శ్రీకాంత్ కవితలు మూడు

 

1

ఇలాగే

 

పగలంతా ఇలాగే గడిచిపోయింది

గాలికై ఉగ్గబట్టుకుని

అల్లాడక వేచి చూసే ఆకులాగే

మంచం మీద ఒక్కత్తే అమ్మ, ఇక

ఏదో యోచిస్తో; మరి

కేటరాక్ట్ ఆపరేషన్ అయి, ఏమీ

చూడలేక, కళ్ళప్పుడే తెరువలేక;

ఏముంది? ఆ కనుల

కింద? వానకు తడిచే తోటనా

లేక, నింగికెగిసే పక్షులా? చెట్లకు

వేళ్ళాడే గూళ్ళా, లేక

గోధూళి మబ్బులై వ్యాపించిన

సాయంత్రాలా? చుక్కలు దీపాలై

వెలిగే రాత్రుళ్ళా, లేక

వెన్నెల నీటిపొరైన కాలాలా?

 

ఏముంది ఆ కళ్ళ కింద? అసలు

ఇవేమీ కాక, తల్లి లేని

పసిపాపలే ఉన్నాయా అక్కడ?

***

పగలంతా ఇల్లాగే గడిచిపోయింది

గాలికై ఉగ్గబట్టుకుని

శిలలైన పూలతో, బాల్కనీలోనే

 

బందీయైన ఒక పూలకుండీతో!

 

2

ఉనికి

 

ఎంతో పల్చని ఎండ, ఒక పొరలా;

సవ్వడి చేయని గాలి –

ఆవరణలో తాకీ తాకని నీడలు

 

త్రవ్విన మట్టికి పైగా చల్లిన నీళ్ళల్లో

తడిచిన రాళ్ళు ; మెత్తగా

అమ్మ కనులై మెరుస్తో, స్రవిస్తో …

నేలపై ఎప్పుడో రాలిన ఓ  పసుపు

ఆకు; గవ్వలాగా, మరి

ఒక శరీరంలాగా, ముడతలతో …

***

ఎంతో పల్చని ఎండ, ఒక పొరలా;

అక్కడే ఒక పిట్ట

అటూ ఇటూ ఎంతో తచ్చాట్లాడి

 

 

చిన్నగా, ఎటో ఎగిరే పోయినట్టు

మరి అమ్మకి తప్ప

ఇంకెవరికీ మరి తెలియనే లేదు!

 

3

 

ఇప్పటికైతే….

 

ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది

నిజంగానే,

నా నెత్తురునంతా మాటల్లోకి వొంపి

ఊరకే, నీ పక్కన కూర్చోవాలని ఉంది

నిజంగానే,

ఏమీ మాట్లాడకుండా నిన్నానుకుని

చిన్న నవ్వుతో నిన్ను వినాలని ఉంది

నిజంగానే,

శరీరం నిండుగా నిన్ను పీల్చుకుని

ఎటో దారి తప్పి పోవాలనే ఉంది నీతో

నిజంగానే,

నను నేను మరచీ, మరోసారి బ్రతికీ …

హా; నిజం. మరోమారు మరణించాలనే

ఉంది నీలో,

ఒక మెలకువలోకి పూర్తిగా మేల్కొని!

***

చూడూ; ఇప్పటికైతే మరి ఇదే సత్యం

 

ఎలా ఉన్నావు అని అడగాలని ఉంది

నిజంగానే,

నిన్నోసారి ఎంతో గట్టిగా హత్తుకుని!

***

 

పెయింటింగ్: పఠాన్ మస్తాన్ ఖాన్ 

శ్రీకాంత్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇప్పటికైతే …కవిత చాలా బాగుంది!!!

  • ముచ్చటగా ఉన్నాయి మూడు కవితలూ !! రెండో కవిత చదివుతున్నప్పుడు కూడా మొదట కవిత పరిమళం పోలేదు, అలాగే మూడో కవిత చదివాక కూడా ఆ పల్చని ఎండ పొర అట్లానే ఉండింది. వేటికవి చాలా బావున్నాయి శ్రీకాంత్ గారూ !! అభినందనలు మీకు

  • ఏముంది ఆ కళ్ళ కింద? అసలు ఇవేమీ కాక, తల్లి లేని పసిపాపలే ఉన్నాయా అక్కడ?
    ఇంతకు మించిన పోలికెవరు పోల్చగలరు? ఇది కదా మనసు. పెయింటింగ్, కవితా రెండూ అద్భుతం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు