రాజకీయాలపై ఎక్కుపెట్టిన అస్త్రం!

మాజానికి సంబంధించిన ఏదైనా విషయాన్ని అందరికి సులువుగా గుర్తుండేలా రాయాలి అంటే అది కేవలం హాస్యం లేదా వ్యంగ్య రచనా ప్రక్రియలోనే సాధ్యం అవుతుంది అని నా అభిప్రాయం. కానీ అన్నింటికన్నా కష్టమైన ప్రక్రియలు కూడా ఇవే. ఎవరిని నొప్పించకుండా, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం. అలానే రచయితకి సమాజంలో ఉన్న సమస్యల పైన కూడా ఎంతో అవగాహనా, వివాదాలకు దారి తియ్యకుండా, విషయ పరిధిని దాటకుండా హాస్యం పండించడం, వంటివి  కత్తి మీద సాము. అయితే తెలుగులో నాకు తెలిసినంత వరకు పేరడీ రచనలో జలసూత్రం రుక్మిణినాథ శాస్త్రి గారు, శ్రీ రమణ గారు, వ్యంగ్య రచనలో  కె.ఎన్.వై. పతంజలి గారు, ప్రసన్నకుమార్ సర్రాజు గారు  ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. సమకాలీన సాహిత్యం ఎక్కువ చదివే నేను, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక వ్యంగ్య నవలను చదివే అవకాశం దొరికింది. అదే తెలిదేవర భానుమూర్తి గారు రాసిన “లత్కోర్ సాబ్” నవల.

మేరు పర్వతానికి దక్షిణ దిశలో ఉన్న “కంగాళీ” దేశంలో ఉన్న “దిక్కుమాలిన” రాష్ట్రానికి, “లత్కోర్”అని పిలవబడే లక్ష్మికాంత్ మహామంత్రి అవుతాడు. వీధినాటకాలు వేసుకొనే లక్ష్మీకాంత్ మహామంత్రి ఎలా అయ్యాడు? మహామంత్రి అయిన తర్వాత ఆ “దిక్కుమాలిన” రాష్ట్రంలో ఎలాంటి పరిపాలన చేసాడు? “లత్కోర్” పరిపాలనలో ప్రజలు ఎలాంటి పరిస్థితులులో ఉన్నారు?,  తిరిగి ప్రభుత్వం స్థాపించడానికి “లత్కోర్” ఎలాంటి  ప్రయత్నాలు చేశాడు వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాల్సిందే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న రాజకీయల మీద ప్రయోగించిన వ్యంగ్య అస్త్రమే ఈ నవల. నవల చదువుతున్నంత సేపు మనకి ప్రతి రోజు వార్త పత్రికల్లో కనిపించే విషయాలనే కథాంశంగా తీసుకొని, ఆ పరిస్థితులను “లత్కోర్” ఎలా నివారిస్తాడో మనం ఈ నవలలో చూడచ్చు. మచ్చుకకు ఒక రెండు ఉదాహరణలు.

“రాష్ట్రంలో కుక్కలెక్కువయ్యాయి, అవి ఎవర్ని పడితే వారిని కరుస్తున్నాయి. ఆసుపత్రిలో కుక్కకాటుకు మందులు లేవంటున్నారు, దీనికి మీ ప్రభుత్వం ఏం చేస్తుంది?” అని ఒక విలేకరి ప్రశ్న అడిగితే,

“ఆసుపత్రులన్నిటికి చెప్పులు సరఫరా చేస్తున్నాము. కుక్క అంటే సాక్షాత్తు కాలభైరవుడు. ఆ దేవుడు కరిచి జెనాలు మోక్షమిస్తున్నాడు” అని “లత్కోర్” సమాధానం చెప్తాడు.

అలానే అనుకోని పరిస్థితుల్లో తమ ప్రభుత్వ మంత్రి వేరే రాష్ట్రంలో జైలు పాలైతే, దానిని సమర్ధించుకోవడానికి “లత్కోర్” ఈ మాటలు అంటాడు.

“మా మంత్రి అమాయకుడు. అతణ్ణి పోలీసులు అరెస్టు చెయ్యలేదు. ఆ రాష్ట్రంలో జైళ్ళు  ఎలా ఉన్నాయో చూసి రమ్మని నేనే పంపించాను. అతను ఆ జైళ్ళను చూసి రావడానికి కొన్ని నెలలు పట్టచ్చు అని అంటున్నాడు” అని చెప్పి తప్పించుకుంటాడు.

రోడ్లు బాలేవని, రాజధాని అభివృద్ధి గురించి, నీటి ఎద్దటి గురించి, వరుస విదేశీ ప్రయాణాల గురించి, ఇలా ప్రతి విషయం మీద తనదైన శైలిలో సమాధానాలు “లత్కోర్” చెప్తూ ఉంటాడు. ఈ సమాధానాలు చదువుతున్నపుడు ఎంత నవ్వును తెపిస్తాయో , అదే సమయాల్లో మన చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రశ్నించుకొనేలా చేస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎలా పని చేస్తారు, వాళ్ళ దృష్టిలో సామాన్య ప్రజలు ఎలాంటి వాళ్ళో వంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.

ఈ నవలలో నాకు బాగా నచ్చిన సందర్భాలు,  “దిక్కుమాలిన” రాష్ట్రంలో “అమ్మో ఒలింపిక్స్”ని నిర్వహించడం, అలానే ఎన్నికల ప్రచారానికి చేసే పనులు.

ఈ కథను రచయిత ఒక జానపథ కథలా మనకి పరిచయం చెయ్యడం వల్ల, నవల మధ్యంతరంగా ఆగిపోయినా  కూడా మనం దానికి సమాధాన పడతాము.

మనం రోజు చూసే ఎన్నో విషయాలకు తనదైన శైలిలో వ్యంగ్యం రాసిన భానుమూర్తి గారు, సన్నివేశాల మధ్య సమన్వయ లోపం కనిపిస్తుంది. దీనివల్ల , నవలగా కాకుండా కథల పుస్తకం చదువుతున్నట్టు అనిపించింది.

రెండు రాష్ట్రాలు, ఎన్నికలకు సిద్దమవుతున్న ఈ తరుణంలో ఈ పుస్తకం ద్వారా మన రాష్ట్రాల్లోని పరిస్థితులను అర్ధం చేసుకొని సరైన నిర్ణయం తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

తెలుగులో హాస్యం లేదా వ్యంగ్య రచనలు కోసం చూస్తున్న వాళ్ళ కోసం ఈ  నవల ఒక మంచి ఎంపిక అవుతుంది.

పేజీలు : 104

పుస్తకం ధర : 120/-

ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు 9848023384 నంబర్ కి ఫోన్ చేసి కొనుకోవచ్చు.

*

ఆదిత్య అన్నావఝల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు