కవిత్వంలో శబ్దమూ నిశ్శబ్దమూ?!

గమనిక: వివిధ సాహిత్య అంశాలపై ప్రతి నెలా ఒక చర్చని ఆహ్వానిస్తున్నాం. ఈ నెల చర్చ నిర్వాహకులు నారాయణస్వామి వెంకటయోగి. కవిత్వంలో శబ్దమూ నిశ్శబ్దమూ అనే అంశం మీద ఇవి స్వామి అభిప్రాయాలు. మీరు మీ అభిప్రాయాలని కూడా ఇక్కడ వ్యాఖ్యలుగా రాయండి.

మాటలిక చాలు దోస్త్!

నువ్విపుడు చెవుల్ని

చూసేటట్టు చెయ్యి.  

ఇక నీ మిగతా పద్యాన్ని

ఆ భాషలోనే  చెప్పు.  

–        రూమి

నిజమే కొన్ని సార్లు కవిత్వం రాస్తున్నపుడు మాటలు చాలు అనిపిస్తుంది. చెవులకు చూపు వస్తే ఏమవుతుంది. నిశ్శబ్దం కనిపిస్తుంది.అనేక దృశ్యాలు చూపిస్తుంది. వేల మాటలు చెప్పే అర్థాలను నిశ్శబ్దం దృశ్యమానం చేస్తుంది. కవిత్వం చదివేటప్పుడు కూడా అంతే .  అయ్యో ఈ కవి ఈ కవితను ఇక్కడ ఆపేస్తే బాగుండేది కదా. ఆపేసి ఇప్పటిదాకా తను మాటల్లో చెప్పింది మనను నిశ్శబ్దంలో అనుభవించనిస్తే బాగుండేది కదా అనిపిస్తుంది.

రూమి కవిత్వంలో నిశ్శబ్దాన్ని గురించి అద్భుతంగా చెప్తాడు.

నిశ్శబ్దంగా ఉండిక!  

కీర్తించే పద్యాలు వీలైనంత  తక్కువగా చెప్పు.

నువ్వే జీవించే కవిత్వమై పో !  

నిజమే కదా ఊరికే ఎంతసేపు కవులు ప్రేమను, కీర్తనను, ఆగ్రహాన్ని, అభిశంసనను దుఃఖాన్ని , వేదనను అనేకానేక మాటల్లో, పదచిత్రాల్లో, వాక్యాల్లో  చెప్పి మనను ఆ శబ్దమయ కవితా ప్రపంచం లోనికి తీసుకెళతారు? వాళ్ళు నిశ్శబ్దంగా ఉండి  వాళ్ళే ఆ కవిత్వమై జీవిస్తే, వాళ్ళ కవిత్వమే వాళ్ళని జీవిస్తే  ఎంత అద్భుతంగా ఉంటుందో కదా.

ఈ పద్యాన్ని ఇక నిడివి తగ్గించేయాలి! 

ఎందుకంటేమిగతాది, 

మన కళ్ళల్లో ని ప్రపంచమే చెప్తుంది. 

పద్యం అట్లా రాస్తూ పోవచ్చు. ఎంతో పొడుగ్గా వాక్యాల మీద వాక్యాలు పేరుస్తూ, పదచిత్రాల మీద పదచిత్రాలు పేరుస్తూ రాసుకుంటూ పోవచ్చు. కానీ పద్యం నిడివి ఎక్కడ  తగ్గించాలో పద్యం ఎక్కడ ఆపాలో,  ఎంతసేపు పొడిగించాలో కవికి తెలిసి ఉండాలి.  కవి తన కవిత తో పాఠకుల మనసులో ఒక ప్రపంచం సృష్టిస్తాడు. ఇక కవి మాట్లాడడం ఆపేస్తే ఆ కవిత్వ ప్రపంచం పాఠకునితో మాట్లాడుతుంది.

అంటే ఇక కవి చెయ్యాల్సిన పని కవితను ఆపేసి, లేదా నిడివి తగ్గించేసి పాఠకులతో సంభాషించడమే.

కవి తన కవితలో తన ఆలోచనలను,  భావావేశాన్ని, కవితా ప్రవాహ ధారను చెప్తూ పోవాలా లేదా ఎక్కడైనా ఆపి పాఠకులకు కొంచెం సేపు నిశ్శబ్దాన్ని, ఆలోచించుకునే వ్యవధినీ ఇవ్వాలా వద్దా అనేది కవిత్వం ఆరంభమైనప్పటి నుండి, ముఖ్యంగా ఆధునిక కవిత్వం ఆరంభం ఐనప్పటినుండి  జరుగుతున్న చర్చనే.

అట్లే కవిత్వంలో నిశ్శబ్దం తో పాటు, పొదుపైన మాటల ఉపయోగమూ, పద్యాల నిడివి తగ్గించడమూ ఇవన్నింటితో పాటు కవిత్వంలో నిగూఢత అవసరం అని,  మొత్తం కవి విప్పి చెప్పేస్తె ఇక పాఠకునికి మిగిలిందేమిటి అనే చర్చ కూడా విస్తృతంగా జరిగింది.

ఇంతకీ నిగూఢత అంటే యేమిటి అది ఎందుకవసరం? అన్ని సార్లూ నిగూఢత, నిశ్శబ్దం కవితలో  అవసరమేనా ?

ఈ ప్రశ్నలు ఎన్ని సార్లు వేసుకున్నా సమాధానాలు అంత సులభంగా దొరకవు.

నిశ్శబ్దం అంటే కవి ఇంక తన కవిత లో మాట్లాడ్డం ఆపేసి పాఠకున్ని ఊహించుకోనివ్వాలి. పాఠకుని ప్రపంచాన్ని తన కవిత తో, కవిత సృష్టించిన ప్రపంచం తో  నింపేసి,  పాఠకుణ్ణి వదిలెయ్యాలి.

‘కవి తను చెప్పాల్సిందేదో చెప్పేసి ఇంత మౌనానికీ ధ్యానానికీ కార్యాలకీ విజయాలకీ వ్యవధినివ్వరాదా’ అని చెలం ఎప్పుడో అడిగారు కూడా.

అయినా ఇవాళ్ళ మళ్ళా చర్చించుకుంటున్నాం. నిజానికి చర్చించుకోవాలి కూడా. ఎందుకంటే ఈ ప్రశ్నలకు అని కాలాల్లో అన్ని స్థలాల్లో సంతృప్తి కలిగించే సమాధానాలు దొరకవు. ఈ ప్రశ్నలకు విశ్వజనీనమైన సమాధానాలు లేవు.

ఇవేమిటీ వింత భయాలు?

    -ఇంట్లో చీకటి!

  ఇవేమిటీ అపస్వరాలు?

    -తెగింది తీగ!

  అవేమిటా రంగుల నీడలు?

    -చావూ, బ్రదుకూ! 

   ఎచటికి పోతా వీ రాత్రి?

    -అవతలి గట్టుకు!

పై అద్బుతమైన కవితలో ఎంత క్లుప్తతనో యెంత నిశ్శబ్దమో యెంత నిగూఢతనో మరికొన్ని కవితల్లో అంతగా విడమర్చి చెప్పడం. అంత  ఎందుకూ,  ‘కవితా ఓ కవితా’   నే తీసుకోండి. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని పదచిత్రాలు  ఎన్ని వాక్యాలు ఎంత సంగీతం – అందులో నిగూఢమైన వాక్యాలు లేవా?  అంటే ఎన్నో – ‘అగ్ని సరస్సున వికసించిన వజ్రం’, ‘ ఎగిరే లోహ శ్యేనం’, ‘ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాదం’  – ఇట్లా ఎన్నో ఎన్నెన్నో…

కవిత్వమంటే ప్రతిసారీ ఇట్లానే ఉండాలి కవి యెప్పుడూ ఇట్లా నే స్పందించాలి,  ఇట్లా నిగూఢంగానే   రాయాలి అని విశ్వజనీనంగా  సూత్రాలు ఏర్పాటు చెయ్యడం అసందర్భమూ అనవసరమూ కూడా.

నిజమే కవిత్వం లో  అనవసర పదాలు వాక్యాలు ఉండగూడదు. నిడివి అనవసరంగా పొడుగ్గా ఉండకూడదు.  వీలైనంత నిగూఢంగా ఉండాలి. ఇందులో  ఎవరికీ భేదాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు.

కానీ ప్రతిసారీ ఒక సంఘటనకు స్పందనగానో ఒక వస్తువును, ఆలోచననను  ప్రతిఫలిస్తూనో రాసే కవితలు ఇట్లానే రాయాలి అని దిశనిర్దేశాలు చెయ్యడం సరైంది కాదేమో ..

ఉదాహరణకు – నిన్న గాక మొన్న గడ్చిరోలి లో జరిగిన దారుణమైన హత్యాకాండ నే తీసుకోండి – దానికి ప్రతిస్పందనగా నిగూఢంగా మాత్రమే రాయాలి కవితలో నిశ్శబ్దమే మాట్లాడాలి అంటూ నియమాలు ఏర్పాటు చేస్తే,  కవుల సహజ భావావేశ  ప్రవాహధారకు అడ్డుకట్ట వేసి,  ఒక ఆగ్రహ జలపాతంగా కవిత్వం పెల్లుబుకడానికి అడ్డుకట్ట వేస్తున్నట్టే కదా. అట్లే ,  “కవులు ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయా ఎప్పుడు కవిత్వం రాద్దామా అని పెన్ను పట్టుకుని (ఇప్పుడు కంప్యూటర్ ముందు ) రడీ గా ఉండాలా?”  అనే అత్యంత అన్యాయమైన ప్రశ్నకు మనం న్యాయ బద్దత ను కలిగించకూడదు. ఇట్లాంటి సంఘటనలు,  ముఖ్యంగా పదుల సంఖ్యలో ప్రజల కోసం పాటుబడే వాళ్ళు హత్య చెయ్యబడడం,  వాళ్ళ పార్థివ శరీరాలు నంబర్లు తగిలించి తార్పోలిన్ మీద పడేసిన దృశ్యాలు చూస్తే  ఆ రాజకీయాలతో సంబంధం లేకున్నా  మానవత్వం ఉన్న యే కవి హృదయం  లో అయినా కవిత్వం పొంగడం సహజం. దానికి కట్టలు వేసి నియమాల సంకెళ్ళలో బంధించాల్సిన అవసరం లేదు. పైగా వీటిని చూసి వెంటనే రాయకూడదు,  చాలా  రోజులు ఆగి,  ఆ సంఘటన మన మనసుల్లో మాగిన తర్వాత నిగూఢంగా రాయాలి అని నియమాలు యేర్పర్చడం అర్థ రహితం.

అట్లే మరో  ఉదాహరణ , ఇంట్లో పనిచేసే పనిపిల్ల దైన్యం గురించి ఆమె మీద అణచివేత గురించి కూడా కవి మానసిక స్తితి ని బట్టి కవిత రావచ్చు . ఆ పనిపిల్ల పడే వేదనను చూసి తక్షణం స్పందించి కవిత రాయొచ్చు  లేదా చాల రోజులు  మనసులో మధన పడి మాగి మాగి కవిత రావచ్చు. రెండూ శక్తివంతంగా ఉండొచ్చు. రెంటి లోనూ నిగూఢతా, నిశ్శబ్దమూ ఉండొచ్చు. ఇట్లే రాయాలనీ , ఇదే గొప్ప కవితనీ  తీర్పు లివ్వడం, కవులకు చెప్పడం  ఎట్లా సాధ్యం? చెప్పినా అందులో నిష్పాక్షికత యెట్లా వీలవుతుంది. కొన్నిసార్లు  ఇటువంటి అభిప్రాయాలు విమర్శకులు ముందే యేర్పర్చుకున్న పాక్షిక అభిప్రాయాల వల్ల పెట్టుకున్న నల్ల కళ్ళద్దాల చాటునుండి వెలిబుచ్చుతూ ఉంటారు.

ఐతే ఒకటి మాత్రం నిజం – ఆధునిక ప్రపంచం శబ్ద ప్రపంచం. ఉట్టి శబ్దాలే కాదు – దృశ్యాలు, ఇమేజెస్, వీడియోలు ఒకటేమిటి మనిషి అన్ని ఇంద్రియాలనూ వశం చేసుకుని,  ఆధిపత్యం చలాయించి స్వారీ చేస్తున్న సామాజిక మాధ్యమాల హోరులో కవి రాస్తున్న కవిత్వం కొట్టుకు పోకూడదు. మనకు అనుభూతి లొకి వచ్చే ప్రతి ఒకటీ లిప్తపాటులో మాయమౌతున్న సందర్భం లో మనకు శాశ్వత అనుభూతి ని మిగిల్చగలిగేది  కవిత్వమొక్కటే . ఇటువంటప్పుడు కవి మునుపటి కన్నా ఇప్పుడు రూపం మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. సామాజిక మాధ్యమాల శబ్ద ప్రవాహాల హోరులో కవిత్వం కొట్టుకు పోయే ప్రమాదంనుంచి తప్పించుకోవాలి.

తన కవిత్వం ప్రత్యేక ముద్ర వేయాలంటే వీలైనంత నిశ్శబ్దంగా నిగూఢంగా ఉంటేనే పాఠకుల మనసులపై చెరగని చిరకాల ముద్ర వేస్తుందేమో ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు రాస్తున్న ప్రతి కవికీ ఉన్నది. యేమైనా ఈ క్షణభంగురమైన అనుభూతుల డిజిటల్ ప్రపంచం లో చిరకాలం మిగిలే  అనుభూతుల్నిచ్చే కవిత్వాన్ని రాసే ప్రయత్నం కవులు చేయాల్సి ఉన్నది.

 

నారాయణ స్వామి వెంకట యోగి

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత్వంలో నిశ్శబ్దం.. హృదయ స్పందన గొప్పగా అనువదించబడింది.

    • నెనర్లు సుధాకర్. నీ కవిత్వం లో నిశ్శబ్దమూ నిగూఢత్వమూ గురించి నీ అనుభవాలు చెప్తే నాలాంటి వాడికి నేర్చుకునే వీలుంది.

    • నెనర్లు పద్మ గారూ – మీరు చదివిన కవితల్లో ఈ అంశాలు ఎట్లా ప్రతిఫలించినాయి అని మాతో పంచుకుంటే బాగుంటుంది.

  • కవిత్వం లో శబ్ద నిశ్శబ్దాల చర్చ వ్యాసం బాగుంది.రెండు ముఖ్యమే అని అనిపింపచేసింది.అభినందనలు యోగి గారు

    • నెనర్లు రాజారామ్ గారూ – అనుభవజ్ఞులైన విమర్శకులు మీకు నచ్చడం సంతోషం.

  • కవిత్వం లోశబ్దానికనిశ్శబ్దాని కీ ఒకే ప్రయోజనం ఒకేఅర్థం. నిశ్శబ్దం ఒక్కోసారి విస్పోటనం చెంది విశ్వాన్ని నివ్వెర పరుస్తుంది. శబ్దం మరోసారి మౌన రాగమయి రాళ్ళ గుట్టలను సైతం మంచులా కరిగిస్తుంది. ” ఇంత మౌనానికి, ధ్యానానికి చొటివ్వండని అడిగాడుచెలం. “ఎమోషన్స్ రికలెక్టెడ్ ఇన్ ట్రాన్ఖ్విలిటీ “ అన్నాడు వర్డ్స్వర్త్. ఆ ఇద్దరి మాటల వెనుక ఉన్న నిఘూఢత్వాన్ని చక్కగా విప్పి న నారాయణ స్వామి గారికి అభినందనలు.

    • రాజేంద్రబాబు గారు మీకు నచ్చినందుకు సంతోషం. మీ అభిప్రాయానికి నెనర్లు.

  • ఇది నిజానికి చర్చ కాదు. కవిత్వానికి సంబంధించిన భిన్న ప్రయోజనాలకు సంబంధించిన దృక్కోణాల ఘర్షణ. ఎవరైనా కవిత్వం ఇలాగే రాయాలంటే నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది. రాసిన పద్ధతిలో నిజాయితీ వుందా లేదా, అనుభూతి ఎంచుకున్న భాష వ్యక్తీకరణల సంగమంతో కవిత్వంలో భావోద్వేగం పలికిందా లేదా అనేది కవిత చదివినప్పుడే తెలుస్తుంది. పదచిత్రాలతో కవిత్వం రాస్తే ఇదేమిటి ఈ పదచిత్రాల ర్యాలీ అంటే నాకు నవ్వొస్తుంది. అలాగే పదచిత్రాలు లేని కవిత్వం ఏం కవిత్వం అంటే కూడా అజ్ఞానమే. భావం నిగూఢంగా వుంచాలి అంటే ఎందుకుంచాలి? అదేమైనా సస్పెన్స్ థ్రిల్లరా? పాఠకుడికి మెంటల్ ఇంపొజిషన్ ఇస్తున్నావా కవీ? అని అడగబుద్ధి అవుతుంది.

    కవిత్వం స్పష్ఠంగా వుంటే ఇంకేముంది? అంటే అస్పష్ఠంగా నే కవిత్వం రాయాలని తీర్మానించినట్లౌతుంది. నేను కూడా కవిగా ఒక విషయం అంగీకరించాలి. నేను రాసే పద్ధతి నిజానికి నేను ఎంచుకున్నది కాదు. అది నాకు స్వాభావికంగా అలవడ్డది. వాస్తవాన్ని, దానికి సంబంధించిన నా దృష్ఠికోణాన్ని ప్రతీకాత్మకంగానో, పదచిత్రాల ద్వారానో కవిత్వం చేయటం నేను ఆలోచించి అలవరచుకున్నది కాదు. అది నా పద్ధతి. మరో రకంగా రాయటం నాకు చేతకాదు. నాకు చేతనైన పద్ధతి మాత్రమే కరెక్టనుకోవటం మించిన అజ్ఞానం మరొకటి లేదు. అలాగే స్వామీ నీకో పద్ధతి వుంటుంది. వస్తువు పట్ల నీ పరిశీలన, నీ జ్ఞానం, అనుభవం, నీ సృజనాత్మకస్థాయి, ఆ వస్తువుతో నీకున్న రాగద్వేషాల భావోద్వేగాల స్థాయి నీ కవితకో రూపాన్నిస్తాయి. నువ్వలా రాయకూడదనటం లేదా అలా రాస్తే అది కవిత్వం ఎలా అవుతుందనటం మినీ నియంతృత్వమే. కవిత్వంలో ఇంక రాజకీయాలుండటం తప్పట. కవిత్వంలో రాజకీయాలుండ కూడదు అనటాన్ని మించిన రాజకీయం మరొకటి లేదు.

    “ఏమైనా నీ కవిత్వంలో లోతు తక్కువరా అబ్బాయి” అంటే అదో పద్ధతి. సంఘటనలకి స్పందించి రాయటం తప్పట. ఎవరైనా సంఘటనలకి మాత్రమే స్పందించి సంఘటనని మాత్రమే రాయటం వల్ల ప్రయోజనం లేదు. నిజానికి ప్రతి సంఘటన ఒక పరిణామ క్రమంలో భాగమే. ఆ ప్రాసెస్ని కవిత్వంలో చూపించగలిగితే బాగానే వుంటుంది అని మహా అయితే సలహా ఇవ్వొచ్చు. కానీ రాయకూడదని దబాయిస్తే ఎలా మిత్రమా? ఇదివరకు నన్నో మిత్రుడడిగాడు “నువ్వు సంఘటనలకి స్పందించి రాస్తుంటావు. కానీ ఒక పాతికేళ్ళ తరువాత లేదా ఓ వందేళ్ళ తరువాత ఆ సంఘటనలు కనుమరుగై పోయి జనం మర్చిపోతే నీ కవిత్వానికి వున్న విలువేంటి?” అని అడిగాడు. నా సమాధానం ఏమిటంటే “ఏ సంఘటనలకి స్పందించి నేను కవిత్వం రాస్తున్నానో ఆ సంఘటనలు పునరావృతం కాకూడదని, నా కవిత్వం చిరస్తాయిగా వుండకూడదని, కవిత్వంలో దీర్ఘ కాలిక ప్రణాళికలు వేసుకోవటం దుర్మార్గమని, కవిత్వాన్ని ప్రత్యేకంగా బతికించకూడదని, దానంతట అది బతకాలి” అని నా అభిప్రాయం చెప్పాను. ఇప్పటికీ అదే చెబుతాను. నా కవిత్వం కాలక్రమంలో తన ప్రాసంగితని కోల్పోవాలి.

    • అరణ్యా – సమయం తీసుకుని నీ అభిప్రాయం రాసినందుకు నెనర్లు. నువ్వన్న విషయాలతో నాకు దాదాపు ఏకీభావం ఉంది – ఐతే నీ కవిత్వం కాలక్రమంలో ప్రాసంగికత కోల్పోవాలని నేను కోరుకుంటాను అన్నావు – అది కొంచెం ఆలోచించాల్సిన విషయం – కవిత్వం లో నిర్దిష్టత విశ్వజనీనత సమకాలీనత సార్వజనీనత ఉండాలని మనందరం ఒప్పుకుంటున్న విషయమే కదా. అంటే ఒక ప్రత్యేకమైన సంఘటనకు స్పందించి నువ్వు కవిత్వం రాస్తే అది బలంగా పాఠకుల మనసులో ముద్ర వేయాలంటే కదిలించాలంటే అందులో ఏదైనా విశ్వజనీనత ఉండాలి – లేదా ఒక ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన వస్తువు గురించి రాస్తే ఆ కవిత మరో ప్రాంతం వారు చదివి ఏకీభవించడానికి వాళ్ళమీద ప్రభావం నెరపడానికి అందులో ఏదైనా ఒక విశ్వజనీన (యూనివర్సల్) అంశం ఉండాలి కదా. అటువంటప్పుడు కవిత నిలబడుతుంది కదా. నువ్వు రాసిన కవిత ఆ ప్రత్యేక సంఘటన గురించి ఆ ప్రత్యేక ప్రాంతమా గురించి ఆ ప్రత్యేక సందర్భం గురించి మాత్రమే ఐతే అందులో అందరూ అన్వయించుకోవలసిన తాత్త్విక అంశమేదీ లేక పోతే అది బలమైన కవిత అవడం కష్టం కదా. ఆ తాత్వికతనే నిగూఢత నిశ్శబ్దం అంటున్నా నేను. బహుశా నీ ప్రతి కవిత లో అట్లాంటిది ఉంది తీరుతుంది. నీ నెత్తురోడుతున్న పదచిత్రం కవితలు ఇప్పటికీ బలంగా ప్రభావం నెరపుతున్నాయంటే వాటి వస్తువుల ప్రాసంగికత మాత్రమే కాదు వాటిలోని విశ్వజనీన తాత్వికత కూడా కారణమంటున్న – వాటిలోని నిశ్శబ్దం పలుకుతుందంటున్నా

  • శబ్దనికీ శబ్దనికీ మధ్య వుండే నిశ్శబ్దమే సంగీతమంటే అని సంగీతజ్ఞులు చెబుతారు. కవిత్వానికీ అదే వర్తిస్తుంది. మంచి చర్చ.

    • బాగా చెప్పారు ప్రభాకర్ గారూ . మీకు నెనర్లు. కవిత్వంలో పదానికి పదానికి మధ్య పాదానికీ పాదానికీ మధ్య సంగీతమూ ఉంటుంది నిశ్శబ్ద సంగీతమూ ఉంటుంది

  • బాగా చెప్పావు స్వామీ. సరిగ్గా కూడా.
    ఏమి రాయాలో, ఎలా రాయాలో ఎవరూ శాసించకూడదు గానీ, ఎలా రాయాలో, ఎలా రాయకూడదో కొంచెమైనా మాట్లాడుకోవాలి. నిజాయితీ, మన అనుభూతి మాత్రమే చర్చకి ప్రాతిపదిక కాకూడదు. అది ఎవరికీ, ఎలా అందుతుందో చూసుకోవాలి కూడా. అందులో విషయం సూటిగానూ ఉండవచ్చు, పొరలు, పొరలుగానూ ఉండవచ్చు.
    కాలాలు దాటిన కవిత అసంగతంగా, అనామకంగా మిగిలిపోనూ వచ్చు. గతపు పీడకలగానో, మేలు జ్ఞాపకంగానో నిలిచిపోనూ వచ్చు. ఐరిష్ రచయిత బ్రెండన్ బెహాన్ కవిత ‘లాఫింగ్ బాయ్’ ఒక ఉదాహరణ. పదమూడేళ్ళ వయసులో తాను రాసిన ఈ కవిత ఐరిష్ తిరుగుబాటుదారుల అంతఃకలహాల్లో హత్యకి గురైన మైఖేల్ కోలిన్స్ గురించి 1936లో రాసిన ఈ విషాద గీతం, 1970లలొ సైనిక నియంతృత్వాన్ని ఎదిరించిణ గ్రీకు విద్యార్ధుల ప్రతిఘటనకి సంకేతంగా మారింది. కొద్ది మార్పులతో, విస్తృత ఆదరణ పొందిన ఈ గీతాన్ని చాలామంది గ్రీకు గీతంగానే భావిస్తారు.

    • బ్రెండన్ బహన్ కవిత గుర్తు చేసి కంట నీరు తెప్పించావు కిరణ్ అద్భుతమైన బాలడ్. అట్లే నాకు నచ్చిన మరో గొప్ప కవిత పాల్ సెలాన్ రాసిన మృత్యు హేల అనేది. గొప్ప సంగీతం తో పాటు గుండెల్ని మెలేసే నిశ్శబ్దమూ నిగూఢత ఉంటుంది అందులో.

      అవును నిజమే ఇప్పుడు మనం ఇంత ప్రయాణం చేసినంక ఎట్లా రాయాలో యెట్లా రాయకూడదో కొంచెమన్నా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగం లో మిలీనియల్ తరం ఎక్స్ తరమూ కవిత్వం రాసె పద్ధతులు పరికరాలు తప్పకుండ మారాలి కొత్త ఫార్మ్ ఎంచుకోవాలి – కొత్తగా చెప్పాలి – ఫేస్ బుక్ తెరిస్తే కనబడి మాయమైపోయే అక్షరాలు ఇమేజెస్ కాదు కవిత్వమంటే – అది బలంగా ప్రభావం వేయాలంటే ఇంకేదో వేరే రకంగా రాయడం ఈ కొత్త తరాలు మనకు నేర్పాలేమో ….

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు