Immunity

రోజు రోజుకీ కాస్త మరణం, ఒక చివరి రోజున ఇక సెలవు. మళ్ళీ నూతనత్వం. ఆ individual కి అది అన్యాయంగా కనబడవచ్చు కానీ big picture లో అంతా బాలన్స్ అయిపోయింది.

ప్రపంచంలో ఎంత వేదన ఉందో కదా! రోజువారీ instagram హరివిల్లు రంగు విరుపుల్లో, మాల్ హడావుడి లో, వీకెండ్ పబ్ సంగీతంలో, పండగ ఆఫర్ల హోర్డింగ్ లైటింగ్ లో ఇదంతా వెలుగు చీకట్ల సమన్వయం అన్నట్టు, వెలుగునే పట్టించుకుని ముందుకెళ్లిపోవాలన్నట్టు అందరూ తోసుకుపోతారు కానీ, కాస్త నిజాయితీ గా పరిశీలిస్తే ఈ ప్రపంచంలో ఎంత వేదన ఉన్నదో కదా!

కొన్నేళ్ల క్రితం ఒకసారి ఓ టీనేజ్ కుర్రాడు ఓ కుక్కపిల్లను మెడకు తాడు కట్టి బ్రతికుండగానే మంటల్లో కాలుస్తుంటే అది ఎటూ పోలేక అరుస్తున్న వీడియో ఒకటి నా కంట పడింది. ఆ disturbance నన్ను ఒక వారం పాటు వెంటాడితే మెహెర్ The Brothers Karamazov నుంచి కొన్ని పేజీలు పంపి చదవమన్నాడు. విశ్వపు ఉనికిలో ఒక విడదీయలేని భాగమైపోయి మన జీవన అనుభవంలోకి తరచూ చొచ్చుకొచ్చే వేదన గురించి విపులంగా ప్రస్తావించిన ఆ వాక్యాలు చదివాక నిజమైనదో, మనసు కల్పించుకున్నదో ఓ గట్టిదనం మనసుకి ఏర్పడింది. ఆ తర్వాత అలాంటి దృశ్యాలు ఏవి నా కంటపడినా “Existence did sign up for this. I am not responsible for it. I am not going to compensate for it” అనేసుకొని ముందుకెళ్లిపోవడం చేతనైంది. ఐతే నేను సమాధానపడినంత మాత్రాన విశ్వపు వేదన ఆవిరైపోయిందా? లేదు. అలా అని దానికి నేను పరిష్కారం చూపించగలనా? లేదు. అలా అని చేతులు కడిగేసుకోనా? ఇదే ఊగిసలాట.

ఏం లేదు.. మట్టి animate అయ్యింది. ఒక గడువు తర్వాత అది కొత్త దానికి దారి ఇవ్వాలి కాబట్టి ఆ గడువు టైమర్ సెట్ చేయబడింది. రోజు రోజుకీ కాస్త మరణం, ఒక చివరి రోజున ఇక సెలవు. మళ్ళీ నూతనత్వం. ఆ individual కి అది అన్యాయంగా కనబడవచ్చు కానీ big picture లో అంతా బాలన్స్ అయిపోయింది. దాని నొప్పి ద్వారా విశ్వం తనను తాను మరింతగా స్పర్శించుకుంది. ఈ జ్ఞానం కంటే గొప్పది, పనికిమాలినది మరేదీ నాకు కనబడలేదు. ఏ సమస్యనూ పరిష్కరించకుండా అసలు నువ్వు అనుకుంటున్నది సమస్యే కాదని చెప్పే దాటువేత వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయింది. మొన్న ఒక రోజు మెడికల్ షాప్ లోకి వెళ్తుంటే బైట ఒక బీద జంట వాళ్ళ అయిదేళ్ల బాబుకి ఫిట్స్ వచ్చి కంగారు పడుతుంటే నేను నా టాబ్లెట్స్ కోసం నేరుగా లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇదంతా విశ్వం లెక్కల్లో ఓ చిన్న collateral damage. మామూలే కదా అనుకుంటూ ఇక ఏ చలనం కలగకుండా వెళ్ళిపోయాను. అప్పుడు కలిగింది ప్రశ్న. Human suffering నుంచి నాకు immunity ఇచ్చిన ఈ perspectives వల్ల నేను మనిషిని కాకుండా పోతున్నానా అని. విశ్వంలో వెలుగు చీకట్ల ఆటలో ఏది ఎంత స్కోర్ చేస్తుందో లెక్క చూసి, అంతే కదా అనుకొని ముందుకెళ్లిపోవడం అలవాటు చేసుకొని నేను మనిషిగా పోషించాల్సిన పాత్ర పోషించకుండా escape అవుతున్నానా అని. సరే అని పట్టించుకుంటే ఎంత వేదనకు బరువు కాయగలను? వీధి వీధిలోనూ అణచివేత, అన్యాయం, ఆయాసం, ఛిద్రం చేయబడే ఆశలు, కళ్ళ నిండా నింపుకున్న రంగుల్లో ఒక్క శాతం కూడా జీవితానికి పూసుకోలేని అమాయకపు ప్రాణాలు… ఇంత బరువైన శిలువ  నేను మోయగలనా?

“You are not God, House. Don’t try to play one” అంటాడు House MD లో అతని కౌన్సిలర్. ఇదేదీ నేను సృష్టించలేదు. సృష్టించిన దేవుడే సిగ్గు పడాలి. నాకేం సంబంధం అనుకుంటే చక్కగా నిద్రపోవచ్చు. ఇప్పుడు అలాగే అనుకుంటున్నాను కాబోలు. అందుకే ఇంత అల్లకల్లోలం నాకు కేవలం కాలక్షేపంగా అనిపిస్తుంది. ఐతే అలా ఎంత కాలం అనుకోగలనో అనుమానమే. కామన్ సెన్స్ కి అందకపోయినా, ఈ రక్షణ కవచాన్ని వదిలి యుద్ధంలోకి అడుగుపెట్టడమే అర్ధవంతంగా అనిపిస్తుంది ఎందుకో. Existence బండరాయి కింద నలిగిపోతున్న మనిషికి ఆ బరువుని దూరం చేయలేము. కానీ వాడిని ప్రేమించగలము. అది వాడి సమస్యను ఏ రకంగానూ పరిష్కరించలేదని తర్కం చెవుతుంది. నిజమే. కానీ తర్కానికి అందని సమాధానం ఏదో ప్రేమలో ఉందని తర్కానికి అందని ఓ స్వరం ఏదో లోలోపల ఎప్పటి నుంచో మెల్లగా చెబుతూనే ఉందని గుర్తొస్తుంది.

ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళగలనా? కావాలని సెంటిమెంట్ పిండుకోగలనా? మనుషుల కష్టాల వెనుక math ని విస్మరించి వాళ్ళ కన్నీళ్ళ తడిని మళ్ళీ పూసుకోగలనా? ఏర్పడటానికి ఏ ఉద్దేశం లేని ఈ జీవితాన్ని ప్రేమ లాంటి ఇల్లాజికల్ సాధనంతో కొలవగలనా?

*

స్వరూప్ తోటాడ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆహారం , నిద్ర , మైథునం వదిలేస్తే మిగతావన్నీ మనిషి అంతరంగపు సృష్టే.. conflict ఏళ్ల తరబడి పేరుకుపోయింది .. మీ రాతలు ఎప్పుడూ ఆ లోతుల్ని వెదకడానికి ప్రయత్నిస్తాయి ..love this

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు