అడవి పంది

1

“నేను ఈ చేతులతో వేల క్రూర   మృగాల్ని చంపాను. ముఖ్యంగా పొగరుబోతు అడవి పందుల్ని. కాని మనిషిని చంపడమంటే నావల్ల కాదు. మనిషన్నవాడెవడివల్లా కాదు.”

అతడి మాటలకు ఆ కారులో ప్రయాణిస్తున్న వారెవరి ముఖంలోనూ కత్తివేటుకు నెత్తుటి చుక్క లేదు. అందరి వెన్నుల్లోనూ సన్నగా వణుకు పుడుతోంది. అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎవరికీ మాట్లాడే ధైర్యం చిక్కలేదు. ఒక మృత్యు నిశ్శబ్దం అలముకుంది.

ఆ కిక్కిరిసిన షేర్ టాక్సీ హెయిర్ పిన్ బెండ్ వద్ద చీకటి నిండిన అడవి దారిలో మలుపు తిరగగానే, ఆ విసురుకు కారులోని వారంతా వానపాము రాజు మీద పడ్డారు. అతడు బాధతో మూలుగుతూ తన దేహాన్ని  బలంగా విదిలించు కున్నాడు.

ఇంతలో వర్షం మొదలయింది. ఎత్తయిన కొండల్లోంచి వెళుతున్న ఆ ఘాట్ రోడ్డు మీదకి, కొండల పై భాగం నుండి జారుతూ ఎర్రని వర్షపు నీరు ప్రవహిస్తోంది. కారుని లోయలోకి ఈడ్చుకుపోతుందేమో అనేంత బలంగా ఉంది ఆ ప్రవాహం. ఇటువంటి పరిస్థితులకు బాగా అలవాటుపడిన డ్రైవర్ నేర్పుగా కారును ముందుకు తీసుకుపోతున్నాడు.

ఇంతలో ఒక భయంకరమైన ఫెళఫెళారావం.

అతడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసాడు. ఒక పురాతన మహావృక్షం మీద అగ్గి పిడుగు పడడం వల్ల అది నేలకొరిగి, దారికి అడ్డంగా పడింది.

అతడు తనలో తాను అనుకున్నాడు రహస్యంగా “నేను ఈ ఏడాది ఎలాగైనా అడవి పందిని చంపుతాను”.

చీకటిలో ఎర్రగా మండుతున్న ఆ చెట్టు వెలుగుకు దూరంగా వెళుతున్న  కారులో అతడి ముఖం మీద పడిన ఎర్రని కాంతి క్రమంగా మసకబారుతూ వస్తోంది. అతడి కళ్ళలలో మండే ఆ చెట్టు యొక్క ప్రతిబింబం కనిపిస్తోంది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి.

అతడి పెదవులు చిన్నగా వణుకుతున్నాయి. అతడు అందరికీ వినిపించేలా అన్నాడు.

“మనిషిని చంపినవాడిని హంతకుడు అంటారు. మరి భార్యను చంపిన వాడిని ఏమనాలి?”.

2

వానపాము రాజు ఆరుగురు అన్నదమ్ములలో పెద్దవాడు. అతడి అసలు పేరు తెలిసినవారు లేరు, కుటుంబ సభ్యులు తప్ప. అతడిని వానపాము రాజు అని ఎప్పటి నుండి పిలుస్తున్నారో, ఎందుకు పిలుస్తున్నారో తెలిసిన వారు లేరు. అతన్ని అందరూ అసమర్ధుడిగా, ఒక కేతిగానిలా చూస్తారు. అతడి తమ్ముళ్ళలో ఒకతను ఆర్థికశాఖామంత్రి. మరొకతను ప్రభుత్వ సలహాదారు. మిగతావారు కూడా మంచి పదవుల్లోనే ఉన్నారు. తమకి ఒక అన్న ఉన్నాడనే విషయమే వారెవరికీ గుర్తు ఉండదు.

అతడు ప్రజల్లో కలిసిపోతాడు. రచ్చబండ దగ్గర అలగాజనంతో బాతాఖానీ కొడతాడు. కులీన క్షత్రియ కుటుంబానికి చెందిన వానపాము రాజు నిమ్న కులాలకు చెందిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో కలిసి చెరువుల్లో ఈత కొడతాడు. అతడు చేసే ఇటువంటి సిగ్గుమాలిన పనుల్ని అతడి తమ్ముళ్లు అవమానంగా భావించరు. ఎందుకంటే అతడి ఉనికినే వారెవరు గుర్తించరు.

సాయంత్రం వేళ తమ రోజువారీ కష్టాన్ని ముగించుకొని, జీవితం తమకు ఇచ్చిన ఒకేఒక్క ఆనందం అయిన నాటు సారాని శ్రామికులు ఉల్లాసంగా తాగే మట్టయ్య పాకలో సారా తాగుతూ, వారితో తన వీర గాథల్ని పంచుకుంటూ, కేకలు వేస్తూ, పాటలు పాడుకుంటూ గడుపుతూ ఉంటాడు వానపాము రాజు. నిజానికి తన వీర గాథల్ని వారెవరూ నమ్మడం లేదన్న విషయం అతడికి ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. వారు నమ్మినట్టు నటిస్తారు, ఎందుకంటే వారికి అతనంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే అతడు ఎంతో ప్రేమాస్పదమైన, నిష్కల్మషమైన మనిషి. అటువంటి మనిషితో గడపడం సాదాసీదా ప్రజల సాదాసీదా హృదయాలకు ఎంతో హాయిని కలిగించేది. వారు అతడి వీర గాథల్ని కోరి మరీ చెప్పించుకునేవారు. తాత్కాలికంగా వాటిని నమ్ముతూ, ప్రతిస్పందిస్తూ ఉత్తేజితులయ్యేవారు.

అతడు నాటు సారా ఎందుకు తాగుతాడు అంటే ఖరీదైన మద్యాన్ని కొనుక్కునే ఆర్థిక స్థితి అతనికి లేదు. అతడు ఖరీదైన మద్యాన్ని తాగేది, మేలైన ఆహారాన్ని తినేది రాజకీయ ప్రముఖులు ఎవరైనా వారి తమ్ముళ్ల ఇంటికి అతిథులుగా వచ్చినప్పుడు, వారిచ్చే విందులో మాత్రమే.

ఒకసారి సాక్షాత్తు ముఖ్యమంత్రే విందు రాజకీయాన్ని నెరపడం కోసం తన తమ్ముడి ఇంటికి, వారి చిన్న గ్రామానికి, అతిథిగా వచ్చినప్పుడు, తన తమ్ముడు వానపాము రాజుని పిలిపించుకుని ముఖ్యమంత్రికి పరిచయం కూడా చేశాడు. కుటుంబ సభ్యులందరినీ, అతిథులు వచ్చినప్పుడు వారికి పరిచయం చేసే ఆనవాయితీ వల్ల వానపామురాజుకు అన్న హోదాలో క్షణికమాత్రమైన గౌరవం దక్కేది. మంచి భోజనాన్ని, ఖరీదైన మద్యాన్ని ఆనందించే అవకాశం లభించేది.

అందరిచేత వ్యర్ధుడిగా భావింపబడే వానపామురాజు దగ్గర గొప్ప వేటగాడిగా పేరుపొందిన తన తండ్రి గారి నాటు తుపాకీ ఉండేది. వారసత్వంగా వచ్చిన అపారమైన ఆస్థిలో గజం భూమిని కూడా తమ్ముళ్లు ఆ  అన్నకు ఇవ్వలేదు మరి, ఈ తుపాకీ తప్ప.

అతడికి భార్య, పిల్లలు లేరు. ఒంటరి జీవితంలో ఆ తుపాకీయే అతడికి ఆప్తమిత్రుడు. దానితోనే తన కష్ట సుఖాలను చెప్పుకునేవాడు. నిద్రరాని రాత్రులు ఆ తుపాకీని మంచం మీద తన పక్కనే పెట్టుకునేవాడు. నిజానికి పడుకోబెట్టుకొనేవాడు అనాలి. చలికాలంలో దానికి దుప్పటి కప్పేవాడు. వేసవిలో దానికి పంకా పెట్టేవాడు. అచ్చంగా ఒక మనిషిలాగానే దానిని భావించేవాడు.

అతడిని బాగా ఉద్వేగానికి గురిచేసే విషయం ఒకటే. వేట. అతడు వేటలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అయినా అతడు ఎప్పుడూ ఒక జంతువుని కాని, పక్షిని కాని చంపలేకపోయాడు.

అతడికి అడవి పందిని వేటాడి చంపడం కల. జీవిత లక్ష్యం. అదే అతడిని జీవింపజేస్తోంది. అతడి గురి ఎప్పుడూ కుదరలేదు. సాదాసీదా అలగాజనాల వద్ద అతడు చెప్పుకునే, అతని వీరగాథలన్నీ అతడి కౄరమైన ఒంటరితనంలోంచి పుట్టినవే. నిజంగా అతడు అడవిపందిని చంపగలిగితే ఆ కల మరణిస్తుంది. అతడు జీవించేందుకు ఆధారమైన ఒకే ఒక్క కారణం కూడా అంతమయిపోతుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకునేంత తెలివి, సమర్థత అతడికి లేకపోవడం, నిజంగా అతనికి వరం.

3

వర్షం వెలసింది. కారు ఆగింది.  కారులో ముందు సీటులో ఉన్న ఒక వ్యక్తి దేహం ఏడుపుని బలవంతంగా ఆపుకుంటున్నట్టుగా కంపిస్తోంది. అతడు కారు దిగుతున్నప్పుడు తన కుడి చేతితో నోటిని బలంగా అదిమిపెట్టుకుని ఏడుపు ధ్వని బయటకు వినిపించకుండా అదుపు చేసుకుంటున్న దృశ్యం, అతని కళ్ళ నుండి కన్నీరు రాలుతున్న దృశ్యం వానపాము రాజుకి కనిపించింది.

కారు బయలుదేరాకా వెనక్కి తిరిగి చూసిన వానపాము రాజుకి, అదిమి పెట్టుకున్న దుఃఖం బ్రద్ధలై రోడ్డు మీద కారు దిగిన వ్యక్తి బిగ్గరగా ఏడుస్తూ ఉన్న దృశ్యం కనిపించి జాలితో హృదయం ద్రవించింది.

“ఎవరండి అతను! ఎందుకు ఏడుప్తున్నాడు?”  అని మిగతా ప్రయాణికుల్ని ప్రశ్శించాడు.

ఎవరూ అతడికి సమాధానం చెప్పలేదు. అతడి ముఖం చూస్తూ వారు అతడు కోరిన సమాధానాన్ని చెప్పడానికి ఇబ్బంది పడ్డారు.

ముందు సీట్లో కారు నడుపుతువ్న డ్రైవర్ “ఇందాక మీరు హంతకుడు అన్నారు కదా! ఇతనే అతను.” అన్నాడు.

4

సన్నగా చినుకులు పడుతున్నాయి. అడవిలో వానపాము రాజుకి అడవి పంది ఎదురుపడింది. అది కదలకుండా మెదలకుండా అతడిని చూస్తోంది. హఠాత్తుగా సంభవించిన ఈ ఘటనకు ఎలా స్పందించాలో అడవి పందికి తెలియలేదు. అది ఇంకా సంశయంలోనే ఉంది.

వానపాము రాజు దానికి తుపాకీ గురిపెట్టాడు.

కొన్ని క్షణాలు లోతైన నిశ్శబ్దం. కాలం ఆగిపోయినట్టుగా అనిపించింది అతనికి. అతని వ్రేళ్ళు ట్రిగ్గర్ మీదికి అప్రయత్నంగా వెళ్లాయి. అతనికి తెలియకుండానే తుపాకీని కాల్చాయి. అడవి పంది నేలకొరిగింది. అయితే అంతకు ముందే వావపాము రాజు నేలకొరిగాడు.

5

దిశలు లేని చోటులా అనిపించింది. అనంతంగా తెల్లని మంచు విస్తరించి ఉంది. క్షితిజ రేఖ అనేదే లేదు. అనంతమైన తెల్లదనం. ఆకాశం-భూమి అనే విభజనలేని తెల్లదనం. కళ్ళకు నొప్పిని పుట్టించే తెల్లని కాంతితో నిండిన తెల్లదనం.

నల్లని అడవి పంది తెల్లని మంచు పై పరిగెడుతోంది. నగ్నంగా ఉన్న వానపాము రాజు నల్లని తుపాకితో అడవి పంది వెనుక పరిగెడుతున్నాడు. అలా 6000 సంవత్సరాలు పరిగెత్తాకా అతడు ఒక్కసారిగా ఆగిపోయాడు. చుట్టూ చూసాడు. అతడి చుట్టూ వ్యాపించి ఉన్న మహిమాన్వితమైన సౌందర్యాన్ని,  శాంతిని తొలిసారి అనుభూతి చెందాడు.

అతడు అక్కడ ఆగిపోయాడు.

*

 

శ్రీరామ్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు