ఆ కవిత్వంలో రెంటాలదొక ప్రత్యేకత!శ్రీశ్రీ, నారాయణ బాబు ల ప్రశంస

రెంటాల గోపాల కృష్ణ శతజయంతి సందర్భంగా వారి గురించి జ్ఞాపకాలూ, విమర్శ వ్యాసాలకు ఇదే మా ఆహ్వానం!

“నిస్సందిగ్ధమైన సంకల్పబలం ఈ గీతాల్లో స్పందిస్తూన్న కారణం చేత వీటినొక గ్రంథరూపంలో సంతరించవలసిన అగత్యం ఏర్పడుతోంది. కథన కవిత్వం చెప్పడంలో రెంటాల కొక ప్రత్యేకత్వమున్నట్లు గోచరిస్తోంది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని గొంతు విప్పినప్పుడల్లా ఆ గొంతుకలో మనకొక విశిష్టత వినిపించి తీరుతుంది. ఇందుకితని ‘పల్లకీబోయీలు’ ఒక మంచి ఉదాహరణ.”

  • శ్రీశ్రీ (రెంటాల రచించిన ‘సర్పయాగం’ కవితా సంపుటిని ప్రశంసిస్తూ…)

……………

 

ప్రవర

శ్రీరంగం నారాయణబాబు

(రెంటాల గోపాలకృష్ణ తొలి కవితా సంపుటి ‘సంఘర్షణ’కు శ్రీరంగం నారాయణబాబు రాసిన విపులమైన, ప్రసిద్ధ పీఠిక ‘ప్రవర’ యథాతథంగా…)

 

రెంటాల గోపాలకృష్ణ రచించిన ‘సంఘర్షణ’ అనే కావ్యాన్ని ఆమూలాగ్రం చదివేక ఆనందంతో హృదయం జరిగిపోయిన, గడచిపోయిన ఇరవై సంవత్సరాల క్రితం నేనూ, శ్రీశ్రీ ఈ అతి నవ్య కవిత్వానికి నాంది పాడిన దినాలు తళుక్కుమన్నాయి. ఈ సుముహూర్తంలో రకరకాల అనుభూతులు అనుకోని కొత్త మార్గాలలో నవనవంగా ప్రజ్వలించి, నాట్యమాడి లోకానికొక కొత్త పద్ధతి, ఒక కొత్త బాణీ, సరికొత్త శ్రుతులతో మూర్ఛనలు పోయిన ముమ్మరపాటు ద్యోతకమౌతుంది.

సాహిత్య జగత్తుని గంగ వెర్రులెత్తించు భావకవిత్వపు రోజులవి. స్వర్ణయుగం అన్నారు వాళ్ళు. యథార్థయుగం అంటున్నాము మేము. భావకవిత్వపు పోకడలు జీర్ణం చేసుకొని కొంతవరకు మేమూ రచన సాగించాము. ఈ ఫణితిని రచన సాగించిన దినాలలో కూడా ససి లేకుండా నీరసంగా చేయవలసిన రచన ఇది కాదూ అని మాకు తెలిసి కూడా గత్యంతరం లేక కనులకు పొరలు కమ్మితే కావ్యరచన సాగింది. అంతట హృదయంలో ఒక విభిన్నమైన సంచలనం, ఉద్వేగం, ఓజస్సు, బలం హఠాత్తుగా ఆరోగ్యాన్నిచ్చాయి. అంతవరకూ భావకవులతో పాటు మేము కూడా జీవిత గ్రీష్మాన్ని దర్శించేందుకు మనోనేత్రానికి తగిలించిన ‘గాగుల్సు’ నేల విసరికొడుదుం కదా! హృదయంలో పొగలూ సెగలూ రేగి వీధికాలువ నీటిలో బురదలో ఆపసోపాలు పడిపోతున్న శ్వనాథుడు, ఊరిబైట పొలంలో ఇనకిరణాలు క్రౌర్యంతో కాయక్లేశపడుతున్న సేద్యగాని శరీరం మీద పండిస్తున్న ఘర్మమౌక్తికాలతో ఒక తాజమహల్ కట్టాలని బుద్ధి పుట్టింది. మా కవిత్వంలో ఉండకూడని వస్తువు, వాడకూడని భాషా లేనే లేదు. చాకలాడు, సంతబయలు, కుక్క, గాడిద, కుళ్ళుకాలువ, ఫేక్టరీ కూత, మరఫిరంగి, మందుగుండు, బీదవాడు, భిక్షువర్షీయసి అన్నీ – అవేమిటి ఇవేమిటి – లోకంలో ఉన్నవన్నీ! పలాయనతత్వం పనికిరాదు. నల్లమందు నిషా పనికిరాదు. జీవితం ఎంత సహారా ఎడారి ఐనా మేము మాత్రం మరి ఉష్ట్రపక్షులమై సంచరించలేము. యథార్థంగా జీవితాన్ని దర్శిస్తాము. జీవితం మాలిన్య భూయిష్ఠం అని ఒప్పుకుంటాము. వేలెత్తి చూపిస్తాము. జీవితంలో మాలిన్యాన్ని గాలించి, క్షాళితం చేస్తాము. వేదాంతులు జీవితాన్ని, ప్రకృతిని అవగాహన చేసుకొన్నారు. మేము లోకాన్ని, జీవితాన్ని, ప్రకృతిని కూడా మారుస్తాము. లోకం అంతా ఆ రోజుల్లో మా రచన అశ్లీలమనీ, అపశ్రుతుల మయమనీ, ఇది ఏదైనా అవుతుంది కాని కవిత్వం మాత్రం కాదనీ వెటకారాలు చేశారు; వెక్కిరించారు.

నాటి నుంచి నేటి వరకూ నవ్యకవి కవిత్వం కోసం అనేక అవతారాలెత్తేడు. ఎన్నెన్నో మార్గాలు అన్వేషించాడు. ఎన్ని మార్గాల నుంచి వెళ్ళినా కొసకి మానవాభ్యుదయం, విశ్వశ్రేయస్సే కవి కోరుతాడు. ఇప్పటికీ, ఎప్పటికీ జాతి పురోగమనానికి సాంఘిక చైతన్యం వాంఛనీయమనీ, ఏకైక మానవ కుటుంబంగా మానవులు వర్ధిల్లి ఈ కాశ్యపిని భూతల స్వర్గం చేసుకొందామనీ కవికి, సాధారణ మానవునికి కూడా ఏకైక లక్ష్యం.

నవ్యకవి పోయిన కొన్ని పంథాలు, కొన్ని నమ్మకాలు:

వైద్యుడు నాభీ, నల్లమందూ వాడొచ్చు. వైద్యుడు వాడాడు కదా అని వైద్యం తెలియనివాడు వాడితే మరణిస్తాడు. అంచేత ద్రష్ట అయినవాడే దాన్ని గ్రహించగలుగుతాడు. నేటి యువ కవులందరికీ బహుపరాక్!

          పద్యాన్ని కవి ఒక్కడే పటిష్ఠతతో వాడకలడు. ఇది కవికుండే ఒక ప్రత్యేక విశిష్టత, ప్రపత్తి. కవికి పదం సాక్షాత్కరించినట్టు మరెవ్వరికీ సాక్షాత్కరించదు. సాక్షాత్కరించినా మూలం తెలుసుకోలేరు.

పదాలు — పలకలు తీరిన స్ఫటికపు రాళ్ళలా ఎన్నెన్నో ముఖాలతో, ఎన్నెన్నో జీవితానుభవాలు సాక్షాత్కరింపజేసే గతిభేదపు గర్భగుళ్ళు!

          పదాలు — ఒకే రకపు సాంప్రదాయాలు, సంస్కరణ గల మానవుల దైనందిన జీవితంలో కేవల లౌక్యార్థాన్నిచ్చేవి. ఆత్మానుభవానికి అవగతమై, వ్యక్తిగత అర్థగౌరవం స్ఫురింపజేసేవి.

కావ్యకలాపంలో ఛందో బంధ గజ్జల రవళితో, శ్రుతి తాళ ప్రమాణ శ్రవోపేతాలు. ఈ రకంలో శ్రీశ్రీ ప్రతిభావంతుడు (In Sri Sri the form is everything).

          వర్ణక్రమమని పేరు పెట్టడంలోనే రంగుల స్ఫురణ తోస్తోంది. కొన్ని అక్షరాల సముదాయం ఒక పదం. ఒక పదాన్ని ఉచ్చరించి చూస్తే వింత రంగులు, జిలుగు వెలుగులూ ద్యోతకం అవాలి. నయనానందకరం కూడా అవాలి. శైశవావస్థలో మనందరికీ పదాలు వింత రంగులతోనే కన్పిస్తాయి. ఇప్పుడిప్పుడే అంటే ఆరుద్ర కావ్యజగత్తులో కాలు పెట్టేక ఈ రంగుల స్ఫురణ ప్రాముఖ్యత కొస్తున్నది.

ఒక కొత్త రకపు మంత్రశక్తి కూడా ఉంటుంది పదాలకి. తిరిగిపోయిన యుగయుగాల కాలచక్ర చంక్రమణపు ఇరుసులలో, అర్థం కాని అవ్యస్తతతో మంత్రించిన అక్షతల మాదిరి ఏదో ఒక శక్తి వచ్చి తాకుతుంది మనని. ఇది భూతాలను పారద్రోలి, పంచభూతాలను ప్రజ్వలింపజేయగల మంత్రయుత బీజాక్షర పటిష్ఠా పటిమ చూపించేది.

******     ******   *****

          మాటవరసకి ఒక పదం తీసుకొని పఠిత హృదయాల మీదికి విసురుతామనుకోండి. అందరిలోనూ ఒకే రకపు బొమ్మకట్టి, ఒకే రకపు భావస్పందన కలుగదు. ఎవరికుండే జీవితానుభవాలను బట్టి, వారి వారి ఉపజ్ఞ, ఓజస్సు, రసగ్రహణ పారీణత, హృదయార్ద్రతను పట్టి అవగాహన అవుతుంది. ఉదాహరణకు తేజస్సు అనే పదం తీసుకుందాము. ఇది కేవలం బాహ్యనేత్రాలతో వీక్షించి చటక్కున మరిచిపోయేవారికి, మనోనేత్రం మీద పొందుపరచుకొన్నవారికి వేరువేరుగా అవగాహన అవుతుంది. ‘శ్యామల వర్ణం’ అనే పదం తీసుకొందాం; బొగ్గుగనిలో పని చేసే వారికి, సంగీత కళానిధి (ద్వారం వెంకటస్వామి) నాయుడు గారికి వేరువేరు అర్థం, భావ సంచలనం కలిగిస్తుంది. ఒకరికి, భుక్తి కోసం తన జీవితాన్ని అమ్ముకొంటే, రక్తాన్ని కూడా నల్లగా మార్చిన పెనుభూతంలా కనబడుతుంది. సంగీత కళానిధికి త్యజించిన మిత్రులు, మృతించిన బంధువులు, అందుకోలేని ఆదర్శాలు అన్నీ జాలిజాలిగా, నీలినీలిగా నల్లటి ఆవిరులై శబ్దంగా మారి, శార్వాణి రాగమై సాక్షాత్కరిస్తుంది.

అందుకే, ఒక జీవితకాలమంతా జగత్తులో సమస్త విషయాలనూ వ్యక్తంగానూ , వ్యక్తావ్యక్తంగానూ సేకరించుకొన్న అనుభూతి శకలాలు మెట్లు పేర్చి మేడ కట్టుకొన్నట్టు ఉంటాయి. ఈ అనుభూతులన్నింటినీ కిన్నెర మీటినట్టు ఒకే మారు కదల్చగలిగే శక్తిస్వరూపిణి పదం.

 

కొన్ని కవిత్వపు రహదారులు!

కవిత్వమంటే?

అతి మృదులమైనదీ, బహు సరళమైనదీ, మందుగుండు లాంటిది. జాగ్రత్త! ఖబడ్దార్!

సాంద్రతరమైన, నిబిడమైన భాషా విపిన విటపీ వీధుల గంభీరత కాదు; గుబురులు గుబురులుగా గుమిగూడిన పాదప శ్యామల పత్రాళిలో అలముకొంటున్న నీరవ నీరంధ్ర భయదాంధకార జీమూతాళి!

జీవితమొక ఆసుపత్రి. వ్యక్తావ్యక్తం అనే గవాక్షం లోంచి వీక్షిస్తే మనోజగత్తులోని పచ్చికబయళ్ళు, వృక్షచ్ఛాయలు, సెలయేళ్ళ గానము, ఇంకా మీదికి సముద్రపు కెరటాల హోరు – అంటే అవ్యక్తం వినిపించి కనిపిస్తాయి.

ప్రాకారాల మధ్య పెనుగోడలతో మేడలు రమణీయంగా కట్టిన పట్టణం సాహిత్యం. ఈ పట్టణంలో ప్రవేశిస్తే మరేం కనిపించదు. కులాసాగానే ఉంటుంది. ప్రాకారాలు బద్దలు కొడితే… భిత్తిక కవతలనున్న పచ్చిక బయళ్ళు, రమణీయ శ్యామల ప్రదేశాలు కనబడతాయి. అంటే వ్యక్తంలో అనుభవించిన అనుభూతుల్ని వ్యక్తావ్యక్తంగా మారే అవకాశం ఇవ్వాలి. పట్టణం కూడా ఎలాగా కనిపిస్తుందిగా! ఈ వ్యక్తావ్యక్తం అవగతం చేసుకొనేందుకి అనాది నుంచి వస్తున్న సాంప్రదాయాలూ, నీతి, తర్కం, హేతువాదం – అన్నీ కూడా విసర్జించాలి. ఈ గోడలు పగలగొట్టేందికే, ప్రాకారాలు కూలదోసేందికే ప్రతి గీతం చేసే ప్రయత్నం. ఇదే విధ్వంసం. ఈ విధ్వంసంలో బలపపురాళ్ళ శిల్పపు మేడలు ఎన్నో కూలిపోయాయి. తాజమహలుకే దెబ్బ తగిలింది.

 

పునస్సృష్టి:

ఈ కాలంలో వాత్స్యాయనుడూ, మనువూ కాదు మా ఋషులు. మార్క్సు, ఫ్రాయిడ్. యథార్థ జగత్తు, స్వాప్నిక జగత్తు తారుమారయాయి. యథార్థాన్ని గుర్తించము. కలలు మాకు యథార్థాలు. ఈ జగత్తుతో మాకు పని లేదు. మాది స్వప్నజగత్తు. సంపన్నులు, భాషా సంపన్నులు మాకు విరోధులు. కావ్యలక్షణాలే అవలక్షణాలు. అందరం కవులమే. వ్యక్తాన్ని వదలిపెడతాము. వ్యక్తావ్యక్తంలో ఈత కొడతాము. ఏదో విధమైన శక్తి మమ్మల్ని పూనుతుంది. అదేదో రాయిస్తుంది. అర్థమనర్థం. అదేది రాయిస్తే అదే కవిత్వం. ఇది అధివాస్తవికుల మతం. సాహిత్య వృక్షం మీద, చిటారికొమ్మని కూర్చుని ఊగిసలాడడం. ఇది సాహిత్యానికి గొప్ప ప్రయోజనం, అనర్థం కూడా సమకూరుస్తుంది. కేవలం ప్రయోజనాన్నే వినియోగించుకొని, అనర్థాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చెయ్యగలిగిన పని. అధివాస్తవికులు తీసుకొచ్చిన మార్పు రాజకీయమైనదా, మనోప్రవృత్తికి చెందినదా? దాని విశిష్టత ఏమిటీ అంటే ఏ విశిష్టతా లేకపోవడమే. జార్జి హ్యూజ్‌నెట్ (George Hugnet) “Sonton Destructeur” అన్న మాట నిజం.

ఇంకా ఎన్నెన్నో రహదారులు ఉన్నాయి. కొన్ని దిఙ్మాత్రంగా సూచించాము.

ఈనాడు కవిత అభ్యుదయ పథాలనంటి మానవజాతి పురోగమనం కోసం ఒక మహనీయ పథాన్ని చేపట్టింది. ఇది మానవజాతి అంతటికీ ముక్తినిస్తుంది. అతి నవ్య కవులంతమందీ కూడా ఈ ఋజుమార్గంలోనే తమ తమ కలాల్ని నడిపిస్తున్నారు.

ఈ అతినవ్య కవులలో మూడో తరానికి చెందినవాడు ‘సంఘర్షణ’ రచించిన శ్రీ రెంటాల గోపాలకృష్ణ గారు. శ్రీశ్రీ, నేనూ, శిష్ట్లా, రుక్మిణీనాథశాస్త్రి మేమంతా వంశపురుషులం. మొదటితరం వాళ్ళం. శిష్ట్లా విషయంలో ఇక్కడ కొంత చెప్పవలసినది ఉంది. శిష్ట్లా అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు. శిష్ట్లా చేసిన సాహితీసేవ ఏమిటి అంటే వేల కొలది సంవత్సరాల నుంచీ అందరి నోటా పడి అరిగిపోయి వాటం చెడిన నిస్సారమైన మాటలను పునస్సృష్టి (Re-creation of words) చెయ్యడానికి ప్రయత్నించాడు.

రెండో తరానికి చెందినవారు అనిసెట్టి, రామదాసు, ఏల్చూరి, ఇంకా ఎంతోమంది. ఆరుద్ర కూడా రెండో తరానికి చెందినవాడే. మూడో తరంలో ఈనాటి యువ కవులెంతోమంది ఉన్నారు. ఈ తరంలో గోపాలకృష్ణ గారు ప్రతిభావంతుడైన కవి. ‘సంఘర్షణ’ అనే కావ్యం చక్కగా రచించారు. భాషా ప్రయోగంలో, ఛందస్సుల పోకడలో ఒక వింతగమనం, ఉద్వేగం, భావౌన్నత్యం కనబడుతాయి. కావ్యాన్ని ‘నవభారతం’ అని ప్రారంభించి,

“సస్య శోభిత సంపదోజ్జ్వల

సర్వ శిక్షిత రక్షితం

విశ్వ మానవ శాంతి స్థాపిత

విజయ శంఖోద్ఘోషితం!

 

నవభారతం శుభదాయకం

జననాయకం సుఖదాయకం

జననాయకం జయసాధకం

నవభారతం ధ్రువతారకం!”

అని నాంది చేశారు. వీరి కవిత్వంలో వింత వింత పోకడలు, వివిధ గమకాలు, రాగం బాణీ, తానం మీటూ కనబడతాయి. ఈ కావ్య సంగీతంలో ప్రతి శీర్షికా కూడా ఎత్తుపల్లాల్లేని మానవ సమైక్యత అనేక ప్రతిధ్వనులతో ఎలుగెత్తి చాటుతుంది. ‘విషాదోదంతం’ అనే శీర్షికలో కులట కథానాయకి. వ్యభిచారాన్ని వివిధ రీతుల తూలనాడుతూ, మానవాళి అందులో స్త్రీజాతి ఈ దుష్టప్రవృత్తిలోకి ఎందుకు దిగుతూందీ అనే జిజ్ఞాసతో “మెతుకులు మ్రింగకపోతే మిసమిసలాడదు దేహం.”

“మొలసిగ్గును బలిచేసిన

మీ బ్రతుకులు, భారత

యువతుల ఖ్యాతిని

పరాభవిస్తాయి నిజం!

కానీ, ఇది మీ నేరం

కాదు! సర్వ లోకానిది     !

పవిత్రాభిమానాన్నే

పతిత యువతులమ్ముకునే

ఈ లోకం ఏనాడో

కుళ్ళి కుమిలిపోతుంది.

కూలి ధూళి కలుస్తుంది!”

ఇది నాకూ నీకూ సమస్త మానవజాతికి కవి పెట్టిన శాపం. ఈనాడు స్వాతంత్ర్యం వచ్చినా, ఆకతాయి మనుషులు చేసిన ఆఘాయిత్యపు చేతలకు; నిర్దోషులు, అమాయికపు ప్రజలూ అనుభవించే ఇబ్బందుల సిబ్బందులకు కూడా అన్వయించవచ్చు. ‘జీవన్మృతులు’ ఆఖరి చరణాలు రసవదోన్మాదంతో పలికిన గంభీర వాక్యాలు:

“తుపాకి మడమల పొడుపులు

తురాయిలయి ధరిస్తే

ధరిత్రి తనతో భుజించిన — చరిత్ర…”

ఎక్కడ ఏ గీతం పఠించినా, ఏ చరణం ఉచ్చరించినా భావబంధురంగా, పటిష్ఠంగా, ఉపదేశ సూచకంగా చెప్పలేనన్ని ప్రతిధ్వనులు హృదయం నిండా వినిపిస్తాయి. నేటి ‘యుగవాణి’

“దుర్భర మానవ జీవిత

గర్భంలో దాగిన వ్యధ

నిశ్శబ్దం తెరుచుకుంది!

నవ చైతన్యోద్దీపిత

యువ హృదయం

యుగ కంఠం పలుకుతోంది!

అంతిమ విజయం మనదే

అఖండ మీ ఘన విజయం!”

దీన్ని భరతవాక్యంగా తీసుకోవచ్చు. మనదే అంతిమ విజయం! ఇది చంద్రాత్మకమైన అవసరం. దాన్ని తుపాకి గుళ్ళు, మర ఫిరంగులు మసి చేసి, నుసి చేయలేవు. ఏ కొద్దిమందినో మినహాయిస్తే మానవజాతి మౌనంగా చేసుకొన్న మహాసంకల్పం. అనుల్లంఘనీయం. ప్రతి ఒక్కరూ నడుం కట్టండి. ఈ రోజుల్లో కవిత్వం గురించి వాగాలాపన జరుగుతున్నాది కాని ఉత్తమ కవిత్వ రచన సాగలేదు. అటువంటి రోజుల్లో రెంటాల గోపాలకృష్ణ గారు రసభరితమైన కావ్యాన్ని రాసి, లోకానికి అర్పించారు. వారికి నా ధన్యవాదాలు. ఎన్నో కావ్యాలు రాసి మానవాళినీ, సంఘాన్నీ ఉద్ధరించి, మనశ్శాంతిని పొంది, యశస్సును ఆర్జించమని ఓ సోదరకవి వాంఛిస్తున్నాడు. స్థాలీపులాకన్యాయంగా రసచర్చ చేశాను. నెరుసులు ఉండకపోవు. కాని గుణాలనే స్మరించాలి.

 

కృతిభర్త:

మిత్రుడు, కవి, దేశం కోసం త్యాగం చేసినవాడూ అయిన అనిసెట్టికి అంకితం ఇవ్వడమైంది. అనిసెట్టి జీవితమే ఒక కావ్యమై పాడింది. అది మదరాసులో నేనూ, అనిసెట్టి ఒకే గదిలో ఉండి సాహిత్య రచన చేస్తూ, సార్థకంగా బతికిన దినాలు. అనిసెట్టి ప్రాంశువు. గల్లా పొడుగు షరాయి. మోకాళ్ళ వరకూ కమీజూ, కోల ముఖము, జ్యోతుల్లాగ మెరిసే కళ్ళు, చెదరిపోయిన క్రాపింగు, చేత సిగరెట్టుతో అతి నాజూగ్గా, మార్దవంగా కనిపించే అనిసెట్టి బాహ్యరూపాన్ని చూస్తే, కష్టాల కోర్వలేని స్త్రీ సన్నిహితత్వాన్ని అలవరచుకొన్న భావకవిలా కనిపిస్తాడు. కాని జీవితాన్ని బట్టి చూస్తే ఎంతేసి కష్టాలనైనా అనుభవించి, ఎంతటి త్యాగాన్నయినా చెయ్యగల ధీమంతుడనని తన చేతలచే ఋజువు చేసుకొన్నాడు. ఆమె, అతడు గాఢంగా ప్రేమించుకొన్నారు. పెళ్ళి ఎప్పుడని తహతహలాడారు. పెద్దలు హర్షించారు. కావ్యాల్లాంటి ఉత్తరాలు ఒకరికొకరు రాసుకున్నారు. ఎల్లాగైతేనేం పెళ్ళి నిశ్చయం అయింది. మమ్మలిని అందరినీ ఆహ్వానించడానికి అనిసెట్టి చెన్నపట్నం వచ్చాడు. రేపు పెళ్ళి అనగా హఠాత్తుగా పోలీసులు వచ్చి, చెరసాలకు తీసుకుపోయారు. మేఘసందేశంలో యక్షుడు లాంటి అనిసెట్టి ఏమైపోతాడో అనుకున్నాము. తీయని చిరునవ్వుతోనే చెరసాల ప్రవేశిస్తూ, వెళ్ళి వస్తాన్నాడు. అప్పుడా నవ్వు మల్లి నాగులా కనిపించింది. ఆమె ఏమయిపోతుందో అనుకొన్నాము. ఆమె హిమాలయ పర్వతమంత ధైర్యంతో కష్టాల నెదుర్కొంది. కష్టాలు కాపురముండిపోవు. వారిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు. వారి ప్రేమా, వారి కాపురం చంచలానిల హిమానలం. అనిసెట్టి ఎన్ని కావ్యాలయినా అంకితం పుచ్చుకొనేందుకు అర్హుడు.

కాలం కన్నువిప్పిన నాటి నుండి కవులు పఠితతో రకరకాల సంబంధం పెట్టుకున్నారు. అతి నవ్యకవి నీతో కల్పించుకొన్న సన్నిహితత్వం ఎవ్వరూ కల్పించుకోలేరు. అతినవ్య కవి మాట అభిమానపు మూట. నీ రక్తం నుంచి ఉద్భవించాడు —- నువ్వే!

ఈ ప్రపంచ

జీవన వైతరణి

దాటేందుకు

నీ కోసం

నే చేసిన

గోదానం

నా గీతం!

 

                           విజయనగరం,

                           2 సెప్టెంబర్ 1950

 

ఎడిటర్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు