కూతురికో ఉత్తరం       

ఆపోజిట్ సెక్స్ కి చెందిన వ్యక్తుల పట్ల ఆసక్తి మొదలవుతుంది. వారితో మాట్లాడాలనీ, వారి దృష్టిని ఆకర్షించాలనీ, వారి గుర్తింపునీ ఆమోదాన్నీ పొందాలనీ అనిపిస్తూ వుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ యీ రకమైన మార్పు కలగడం వొక ఆరోగ్యకరమైన లక్షణం అని గ్రహించే పరిపక్వత మన చుట్టూ వున్న సమాజంలో లేదు.

 హాయ్ అమ్మలూ,

మీ అమ్మ బతికుంటే యీ విషయాలు నేను నీతో చర్చించాల్సిన అవసరం వచ్చివుండేది కాదు. మేమిద్దరం కలిసి యీ ప్రపంచాన్ని ఎలా చూశామో, ఎలా అర్థం చేసుకున్నామో తన ద్వారా నీకు యీపాటికే తెలిసి వుండేది. పాత తరానికి చెందిన మనుషులుగా మా అవగాహనలో వున్న లోపమేంటి, సమాజంలో వచ్చిన మార్పులేంటి అన్నది నీ ద్వారా తను, తన ద్వారా నేను తెలుసుకోని వుండేవాళ్లమేమో కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అసలు నీకు చెప్పాల్సిన అవసరం వుందా? లేక నీ అనుభవాల ఆధారంగా నీకంటూ వొక దారిని నువ్వే వెతుక్కోవడానికి కావాల్సిన వెసులుబాటుని కల్పించడానికి నేను మౌనం పాటించడమే మంచిదా? చాన్నాళ్లుగా తేల్చుకోలేకపోతున్నాను. ఒక పని చేయాలా వద్దా అనే మీమాంస ఎదురైన ప్రతిసారీ నాకు నేను చేసే పని వొక్కటే. మీ అమ్మ పక్కనుంటే ఏం  సలహా యిచ్చివుండేదీ అని ఆలోచించడం. ఈ మాటలు చదువుతూ “నువ్వేం చేయాలనుకున్నా అమ్మ పేరు అడ్డం పెట్టుకుంటావ్” అని నన్ను ఆటపట్టిస్తూ నువ్వు నవ్వుకుంటూ వుంటావని నాకు తెలుసు.

ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకోని యింకా పెద్ద కాలేజీకి వెళ్లబోతున్నావు నువ్వు. ఇంటికి దూరంగా నువ్వు వుండబోతున్న మొదటి సందర్భం కూడా యిదే. నీ జీవితానికి సంబంధించి నువ్వే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పెద్దరికం నీకు వచ్చిందని అర్థమవుతూంటే కాస్త ఆశ్చర్యంగా, కాస్త గర్వంగా వుంది నాకు. చదువుకి సంబంధించి నేను నీకేం చెప్పాల్సిన అవసరం లేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏ రంగంలో స్థిరపడాలనుకున్నా నేను అభ్యంతర పెట్టనని నీకు తెలుసు. నీ కలల్ని సాకారం చేసుకోవడంలో నీకు అడ్డం వచ్చి, యిబ్బంది పెట్టే అవకాశం వున్న రెండు విషయాల గురించి యిప్పుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను. అవి ప్రేమ, సెక్స్. మొదటిదాని గురించి నీకు అంతా తెలుసనీ, రెండవ దాని గురించి యిప్పుడే తెలుసుకోవాల్సిన అవసరం లేదనీ నువ్వు అనుకుంటూ వుంటావేమో.

అడాలసెన్స్ మొదలయ్యాక ప్రతి మనిషిలోనూ లైంగిక పరమైన కోరికలు మొదలవుతాయి. అది చాలా సహజం. ఆపోజిట్ సెక్స్ కి చెందిన వ్యక్తుల పట్ల ఆసక్తి మొదలవుతుంది. వారితో మాట్లాడాలనీ, వారి దృష్టిని ఆకర్షించాలనీ, వారి గుర్తింపునీ ఆమోదాన్నీ పొందాలనీ అనిపిస్తూ వుంటుంది. దుర‌దృష్ట‌వ‌శాత్తూ యీ రకమైన మార్పు కలగడం వొక ఆరోగ్యకరమైన లక్షణం అని గ్రహించే పరిపక్వత మన చుట్టూ వున్న సమాజంలో లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోకుండా, కలుసుకోకుండా నియంత్రించడం తమ బాధ్యత అని తల్లిదండ్రులు, టీచర్లు అనుకుంటూ వుంటారు. పరిచయం లేనివాళ్లు కూడా వొక అబ్బాయి, అమ్మాయి కలిసి వొకచోట కనిపిస్తే వారిని నేరస్తుల్లా చూస్తారు. పైగా అలా చూడడం గొప్ప విషయమనీ, తాము చాలా పవిత్రమైన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నామనీ భావిస్తారు.

లైంగికపరమైన కోరికలను తీర్చుకోవడానికి అందరికీ ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన వొక మార్గాన్ని ఆవిష్కరించడంలో మానవమేథ విఫలమైంది. సెక్సుకి సంబంధించిన హార్మోన్ల ప్రభావం పదహారు, పదిహేడేళ్లకి మొదలవుతుంది అనుకుంటే, పాతికేళ్లొచ్చి పెళ్లి చేసుకునేవరకూ  ఆ ప్రభావాన్ని ఎలా తొక్కిపట్టాలి, ఎలా సంతృప్తిప‌ర‌చాలీ అన్నది ఎవరూ పైకి మాట్లాడుకోరు. ఎంత పెద్ద వుద్యోగం చేయాలి, దానికోసం ఎంత పెద్ద చదువులు చదవాలి అన్నదాని గురించి సంవత్సరాల తరబడి చర్చలు జరిగే యిళ్లలో కూడా పిల్లల శారీరక అవసరాలకి సంబంధించిన మాట పొరపాటున కూడా చోటు చేసుకోదు. అలా మాట్లాడుకోవడం మొదలెడితే లేని పోని తప్పుడు ఆలోచనలు చేయడానికి పిల్లలకి అవకాశం యిచ్చినట్లు అవుతుందని తల్లిదండ్రులు అనుకుంటారు. స్నేహితులు, సమాజం, మీడియా లాంటి మార్గాల ద్వారా పిల్లలకి తెలియాల్సినవి తెలుస్తూనే వుంటాయనీ, ఆ సమాచారానికి సంబంధించిన ఆలోచనలు వారిని వుక్కిరిబిక్కిరి చేస్తాయనీ అర్థం అవుతున్నా కానట్లే వుంటారు.

ఇదంతా చూశాక, పెద్దవాళ్ల మౌనం వెనుక వున్నది కపటం మాత్రమే అని అనిపించడం సహజం. కానీ, అలా అనుకోవడం సమంజసం కాదు. అది కేవలం వారి నిస్సహాయత మాత్రమే. సృష్టి కొనసాగాలంటే పిల్లలు పుట్టాలి. పిల్లలు పుట్టాలంటే స్త్రీ పురుషుల మధ్య సెక్స్ జరగాలి. ఆ సెక్స్ అనేది కేవలం భార్యాభర్తల మధ్య మాత్రమే జరిగితీరాలి. ఇది మనుషులు చేసుకున్న ఏర్పాటు. ఇందులో ఎన్ని లోపాలు వున్నా, ఆ చట్రం దాటి రావడానికి అందరికీ భయం. పిల్లలుగా వున్నప్పుడు తాము ఎలాంటి భావోద్వేగాలకు లోనయ్యారో, ఏ రకమైన వొత్తిడిని ఎదుర్కొన్నారో పెద్దవాళ్లకి గుర్తుండదని అనుకోలేం. కానీ, తమ పిల్లల దాకా వచ్చేసరికి వారి నమ్మకాలు సామాజిక నియమాలని అతిక్రమించలేవు. వాటిని అతిక్రమించాలని ప్రయత్నం చేయడం ద్వారా వచ్చే ప్రమాదాల కన్నా, కొన్ని వాస్తవాలని గుర్తించనట్లు గుడ్డిగా సమూహంతో కలిసి నడవడం వల్ల వచ్చే ప్రమాదాలు తక్కువ అనే ఆలోచన వారి ప్రవర్తనని నిర్దేశిస్తూ వుండొచ్చు. ప్రత్యామ్నాయం లేనప్పుడు, ఎన్ని అవకరాలతో కూడుకున్నది అయినా అందుబాటులో వున్నదాన్ని ఎంత బలంగా నమ్మగలిగితే అంత సుఖం అని నమ్ముతుంది సమాజం.

కానీ, తమ వైఖరి పిల్లలలో ఎలాంటి ప్రతికూల ధోరణులకి దారితీస్తుందో తెలుసుకోగలిగేంతగా, తెలిసినా మాట్లాడగలిగేంతగా మనుషులు యింకా ఎదగలేదు. దాని ఫలితంగా పిల్లలు దొంగల మాదిరిగా, రహస్యంగా తమ కోరికలని తీర్చుకోవాల్సిన పరిస్థితికి నెట్టబడతారు. తాము చేస్తున్నది తప్పనీ, అసహజమనీ అనుకోవడం ద్వారా అపరాధ భావనకి లోనవుతారు. దానిని కప్పిపుచ్చుకోవడానికి పెద్దవాళ్లలో యింకేవో తప్పులు వెదకడానికి ప్రయత్నిస్తారు. పిల్లలు ఎత్తిచూపించే ఆ తప్పుల వెనక హేతుబద్ధత లేదని పెద్దవాళ్లు నిందిస్తారు. ఇదొక విషవలయంలా మారి ప్రేమానుబంధాలతో నిండాల్సిన కుటుంబ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది.

ఇదంతా నాణేనికి వొకవైపు మాత్రమే. ఒక టీచరుగా, రెండు దశాబ్దాలకి పైగా అనేక వయసుల్లో వున్న పిల్లలతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా నాకున్న కొన్ని అనుభవాలు చెపుతా విను. క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ, ఎంతో ఏకాగ్రతతో చదివే వొక అమ్మాయి అకస్మాత్తుగా చదువులో వెనుకబడిపోతోంది. క్లాసులో టాపర్ గా వున్న వొక అబ్బాయి వున్నట్టుండి పరీక్షలో తప్పుతాడు. ఇలా జరిగిన ప్రతిసారీ దాని వెనకున్న కారణం వొకటే అయివుంటుంది. ఆ అమ్మాయి లేదా అబ్బాయి ప్రేమలో పడడం. ఒకరితో వొకరు రహస్యంగా సంభాషించుకోవడం, ఆ విషయం ఎవరికీ తెలియకుండా వుండడానికి తంటాలు పడడం, వారిద్దరి మధ్యా ఏదైనా తేడా వస్తే మానసికంగా కృంగిపోవ‌డం యివన్నీ వొకదాని వెంట మరొకటి జరుగుతూ పోతుంటాయి. ఒక రెండు మూడు నెలలపాటు యిలాంటి మానసిక స్థితిలో వున్న పిల్లలు మళ్లీ తేరుకోని చదువు మీద దృష్టి పెట్టడం అన్నది చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది.

ఇక్కడ యింకొక్క విషయం మాట్లాడుకోవాలి. పిల్లల మధ్య వుండేది ప్రేమ కాదనీ, అది కేవలం ఆకర్షణ మాత్రమే అనీ కొందరు అంటూ వుంటారు. నాకు తెలిసి ఆ రెండిటికీ ఏ తేడా లేదు. ఎక్కువ కాలం కొనసాగితేనో, లేదా పెళ్లికి దారి తీస్తేనో అది ప్రేమ అని నమ్మడానికి జనాలకి అభ్యంతరం వుండదు. కొన్ని రోజులు లేదా వారాల వ్యవధిలో ముగిసిపోయే షార్ట్ లివ్డ్ లవ్ స్టోరీస్ అన్నీ అట్రాక్షన్ అని కొట్టిపారేస్తారు. ఫలానా వయసు వాళ్ల మధ్య వుండేది మాత్రమే ప్రేమ అనీ, విడిపోయినప్పుడు ఎంత ఎక్కువ ఏడిస్తే అంత ప్రేమ వున్నట్టనీ యిలా ఏవేవో అర్థం లేని థియరీలు పట్టుకు వేలాడుతూ వుంటారు. నిజానికి యిద్దరి మధ్య వున్నది ప్రేమా లేక ఆకర్షణా అన్న విషయంలో తీర్పులు యిచ్చే అధికారం ఎవరికీ వుండదు. తమ మధ్య వున్న బంధానికి ఏం పేరు పెట్టుకోవాలన్నది అందులో వున్న యిద్దరు వ్యక్తులు మాత్రమే నిర్ణయించుకోవాల్సిన విషయం.

మళ్లీ యిందాకటి విషయానికి వస్తే, టీనేజీలో వుండే ప్రేమల వల్ల జరగడానికి వుండే పెద్ద ప్రమాదం పరీక్షల్లో మార్కులు తగ్గిపోవడం కాదు. తమ కూతురు కుదురుగా వుండడం లేదనీ, అబ్బాయిలతో చనువుగా వుంటోందనీ కారణంగా చూపి చదువు మాన్పించిన వాళ్లని చాలామందిని చూశాన్నేను. ఒక ఆడపిల్ల ప్రేమలో పడడం అనేది, అత్తెసరు చదువుతో ఆపేయడం కన్నా పెద్ద సమస్య ఎలా అవుతుందో నాకు అంతుపట్టదు. అలా బలవంతంగా చదువు మానేయాల్సి వచ్చి, చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని, గంపెడు సంసారాన్ని యీదే ఆడపిల్లల్ని చూసినప్పుడు మాత్రం నాకు ప్రేమ అనేది పెద్ద విలన్ లా కనబడుతుంది. మనుషులు చేసిన తప్పుని ప్రేమ మీదకి నెట్టేయడం భావ్యం కాదని తెలుసు నాకు. కానీ యీ మనుషుల్ని మార్చడం అన్నది నా చేతుల్లో లేదు. పిల్లల్ని కట్టడి చేయడం మాత్రం నేను చేయగలిగిన పనే. చూశావా? ఏ లక్షణం పెద్దవాళ్లలో పిరికితనానికీ, అవగాహనా రాహిత్యానికీ సూచన అని నేను పైన చెప్పానో, అదే లక్షణం నాలోనూ అప్పుడప్పుడూ బయట పడుతుందని వొప్పుకుంటున్నాను.

లైంగిక సంబంధాలు ఏర్పడినప్పుడు అవాంఛనీయ గర్భధారణ అనే సమస్య కూడా పొంచి వుంటుంది. అబార్షన్ అనేది సులువుగా, నిరపాయకరంగా తోచే వొక పరిష్కారం. చాలా సందర్భాల్లో దీనివల్ల ఎలాంటి యిబ్బందీ వుండకపోవచ్చు. కానీ, అబార్షన్ చేయించుకున్న కొంతమంది, ఆ తర్వాత పిల్లలు కావాలనుకున్నా సరే కనలేని విధంగా వారి శరీర అంతర్గత నిర్మాణం మారిపోయే ప్రమాదం వుంది. ఇలా జరగడానికి వుండే సంభావ్యత ఎంత తక్కువ అయినా సరే, అలాంటి రిస్కు తీసుకోకపోవడం మంచిది అని అనిపించడం సహజం. మాతృత్వం లోనే వుంది ఆడజన్మ సార్థకం అని పాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ, మనకీ సొంతబిడ్డలు వుంటే బావుండు అనిపించే దశ వచ్చాక, పిల్లలు పుట్టకపోవడం అన్నది చాలా కుటుంబాల్లో భరించలేనంత పెద్ద విషాదం. పిల్లల్ని కనడంలో, పెంచడంలో ఆనందం వుండి తీరుతుంది అనుకున్నప్పుడు, నిష్కారణంగా ఆ ఆనందాన్ని దూరం చేసుకునే పనులు చేయడం అవివేకం అని వొప్పుకోని తీరాలి.

ప్రేమా ఆకర్షణా సెక్సూ ఏదైనా కావొచ్చు,  ఒక బంధంలో నుండీ బయటకి రావాలీ అని యిద్దరిలో వొకరు అనుకున్నప్పుడు అదంతా తేలిగ్గా జరగదు. ప్రేమిస్తున్నామని వొకసారి చెప్పిన తర్వాత, అమ్మాయి బయటకి వెళ్లిపోతానంటే దాన్ని అబ్బాయిలు తేలిగ్గా తీసుకోరు. కారణాలతో సంబంధం లేకుండా అవతలివారి నిర్ణయాన్ని గౌరవించే సంస్కారం చాలా తక్కువమందిలో వుంటుంది. కొంతమంది బతిమాలొచ్చు. కొంతమంది బెదిరించొచ్చు. ఇంకా దారుణమైన చర్యలకి కూడా దిగజారొచ్చు. అలా దిగజారుతున్న సంఘటనలు మన కళ్లముందు రోజూ చాలా జరుగుతూనే వున్నాయి. ప్రేమ అనేది చాలా సందర్భాల్లో పెద్దవాళ్లకి తెలియకుండా రహస్యంగా సాగుతూ వుండేది కాబట్టీ, అబ్బాయిని కాదనుకోవడం వల్ల వచ్చిన సమస్యలని ఎవరికీ చెప్పుకోలేరు అమ్మాయిలు. అలా చెప్పుకోలేరని తెలుసు కాబట్టే, దుర్భలంగా వున్న అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడం అబ్బాయిలకి సాధ్యపడుతుంది. ప్రేమ అనేది అనివార్యమైన వొక మానసిన అవసరంగా సమాజం ఆమోదించిన రోజున.. బ్రేకప్ చెప్పడం అనేది ఎలాంటి ప్రమాదాలకి దారితీస్తుందో అని భయపడాల్సిన దుర్గతి అమ్మాయిలకి పట్టదు.

ఎలాంటి సమస్యలూ లేకుండా సాఫీగా సాగిపోయి, యిద్దరూ లేదా యిద్దరిలో వొకరు వొద్దనుకొని, ఆ నిర్ణయాన్ని అవతలివారు గౌరవించి, స్నేహపూర్వకంగా విడిపోయిన సందర్భాల్లో కూడా రాగలిగిన సమస్య మరొకటుంది. అది, టీనేజీలో లేదా వివాహానికి పూర్వం వున్న ప్రేమానుభవాలు వివాహం అయిన తరువాత కొంతమందిలో నిరుత్సాహానికీ, వెలితికీ కారణం అవ్వడం. ప్రేమ అనేది సహజంగానే సాహసోపేతమైన చర్యలా అనిపించి, వుద్విగ్నభరితమైన భావోద్వేగాలని కలిగిస్తుంది. భవిష్యత్తులో మన జీవితంలోకి రాబోయే వ్యక్తులు కూడా అదే రకమైన వుద్వేగాలని మనలో కలిగించగలుగుతారనే భ్రమకి కారణం అవుతుంది. కానీ సమాజం ఆమోదంతో, పెద్దల సమక్షంలో జరిగిన పెళ్లి ద్వారా మన జీవితంలోకి వచ్చే వ్యక్తి వివాహపూర్వ ప్రేమల తాలూకూ గాఢతని అందించగలడనే గ్యారంటీ యివ్వడం అన్నిసార్లూ కుదరదు. దీనివల్ల దాంపత్య జీవితంలో కలతలు, అసంతృప్తి అనివార్యం. ఇది యిలా జరగబోతుంది అనే స్పష్టత వున్నవాళ్లకి యిలాంటి పరిణామాలు నష్టం కలిగించకపోవచ్చు. ఆ స్పష్టత లేనివాళ్లకి వివాహం అనేది నరకప్రాయంగా మారి తీరుతుంది.

నిన్ను భయపెట్టడానికో, ప్రేమ పట్ల విముఖత పెంచడానికో యిదంతా చెప్పడం లేదు నేను. నువ్వు ప్రతి క్షణం సంతోషంగా వుండాలని కోరుకునే వాడిగా నీ జీవితం నీ చేతుల్లోనే వుండాలని ఆశిస్తున్నానంతే. నీకు ఎలాంటి యిబ్బందీ రాకుండా చూడడానికి నా చివరిశ్వాస వున్నంతవరకూ ప్రయత్నం చేస్తూనే వుంటాననే భరోసా నీకు కల్పించగలిగితే నాకు అంతకన్నాకావాల్సింది మరొకటి లేదు. నీ కలల్ని నిజం చేసుకోడానికి అడ్డం పడకుండా చూసుకోగలవన్న నమ్మకం నీకు వున్నంతవరకూ నువ్వు ఎవరిని ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు. ప్రేమించడం మాత్రమే కాదు, “యిలా చేసివుండాల్సింది కాదు అని రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం భవిష్యత్తులో రాదు” అనే నమ్మకంతో నువ్వు ఏం చేసినా నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ నాకు అభ్యంతరకరంగా తోచే పని నువ్వు చేసినా సరే, దాని వల్ల నీకు ఏదైనా కష్టం వస్తే, పంచుకోడానికి నేను వున్నానని మర్చిపోకు.

మనుషులన్నాక తప్పులు చేస్తారు. కేవలం మనిషిగా పుట్టినందువల్లనే చేసే తప్పులు కొన్నుంటాయి. వాటిని తప్పులు అని పిలవడమే పెద్ద తప్పు.  అలాంటి తప్పు చేసే వుద్దేశం నాకు లేదు. ఆ అవతలి మనిషి నా ప్రాణంలో ప్రాణం అయిన నా కూతురు అయినప్పడు అస్సల్లేదు.

ప్రేమతో..                                                                                                                         నాన్న

శ్రీధర్ బొల్లేపల్లి

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కూతురును కన్న ప్రతి తండ్రి రాయాల్సిన ఉత్తరం. సేవ్ చేసుకుంటే అవసరం అయినప్పుడు రిఫరెన్స్ అవుతుంది.

    జీవితంలో అనివార్యంగా వచ్చే ఒకానొక దశని ఎలా ఎదుర్కోవాలో, అన్ని పర్యవసానాలతో అవగాహన కల్పిస్తూ, ఆపై ఏం జరిగినా భరోసాను నింపే ఉత్తరం; సమాజంలో అనివార్యంగా రావాల్సిన మార్పుని ధ్వనించేలా రాయడం అద్భుతమైన శిల్పం.

  • ఎప్పటిలాగే మంచి విషయ పరిజ్ఞానం తో అనాలసిస్ తో ఆసక్తికరంగా…తల్లిదండ్రుల మనసును తట్టేలా రాశారు శ్రీధర్ గారు. ఇది చర్చించవలసిన సమస్య.
    లైంగిక వాంఛలను తమంతట తాము ఎలా మేనేజ్ చేయాలో తెలిపే పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచి…వారికి కొంత ప్రైవసీని ఇస్తూనే గమనిస్తూ ఉంటే తెలిసిపోతుంది వారి ప్రవృత్తి లో మార్పూ స్టెబిలిటీ.

    • Nice piece of advice madam. Thank you. Right now we may not have any instant solutions for this problem. What we need to do is to keep exploring with patience and concern,

  • ప్రస్తుత పరిస్థితులలో కూతురు, కొడుకు అనే తేడా లేకుండా వయసులో ఉన్న బిడ్డలందరికీ ప్రతి తల్లి, తండ్రి విడమరిచి చెప్పాల్సిన విషయాలు.

    చాలా చక్కగా వివరించారు 👌

    • “కూతురికో ఉత్తరం” మీకు నచ్చినందుకు చాలా‌ సంతోషం. ధన్యవాదాలు 🙏

  • A very apt and precise portrait of the emotions, fears and anxieties a father goes through. Special appreciation for the way of writing which made this heartfelt and tearful.

    • Thank you so much Bhavana. You are one of the reasons I had to write this. You made me look through the reality which I had been ignoring 🙏

  • చాలా చక్కని ఉత్తరం మంచి విశ్లేషణ అవగాహన ఉన్నాయి .రచయితకు అభినందనలు

  • ఉత్తరం చాలా బావుంది.సర్..తల్లిదండ్రులుగా అందరికీ ఈ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది..లేనిపోని అనుమానాల తో అధిపత్యాలతో బిడ్డల బతులుల్ని చిదిమేస్తున్న పరిస్థితి మారాలంటే ఇటువంటివి కనీసమైన మాట్లాడాలి..
    మంచి విషయాల్ని చదివించారు. మీకు ధన్యవాదాలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు