రంగస్థలం

“బావా! చాలా రోజులయిపోయింది కానీ సాయంత్రం కలుద్దామా?” అటునుంచి నయీం గొంతు.

చాలా రోజులంటే నెలలూ సంవత్సరాలూ కాదు. అయితే గియితే వారం రోజులయ్యుంటుంది. కలవడం అంటే మాటల్ని, సమయాన్నీ, మందులో కలుపుకుని తాగడం. నిజానికి, ఒకేచోట పని చేసేవాళ్ళకి ఈ కలయికల్లో మాత్రమే చెప్పుకునే ప్రత్యేక విషయాలేమీ ఉండవు. మనెదురుగా లేనోళ్ళ మీద ఏడుపుతో మొదలయ్యి, ఆఫీస్ లో ఆడోళ్ళమీద నాటుజోకులతో శిఖరాగ్రానికి చేరి,  ఒకరిని ఒకరు పొగుడుకోవడంతో ముగిసే  పార్టీలంటే నాకేమంత ఆసక్తి లేదు. ఆ మాత్రం కబుర్లు ఆఫీస్ కాంటీన్ లోనే అయిపోతాయి. అయితే మా పార్టీల్లో ఒక ఆకర్షణ ఉంది. మూడు పెగ్గులు పడిన వెంటనే లేచే గొంతు నయీం ది. మూడు పెగ్గులు పడితేనే గానీ లేవని గొంతు అనాలేమో! అదొక్కసారి లేచిందంటే డీవీ సుబ్బారావు అమ్మాబాబులా పాడతాడు.

ఆ గొంతు మా ఊరిని లాక్కొచ్చి నా ముందు పెడుతుంది. నిజానికి, చిన్నప్పుడు ఆ పద్యాలంటే పెద్ద ప్రేమ లేదు. ఆ నాటకాలు పూర్తిగా చూసే ఓపికా ఉండేది కాదు. వాడంతసేపు రాగం ఎందుకు తీస్తున్నాడో అర్ధమయ్యేది కాదు. చీకటిలో ఒక్కడినీ ఇంటికెళ్లడానికి భయమేసి అందరూ వచ్చేవరకూ చివరికంటూ చూసేవాడిని. ఆ నాటకాలు వేసేవాళ్ళు కూడా తెల్లారుఝాము  ఐదింటికి, రాజమండ్రి పోయే బస్సువచ్చేవరకూ పాడిన పద్యాలే  పాడుతూ రాత్రంతా సాగదీస్తూ ఉండేవారు. చిన్నప్పుడు సాధారణంగానూ, ఒక్కోసారి విసుపుగానూ  అనిపించినవి  ఇప్పుడు జ్ఞాపకాలుగా,   బెంగలుగా, పురావేదనలుగా మారిపోయాయి.

పార్టీ అంటే పెద్ద ఏర్పాట్లేవీ ఉండవు. సాయంత్రం ఏడున్నర కల్లా ఐదుగురం క్లబ్ కెళ్ళి బార్లో కూర్చుంటాం. అది కట్టేసేవరకూ తాగడం. సరిపోకపోతే వేరేచోటుకి వెళ్లి తాగడం. ఆఫీస్ రాజకీయాలూ, పోగొట్టుకున్న ప్రేమలూ,  పోగొట్టుకోలేని అక్రమ సంబంధాలూ , పాటలూ పద్యాలూ పొగడ్తలూ ఏడుపులూ – ఒకదానిలోంచి ఒకటి. ఇప్పటికి అన్నీ అందరికీ  తెలిసిపోయినవే అయినా కలిసిన ప్రతిసారీ కొత్త వెర్షన్ తయారవ్వాల్సిందే. మొదటి సిట్టింగ్ లో చెప్పబడిన సున్నితమైన ప్రేమకథలన్నీ ఐదో సిట్టింగ్ కల్లా కొత్త కొత్త అలంకరణలతో రూపు మార్చుకుని బూతుకథలుగా మారిపోయాయి. మూడో పెగ్గుకల్లా నయీంకి డీవీ సుబ్బారావు పూనుతాడు . విజయాకర్ తన విఫల,సఫల ప్రేమగాథల కథకుడిగా మారతాడు.   వాటిలో కొన్ని నిజాలయితే, మరికొన్ని నిజాల్లాంటివి. అందరికీ  అన్నీ తెలిసినా నమ్మినట్లే ఉంటారు. ప్రతీసారీ కొత్తగా రసానుభూతి పొందుతారో ఆర్గాజంని నటిస్తారో తెలియదు. మూడుపెగ్గుల తర్వాత అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సినవి కావు. నిజానికి , అన్నినిజాల్లో నా నిజాల్ని వెదుక్కోవడమంత వ్యర్థప్రయత్నం లేదు. ఇక ఆనంద్ కీ పెగ్గులకీ సంబంధం లేదు. ‘బావా నాకు రెండు పెగ్గుల వరకూ ఎక్కుతుంది. ఆ తర్వాత ఎంత తాగితే అంతా బొక్కే, తాగినకొద్దీ దిగిపోద్ది’ అంటాడు. మందుకంటే మా గోలే ఎక్కువ కిక్ ఇస్తుందేమో. అప్పారావు    తాగనివాడు. మాకంటే చాలా జూనియర్. ఇంకా పెళ్ళికానోడు. మా గ్రూప్  లో చేరడానికి కారణం ఒకేచోట పనిచేయడం మాత్రమే  కాదు, మా అందరినీ అన్నా అన్నా అంటూ మా తాగుడిని, వాగుడిని, ఖైదీ సినిమాలో చిరంజీవికీ సుమలతకీ మధ్య డ్యూయెట్ ని ఊహించుకునే సుధాకర్ లా, ఆరాధించడం కూడా.

బార్ లోకి అడుగుపెట్టగానే, సిగరెట్టు పొగ, ఆల్కహాలు కంపుతో ఇక్ష్వాకుల కాలంనాటి తివాచీ నుంచి వచ్చే ముక్కవాసన  కలగలిసి  గుప్పుమంది. కనబడీ కనబడని వెలుగులో ఏవోవో గొంతుల రొద.

“జిలానీ” గట్టిగా కేక వేసాడు ఆనంద్.

“సార్! మీకు డాబా మీద కుర్చీలు వేసేశాను” మమ్మల్ని వెదుక్కుంటూ వచ్చి చెప్పాడు జిలానీ. మేమేమి తాగుతామో ఎలా వాగుతామో బాగా తెలిసినవాడు. డాబా – బార్ కి వచ్చేవాళ్ళలో  కొంతమందికే తెలిసిన రహస్యం. గబగబా రెండు పెగ్గులేసి, ‘కిళ్ళీ వేస్తే  పెళ్ళాం కనుక్కోలేదులే’  అని భ్రమిస్తూ, పెందలకడే ఇంటికి పోయేవాళ్లకి తెలియని ప్రదేశం. పైన పున్నమి చంద్రుడి సాక్షిగా, పారిజాతాల పరిమళంతో వేడెక్కిన డిసెంబర్ చలిలో, ఆ కళామతల్లికి సింగల్ మాల్ట్ తో నివాళి అర్పించేవారికి మాత్రమే తెలిసిన చోటు.

***********

ఎన్నిపేజీలు  రాయాలి, ఎంత పొడవెడల్పులు ఉండాలనే  లాంటి రూల్స్ కళాకారుల స్వేచ్చని ఎలా కబళిస్తాయో  బాగాతెలిసిన వాణ్ణి  కనుక మందు పార్టీకి ఎటువంటి నిబంధనలు  పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు .

ఎప్పటినుంచి తాగుతున్నామో తెలియదు. మాతోబాటే పరిసరాలన్నీమంచు తాగి  వెన్నెలలో తడుస్తూ తూగుతున్నాయి. పారిజాతాల వాసన గుప్పుమంటోంది. కడుపులో చేరిన ‘నల్లకుక్క’ మొరగమంటోంది.

“బావా పారిజాతాలు రాత్రే ఎందుకు పూస్తాయో తెలుసా?” నయీం గాడిది , నాది ఇరవై ఏళ్ల స్నేహం. వాడు తర్వాత ఏం మాట్లాడుతాడో నాకు తెలుసు. వాడి మాటలు ఒక్కోసారి  లేకిగా అనిపించినా వాడి గుండె నాకు తెలుసు. దానిలో తడి నాకు ఎన్నోసార్లు పరిచయం.

“నువ్వాగవుగా, చెప్పు” నవ్వుతూ అన్నాడు విజయాకర్.

“అసలు దేవుడు గొప్ప కళాపోషకుడు చిన బావా! మనుషులంటే గొప్ప ప్రేమ ఉన్నోడు. ఎంత ప్రేమ లేకపోతే దేవలోకం నుంచి పారిజాతాన్ని దొబ్బుకొచ్చి, మనుషులకి ఇచ్చి, ఒరే బాబూ, పుచ్చపూవు లాంటి వెన్నెల్లో పారిజాతం పక్కన కూర్చుని మందు కొట్టుకోండిరా అని చెబుతాడు? గబ్బునాయాళ్ళు బావా! సిగరెట్టు కంపులో సింగల్ మాల్ట్ గబగబా మింగి పెళ్ళాల దగ్గరికి  దొంగల్లా వెళ్లి హాజరేయించుకుంటారు. హైలీ అన్ రొమాంటిక్ బగ్గర్స్.” తిట్లు మొదలయ్యాయంటే మూడో పెగ్గులోకి చేరుతున్నట్లే. నాకూ అదే కావాలి. ఇంక ఏ క్షణంలోనైనా నయీం, డీవీ సుబ్బారావులా రూపాంతరం చెందొచ్చు.

అందరూ మూడోపెగ్గులోకి వచ్చేశారు. అప్పారావు  మా వాగుడు కోసం ఆత్రంగా చూస్తున్నాడు. మందు తాగడు కానీ స్నాక్స్ లో సింహభాగం వాడిదే. చిన్నోడైనా మాకంటే పెద్ద బొజ్జోడు. విజయాకర్ పాత ప్రేమ కథలు మొదలుపెట్టే సమయం వచ్చేసింది. నేను కృష్ణశాస్త్రి కవిత్వం మొదలెట్టి వత్తి ఎగదోయడమే. కొన్ని వందలసార్లు చదివిన కవితే అప్పుడప్పుడూ మర్చిపోతుంటాను.

“సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము.. చంద్రికల నేల  వెదజల్లు చందమామ ?”

“అంటే పారిజాతమన్నమాట.” మత్తుగా అన్నాడు విజయాకర్

“బావకి పారిజాతం గుర్తుకొస్తోంది, చెల్లిని పరిచయం చేసింది నేనే. చెల్లి చాలా ఫాస్ట్. బావేమో నత్త గుల్ల. నా ఎదురుగానే చెల్లి చినబావని లోపలికి లాగి తలుపేసింది. ఏం చేసాడో చెప్పడు బావ” ఆనంద్ ఆటపట్టించాడు.

“దానమ్మ అదొక లంజ. ఈడు, దానికి  అన్న”  విజయాకర్ నాలుగో పెగ్గులో ఎలా ఉంటాడో ఎప్పుడూ ఎరగని దారే. మౌనంగా, కోపంగా, ప్రేమగా, ఎలాగైనా ఉండొచ్చు. అద్భుతమైన ప్రేమకథల నుంచి అసహ్యకరమైన అనుభవాల వరకూ బోల్డన్ని కోణాల ప్రదర్శన.

అంత అద్భుతమైన కవితకి జరిగిన అవమానంగా అనిపించింది వాళ్ళ సంభాషణ. నాక్కావలసింది అదికాదు. ఆ బూతుకథలు ఎన్నోసార్లు విన్నాను. “చీరచెరగు గుసగుసమన్నా చేరి అందియల సవ్వడి విన్నా చిక్కులు సుమ్మా” అనుకునే వయసులో విజయాకర్ ప్రేమలు విని తీరాల్సిందే. ప్రేమించిన అమ్మాయి కోసం అమ్మాయి ఇంటిముందు, రెండురోజులు వర్షంలో తడుస్తూ, ఏడుస్తూ  నిలబడగల తీవ్రత  ఉంది అతనిలో.

‘గురూ దారిలో వెళ్ళేవారు విచిత్రంగా చూడలేదా’ అంటే ‘వర్షం తమ్ముడూ! కంటిలోనూ మింటిలోనూ, వర్షం. ఎవరూ కనబడలేదు’ అంటాడు.

విజయాకర్, నేనూ ఒకేసారి ఈ జాబ్ లో జాయిన్ అయ్యాం. ఒక్కోసారి రెండు మూడురోజులు ఇంటికెళ్లకుండా ఆఫీస్ లోనే ఉండి పనిచేసేవాడు. ఆ పేషన్ చూస్తే అతన్ని ప్రేమించకుండా ఉండటం కష్టం. అతని ప్రేమల తీవ్రత కూడా అలాగే ఉంటుంది. జాబ్ వచ్చిన కొత్తలోనే, కవితని వాళ్ళింట్లో తెలియకుండా తీసుకొచ్చేసాడు. మిత్రులంతా కలిసి ఆర్యసమాజంలో పెళ్లి చేసి కాపురం పెట్టించాం. ఆ తర్వాత ఎన్నిసార్లు వాడి ఇంటిపైబడి తిన్నామో.

“మీవోళ్ళే! పర్వతనేని రాజేంద్ర చుట్టం.”  కవిత పరిచయం అలా అయ్యింది. ఆ పర్వతనేని ఎవరో కూడా నాకు తెలియదు. ఎందుకలా చెప్పాడో నాకు స్పష్టత లేదు. గొప్పకోసం ‘చూసావా గొప్పోళ్ళ అమ్మాయిలు నేనంటే  పడిపోయారు’ అని చెప్పుకునేరకం  మాత్రం కాదు. ఆమెపై అతని ప్రేమని చూసిన వారెవరికీ అలాంటి ఆలోచన కలలో కూడా రాదు. ఆమె కూడా అలాగే ఉండేది. ఇతని ప్రేమలు – ఆకర్షణలు అనాలా! ఆమెకి తెలిసే ఉంటాయి. తెలిసినా ఎప్పుడూ పట్టించుకున్నట్లు కనబడలేదు. అతనిపై వాటన్నిటినీ మించినది ఏదో ఉండేది ఆమెలో. ఒక రకమైన మోహం. ఆ సంక్లిష్ట స్త్రీ హృదయం నన్నుఆశ్చర్యానికీ  ఆకర్షణకీ లోను చేసేది.

“అంతగా ఆమెని ప్రేమిస్తూ వేరేవారితో ఎలా, సెక్స్ లో?” అలాంటి ప్రశ్నలకి సమాధానం ఉండేది కాదు అతని దగ్గర. ఆమె కూడా అలాగే చేసినా, ఆమెపై అతని ప్రేమలో సాంద్రత తగ్గి ఉండేది కాదని అనిపించేది. అసలు ఒకరి కంటే ఎక్కువమందితో అంత తీవ్రమైన ఇచ్చని కలిగి ఉండటం ఎలా సాధ్యమో నాకు అంతుబట్టని విషయం. అతని చంచల హృదయమే అతన్ని తెలియనిదారుల్లోకి లాక్కుని పోయేది.  కొన్నిసార్లు అవి పెడదార్లుగా మారడం నాకు తెలుసు. పారిజాతం  అలాంటి ఒక పక్కదారే.

“పారిజాతం సంగతేం గానీ రమ్య సంగతి చెప్పు” మళ్ళీ పొడిచాడు విజయాకర్ ని.

మా కొలీగ్ రమ్యతో చాలాకాలం నుంచే ఎఫైర్ నడుస్తోంది. ఆ వ్యవహారాన్ని ‘ప్రేమాయణం’ లాంటి తేలికైన పదాలతో వర్ణించలేము. అది ఎంత తీవ్రమైన దశకి చేరిందంటే ఇద్దరూ అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా పోయి బతకాలని రక్తసంతకాలు చేసుకునేంత. అయితే చాలా ప్రేమకథల్లో జరిగినట్లే అప్పటివరకూ బలహీనంగా ఉండే బుద్ధి ఆఖరినిమిషంలో హృదయాన్ని జయించింది.

“నీయబ్బ! నయీంగా, నువ్వు పద్యం ఎత్తుకో బే. దాని సంగతి తర్వాత”  విజయాకర్ గొంతు కొంచెం వింతగా అనిపించింది. రమ్యని అదీ ఇదీ అనడం నేను ఎప్పుడూ వినలేదు.

“దేవీ! కష్టములెట్లున్నను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితిమి. ఈ వారణాసి.”  నయీం గొంతు ఒక్కసారిగా నన్ను, మా ఊరు  ముక్కోటి ఏకాదశి పందిట్లోకి లాక్కెళ్ళింది.

“భక్తయోగ పదన్యాసి వారణాసి” ఆంజనేయస్వామి గుడిముందు పందిట్లో నాటకం నడుస్తోంది. గుడిచుట్టూ తిరుగుతూ పిల్లల ఆటలు. దొంగ పోలీస్  ఆటలో దొరక్కుండా దాక్కోవాలి. తెర వెనకాల గుడ్డలతో కట్టిన మేకప్ రూమ్ లోకి దూరిపోయాడు బుజ్జి. ఎవరావిడ, చంద్రమతి అనుకుంటా, బట్టలు మార్చుకుంటోంది. పక్కన సూర్రావు తాత. చూస్తూ నిలబడిపోయాడు బుజ్జి. చంద్రమతి దగ్గరికి వచ్చింది. వంగి బుగ్గపై ముద్దు పెట్టుకుంది. చేత్తో తుడిచేసుకున్నాడు బుజ్జి. బయటికి పరిగెత్తాడు. ఔట్ ఔట్ అరుస్తున్నాడు నందాగాడు.

నయీం గొంతు జీరగా, పొరలుపొరలుగా విడిపోయి పారిజాతాల గంధాన్ని  కలుపుకుని  మంచుతో బాటు  కురుస్తోంది. అందరూ మాట్లాడటం మానేశారు. జిలానీ బొమ్మలా చూస్తున్నాడు. “పావన క్షేత్రముల వాసి” అంటూ డీవీ సుబ్బారావు గొంతుతో సూర్రావు తాత హార్మోనియం గొంతు కలిపింది. పరుగెత్తుకుంటూ తాత దగ్గరికి వెళ్ళాడు బుజ్జి, తాత వీపుమీదకి చేరాడు. సూర్రావు తాత నవ్వుతూ హార్మోనియం వాయిస్తూనే ఉన్నాడు.

ఒక సుదీర్ఘమైన ఆలాపన తర్వాత ఆపాడు నయీం. ఒక్కసారిగా ఎవరో బాల్యం నుంచి వర్తమానంలోకి తోసినట్లనిపించింది.

“సార్ బార్ కట్టేస్తారు, ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేయండి’’ ఎలాగో తేరుకుని అడిగాడు జిలానీ.

“అందరికీ రెండు రెండు పెగ్గులు తెచ్చేయ్”

అందరూ మాట్లాడటం మొదలెట్టారు. తాగని అప్పారావు  ఒక్కడే వింటున్నాడు. ఆనంద్ తాగిన కొద్దీ దిగిపోతుందని బెంగ పెట్టుకుంటున్నాడు.

“చెల్లియో చెల్లకో తమరు చేసిన యెగ్గులు’’ నయీం మళ్ళీ అందుకున్నాడు.

“నీయబ్బ! నయీంగా నువ్వేం తురకోడివిరా! తురకోడంటే మీకీ బాస మాకీ తెల్వద్ అన్నట్లుండాలి. నువ్వేంట్రా! ఈ అప్పిగాడి   కంటే  తెలుగు బాగా దంచేస్తున్నావ్. అప్పిగా  నువ్వేం బేపనోడివిరా? ఒక్క పద్యం రాదు, పాట రాదు.” ముద్ద ముద్దగా అన్నాడు విజయాకర్.

“మా ఊర్లో షేక్ మదీనానే రామాలయంలో భజన మొదలెట్టేవాడు. పీర్లపండక్కి పౌరాణిక సినిమాలు వేసుకునేవాళ్ళం.”  నవ్వుతూ అన్నాను.

“నీ ఫిగరు మొన్న కనబడింది సెక్టర్ టు లో. ఇద్దరికీ చెడిందిగా ట్రై చేసుకోమంటావా?” విజాయాకర్ ని ఉద్దేశించి  వెటకారంగా అన్నాడు ఆనంద్. అకస్మాత్తుగా అలా ఎందుకు అన్నాడో అర్ధం కాలేదు. అదోరకమైన లేకితనం.

“రమ్య గొంతు వింటావా?” విజయాకర్ మాటలో ఎప్పుడూ లేని అపస్వరం.

“ఇప్పుడా! చెప్పుతీసుకు కొడుతుంది”  ఎగదోసాడు ఆనంద్.

జేబులోనుంచి మొబైల్ తీసి డైల్ చేయడం మొదలెట్టాడు విజయాకర్.

“చినబావా ఒంటిగంట అవుతోంది, వదిలేయ్’’ కంగారుగా అన్నాడు నయీం.

విజయాకర్ సంగతి మాకు తెలుసు. మామూలుగానే అతని బుద్ధికీ హృదయానికీ   ఆమడదూరం. ఇప్పుడెన్ని పెగ్గులయ్యాయో తెలియదు.

అటునించి రింగ్ శబ్దం వినబడుతోంది.  ఫోన్ లో స్పీకర్ పెట్టాడు.

“ఫోన్ రమ్యకి ఇస్తారా”

అటువైపు శ్రీకాంత్ ఎత్తినట్లున్నాడు, రమ్య హస్బెండ్.

“హలో”

“నా ఫోన్ వచ్చిన వెంటనే ఏమనాలి?” అడుగుతున్నాడు విజయాకర్.

“ఐ లవ్ యు’’ నిద్రమత్తులో అటునుంచి రమ్య గొంతు.

ఆనంద్ వెకిలిగా నవ్వుతున్నాడు. అప్పారావు , నయీం కంగారు పడుతున్నారు.

“చినబావా ఇది కరెక్ట్ కాదు. ఈ టైం లో” నయీం కంగారుగా ఫోన్ ఆపేసాడు.

కడుపులో దేవినట్లయ్యింది. “ఛీ! నీయమ్మ. తక్కువ నా కొడకా” అప్రయత్నంగా నా నోటిలోనుంచి వచ్చిందామాట.

“ఏంటేంటి!!!”

“రాత్రి పన్నెండింటికి లేపుతావా? నీ గొప్ప గొరిగించుకోడానికి! ఎవడికి ప్రూవ్ చేయాల్రా?’’ నా గొంతు నిండా అసహ్యం.

“అవును నువ్వు పెద్ద కమ్మోడివి. నేను తక్కువోడిని.”  విజయాకర్ గొంతులో కసి, రోషం కలగాపులగంగా.

ఒక్కనిమిషం ఏమయ్యిందో అర్థం కాలేదు. మెల్లగా, నేనేమన్నానో తెలిసేటప్పటికి వెన్నెల వగరుగా మారింది. పరిసరాలన్నీ ఉక్కపోతగా అనిపించాయి.

“నా ఉద్దేశ్యం అదికాదు. ఇందులో కులం ఎందుకు?” చిన్నగా గొణిగాను.

నాగొంతు నాకే విచిత్రంగా తోస్తోంది. నయీం వారించిన దానికీ నేను అన్నదానికీ తేడా ఉంది. కాని వీడు చేసింది ఏమిటీ, ఇదేం సంస్కారం, ఎంత తాగితే మాత్రం, ఇన్నాళ్ళూ ఇలాంటోడితోనా తిరిగింది? కానీ ఇరవై ఏళ్ల స్నేహం. ఎప్పుడూ ఇలా అవ్వలేదు. ఒక్కక్షణంలో తక్కువోడు ఎలా అయిపోయాడు?

“నువ్వు చేసింది బాగుందా?” బలహీనంగానే అడిగాను.

“మొగుడి పక్కలో పడుకుని అది మాత్రం నాకు ఐ లవ్ యు చెప్పొచ్చు. అది బేపంది కాబట్టి గొప్పది. నేను మాలోడ్ని కాబట్టి తక్కువోడిని.”  కోపమూ బాధా కలిసి విజయాకర్  గొంతు వణుకుతోంది.

“కనీసం నువ్వు స్పీకర్ ఫోన్ లో పెట్టకూడదు కదా” మెల్లగా అన్నాను.

“అవున్రా నాకలాటివి తెలీదు. తక్కువోడిని కదా” కసిగా అన్నాడు.

“చినబావా వదిలేయ్. బావ ఉద్దేశం  అది కాదంటున్నాడు కదా”  నయీం కలగచేసుకున్నాడు. నయీం గొంతు నాకు ధైర్యాన్నిచ్చింది.

“ఇరవై ఏళ్ల నుంచి దాచుకున్నది బయటపడింది.” మళ్ళీ కసిగా అన్నాడు విజయాకర్.

ఇరవై ఏళ్ల స్నేహం. ఇన్నాళ్ళ తర్వాత ఈ మలుపు దగ్గర ఆగుతుందని అనుకోలేదు.

“బావా, ఇద్దరూ పదినిమిషాలు మాట్లాడకండి.”

ఒక్కోక్షణం భారంగా గడుస్తోంది. తాగినదంతా దిగిపోయినట్లయ్యింది. నాలో మొదటినుంచీ ఎక్కడో కులం దాగి ఉందా! సమయం ఒక్క అరగంట  వెనక్కి  జరిగితే బాగుణ్ణు. అయినా ఇది అరగంటకి సంబంధించింది కాదు. తరాల నాటిదా!

“నీవు చేసిన పని నాకు నచ్చలేదురా, కులం గురించి కాదు” మెల్లగా గొణిగాను. నా గొంతు మీద నాకే నమ్మకం లేదు.

విజయాకర్  ఏదో అనబోయి ఆపేసాడు. కోపం కొద్దిగా తగ్గినట్లే ఉంది.

“బావా ఇంక పోదాం పదండి. కార్ తియ్యరా తమ్ముడూ’’ అప్పారావుకి పురమాయించి బయలుదేరదీసాడు నయీం. బయటపడేసరికి రెండు  గంటలయింది. సాధారణంగా ఈ టైంలో ఇంటికి వెళ్ళం. కవిత ఒక్కతే ఏ గొడవా లేకుండా తలుపు తీస్తుంది. అందరం వాళ్ళ ఇంట్లోనే పడుకుంటాం. కారు విజయాకర్ ఇంటిముందు ఆగింది.

ఇంట్లో లైట్ వెలుగుతున్నట్లు  తెలుస్తోంది. కవిత మాకోసం ఎదురుచూస్తూ సోఫాలో పడుకుని ఉంటుంది. లోపలికి వెళ్ళబుద్ధి వేయడం లేదు. చేసింది తప్పోఒప్పో తెలియని గజిబిజి ఉంది  లోపలంతా. ఒకేసారి ఎక్కడినుంచో గబాలున తోసినట్లయ్యింది.

విజయాకర్ ఒక్కడే కారు దిగి నడుస్తున్నాడు. నేను కదలకపోవడం చూసి ముగ్గురూ లోపలే ఉండిపోయారు. ఎవ్వరం మాట్లాడటం లేదు. అప్పారావు, ఆనంద్ – కార్  బయటికి వెళ్ళి సిగరెట్ వెలిగించారు.

“మొత్తం దిగిపోయింది బావా! తాగిన తర్వాత పాటలో పద్యాలో పాడుకున్నామా ఎప్పటికోకప్పటికి ఇంటికి పోయామా అన్నట్లుండాలి. దీనమ్మ ఈ గోలేంటి బావా’’ చిరాగ్గా అన్నాడు నయీం. నాకేం మాట్లాడాలో తెలియలేదు. ఒక్క ఉదుటున కారు దిగి ఆనంద్ జుట్టు పట్టుకున్నాను.

“నీయబ్బ, నీవల్లేరా!”  కోపమూ బాధా కలిసిపోతున్నాయి. నయీం, అప్పారావు విడిపిస్తున్నారు. ఒక్క ఏడ్పుతో కడిగేసుకోవాలని ఉంది.

చేతిలో బేసిన్ లాంటిది మోసుకుంటూ వస్తున్నాడు విజయాకర్.

“చికెన్ బిర్యాని చేసింది, రండి” బేసిన్ కార్ బోనెట్ మీద పెట్టి చెప్పాడు విజయాకర్.

నామొహం వైపు చూడటం లేదనిపించింది. కార్ లోపలికి వెళ్లి కూర్చున్నాను.

“మందు కావాలిరా నయీం” అప్రయత్నంగా అన్నాను.

“ఇప్పుడెక్కడ దొరుకుతుంది బావా! తినేసి పడుకుందాం.” విసుగ్గా అన్నాడు నయీం.

“నడువ్ నీయబ్బ’’ అంటూ బేసిన్ని వెనకసీటులో పెట్టి డ్రైవింగ్ సీట్లో చేరాడు విజయాకర్. అప్పారావు, నయీం వెనక సీటు లో కూర్చున్నారు. ఆనంద్ వైపు చూసాను.

“మీరెళ్ళండి. నేను ఇంటికి పోతా” నడవడం మొదలెట్టాడు ఆనంద్.

“నీయబ్బ ఎక్కు. చంపుతా నా కొడకా’’ కార్ ఆనంద్ ముందు ఆగింది. వెనకసీట్లో ఎక్కి కూర్చున్నాడు ఆనంద్. రెండు నిమిషాల్లో కార్ హైవే మీదకి చేరింది. కారు వేగం మనోవేగంతో పోటీపడుతోంది. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో గాల్లో వెళుతున్నట్లే ఉంది. ఎవ్వరం మాట్లాడటం లేదు. ఆ వేగమైనా ఇద్దరినీ తేలికపరుస్తుందేమోనని ఎదురుచూస్తున్నట్లున్నారు. ఇరవై నిమిషాల్లో సిటీ చేరింది కారు.

ఆ టైంలో మందు ఎక్కడ దొరుకుతుందో అందరికీ తెలిసిందే. లక్ష్మి వైన్స్ షట్టర్ మూసేసి ఉంది. విజయాకర్ కార్ దిగి షట్టర్ దగ్గరకి వెళ్లి మూడుసార్లు కొట్టాడు. షట్టర్ కొద్దిగా తెరుచుకుంది. “టీచర్స్” అంటూ కొన్నినోట్లు కిందనుంచి తోశాడు. అటువైపునుంచి బాటిల్ వచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్నదే. అంత అయోమయం లోనూ నవ్వొచ్చింది.

కార్, బీచ్ రోడ్డులో ఆగింది. రోడ్డుమీద పిట్టకూడా లేదు. రోడ్డుపక్క పిట్టగోడపై కూర్చుని మొదలెట్టాం.సముద్రం హోరు కన్నా లోపలే ఎక్కువ గొడవగా ఉంది. నేనూ విజయాకర్ కొన్ని గంటలుగా డైరెక్ట్ గా మాట్లాడుకోవడం లేదు. విచిత్రంగా అనిపిస్తోంది. మొహమాటంగా కొత్తగా గట్టిగా కలబడి కొట్టుకోవాలనిపిస్తోంది. వదిలించుకోవాలనుకునే స్నేహం అయినా  బాగుణ్ణు.

దూరంగా ఏదో వెహికల్ వస్తోంది. పోలీస్ జీప్ లాగుంది.

“బావా ఇక్కడే ఉంటే ఎదవ గొడవ కార్ తీయి.” నయీం కంగారుగా కార్ వైపు నడక మొదలెట్టాడు.

అందరం కూర్చోగానే పోర్ట్ రోడ్ వైపు బయలుదేరింది కారు. అల్లిపురం, రైల్వేస్టేషన్ దాటగానే చావుల మదుం.  కైలాసభూమి. శివుని విగ్రహం  పక్కనే ఆగింది కారు.

“ఇక్కడైతే ఎవ్వడూ ఉండడు.”

“ఈ మధ్య స్మశానంలో దయ్యాలు కూడా ఉండట్లేదు.” వాతావరణాన్ని తేలికపరచడానికి అన్నట్లు అన్నాడు నయీం.

ఆనంద్, అప్పారావు కార్ లోంచి దిగలేదు. ముగ్గురం  లోపలికి  నడిచాం. శవదహనానికి వచ్చినవాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకునే చప్టాలాంటిది ఉంది. ఎవరూ లేరు. విచిత్రంగా భయం కూడా లేదు. స్మశానం నిండా ఫ్లెక్సీలు కట్టి ఉన్నాయి. చనిపోయిన  వారి బంధువులు  వారికోసం పెట్టించినవి. చనిపోయిన తర్వాత వచ్చే కీర్తికి, ప్రచారానికీ  విలువుందా?

మళ్ళీ తాగడం మొదలెట్టాం. మెల్లగా శరీరంలో రక్తం స్థానాన్ని ఆల్కహాల్ ఆక్రమించింది. శరీరం, మనసూ తేలికవడం తెలుస్తోంది.

“ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరగిపోయే” సన్నగా మొదలైన నయీం గొంతు కొద్దిసేపట్లోనే పరిసరాలని తన వశం చేసుకుంది. నరనరాన్నీ పట్టుకుని లాగుతూ మనసునీ శరీరాన్ని ఊపేస్తోంది.

“ఇచ్చోటనే, భూములేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే” ఎప్పుడు మొదలెట్టానో తెలియలేదు నయీం తో కలిసి ఎలుగెత్తి పాడుతున్నాను.

“ఇచ్చోటనే ఎట్టి పేరెన్నికం గన్న చిత్రలేఖకుని కుంచియ నశించె”

‘బతికుండగా ఎవ్వత్తినీ వదలలేదు మహానుభావుడు, మాలపేట అంతా మన చుట్టాలే’ శీనన్నయ్య చెవిలో గొణుగుతున్నాడు. చితి మీద సూర్రావు తాత శవం ఐహికాలన్నీ కోల్పోయి నగ్నంగా.

ఈ దేశంలో విలువలకి కూడా కులం ఉందా !  ఏ పురాతన దుఃఖమో నా గొంతుని వశపరచుకుంది. నేను పాడుతున్నానా? ఏడుస్తున్నానా?  నా పక్కనే సన్నటి రోదన. తలతిప్పి చూసాను.

“కవిత! పాపం, నన్ను నమ్మి వచ్చిందిరా! ఒక్క ముక్క అడగలేదు ఎప్పుడూ”

ఆకాశంలో పున్నమిచంద్రుడు. మబ్బులు చంద్రుని కమ్ముకుంటాయో, చంద్రుడే మబ్బుల్లో దాక్కుంటాడో ఎప్పటికీ సందేహమే. అదొక విచిత్రమైన ఆట.

“రమ్యతో మాట్లాడాలనిపించిందిరా.”  విజయాకర్ వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం.

బహుశా మనిషి అంతరంగాన్ని మించిన యుద్ధభూమి, బహిరంగానికి ధీటైన  రంగస్థలం లేదు.

“ఇది పిశాచులతో నిటలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు”

************

చిత్రం: బీబీజీ తిలక్

శ్రీధర్ నరుకుర్తి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అద్భుతమైన నడక.నరుకుర్తి శ్రీధర్ ఎన్ని కథలు రాశారో..!! ఫేస్బుక్ లో రైటప్ లు మాత్రమే చదివిన వాడిని. ఈ కథ ‘రంగస్థలం’ ఒక అనుభూతుల, తాత్వికతల రణభూమిగా నిలిచింది నాకు. ‘కవిత పాపం నన్ను నమ్మి వచ్చింది రా! ఒక్క ముక్క అడగలేదు’
    అన్న వ్యక్తి, అదే సమయంలో ‘రమ్య తో మాట్లాడాలనిపించింది రా’ అనగలగడం ఏ తాత్వికం నిర్వచిస్తుందో!
    తాగిన మైకంలో అంతరాంతరాల్లో యెదుటి మనిషిపై వున్న ఒక తక్కువ భావన, సమాజం పాదు గొలిపినదా? దీనికి మనోవైజ్ఞానిక తత్వానికి సంబంధం లేదా?
    కథ ఆసాంతం కవితాత్మకంగా పద్యాల నంజుడుతో అద్భుతంగా వుంది.

  • సారంగలో ఆరంగేట్రం
    రంగస్థలం మీద నరుకుర్తి కాటిసీను

    కథలో నిజాయితీ ఉంది . వాక్యం సొంపుగా ఉంది .

  • బావుంది శ్రీధర్ గారూ. విజయాకర్ సంఘర్షణ ఇంకొంచం రాయొచ్చు అనిపించింది. కథకి spine అతనే కదా

  • సరదాగా మొదలైన కథ డీప్ ట్రాన్స్ లోకి తీసుకుపోయేలా మారిపోయింది. స్నేహితుల మధ్య ఉండే సహజత్వాన్ని చక్కగా నేరేట్ చేయగలిగారు శ్రీధర్ గారూ.. పొద్దున్నే మంచి కథని చదివించారు. ధన్యవాదాలు

  • జీవితానికి చాలా దగ్గిరగా కాదు వొకానొక జీవితమే కధగా .. . బాగుంది. సోమసుందరం గ్రౌండ్స్ అర్ధరాత్రి వరకు తాగి బాటిల్స్ పగలగొట్టుకున్న రాత్రిళ్ళు గుర్తు వచ్చాయి. అవునే ఇదే జీవితం! నచ్చినా నచ్చకపోయినా.

  • చాలా రోజులయ్యింది ఇలాంటి మనసుకి దగ్గరగా ఉన్న కథలు చదివి.
    అందరి అనుభవాలే దాదాపు. ఇప్పుడు తలుచుకుంటే సిగ్గేస్తుంది, అలా ఎలా ప్రవర్తించామని. ఇప్పుడలాగ ప్రవర్తించగలమా? ఏదో అడ్డు పడుతుంది.. కానీ..
    మళ్ళీ ఒకసారి అలా నేస్తులతో చిత్తుగా తిట్టించుకోవాలనిపిస్తూంది.
    Thanks శ్రీధర్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు