ఇరాన్ ..

ఒరియా మూలం: సౌభాగ్య కుమార మిశ్ర

తెలుగు అనుసృజన: వేలూరి వేంకటేశ్వర రావు, వెనిగళ్ళ బాలకృష్ణ రావు.

 

ఇరాన్

 

ప్రతిఒక్కడి కళ్ళకీ గంతలు

వాళ్ళు మొత్తం పదిహేడుమంది,

మిగిలిన పని ఫైరింగ్‌ దళానిది,

పదిహేడునిమిషాలుకూడా పట్టలేదు

పని పూర్తిచెయ్యటానికి,

ఒకడి తల ముందుకు వేలాడి పోతే

ఒక్క క్షణంలో

మరొకడి రక్తం చిందిఎగిరెగిరి

ఆగిపోయింది.

పొలం పుట్రల వారసత్వం నుంచి

విముక్తి లభించింది.

 

 

కళ్ళకి యెరుకే,

రహస్యంగా ఎలా కన్నీరు కార్చచ్చో,

గంతలు తీసిన తర్వాత కూడా వేర్వేరు కళ్ళు

రహస్యంగానైనా నేలని ఇంకా గుర్తించలేదు,

ఒక ఒంటరి పక్షి మాత్రం ఎగిరిపోయింది

వేగంగా జైలు ఆవరణపై ఆకాశంలో

సూర్యుడు చలనంలేని గడియారంలా

వేలాడుతూ వుండి పోయాడు.

 

వాళ్ళల్లో ఒక కవి ఉన్నాడు

ఏదో అమరత్వం సిద్ధిస్తుందన్నతలపు

కలవరపెడుతున్నదో యేమో ఎవరికెరుక

ఇంకా ఎక్కువ సేపు బ్రతికుండటం

తనకిష్టంలేదని చెపుతున్నాడు:

కాని,  తన సహచరుల, సోదరుల చేతుల్తో

ఇట్లాంటి సమిధలు పట్టించాడు కదా.

వాళ్ళు బ్రతికుండటానికి ప్రాణాలొడ్డి ప్రయత్నించారు,

 

కవి మరణం సహజం

చెట్టునుండి పండు రాలినట్లు.

 

ఈ నాటకం

గెలుపు, ఓటముల నాటకం కాదు

ఏ రకమైన బాకాలూ మోగలేదు

గెలుపుకి గుర్తుగా ఏజండాలూ ఎగరలేదు

మనుషుల చేతులు విసిరే గుప్పెడు గుప్పెడు ధూళి మీద

కనిపించని దేవతల మహాపురుషుల సంవాదాలు

మేఘాల్లాతేలిపోతున్నాయ్ఆకాశంలో

 

ఒక చెయ్యికొద్దిగాకదిలింది

ఏమిటది? ఆచెయ్యి కవిదా?

ఆ చెయ్యింకెందుకూ పనికిరాదు.

 

 

సీతాకోకచిలుక ప్రతి

 

ఒకసారి చూశాను ఎండిన నారు మొక్క మీద నిన్ను

కదలకుండా అంటుకోపోయి ఉండటం,

విస్తరించిన అనేక చిత్రాలు నీ రెక్కల కింద

ఆపి వుంచేశావు

వేరే నారు మొక్కకు వెళ్ళిపోనని

చెప్పటానికా అన్నట్టు ఆఖరుసారి మట్టితల వూపావు.

 

ఇంకోసారి చూశాను నువ్వు పూల మధ్యలో పువ్వువి,

తారల మధ్యలో తారవి,

అన్య మనస్కుడనై పాముకు దారి వదలటానికి

నేనాగకపోతే, నిన్నేమాత్రమూ చూసేవాడిని కాదు.

నేననుకోకుండా నిన్ను చూడకపోతే

ఆ కోరిక కూడా మిగిలి పోయుండేది.

 

 

మరెప్పుడు చూసినా అతి వేగంగా

పొద నుండి పొదకూ, గోడపై నుండి పెంకు మీదికీ,

వరండా నుండి గూటి అంచుకూ ఎగురటం, నరనరానికీ

అసహజమైన బరువుతో బుజం నెప్పెట్టి,

దింపటానికి చోటు కోసం చూస్తున్నావు

అన్నిచోట్లా ఎవరో చెప్తున్నారు ఇక్కడ కాదు, ఇక్కడ కాదని….

 

ఎంతో ఎక్కువగా, మాలాగా మనుషుల్లా

నిన్ను కావలించుకోవాలని మనసవుతోంది,

నీవంటి రంగులో కుంచె ముంచి

గాలీ, ఆకాశమంతా గీస్తూ పోగలను.

ఆ కలని మేమెన్నడూ మరిచిపోలేం

మేమెంత నిశ్ఛలం, స్థిరం అయినా కూడా !

 

పై రెండు కవితలూ  సౌభాగ్య కుమార మిశ్ర ఒరియాలో ప్రచురించిన “ ద్వా సుపర్ణా” కవితా సంకలనంలోనివి. ద్వా సుపర్ణా కవితా సంకలనానికి  1986 లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానం లభించింది. ద్వా సుపర్ణా కవితలన్నీ తెలుగు – ఒరియా ద్విభాషా సంకలనంగా  త్వరలో ప్రచురించబడుతుంది. 

 

పెయింటింగ్: రాజశేఖర చంద్రం 

*

వేలూరి

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు