ఐసోలేషన్‌

శ్రీనివాస్‌ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకోబట్టి అయాల్టికి తొమ్మిదో రోజు!

అవాళెందుకో మనసంతా డల్‌ గా ఉంది అతనికి. ఎప్పుడూ తన చుట్టు పదిమంది ఉండేవాళ్లు. తన భార్య, కొడుకు కూడ తనతో లేకుంట ఒంటరిగా ఉండడం ఎందుకో అరాయించుకోలేకపోతున్నడు. వేరుబడ్డ పెద్ద కొడుకు,

పిల్లలు గుడ వచ్చి చూసేటట్లు లేదు. ఎందుకో, పాత జ్ఞాపకాలన్నీ మనసుని కమ్ముకుంటున్నయి. కఠినాత్ముడన్న పేరొస్తున్నా పట్టించుకోకుండా కట్‌ చేసిన దోస్తులంతా యాదికొస్తున్నరు, చిత్రంగ!

తనకు కరోనా పాజిటివ్‌ అని తేలిన రోజు హడలిపోయిండు శ్రీనివాస్‌. ఎన్నో విషయాల్లో ఎంతో ధైర్యంగ కఠిన నిర్ణయాలు

తీసుకునే తను ఇలా ఎందుకు వణికిపోతున్నడో అతనికి అర్ధం కాలేదు. తను చనిపోతే!? అన్న భయం అతడిని కుదిపేసింది. తను ఇన్నాళ్లు సంపాదించినదంతా అనుభవించకుండానే, అణచిపెట్టుకున్న ఇష్టాలు, కోరికలు, హాబీలు తీరకుండానే, చనిపోతాడా ఏంటి!? నో.. అలా జరగడానికి వీల్లేదు.. జాగ్రత్తగా ట్రీట్‌మెంట్‌ తీసుకోవాలె. మనసు గట్టి చేసుకొని అధికారులతో మాట్లాడి హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉండి ట్రీట్‌మెంట్‌ తీసుకోడానికి ఒప్పించుకున్నడు. వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్‌ కు కాల్‌ చేసి ట్రీట్‌మెంట్‌ ఎలా తీసుకోవాలో డీటెయిల్స్‌ తెలుసుకున్నడు. డబ్బు ఎంత డిమాండ్‌ చేసినా పర్లేదు, అన్నీ తననే మానిటర్‌ చేయమని కోరిండు.

డాక్టర్‌ ఓకే అన్నడు.

డాక్టర్‌ చెప్పినట్లు తన బంగ్లాలో ఒక పోర్షన్‌ అరేంజ్‌ చేయించుకుని అందులోకి తనకు కావలసిన వస్తువులన్నీ అమర్చేటట్లు తన భార్య సులోచనని, చిన్న కొడుకుని పురమాయించిండు. అన్నీ అరేంజ్‌ అయ్యి ఆ పోర్షన్‌కు చేరిపొయిండు శ్రీనివాస్‌.

తొలి రెండు రోజులు భయం వీడలేదు. మూడో రోజు నుండి కాస్త ధైర్యం కూడగట్టుకున్నడు. కానీ తనకున్న బీపీ, షుగర్‌ వల్ల ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు హెచ్చరించిన్రు. దాంతో ఎంతగనం ధైర్యం కూడగట్టుకున్నా ఆలోచనల్లో పడంగనే నీరుగారిపోతున్నడు. నిబ్బరం కోల్పోతే మరింత ప్రమాదం అని తెలిసి గూడా ఆందోళన తనను వీడడం లేదు.

తనెందుకలా ఆందోళన పడుతున్నడా అని సోంచాయించిండు…

తనను చావు భయం ఇంతగా కవరపెట్టడానికి కారణమేందా అని ఆలోచించిండు. ఎందుకో అర్ధమై పెదవుపై చిన్న నవ్వు తొణికింది!

తను ఇన్నాళ్లు సంపాయించడమే బతుకన్నట్లు బతికిండు. ఒక్కో టాస్క్‌ అనుకోవడం దాన్ని సాధించడమే బతుకైపోయింది. ఎదగడమే జీవితం అనుకున్నడు. అనుకున్నయన్నీ సాధించటానికి ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకున్నడు. ఆ దారిలో ఎందరో తనకు దూరమయ్యిన్రు. ఇప్పటికీ మరికొన్ని గోల్స్‌ ఉన్నై. ఇయన్నీ అయిపొయినంక రిలాక్పై పూర్తిగా ఎంజాయ్‌ చెయ్యడం మీదనే నజర్‌ పెట్టానుకునేటోడు. అందుకే సాధించినవి, సంపాయించినవి ఎంజాయ్‌ చెయ్యకుంటనే యాడ చచ్చిపోతనోనన్న భయంతో కలవరపడిపోతున్నడు.

“నిజంగనే తను చచ్చిపోతే ఎట్లా? ఒక్కసారిగా మనసంతా నిస్సారంగా తోచింది శ్రీనివాస్‌కు. ఛత్‌! తను బతకాలె. ఎట్లయినా బతకాలె. బతికి అన్నీ అనుభవించాలె. ఇప్పటికి సాధించిన విజయాలు  సాలు, ఆ విజయాలను, సంపాయించిన ఆస్తిని తనివితీరా ఆస్వాదించాలె. ఇక ముందు ఉన్న గోల్స్‌ కి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలె. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేనో, ఎంపీనో కావాలన్న ఆలోచన గుడా వదులుకోవాలె. తను చూసుకుంటున్న కంపెనీల్లో నమ్మకస్తులను పెట్టి మానిటరింగ్‌ చేసుకుంట ఇగ పూర్తిగా ఎంజాయ్‌ చేస్తానికే మిగిలిన కాలమంతా కేటాయించాలె…” అని గట్టిగ నిర్ణయించుకున్నడు.

ఎట్ల తెలిసిందో.. అవాళ సలీమ్‌ ఫోన్‌ చేసిండు. వీడెందుకు ఫోన్‌ చేస్తున్నడా అనుకుంటనే ఎత్తిండు. ‘హలో..!’ అన్నడు గుంభనంగా.

అవతల్నించి సలీమ్‌,

‘‘ఏరా శ్రీను! ఎట్లున్నవురా?! హెల్త్‌ ఎలా ఉందిరా? అంతా ఓకే కదా!’’ అని అడిగేసరికి కలవళపడి పోయిండు శ్రీనివాస్‌. ఆ గొంతులో గాభరా, ఆత్మీయత, మరెన్నో పలకడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. గిర్రున కళ్లల్లో నీళ్లు తిరిగినయి. ఇన్నాళ్లుగా ఇంత ఆత్మీయంగా అడిగిన గొంతు లేదు!

జవాబు ఇవ్వకపోయేసరికి సలీమ్‌, ‘‘ఏంట్రా శ్రీను! పలకవేంట్రా?’’ అన్నడు మరింత ఆదుర్దాగా….

‘‘ఆఁ.. ఆఁ.. సలీమ్‌!’’ అన్నడు తడబడుతూ.. గొంతులో దుఃఖం అడ్డంపడ్డది. పూడుకుపోయిన గొంతు విని సలీమ్‌, ‘‘అరేయ్‌ శ్రీను.. ఏంట్రా.. ఎట్లున్నవ్‌ రా?’’ అని అడుగుతుంటే అతని గొంతు గుడ పూడుకుపోయింది.

అంతే.. శ్రీనివాస్‌ ఫోన్‌లో పొగిలి పొగిలి ఏడ్చిండు. అవతల్నించి సలీమ్‌ ఎంతగనం ఓదారుస్తున్న గుడ వినకుండ పెద్దగ ఏడ్చిండు. సలీమ్‌ ఓదార్పు మాటలు చెప్తనే ఉన్నడు. శ్రీనివాస్‌ ఏడుస్తనే ఉన్నడు. కొన్ని నిమిషాలు అట్ల గడిచినంక తేరుకుని ‘ఒక్క నిమిషం రా!’ అని ఫోన్‌ పక్కన పెట్టి ముక్కు చీది మొఖం కడుక్కొని వచ్చి ఫోన్‌ తీసుకున్నడు శ్రీనివాస్‌.

‘‘నీకెట్లా తెలిసిందిరా సలీమ్‌?’’ అన్నడు. మళ్లీ దుఃఖం తన్నుకు వచ్చింది. గొంతు పూడుకుపోయింది. అవతల్నించి సలీమ్‌,

‘‘తెలవకుంట ఎట్లుంటదిరా.. నీ స్నేహం నేనెలా మర్చిపోతరా.. నువ్వు నీ పనుల్లో బిజీ ఉంటవు. నీ లక్ష్యాలు నీవి. అందుకే నిన్ను డిస్టర్బ్‌ చేయడం ఎందుకులే అని కాల్స్‌ చేయను, వాట్సప్‌ చేస్తుంట. సరే, చెప్పు, ఇప్పుడెట్ల ఉన్నవు.. డాక్టర్లు ఏమన్నరు. కోలుకున్నవుగా?! అసలు ఇంట్లో ఉన్నవా? హాస్పిటల్లనా?’’

ఆశ్చర్యం ఇంకా వీడలేదు శ్రీనివాస్‌ని. తేరుకుంట,

‘‘పరవాలేదు రా.. కోలుకుంటున్నా. ఇంకొన్నాళ్లు పడుతుంది. ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నా.’’

‘‘తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ సీరియస్‌గా తీసుకుంటున్నవు గదా..’’

‘‘అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నరా.. చెప్పు, నువ్వెట్లున్నవు?’’

‘‘నాదేముందిరా.. నడుస్తుంది.. నీ గురించే తెలిసి పరేశానయిన. అంత జాగ్రత్తగ ఉంటవు గదా, ఇట్లెట్ల జరిగిందిరా?’’

కాసేపు సంభాషణ నడిచినంక ఉండబట్టలేక అడిగిండు శ్రీనివాస్‌,

‘‘అరేయ్‌ సలీమ్‌! ఒక్క విషయం చెప్పురా! ఉన్నది ఉన్నట్లు చెప్పు. నేనేమనుకోను. నాకు కూడా ఈ కరోనా రావడంతోటి చావు భయంలోంచి నిజాలు తెలుసుకోవాల్నని ఉంది. అట్లనే కొద్దిగ నన్ను గుడ మార్చుకోవాల్నని ఉంది. చెప్పురా, నేను మీ అందర్నీ దూరం చేసుకున్న తర్వాత మీరేమనుకున్నరు? నరేందర్‌ గాడేమన్నడు నీతో? శ్రీధర్‌ ఏం ఫీయ్యిండు. వినాలని ఉందిరా.. ఏదీ దాచుకోకుంట చెప్పెయ్‌ సలీమ్‌! ఇయాల నువ్వు ఫోన్‌ చేయడం నిజంగా నాకు బాగుంది. నాలో నాకు తెలీకుండానే గూడు కట్టుకొని ఉన్న దుఃఖం చూసినవ్‌ గదా.. నాకే తెలీదు, నాలో అంత దుఃఖం పేరుకుపోయి ఉందని! నువ్వు కాల్‌ చేసి నీ ఆత్మీయ పలకరింపుతో నాలోని దుఃఖపు కుండను పగులగొట్టినవ్‌…’’

చెప్పుకుపోతున్నడు శ్రీనివాస్‌. సలీమ్‌ ఆలోచిస్తున్నడు. వీడికి అవన్నీ ఇప్పుడు చెప్పడం అవసరమా.. మరింత బాధ పడతడు అనుకున్నడు.

‘‘అరే సలీమ్‌! చెప్పరా?’’ శ్రీనివాస్‌ నిశ్చయంగా అడుగుతున్నడు.

‘‘అరేయ్‌ శ్రీను! ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వేం అడుగుతున్నవురా.. ఇప్పుడవన్నీ అవసరమా.. నువ్వు ముందు కుదుటపడు. నేనొస్తగా.. వచ్చినప్పుడు అన్నీ మాట్లాడుకుందాం.. సరేనా..’’

‘‘అదికాదురా.. నీతో సహా వాళ్లందరినీ నేను చాలా బాధ పెట్టిన కదా.. నీతో చెప్పుకొని బాధపడి ఉంటరు కదా.. సారీరా.. వెరీ సారీ…’’ మళ్లీ ఏడుస్తున్నడు శ్రీనివాస్‌!

 

‘‘అరె అరేయ్‌! నేను నీకు కాల్‌ చేసింది నిన్ను ఏడ్పించడానికా.. ఇట్లాగైతే నేను ఫోన్‌ పెట్టేస్తున్నా..’’ అన్నడు సలీమ్‌.

‘‘సలీమ్‌! సలీమ్‌! ఫోన్‌ పెట్టకు.. అది కాదురా.. ఇన్నాళ్లు నాకు తెల్వకుంటనే మనసులో ఎక్కడ్నో గూడు కట్టుకొని ఉందిరా ఇదంతా.. నేను తప్పు చేస్తున్ననని తెలుసు. అయినా చేస్తూ పోయినా.. నా లక్ష్యాలు నాకు ముఖ్యమనుకున్నా. నన్ను క్షమించురా.. ముందు నువ్వు క్షమిస్తే అందరికీ సర్ది చెప్తవ్‌! నేను రియలైజ్‌ అయిన్ననిపిస్తున్నది ఇయాల. కరోనా నన్ను మళ్లీ మనిషిగా మార్చిందేమో! బిజినెస్సే ముఖ్యమనుకున్న నన్ను రియలైజ్‌ చేసిందనే అనుకుంటున్నా. నువ్వు చెప్పు, నేనేం చేయను ఇప్పుడు?!’’

‘‘అరేయ్‌ శ్రీనుగా! నువ్వు కాస్త రిలాక్స్‌ అవ్వు ముందు. బెడ్‌ మీద పడుకొనే మాట్లాడుతున్నవా?’’

‘‘లేదురా, నిలబడి ఉన్నా..’’

‘‘ముందు కొన్ని మంచిన్లీు తాగి బెడ్‌ మీద ఒరుగు. ఒరిగి మాట్లాడు.’’

‘‘హాఁ.. తాగుతా… తాగిన.. ఒరిగినరా… చెప్పు.’’

‘‘ఏం లేదురా.. నువ్వు కోలుకున్నంక నేను అందరినీ పట్టుకొస్తగా.. అందరం కలిసి మాట్లాడుకుందాం. సరేనా..’’

‘‘దానికి టైం పడుతుందిరా.. ఈ కరోనా ఇప్పుడే మనల్ని విడిచేలా లేదు.. అప్పటిదాకా నేనేం చేయను. నేను బేచైన్‌ అవుతున్నా. నాకు తెలుస్తున్నది. పశ్చాత్తాపం నన్ను సంపుకుతినేటట్లున్నది..’’

‘‘ఒక పని చెయ్‌రా.. నేను నెంబర్లు పెడతా. ఒక్కొక్కరికి తీరికగా కాల్‌ చెయ్‌. చేసి మాట్లాడు. పశ్చాత్తాప పడుతున్ననని చెప్తున్నవుగా.. సారీ చెప్పెయ్‌! నీ మనసులో బాధ తీరిపోతుంది.’’

‘‘అంత ఈజీ అంటవా?’’

‘‘పశ్చత్తాపం కన్నా మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది చెప్పు?’’

‘‘ఎంత బాగా చెప్తవురా నువ్వు! నీ మాటలు ఇన్నాళ్లు చాలా మిస్సయిన.’’

‘‘ఇప్పుడు మాట్లాడుకుంటున్నం గదా.. ఇక ముందు కూడా మిస్సయినయన్నీ మాట్లాడుకుందం. నువ్వు హాయిగా మనోల్లతో మాట్లాడెయ్‌! నీ మనసులోని దుఃఖమంతా తీరిపోతుంది. ఇంకొన్నాళ్ళు ఇల్లు కదిలే పరిస్థితి లేదు కాబట్టి ఆ పని చెయ్‌రా.. నువ్వలా అందరికీ కాల్స్‌ చేసినవంటే నేను గూడా షానా ఖుష్షయితా..!’’

‘‘అట్లనే చేస్తరా.. తప్పకుండా ఆ పని చేస్తా..’’

‘‘నేను నంబర్స్‌ అన్నీ వాట్సప్‌ చేస్తా.. మరి ఉండనా.. ఆరోగ్యం జాగ్రత్త! డాక్టర్లు చెప్పినట్లు విను. సొంత వైద్యం చేసుకోకు.’’

‘‘సరేరా.. థ్యాంక్యూ వెరీమచ్‌రా.. కాల్‌ చేసినందుకు. నాకు నిశ్చింత నిచ్చినందుకు.’’

‘‘పరవాలేదురా.. నీకు ఎప్పుడు చెయ్యాలనిపిస్తే అప్పుడు చెయ్‌. నేను మాట్లాడుతా. సరేనా.. బై మరీ!’’

ఫోన్‌ పెట్టేసినంక మనసు కొద్దిగ కుదుట పడ్డట్లు అనిపించింది శ్రీనివాస్‌కు. సంతోషంగ గూడ అనిపించింది. తన చిననాటి మిగతా ఫ్రెండ్స్‌ అందరికీ గూడ వెంటనే ఫోన్లు చేసి మాట్లాడేయాలనిపించింది. వాళ్లతో తను ఎంతగా హాపీ డేస్‌ గడిపిండో యాదికొచ్చి మనసు అతలాకుతలమై పోయింది. అసలు వాళ్ళ మొఖాలు గుర్తొస్తేనే ఇంత ఆనందంగా ఉంది, ఇన్నాళ్లు వాళ్ళనెట్ల వదిలేసుకున్నడు తను? ఛ!

ఆ ఒక్కొక్క మొఖమే యాదికి తెచ్చుకోబట్టిండు! సలీమ్‌, నరేందర్‌, శ్రీధర్‌ … అట్లా మంచంపై ఎల్లకిలా పండుకొని ఆలోచనల్లోకి జారిపోయి మైమరచిపోయిండు శ్రీనివాస్‌!

మనసు నిండా శ్రీలత నిండిపోయింది!

ఆ చల్లని మనసు, మల్లె నవ్వు పరుచుకున్నయి..

***

టౌనుకి దగ్గర్లోకి ఊరి నుంచి ఎదిగి వచ్చిన నలుగురి బ్యాచ్‌ తమది. వాళ్లందరిల షానా హుషారుగా ఉండేటోడు తను. తనే వాళ్లకు నాయకుడిగా అన్ని నిర్ణయాలు తీసేసుకునేటోడు. వాళ్ళంతా సై అనేటోల్లు. ఇంటర్‌ నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేటోడు. పిడిఎస్‌యూ నాయకుడిగా ఎదిగిండు. మార్క్సిస్టు, మావోయిస్టు రచనలన్నీ చదువుకున్నడు. తన ఫ్రెండ్స్‌తో చదివించేటోడు. సోవియట్‌ భూమి పత్రిక అక్షరం వదలకుంట చదివేటోడు.

టౌన్‌ దాటి యూనివర్సిటీలో చేరిండు. దోస్తులు వెంటే ఉన్నరు. సభలు, సమావేశాలు, ఎబివిపి వాళ్లతో గొడలు.. శ్రీలతతో ప్రేమలో పడడం! పిక్నిక్లు, సినిమాలు, ఉద్యమాలు అన్నీ అన్నీ నడిచినయి. ఎందరో ఫ్రెండ్స్‌ అయ్యిన్రు. పెద్ద పెద్దోళ్లు ములాఖాతయ్యిన్రు. రాజకీయ నాయకులు పిలిపించి మాట్లాడేటోల్లు.

యూనివర్సిటీ వదలాల్సిన రోజు రానే వచ్చింది. ఉద్యోగం రాలేదు. శ్రీలత టీచర్‌ జాబ్‌ సంపాదించుకుంది. పెళ్లి చేసుకుందామన్నది. తను సెటిల్‌ కాకుండా పెళ్లి వద్దని బిజినెస్‌లోకి దిగిండు. ఒకటి తర్వాత ఒకటి రెండిట్లోనూ లాస్‌ వచ్చింది. దిగాలు పడిపోయిండు.

ఈలోపు యూనివర్సిటీ నుంచి తనను ఫాలో అవుతున్న సులోచన తన గురించి తండ్రికి చెప్పింది. లక్షాధికారి అయిన ఆమె తండ్రి తనను పిలిపించిండు,

‘‘నాకు సులోచన ఒక్కతే బిడ్డ. తనను చేసుకుంటే నా బిజినెస్‌కి, ఆస్తికి నువ్వే సర్వాధికారివి. నా తెలివితేటలతో నువ్వు జత కలిస్తే మనం తక్కువ కాలంలోనే ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు. అందుకు నువ్వు ఇల్లరికం రావాలె. రాజకీయాల జోలికి పోకుండా బిజినెస్‌ చూసుకోవాలె. దానికొప్పుకుంటే మీ చెల్లెలి మ్యారేజ్‌ ఘనంగా జరిపిస్తాను. మీ అమ్మానాన్నలకు కావసినంత డబ్బు ఇస్తాను. వాల్లకు అన్ని సదుపాయాలతో ఇలు కట్టిస్తాను. మీ అన్నకు కావలసిన సాయం చేస్తాను. ఇంకా నీకేం కావాలన్నా అడగొచ్చు. ఇప్పుడే నీ నిర్ణయం చెప్పాల్సిన పని లేదు. ఆలోచించుకొని చెప్పు’’ అని అతని ప్రపోజల్‌ సారాంశం.

తనకు మనసాడలేదు. లేచి వచ్చేసిండు. వచ్చేటప్పుడు అందంగా తయారై నిలబడ్డ సులోచన గేటుదాంక వచ్చి బాయ్‌ చెబుతూ, ‘‘కాదనకు శ్రీను, నువ్వంటే చాలా ఇష్టం నాకు.. లవ్‌ యూ వెరీ మచ్‌ శ్రీను!’’ అని చెప్పింది.

రూంకి వచ్చి మంచంపై పడిపోయిండు. ఎడతెరపి లేని ఆలోచనలు అల్లకల్లోలం చేస్తున్నయి! సులోచన  వాళ్ల అంతస్తు, సులోచన అందం మాయ చేస్తున్నయి. ఏం చేయాల్నో తోచడం లేదు…

అప్పటికే నరేందర్‌ ఊర్లో వ్యవసాయం చేసుకుంటనని ఎళ్లిపోయిండు. సలీమ్‌ వ్యాపారం పెట్టుకున్నడు. శ్రీధర్‌, తను రూం తీసుకొని ఉన్నరు. శ్రీలత ఓ మారుమూల పల్లెటూర్లో టీచర్‌గా పనిచేస్తున్నది. అక్కడే రూం తీసుకుని ఉంటున్నది.

శ్రీధర్‌ వచ్చి ఏమైందని అడిగిండు. వీడికి చెప్తే ఖచ్చితంగా వద్దంటడు. ఒప్పుకోవాల్నో వద్దో తనే నిర్ణయం తీసుకోవాలనుకున్నడు. దాంతో ఏం లేదని చెప్పిండు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిండు.

తెల్లారి సులోచన ఇంటికి వెళ్లి వాళ్ల నాన్నకు ఓకే చెప్పిండు. నెలరోజుల్లో మ్యారేజీ అయిపోవాలని కండిషన్‌ పెట్టిండు. రూం ఖాళీ చేసిండు. పార్టీకి రాజీనామా చేసిండు. అమ్మానాన్నలను ఒప్పించిండు. దోస్తులకు చెప్తే గొడవ చేస్తరని చెప్పకుంటనే పెళ్లి చేసేసుకున్నడు!

చివర్లో తెలిసి హతాశులయ్యిన్రు దోస్తులు. సలీమ్‌ గాడు ఉండలేక వచ్చి గొడవ చేసిండు.

‘‘తప్పలేదురా.. నువ్వేమన్న అనుకో!’’ అన్నడు తను.

‘‘శ్రీలత కెందుకురా అన్యాయం చేసినవ్‌!?’’ అని ఉగ్రంగా అడిగాడు సలీమ్‌. ‘‘తనకు ముసలి తల్లిదండ్రులు తప్ప వెనకా ముందు ఎవరూ లేరనే కదా.. ఆ టీచర్‌ ఉద్యోగం తప్ప తనకేం ఆస్తులు లేవనేగా.. తను గుడ్డిగా నిన్ను ప్రేమించడమే తను చేసిన తప్పా? ఎట్ల వదుకున్నవురా ఆ అమాయకురాలిని?’’

‘‘తనకు కూడా సారీ చెప్పురా.. నేను మాట్లాడలేను!’’ అన్నడు తను.

శ్రీధర్‌ గాడు ఫోన్‌ చేసి ఇష్టమొచ్చినట్లు తిట్టిండు. నరేందర్‌ ఇంతదాకా కాల్‌ గూడా చేయలేదు. శ్రీలతకు తెలిసి షానా ఏడ్చిందని తెలిసింది.

పెళ్లయి ఒక కొడుకు పుట్టాక, ‘నీలాంటి ఒక కొడుకును కనాలని ఉంద’ని శ్రీలత చెప్పడం గుర్తొచ్చింది. నంబర్‌ కనుక్కొని కాల్‌ చేయబోయి మనసు చెల్లక ఊకుండిపోయిండు..

అప్పట్నుంచి ఆ దోస్తులందరినీ వదులుకున్నడు.

సులోచన హుషారయినది. తెలివిగా తన తండ్రికి అనుగుణంగా తనను మార్చిపడేసింది. లగ్జరీ సదుపాయాలకు అలవాటు చేసేసింది. బిజినెస్‌ లన్నింటిలో తనను కీలకం చేస్తూ మెసలకుండా చేసేసింది. తను గూడా తెలిసీ వాటన్నింటినీ స్వీకరించిండు. తన తెలివి నుపయోగించి బిజినెస్‌ను పెంచిండు. ఎందరినో నిర్దాక్షిణ్యంగా తొలగించేసిండు. ఎందరినో అణిచేసిండు. పార్ట్‌నర్స్‌ని తెలివిగా తప్పించిండు. ఒక పార్ట్‌నర్‌ తనకు వేరే ఆధారం లేదని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ బతిలాడుకున్నా కఠినంగా వ్యవహరించి వదిలించుకున్నడు. ఎవరూ అందుకోలేని ఎత్తుకు చేరుకొని ఎవరినీ లెక్కచేయనోడిగ తయారైండు…

***

రెండో రోజు పొద్దున కాలకృత్యాలు తీరగానే ట్యాబ్లెట్లు వేసుకున్నంక తను అన్యాయం చేశాననుకున్న వాళ్ళందరి లిస్టు ఒకటి తయారుచేసిండు శ్రీనివాస్‌. మ్యారేజ్‌కు ఒప్పుకున్నప్పటి నుంచి ఒక్కో పేరు రాసుకుంట వచ్చిండు. షానా పెద్ద లిస్టే తయారైంది! మొదటి పేరు శ్రీలతదే! కళ్లల్లో నీళ్లు తిరిగినయి.

సలీమ్‌ కి కాల్‌ చేసి నంబర్లు అడిగిండు. ‘బిజీగా ఉండి పంపలేదురా. జరసేపట్లో పంపిస్తా’ అని ఒక గంట తర్వాత వరుసగా నెంబర్లు పెట్టిండు. అందులో గూడా మొదటి పేరు శ్రీలతదే. తను మరిచిపోయిన పేర్లు గూడా కొన్ని ఉండడం చూసి సిగ్గనిపించింది!

మొదటి కాల్‌ భోళా దోస్తయిన నరేందర్‌కి చేసిండు. దాదాపు 25 ఏండ్ల తరువాత!

నరేందర్‌ ఫస్టు తనను గుర్తుపట్టలేదు. చెప్పినంక ‘‘ఓ.. నువ్వా.. నీకు నేను గుర్తున్ననా?’’ అన్నడు.

‘‘సారీరా.. నన్ను క్షమించు. నా వల్ల పొరపాట్లు జరిగిపోయినయి’’ అన్నడు శ్రీనివాస్‌.

నరేందర్‌ ఆశ్చర్యంగా ‘‘అదేం మాటరా.. సరేలే.. ఇప్పుడెట్ల ఉన్నవు?’’ అన్నడు.

బాగనే ఉన్ననని కరోనా ముచ్చటేమీ చెప్పకుండా, నరేందర్‌ బాగోగులన్నీ అడిగిండు శ్రీనివాస్‌. ‘చేస్తున్నది వ్యవసాయం కదరా.. నెట్టుకొస్తున్నా’ అన్నడు. గుచ్చి గుచ్చి తన అప్పు గురించి, బిడ్డ పెండ్లికున్న సంగతి తెలుసుకున్నడు శ్రీనివాస్‌. ‘నీ బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ ఇవ్వురా!’ అనడిగిండు.

‘‘ఎందుకురా.. ఏమొద్దులే..’’ అన్నడు నరేందర్‌ మొహమాటంగ.

‘‘ఇవ్వరా.. నా వ్యాపారంలో ఈ మధ్య బోలెడు లాభాలు వచ్చినయ్‌రా.. మన ఫ్రెండ్స్‌కి సాయం చేద్దామని డిసైడ్‌ అయిన. కాదనొద్దురా.. ప్లీజ్‌!’’ అని సమ్జాయించి అకౌంట్‌ నంబర్‌ మెసేజ్‌ పెట్టించుకొన్నడు.

అప్పు, బిడ్డ పెండ్లి లెక్కలేసి పెద్ద అమౌంటే అయినా బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసి కాల్‌ చేసి చెప్పిండు.

నరేందర్‌ కండ్లనీళ్లు పెట్టుకున్నడు. ‘‘ఈ కరోనా గొడవ, లాక్‌డౌన్‌ అయిపోంగనే వచ్చి కలుస్తరా.. షానా షానా థ్యాంక్స్‌ రా..’’ అంటుంటే వాడి గొంతు పూడుకుపోయింది!

తర్వాతి వంతు శ్రీధర్‌ది. వాడికి ఫోన్‌ చేస్తే-

‘‘మల్లెందుకు ఫోన్‌ చేసినవురా.. సిగ్గున్నాదిరా నీకు! స్వార్థపరుడా! నీతోపాటు మా బతుకు కూడా నాశనం చేస్తివి కదరా.. నువ్వు మాత్రం కార్లల్ల తిరుక్కుంట బంగ్లల్ల కులుకుతున్నవా.. థూ!’’ అంటూ తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిండు. అయినా ఓపికగా విన్నడు శ్రీనివాస్‌. దుఃఖం తన్నుకు వచ్చింది. గొంతు పెగుల్చుకొని-

‘‘సారీరా.. నువ్వు చెప్పేవన్నీ కరెక్టే! ఇన్నాళ్లకు రియలైజ్‌ అయినరా.. నన్ను క్షమించు’’ అన్నడు.

‘‘ఇప్పుడు రియలైజ్‌ అయితే ఏం లాభంరా బట్టెబాజిగా! నీ వల్ల మేం నాశనమైనం. నువ్వు చెప్పినవే పాటించి మేం ఎటూ కాకుంటయినం. నువ్వేమో అవన్నీ వదిలేసి మేడలెక్కినవ్‌. ఆఖరికి నిన్ను గుడ్డిగ ప్రేమించిన ఆడపిల్లను గూడ మోసం చేస్తివి కదరా.. థూ.. నీ బతుకు చెడ! మల్ల ఫోన్‌ చేసినావ్‌ ఎంతబాగా..’’

‘‘తిట్టురా.. ఎంతసేపు తిడతావో తిట్టు.. అన్నీ పడతాను’’ అన్నడు శ్రీనివాస్‌.

‘‘ఇంకేం తిట్టమంటవ్‌.. ఇప్పుడు తిట్టినా ఏం లాభం.. బతుకులే చెడ్డంక. అంతా అయిపోయినంక. చెప్పు, ఎందుకు కాల్‌ చేసినవో..’’ అన్నడు విసురుగా.

‘‘అరేయ్‌ శ్రీధర్‌! చివరిదాంక నాకు వండి పెట్టినవ్‌. నీ చేతి వంట తిన్నవాణ్ని. నాకేం ఇష్టమో నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నువ్వు నా మనసెరిగినోడివి. నేనే మధ్యలో చెడిపోయినరా..’’

‘‘సర్లే, సక్కదనం గనీ.. సంగతేందో చెప్పు!’’

‘‘ఏం లేదురా.. నాకు కోవిడ్‌ సోకింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నా.’’

‘‘అరెరె.. అదేందిరా.. అంత జాగ్రత్తపరుడివి. నువ్వెందుకు దాని బారినపడ్డవురా.. ఇప్పుడెట్లుంది?!’’

‘‘కోలుకుంటున్నరా.. బీపీ షుగర్‌ లున్నయి. షానా జాగ్రత్త పడాల్సి వస్తున్నది.’’

‘‘ఓహ్.. సారీరా.. సారీరా.. ఏంగాదు.. నువ్వు గట్టోడివి. నువ్వు కోలుకుంటవు. ఏం గాదు. భయపడకు!’’

‘‘భయం కాదులే.. అందరినీ ఒకసారి పలకరించాలని ఫోన్లు చేస్తున్నా. నా తప్పు పట్ల రియలైజ్‌  అయిన. కానీ ఆలస్యమైపోయింది. కరోనా నన్ను మనిషిని చేసింది. నిన్న సలీమ్‌ కాల్‌ చేసిండు. చాలా సంతోషమేసింది. షానాసేపు మాట్లాడుకున్నం. వాడే నీ నెంబర్‌ ఇచ్చిండు.’’

‘‘అవునా.. వాడి కష్టాలు అన్నీ ఇన్నీ కావురా. ఎవరికీ చెప్పడు. ఇద్దరు చెల్లెండ్ల పెండ్లిళ్లు చేసిండు. మస్తు అప్పులైనయ్‌. అరిగోస పడుతుంటడు. అయినా ఎవర్నీ మర్షిపోకుండా అందర్నీ పకరిస్తుంటడు.’’

‘‘అవునా.. వాడి ఇబ్బందులేంటో వివరంగ చెప్పు’’ అని ప్యాడ్‌ తీసుకున్నడు శ్రీనివాస్‌.

శ్రీధర్‌ చెప్తుంటే నోట్‌ చేసుకున్నడు. ఆఖరికి శ్రీధర్‌ ఇబ్బందులు గూడా తెలుసుకున్నడు. బ్యాంక్‌ అకౌంట్‌ అడిగితే వాడు ఎంతకూ ఇవ్వనన్నడు. బతిలాడంగ ఆఖరికి ఇచ్చిండు. శ్రీధర్‌ అప్పులు వాడి పరిస్థితులు లెక్క కట్టి అకౌంట్‌ లో అంత అమౌంట్‌ వేసిండు.

ఆ లెక్కనే సలీమ్‌కి కూడా పెద్ద మొత్తమే సాయం చేసిండు. సలీమ్‌ కళ్లనీళ్ల పర్యంతమయ్యిండు.

తర్వాత శ్రీలతకు కాల్‌ చేసిండు. ఎత్తలేదు. ఎందుకా అని మదనపడ్డడు. మల్ల మల్ల చేసిండు. బహుశా తన ఇంటిపేరుతో సహా ట్రూకాలర్‌లో పడుతుంది. చూసి ఎత్తడం లేదేమో అనుకున్నడు.

***

 

మరునాడు కొన్ని షేర్లు కాన్సిల్‌ చేసుకొని మనీ తన అకౌంట్‌లో వేయించుకున్నడు.

ఎవరినైతే కఠినంగా తమ బిజినెస్‌ పార్ట్‌నర్‌ షిప్‌ నుంచి తొలగించిండో అతనికి కాల్‌ చేసి అతని గురించి తెలుసుకున్నడు. అతను చితికిపోయి ఉన్నడు. అతనికి కావసినంత సాయం పంపించిండు.

అలాగే తన బిజినెస్‌ ప్రస్థానంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి అన్యాయం చేసినట్లు గుర్తొచ్చిందో వాళ్లందరినీ కాంటాక్ట్‌ చేసి ఆదుకున్నడు.

ఆ ప్రాసెస్‌లో తను ఎంత కఠినంగా, క్యాలిక్యులేటెడ్‌గా, జాలి, దయ లేకుండా వ్యవహరించిండో గుర్తు చేసుకుంట కుమిలిపోయిండు. మరో రెండు రోజులు పట్టింది తను రాసుకున్న లిస్ట్‌లో అందరినీ పలకరిస్తానికి. అందులో ముగ్గురు చనిపోయిన్రు! షానా బాధేసింది. వాళ్ల ఇంటివాళ్లకు సాయం పంపించిండు. ఆ రెండు రోజు గూడా శ్రీలతకు కాల్‌ చేస్తనే ఉన్నడు. తను ఎత్తనే లేదు.

ఆ రోజు ఉదయం కాలకృత్యాలు తీరంగనే శ్రీలతకు ఫోన్‌ కలిపిండు. ఆశ్చర్యంగా తను ఫోన్‌ ఎత్తింది. నోట మాట రాలేదు శ్రీనివాస్‌కి. అవతల్నుంచి ‘హలో హలో’ అంటున్నది శ్రీత.

25 ఏండ్ల కింద విన్న గొంతు!

పూడుకుపోయిన గొంతుతో-

‘‘నేను లతా! శ్రీను ని’’ అన్నడు.

కొన్ని క్షణాల మౌనం తర్వాత-

‘‘ఇన్నాళ్లకు గుర్తొచ్చిన్నా?! ఇప్పుడెందుకు ఫోన్‌ చేయడం?’’

‘‘సారీ చెప్పాలనిపించింది లతా!’’

‘‘హుఁ.. సారీతో చెరిగిపోయేదా నువ్వు చేసిన పాపం? నాతో అన్ని రకాలుగా కలిసి మెలిసి తిరిగి ఒక్క మాటన్నా చెప్పకుండా నువ్వు చేసిన తప్పు అంత చిన్నదనుకుంటున్నవా?’’

ఏం మాట్లాడాల్నో గొంతు పెగలలేదు శ్రీనివాస్‌కి.

‘‘వెరీ సారీ లతా!’’ అన్నడు నీరసంగా.

‘‘తొంభై ఏళ్లు గుర్తుండే సావాసాన్ని తొమ్మిది గంటల్లో చంపేసినోడివి. విప్లవం ఇచ్చిన చైతన్యాన్ని స్వార్థానికి వాడుకున్నవాడివి. నీలాంటి వాళ్ల వల్లే విప్లవాలు, ఈ దేశం ఇట్లా ఏడ్చినయి..’’

‘‘ప్లీజ్‌ లతా…’’

‘‘విప్లవవాది మాజీ అయ్యిండంటే వాడికన్నా డేంజర్‌ ఎవడుండడు!’’

‘‘లతా! నన్ను క్షమించు! ప్లీ..జ్‌!’’ దుఃఖంతో పూడుకుపోయింది శ్రీనివాస్‌ గొంతు. గుండెల్లో ఏదో నొప్పి.

‘‘నీలాంటి నీచుడిని ఈ జన్మకు క్షమించలేను!’’ ఫోన్‌ కట్‌ చేసింది శ్రీలత.

ఆ మాట విని కాలు నిలువని బేచైనీలో నిలబడి ఉన్న శ్రీనివాస్‌ గుండె ఆగిపోయింది! కుప్పకూలిపోయిండు!

*

 

స్కైబాబ

15 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎప్పుడూ కాలంతో సమానంగా పరిగెత్తే రచయితల్లో మీరు ముందుంటారు. ఇప్పుడూ అంతే. కథ చాలా హృద్యంగా ఉంది. ముగింపు ఊహించలేదు. కానీ తప్పదు. చావు నా మీదకే వస్తుందా అని భయ పెట్టింది కూడా ఈ కథ. అభినందనలు అన్నయ్య.

    • థాంక్యూ రా మానసా🌱
      నా కథ వచ్చిందంటే వెంటనే చదివి స్పందిస్తావు.. నా కథల్ని అభిమానించే నీలాంటి కొత్తతరం కథకురాలు ఉండడం నిజంగా హ్యాపీ రా 🍀

  • సమకాలీనతను చాటిన కధ. స్కై బాబా గారికి శుభాకాంక్షలు

  • కథ అంతా బాగుంది. ముగింపులో శ్రీ లత వెంజెన్స్ కూడా బాగుంది. కానీ కొంచెం సినిమా టిక్ గా ఉంది. సులోచన… సంగతి..

  • స్వార్ధం అనేది అన్నంటికన్నా పెద్ద జబ్బు. మీ కథలో అది చాలా స్పష్టంగా నిర్వచించారు.

    కథ, కథనం పక్కకి పెడితే … స్నేహం, దాని విలువ, స్నేహాన్ని హేళన చేస్తే పడాల్సిన కష్టాలు చాలా బాగా చెప్పారు.

    ఆగస్ట్ 15న శ్రీనివాస్ కి తన స్వార్ధపు ఆలోచన నుంచి విముక్తి వచ్చింది అనుకున్న క్షణంలోనే … శ్రీలత మాటలతో ఏకంగా షాక్ ఇచ్చారు. సూపర్బ్ సర్!! 👍

  • బహుత్ షుక్రియా Panthangi Rambabu గారు, Mounika గారు, GKD Prasad అన్నా!

    ప్రభు అన్నా! సినిమాటిక్ అనిపించే అవకాశముంది. చాలా సందర్భాల్లో అలా జరుగుతుంది కదా! షుక్రియా🌱

    Swapna Peri గారూ!
    స్నేహం అంటే చాలా ఇష్టం నాకు. స్నేహాన్ని మోసం చేసేవారు చాలా డేంజరస్ కదా! అందుకే ఆ కోణం బాగా వచ్చింది అనుకుంటా🌿 షుక్రియా🌱

  • డబ్బు మనుషుల మధ్య స్నేహాన్ని అనుబంధాలను ఎలా దూరం చేస్తుందో కరోనా కాలం వాహికగా రాయడం బావుంది. ఈ కథ ఒక్కరికి కనువిప్పు కలిగించినా రచయిత సక్సెస్ అయినట్టే! కాలాన్ని చేజార్చుకోక ముందే స్నేహాన్ని నిలబెట్టుకోవాలని సూచించడం సరైనది.

  • కథ ఆసాంతం చదవడం లొ పరిగెత్తించిది.. గొప్పగా ఉంది… ముగింపు నాకెందుకో జీర్ణం కాలేదు….

  • మంచి కథ రాశారు అన్నా. చదువుతుంటే అట్లా అక్షరాల వెంట వెళ్లిపోయాను. కరోనా పశ్చాత్తాపాన్ని, విషాదాన్ని మిగిల్చింది. శ్రీలత గుర్తుండిపోయే పాత్ర.

  • ‘ఐసోలేషన్ ‘..గొప్ప కథ కాదు, కానీ వాస్తవం. వాస్తవం ఎప్పుడూ గొప్పగా అనిపించదు. గుండె ని తడి చేస్తుంది. గాయం చేస్తుంది. నిజాలను కక్కిస్తుంది. జ్ఞాపకాలను రగిలిస్తుంది. గతాన్ని తవ్వి తీస్తుంది. ‘కరోనా ‘..నిజానికి మనకు మంచి చేసేనో, చెడు చేసేనో?! పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. అయినా చివరికి శ్రీను బలయ్యాడు. ఇది డ్రమెటిక్ గా అనిపించినా, ఇందులో కొంత ఒకరికి చేసిన అన్యాయానికి ఇదే సరైన ముగింపు కావచ్చు. రచయిత కు అభినందనలు.

  • Thanks to shajahana & సంఘీర్!
    కరీమ్ ఖాన్ భాయ్! కొన్నిసార్లు కొన్ని ముగింపులు మనకు నచ్చవు. కానీ ఏమీ చేయలేము.
    గురుప్రసాద్ గారూ, శ్రీనివాస్ లు ఒక్కరు కాదు, మన మధ్య ఎందరో ఉన్నారు! థాంక్యూ సర్🌺🍀

  • బాగుంది సార్…
    ముగింపు తో గుండె బరువెక్కిపోయింది .

  • విప్లవవాది మాజీ అయ్యిండంటే వాడికన్నా డేంజర్‌ ఎవడుండడు! …

    … అంతే నంటారా సార్..

    నిజమే. ఈ కథలో మీరు చెప్పినట్టు ఇపుడు ప్రతిఒక్కరూ ఆగి ఆలోచించాల్సిన సందర్భం ఇది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు