కొత్త స్నేహితులూ- సరదాలూ

అంత వరకూ నేను తాగినది భంగ్ అనే దిక్కు మాలిన ద్రావకం అని నాకు తెలియనే లేదు.

యాభై ఏళ్ళ క్రితం నేను విద్యార్థి చొక్కా విప్పేసి, లెక్చరర్ చొక్కా వేసుకుని స్టాఫ్ హాస్తల్ లో అడుగుపెట్టగానే జరిగిన మొదటి విశేషం సరి కొత్త స్నేహితులు సమకూరడం…వీళ్లలో ముఖ్యులు ఏ.జి.రావు (మన అనంతపురానికి చెందిన చిద్విలాసుడూ, తెలుగు వాడే అయినా తరువాత ఐదేళ్ళలో అతనితో ఐదారు సార్లు మాత్రమే తెలుగు లొ మాట్లాడాను. దానికి పెద్ద కారణాలేమీ లేవు. అందంతే), సత్య తల్వార్ (పంజాబీ వాడు. అమెరికాలో విస్కానిసిన్ లో డాక్టరేట్ చేసి కెమిస్ట్రీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం), అథ్వంకర్,…(అతని మొదటి పేరు అప్పుడూ, తెలియదు, ఇప్పుడూ గుర్తు లేదు కానీ ‘అత్తూ’ అని పిలిచే వాళ్ళం.), నీలిమా సక్సెనా (ఈ అమ్మాయి మా అందరికీ ఎంతో ఇష్టమైనదీ, ఎంతో సరదాగా, కలుపుగోలుగా, నాజుగ్గా, దర్జాగా, అందంగా ఉండేది), నీలిమా ఒక రకంగా మేధావి. ఎందుకంటే మేధావి వర్గాలు మాట్లాడే భాష, అంశాలు, అభిప్రాయాలు ఇలాంటి వన్నీ వేరేగా ఉంటాయి. పైగా ఆ అమ్మాయి ఇంగ్లీష్ లిటరేచర్ లో ఇండోర్ లో డాక్టరేట్ చేసి మా ఐఐటి లో ఆ డిపార్టెమెంట్ లో లెక్చరర్ గా చెరింది. అందరం ఇంచు మించు ఒకే సమయం లో స్టాఫ్ హాస్టల్ లో అడుగుపెట్టి అల్లుకు పోయిన వాళ్ళమే. మా అందరి ఆలోచనలూ, అభిప్రాయాలూ ఒకేలా ఉండేవి. కాక పోతే, నేను అప్పుడూ, ఇప్పుడూ మేధావిని కాదు. మేధావి వర్గాన్ని గుర్తించగలిగినా, అలా కాస్తో కూస్తో ప్రవర్తించ గలిగినా, వాస్తవిక వాదిగా ఉండడమే నాకు ఇష్టం. మేమే కాక ఇంకా మరో పాతిక మంది బ్రహ్మచారులూ, సంసారులూ ఉండే వారు కానీ వాళ్ళలో చాలా మంది “బిగుసుకు పోయే” బాపతు. అంటే లెక్చరర్, కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అనగానే టై కట్టుకునే క్లాసులకి వెళ్ళాలి అనీ, గట్టిగా నవ్వకూడడు అనీ, ఆఖరికి మెస్ లో ఆమ్లెట్ తింటున్నా అమెరికా వాళ్ళ డైనింగ్ రూమ్ లో లాగా “will you please pass the cheese, please, thank you” అని అసహజంగా మాట్లాడే బాపతు అనమాట.

మేము నలుగురం, అంటే నేను, ఏ.జి. రావు, సత్య, నీలిమ, అత్తూ, మరి కొందరూ ఒక రకంగా ‘రిబెల్’ లెక్చరర్లం అనమాట. అలా అని ఏనాడూ రౌడీ వేషాలు వెయ్య లేదు కానీ లెక్చరర్లకి తగని, స్ట్యూడెంట్స్ మాత్రమే ఫేషన్ కోసం హీరో రాజేష్ ఖన్నా టైపులొ లాల్చీలు, రంగు రంగుల పంట్లాలు వేసుకునే వాళ్ళం. నేనూ, తల్వారూ అంత పని చెయ్య లెదు కానీ రావూ, అత్వంకరూ క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు కూడా చాలా కేజువల్ గా జుబ్బాలూ, లాల్చీలు వేసుకునే వారు. దానికి ప్రధాన కారణం వాళ్ళిద్దరూ పని చెసేది “ఇండస్ట్రియల్ డిజైన్” అనే సరి కొత్త డిపార్ట్ మెంట్. 1970 లో మొదలు పెట్టిన ఆ ఆ డిపార్త్ మెంట్ హెడ్ ప్రొఫెసర్ నడ్కర్ణీ, చట్టోపాధ్యాయ్, అతని అందమైన బెంగాలీ భార్య మొదలైన తొలి ఫేకల్టీ మెంబర్స్ అంతా మా హాస్టల్ లోనే కొన్నాళ్ళు ఉన్నారు. ఆ డిపార్టె మెంట్ మిగతా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలకన్నా చాలా భిన్నమైనది. ఏ వస్తువుని అయినా, యంత్రాన్ని అయినా ఎంతొ ఆకర్షణీయంగా కనపడేలా డిజైన్ ఎలా డిజైన్ చెయ్యాలో ఆ డిపార్టె మెంట్ లో నేర్పిస్తారు. ఉదాహరణ కి ఇప్పుడు మనం వాడుతున్న ఇండియా రుపీ సింబల్ (₹) ఆ ఇండస్ట్రియల్ డిజైన్ డిపార్టెమెంట్ లో పని చేస్తున్న ఉదయకుమార్ అనే అతను రూపొందించినదే!. 1970 లో నలుగురు ఫేకల్టీ తో మొదలు పెట్టిన ఆ డిపార్టె మెంట్ లో ఇప్పుడు 30 మందికి పైగా ఉన్నారు. కాలక్రమేణా సినిమా ఎప్రీసియెషన్, లఘు చిత్రాల నిర్మాణం మొదలైన కోర్సులు కూడా ప్రవేశపెట్టారు. నాకు ఆ రోజుల్లో ఎంతో సన్నిహితులైన ఆ మొదటి నలుగురూ ఇప్పుడు రిటరై పోయి ఎడ్జంట్ ఫేకల్టీ గా ఉన్నారు అని ఆ వెబ్ సైట్ లో చూశాను. సహజంగానే వాళ్ళు “కళా కారులు”, ఆర్టిస్ట్ లు” కాబట్టి ఇతర ఫేకల్టీ వాళ్ళ లాగా సూట్లూ, బూట్లూ వేసుకునే వారు కాదు.

ఇక్కడ ఎందుకో నా మొట్టమొదటి హోలీ పండుగ గుర్తుకొస్తోంది. ఆ రోజుల్లో ఈ హోలీ పండుగ, రాఖీ కట్టడాలూ మొదలైనవి దక్షిణ భారత దేశం లో లేవు. నేను హాస్టల్ వన్ లో ఉన్నప్పుడే ఈ హోలి పండుగ చేసుకున్నా స్టాఫ్ హాస్టల్ లో చేరి న కొద్ది నెలలకే వచ్చిన ఈ హోలీ పండగ లో ఒక చిన్న విచిత్రం జరిగింది. పొద్దున్నే తల్వార్ నన్ను నిద్ర లేపి “ఇది తాగి కిందకి రా. హోలి ఆడదాం” అని ఓ పెద్ద గ్లాసులో పాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను అది గడ, గడా తాగేసి మా హాస్టల్ లాబీ లో కి వెళ్ళగానే, మరో గ్లాసుడో, రెండో తాగేసి రంగులు పులుముకుని, కళ్ళు తిరిగి ఢబీమని పడిపోయాను..ట. వాళ్ళు నన్ను నా గదికి తీసుకెళ్ళి పడుకోబెట్టాక రెండో రోజు విపరీతమైన తలభారంతో లేచాను. అంత వరకూ నేను తాగినది భంగ్ అనే దిక్కు మాలిన ద్రావకం అని నాకు తెలియనే లేదు. హోలీ నాడు పాలు తాగాలి కామోసు అనుకున్నంత అజ్ణానం నాది! భంగ్ తాగడం అదే నా జీవితం లో మొదటిసారీ, ఆఖరి సారీ.

ఇక్కడ మరొక చిన్న పిట్ట కథ: 1971 లోనో, 72 లోనో గుర్తు లేదు కానీ, మా ఐఐటి కేంపస్ లో బహుశా మొదటి సారి ఒక హిందీ సినిమా షూటింగ్ జరిగింది. దాంట్లో రణధీర్ కపూర్ ..అంటే రాజ్ కపూర్ కొడుకు హీరో. సినిమా పేరు కల్, ఆజ్ ఔర్ కల్ కానీ జవానీ, దివానీ అని కానీ జ్ణాపకం. అందులో హీరో ఏదో లండన్ కాలేజ్ లో చదువుకుంటూ ఉంటాడు. అది ఎస్టాబ్లిష్ చెయ్యడం కోసం మంచి అందమైన భవనాలు, బృందావనాలు, పచ్చటి లాన్ ఉన్న మా కేంపస్ ని ఎంపిక చేసుకుని ఒక శనివారం షూటింగ్ ఏర్పాటు చేశారు. అప్పుడు రెండు తమాషా విషయాలు జరిగాయి. మొదటిదేమో….రణధీర్ కపూర్ కీ, మరి కొందరు సహాయకులకీ మధ్యాహ్నం లంచ్ మా స్టాఫ్ హాస్టల్ లో ఏర్పాటు చేశాం. అప్పుడు నేను ఆ మెస్ సెక్రటరీ కాబట్టి ఆ బాధ్యత నాదే అయినప్పటికీ, అక్కడ తీసే సీన్స్ లో హీరోయిన్ లేకపోవడంతో కాస్త నిరాశగానే ఈ మగధీరులకే ఆ లంచ్ ఏర్పాట్లు చేయవలసి వచ్చినా, ఎంతయినా రాజ్ కపూర్ కొడుకు కాబట్టి హుషారుగానే ఉన్నాం. లంచ్ సమయం లో అతను తన ముగ్గురు బృందంతో రాగానే, చెప్పొద్దూ, భలే ముచ్చట పడిపోయాం. ఎందుకంటే అతను ఎర్రగా, బుర్రగా, జాంపండు లా, నీలం కళ్ళతో ఉన్నాడు… అచ్చు రాజ్ కపూర్ పోలికే….హడావుడిగా అందరం అతడిని ఆహ్వానించేశాం. అప్పుడే కనక ఇప్పటి సెల్ ఫోన్లు ఉండి ఉంటే ఉన్న పాతిక మందీ ఎడా పెడా ఫొటోలు లాగేసీ వాళ్ళం. కానీ, మాలో ఎవరి దగ్గరా అప్పటి భూతాల లాంటి కెమేరాలు కూడా లేవు మరి!. అలాగే ఇప్పటి డ్రింక్ కల్చర్ అంతకంటే లేదు. గౌరవం చెయ్యాలంటే అంతా నిమ్మ రసం, మహా అయితే రంగు రంగుల అరకు డ్రింక్ బాపతే!

ఇక లంచ్ సమయం లో మామూలు కబుర్ల తో పాటు ఎప్పటి లాగానే మా లెక్చరర్స్ లో కొందరు స్ట్యూడెంట్స్ అడిగే ప్రశ్నలు అడగడం అతను వాటికి తగ్గ సమాధానాలు చెప్పడం జరుగుతూ ఉండగా చక్రబోర్తీ అనే ఫారిన్ రిటర్న్డ్ మేధావి, లండన్ వాళ్ళ ఉచ్చారణ ని అనుకరిస్తూ, రణధీర్ కపూర్ ని “మీరు హాలీవుడ్ లో లాగా నిజమైన కథలతో కాకుండా వాస్తవికంగా లేని, చెట్టూ, పుట్టల చుట్తూ పరిగెట్టే చచ్చు సినిమాలు ఎందుకు తీస్తారు? మీకు సిగ్గుగా లేదా?” అని డబాయిస్తూ అడిగాడు. మేము అతను ఏం అనుకుంటాడో, అంటాడో అని కంగారు పడుతూ ఉంటే వెంటనే రణధీర్ కపూర్ “ఏక్ మినిట్, సాబ్.” అని, ఎక్కడో వెనకాల కిచెన్ లో చపాతీలు చేస్తున్న సింగ్ అనే మా ఆస్థాన వంటగాడిని “అరే, భాయ్ సాబ్. ఇధర్ ఏక్ బార్ ఆనా” అని చప్పట్లు కొడుతూ పిలవగానే ఆ కుర్రాడు పరిగెట్టు కొచ్చాడు.”

“తుమారా నామ్ క్యాహై?” అడిగాడు హీరో రణధీర్ కపూర్.

“సింగ్, సాబ్, రణబీర్ సింగ్” అన్నాడు ఎంతో గర్వంగా.

“అచ్చా….బహోత్ అచ్చా…అచ్చా..ఏ బతావ్…..తుమ్ భువన్ షోమ్ పిక్చర్ దేఖా హై క్యా?” అడిగాడు రణబీర్ సింగ్ ని రణధీర్ కపూర్.

“నయీ సాబ్”

“తో…పథేర్ పాంచాలీ…దేఖాహై క్యా” -కపూర్

“నై సాబ్, వో పిక్చర్ కా నామ్ భీ నయీ సునా” -సింగ్

ఇలాగ హీరో గారు ఐదారు సినిమాల పెర్లు చెప్పి, అన్నింటికీ ‘లేదు బాబోయ్ లేదు” అని సింగ్ చేత చెప్పించుకుని ఆఖర్న హీరో గారు మా చపాతీలు కేసే సింగ్ ని….

“హాథీ మేరీ సాథీ దేఖా హై క్యా” అని అడగగానే మా సింగ్ చేటంత మొహం చేసుకుని

“హా, సాబ్..పాంచ్ బార్ దేఖా హై”..అంటే హాథీ మేరే సాథీ అనే రాజేష్ ఖన్నా సినిమాని ఐదు సార్లు చూశాను అని చెప్పగానే రణధీర్ కపూర్ మా చక్రబొర్తీ కేసి దీర్ఘంగా చూసి “ప్రొఫెసర్ సాబ్. ఐ రెస్ట్ మై కేస్.” అన్నాడు. ఆ తరవాత వివరణగా “వుయ్ మేక్ మూవీస్ ఫర్ దెమ్. మీ లాగ మహా అయితే ఒక సారి చూసి మెచ్చుకోవడమో, విమర్శించే మేధావుల కోసం కాదు.” అని ఆ నాటి హాలీవుడ్ సినిమాల పోకడల గురించి వివరించాడు. అది ఇప్పటికీ అంతే కానీ ఆ నాటి అతని సమయ స్ఫూర్తికి ముచ్చట వేసింది.

ఆ రోజుల్లో మా ఐఐటి లో గెస్ట్ హౌస్ అంటూ వేరే ఏమీ లేదు. ఎవరైనా వస్తే మా స్టాఫ్ హాస్టల్ లో ఉండవలసినదే. అంచేత లంచ్ అయిన తర్వాత కాస్సేపు విశ్రమించాక……అందరం మా మైన్ బిల్డింగ్ దగ్గర షూటింగ్ కి వెళ్ళాం. అప్పటికే ఆ సినిమా యూనిట్ వాళ్ళు షూటింగ్ కి కావలసిన కెమేరాలు, గొడుగులు వగైరాలు సిధ్దం చేసుకున్నారు. ఆ సీన్ లో లండన్ లో ఏదో పెద్ద కళాశాలలో చదువుకుంటున్న హీరో రణధీర్ కపూర్ పాత్ర, చేతిలో నాలుగు పుస్తకాలు పట్టుకుని, పక్కన నలుగురైదుగురు స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకూంటూ నడుస్తాడు. కానీ అది శనివారం అవడంతో నిజమైన విద్యార్ధులు లేకనో, వాళ్ళకి ఇష్టం లేకనో ఆ బృందంతో తెచ్చుకున్న ఎక్స్ ట్రా విద్యార్ధులతో ఒక సీన్ తీశాక, ఎందుకో తెలియదు కానీ అతను దూరంగా నుల్చుని షూటింగ్ చూస్తున్న నన్నూ, ..అవును..ఆ చక్రబోర్తీ నీ చేతులెత్తి దగ్గరకి రమ్మని పిలిచాడు. తీరా మేము వెళ్ళగానే సహకార దర్శకుడు అనుకుంటాను…అతడిని పిలిచి “తరవాతి సీన్ లో నా పక్కన ఈ ప్రొఫెసర్ సార్లు ఉండేలా ప్లాన్ చెయ్య గలరా?” అని అడిగాడు. అతను వెర్రి మొహం పెట్టి “సార్, వీళ్ళకి కోట్లు కావాలి సార్. ఇలా జుబ్బాలు వేసుకుంటే కుదరదు” అన్నాడు. “కోట్లు ఎందుకూ, స్ట్యూడెంట్సే కదా?” అని అతను అడిగిన ప్రశ్నకి “మీరు చదువుతున్నది లండన్ లో యూనివర్సిటీ కదా. స్ట్యూడెంట్స్ కూడా సూటూ, బూటూ వేసుకోవాలి” అని తప్పించుకోడానికి ప్రయత్నించాడు ఆ సహకార దర్శకుడు. “ఓస్, అంతే కదా?” అని నాకూ, ఆ చక్రబోర్తీ కీ అసలు విషయం అర్ధం అయే లోపుగా సూటూ, బూటూ, చేతిలో నాలుగు పుస్తకాలూ వచ్చేశాయి. మరో ఐదు నిముషాలలో “షాట్ రెడీ” అనే అరుపులూ, హీరో రణధీర్ కపూర్ కి నేను ఒక వేపూ,ఆ షాక్రొబొర్తీ రెండో వేపూ నడుస్తూ, ఏదో మాట్లాడుతున్నట్టు వీరగా నటించేశాం. ఆ తరవాత నా బుర్రలో రెండు సార్లు అసలు వెలుగులు వెలిగాయి. ఒకటేమిటంటే … ఆ రణధర్ కపూర్ అనే హీరో మా ఇద్దరి కంటే మూడు, నాలుగు అంగుళాలు పొడుగు. అంచేత ఆ వెధవ షాట్ లో మేము మెడలు ఎత్తి వాడికేసి చూసి మాట్లాడుతున్నట్టూ, అతను కిందకి చూస్తూ మా కేసి ప్రవచనం చేస్తున్నట్టూ ఆ సీన్ వస్తుందన మాట. రెండోది, లండన్ లో ఉన్న ఆ యూనివర్శ్టీ లో కూడా ఒక్క అమ్మాయి కూడా లేక పోవడం….మా కేంపస్ లో ఉన్న ఆ ఇబ్బంది వాళ్ళకి ముందు తెలియక “అద్దె” అమ్మాయిలని తెచ్చుకోలేదు. అంతా ఎడారే!

తీరా ఆ సినిమా ఎప్పుడు వస్తుందా, వెండి తెర మీద…అందునా బాలీవుడ్….అప్పటికింకా ఆ బాలీవుడ్ అన్న మాట లేదు అనుకుంటాను…..ఆ బాలీవుడ్ తెరమీద నా రంగ ప్రవేశం ఎప్పుడా, ఎప్పుడా అని తీవ్ర ఉత్కంఠ తో ఎదురు చూడ్డం, తీరా చూశాక నేను అంత పరమాద్భుతంగా పోషించిన లండన్ లో నా విద్యార్థి పాత్ర బహుశా సెన్సార్ వారు కత్తిరించడం వలననో, మరే కారణాలకో పూర్తిగా తొలగించబడడం నాకు తీవ్రమైన మనస్తాపాన్ని కలిగింది. అంత కన్నా ఎక్కువగా భావి తరాల వారు నా లాంటి ఒక “మహా” నటుడినీ, అతని తొలి చిత్రాన్ని వీక్షించే అవకాశం కోల్పోయారు….ఎందుకంటే ఆ తరవాత మళ్ళీ నా జీవితంలో సినిమాలలో నటించడానికి ప్రయత్నించ లేదు. అనేక నాటకాలు, ఒక టీవీ సీరియల్ లోనూ నటించాను అనుకోండి..అది వేరే సంగతి.

ఇక అసలు విషయానికి వస్తే..మా ఐదుగురినీ..అంటే అపరాచ్చెరువు గొపీనాథ రావు (ఏ.జి. రావు పూర్తి పేరు), అత్వంకర్, తల్వార్, నీలిమా…నేనూ….మా స్టాఫ్ హాస్టల్ లో లేకపోయినా మాలాగా ఆలోచించే అనిల్ దాతే….మరికొంత మంది ఫేకల్టీ వారినీ, విద్యార్ధులనీ కలిపిన ఏకైక అంశం గాంధీ గారి సిధ్ధాంతాల ప్రాతిపాదిక గా ఆ రోజుల్లో కొంత ప్రాచుర్యం పొంది, ఈ నాడు బహుశా పూర్తిగా తిరస్కరించబడిన ”ఇంటర్ మీడియేటే టెక్నాలజీ” లేదా …”ఆల్టర్ నేట్ టెక్నాలజీ” అనే అంశాల గురించీ…..అనిల్ దాతే గురించీ …మరొక సారి….

*

వంగూరి చిట్టెన్ రాజు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • I am glad that you are recording all these memories. Sometimes, I am curious what happened to the tangential characters and try to google their names! Just paranthetically mention about them — I feel like I know some of them.

    • I am glad that you are not only reading the article, but also relate to some of my old IITB friends…I do not know any thing about most of them…and curious..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు