అతని కళ్ళల్లోంచి మన పాడు లోకం!

Better Call Saul గురించి రాయాలంటే ఒక వ్యాసం సరిపోదు.

Better Call Saul లో ప్రధాన పాత్ర Jimmy McGill కళ్ళలోంచి ప్రపంచాన్ని చూడటం బావుంటుంది. అదో వంకర చూపు. అతనంత తొందరగా మనం లొసుగుల్ని పట్టలేం కానీ అతను ఓ జిత్తులమారి ప్లాన్ వేయగానే అప్పటి వరకూ మనకు ఆ ఐడియా రానందుకు అతను మనకి ఇంకా నచ్చుతాడు.

సమాజాన్ని, చట్టాన్ని, మానవ సంబంధాల్ని కలిపి ఒక broken system లా చూస్తూ వాటికున్న loopholes ద్వారా మాత్రమే వాటితో వ్యవహరించడం నేర్చుకున్న బుర్ర Jimmie ది. Breaking Bad లో కరడుగట్టిన స్వార్ధపరుడిగా, తన charm తో, నక్క యుక్తులతో తన ప్రశ్నార్ధకమైన పనులన్నిటికీ మన ఆమోదన్ని లాగేసుకునే క్రిమినల్ లాయర్ గా మనకు పరిచయం అయ్యే Saul అసలు పేరు, అతని గతం, అతని అంతరంగం మనకు పూర్తిగా చెప్పే ఈ spinoff సిరీస్ ఈ మూలాల్ని చక్కగా ఆవిష్కరించింది. జీవితంలో విజయం ఎప్పుడూ ఒక షార్ట్ కట్ దూరంలోనే ఉంటుందని నమ్మే పాత్ర moral failings ని చూపించాలంటే అందుకు విరుద్ధమైన పాత్ర కూడా ఒకటి కావాలి. అతనే Jimmie అన్నయ్య Chuck McGill. ఐతే ఇక్కడ Chuck పరిశుద్ధుడు కాదు. ఎందుకంటే ఈ కథ చోటు చేసుకునే ప్రపంచం morally gray పాత్రలకు గుణపాఠాలు చెప్పి కధని కంచికి తీసుకెళ్లే ఇరుకు సందు కాదు. Dog-eat-dog వాస్తవ ప్రపంచం. ఈ మంచి చెడు binary లేని వాస్తవిక నేపథ్యంలో ఈ ఇద్దరి అభిప్రాయ వైరుధ్యాలు తేలిక తీర్పులకు చిక్కనంత వైశాల్యంలో మసులుతాయి.

Chuck చిన్నప్పటి నుంచీ కష్టపడి చదివి లాయర్ అయ్యాడు. తనకు ఉన్న ప్రతీదీ తన కష్టార్జితం. పేద కుటుంబంలో పుట్టి బాల్యం అంతా తన తండ్రి విఫలం అవ్వడం చూసి కష్టపడి చదివి, ఈ రోజు ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ కి వ్యవస్థపకుడిగా ఉన్న Chuck తన జీవితంలో చాలా సాధించాడు. Season-1 లో కథ మొదలయ్యేసరికి అప్పటికే Chuck జీవితంలో విజయవంతంగా స్థిరపడితే Jimmie చిన్నా చితకా కేసులతో కుస్తీ పడుతూ తన అన్న మెప్పు ఎలాగైనా పొందాలని తపన పడుతుంటాడు. ఐతే అదంత సులభం కాదు. Jimmie తన అన్న కంపెనీ లో లాయర్ గా జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే తాను నేరుగా చెప్పకుండా తన partner ఒప్పుకోలేదని అబద్దం చెప్పి Jimmie కి ఉద్యోగం ఇవ్వడు Chuck. తమ్ముడితో ప్రేమగా ఉంటున్నట్టే ఉంటూ అతని పట్ల ఒక తీవ్రమైన తీర్పుని కలిగి ఉంటాడు. తాను ఎంతగానో ఆరాధించే తన అన్నయ్య తన పట్ల ఎంత చులకన భావంతో ఉన్నాడో తెలుసుకుని Jimmie ఒక పెద్ద కుదుపుకి గురవుతాడు. మొదటి మూడు సీజన్లలో ఈ ఇద్దరి మధ్యా జరిగే గొడవల్లోంచే వారి పాత్రలు ఆవిష్కరించబడతాయి.

Siblings మధ్య ఉండే సంబంధం సరళంగా ఎప్పుడూ ఉండదు. ప్రేమ, ఈర్ష్య కలగలిసిన ఓ సంక్లిష్టత ఇద్దరి మధ్యా తచ్చాడుతూ ఉంటుంది. ఇద్దరి మధ్యా సంబంధాలు బావున్నప్పుడు కూడా Chuck కీ Jimmie కీ మధ్య ఓ నర్మగర్భ యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ఆ ఇద్దరి మధ్య గొడవ మాత్రమే కాదు. ప్రపంచంలో ఉన్న రెండు రకాల మనుషుల మధ్యా ఎప్పుడూ జరిగే పెనుగులాటే అది. ప్రపంచాన్ని నేరుగా వ్యవహరిస్తూ, అర్హతల ప్రాతిపదికన, తమ శ్రమతో జీవితాన్ని బేరమాడుతూ సూటి బాణం లాగ ముందుకెళ్లే Chuck లాంటి మనుషులకి జీవితాన్ని చీటీ పెట్టి పాస్ అవ్వచ్చు అనుకునే Jimmie లాంటివాళ్లు అసలు నచ్చరు. అలాంటి భిన్న ధ్రువం తన తమ్ముడైనందుకు Chuck విసుక్కోని రోజుండదేమో. అయినా అదెప్పుడూ ముఖంలో చూపించడు. Chuck అభిప్రాయాలు లేజర్ పదునుతో తెగేవి అయినప్పటికీ అతను మర్యాదస్తుడు. ఐతే కుండ బద్ధలుకొట్టాల్సిన సమయంలో ఈ మర్యాదలేం Chuck కాళ్ళకి అడ్డు పడదు. తమ్ముడి గురించి అతని అసలు ఫీలింగ్స్ బైట పెట్టిన మొదటి సారి “You are not a real lawyer” అంటూ ప్రారంభిస్తాడు. అలా అనేప్పుడు ముఖంలో ఒక తీవ్రమైన తృణీకారం. ఒకసారైతే “I never cared about you” అని మొహం మీదే చెప్పేస్తాడు. అప్పుడు కొట్టొచ్చినట్టు కనబడే ఓ ధీమా, లెక్కలేనితనం.

Sibling rivalry చక్కటి డ్రామాని పండించగలదు. తల్లిదండ్రుల నుండి సారూప్యం ఉన్న రూపల్ని, ఏ పోలికా లేని వేరు వేరు లక్షణాల్ని పంచుకు పుట్టి చిన్నప్పటి నుండే ఒక పోటీలో పడతారు తోబుట్టువులు. ఒకే భావోద్వేగ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఒకర్ని ఒకరు ఎలా గాయపరచుకోవచ్చో బాగా తెలిసిన వాళ్ళు. ఒకరిపై ఒకరు గెలవాలని ఆరాటంలో ఒకళ్ళను ఒకళ్ళు ఓడించుకుని అందుకు పాశ్చాతాప పడుతుంటారు. మనం మన మూలాల నుంచి ఎంత పారిపోయినా కేవలం తమ ఉనికితోనే మనకు అన్నీ గుర్తు చేస్తారు మన తోబుట్టువులు. బాల్యపు గాయాలను సందర్భం వచ్చిన ప్రతీ సారీ రేపుతూ, ఇప్పటి reconciliation తో మాన్పజూస్తారు. మన ఎదుగుదల క్రమంలోని ఆటుపోట్ల సంక్లిష్టతల పట్టు మన మీద పోకుండా చేస్తుంటారు. ఈ కధలో Chuck పాత్ర Jimmie ఏం కాలేడో చెప్పడానికే ఒక గురుతు లా ఉంటుంది. Jimmie ఎప్పటికీ Chuck లా నిదానంగా అలోచించలేడు. అది అతని స్వభావం కాదు. Chuck మెప్పు కోసం అన్నాళ్ళు ప్రయత్నించి విఫలం ఐతే తప్ప Jimmie కి తను అసలు ఎవరో అర్ధం కాలేదు. Chuck అంత కష్టపడి చదివినా తమ తల్లిదండ్రులు Jimmie నే గారాభం చేయడం Chuck మనసు మీద చెరగని ముద్ర వేస్తుంది. ఎటువంటి ప్రయత్నమూ లేకుండా కేవలం తన charm తో Chuck ని దాటుకెళ్లిపోయిన Jimmie పెద్దయ్యాక షార్ట్ కట్ లో లాయర్ అయ్యి మళ్ళీ అదే అడ్డదారుల్లో చట్టాన్ని ఆడుకోవడం చూసి Chuck తట్టుకోలేకపోతాడు. Chuck దృష్టిలో ప్రపంచానికున్న సమస్య Jimmie లాంటి మనుషులే. ఐతే ఈ నిక్కచ్చి అభిప్రాయాలు అన్నిటికీ వెనుక రేషనల్ కారణాలు మాత్రమే కాక గాయపడ్డ భావాలు, దీర్ఘాకాలిక అసహనాలు, కుటుంబ రాజకీయాలు ఉండటం ఆసక్తికరం.

ఇందాక అన్నట్టు Jimmie పాత్ర మీద రచయిత తన critique ని ఇవ్వడానికి Chuck ఒక proxy లా పనికొస్తాడు. “నువ్వు చేసే పనులు నువ్వు చేస్తూనే ఉంటావు. ఈ సంజాయిషీల వల్ల వీసమెత్తు ఉపయోగం లేదు. నువ్వు మారలేవు” అంటాడు Jimmie తో Chuck. ఐతే Chuck పరిపూర్ణమైన మనిషేమీ కాదు. Chuck కి ఉండే సూటి అభిప్రాయాలకు అవసరానికి మించిన పదును పెట్టేవి అతని అసూయ, ద్వేషాలే. ఒక సందర్భంలో Jimmie చేసిన ఒక తప్పుకి అతని practice మొత్తం మూతపడేలా చేస్తూ అదంతా కేవలం Jimmie తన తప్పు తెలుసుకోడానికే చేస్తున్నట్టు మాట్లాడే సంబవేశంలో Chuck ప్రేక్షకుల అమోదాన్ని పూర్తిగా కోల్పోతాడు. నియమ నిబంధనల పట్ల Chuck రాజీ లేని వైఖరికి అవతలి వైపు ఉండే అతని కాఠిన్యం Jimmie చట్టంతో ఆడే ఆటల్ని చిన్న చిన్న తప్పుల్లా చూపిస్తుంది. ఇదే సిరీస్ లో వేరే సన్నివేశంలో Mike అనే ఒక పాత్ర అన్నట్టు “మంచి వ్యక్తీ”, “నేరస్థుడు” పూర్తి వ్యతిరేక పదాలు కావు. ఇది కదా ఒక morally gray క్యారెక్టర్ కి ప్రేక్షకుల ఆమోదాన్ని సంపాదించే పద్ధతి. Vince Gilligan నుంచి మనం ఆశించేది ఇదే.

Better Call Saul గురించి రాయాలంటే ఒక వ్యాసం సరిపోదు. It has got too many things right with absolute perfection. ఐతే ఇంకా ఒక సీజన్ బాకీ ఉన్న ఈ సిరీస్ లో అన్నిటికంటే నన్ను బాగా ఆకట్టుకుంది sibling rivalry లో లోతుల్ని పరీక్షించిన ఈ ట్రాక్. ఆసక్తికరమైన పాత్రలు రాయడానికి చాలా అలోచించి జుట్టు పీక్కునే రచయితల్ని చూస్తాం. ఐతే పాత్ర వ్యక్తిగత చరిత్ర మొత్తాన్ని సమగ్రంగా నిర్మిస్తే, ఆ detail లోనుంచే depth వస్తుందని Vince Gilligan series లు మనకు నిరూపిస్తాయి. పాత్రకు వకాల్తా పుచ్చుకుని కధని నీరుగార్చకుండా నిర్దాక్షిణ్యమైన నిజాయితీతో చూస్తూ మనకు చూపిస్తే తెరకు అతుక్కుపోయి చూడటానికి ప్రేక్షకులం మనం ఎప్పుడూ సిద్ధమే కదా.

ఏమంటారు?

*

స్వరూప్ తోటాడ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు