కాస్త వెతికి పెట్టండయ్యా పోరాట ప్రేమికుల్లారా..!!

ఈ భూమ్మీద బతుకుతున్న ప్రతీ జీవి పోరాట ప్రేమికుడే అయ్యుండాలి. అణచివేయబడుతున్న ప్రతీ మనిషి తిరగబడుతూనే వుండాలి.ప్రపంచ వ్యాప్తంగా ప్రజల గుండెలను గొంతులను మోయాల్సిన ప్రజాకవులు తప్పిపోయారు,చాలా తెలివిగా పారిపోయారు.ఈ పారిపోతున్న కవులను వెతికి పట్టాల్సిన బాధ్యత ప్రతీ పోరాట ప్రేమికుడిపై వున్నది.ప్రతీ పోరాట ప్రేమికుడికి గుర్తు చెయ్యాల్సిన బాధ్యత నాలాంటి వాడిపై వుంటుంది.
**
స్వేచ్ఛ కోసం నరాలు ఆకలి పాట పాడినప్పుడేనా
విప్లవం కోసం పేగులు పోరాట పాట పాడినప్పుడేనా
నేను కవినయ్యింది..??
దుక్కాన్ని గుండె మీద కుప్పబోసుకుంనందుకేనా
అడవుల్లో నిండిపోయిన మనిషితనాన్ని
కాస్త జోలెలో తెచ్చుకునందుకేనా
ఆదివాసీల పోరాటాన్ని దోసిల్లో బుక్కెడు తాగినందుకేనా
నేను కవినయ్యింది..??
నా నాలుకను తెగ్గోసుకొని భూమాతకు అతికించినందుకేనా
నా మాంసం ముద్దలతో వీరుల సమాధులకు రంగు వేసినందుకేనా
నా బొక్కలను కడియాలుగా మార్చి స్థూపాలకు తొడిగినందుకేనా
నేను కవినయ్యింది..??
నా పిడికిలికి గద్దెముక్కును అతికించినందుకేనా
నా గుండె చప్పుడ్లను తుడుం మోతలుగా ప్రకటించి
ప్రజా యుద్ధంలో నా కనుగుడ్లను నగారాలుగా మార్చినందుకేనా
వేడి వేడి నా రక్తాన్ని ఆకాశమ్మీద చల్లి
పొద్దును పుట్టించినందుకేనా నేను కవినయ్యింది..??
*******
ఇప్పుడేమిటి ఏదో వింత జరుగుతున్నది
నా కవిత్వంలో కవి కనిపించడం లేదేమిటి
నా కవిత్వంలో ప్రజల గుండె చప్పుడ్లు వినిపించడం లేదేమిటి
రాజ్యపు ఉచ్చ మడుగుల్లో పొర్లాడుతూ
ఏ యువరాణుల అరికాళ్లను నాకుతున్నాడో నా కవి
కాస్త వెతికి పెట్టండయ్యా పోరాట ప్రేమికుల్లారా..!!
******

దొంతం చరణ్

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు