పొగ

భూమి గురించి మనకి ఈమధ్యనే తెలిసింది. ఆ సమాచారం నాలో ఒంటరితనాన్ని నింపుతోంది. వీలైనంత త్వరగా భూమిని చూడాలనిపిస్తోంది. చూడకుండా ఉండలేననిపిస్తోంది. వింటున్నప్పుడు మెదడులో ఒక రకమైన ఫీలింగ్.

కొత్త తరం కథకుల్లో విలక్షణ శైలితో రాస్తున్న కథకురాలు మోహిత. నేటి తరం అమ్మాయిల ఆలోచనలు, అంతస్సంఘర్షణనలు చాకచక్యంగా ఒడిసిపట్టుకుని అద్భుతమైన వాక్యంతో కథలుగా మలుస్తున్నారు. అందుకే మోహిత కథలే కాదు, కథల్లోని వాక్యాలు కూడా మనల్ని వెంటాడతాయి. మోహిత రాసిన తొమ్మిదో నంబర్ చంద్రుడు కథ….పాఠకులతో పాటూ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సీనియర్ రచయిత దాసరి అమరేంద్ర మోహిత గురించి ఓ చోట ఇలా అంటారు. “ తెలుగు కథకుల్లో చలం, త్రిపుర, చండీదాస్, లతలది అనితరసాధ్యమైన బాణీ. మోహిత వాళ్లందరి లక్షణాలూ అందిపుచ్చుకున్నారా అనిపిస్తుంది. బాధ్యతతో, ఆరోగ్యకరమైన ఆలోచనలతో, వయసుకు మించిన పరిణతితో, అబ్బురపరచే అభివ్యక్తితో కథలు చెప్తారు. ఇప్పటి యువత ఆలోచనలకు అతిచక్కని ప్రతినిధి అనిపిస్తారు.”

రాసింది తక్కువే ఐనా వాసి పరంగా ఆణిముత్యాల్లాంటి కథలు రాస్తున్న మోహిత కథ పొగ. సారంగ పాఠకుల కోసం.

 

పొగ

 

ఒక వెంట్రుక. కంట్లో ఎంతోసేపటి నుంచి ఇబ్బంది పెడుతోంది ప్రకృతిని. కన్ను నలుపుకుంటూ డాక్టర్ వంక చూసింది.

“నిన్నరాత్రి ఏమి తిన్నావు ?”

“రెండు రోటీస్, పాలకూర”

“పనీర్ ఉందా పాలకూరతో బాటు?” పచ్చటి పాలకూరలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముక్కలు వేసిన హోటల్ నిర్వాకం వాట్సప్ లో రెండు రోజుల కిందటే చదివాడు.

“పాలకూర పప్పు!”

“ఓ. డైజెషన్ ప్రాపర్ గా ఉందా? కడుపులో నొప్పి లాంటిదేమైనా…?” కందిపప్పు గ్యాస్ కలుగజేస్తుంది.

“నో ప్రాబ్లెమ్”

“పాలకూర ఎలర్జీ ఏమీ లేదుగా?” హిస్టమిన్ ఎక్కువైందేమో.

“నాట్ ఎట్ ఆల్. ఇష్టం కూడా”

“పెరుగు తిన్నావా?” మజ్జిగ ఉత్తమం.

“లేదు”

“ఐస్ క్రీమ్?” రక్తంలో చక్కెర స్థాయి పెంచుతుంది.

“లేదు. ఆరంజ్ జ్యూస్ తాగాను”

“సరే, పప్పులాంటి హెవీ ఫుడ్ తీసుకోకుండా ఉండు రాత్రి పూట. చూద్దాం”

“ఓకే డాక్”

డాక్టర్ అని పూర్తిగా పిలవలేని లేటెస్ట్ జనరేషన్ కు ప్రతినిధి అయిన ప్రకృతిని చూసి సన్నగా నవ్వి విటమిన్ బి12 రాసిచ్చాడు. ప్రకృతి కూడా చిరునవ్వుతో చూసి అద్దంలాంటి నల్లటి టైల్స్ మీద ఎత్తైన హీల్స్ టకటక లాడించుకుంటూ బయటకు నడిచింది.

 

నాలుగవ రోజు

సాధారణంగా రెండవసారి వచ్చే పేషెంట్లలానే ఈ అమ్మాయి కూడా ఇంప్రూవ్మెంట్ చెప్పేసి వెళ్ళిపోతుందనుకున్నాడు. సెకండ్ కన్సల్టేషన్ కి తను ఫీజు తీసుకోడు కాబట్టి ఎక్కువ టైం కేటాయించడు. వచ్చీ రాక ముందే కుశల ప్రశ్నలు వేస్తే బాగుండదేమో అనిపించి రెండు క్షణాలు ఆగాడు. ఏదో ఊరెళ్ళటానికి బయలుదేరినట్టు తెచ్చుకున్న పెద్ద లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని, స్కార్ఫ్ ని పక్కన కుర్చీలో పెట్టి గాగుల్స్ తీసి చొక్కాకి తగిలించుకొని ప్రకృతి కొంచెం సర్దుకుని కూర్చున్నాక –

“Have you slept well?” అని పలకరించాడు.

సమాధానం ఎక్కణ్ణుంచో వచ్చినట్టుంది. ఆమె నోట్లోంచి వచ్చిన మాట కన్నా కళ్ళు చెప్పిన జవాబునే శ్రద్ధగా విన్నాడు. లోతుకు పోయిన ఆ కళ్ళు- మెలకువగా ఉన్న ఆ కళ్ళు- నిద్రని దాచుకోలేదంటున్నాయి.

అర్థమైనట్టు తలాడించాడు. “నిన్న రాత్రి  ఏమి తిన్నావు ?”

“ఏమీ తినలేదు డాక్”

కళ్ళు పెద్దవి చేసి అడిగాడు – “నథింగ్?”

తల అడ్డంగా ఊపింది పెదవులు లోపలికి ముడిచి.

ఈ అమ్మాయికి పస్తులుండే అవసరం లేదని తెలుస్తూనే ఉన్నా “ఉపవాసం?” అడిగాడు.

“నో. తినాలనిపించలేదు.”

“చూడు ప్రకృతీ, మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆరోగ్యం ఉంటుంది. ప్రత్యేక కారణాలవల్ల తప్ప ఖాళీ కడుపు శ్రేయస్కరం కాదు. ఈ వయసులో పోషకాలు చాల అవసరం. గ్లాసుడు పాలైనా తాగాలి రోజుకి”

“హే డాక్, రోజూ పొద్దున లేవగానే ఐ హావ్ కార్న్ ఫ్లేక్స్ ఆర్ ఓట్స్ ఇన్ మిల్క్ అండ్ ఆరంజ్ జ్యూస్” నీరసంగా డాక్టర్ ఆలోచనని సరిదిద్దింది.

స్టైలిష్ పిల్లల స్టైలిష్ తిండి ! అడ్వర్టైజ్ మెంట్లలో చూపేదంతా నిజమనుకుంటారు. “ఓహ్…గుడ్ దెన్. అసలు ఏమీ తినకపోయినా, ఆకలితో ఉన్నా నిద్ర పట్టదు. కొంచెం లైట్ గా తప్పకుండా తినాలి” అన్నాడు.

ఇది తెలిసిన విషయమే అన్నట్టు ముఖం పెట్టి “మరి మొన్న, అటు మొన్నా తిన్నాను కదా డాక్. అప్పుడు కూడా నిద్ర రాలేదు. ఐనా అసలు తిండికీ నిద్రకీ సంబంధం ఏంటి ?” విసుక్కుంది.

“మెటబోలిక్ రేట్ అందరికీ ఒకేలా ఉండదు. నూనెలో వేయించినవి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నవి, తీపి పదార్థాలు రాత్రిపూట తినడం అంత మంచిది కాదు. పైగా తిన్న వెంటనే పడుకోకూడదు” అన్నాడు ఓపికగా. పేషెంట్స్ తో ఆర్గ్యూ చేయడు.

“ఓ…! మొన్నరాత్రి వెజ్ మంచురియా తిన్నాను” గుర్తు తెచ్చుకుంది.

“అయితే దానివల్లే. నిద్రపోయే ముందు వీలుంటే వేడిగా పాలు తాగు బెల్లం కలుపుకుని” చెప్పాడు.

“జ్వరం వచ్చినట్టు నోరంతా చేదుగా ఉంది”

“నిద్ర లేకపోతే అంతే! బాడీ నీడ్స్ రెస్ట్. దాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి”

హెవీ హ్యాండ్ బ్యాగ్ లో పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా చేరాయి. హీల్స్ దెబ్బని ఎదుర్కొని నల్లటి టైల్స్ టక్ టక్ మన్నాయి.

ఐదవ రోజు

“నిద్ర పట్టలేదు కదూ?”

అది ప్రత్యేకంగా అడగాలా అన్నట్టు పేలవంగా నవ్వింది.

“ఎందుకంటావ్?”

“ఐ డోంట్ నో. కొంచెం నడుము నొప్పిగా అనిపించింది” తీయటి కంఠం బొంగురు పోయింది.

సరైన నిద్ర లేకపోతే అన్నీ నొప్పులే అనుకుంటూ డాక్టర్ “వంగి లేచినప్పుడు పట్టేసిందా?” అడిగాడు బరువైన పెద్ద బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ నే చూస్తూ.

“పీరియడ్ వచ్చింది”

డాక్టర్ లో ఆశ చిగురించింది. “ఓ.. అలాగా! మరి చెప్పవేం? ఇన్నాళ్ళూ ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ వల్ల నిద్ర పట్టలేదన మాట!” తేల్చిపారేశాడు.

“నాకలాంటి ప్రాబ్లెమ్ ఎప్పుడూ లేదు డాక్”

“See, when there is a lot of stress, there are hormonal imbalances in the body” వివరిద్దామని మొదలు పెట్టాడు.

“Yeah I know. గూగుల్ లో అంతా చదివాను. But I don’t have any kind of stress” మాట తుంచేసింది.

“None ?”

“None !”

ఉసూరుమన్నాడు డాక్టర్. ఈ కాలపు పిల్లలు డాక్టర్లు చెప్పేదానికన్నా గూగుల్ చెప్పేదే నమ్ముతున్నారు. ఉన్న రోగాలు లేనట్టు, లేనివి ఉన్నట్టు భ్రమ పడుతున్నారు. సమస్యేంటో తెలుసుకోకుండా పనికిమాలిన మాత్రలు రాసే వైద్యుడు కాదు కాబట్టి నాలుగైదు చిన్న చిన్న చిట్కాలు – రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలని, నిద్ర పట్టకపోతే ఊపిరి దీర్ఘంగా తీసుకోమని, గొర్రెలు లెక్క పెట్టమని, ఇష్టమైన పాటలు వినమని చెప్పాడు.

“Why don’t you give me medicines?” అని గొణుక్కుంటూ లేచింది.

మూర్ఖత్వపు నడకలో వయ్యారం తగ్గింది. నల్లటి టైల్స్ మీద హీల్స్ స్ట్రెస్ వేయలేదు.

 

పదవ రోజు

ఈ అమ్మాయికేం పనిలేదా ? రోజూ వస్తుందేంటి ? ఏదో ఒకటి చెప్పి పంపించేస్తే సరి.

“నిన్నరాత్రి ఏమి తిన్నావు ?”

“అవన్నీ నాకు సరిపడతాయి డాక్”

వివరాలు చెప్పే అవసరం కూడా లేదిప్పుడు. ఇదే ప్రశ్న వినీ వినీ బోర్ కొట్టింది. ఆమెకు కావాల్సింది ఆహారం కాదు, నిద్ర. ఈ డాక్టర్ సరిగా డయాగ్నోజ్ చేస్తున్నాడా?

“పాలల్లో బెల్లం?”

“యా యా ఐ యామ్ హ్యావింగ్. మీల్స్ స్కిప్ చేయట్లేదు. మధ్య మధ్యలో ఫ్రెష్ ఆరంజ్ జ్యూస్”

“ఏసీ వేసుకున్నావా?” ఉష్ణోగ్రతలో తేడాలు నిద్రను ప్రభావితం చేస్తాయి.

“మొన్నటి నుంచి వేసుకోవటం లేదు. చల్లగానే ఉంటోంది కదా”

ఇస్త్రీ మడతలున్న ఆమె డ్రెస్ ని గమనించి “దిండ్లు, పరుపు మార్చి చూశావా? దుప్పటి మురిగ్గా ఉన్నా నిద్ర పట్టదు” అన్నాడు. ఒకోసారి పరిశుభ్రత వ్యక్తికే పరిమితమవుతుంది.

చివ్వున తలెత్తి “I am personally very hygienic and take proper care to keep things around me neat and tidy” అంది నొసలు చిట్లించి.

అఫెండ్ అయినట్టుంది. ఈ రోజుల్లో పిల్లలు చిన్న మాటంటేనే తట్టుకోలేక పోతున్నారు. ఇక, ఎప్పుడూ ఆ ఎడమ కన్ను ఎందుకు నలుపుకుంటావని అడిగితే నీకెందుకు మూస్కొని ఉండు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

“దోమలుగాని, దోమలమందులు గాని ఉన్నాయా?” డీట్ (Deet) ఊపిరితిత్తులకి హాని చేస్తుంది.

“సాయంత్రమే కిటికీలన్నీవేసేస్తాను. దోమలమందు is nothing but poison”

ఇప్పుడు ఏమిటి చేయడం? డాక్టర్ నిస్సహాయతతో మందుల పుస్తకం మీద ఉన్న పెన్నుని చేతిలోకి తీసుకొని వేళ్ళ మీద తిప్పుతున్నాడు. తనకెదురుగా కూర్చున్న ఈ అమ్మాయి పది రోజుల నుంచి నిద్రపోలేదు. మనిషనే వాడికి ఇన్నాళ్ళు నిద్రపోకుండా ఉండటం అసాధ్యం. ఆహారం వల్ల కాదు, స్ట్రెస్ లేదంటుంది, నెలసరి బానే వస్తుందంటుంది, కుటుంబపరంగా ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవంటుంది. మంచి ల్యాబ్ లో ఎంతో ఖర్చు పెట్టి పరీక్షలు చేయించుకుంది. జనరల్ హెల్త్ రిపోర్ట్స్ లో ఏ వంకా లేదు. సహనానికి మెచ్చుకోవాలి. వేరే పేషెంటయితే ఈ పాటికి కాలర్ పట్టుకొని నిద్ర పుచ్చుతావా చస్తావా అని అడిగేవాళ్ళు. తన వైద్యం మీద నమ్మకం పెట్టుకొని పది ఫీజులూ కట్టింది. అందుకోసమైనా ఈ అమ్మాయికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పాలి.

“బ్రీతింగ్ మార్చి చూశావా?”

“యా. నిమిషానికి నాలుగుసార్లే తీసుకున్నాను నిన్న రాత్రి. That is my lowest till date.”

డాక్టర్ ఆశ్చర్యపోయాడు. చెప్పింది తు. చ. తప్పకుండ పాటించే అరుదైన సిన్సియర్ పేషెంట్!

“ఎనీ యూజ్?” పెన్ను బల్ల మీద పెట్టి అడిగాడు.

తల దించి అడ్డంగా ఊపింది. మధ్య పాపిడి తీసి విరబోసిన అందమైన జుట్టు ముఖానికి రెండు వైపులా మెత్తగా నాట్యమాడింది.

“షీప్?”

“రెండు లక్షలా నలభై మూడు వేల నూట యాభై మూడు వరకు గుర్తుంది”

“అంటే ఆ తర్వాత నిద్ర పట్టిందా?”

“అలారం మోగింది”

షిట్ అనే మాట నాలుక చివరి వరకు వచ్చాక బలవంతంగా మింగేశాడు. పేషెంట్ ముందు డాక్టర్ ఎప్పుడూ ఎమోషనల్ అవ్వకూడదు. ట్రస్ట్ ఫాక్టర్ బ్రేక్ చేయకూడదు. నిద్ర పట్టకపోవడం అనేది గొప్ప సమస్యేమీ కాదు. చిన్నదే. సాధారణ డాక్టర్ తగ్గించగలదే… కాని తను ఇరవయ్యేళ్ళ కిందట చదివిన వైద్యశాస్త్రంలో ఇలాంటి రుగ్మత ఉన్నట్టు చూచాయగా అయినా గుర్తురావడం లేదే. నిద్రలేమి కేసులకి రెండోరోజున నిద్రమాత్రలు రాసేస్తాడు. ఈ అమ్మాయి విషయంలోనే తనెందుకింత జాగు చేస్తున్నాడు..??? పది రోజుల పాటు నిద్రపోకుండా ఉండటం ఎలా సాధ్యమో అర్థం కావటం లేదు. Process of elimination. తన పరిధిలో ఉన్నవన్నీ తాను చేస్తాడు. సైకాలజిస్ట్ స్నేహితుడికి కేసు రిఫర్ చేస్తే? ఇంతాలస్యం చేశావేమని అంటాడేమో? నిజమే చెప్తోందా అసలు?

“డాక్! హే డాక్! కఫ్ సిరప్ లో ఏది బెస్ట్?”

“ఆఁ.. ఎ.. ఏంటి ?” ఆలోచనలో పడి ఆమె అడిగింది సరిగ్గా వినలేదు.

“అది తాగితే నిద్ర పడుతుందట కదా. మై కొలీగ్ టోల్డ్ మీ”

Yes, DXM is a sedative. కాని నిద్ర కోసం దగ్గు మందా? డాక్టర్ కొంచెం షాక్ తిన్నాడు. దేన్ని దేనికోసం వాడాలో తెలీకుండా ఇష్టం వచ్చినట్టు ఎడా పెడా వాడేస్తే సిస్టం చెడిపోతుంది. ఈ పిల్ల మంచిది కాబట్టి తనని అడిగింది. కాక, మెడికల్ షాప్ లో కొనుక్కొని తాగేస్తే? ప్రిస్క్రిప్షన్ లేకుండా over the counter drugs ఇవ్వటం ఇండియాలోనే చెల్లింది. ప్రతివాడూ డాక్టరే ఇక్కడ!

డాక్టర్ జవాబివ్వకపోవడంతో “Or otherwise, can you prescribe sleeping pills?” ఆశగా అడిగింది.

“చూడమ్మా ప్రకృతీ, దగ్గు మందులూ, స్లీపింగ్ పిల్సూ పెప్పర్ మింట్లు కాదు, కావాల్సినప్పుడల్లా వేసుకొని చప్పరించడానికి. ఫైనల్లీ, ఇంకో రెండు రోజులు చూద్దాం. ఈ లోపు నువ్వు పగటి పూటైనా కాస్త నిద్ర పోవడానికి ట్రై చేయి. మాటిమాటికీ కళ్ళు రుద్దకు. మంటెక్కుతాయి” అన్నాడే గాని ‘నీ కేస్ ఫైల్ నా ఫ్రెండ్ కి రిఫర్ చేస్తాను’ అని చెప్పలేకపోయాడు.

హీల్స్ కోపంగా టైల్స్ ని టకటకా కొట్టాయి.

 

పదహారవ రోజు

“నిన్నరాత్రి ఏమి తిన్నావు ?”

“చిప్స్”

డాక్టర్ తీక్షణంగా చూడటంతో తత్తరపడి నిజం చెప్పేసింది. “చిప్స్ తో బాటు కొంచెం వోడ్కా”

ఆ సమాధానానికి తృప్తి పడ్డాడు.

“మరి నిద్ర పట్టిందా?” తీసుకునే తొలినాళ్ళలో నార్కోటిక్స్ మగతను కలిగిస్తాయి.

“లేదు. ఏక్టివ్ గానే ఉన్నాను.”

నిజాయితీతో కూడిన ఆ సమాధానానికి డాక్టర్ నిగ్రహం పటాపంచలైంది. “ద హెల్! ఐ కాంట్ అండర్ స్టాండ్ యువర్ ప్రాబ్లెమ్. ఎందుకు నిద్ర పోలేవు?” స్టెతెస్కోప్ బల్ల మీదకి విసిరి కొట్టి అంతే విసురుగా లేచి నుంచున్నాడు. రివాల్వింగ్ చైర్ వెనకకి జరిగి ధడాలున గోడకి కొట్టుకుంది. బెదిరిపోయింది ప్రకృతి. అంచెలంచెలుగా లేచింది కుర్చీలోంచి. కన్నీళ్ళు అంచెలంచెలుగా చున్నీలోకి జారుతున్నాయి.

“ఎంతమంది ఇన్సోమ్నియా పేషంట్లని ట్రీట్ చేశాను! నీకెన్ని సొల్యూషన్స్ ఇచ్చాను?” చేతులు వెనక్కి కట్టుకొని అటూ ఇటూ వేగంగా పచార్లు చేస్తూ తనలో తానే అనుకుంటున్నట్టు పైకి మాట్లాడేస్తున్నాడు డాక్టర్. “హార్మోన్ లెవెల్స్ నార్మల్. విటమిన్స్ యాజ్ నెసెసరి. ఫుడ్ ఇన్టేక్ ప్రాపర్. బెడ్ థింగ్స్ ఫైన్. స్ట్రెస్ నిల్. ఇంకెందుకు రాదు నిద్ర ?”

ప్రకృతి తల్లడిల్లుతూ అతన్నే చూస్తోంది. ఆమె దగ్గర ఆగి ముఖం మీద ముఖం పెట్టి “అసలు నీకు నిద్ర పోవాలని లేదు కదూ?” అని హుంకరించాడు.

ఆమె ఎర్రటి కళ్ళలో నీటిని చూసి వెంటనే శాంతించాడు. మస్కారా కలిసి మరింత నల్లబడ్డాయి ఆ నీళ్ళు. తన outburst కి సిగ్గుపడ్డాడు. “సారీ డియర్! ఐ యామ్ ఏబ్సల్యూట్లీ సారీ. నీ వల్ల నా నిద్ర కూడా ఎగిరిపోయింది. వైద్యశాస్త్ర పుస్తకాలన్నీ మళ్ళీ మళ్ళీ తిరగేస్తున్నాను. ఊరికే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ రాయడం నాకు గిట్టదు. అందుకే ఇన్నాళ్లవుతోంది. అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలని నా తాపత్రయం. మాట్లాడవేం ప్రకృతీ? ఏం దాస్తున్నావ్ నా దగ్గర? Help me help you !”  బతిమిలాడుతున్నట్లే అన్నాడు.

కన్నీటిలోంచి చూపు.

డాక్టర్ మసగ్గా, ఉన్నదానికంటే లావుగా కనిపిస్తున్నాడు.

లో చూపు.

ఈ డాక్టర్ కూడా తనకే పరిష్కారమూ చూపలేడు. బుద్ధి తక్కువై అసలు తన ప్రాబ్లెమ్ కి వేరే మనిషిని నమ్మింది ! ఎస్ ప్రకృతీ యు ఆర్ ఏ ఫూల్.

“ప్రకృతీ వెయిట్!”

టైల్స్ పిలుస్తూనే ఉన్నాయి. హీల్స్ వినిపించుకోకుండా టక టకా వెనుదిరిగాయి.

*  *  *

మౌనం.

డ్రైవర్ తో మాట్లాడటానికి ప్రయత్నించింది. గొంతు పెగల్లేదు. కాగితపుడబ్బాలోని కమలాపండు రసాన్ని  నోట్లో పోసుకుంది. రేర్ వ్యూ మిర్రర్ కి తగిలించిన మల్లెపూలు మంచి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. అదే చెప్దామని కళ్ళెత్తి పక్కకి చూసింది. అతని సైడ్ లాక్స్ భలే ఉంటాయి. ఎన్ని రకాలుగా ట్రిమ్ చేస్తాడో.

“ఏమి చూస్తున్నావు? అన్నాడు తల తిప్పకుండానే.

“కొంచెం ఎఫ్. ఎం. ఆన్ చెయ్”

అన్నాక పావు క్షణం ఆశ్చర్యపోయింది. తను కళ్ళు మూసి గొంతు విప్పి ఎన్నాళ్ళైందో!

“సారీ హనీ, రేడియో పాడైంది” అన్నాడు.

నిరుత్సాహపడింది ప్రకృతి ప్రాణం. మొబైల్లో కూడ ఛార్జింగ్ లేదు. మౌనం భరించలేకపోతోంది. ఆ డాక్టర్ ఉత్త వేస్ట్ గాడు అని చెప్దామనుకుంది. క్లినిక్లో సంఘటనని గుర్తుచేసుకోవడం ఇష్టం లేక “నువ్వే ఏమన్నా కబుర్లు చెప్పు” అంది.

“డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్  చెయ్యకమ్మా”

మాట్లాడటానికి ఇంకేమీ మిగల్లేదు. కాని మాటలోనే తన మౌనం. మనసు కడలే.

“పోనీ పాట పాడు”

మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటినే

తెలుపక తెలిపే అనురాగము నీ కనులలో కనుగొంటినే….”  

మెత్తటి ఆ స్వరం వింటూ సీట్ బెల్ట్ పెట్టుకుంది. సౌండ్ ప్రూఫ్, లైట్ ప్రూఫ్ అద్దాలున్నాయి కిటికీలకి. ఇది ఇప్పటి కార్లలో ఒక లగ్జరీ ఫీచర్. బయటి వాహనాల రూపం వేగం తప్ప రొద లేదు. వ్యక్తి సుఖానికి అలవాటు పడ్డ యుగం పరాయి పొడను భరించలేదు. హైట్ ఆఫ్ ఇండివిడ్యువలిజం. ఇజం. ఎగ్జిస్టెన్షియలిజం. పుస్తకాల్లో టీవీల్లో సమాజంలో ఇజం ఇజం. ఏదో ఒక ఇజం ఒంటబట్టించుకోకపోతే బతకలేమా. ఏ ఇజమూ లేకపోవడం కూడ ఒక ఇజమేనేమో. డాగ్మా. కాదు. డాగ్స్. కళ్ళ మంటలని రెప్పలకింద అదిమి పెట్టి తల వెనక్కు వాల్చింది. మూడు క్షణాలకి ఏసీ చప్పుడు వినిపించసాగింది. పాత ఇనుప బొంగరం నేల మీద తిరుగుతుంటే ఆ వేగానికి దానికి పట్టిన తుప్పు వృత్తాలుగా రాలుతున్న చప్పుడు.

*  *  *

ఆ సముద్రానికి పేరు లేదు. దానిలోంచి ముడతలు పడ్డట్టు కనిపిస్తున్న అప్పుడే గడ్డకట్టిన రాతికి కూడ పేరు లేదు. అసలు వాటికి పేరు పెట్టటానికి ఎవరూ లేరు. కాలక్రమంలో ఉంటారు, మంటెక్కి వేగిపోయి మాడిపోయి కరిగిపోయి గడ్డకట్టిన ఈ ఘన ప్రపంచం సూర్యుడి చుట్టూ మరో నలభై కోట్ల భ్రమణలు చేశాక అప్పుడు ఉంటారు. కానీ ప్రస్తుతానికది వట్టి ఒంటరిది. అదొక ఊషరక్షేత్రం. ఆ గ్రహం చనిపోయిందని అనలేం. అది జీవాన్ని చూడలేదంతే.

సుదూర భవిష్యత్తులోంచి ఎవరైనా మనిషి ఇప్పుడు దీనిమీద నిలబడి దీన్ని చూడటం సాధ్యపడితే, తనకి తెలిసిన ప్రపంచానికి పూర్తి భిన్నమైన ప్రపంచాన్ని చూస్తుండి ఉండేవాడు. అతనికి పొగలు, బూడిదలు కక్కుతున్న లెక్కపెట్టలేనన్ని అగ్నిపర్వతాలు ఆ గ్రహ ఉపరిభాగం మీద కనిపించేవి. ఇప్పుడిప్పుడే గట్టి పడుతున్న ఉపరితలాన్ని పగులగొడుతూ బయటకి రావాలనుకునే గ్రహగర్భం, గిన్నెలో కట్టిన మీగడ తెట్టల కింద నుంచి కుతకుత ఉడుకుతూ ఉబుకుతున్న పాలపొంగుని గుర్తుకు తెచ్చేది.

ఆ భవిష్యమనిషి చూసే ఆకాశం కూడ చాల భిన్నంగా ఉండేది. పైన ఏముందో కనపడనివ్వని దట్టమైన నల్లటి మేఘావరణం. ఆ మేఘాల పైన నిరంతర దీపావళి చేసే వేన వేల ఉల్కలు. విశ్వంలోని శూన్యాన్ని తట్టుకొని మనలేని చిన్నచిన్న రాళ్ళురప్పలే ఉల్కలు. నూతన సౌరమండలాలను నిర్మించగల ఈ కణజాలం నేలకి చేరకముందే వాతావరణ రాపిడివల్ల మండిపోతూ బుగ్గి అయిపోయి గ్రహంమీదకి రాలిపోతూ అతనికి కనిపించి ఉండేవి.

రాలే ఉల్క ఎంత పెద్దదైతే, దాని పతనం అంత తక్కువ.

అంతరిక్షంచేత సంధింపబడి చురచురా రాలిపడుతున్న ఈ బాణాసంచాలో ఒకటి కొంచెం ప్రకాశవంతంగా ఉంది. రేఖలా కాదు, చిన్న తళుకులా. నిజానికది కదలకుండా ఉన్నట్టు భ్రమ కల్పించే భ్రమించే అగ్నిధార. భవిష్యమనిషి సరిగ్గా చూసుంటే అది సెకనుకు పదహారు కిలోమీటర్ల పైన వేగంతో ఈ నల్లటి సముద్రతీరం వైపే దూసుకొస్తోందని భయంతో గిజగిజలాడేవాడు.

తళుకు ఒక్కసారే భగ్గున మండింది. గ్రహ వాతావరణంలోకి ప్రవేశించిన ఉల్క అమిత వేగంతో కరుగుతున్న దాని పైతట్టు ద్రవంలో ఉక్కిరిబిక్కిరవుతోంది. అది నేలను చేరే లోపే కాలి బూడిదయ్యేంత చిన్నది మాత్రం కాదు. ఖచ్చితంగా నేలను తాకేంత పదార్థం దాన్లో ఉంది.  గాలిలో దొర్లి దొర్లి మండిపోతూ ఆఘమేఘాలపై విజృంభించిన వేగంతో వస్తోంది జ్వాలాముఖి. అదే వేగంతో తాకుంటే గనక, వందల మైళ్ళ సముద్రాన్ని అల్లకల్లోలం చేసేసి అప్పటిదాకా ఏర్పడ్డ ఉపరితలాన్ని ఆనవాలు గుర్తుపట్టకుండా పతనం చేసేసుండేది.

ఇంతలో అనూహ్యమైనదేదో జరిగింది.

ఉల్క మళ్ళీ మండింది. కాని ఈసారి అది అగ్నిపూలు విరజిమ్మే ఎరుపు కాదు. విద్యుదాఘాతం. లేత నీలపు శిఖ. ఒకటి కాదు, వంద కాదు, అసంఖ్యాక నీల చమక్కులు విరిశాయి. అవి ఉల్క నుంచి రాలేదు. గ్రహ వాతావరణంలోని మెరుపులవి. ఉగ్రంగా ఆకాశంనుంచి నేల దాకా పాకిన విద్యుద్వలయ రేఖలు. భవిష్యమనిషి సరిగ్గా చూసుంటే అవి వంకరటింకర గీతల్లా కాక ఏదో అజ్ఞాత ప్రకృతి శక్తి ముందే గీసిన నిర్ణీత దారుల వెంట అవి ప్రయాణిస్తున్నట్టు గ్రహించేవాడు.

ఉల్క నెమ్మదించింది. వాతావరణ పీడనం వల్ల దానివేగం తగ్గుతోంది. పెరుగుతున్న మెరుపుల వేగం, తగ్గుతున్న ఉల్క వేగం ఏకరూప నిష్పత్తిలో ఉన్నాయి. అయితే, ఉల్క పరిమాణంలో మరీ పెద్దదవటంతో ఇంత సంఘర్షణనీ తట్టుకొని ఇంకా కిందివైపుకే దిగుతోంది. నెమ్మదిగా, నెమ్మదిగానే… కాని ఉపరితల ప్రశాంతత చెడకుండా ఉండేందుకు ఆ నెమ్మది సరిపోలేదు.

శబ్ద వేగానికి కొన్నిపదుల రెట్ల వేగంతో ఉల్క తీరాన్ని ఢీకొంది. ఒక చిన్న పరమాణు బాంబు పేలినప్పుడు విడులయ్యేంత శక్తి ఆ అభిఘాతంలో విడుదలైంది. కళ్ళు చెదిరే క్షణికదీప్తి అగ్నిపర్వతాలని రగిలించింది. వేల టన్నుల రాతి స్తరం క్షణాలలో పొడిపొడి అయిపోయి ఆకాశంలోకి పేలింది. ద్రవించిన గ్రహ ఉపరితలం ఎంతో ఎత్తున వాతావరణంలోకి విరుచుకు పడింది. పైకి లేచిన వెంటనే పలుచనై చల్లబడి పదునైన రాతి తుంపరలుగా రాలింది. నిముషాల కిందటి తన పరిమాణానికి ప్రస్తుత పరిమాణానికి పోలికే లేని ఉల్క, విశ్వాంతరాళాల్లో ఎక్కణ్ణుంచో ఊడిపడ్డ ఉల్క, తాను గ్రహం మీద చేసిన వందల అడుగుల వెడల్పాటి గుంటలో ఎర్రగా మండుతూ దర్జాగా కూర్చుంది.

అంతలో సముద్రానికి దొరికిపోయింది.

ఆబగా వచ్చిన జలం బిలంలోకి సర్రున జారింది. ఉల్కని చల్లార్చే ప్రయత్నంలో తానే ఆర్చుకు పోయింది. మరో విస్ఫోటనం గ్రహాన్ని అదరగొట్టింది. హఠాత్తుగా చల్లబడ్డ ఉల్క పైపొరలు ముసిరిన వేడి ఆవిరిలో చెల్లాచెదురయ్యాయి.

క్రమంగా ఉల్క, సముద్రం స్థిమితపడ్డాయి. ఆకాశంలో మెరుపులూ తగ్గాయి. అవి తమ దుప్పటిలో చేసిన చీలికలను కుట్టేయడానికి మళ్ళీ మబ్బులు కమ్ముకున్నాయి. కాసేపటికి అలల ఉరవడి తప్ప ఇంకే శబ్దమూ మిగల్లేదు. గుంటలో మిగిలిన ఉల్కముక్క తన ప్రథమ పరిమాణంలో క్షీణించుకుపోగా మిగిలినదాంతో మౌనంగా ఉండిపోయింది- మనిషంతా పోయి గుండె మాత్రమే మిగిలినట్టు. అందుకు ప్రతిగా, ఎంతో గణించలేని కాలంగా శూన్యావరణం, ఘనీభవించిన రాళ్ళు తప్ప ఏమీ ఎరుగని ఆ వంగ వన్నె శిల మొట్టమొదటిసారి ఒక చల్లటి స్నేహాన్ని చవిచూసింది.

నీరు. ఉల్క అణువణువులో ఏముందో తెలుసుకోవాలని దాని పగుళ్ళలోంచి లోపలికి చొచ్చుకుపోవటానికి ప్రయత్నిస్తున్న నీరు.

ఏదో జరగటానికి ఆరురోజులు పట్టింది. అదేంటో తెలుసుకోవాలంటే భవిష్యమనిషికి శక్తిమంతమైన సూక్ష్మదర్శని కావలిసి వచ్చేది. అందులోంచి చూసి ‘ఆఁ ఇదేముందిలే!’ అని పెదవి విరిచేసి ఉండేవాడు. అక్కడ జరిగిన రసాయన చర్యల ఫలితంగా శిథిలమైన రాతిలోంచి ఒక చిన్న బుడగ బయటకు వచ్చి నీటి ఉపరితలానికి రయ్యిన చేరుకుని అలలనురుగుల్లో తప్పిపోయింది. అదేమంత గొప్ప ప్రారంభం కాదు.

అయితే ఖచ్చితంగా అది ఒక ప్రారంభం, ఎందుకంటే భూమ్మీదకి ‘జీవం’ వచ్చింది!!

 

*  *  *

ఆరవ రోజు

తన సమస్యకి తానే పరిష్కారం తెలుసుకోవాలి. ఊరికే మందులు వాడటం ఆ డాక్టర్ చెప్పినట్టు ఇట్స్ ఆఫ్ నో యూజ్. గాఢంగా నిద్ర పోవాలనుంటుంది. అలసిపోయినట్టు తెలుస్తోంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతున్నట్టు కాలేజీలో అందరూ చెబుతున్నారు. అద్దంలో ముఖం తనది కాదు. నవ్వలేకపోతోంది. దిగులుగా అనిపిస్తోంది. బరువు పెరిగింది. గత నెల రోజులుగా జుట్టు బాగా ఊడిపోయింది. చర్మం వడలినట్టు అనిపిస్తోంది. కళ్ళు గ్రహణం పట్టినట్టు నల్లటి వలయాల్లో చిక్కుకుపోయాయి. నిద్ర లేకపోవడం వల్ల ఇన్ని నెగటివ్ చేంజెస్ ఉంటాయని తెలిస్తే మొబైల్ ఫోన్ని బెడ్ రూమ్ గుమ్మం కూడా తొక్కనిచ్చేది కాదు. చప్పగా ఉంది లైఫ్. Such a tasteless, weary, tiresome, mundane life!

ఎవరితోనన్నా మాట్లాడాలనిపిస్తోంది. ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి కాసేపు తాళం చెవులతో మాట్లాడింది. బాగున్నారా అంది. బర్త్ డే ఎప్పుడని అడిగింది. చాలా ముద్దుగా ఉంది మీ కీచెయిన్ అని చెప్పింది. ఈ గుత్తిలో ఎన్నాళ్ళ నుంచి కలిసున్నారు అని ప్రశ్నించింది. మీరు స్కూల్లో దిగిన గ్రూప్ ఫోటోలు చూపించు అంది. ఇల్లంతా పరిగెత్తుతూ అన్ని తలుపులూ తాళం వేసి, తీసి కాసేపు గడిపింది. ఆట బాగుందా అని ఉత్సాహంగా అడిగింది.

ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం రాలేదు. వేసారిపోయింది. తన కోపాన్నంతా పిడికిలిలోకి తెచ్చి కీ బంచ్ ని విస్సిరి కొట్టింది. ప్రకృతికి తెలుసు వాటికి ప్రాణం లేదని, కిక్కురుమనకుండా ఆ మూలనే, తను వెళ్ళి తీసుకునే వరకూ అలానే, పడుంటాయని. “నేను మాట్లాడితే ఎదుటివాళ్ళు జవాబివ్వాలని కోరుకుంటున్నాను” అని చెప్పింది ఫ్రిజ్ తో. “నేను చెప్పే విషయానికి తగ్గ ఎమోషన్స్ చూపించాలి” అంది సోఫాతో. ఇలా లాభం లేదు. మనుషులు కావాలి. ఎక్కడ దొరుకుతారు మనుషులు? నాకు కావల్సిన మనుషులు? నన్ను కోరుకునే మనుషులు? “I want a social life” అరిచింది మేడ మీదకెళ్ళి. పక్కన ఫ్లాట్స్ లోని పన్నెండో అంతస్తులోంచి ఎవరో కిటికీ తీసి చూశారు. సంతోషంగా చెయ్యూపింది ప్రకృతి. చటుక్కున కిటికీ రెక్క మూసుకుపోయింది. కాంక్రీట్ కీకారణ్యంలో ఒక్కతే మనిషి పిట్టగోడ మీద నుంచొని ఆరంజ్ జ్యూస్ తాగుతూ ఎంతసేపుందో తెలీలేదు.

నిన్నంతా ఒక పబ్లిక్ పార్క్ లో కూర్చుంది. వచ్చేపోయే వందలమంది మనుషులు. ఎవరి లోకంలో వాళ్ళు. కాసేపు మొబైల్ తో గడిపింది. టిండర్ లో 225 మంది రిక్వెస్ట్ పంపి ఉన్నారు. ఆ 225మందినీ ఒకేసారి డేటింగ్ కి పిలవాలనిపించింది ప్రకృతికి. అందరినీ డిక్లయిన్ చేసింది. సాయంకాలానికి మొక్కలకు నీళ్లు పెట్టారు. దూరంనుంచి వేయిస్తున్న బజ్జీల వాసన, వేడికి కాగిన మట్టి వాసన కలిసి ప్రకృతిలో ఆకలిని రేపాయి. లేచి వెళ్ళింది. వాసన బానే ఉంది కాని నూనె నచ్చక మళ్లిపోయింది. ఇంటికెళ్తే ఒంటరితనం. ఇక్కడున్నా పెద్ద తేడా ఏమీ లేదు. డాక్టర్ని కలిసొచ్చాక రాత్రంతా మోకాళ్ళ మీద గడ్డం ఆనించి కాలి బొటన వేలితో టీవీ రిమోట్ నొక్కి చానెల్స్ మారుస్తూనే ఉంది.

మౌనం చెవుల్లో గుయ్యిమంటోంది. పబ్ కెళ్తే ? ఆడే పాడే జనం. సంతోషంగా అందంగా అనిపించే జనం. వయసు తక్కువగా డబ్బు ఎక్కువగా కనిపించే జనం. వైన్ రంగులో శ్పగెట్టి స్ట్రాప్ డ్రెస్ ఉంది. అది వేసుకుని వెళదామనుకుంది.

ఈ లోపు ఏదో ఒకటి వండుకు తిందామని వంటగదిలోకి వెళ్ళింది. కావాలని గిన్నెలు చెంబులు స్టెయిన్లెస్ స్టీల్ సింకులో ఎత్తెత్తి పడేసి ఆ చప్పుళ్ళు వింటూ ఉంది. మందపాటి ప్లాస్టిక్ పీట మీద టమేటాలని ఎంతగా తరిగినా చప్పుడు రాలేదు. కరకరమంటూ తెగి పడిన ఉల్లిపాయల్ని కన్నీళ్లతో జాలిగా చూసింది. కూరముక్కల్లో కోడిగుడ్డు కలిపి మైక్రోవేవ్ ను రెండు నిముషాలకు సెట్ చేసి ఎడమ పాదం గోడకు ఆనించి చేరగిలి టైమర్ వంకే చూస్తూ ఉంది మౌనంగా.

గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు ఎన్నో మోగుతుంటే….’

ఉన్నట్టుండి పెదవుల మీదకు పాట పాకింది పొగలా. గుండె ప్రశాంతంగా కొట్టుకుంటోంది. ఇందులో గంటలు మోగితే? నవ్వుకుంది ప్రకృతి. గుప్పెడంత గుండె ఎక్కడుంటుంది? ప్రకృతి చేయి బ్రెస్ట్ బోన్ మీదుగా కిందకు పాకింది. మనిషి శరీరాన్ని నిలువుగా సగానికి నరికితే గుండె గాయపడుతుంది. ఎవరో మధ్యనుంచి కొద్దిగా – చాల కొద్దిగా- ఎడమవైపుకి తోసినట్టే గుండెకాయ అమరి ఉంటుంది. ప్రకృతి చేయి కొంచెం పక్కకి జరిగి అక్కడి ఎత్తు మీద ఆగింది. ఇది గుండెకి రక్షణ. ఎన్నో రాత్రులు ఇక్కడ చేయి వేసుకొని సుఖంగా నిద్రపోయింది. ఏదీ ఆ నిద్ర ఇప్పుడు రాదెందుకని? ఆ సుఖం ఇప్పుడు లేదెందుకని? నిద్రపోకుండా బతకచ్చుగా? నిద్రకోసం ఎందుకీ కలవరింత? లేనిదే కావాలన్న సలపరింత?

ఓవెన్ బెల్ టంగుమని మోగి తలుపు తెరుచుకుంది. ఉలిక్కిపడింది ప్రకృతి. గుండె వేగం పెరిగింది. అరచేతికింద ఏదో గట్టిగా తగిలింది. ఆశ్చర్యంతో చేయి తీసి మళ్ళీ వేసింది. అదే గట్టిదనం. పరుగున వెళ్ళి అద్దం ముందు నుంచొని పరీక్షగా చూసుకుంది. తేడా తెలీలేదు. గింజని చూడాలంటే పండు వలవాల్సిందే. ప్రకృతి బట్టలు కుప్పగా కింద పడ్డాయి.

 

ఒక సమాంతర విశ్వంలో

“సర్, తల్లి తన బిడ్డల్ని ఎందుకు ప్రేమిస్తుంది?”

నవ్వాడు. “నీ ప్రశ్నకి సమాధానం కావాలంటే ముందు నువ్వు నా ప్రశ్నకి జవాబు చెప్పు. తల్లి అంటే ఎవరు?”

“వెరీ సింపుల్. మనం దేన్నుంచి ఏర్పడ్డామో అది తల్లి” భుజాలెగరేసింది.

“రైట్. అయితే అది కేవలం సింగిల్ సెల్డ్ ఆర్గనిజమ్స్ కే వర్తిస్తుంది. కణాల సంఖ్య పెరిగే కొద్దీ, పరిమాణం పెరిగే కొద్దీ పుటక ఒకే జీవి వల్ల కుదరదు. రెండు జీవులు కావల్సి వస్తాయి. జీవి ఏర్పడటానికి అవసరమైన పదార్థాలు ఈ రెండిటిలో ఉంటాయన్నమాట. సో, ప్రతి బహుకణజీవికీ రెండు తల్లులు ఉంటాయి” అత్యంత తార్కికమైన, అసాధారణమైన ఈ వివరణ ఆమెకు ఆశ్చర్యం కలిగించింది.

“మరి, కొత్త జీవి ఏర్పడటానికి కావాల్సిన పదార్థాలు రెండుతల్లుల్లో సమానంగా ఉంటాయా సర్ ?”

“Absolutely yes! అయితే మరి ఈ రెండిటిలో ‘తల్లి’ అని దేన్ని పిలవాలి?”

“దేన్నైనా…” నడుస్తున్నదల్లా ఆగి సందిగ్ధంలో పడింది.

ఆమె ముఖంలో స్పష్టంగా కనబడిన అనుమానాన్ని చూస్తూ తనూ ఆగిపోయి “కరెక్ట్. ఇది చెప్పు. ఒక ఏక కణం రెండుగా విడిపోయాక, తల్లి కణం ఇంకా మిగిలి ఉంటుందా?” అడిగాడు ప్రొఫెసర్.

“ఉండదు !” టక్కున చెప్పింది.

“మల్టీ సెల్డ్ ఆర్గనిజమ్స్ అలా కాదు, తల్లులు, బిడ్డలు అన్నీ మిగిలే ఉంటాయి, వేర్వేరుగా ఉంటాయి”

“ఓకే” ఆమె ఎప్పుడో నేర్చుకున్న విషయమే అయినా ఆయన చెబుతుంటే కొత్తగా అనిపిస్తోంది.

ప్రొఫెసర్ నడక, మాటలు కొనసాగించాడు – “అలా వేర్వేరుగా ఉన్న తల్లులు తమ బిడ్డలను కంటికి రెప్పలా సాకుతాయి. ఏ జీవజాతికైనా అత్యంత ముఖ్యమైనది తన ఉనికిని కాపాడుకోవటం. ఇంకో రకంగా చెప్పాలంటే తన జాతిని అభివృద్ధి చేసుకోవడం…..”

“That’s survival instinct !” పెద్ద పెద్ద అంగలతో ఆయన్ను సమీపిస్తూ అంది.

“Exactly. దానికి తర్కం, హేతువు ఉండవు. జాతివృద్ధి కోసం చాలావరకు బుద్ధిజీవులు – ముఖ్యంగా క్షీరదాలు – పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. బలిష్ఠమైన, తెలివైన, ఆరోగ్యవంతమైన జీవిగా బిడ్డ ఎదగటం కోసమే తల్లులు అహర్నిశలూ కాపు కాస్తాయి, కష్టపడతాయి. సో, తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది అండ్ బిడ్డల్ని ప్రేమించటంలో ఇద్దరు తల్లులూ ఒకటే. Got your answer?”

ఇంకా ఏవో అసంతృప్తి నీడలు కదలాడుతున్నాయి ఆమె కళ్ళలో.

“పిల్లల్ని సాకటంలోని ఇష్టం డీ.ఎన్.ఏ.లో నిక్షిప్తమై తరం నుంచి తరానికి పాకుతుంది. బిడ్డ పుట్టిన అనుభవం కలిగిన వారికి ఆ ఇష్టమే తెలుస్తుంది కాని కారణం తెలియదు. అందుకే అది అవ్యాజమైన ఇష్టం. పేగుబంధం అనీ, రక్తసంబంధం అనీ అంటుంటారు దాన్నే. దానికే ప్రేమ అనే పేరు పెట్టారు”

“సర్, అంటే మీరనేది, తల్లులు తమ నుంచి ఏర్పడ్డ బిడ్డలని మాత్రమే ప్రేమిస్తాయా?”

నవ్వాడు. ఈ అమ్మాయి ఏ విషయాన్నైనా తరచి తరచి తెలుసుకోనిదే వదిలిపెట్టదని చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. ఇలాంటి చర్చలు వారిద్దరికీ మామూలే.

“జాతిధర్మం ప్రకారం ఒక జీవి తన జాతికి చెందిన జీవులన్నిటినీ ప్రేమిస్తుంది. తన స్వంత ఉనికికి భంగం వాటిల్లనంత వరకు ఆ ప్రేమ ఉంటుంది. తీవ్రతలో తేడాలుంటాయి. కారణం తెలియని ఇష్టం ఎవరి మీద కలిగినా దాన్లోని ఉధృతిని బట్టి అది అభిమానమో ప్రేమో ఖచ్చితంగా అయ్యుంటుంది. తనని తాను ప్రేమించుకునేంత స్థాయిలో, ఇంకా ఎక్కువ స్థాయిలో ఇతర జీవులని, ఇతర జాతులని ప్రేమించటం కొంతమందికే సాధ్యమవుతుంది. ఎందుకిలా అనేదానికి ఇంతవరకు సరైన సమాధానం దొరకలేదు మనకి. బహుశా తన పేగునుండి పుట్టడంవల్లా తమ లక్షణాలే బిడ్డకు వస్తాయి కాబట్టీ బిడ్డను ఇద్దరు తల్లులూ గాఢంగా ప్రేమిస్తారని మన అభిముఖ గ్రహవాసులు తేల్చారు”

“మీరు చెపుతున్న దాని ప్రకారం ఆలోచిస్తే ఈ సృష్టిలో అన్నింటికన్నా గొప్పది తల్లి ప్రేమ అనేది తప్పనిపిస్తోంది?!”

“గుడ్ క్వశ్చన్ వికృతీ !” ఈ మాట అనగానే ఆమె ముఖం వెలిగిపోవటం గమనించాడు. అందుకే తనకి ఆలస్యం అవుతున్నా ఆగాడు.

“‘గొప్ప’ అనేదాన్ని నువ్వు ఎలా నిర్వచిస్తావు? కోట్ల సంవత్సరాల కిందట భూమి మీద ఐన్ స్టైన్ అనే జీవి ఉండేది. అది అప్పట్లో అత్యంత మేధావిగా గుర్తింపు పొందింది. ఆ జీవి మూల ప్రకృతి ఆధార నియమాలను, శక్తి విధాయకాలను కనిపెట్టింది. అది అప్పట్లో గొప్ప. ఇప్పుడు మనకు చిన్న పిల్లలు కూడ చెప్తారు. వాళ్లకెలా తెలుసు? స్వయంగా చూశారా? పరిశోధనలు చేశారా ? ప్రకృతి పని చేసే మౌలిక సూత్రాలు అవి. మన మేధస్సులో నిక్షిప్తమైపోయిన జ్ఞానం అది. దాన్ని గౌరవించని భూగ్రహ వాసులు ఎలా నాశనమై పోతున్నారో మనం రోజూ విశ్వాంతర సమాచారంలో ప్రత్యేక కార్యక్రమాలుగా చూస్తూనే ఉన్నాం. మానవ జీవి గొప్ప బుద్ధిజీవి అన్నారు. ఏది ఆ గొప్పతనం? తన జాతిని తానే నాశనం చేసుకునే బుద్ధి గొప్పదా?” భూమి గురించి ఒకింత వేదనతో ఆవేశంగా మాట్లాడుతుంటే వికృతి ఆయన్ను విస్మయంగా చూసింది.

రవంత మౌనంగా ఉండి తమాయించుకొని “స్వార్థం కోరనిది, స్వార్థం లేనిది గొప్పది అవుతుంది అంటారు ఇంకొంతమంది. అలా చూస్తే ‘ప్రేమ’ అనే నిజమైన అర్థంలో ప్రేమే గొప్పది. అది తల్లిదా మరొకరిదా అనవసరం. ఇక పోతే నీ ప్రశ్నలో రెండో ముక్క. తప్పు అనేది ఎందుకు తప్పు, ఎలా తప్పు, దేంతో పోలిస్తే తప్పు అని ఆలోచించాలి గాని, నిశ్చిత, నిరపేక్ష సత్యం, అసత్యం రెండూ ఉండవు. అలాగే ప్రేమ అనేది కూడ!” చెప్పాడు.

“అందుకేనా మన అభిముఖ గ్రహం నిశ్చరం అని ఎప్పుడూ అంటుంటారు? అది నిజం కాదని తెలిసినా?” నవ్వింది కుడికన్ను రుద్దుకుంటూ. ప్రొఫెసర్ కూడ నవ్వేశాడు. వాతావరణం తేలిక పడింది.

“Very foolish of them. Relativity గురించి ఎన్నిసార్లు నేను గొంతు చించుకున్నా వారికి ఎక్కదు. బుద్ధికి కొన్నిసార్లు నిజం గిట్టక పోవచ్చు. ఆయా సందర్భాల్లో బుద్ధిజీవి ఉనికికే ప్రమాదం వాటిల్లవచ్చు. అందుకే నిజం అందరికీ తెలియకూడదు. కొంతమంది బుద్ధిహీనులుగానే ఉండిపోవాలి. కాలంతో వ్యత్యాసం లేనిది సత్యం ఒక్కటే. అయితే సత్యం నిజంగా ఉంటే, ఆ వెంటే అసత్యం కూడ ఉంటుంది.”

“According to the fundamental law of energy?” మెరుస్తున్న కళ్ళతో సూచించింది.

“సరిగా చెప్పావ్. వెరీ గుడ్.”

“అయితే అసత్యం entropy లాంటిదా? Or something like anti-matter?”

“అది మీరు పై తరగతిలో చదువుతారు. అప్పటిదాకా ఓపిక పట్టు” తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు.

*  *  *

పదకొండవ రోజు

బాత్ టబ్ లో సబ్బు షాంపూ బాడీ వాష్ కలిసిపోయిన తెలినురుగులు. చర్మంపై నూనె, గోరువెచ్చటి నీరు కలివిడిగా ఏర్పడ్డ నునుపైన పొర. తాజాగా కనుగొన్న సౌందర్య సంచయం మెదడులో ఏవో విస్ఫోటనలకి దారి పరుస్తోంది. గంట నుంచీ నీళ్ళలో నానుతున్నా ఎడతెగని తాపం. గిల్లినా గిచ్చినా పరవశమే. కొత్తగా, మత్తుగా, గమ్మత్తుగా ఉంది. చిత్తుచిత్తుగా అమృతం తాగినట్టుంది. ఇంకా ఇంకా తాగాలనుంది. శరీరం వెదజల్లుతున్న వాసన ఇంత బాగుందేంటి.

విరబూస్తున్న పూలవనాన్ని నరాలతో కట్టేసినట్టు వింత అనుభూతి. ఏమిటో ఎందుకో తెలియని సుడులు తిరిగే సంతోషం. కొత్త నిర్వచనాలేవో తెలుస్తున్నాయి. అరచేత్తో అడిగితే ఒక సమాధానం, పది వేళ్ళ ప్రశ్నలకీ పది పదుల వంద సమాధానాలు. తను ఆశించినట్లే అందమైన జవాబు దొరుకుతోంది. ప్రకృతి తన దేహంతో మాట్లాడుతోంది. దేహభాష ఇంత తియ్యగా కవ్వింతగా పులకింతగా ఉంటుందా! కళ్ళు మూతలు పడిపోతున్నాయి ఎందుకు? మైకం కమ్మేస్తోంది ఏంటి?

మూడు నిముషాలు కూడ గడవకముందే ప్రకృతి తల నీటిలో మునిగిపోయింది.

*  *  *

‘సంపూర్ణ సమాంతర భూ గ్రహ విజ్ఞాన సర్వస్వం’ తన ముందేసుకు కూర్చుంది వికృతి. తమది పాలపుంతలోని సౌర భూమి లాంటిదే అందమైన నీలి గ్రహం. భూమికి వ్యతిరేక దిశలో తిరిగే గ్రహం. తమ నక్షత్ర మండలానికి పంతొమ్మిది లక్షల కాంతి సంవత్సరాల కింద ఉన్న కృష్ణ బిలంలోంచి ఇరవై ఏడు వేల కాంతిసంవత్సరాల దూరం ఇంకా కిందకి వెళితే భూమిని చేరుకోవచ్చు. ఇది తను చిన్నప్పటినుంచి వింటోంది. భూమిని చేరుకోవటానికి ఇదే దగ్గరిదారి. పంతొమ్మిది లక్షల కాంతి సంవత్సరాలు తమకున్న వ్యోమవాహనాలతో దాటటం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఆ దారిలో అంతా శూన్యమే. గ్రహశకలాలు కూడ లేవు. ఆ కృష్ణబిలం గురించే తంటాలన్నీ.

తన దగ్గరికొచ్చిన దేన్నైనా తనలోకి లాగేసుకునే, తనలాగా మార్చేసుకునే తత్త్వం గల కృష్ణబిలం అచ్చంగా ప్రేమలాంటిదే. కాంతిని కూడ బంధించేసే చీకటిఊబి.

దక్షిణధృవానికి దగ్గరగా ఉంటుంది తమ దేశం. అందుకే అక్కడి ఆకాశంలో ఒక్క రిక్క కూడ ఉండదు. పుస్తకంలో బొమ్మలు చూసింది. భూమ్మీద ఏ ధృవంనుంచైనా, ఏ చోటనుంచైనా ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు కనబడతాయట! భూమికి ఒక చంద్రుడు ఉన్నాడట. ఆకాశంలో తెల్లగా మెరుస్తాడట. దారిలో ఈ కృష్ణబిలం గనక లేకపోయుంటే తమకీ పాలపుంత కనిపించేది. తెల్లటి ఆ విశ్వం నల్లటి తమ రోదసిలో నిండుగా అందంగా ఉండేది. ఆకాశపు బోసితనాన్ని పాల చుక్కలా కడిగేసేది. ఆ ఒక్క కృష్ణబిలం గనక లేకపోయుంటే….

ప్రేమ వద్దనిపిస్తోంది. అందం కావాలనిపిస్తోంది.

నిట్టూర్చింది వికృతి కుడికన్ను రుద్దుకుంటూ. తమ భాసన్తి సూర్యుడికి కాలం సమీపించింది. కాలం అంటే ఏమిటో అసలు. ‘క్రమంగా ఎర్రబడుతున్నాడు. మహా అయితే ఇంకో ఇరవై కోట్ల సంవత్సరాలు’ అని కాలేజీలో ఎవరో చెప్పుకుంటుంటే విన్నది. ఇవన్నీ ఎలా లెక్కగడతారో భలే వింతగా ఉంటుంది. అభిముఖ గ్రహం, భూమి ఒకేలా ఉంటాయని, అక్కడి మనుషులే ఇక్కడ ఉంటారని, అయితే వేరుగా ప్రవర్తిస్తూ ఉంటారని, అలాంటి ప్రపంచానికి వంతెన వేయడం సాధ్యమేనని తన సీనియర్స్ చెప్పుకున్నారు ఒక రోజు గుసగుసగా. ఆ సిద్ధాంతాన్ని కనిపెట్టిన ప్రొఫెసర్ హాకింగ్ ఆ రోజు సీనియర్స్ కి జూనియర్స్ కి కలిపి స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు. మామూలుగానే బవిరి గడ్డం సవరించుకుంటూ అడుగుపెట్టగానే అందరూ గప్ చిప్ అయిపోయారు. కృష్ణబిలాలకు నక్షత్రాల్లాగే ఆయుష్షు ఉంటుందనీ, త్వరలో మన కింద ఉన్న కృష్ణబిలం శక్తివిహీన అయిపోబోతోందనీ ఆయన చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. వికృతి కొత్తందాల్ని సంతరించుకోబోతున్న తమ ఆకాశాన్నీ, తలకింద చేతులు పెట్టుకుని ఆరుబయట పడుకుని చుక్కలా కనిపించే పాలపుంతను చూస్తున్న తననూ ఊహించుకొని మురిసిపోయింది. అయితే తమవి parallel lines లాంటి universes. వాటిని కలపటం లేదా ఒకదాని నుంచి మరోదానికి ప్రయాణించడం సాధ్యపడుతుందా? విశ్వ గమనంలో గ్రహగమనమెంత ఆఫ్ట్రాల్! భూమిసమయానికి అభిముఖ గ్రహసమయానికి కోట్ల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. సమయం కాలం రెండూ ఒకటేనా, రేపు ఎలాగైనా సర్ ని అడగాలి అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.

*  *  *

అంతా చీకటి. రెప్పల పైనా కిందా ఒకే చిత్రం చిత్రిస్తూ చీకటి.

అంతా మౌనం. సమాధిలోను శ్మశానంలోనూ ఒకే కథ వినిపిస్తూ మౌనం.

ఇంకా చెట్టు కింద తెల్లటి బట్టలు వేసుకుని విరబోసుకున్న నల్లటి జుట్టు దయ్యం కనిపిస్తూనే ఉంది. హనుమాన్ చాలీసా ఎంతకీ గుర్తు రావటం లేదు. గుండె గొంతులోకొచ్చింది. కంట్లో ఏదో పడ్డట్టుంటే నలుపుకుంటూ మళ్ళీ చూసింది. అది ఒంటరి దయ్యం కాదు. ముఖం అటు పెట్టి ఉంది. మట్టిలో ముసలి దయ్యం కూలబడి పోయింది, దాన్ని లేపటానికిది ప్రయత్నిస్తోంది. ఎక్కణ్ణుంచో మంత్రం “ఉత్తిష్ఠన్తు భూత పిశాచాః  ఏ తే భూమి భారకాః”

‘లే పదా ఇది మనం ఉండాల్సిన చోటు కాదు, వెళ్ళిపోమంటున్నారు’

‘నే రాలేను.’

‘ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళు పిలిచే దేవత చాచి పెట్టి కొడుతుంది, అప్పుడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల లోకాలు దాటి బతుకు జీవుడా అని పాతాళంలోకి ఎగిరి పడతాం శాశ్వతంగా. లే పోదాం.’

‘నే రాలేను.’

‘అలా అంటే కుదరదు, పద పదా’ అంటూ కుర్ర దయ్యం ముసలి దయ్యం రెక్క పుచ్చుకు గుంజింది. ప్రకృతి దయ్యమూ కాదు, మంత్రమూ చదవలేదు. జరుగుతున్న దానికి సాక్షి. దూరంగా నిలబడి చెట్టు కింద ఉన్న దయ్యాలనే చూస్తోంది భయం భయంగా.

అంతలో మంత్రం పూర్తయింది. నల్లజుట్టు దయ్యం గాభరా పడుతున్న సంగతి తెలుస్తూనే ఉంది. స్థలశుద్ధి కోసం గాయత్రీ మంత్ర సహితంగా చల్లుతున్న నీళ్ళు ఠపాఠపా ప్రకృతి మొఖాన వచ్చి పడ్డాయి. ఆగకుండా టప్ టప్ మని ఎవరో చల్లుతూనే ఉన్నారు. ‘వద్దు! వద్దు! ఇక చాలు!!’ అంటూ చేతులు గాల్లో తిప్పుతూ ఉండగా ఆ విసురుకి మెలకువ వచ్చింది. గుండె కొట్టుకునే శబ్దం తగ్గు ముఖం పట్టాక ఇహలోకపు శబ్దాలు వినిపించసాగాయి ఆమెకు. బాత్రూం ట్యాప్ లోంచి బకెట్ లోకి టప్ టప్ మని పడుతున్న నీటి చుక్కల శబ్దం పోల్చుకుంది. ఎంత పొడుగు జుట్టో దయ్యానికి. పాపం ఆ ముసలి దయ్యం అంత దీనంగా ఎందుకుంది? వెళ్తుందో వెళ్ళదో. కలలో భయం వేసింది కానీ మెలకువలో ఉత్సుకత పెరిగింది- అవి మంత్రం పూర్తయ్యే లోపు వెళ్ళిపోయాయా లేదా?

ఏంటి ఈ కలలు! చెమటలు తుడుచుకుందామని కుడి చెయ్యి లేపింది ప్రకృతి. అది లేవలేదు. ఏదో కిలోల కొద్దీ బరువున్నట్టు కదలకుండా ఉండిపోయింది. ఏమైంది నాకు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. ఎడమ కంట్లో వెంట్రుక గుచ్చుకోవటంతో భారంగానే మళ్ళీ కళ్ళు తెరిచింది. చెయ్యి లేవదేంటి? ఎడమ చెయ్యి కూడా కదలటం లేదు. తల అటూ ఇటూ తిరగటం లేదు. ఇది గ్రహించిన ఆమెకు నిద్ర మత్తు పూర్తిగా వదిలిపోయింది. మెడ మీద నుంచి ఎదురుగా ఎద ఎత్తుగా కనపడింది. దానిమీద అటు తిరిగి కూర్చున్న నల్ల జుట్టు దయ్యం. దానిదే ఈ బరువు.

అప్పుడు కలిగింది ఆమెకు పిచ్చి భయం! హనుమాన్ చాలీసా ఉంటుందనే ఎరిక విచిత్రంగా మాయమైపోయింది. కంకర రాళ్ళ దారి మీద విపరీతమైన వేగంతో పోతున్న రైలులాగ చప్పుడు చేసింది ఆమె గుండెకాయ. పెనుకేక వేయాలని పొడారిపోయిన గొంతు తెరిచింది. పొడవాటి నల్లటి జుట్టు కంఠానికి చుట్టుకొని శబ్దం రానివ్వలేదు. అవిసిపోయిన గుండెలతో భయ విహ్వల అయి స్పృహ తప్పి మంచం మీద నుంచి దొర్లి కింద పడిపోయింది ప్రకృతి.

*  *  *

ఈ కల తనకు ఎందుకిలా పదేపదే వస్తుంది? ఎగుడుదిగుడుగానే అయినా దాదాపు గుండ్రంగా ఉన్న ఓ గ్రహం. దాని మీద చీకటి సముద్రం. చిత్తడి చిత్తడి నేల. ఎవరి రాక కోసమో ఎదురుచూస్తున్నట్టు పొడవాటి గట్టు. అమిత వేగంతో వచ్చే తెల్లటి కాంతిమంతమైన ఉల్కలు, తోకచుక్కల కోసం స్వాగత తోరణాలు కట్టి తెరిచి ఉంచిన తలుపులు. వాటిలో ఏ ఒక్కటైనా తన క్షేత్రంలో జీవాన్ని వికసింపజేయదా అనే ఆశలో ఊగిసలాడే అలలు. ఏదో కావాలనిపిస్తోంది. అదేమిటో తెలుసుకుందామనే ఆత్రుతలో మెలకువ వచ్చేస్తోంది.

*  *  *

పదమూడవరోజు

దేవుడా మోయలేని ఈ అందాలు నాకెందుకిచ్చావ్ ? పోనీ, మోసే ఆసామిని దూరమెందుకు పెట్టావ్? నాలుక నోరంతా నాట్యం చేసింది. పైపళ్ళ చిగుళ్ళని లోపల నుంచి తాకితే ఒళ్ళు ఝల్లుమంది. పరుచుకున్న మౌనాన్ని ధిక్కరిస్తూ “ఊఁ” అన్న ప్రణయనాదం ఇల్లంతా తిరిగొచ్చింది.

ఇప్పటికిప్పుడు ఎర్రటి పెదవులపైన ఒక కాటు కావాలి. తెల్లటి తొడలపైన ఒక గాటు కావాలి. ఒంటరితనానికి స్నేహపు వేటు కావాలి. గులాబీకి ఓ ముల్లు కావాలి. ప్రియుడు గుర్తొచ్చాడు ఆమెకి. వెంటనే అదురుతున్న చేతులతో ఆరంజ్ జ్యూస్ గ్లాసును పక్కన పెట్టి ఫోన్ చేసింది.

మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా….’  పాట రెండు లైన్లు అయ్యాక ‘మా కస్టమర్ ఏ కాల్నీ స్వీకరించుట లేదు’ అని ఒక వాక్యం. ఎవరో నిజంగా వ్యక్తిగతంగా తనకే చెప్పినట్టు అనిపించింది ప్రకృతికి. తన పని వినటమేనా. మాట్లాడే అవకాశమే లేదా. అసంతృప్తిగా అనిపించింది. వాట్సప్ లో సందేశం పంపింది రాత్రికి వస్తానని, అడ్రస్ మారితే లొకేషన్ షేర్ చెయ్యమని. బెడ్ మీద అసహనంగా అటూ ఇటూ దొర్లింది. అందంగా కనపడటమే కాదు, అందంగా ఉండాలి కూడ అనుకునే స్త్రీ ఆమె. వెంటనే మళ్ళీ ఫోన్ తీసి దగ్గర్లోని బ్యూటీ సెలోన్లను వెతికింది. ఒకటి నచ్చింది. తల మీది జుట్టు నుంచి కాలి గోళ్ళ వరకు మూడు గంటల్లో అన్నీ తీర్చిదిద్దే ఒక ప్యాకేజీని ఎంచుకుని ఆన్లైన్లో డబ్బులు కట్టేసింది. వెంటనే మెసేజ్. మీ డబ్బులు అందాయి, మా సేవలు వినియోగించుకోవడానికి మధ్యాహ్నం నాలుగు గంటలకి పార్లర్ కి రండి అని.

ఖర్చు పెట్టిన ఐదు వేలు తన అందాన్ని ఐదు రెట్లు పెంచినందుకు తృప్తిగా అనిపించింది. లాకర్లో పెట్టిన డ్రెస్, హ్యాండ్ బాగ్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు కొన్ని తలలు తనవైపు తిరగటం గమనించింది. ‘రాత్రికి చచ్చాడు’ అనుకుంటుంటే ఉషారు వచ్చింది. గబగబా ఇంటికి వెళ్ళింది. ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఫేస్బుక్ ని సవరిస్తూ నిద్రలోకి జారుకుంది.

రాత్రికి నిజంగానే చచ్చాడు ప్రకృతిని చూసి. నయనాల పలకరింపుల్లో యవ్వన వీణ సవ్వడి చేయకుండా శృతి అయింది. అతని చూపులే ఆత్రపడ్డాయి.

రాసలీల వేళ రాయబార మేల.. మాటే మౌనమై మాయ జేయ నేల

ఈ మౌనం భరించలేకపోతోంది. “ఏదైనా మాట్లాడు” అంది అతని జుట్టు పట్టి తల ఎత్తి. “నా నాలుక ఇప్పుడు మాట్లాడుతూనే ఉందిగా” కొంటెగా అని మళ్ళీ తల దించేశాడు. కొన్ని క్షణాల్లో బద్దలవబోతున్న ఆనందాన్ని వదులుకోవడం ఇష్టం లేక కళ్ళు మూసుకుంది. ఎడమ కంట్లో ఏదో గుచ్చుకుంటోంది. వెంట్రుక కావచ్చు. దాని సంగతి తర్వాత చూడచ్చులే. ఆమె అరచేతులు రెండూ దుప్పటి మీదా అరికాళ్ళు రెండూ అతని మెడచుట్టూరా పట్టు బిగించాయి.

 

*  *  *

కలలో తను ఒక గ్రహం. మెలకువలో ఒక మనిషి. కల – మెలకువ. ఈ రెంటిలో ఏది సత్యం ఏది అసత్యం? ఏది ప్రకృతి ఏది వికృతి? ఏది భూమి ఏది అభిముఖం? సందేహాల బతుకొక చిత్తు పుస్తకం. అలా అనుకోగానే చిరాకొచ్చింది వికృతికి.

లేచి ఆరుబయట ఆకాశం చూడటానికి వెళ్ళింది. ఇప్పుడు రాత్రి. భాసన్తి సూర్యుడు అస్తమించాడు.  అస్తమించడమేంటి- అసలీ పదం నచ్చదు తనకి. అక్కడికేదో నిజంగా విశ్వమంతా వెలుతురులో మునిగి తేలుతున్నట్టు రాత్రయితే చీకటి కావడం, ఆ చీకటిని మనుషులంతా అసహజమని భావించడమేంటి? విశ్వంలోని సహజ సమయం రాత్రే. కేవలం నక్షత్రకాంతి గ్రహపార్శ్వాన్ని తాకినప్పుడు మాత్రమే పగలు అవుతుంది. గ్రహ తతుల నక్షత్ర తతుల మధ్య ఉండేది శూన్యం, కాంతి కనపడని శూన్యం. అభిముఖగ్రహం చిన్నది కావటంవల్ల ఎర్రటి భాసన్తి సూర్యుడు ముప్పావుభాగంలో కనబడుతూనే ఉంటాడు. మిగిలిన పావుభాగంలో వక్రీభవనం చెందిన అరుణవర్ణం కిచ్చిలి రంగులో ఆకాశాన్ని మెరిపిస్తూ ఉంటుంది. అదే రాత్రి సమయం.

కాలగణన వికృతికి ఎప్పుడూ అర్థంకాదు. చాల చిత్రంగా అనిపిస్తుంది. కాలం జీవానికున్న ఆదిభౌతిక పరిమితి. It is just an empirical dimension. ఒకరి కాలం మరొకరి కాలం సమానం కాదు. అందుకే కదా ప్రొఫెసర్ హాకింగ్ భూమిమీద అస్తమించినా అభిముఖ గ్రహం మీద బతికే ఉన్నారు?! అప్పట్లో ఈ విషయం తెలుసుకోవడానికి తమకి నెలపైనే పట్టిందిట. అంటే తాము భూమికంటె వెనకబడి ఉన్నామా? మరి సాంకేతికత? భూగ్రహ వాసులకి తమతోబాటే ఒక సమాంతర ప్రపంచమున్నదని తెలియాలంటే కనీసం ఇంకో వెయ్యేళ్ళు పడుతుందని కాలేజీలో అనుకుంటూ ఉంటారు. ఎవరి వెయ్యేళ్ళు అది? భూమిదా మాదా? కాలం కదలికలను గుప్పిట పట్టగలవారెవ్వరు?

తలకింద చేతులు పెట్టుకొని నిశ్శబ్ద నిశ్చల ఆకాశాన్ని చూస్తూ కృష్ణబిలం లాంటి నల్లటి నిద్రలోకి జారుకుంది.

 

*  *  *

సగానికి మడిచిన దోశెలా ఉన్నాడు చంద్రుడు. నెమలేదో ఎగురుతూ రంగు రాల్చి వెళ్లినట్టు అర్ధరాత్రి ఆకాశం అద్భుతమైన నీలి రంగులో ఉంది. మిడ్ నైట్ బ్లూ. వాటర్ ట్యాంక్ పైన పడుకొని కాలు మీద కాలు వేసుకొని తల కింద చేతులు పెట్టి ఆకాశం వంకే చూస్తోంది ప్రకృతి. పెట్టుకున్న చేతిగడియారంలో సెకన్ల ముల్లు చేస్తున్న శబ్దం తప్ప అంతా మౌనం. నిశీథి నిశ్శబ్దం.

ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ రాత్రి! Are those stars or planets that blink in the gentle breeze ? దూరానికన్నీ నక్షత్రాల్లానే కనిపిస్తాయి. వాటిమీద- at least on one of them- తనలాగే పడుకొని తనలాగే ఆకాశం వంక చూసే అమ్మాయెవరైనా ఉంటుందా?

గాలైనా లేని గ్రహాల మీద శబ్దం ప్రయాణిస్తుందా? లేక అవి తనలాగే మౌనముద్ర వేసుకొని ఉంటాయా? వేల సంవత్సరాలనుంచి మాట్లాడకుండా మౌనంగా ఉండటం గ్రహాలకి బోరనిపించదూ? అద్భుతమైన రహస్యాలను తనలో ఇముడ్చుకున్న విశ్వగోళం సృష్టి ఆరంభ దశలో ఒక అండమని నేషనల్ జెగ్రాఫికల్ లో చూసిన వీడియో గుర్తొచ్చింది. మనిషీ అంతే కదా. అండం పిండం బ్రహ్మాండం. కణాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకోకుండానే ఎలా కనిపెడతాయి కలవాలని, పెరగాలని, కోలుకోవాలని? మౌనంగానే ఎలా విభాజనం చెందుతాయి? తనకెలా తెలుస్తోంది దేహంతో ఎలా మాట్లాడాలో? ఏ భాష ఇది? తనకి మెదడున్నట్టు ఈ విశ్వానికీ ఎక్కడో మెదడుంటుందా? తన మెదడు తనను నియంత్రించినట్టు, ఆజ్ఞాపించినట్టు విశ్వం మెదడు విశ్వాన్ని control చేస్తుందా? నిశ్శబ్దం మౌనం ఒకటేనా? జవాబు దొరకక ఎంత వ్యాకులత పడుతోంది!?

తన circle లో ఇలాంటి ప్రశ్నలకి జవాబులు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కాలేజీలో ప్రొఫెసర్ ఒకాయన్ని అడిగితే ‘నీ స్ట్రీమ్ ఏంటి, నువ్వడుగుతున్న డౌట్ ఏ స్ట్రీమ్ ది’ అని చిరాకుపడ్డాడు. తను వెనుదిరగ్గానే ‘ఆడపిల్లలకి బ్రెయిన్ ఉండటం వేస్ట్’ అన్నాడు పక్కనే కూర్చున్న అసిస్టెంట్ తో. He thinks, rather, a lot of men think that girls are bosoms and bottoms. ఇక వాడి మొహం కూడ చూడాలనిపించక వచ్చేసింది. నాలుగు రోజులయింది కలిసి, డాక్టర్ని అడిగితే చెప్తాడా పోనీ ? చంద్రుడు ఎర్రబడే వేళకి లేచి బట్టలు వేసుకొని ఇంట్లోకి వచ్చింది. ప్రియుడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.

 

*  *  *

పద్నాలుగవ రోజు

“లే డియర్! ఇంకా పడుకున్నావా? చాలా పొద్దెక్కింది. నేను బయటకి వెళ్ళిపోతున్నాను. ఆమ్లెట్, టోస్ట్, ఆరంజ్ జూస్ కిచెన్ కౌంటర్ మీద పెట్టాను. ఇవాళ ఇక్కడే ఉండు. కూరగాయల వాడొస్తే నీకిష్టమైనవి తీసుకో. అన్నం తినేసి ఎంతసేపైనా పడుకో. అయినా నిన్నిలా చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదులే” అన్నాడు మురిపెంగా. ముక్కుమీద ముక్కు. పెదవులపై మెత్తటి ముద్ర. ఎప్పుడూ వాడే సెంట్ హాయిగా తాకింది. చిరునవ్వుతో అతని బరువుని స్వాగతించింది. పొట్ట మీద వేసిన చేయి ఎంతకీ కిందకి జరగదే ? పైకీ కదలటం లేదు. సౌకర్యంగా పొదువుకుందామని ప్రయత్నించింది. చేతులు కాళ్ళు కదల్లేదు. అదిరిపడి కళ్ళు తెరిచింది. ఒంటిమీద నూలు దుప్పటి తప్ప ఇంకేమీ లేదు. ప్రియుడు లేడు, అతని పొడయినా లేదు. అప్పుడు అరిచింది ప్రకృతి బెడ్రూమ్ దద్దరిల్లేట్టు. పది నిముషాలపాటు అరుస్తూనే ఉంది.

*  *  *

“Today we are going to talk about types of sexuality” పాఠం మొదలైంది.

“లైంగికత పలు రకాలు. భౌతిక, జీవ, కామ, భావ, సాంఘిక, ఆధ్యాత్మిక, అభౌతిక, అభావ లైంగికతలు కొన్ని. ప్రతి జీవి వీటిలో ఏదో ఒక లైంగికత కలిగి ఉంటుంది…..” ప్రొఫెసర్ ఒక్కోదాని గురించి వివరంగా చెప్పుకుపోతున్నాడు.

వికృతి తన పుస్తకంలో ఒక పదాన్ని పదేపదే దిద్దుతోంది.

“….. బుద్ధిజీవులకి స్పష్టంగా ఒకటే లైంగికత ఉండదు. ప్రతి లైంగికత పునరుత్పత్తి చేయదు. అన్ని లైంగికతలకీ సామాజిక అంగీకారం కూడ ఉండదు. అందుకే కొన్ని వెల్లడించడానికి నోచుకోవు…….” పాఠం సాగిపోతోంది.

వికృతి దించిన తల ఎత్తకుండా అదే పనిగా దిద్దుతోంది.

“….. హోమో శాపియన్స్ అనబడే భూగ్రహ బుద్ధిజీవుల జాతి సక్రమమైన ప్రత్యుత్పత్తి కోసం పెళ్ళి అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. సెపియన్ట్ అంటే ‘అభివృద్ధి చెందిన మేధ కలిగిన’ అని అర్థం. అందుకే వారికి ఎన్నో రకాల ఆలోచనలు మనలాగే…… ”

ఉలిక్కిపడిన వికృతి పాఠం వింటూనే ఆ పదం చుట్టూ సున్నాలు కొడుతూనే ఆలోచిస్తోంది.

“…. బుద్ధి విపరీతంగా అభివృద్ధి చెందిన జీవుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కూడ అంతే సంక్లిష్టంగా ఉంటుంది…. మనోవికారాలకీ లైంగికచేష్టలకీ సంబంధం ఉంటుంది. Vice versa is also true. అన్ని క్షీరదాలకు నెలసరి ఉండదు. వికృతీ! ఏమి చేస్తున్నావు? ఇది ఎంత విలువైన సమాచారమో తెలుసు కదా. భూమినుంచి ఎంతో కష్టపడి లక్షల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించి అభిముఖగ్రహానికి చేరుకున్న రేడియో వేవ్స్ ని డీకోడ్ చేసి వారి గురించి ఒకో విషయమే కనుక్కుంటున్నాం. అలాంటిది నువ్వు శ్రద్ధ చూపటం లేదంటే…. If you are not interested, please leave” భృకుటి ముడిచి కోపంగానే అన్నాడు ప్రొఫెసర్.

“సర్, అది కాదు” కుడి కన్ను రుద్దకుంటూ నీళ్లు నమిలింది వికృతి.

“ఏమి రాస్తున్నావు? చూపించు”

అయిష్టంగానే లేచి వెళ్ళింది. పుస్తకంలో ఆమె రాసింది చూసి ప్రొఫెసర్ అవాక్కయ్యాడు.

 

*  *  *

పదహారవరోజు

కళ్ళు తెరిచి చూసింది ప్రకృతి. ఇంకా ఫ్లాట్ కి చేరుకోలేదా? ప్రియుడు ఎక్కడికి తీస్కెళ్తున్నాడు?

ఏదో పెయింటింగ్ లో చూసిన ప్రదేశంలా ఉంది. అందమైన ఆకుపచ్చటి అడవిలో మెలికలు తిరిగిన నున్నటి రోడ్డు. ఇరువైపులా దట్టంగా చెట్లు. రోడ్డుని ఆకాశాన్ని కలుపుతూ అప్పుడే ఉదయించిన ఏదో గోమేధిక నక్షత్రం. గుత్తులు గుత్తులుగా విరబూసిన పూల మీద గుంపులు గుంపులుగా వాలుతున్న సీతాకోకచిలుకలు. లీలగా లావెండర్ పరిమళం. When did he retract the roof ? టాప్లెస్ కారు నక్షత్రం వైపు వెళ్తోంది. ప్రకృతి షర్ట్ విప్పి ప్రియుడి ఒళ్ళో వేసి సీట్లో నుంచొని ఒళ్ళు విరుచుకుంది. అతను ఆమెవంక చూసి నవ్వి చొక్కాను ఉండచుట్టి వెనుకసీట్లో పడేశాడు. చిరుగాలి ఈల చెవిలో చిందు వేస్తూ విందు చేస్తోంది. ప్రశాంతంగా ఉంది. ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండనిపిస్తోంది. ప్రియుడికి తనంటే నిజంగా ప్రేమ కాబోలు. రెండు నెలల నుంచి ఇద్దరూ కలిసే ఉన్నారు ఇతర ఆకర్షణల వైపు పోకుండా. బంధం పాతబడింది. మాటల అవసరం క్రమంగా తగ్గుతోంది. మౌనం పాకుతోంది పొగలా. ఇంకో నెలకి ఎక్కడుంటారో. ఎలా ఉంటారో. ఎలా విడిపోతారో. మౌనంగానే విడిపోతే బాగుండు. నువ్వలా నేనిలా అని మాటలు మీరకుండా.

ఎందుకీ మౌనం ఏమిటీ ధ్యానం  అని పాడుతూ కన్నుగీటాడు.

“పాత పాటలంటే ఎందుకంత మోజు నీకు?”

“పాత పాటలే కాదు, పాత ప్రియురాలంటే కూడా” అన్నాడు ఆమె జీన్స్ ప్యాంటు బటన్ దగ్గర చూపుడు వేలు లోపలికి పెట్టి తన వైపు గుంజుతూ.

ఆ లాగిన బలానికి ప్రకృతి నుంచున్నది కాస్తా స్టీరింగ్ మీదకి ఒరిగిపోయింది. ప్రియుడు ఏమయ్యాడో. అంతలో ఎక్కడికెళ్ళాడో. కార్ వెళ్తూనే ఉంది. పగలో రాత్రో తెలీడం లేదు. బూజు పట్టినట్టు మంచు. నక్షత్రం కనిపించటం లేదు. సర్దుకొని మళ్ళీ నిలబడే ప్రయత్నంలో ప్రకృతి చేతులు గాల్లోకి చాపి మరుక్షణంలో ఎడమ కంట్లో ఏదో నలుసు పడ్డట్టు అనిపించి చేతులు దించింది.

కళ్ళు తెరవగానే ఒక పురాతనమైన కోటలో ఉన్నానని గ్రహించింది. అన్నీ మెట్లే. ఎటు వెళితే ఏమొస్తుందో అనే అనుమానం క్రమంగా పెనుభూతమైంది. గబగబా ఒక వరుస దిగింది. దూరంగా రక్తం కారుతున్న పచ్చి మాంసం ముక్కలున్నాయి. వెగటనిపించి పైకెక్కుదామని వెనక్కి తిరిగింది. అక్కడ తను దిగిన మెట్లు లేవు. గుండె జారింది. భయం మొదలైంది. నుదుటిమీద చెమట ముత్యాలసరాలైంది. స్వర్గానికి దారి వెతుక్కుంటూ మరో మెట్లవైపు వెళ్ళింది. అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. అటు తిరిగి కూర్చున్నారు.

“దా…దా…రి… తె…తె..లీ…డం… లే…దు…, ఎగ్జిట్ ఎటు?” అనడిగింది ఒక్కో అక్షరమే కూడబలికి. తను నిజంగానే అడిగిందా, నిజంగా గొంతు పెగిలిందా? గిర్రున తల తిప్పారు. జుగుప్సతో కక్కేసింది ప్రకృతి. ఆయాసపడుతూ నీరసంతో మెట్లమీద కూలబడిపోయి చేతులతో చెవులు మూసుకొని తల కిందకి దించి త్వరత్వరగా శ్వాస తీసుకుంది. గోడ ఆధారంగా లేవటానికి ప్రయత్నించింది. చీకట్లో కాలికేదో తగిలింది. ఎగుడుదిగుడుగా ఉన్నా దాదాపు గుండ్రంగానే ఉందది. కళ్ళు చికిలించి చూసింది. అది తన కడుపులోంచి బయటకి వచ్చిందే. ప్రియుడి తల! పసుపుపచ్చటి పసరులో నానుతూ పాలిపోయిన ముఖం!! కెవ్వున అరిచింది ప్రకృతి. లేని శక్తిని కూడగట్టి ఎటు పడితే అటు పరిగెత్తింది. ఆమె ఆలోచనలే మంత్రాలై గిర్రున తిరుగుతూ కోటంతా ప్రతిధ్వనిస్తున్నాయి.

 

ఓం అంతర్యామినే నమః ! నేనే సత్యం.

సత్యం త్వర్తేన పరిషించామి. గాంధీ కంటే లెనిన్ సత్యవంతుడు.

ఓం ప్రాణాయ స్వాహా! భారతదేశం నా మాతృభూమి.

ఓం అపానాయ స్వాహా! డాలర్లు తిని బతుకుతాను.

ఓం వ్యానాయ స్వాహా! బ్లడ్ ఈజ్ కాలింగ్ టు బ్లడ్.

ఓం ఉదానాయ స్వాహా! హూ కిల్డ్ ఆరుషి ?

ఓం సమానాయ స్వాహా! శరణార్థులు కూడ పౌరులే”.

మెట్టుకో మంత్రంచొప్పున చదువుతూ పైపైకి దూకుతోంది.

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి  చెమట చింది మెట్ల మీద పడుతోంది. అది శ్రమజీవుల రక్తంగా మారుతోందని గమనించి తొక్కకుండా జాగ్రత్త పడుతోంది. “స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి” అని అవిశ్రాంతంగా మెట్లు ఎక్కుతోంది. చుట్టూ చిమ్మచీకటి. భూర్భువస్సువర్మహర్జనస్తపస్సత్యాలనే ఏడు ఊర్ధ్వలోకాల మెట్లు ఎక్కడానికి దారి తెలియడం లేదు. స్వర్గానికన్నా పైనుండేది సత్యమని చెప్పేవాళ్ళు అక్కడెవరూ లేరు. బరువు తెలియడం లేదు. జారిపోతున్నట్టు, పడిపోతున్నట్టు, తన పసుపుపచ్చటి నక్షత్రాన్ని ఏదో బ్లాక్ హోల్ మింగేయబోతున్నట్టు, ఆకర్షణ శక్తి నశించిపోయినట్టు, చీకటై చెదిరిపోయినట్టు. ఇది నిజమా కలా ?! వెలుతురు నదిలోకి ప్రవేశిస్తూ ఉంది. అంతలోకే, గాఢాంధకార అగాథంలో పడిపోతూ ఉంది.

అలా ఎంతోసేపు గడిచాక ఇక మెట్లు లేవు. నలుచదరపు నేల. ఆ చివర ఓ గోడ. దానికి తగిలించి ఉన్న ఓ నలుచదరపు అద్దం. అదురుతున్న గుండెలతో భారమైన ఊపిరితో అద్దం దగ్గరికి చేరుకుంది ప్రకృతి. చెమట ధార జలపాతంలా నుదుటిపైనుంచి ఎడమ కంటిమీదకు కారింది. వేలితో దాన్ని విదిలించి అద్దంలోకి చూసుకుంది. ఎడమ కన్ను ఒక్కటే అద్దంనిండా. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చింది. తెల్లటి ఆకాశంలో ఎర్రటి మెరుపుల్లా గజిబిజి రక్తనాళాలు. బ్లాక్ హోల్ లాంటి కంటిపాప. తన కంట్లోకి తానే చూసుకోలేక వేళ్ళతో కంటి రెప్పలని విచ్చదీసి పైమూల ఇరుకున్న వెంట్రుకని బలంగా పెకలించింది. ఇప్పుడు మామూలుగా కనిపిస్తోంది అద్దంలోని ప్రతిబింబం. ఆ అద్దాన్ని పట్టుకున్నాడు డాక్టర్. ఆయన ఇంకో చేతిలో తన హ్యాండ్ బ్యాగ్.

 

*  *  *

ప్రకృతి మళ్ళీ డాక్టర్ ఛాంబర్ లో ఉంది. రిసెప్షన్లో వేసిన కుర్చీల్లో ఒకదాంట్లో హ్యాండ్ బ్యాగ్ లోంచి పడి ఒలికిపోయిన ఆరంజ్ జ్యూస్ ని, ప్రకృతి వమన మలినాన్నీ అప్పుడే ఆయా లావెండర్ పరిమళం కలిగిన ఫినాయిల్ తో శుభ్రం చేసి వెళ్ళిపోయింది. రిసెప్షనిస్ట్, నర్స్, డాక్టర్ కలిసి ప్రకృతిని లోపలికి తీసుకొచ్చారు. ప్రకృతికి పరిస్థితి అర్థమయ్యీ కానట్టుగా ఉంది. డాక్టర్ తనమీద కోప్పడటం, ఆ తర్వాత తను ఈ గదిలోంచి విసవిసా బయటకి రావడం, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోదామంటే నెట్వర్క్ లేకపోవడం, తను విసుక్కొని ప్రియుడికి ఫోన్ చేసి చెప్పడం, అతనికోసం తను రిసెప్షన్లో వేసిన కుర్చీలో కూర్చుని ఎదురుచూడటం – ఇవన్నీ గుర్తున్నాయి. ఆ తర్వాతేమైందో మరి…….!!

“Are you comfortable?” డాక్టర్ స్నేహపూర్వకంగా అడిగాడు.

“Yes doc. What happened to me?” తడబడుతూ అడిగింది.

“We will come to that slowly. First relax. Have some chocolate” బల్ల మీద పొగలు కక్కుతున్న చాకొలేట్ కప్పుని చూపించాడు.

దాన్ని చూస్తూనే కొంచెం శక్తి వచ్చినట్టయింది ప్రకృతికి. కప్పుని చుట్టుకున్న కుడిచేతివేళ్ళ కొసలకి వణుకు తగ్గి వెచ్చదనపు స్పర్శ తెలిసింది. ఆమెనే గమనిస్తున్న డాక్టర్ అడిగాడు –

“ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ప్రమాదకరమైన చోటేదో తెలుసా?”

“…..”

“మన మెదడు. అదే అన్నిటికన్నా సురక్షితమైన చోటు కూడా”

“నాకేమైంది?”

“నువ్వు కలలు కంటున్నావు. వాటిని నిజమనుకుంటున్నావు”

“యు ఆర్ మిస్టేకెన్ డాక్టర్ ! కలలు రావాలంటే నిద్రపోవాలి. కాని నాకు నిద్రే రావటం లేదే”

“నువ్వు నిద్రపోతున్నావు. కాని అది నిద్ర అని నీకు తెలియడం లేదు”

నివ్వెరపోయింది ప్రకృతి.

“నిద్ర లేకుండా పదిరోజులు ఉండగలగడం అసాధ్యం. నువ్వో మెడికల్ వండర్ వి అనుకున్నాను. నో. సహజవృత్తిని పక్కన పెడితే విపరీత పరిణామాలు ఎన్నో ఎదురవుతాయి. నీ విషయంలో అదే జరిగింది. నీ శరీరం నీ మాట వినడం మానేసింది”

“లేదు డాక్టర్. నేను నా శరీరంతో మాట్లాడుకుంటూనే ఉంటాను”

“అవునా? ఎలా? Something like auto suggestion?”

“అదేంటో నాకు తెలీదు”

“ఆటో సజెశ్చన్ అంటే ఉదాహరణకి, నీమీద నీకు నమ్మకం తక్కువున్నప్పుడు నేను చెయ్యగలను, భయం లేదు, మరేం ఫరవాలేదు అని మనసులో అనుకుంటూ ఉంటావు చూడు, అలాంటిదే. తల్లి బిడ్డవీపుని తట్టినట్టనమాట. ఎ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ. నాటోన్లీ పాజీటివ్, మన మెదడు మనమేం చెప్పినా వింటుంది. పదే పదే ఒకే విషయాన్ని చెబుతుంటే అది నిజమని నమ్ముతుంది. అలాగే ప్రవర్తిస్తుంది. వ్యక్తిత్వం ఏర్పడటానికి ఇదెంతో ముఖ్యం. చిన్నపిల్లలకి చీకట్లో బూచాడున్నాడు, నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు అని చెప్తే అదే నమ్ముతారు. పెద్దయ్యాక కూడ వారికి చీకటంటే భయం వదలకపోవచ్చు. కాలం గడిచే కొద్దీ విస్మృతిలో దాచిన విషయాల్ని సహజంగానే జాగృత చైతన్యం నిజమా కాదా అని నిర్ధారించుకుని అవసరాన్ని బట్టి అభిప్రాయాలను, నమ్మకాలను మార్చుకుంటూ సాగుతుంది. కొన్నిసార్లు తను అనుకునే నిజాన్ని, తనకు తెలిసిన నిజాన్ని పరీక్షించకుండానే ఉండిపోతుంది, ఆ అవసరం రాలేదు కాబట్టి. ఏళ్ళు గడిచాక అవసరం రావచ్చు. అప్పటికి ఆ అభిప్రాయం మెదడులో లోతుగా స్థిరపడుతుంది. మారటానికి సాధ్యం కాదు. దాంతో మనిషిలో సంఘర్షణ మొదలవుతుంది. దీన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తాడు. ప్రవర్తన, మాటతీరు, అలంకరణ, కొన్నిసార్లు కలలు.”

“మీరు చెప్తోంది నాకర్థమవుతోంది డాక్. మెదడుకి చెబితే శరీరం దానిమాట వింటుంది అంటున్నారు. I think what you say pertains only to the brain. Not the body.”

కొంచెం తికమక పడ్డాడు డాక్టర్. “What do you mean?”

“అదే నాకు అర్థం కావటం లేదు డాక్. నేను నా శరీరంతో మాత్రమే మాట్లాడుతున్నాను. దాంతో మెదడు మాట వింటోంది”

“You mean నీ నిద్ర రాకపోవడం అనే సమస్యని శరీరంతో మాట్లాడి పరిష్కరించుకున్నావా? ఎలా ? Like, నిదరపో ప్రకృతి అని బిగ్గరగా చెప్పుకుంటున్నావా మంచం మీద పడుకొని? ”

ప్రకృతి నవ్వింది. పగలబడి నవ్వింది. ఎన్నో రోజుల తర్వాత హాయిగా నవ్వింది. ఆమె సమాధానం తెలుసుకున్న డాక్టర్ బిత్తరపోయి నోరు తెరిచాడు.

 

*  *  *

 

Sapiosexual.

బుద్ధికి ఆకర్షితులగుట. ప్రజ్ఞకు ఆకర్షితులగుట. మేధకు ఆకర్షితులగుట. జ్ఞానంతో కామోద్దీపన పొందుట.

“ఎందుకీ పదం రాశావు?” గంభీరంగా అడిగాడు ప్రొఫెసర్ హాకింగ్.

“జ్ఞానం బాగుంటుంది సర్. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటే ఏదో ఆనందం ఉంటుంది. మనలాంటి universes parallelగా పద్నాలుగు ఉంటాయనిపిస్తోంది. Milky way galaxy మన ఆకాశంలో మెరవటానికి నా సర్వస్వమూ ఒడ్డి కృషి చేయాలనిపిస్తోంది”

తన పరిశోధనల రంగంలోనే ఆసక్తి కనబరుస్తున్న వికృతిని ముచ్చటగా చూశాడు ప్రొఫెసర్. “You can do it” అని అన్నాడు సింపుల్ గా.

మెరిసే కళ్ళతో ఆయన వంక ఓ చూపు విసిరి వెంటనే తల దించింది. “….. అది కాదు. ఇంకోటేదో ఉంది నా ఆలోచనల్లో. అస్పష్టంగా. భూమి గురించి మన కీమధ్యనే తెలిసింది. ఆ సమాచారం నాలో ఒంటరితనాన్ని నింపుతోంది. వీలైనంత త్వరగా భూమిని చూడాలనిపిస్తోంది. చూడకుండా ఉండలేననిపిస్తోంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది. ఆది మానవుడి నుంచి అధి మానవుడి వరకు, అంతర్గృహం నుంచి అంతరిక్షం వరకు- భూమికి సంబంధించినది ఎంత చిన్న విషయమైనా చాల ఆసక్తి గొలుపుతోంది. భూమిగురించి వింటున్నప్పుడు ఉత్తేజం కలుగుతోంది. మెదడులో ఒక రకమైన ఫీలింగ్. అదేంటో స్పష్టంగా తెలీడం లేదు. మన ఆకాశంలో భూమి కనపడితే బాగుండనిపిస్తోంది. నేనూ భూమి ఒకటై పోవాలనిపిస్తోంది. కుదిరితే భూమిని కౌగిలించుకోవాలని, భూమిగురించి మాట్లాడే ఎవరినైనా సరే ముద్దాడాలని-  ఏంటో అర్థం కావడం లేదు.”

నవ్వాడు ప్రొఫెసర్. వికృతి ఆయనకు బాగా అర్థమైంది. “Don’t worry. It’s natural in your age. నీ లైంగికత ఏమిటో నువ్వు తెలుసుకునే వయసు ఇది. If anybody asks you your sexuality, say that you are a sapiosexual even before you blink.”

“కాని సర్, మీకు చెప్పానుగా నా తోకచుక్కల కల గురించి. ఆ గ్రహం నేనేనని, తోకచుక్క ఢీకొనేది నన్నేననీ ….” ఇక చెప్పలేకపోయింది.

“ఆ కల నీ లైంగికతను నిర్ధారిస్తోంది” తేల్చిపారేశాడు.

“అంతేనంటారా?”

“Absolutely!”

“మరి నేను భూమిని ఎప్పుడు చూడగలను?”

“నీ సంకల్పం ఎంత గట్టిదైతే అంత తొందరగా…”

అప్పుడర్థమైంది ఆమెకుకాలం అంటే సమయం కాదనీ, కాలం అంటే కోరికనీ !

 

*  *  *

 

ప్రకృతి కుడిచేతి వేళ్ళన్నీ మడిచి మధ్యవేలు తెరిచి చూపించింది.

అది చూడలేక తల తిప్పుకొని డాక్టర్ “Don’t worry. It’s natural in your age. నీ లైంగికతని నువ్వు తెలుసుకునే వయసు ఇది” అన్నాడు.

“అవునా?” అంది ప్రకృతి మామూలైపోయి.

“అవును. ఎండార్ఫిన్స్ వల్ల నొప్పి, బాధ మరపుకు వచ్చి ఆనందం పెరుగుతుంది. కమ్మటి నిద్ర పడుతుంది. అలాంటి సమయాల్లో నిద్ర పట్టినట్టు నీకు తెలుస్తోందా? ”

“ఏదో మైకం లాంటిది. అది నిద్రా?”

“Hmm no. సర్కేడియన్ క్లాక్ ప్రకారం అది నిద్ర కాదు. నిద్రకు ముందు దశ అనుకోవచ్చు. ఒక జోగు. ఇప్పటివరకు నువ్వు చెప్పింది, నేను చూసింది కలిపితే నీకు రెండు సమస్యలు ఉన్నాయని నాకర్థమవుతోంది”

“నాకెటువంటి సమస్యలూ లేవు” వాదించింది.

“అయ్యుండచ్చు. తెలుసుకోవాలంటే నేను నిన్ను హిప్నటైజ్ చేయాలి. అందుకు నువ్వు పూర్తిగా సహకరించాలి”

హిప్నాసిస్ అనే మాట వినగానే ప్రకృతి బిగుసుకుపోవటం గమనించాడు.

“పోనీ, నేను మామూలుగా అడిగే ప్రశ్నలన్నిటికీ నిజాయితీగా సమాధానం చెప్తే సరిపోతుంది, దాచకుండా. నువ్వెందుకో నిద్ర పోవాలంటేనే భయపడుతున్నావు. ఎందుకు? ఇప్పటికైనా చెప్పు ప్రకృతీ !”

చెప్పింది ప్రకృతి. రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవటం గురించి, తను నిద్ర పోలేనప్పుడల్లా శరీరంతో మాట్లాడుకోవటం గురించి, అప్పుడు పట్టిన అరా కొరా నిద్రలో తనకొస్తున్న పీడకలల గురించి, అవి నిజమో కాదో తెలుసుకోలేని తన అశక్తత గురించి, వాటివల్ల మళ్ళీ నిద్రపోవాలంటే ఒకరకమైన భయం కలగటం గురించి.

అంతా చెప్పి “నాకొచ్చే కలలు సంఘర్షణ వల్ల అంటారా? నా లైంగికతకీ, కలలకీ సంబంధం ఉందా?” అడిగింది నెమ్మదిగా.

డాక్టర్ భృకుటి ముడివేసి విన్నాడు. బల్ల మీదున్న పెన్నుని వేళ్ళమీద తిప్పుతూ “ఐతే నా అనుమానం నిజమే. నా లైంగికతకీ, కలలకీ సంబంధం లేదు. Stress ఉంది. నీ లక్షణాలని బట్టి చూస్తే నా అనుమానం – నీకు స్వాప పక్షవాతం. Sleep Paralysis” తేల్చిపారేశాడు.

“What are you saying doctor? What type of a disease is this?”

“నీకు నాకంటే గూగుల్ మీదే ఎక్కువ నమ్మకం కదా”

ప్రకృతి తప్పు చేసినదానిలా ఆలోచిస్తూ ఉండిపోయింది. డాక్టర్ ఆమెని disturb చేయలేదు.

“When did you first diagnose ?” అడిగింది చివరికి.

“ఇందాకే. నువ్వు కోపంతో వెళ్ళిపోయాక మొబైల్లో నెట్వర్క్ లేదని రిసెప్షనిస్టుని అడిగి ఫోన్ చేయటం, తర్వాత అక్కడున్న అడవి నక్షత్రం పెయింటింగ్ ని తదేకంగా చూస్తూ ఉండటం, ఆరంజ్ జ్యూస్ తాగుతూ కన్ను రుద్దుకొని కుర్చీలో కూలబడటం సీసీటీవీలో చూస్తూనే ఉన్నాను. నేను నా ఛాంబర్ తలుపు తీసుకొని నీ దగ్గరికి వచ్చేలోపు నిద్రపోయావు ! అంతలో నీ బాడీ స్టిఫెన్ అయిపోయింది. రోబోటిక్ మూవ్మెంట్స్ తో నీ ఎడమ కన్ను పీక్కోబోతున్నావ్. నేను చూసుండకపోతే…..”

ఆ అనుభవం ఇంకా గుర్తుంది ఆమెకి. “మై బాయ్ ఫ్రెండ్” అంటూ వణికిపోయింది. దుఃఖమొచ్చేసింది.

“అతనికి ఏమీ కాలేదు. అసలు అతనిక్కడ లేడు. Remember, నువ్వు అతనికోసమే వెయిట్ చేస్తున్నావు. In fact, నువ్వు ఫోన్ చేసి జస్ట్ పావుగంట అయింది”

“ఓహ్ మై గాడ్!! ఎంత భయంకరమైన కల!!!” అంది.

“It’s not a dream. It’s just a hallucination.”

ఆశ్చర్యంగా చూసింది ప్రకృతి.

“అవును. అది కేవలం భ్రమ. ఏ కోరికనైనా అణచివేస్తే మెదడు దాన్నే ఇంకా కోరుకుంటుంది. అది మన సహజగుణం. ఒక్కోసారి అది కల రూపంలో వ్యక్తమవుతుంది. నీ విషయంలో జరిగిందదే. ఒంటరితనం నీ కిష్టం లేదు. తట్టుకోలేకపోయావు. మనుషులు కావాలని కోరుకున్నావు. దానివల్ల ఒత్తిడికి గురయ్యావు. చాలాసార్లు ఒత్తిడిని మనిషి గుర్తుపట్టలేడు. నీ విషయంలో కూడ అంతే. అయితే, ఇంకా కొన్ని కారణాల వల్ల నీ నిద్ర, తద్వారా నా నిద్ర చెడింది” నవ్వాడు డాక్టర్.

ఇబ్బందిగా నవ్వింది ప్రకృతి. ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెబుతాడో ఈయన.

“అవసరమున్నా లేకపోయినా కమలాపండ్ల రసం తాగటంతో నీ రక్తంలో పొటాషియం చాల ఎక్కువగా ఉంది. ఆ స్థితిని Hyper kalemia అంటారు. అది నిద్రలేమిని, వెన్ను, కాళ్ళూచేతుల్లో నరాలకి తిమ్మిరినీ కలిగిస్తుంది”

“కాని ఫ్రూట్ జ్యూస్ మంచిదేగా”

“అతి సర్వత్ర వర్జయేత్. అంటే అర్థం తెలుసా?”

తలూపింది. మధ్యపాపిడి తీసి విరబోసిన అందమైన జుట్టుమీద బంగారు రంగు చారలు జిగేల్మన్నాయి.

“స్ట్రెస్ వల్ల, ఎక్కువ పొటాషియం వల్ల నీ నిద్ర చెడింది. దాంతో నీ శరీర అవసరానికి తగినట్టు సరిగా నిద్రపోలేకపోతున్నావ్. అదే సమయంలో స్వాప పక్షవాతం వచ్చింది”

ప్రకృతి సారీ చెప్పినట్టు జాలిగా చూసింది. దాంతో డాక్టర్ వివరించాడు-

“నిద్ర పోయేటప్పుడు కలలు రావడం సహజం. మంచి నిద్రలో సహజంగా ఐదు దశలు ఉంటాయి. ఆర్ ఈ ఎమ్ – రాపిడ్ ఐ మూవ్ మెంట్ స్టేజ్ లో అంటే గాఢనిద్ర దశలో కలలు ఎక్కువగా ఉంటాయి. మెదడు కనే ఈ కలల్లో జరిగే సంగతులు నిజమని నమ్మి శరీరం దానికి తగ్గట్టుగా కదిలే అవకాశం ఉంది. అందుకు పరిష్కారంగా మెదడు గాఢనిద్రలో ఉన్నప్పుడు అవయవాలని స్థంభింపజేస్తుంది. This is one of our body’s defence mechanisms. సో, కల ఎలాంటిదైనా, శరీరానికి ఎటువంటి హానీ జరగదనమాట.

“… అయితే కొన్నిసార్లు మెదడుకి REM దశలో మెలకువ వచ్చేస్తుంది. అంటే ఇహలోకంలోకి వచ్చేస్తుందనమాట. కాని శరీరం మాత్రం ఆ గాఢనిద్ర దశలోనే ఉంటుంది. అంటే కదలలేదు. కండరాలు రిలాక్స్ అయి ఉంటాయి. మెదడు ఆదేశాలని వినే స్థితిలో ఉండవు. అప్పుడు కళ్ళు తప్ప ఏ ఇతర అవయవమూ కదల్చలేము. సరే ఇది చెప్పు, మనం సాధారణంగా ఎప్పుడు కదలలేము?”

ఆలోచించి “కీళ్ళు పట్టేసినప్పుడో, కదిలే దారికి ఏదైనా అడ్డు ఉన్నప్పుడో” చెప్పింది ప్రకృతి.

“అవును. నిజ జీవితంలో ఆ అడ్డంకి మన కలలో ఏదో బరువు గుండెలమీద ఉన్నట్టు- ఆ బరువు వల్ల కదలలేకపోతున్నట్టు భ్రమ కల్పిస్తుంది. ఈ స్థితి కొన్ని క్షణాలు లేదా కొన్ని నిముషాలు ఉండవచ్చు. కొంతమంది పేషెంట్స్ గదిలో ఎవరో ఉన్నారని, కదులుతున్నారని, తమకి హాని చేయటానికే వాళ్ళు ఆ గదిలోకి వచ్చారని చెప్తుంటారు. స్లీప్ పెరాలసిస్ లక్షణమే అది. అది రోగం కాదు. ఒక స్థితి అంతే. పైగా అది కల కాదు. చుట్టుపక్కల ఉన్న విషయాలని చైతన్యస్థితిలో గమనించే మెదడు మెలకువ వచ్చీరాని స్థితిలో hallucination సృష్టిస్తుంది. బై ద బై నువ్వు రోమియో జూలియెట్ చదివావా?”

ఆయన చెప్పింది పూర్తిగా అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తున్న ప్రకృతి సడన్ గా టాపిక్ మారిందేంటని అయోమయంలో పడింది.

“అందులో ఓల్డ్ హ్యాగ్ ఉంటుంది?! నో ? తెలీదా? అది స్లీప్ పెరాలసిస్ వలనే”

“ఓ”

“జాగృత చైతన్యానికి తెలియనిదానిని బుద్ధి ఒక భయంలా ప్రొజెక్ట్ చేస్తుంది కలలో. ఆ భయం నువ్వు చిన్నప్పుడు ట్యూన్ అయివున్న భయంలాగా బయటపడుతుంది. బహుశా నీకు చిన్నప్పుడు దయ్యాలంటే భయం ఉండేదేమో”

“అవును డాక్. అందరు పిల్లల్లాగే”

“ఊఁ. సీ, వెరీ ఈజీ నౌ. ఇప్పటికీ ఆ భయం ఉందా?”

“కొంచెం. నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం. దానికంటే, ఈ యూనివర్స్ లో మనమొక్కళ్ళమే ఈ భూమి మీద ఎంత ఒంటరిగా ఉంటున్నామో తల్చుకుంటే ఇంకా భయమేస్తుంది. వేరే గ్రహాలమీదకి వెళ్ళి అక్కడ మానవజాతిని వృద్ధి చేయటం అవసరం కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది. Apocalypse తో భూమి అంతమైపోతే… హమ్మో” అని గుండెల మీద చేయి వేసుకుంది.

ఈ అమ్మాయి నన్ను విస్మయపరచటం మానుకోదు కాబోలు అనుకుంటూ తల విదిలించాడు. కనీసం మూడు నాలుగు సెషన్స్ పడతాయి ట్రీట్మెంట్ కి అని లెక్క వేసుకున్నాడు. డాక్టర్ మౌనంగా ఉండటం భరించలేని ప్రకృతి –

“Doc, hey doc, స్లీప్ పెరాలసిస్ అంటే ఇంక ఎప్పటికీ ఇలానే ….?” అంది.

“Don’t be silly. ఇది చాల చిన్న సాధారణ సమస్య. దాదాపు ప్రతి వ్యక్తికీ జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. It’s absolutely curable by cognitive behavioural therapy. ముందు నువ్వు సరిగ్గా నిద్రపోవాలి. దానికి ఏమి చేయాలంటే, అర్జెంటుగా పొటాషియం ఇన్టేక్ ఆపేయి. సరైన పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. మినరల్స్ కావలసినంత మాత్రమే ఉండేలా చూసుకోవాలి. వెల్లకిలా కాకుండా పక్కలకి తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవాలి….. ” డాక్టర్ చెప్పుకుంటూ పోతున్నాడు.

*  *  *

గుప్పెడంత గుండెలో  మౌనమైన ఊసులే

గుప్పుమన్న ఆశలే రివ్వుమన్న సందడే

ప్రియుడి నుంచి ఫోన్.

చిరునవ్వుతో కుర్చీలోంచి హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటూ లేచింది ప్రకృతి. ఇన్నాళ్లూ తన ఎద మీద ఉన్న భారమంతా పోయి చాల తేలికైపోయినట్టు, తన నవ్వులోంచి గోమేధిక నక్షత్రమేదో పుట్టినట్టు, అది పసుప్పచ్చటి సీతాకోకచిలుకలా మారి పైపైకి ఎగురుతున్నట్టు……

అప్పుడర్థమైంది ఆమెకుస్వర్గం అంటే చోటు కాదనీ, స్వర్గం అంటే సమయమనీ !

సంతోషాన్ని పూసుకున్న హీల్స్ నల్లటి టైల్స్ కి కొత్త అందాన్నద్ది కనుమరుగై పోయాయి.

 

 

{ఈ కథ బ్లాక్ హోల్ లైఫ్ ను గణించిన ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ కు అంకితం. }

 

సృజనాత్మకత మనసులో పొంగే ఒక ఊట

హలో మోహిత జీ . ఎలా ఉన్నారు …?

హలో చందు గారు. బావున్నానండీ.

మోహిత…మీ కలం పేరా..?

కాదండీ. నా ఒరిజినల్ పేరే మోహిత

మీరేం చేస్తుంటారు…?

బాగున్నానండీ. నేను ప్రస్తుతం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో కార్యక్రమ విభాగంలో పని చేస్తున్నాను.

మీకు బాగా పేరు తెచ్చిన కథ… తొమ్మిదో నంబరు చంద్రుడు.. ఆ కథ గురించి చెప్పండి .. ?

ఒక కాస్మోపాలిటన్ ప్రేమ కథ. 2011లో రాశాను. ఆకాశవాణి వ్యాఖ్యాత పైడిశ్రీ గారికి చూపించాను. ‘ఒక్క అక్షరం కూడ మార్చనవసరం లేదు, వెంటనే ప్రచురణకు పంప’ మన్నారు. అయితే నిడివి ఎక్కువుందన్న కారణం చేత వారపత్రికలు తిరస్కరించాయి. దాంతో పైడిశ్రీ గారు ‘పాలపిట్ట’కు పంపుదామన్నారు. అయితే అప్పుడు కొంతకాలంగా పాలపిట్ట ప్రచురణ ఆగింది. కథ పంపినప్పుడు గుడిపాటి గారు ఈ మాటే చెప్పారు. “నేను ఆగుతాను, మీరు మాత్రమే ప్రచురించాలి, ఇది మా గురువు గారి (పైడిశ్రీ ) కోరిక” అని చెప్పాను. అప్పటికి వారు కాలం చేశారు. అలా చివరికి (నాకు తెలిసినంత వరకు) పాలపిట్ట పునర్ముద్రణ మొదలైన సంచిక మార్చ్ 2015లో ‘తొమ్మిదో నెంబరు చంద్రుడు’ ముద్రితమైంది. అసలు రచయితను ప్రత్యక్షంగా చూడకుండానే (ఈ కాలంలో) కేవలం మెయిల్ ద్వారా అభ్యర్థనను అంగీకరించి ప్రచురించిన గుడిపాటి గారికి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. (కృతజ్ఞత తో కూడిన నవ్వు). ఆ తర్వాత చాల miraculousగా  రమణ మూర్తిగారు ‘కథ 2015’ సంకలనానికి నా కథ ఎంపికైందని చెప్పిన రోజుని నేను ఎప్పుడూ మరువలేను. ఒక మేజిక్ లాగా జరిగింది. ఇందాక మీరన్న మంచిపేరు అలా వచ్చిందనమాట. ‘కథ’ వర్గానికి నేనెప్పుడూ ఋణపడి ఉంటాను. మోహిత అంటే చంద్రుడికథ అని గుర్తుపడుతున్నారు. ఆ కథ గురించి ఇప్పటికీ నాకు మెసేజులు, ఫోన్ కాల్సూ  వస్తుంటాయి.

 అసలా థాట్ ఎలా వచ్చింది? ఎనీ ఇన్స్ పిరేషన్?

అది

కథలా జరిగిన జీవితం.

కలలా కరిగిన జ్ఞాపకం.

నిజమై ఎరిగిన సావాసం

ప్రేమ మరిగిన నమ్మకం

ఇప్పటివరకు ఎన్ని కథలు రాశారు ? ముద్రితమైనవి ఎన్ని..? ఏ ఏ కథలు..?

ఎన్ని అనేది నేనెప్పుడు లెక్క పెట్టుకోలేదు. తెలుగులో నా స్వంత కథలు ఇప్పటివరకు నాలుగు వచ్చాయి. అర్ధ శతాబ్దపు అజ్ఞానం (కౌముది), ముద్ర (విపుల), తొమ్మిదో నంబరు చంద్రుడు (పాలపిట్ట), కృష్ణశోధ (కొత్త కథ), కూసింత చోటు (తానా జ్ఞాపిక). ‘పొగ’ నా ఐదవ కథ.

కొత్తకథ లో కృష్ణశోధ..  నిజంగా ఓ ప్రయోగం… దాని గురించి.. ?

రైటర్స్ మీట్ వారు ‘కొత్త కథ’ సంకలనం వేయటానికి కథ ఇమ్మన్నప్పుడు ఆ స్ఫూర్తితో కొత్తగా రాద్దామనిపించింది. కృష్ణుడు- రాధ- అందరికీ తెలిసిన ప్రేమ కథే. ఈ కాలంలో ఉంటే వారు ఎలా ఉంటారు అనేది ఆ కథ. A compact love story. కథ చివరికి కృష్ణుడి వ్యక్తిత్వం రాధకి, రాధ వ్యక్తిత్వం కృష్ణుడికి వచ్చేస్తుంది. అదే కదా ప్రేమంటే.

కాని దానిమీద విమర్శలు వచ్చాయి కదా..? ఎలా అన్పించింది..?

వచనం, గేయం, వచనం – ఇలా మొత్తం 21 పేరాల్లో కథ అయిపోతుంది. కొద్దిపాటి గ్రామ్యము, గ్రాంథికము వాడాను. పైగా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాత ఫ్యాషన్లు మళ్ళీ వస్తున్నాయి కదా అలాగే ఇదీ. సంపాదకులకు నచ్చింది. వేశారు. పుస్తకావిష్కరణ రోజునే దీన్ని చిన్న కథ కాబట్టి అప్పటికప్పుడు చదివేసి భలే ఉందే అన్నవారు ఉన్నారు. ఆ రోజే, కథ అర్థం కాలేదన్న వారూ ఉన్నారు. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కొంతమంది ఇది కథే కాదన్నారు. ఎవరి అభిప్రాయం వారిది. పాఠకులు తెలివైనవారనే నా అభిప్రాయం. మరీ విడమర్చి వివరించాల్సిన అవసరం ఉండదని నాకో నమ్మకం. ప్రతి కథనీ పాఠకులని దృష్టిలో పెట్టుకొని రాయనవసరం లేదు. ఒకటి మాత్రం చెప్పగలను – నేటి కాలానికి నా కథ ఒక ప్రయోగం.

చాల తక్కువ రాస్తుంటారు… కారణం.. ?

తక్కువో ఎక్కువో నాకు తెలీదు. ఒక అంశం నన్ను విపరీతంగా కదిలించినప్పుడు ఇక రాయకుండా ఉండలేను అనుకున్నప్పుడే రాస్తుంటాను. ‘కూసింత చోటు’ గంటలో రాశాను. ‘పొగ’ రాయటానికి ఏడు నెలలు పట్టింది.  ‘తొమ్మిదో నంబరు చంద్రుడు’ రాస్తున్న కాలంలో (ఓ మూడు నెలలు పట్టింది లెండి) పైడిశ్రీ గారిని అడిగాను ‘నాలోని క్రియేటివిటీ అంతా ఈ కథ తోనే అయిపోతుందేమో అని భయంగా ఉంది’ అని. అప్పుడాయన చెప్పారు – సృజనాత్మకత మనసులో పొంగే ఒక ఊట లాంటిదని. అది ఊరుతున్నంత కాలం కలానికి పని ఉంటుందని. దాంతో ధైర్యం వచ్చింది. ఆ ఊట కోసమే నా వేట.

నచ్చిన కథలు… రచయితలు ….    

నాకు చాల చాల ఇష్టమైన కథ ‘మంత్రనగరి సరిహద్దులు’ (కుప్పిలి పద్మ). ఎన్నిసార్లు చదివుంటానో. ఇప్పటికీ పని గట్టుకొని పుస్తకాల అలమర సర్దుతూ అక్కడే నుంచొని ఆ కథ చదువుతుంటాను. రోజూ ఆ కథలోని వాక్యాలు మననం చేసుకుంటాను. చాల నచ్చింది ఆ కథ. మృణ్మయనాదం (వోల్గా), చివరి పిచ్చుక (పాపినేని శివశంకర్), ఎప్పటిదో ‘డు ము వు లు’, నిన్నమొన్న వచ్చిన ‘రేపటి పువ్వు’ ఇష్టం. ఫలానా కథలే అని లేదు. మూస కథలంటే మాత్రం చెప్పలేని విరక్తి. ఇసాక్ అసిమోవ్, కార్ల్ సగన్, మిలన్ కుండెరా, అగాథా క్రిస్టీ నా ఫేవరె ట్స్. కానన్ డోయిల్ ఎవర్ గ్రీన్. ఈ మధ్యనే యూ ఆర్ అనంతమూర్తి నచ్చుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడుమంది, బోలెడు కథలు.

*

మోహిత

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భిన్నమైన కథ.

  • కాలం అంటే సమయం కాదనీ, కాలం అంటే కోరికనీ !
    కాలాన్ని అధిగమించాలనే ప్రయత్నమే ఈ జీవితం.వాహ్ అద్భుతమైన రచన. చాలా చాలా కాలానికి చదివాను ఒక కథను అనిపించింది. కథలను చదవడం మానేసి నిద్రిస్తూన్న నాలాంటి వాళ్లకు ఇదో మెలకువను తెప్పించిన కల.కన్నార్పకుండా చదివించింది. మళ్ళీ చదవాలి. U have amazing talent. I am unable to express in words more than this. Congrats !

  • ఒకటికి రెండు సార్లు …కాదు కాదు మూడు సార్లు చదివేసా … రచయిత చాలా హోం వర్క్ చేసారు.. చందు ఇదివరకు కవిత్వం కోసం సారంగ కి వచ్చే వాడిని.. ఇప్పుడు కథ కోసం వచ్చేలా చేస్తున్నావ్

    • థాంక్యూ సత్య. కథల కోసం రావడం కాదు. కథలు రాయాలి.

  • చాలా పెద్ద కధ. పూర్తిగా చదివాను. ఒక వస్తువు మీదే కధ నడిచుంటే బాగుండేదనిపించింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు