా నేనే కడుతున్నాను” అని అశ్విన్ అనటం విని నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో అశ్విన్ నన్ను చూశాడు కానీ, తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అన్నట్టు ప్రవర్తించాడు. ఆ రోజు గృహప్రవేశం అయ్యి అందరూ వెళ్ళిపోయాక, మా చెల్లి మాకు ప్రజెంట్ చేసిన నేమ్ ప్లేట్ గోడకి తగిలించాడు. అందులో ‘అమృత & అశ్విన్’స్’ అని రాసి ఉంది. రిజిస్ట్రేషన్‌కి పనికిరాని నా పేరు, గోడకి తగిలించి తనకి నా పట్ల ఉన్న ప్రేమని నలుగురికి చూపించుకోటానికి ఉపయోగపడిందని నవ్వుకుని ఊరుకున్నాను. గృహప్రవేశం రోజు జరిగినదాని గురించి ఇద్దరం మాట్లాడుకోలేదు.

నాకు ప్రమోషన్ వచ్చిందని మెయిల్ వచ్చింది. ఆఫీస్‌లో అందరికీ స్వీట్స్ తెప్పించి, ఇంటికి కూడా ఒక స్వీట్ బాక్స్ తీసుకున్నాను. ఆటోలో వెళ్తూ, అశ్విన్‌కి ఈ విషయం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నా జీతం అరవై వేలయ్యింది. మాములుగా అయితే ప్రమోషన్ వచ్చిన సంగతి ఆనందంగా చెప్పేదాన్నేమో! కానీ, గృహప్రవేశం రోజు అశ్విన్ ఈఎంఐ భారమంతా తనొక్కడే మోస్తున్నట్టు వాళ్ళ మామయ్యకి చెప్పినప్పటి నుండి, ప్రమోషన్ వచ్చినా చెప్పకూడదేమో అనుకున్నాను. ఒకవేళ చెప్పినా, ఇంటి లోన్ తీర్చటానికి దాచేద్దాం అంటాడు. అందుకే, కొన్ని నెలలు చెప్పకుండా ఉంటే బావుండని అనుకున్నాను. పోనీ అమ్మకి చెప్తే, పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే అమ్మ, అశ్విన్‌కి చెప్పేస్తుందేమో అని ఆలోచిస్తుండగా ఇల్లు వచ్చింది.

తలుపు తీయగానే నా చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ చూసి అశ్విన్ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగలించుకుని, “కంగ్రాట్స్ అమృతా! నాకు తెలుసు నీకు ప్రమోషన్ వస్తుందని. మనం ఎంచక్కా ఈ ఇంటి లోన్ క్లియర్ చేసేసి, సెకండ్ ఫ్లాట్ డౌన్ పేమెంట్ కోసం సేవ్ చేయటం మొదలుపెట్టచ్చు. నేను నా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. నాన్నకి ఈ ఏరియా నచ్చలేదు కాబట్టి, ఈసారి మాదాపూర్‌లో ఫ్లాట్ కొంటే మంచిది” అన్నాడు. అశ్విన్ ఆపటానికి “నాకు ప్రమోషన్ రాలేదు. శాలరీ మాత్రం 10 శాతం పెంచారు” అన్నాను. అశ్విన్ చాలా డిసప్పాయింటెడ్‌గా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేస్కుని కూర్చున్నాడు. నేను తెచ్చిన స్వీట్ బాక్స్‌లో నుంచి ఒక లడ్డూ తీస్కుని తింటూ సోఫాలో కూర్చున్నాను.

అశ్విన్ రెండు రోజుల వరకు నాతో సరిగ్గా మాట్లాడలేదు. ఆ తర్వాత రోజు నేను ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతుంటే, బెడ్‌రూమ్‌లోకి వచ్చి “ఈఎంఐ కట్టాలి, డబ్బులు పంపించు” అన్నాడు.

“అశ్విన్! నువ్వు పెళ్లిచూపుల్లో ఈ ఇంటి లోన్ ఇద్దరం కలిసి కట్టాలంటే సరే అన్నాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇంటి లోన్ పూర్తయ్యే వరకు నేను డబ్బులు ఇస్తాను. ఆ తరవాత నేను క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టడానికి నా జీతం వాడాలి అనుకుంటున్నాను” అన్నాను. అశ్విన్ తలదించుకుని నుంచున్నాడు.

“మనకి ఈ ఇల్లు చాలు. అప్పుడే నువ్వు వేరే ఇంటి గురించి దయచేసి ఆలోచించకు. పెళ్లి అయినప్పటి నుంచి ఈఎంఐలు కట్టటం, లోన్ తొందరగా ఎలా తీర్చేయాలని తప్ప మనం మనసు విప్పి మాట్లాడుకుంది లేదు” అంటుంటే, “నీకేం తెలుసు? మా నాన్న నా వయసులో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచుతూ సొంత ఇల్లు కూడా కొన్నాడంట. నాకు రెండో ఇల్లు కొనటం కూడా చేతకాదని, అన్నయ్యని చూసి నేర్చుకోమని ఇవాళ కూడా దెప్పిపొడిచాడు. పోనీ ఆయన ఏమైనా సహాయపడతాడా అంటే, అన్నయ్య ఇల్లు కొనేటప్పుడు నాన్నని సాయం అడగలేదు కాబట్టి నేను కూడా అడగకూడదు. అడిగితే అప్రయోజకుడు అంటాడు. నా బాధ ఎవరికీ అర్థం కాదు. నీకు ఈఎంఐకి డబ్బులు ఇవ్వటం కష్టంగా ఉంటే, నేనే ఏదో రకంగా ఏర్పాటు చేస్కుంటా!” అని అరిచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.

రెండు గంటలు గడిచినా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఎత్తడు. ఇంకా నా వంతు ఈఎంఐ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసి “సారీ..” అని మెసేజ్ పెడితే ఆ మెసేజ్‌కి రియాక్షన్‌గా థంబ్సప్ సింబల్ పెట్టాడు. ఆ తరవాత నేను ఎప్పుడు క్లౌడ్ కిచెన్ అన్నా, ఇంకో ఇల్లు గురించి ఇప్పుడే ఆలోచించొద్దు అని నా అభిప్రాయం చెప్పినా, చాలా గొడవలు అయ్యేవి. అశ్విన్ తన జీవితంలో ఎదిగి గొప్పవాడు అవ్వటం నాకు ఇష్టం లేదని, నా వల్లే తను ఇంకో ఇల్లు కొనలేకపోతున్నాడనీ, అదే వేరేవాళ్ళని చేసుకుని ఉంటే కనీసం ఈపాటికి మరో రెండు ఆస్తులు కొనేవాడని, తనకి నా వల్ల కలిగే ఇబ్బందుల గురించి రెండు రోజులకి ఒకసారైనా చెప్పి గొడవపడేవాడు. అమ్మ మాత్రం ‘సర్దుకుపోకపోతే ఎవరూ సంతోషంగా ఉండలేరు, ముందు పిల్లల గురించి ఆలోచించండి’ అని నా బాధ పట్టించుకోకుండా, పిల్లల గురించి ఆలోచించేలా చేసింది.

కొంతకాలం నేను క్లౌడ్ కిచెన్ గురించి ఎత్తలేదు. అశ్విన్ నాతో బానే ఉన్నాడు. అశ్విన్ ప్లాన్ ప్రకారమే, పెళ్లి జరిగిన ఐదేళ్లకి మాకు అనన్య పుట్టింది. పాప పుట్టినా ఏదీ మారలేదు. అనన్య పుట్టిన రెండు సంవత్సరాలకి నాకు ఇప్పుడే ప్రమోషన్ వచ్చిందని అశ్విన్‌కి చెప్పాను. ఆ పూటకి నాకు స్వీట్ తినిపించి ఆనందపడ్డాడు కానీ, ఇంకా నాకు అరవై వేలే వస్తున్నాయ్ అని గొణిగేవాడు. అప్పటికి నా జీతం నెలకి లక్ష అయిందని అశ్విన్‌కి తెలియదు. నేను మాయ సలహా ప్రకారం డబ్బులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో, సిప్‌లలో అశ్విన్‌కి తెలియకుండా దాస్తూ వచ్చాను. అలా మా ఇద్దరి మధ్య గొడవలు, సర్దుబాట్లతో మరో ఎనిమిది సంవత్సరాలు గడిచాయి.

అనన్యకి ఇప్పుడు ఎనిమిదేళ్లు. చాలా చలాకీగా ఉంటుంది. వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అశ్విన్‌కి కూడా అనన్య అంటే పంచప్రాణాలు. అనన్య పుట్టాకే, అశ్విన్‌కి ప్రమోషన్లు వచ్చి కలిసి వచ్చిందని అపురూపంగా చూసుకుంటాడు. అనన్య పట్ల అంత ప్రేమ చూపించే అశ్విన్, నా పట్ల మాత్రం హక్కు, అజమాయిషీ తప్ప స్నేహం చూపించడు. ఈ ఎనిమిది సంవత్సరాలలో అశ్విన్‌కి తెలియకుండా నా క్లౌడ్ కిచెన్‌లోకి కావలసిన సామానులు కొనడానికి, వర్కర్లకు జీతాలు ఇవ్వటానికి డబ్బులు దాచుకుంటూ, క్లౌడ్ కిచెన్ ఎలా నడపాలో పూర్తి అవగాహన సంపాదించుకున్నాను. కానీ నేను క్లౌడ్ కిచెన్ గురించి ఎవరితో మాట్లాడినా అశ్విన్‌కి ఎక్కడలేని కోపం వచ్చి “బిజినెస్‌లంటేనే రిస్క్. నిన్ను దాని గురించి మాట్లాడొద్దు అని చెప్తే అర్థం కాదా?” అని అందరి ముందు అరిచేవాడు.

అశ్విన్ నా మీద అరిచిన ప్రతిసారీ “అమ్మ మీద అరవకు, గొడవపడకు, అమ్మ బాధపడుతుంది” అని అనన్య వాళ్ళ నాన్నకి నచ్చచెప్తుంటే, అనన్య నా కూతురిలా కాక తల్లిలా కనిపించేది. గొడవల మధ్యలోనే, ఇంటి లోన్ ఇద్దరం కలిసి పూర్తిగా కట్టేశాము. లోన్ తీరిపోయిందనే ప్రశాంతతని పూర్తిగా అనుభవించకముందే అశ్విన్ ఇంకో ఐదు సంవత్సరాల్లో పూర్తి కాబోయే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనటానికి డౌన్ పేమెంట్ కట్టేసాడని, మళ్లీ మనం ఆ ఇంటి కోసం ఈఎంఐ కట్టాలని చెప్పాడు. మా గొడవలు మళ్లీ మొదలయ్యాయి.

“నన్ను అడగకుండా డౌన్ పేమెంట్ ఎందుకు కట్టావ్? ఇంకెన్నేళ్ళు నా జీతం తీసుకుంటావ్?” అని అడిగాను.

“నిన్ను ఎందుకు అడగాలి? మా అమ్మ, వదిన వాళ్ళు ఇంట్లో మగవాళ్ళకి అడ్డు చెప్పరు. మగవాళ్ల విషయాలలో కలగజేసుకోరు. నా కర్మ కాలి నిన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు అనుభవిస్తున్నా!” అని తల బాదుకున్నాడు.

మా గొడవల వల్ల అనన్య తన బాల్యం కోల్పోతుందేమో అనే భయం పెరిగి “నేను జాబ్ మానేసి క్లౌడ్ కిచెన్ మొదలుపెట్టాలి అనుకుంటున్నా. నీ కొత్త ఇంటికి  ప్రతినెలా ఈఎంఐ డబ్బులు ఇవ్వలేను” అని తెగించి చెప్పేశాను.

“నేను డౌన్ పేమెంట్ కట్టేశాను, రిజిస్ట్రేషన్ కూడా తొందరలో అయిపోతుంది” అన్నాడు అశ్విన్.

“రిజిస్ట్రేషన్ అప్పుడు ఈసారి కూడా నా పేరు చేర్చటానికి సిస్టం అనుమతించదు కదా?” వెటకారంగా అన్నాను. అశ్విన్ కళ్ళు ఎర్రగా మారాయి. “నాతో కలిసి ఈ ఇంట్లో ఉండాలంటే, నేను చెప్పినమాట వినాల్సిందే. నీ జీతం డబ్బులు నాకు ఇవ్వాల్సిందే!” తెగించి చెప్పాడు.

నేను బట్టలు సర్దుకుని, నిద్రపోతున్న అనన్యని ఎత్తుకుని అశ్విన్ ఇంటి నుంచి పుట్టింటికి వచ్చాను. “ఒక్కదానివే ఆడపిల్లని పెట్టుకుని ఎలా ఉంటావ్?” అంది అమ్మ. “పదమూడు సంవత్సరాల నుంచి అశ్విన్ కల కోసం కష్టపడ్డాను. ఇప్పుడు నా కలే నాకు తోడుగా ఉండి, నన్ను ముందుకి నడిపిస్తుంది” అన్నాను. పెళ్లయిన ఇన్నేళ్లలో మొదటిసారి పెద్ద భారం తీరిపోయి మనసు తేలికగా అనిపించింది. ఆర్థిక స్వతంత్రం అంటే ఇదేనేమో! కొన్నాళ్ళకి ఒక ఫ్లాట్ అద్దెకు తీస్కుని, అనన్యతో ఉంటూ ‘అనన్య హోమ్ ఫుడ్స్’ ప్రారంభించాను. అప్పుడే మొదలవ్వడంతో బిజినెస్ అంతంతమాత్రంగా ఉంది. నా బిజినెస్ సరిగ్గా నడవట్లేదని తెలిసిన అశ్విన్ ఏడాది తరువాత నా దగ్గరకి వచ్చి “బిజినెస్ అంటేనే రిస్కు. ఇవన్నీ మనకెందుకు చెప్పు? హాయిగా నువ్వు, అనన్య ఇంటికి వచ్చేయండి. నీ పాత జాబ్ తిరిగి నీకే వచ్చేలాగా మీ మేనేజర్‌తో నేను మాట్లాడతాను. ఎంచక్కా గేటెడ్ కమ్యూనిటీలో మనం ఉండి పాత ఫ్లాట్ రెంట్‌కి ఇచ్చేద్దాం. ఈసారి నీకు నచ్చిన ఫ్లాటే కొని, నీ పేరు మీదే రిజిస్టర్ చేయిద్దాం. అప్పుడైనా నువ్వు కట్టే ఈఎంఐ మన కోసమని నీకు అనిపిస్తుందేమో!” అని ప్రేమ వలకబోశాడు. నా ఆశయాలకి, అభిప్రాయాలకి విలువ లేని అశ్విన్ దృష్టిలో నేను ‘ఈఎంఐ కట్టే యంత్రం’ మాత్రమే అని తెలుసుకున్న నేను “రాను” అని తెగించి చెప్పేశాను.

రెండేళ్ళ తర్వాత అనన్య హోమ్ ఫుడ్స్ అభివృద్ధిలోకి వచ్చి నాకు లాభాలు రావటం మొదలైంది. అశ్విన్ నాకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత తన కొత్త ఇంటికి ఈఎంఐ కట్టే మరొక అమ్మాయిని, కాదు..కాదు..ఉద్యోగిని వెతికి పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. నేను అనన్యని చదివిస్తూ, అనన్య హోమ్ ఫుడ్స్ రెండో బ్రాంచ్ రిజిస్ట్రేషన్ పేపర్ల మీద సంతకం చేసి ‘గృహప్రవేశం’ ఎప్పుడు చేయాలో ఆలోచిస్తున్నాను.

*

మనసులోని భావాలు అలా రాసుకుంటూ…

  • హాయ్ ప్రపుల్ల! మీ గురించి చెప్పండి.

హాయ్! నేను పుట్టింది హైదరాబాద్‌లో. పెరిగింది విజయవాడ, గుంటూరులో. బీటెక్ చదివాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ యాపిల్ కంపెనీలో ఎవాల్యుయేషన్ రెస్పాన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నాను.

  • చిన్నప్పటి నుంచి కథలు బాగా చదివేవారా?

చిన్నప్పుడు ఈనాడు సండే మ్యాగజైన్స్‌లో వచ్చే పిల్లల కథలు చదివేదాన్ని. మా నాన్నగారు నా చిన్నప్పుడే పోవడంతో ఆ ఉద్యోగం మా అమ్మకు వచ్చింది. నేను చిన్నదాన్ని కావడంతో మా పెద్దమ్మ మాతోపాటు ఉండేవారు. ఆమె నాకు అన్నం తినిపిస్తూ కథలు చెప్పేవారు. అవి చాలా ఇష్టంగా వినేదాన్ని. సెలవుల్లో మా అమ్మ నాతోపాటు మా కజిన్స్ అందరికీ రామాయణ, భాగవత కథలు చెప్పేవారు. ఇప్పటికీ ఎవరైనా ఒక విషయాన్ని కథగా చెప్తే చాలా ఆసక్తిగా వింటాను. బీటెక్ చదివే టైంలో పుస్తకాలు చదవడం అలవాటైంది. అప్పట్లో ఎక్కువగా చేతన్ భగత్ నవలలు చదివేదాన్ని. ఆ తర్వాత తెలుగు పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. నేను చదివిన తొలి తెలుగు పుస్తకం బి.పల్లవి రాసిన నటి సావిత్రిగారి జీవిత చరిత్ర.

  • పాఠకురాలిగా ఉన్న మీరు రచయిత్రిగా ఎప్పుడు మారారు?

చిన్నప్పటినుంచి రాయడం అంటే నాకు చాలా ఇష్టం. మనసులోని భావాలు అలా రాసుకుంటూ వెళ్లిపోతే ఎంతో ఆనందంగా ఉంటుంది. 2017కు ముందు బ్లాగ్‌లో ఇంగ్లీషు కథలు రాసేదాన్ని. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్ ‘చాయ్ బిస్కెట్’ వాళ్ల వెబ్‌సైట్‌లో ఆర్టికల్స్, కథలు రాయడం మొదలుపెట్టాను. అక్కడ 90 ఆర్టికల్స్ దాకా రాశాను. ఆ తర్వాత వాళ్లే మొదలుపెట్టిన ‘గర్ల్స్ ఫార్ములా’ అనే ఛానెల్‌కి ఓ పదిహేను స్కెచ్ వీడియోలు రాశాను. తమాడా వాళ్ల ‘వైరల్లీ’ ఛానెల్ కోసం ‘ఆవకాయ్ ఆణిముత్యం’ అనే వెబ్ సీరిస్‌కి రైటర్‌గా పనిచేశాను. ఇంకా కొన్ని కథలు పిచ్ చేస్తూ ఉన్నాను.

  • ‘గృహప్రవేశం’ కథ నేపథ్యం ఏమిటి? ఈ అంశాన్నే కథగా ఎందుకు రాయాలనిపించింది?

ఇది చాలామంది మహిళలు అనుభవించే పరిస్థితి. చాలామంది సంపాదిస్తుంటారు, కానీ వారి జీతంపై భర్తల కంట్రోల్ ఉంటుంది. భర్త ఆశలకు వారి జీతం ఖర్చు చేస్తుంటారు. కానీ వారి కలల్ని మాత్రం ఆ భర్త పట్టించుకోడు. చాలాకొద్దిమంది మాత్రమే తమ భార్యకు సపోర్టివ్‌గా ఉంటారు. ఇక్కడే కాదు, అమెరికాలో నాకు తెలిసినవారి పరిస్థితి కూడా ఇంతే! దీని గురించి ఓ కథ రాయాలని అనిపించింది. అదే ఈ ‘గృహప్రవేశం’ కథగా మారింది. ఈ కథ చివర్లో అమృతను, అశ్విన్‌ను విడదీయడం కరెక్టేనా అని చాలా ఆలోచించాను. కానీ అమృత అతనిలో మార్పు కోసం ఎనిమిదేళ్లు చూసింది. అయినా మార్పు రాకపోవడంతో అటువంటి నిర్ణయం తీసుకుంది.

  • మీకు నచ్చిన రచనలు? రచయితలు?

ఇటీవల కాలంలో అరుంధతీరాయ్ రాసిన ‘Mother Mary comes to me’ పుస్తకం చదివాను. ఎంత నచ్చిందో చెప్పలేను. ఇటువంటి విషయాన్ని ఇంత ధైర్యంగా రాయడం అద్భుతం అనిపించింది. ఓల్గా గారి ‘స్వేచ్ఛ’ నవల అతి తక్కువ టైంలో చదివేశాను. నాకు తెలిసిన ఆంటీకి కూడా ఆ పుస్తకం ఇచ్చి చదివించాను. ఆ తర్వాత ఇద్దరం ఆ నవల గురించి చర్చించుకున్నాం. యండమూరి వీరేంద్రనాథ్ ‘అంతర్ముఖం’ నవల కూడా నాకు చాలా ఇష్టం.

  • ముందుముందు ఇంకా ఏమేం రాయాలనుకుంటున్నారు?

కొందరికి ఉద్యోగం చేయడం నచ్చుతుంది. మరికొందరికి ట్రావెలింగ్ నచ్చుతుంది. అలా నాకు రాయడం నచ్చుతుంది. కథలు రాయడాన్ని బాగా ఇష్టపడతాను. మరిన్ని కథలు రాసే ఆలోచనతో ఉన్నాను. అలాగే ఓ నవల కూడా తప్పకుండా రాస్తాను.

ప్రపుల్ల మద్ది

5 comments

Leave a Reply to Prapulla Maddi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కధ చదివినంత సేపు అదో కధ అని అనిపించలేదు.నేటి మహిళే కళ్ళముందు కనిపించింది.Individuality ఉన్న ఆధునిక మహిళలు ఈ
    సంసార చక్రపుతిరగలి లో గిరగిరా తిరుగుతూ పాతతరం మహిళలలా తమని తాము తిట్టుకుంటూ మన జాతకమింతే అని రాజీ పడిపోయి బ్రతుకటంలేదు.హేట్సాప్ టు అమ్రుతా..ప్రపుల్ల హీరోయిన్ ….

    • దాదాపు ఎనిమిదేళ్లుగా నిన్ను తెలుసుకుంటున్న నా స్నేహితురాలిగా చెప్పాలి… నువ్వు కథలు రాసేటప్పుడు నీ ఆలోచనల లోతు, సమాజాన్ని చూసే కోణం చాలా బలంగా బయటపడుతుంది. ఈ కథ కూడా అదే చెబుతోంది.
      ఇంకా ఇలాంటి ఆలోచింపజేసే కథలు రాయాలని ఆశిస్తున్నాను. Proud of you, Prapulla! ✨

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు