హృదయం ఇచ్చేసిన రోజు

మూలం : Doris Lessing వ్రాసిన How I Finally Lost My Heart

డోరిస్ లెస్సింగ్ (Doris Lesling) నోబెల్ బహుమతి పొందిన బ్రిటిష్ రచయిత్రి. 1919లో జన్మించిన డోరిస్ నవలలూ, కవితలూ, నాటకాలూ, కథలూ వ్రాసారు. బ్రిటిష్ సాహిత్యంలో డేవిడ్ కోహెన్ జీవిత సాఫల్య పురస్కారం 2001లో అందుకున్నారు. 2007లో నోబెల్ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె కథాంశాలూ, కథన శైలీ కూడా విలక్షణమైనవి. 2013లో మరణించారు డోరిస్.

*

నా హృదయం నన్ను పెట్టే తిప్పలు అంతా ఇంతా కావు. ఒక వాడి కత్తి తీసుకుని, నా ఎడమ పక్కన చీల్చేసుకుని నా హృదయాన్ని తీసి బయట పడేయాలని నాకెన్నో సార్లనిపించింది, కానీ అది సాధ్యం కాదు కదా? అందుకే  బరువైన ఈ నా హృదయాన్ని మోసుకొని తిరుగుతూనే వున్నాను. అయితే, అనుకోకుండా నా హృదయాన్ని ఒకరికి తేలిగ్గా ఇచ్చేసాను. కానీ అది నేననుకున్నట్టుగా జరగలేదు. నిజం చెప్పాలంటే, నేనేమాత్రం ఊహించని విధంగా నా హృదయాన్ని పారేసుకున్నాను, కాదు కాదు, నేనే ఇచ్చేసాను.

ఆ రోజు కొంచెం విశేషమైన రోజు. ఇద్దరు పాత బాయ్ ఫ్రెండ్స్‌తో గడిపాను. తప్పుగా అనుకోకండి, ఒకరితో కాఫీకి వెళ్ళాను, ఇంకొకరితో మధ్యాహ్న భోజనం! సులువుగా మాట్లాడుకోవడానికి వాళ్ళ పేర్లు ‘ఏ.రావు’, ‘బీ.రావు’,   అనుకుందాం. వాళ్ళ నిజమైన పేర్లు మనకనవసరం కదా?

ఏ.రావు తో నేను నాలుగేళ్ళ, ఏడు నెలల రిలేషన్‌షిప్‌లో వున్నాను. ఆ తరవాత బ్రేక్ అప్ అయిందనుకోండి. ఆ బ్రేక్ అప్ తరవాత ఒక రెండేళ్ళు (కాదు, మూడేళ్ళనుకుంటా) నేనసలు మనుషుల్లోనే లేను. రాయిలా మారిపోయిన హృదయాన్ని పట్టుకొని, కళ్ళల్లో నీళ్ళతో అయోమయంగా తిరిగాను. నన్ను చూసి ఎంత మంది నవ్వుకున్నారో, చెవులు కొరుక్కున్నారో కూడా పట్టించుకోలేదు.

నిజానికి అతనేమీ నేను ప్రేమించిన మొదటి మగవాడు కాదు. ఎందుకంటే, నేను ప్రేమించీ, నన్ను ప్రేమించిన మొదటి మొగవాడు మా నాన్న. ఆ లెక్కన చూస్తే ఏ.రావు రెండో వాడో, మూడో వాడో, నా ప్రేమని పొందిన వాడు. అంటే, మా తమ్ముణ్ణి కూడా లెక్కేస్తే మూడో వాడవుతాడు కదా? ఆ రోజుల్లో ఒక  కవిత కూడా వ్రాసుకున్నాను.

నేను ప్రేమించిన మగవారు ముగ్గురు

నాన్నా, తమ్ముడూ, ఆ పైన

నన్ను హత్య చేసిన నా ప్రేమికుడు.

 అయితే, ఇటువంటి విషయాల్లో మనసు జోలికెళ్ళకుండా పైపైన చూసే వారికి బీ.రావు నాకు పదమూడో బాయ్ ఫ్రెండ్ అనిపించొచ్చు, కానీ అది నిజం కాదు.  ఒక సినిమాకి వెళ్ళీ, “ఇతనితో వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం” అనేటటువంటి స్నేహాలు బోలెడుండొచ్చు. ఎంతో మందితో స్నేహం చేసే ప్రయత్నం చేస్తాం కానీ, ఎవరో ఒకరో ఇద్దరో మనసు లోపలికి దాదాపు వచ్చినంత పనవుతుంది. ఈ ఒకరిద్దరినే లెక్కలోకి తీసుకుంటాం కానీ, ఆ పదముగ్గురినీ లెక్కలోకి తీసుకోం కదా.

ఇలా ఎవరిని లెక్కలోకి తీసుకోవాలి, ఎవరిని వదిలేయాలి అని ఆలోచన మొదలు పెడ్తే చిక్కు ముళ్ళల్లో చిక్కుకొని పోతాం. నిజమైన ప్రేమా, దానికోసం వెతుకులాటే కదా, జీవితం! అందరమూ దానికోసమే వెతుకుతూ అన్ని దిక్కులకీ పరిగెడుతున్నాం.

మనం ఒక మనిషిని ప్రేమిస్తున్నాం అని మనసు నిర్ధారించుకున్నాక కూడా, చుట్టు పక్కల కొంచెం తీరైన మొహం కనబడగానే, కనీసం పావు వంతు చూపు వాళ్ళ మీద పడేస్తాం కదా? మన ఆలోచనల్లో ఒక్క క్షణం విరామం వొచ్చి, ఆ చూసిన కొత్త అందమైన మొహం గురించి ఆలోచనలో పడతాం. మనం ఆల్రెడీ ప్రేమలో వున్న,(పోనీ వున్నామనుకున్న) వ్యక్తి కంటే ఈ కొత్త మొహంతో బ్రతుకు ఇంకాస్త మెరుగ్గా వుండొచ్చేమో అన్న ఆలోచన కనీసం క్షణంలో వెయ్యోవంతు సేపైన మన మనసులో మెదలకుండా వుండదు కదా? ఆ రకంగా మనకు ఎదురై , ఏ మాత్రమో నచ్చిన ప్రతి మనిషిని  మానసికంగానో, శారీరకంగానో “కొంచెం రుచి” చూసి, ఆ తర్వాతెప్పుడో ఒక మనిషిని ఎన్నుకుంటాం కదా?

నాకూ అంతే జరిగింది. “ఏ.రావు” కూ “బీ.రావు “కు మధ్య ఇంకొంతమంది మగవాళ్ళతో కాఫీలకెళ్ళాను, సినిమాలూ చూసాను. అయితే ఆ స్నేహాలేవీ “ఏ. రావు ” తోనో “బీ.రావు” తోనో నా స్నేహానికి సాటి రావు.

“ఏ.రావు ” తో ప్రేమలో పడకముందు, నాకు నచ్చిన మగవాళ్ళంటే, ఇంతకు ముందే చెప్పినట్టు, మా నాన్నా, తమ్ముడూ, ఏదో క్లాసులో నాతో పాటు చదువుతూ నవ్వుతూ నాతో మాట్లాడే మగపిల్లలూ, అంతే. అయితే, “ఏ.రావు ” తో ప్రేమ కొన్నేళ్ళలోనే ముగిసిపోయింది. ఆ దెబ్బకి విరిగిన హృదయాన్నేసుకొని కొన్నేళ్ళు తిరిగాను. ఎప్పట్లాగే ఒక కవిత కూడా వ్రాసుకున్నాను.

రాయైపోయిన ఈ హృదయం నా  గుండెలో,

ఎవరైనా దీన్ని లాగేసి నన్ను విడుదల చేస్తే…”

 “బీ.రావు “తో నా ప్రేమ అంత గాఢంగా కాదుకానీ, అదీ సంతోషంగానే గడిచింది. “ఏ.రావు “, “బీ.రావు ” కలిసి నా బ్రతుకులో పదేళ్ళ కాలాన్ని మింగేసారంటే నమ్మడం కష్టం. సరే, ఏమైతేనేం, ఇవాళ కాఫీ “ఏ.రావు”తో, భోజనం “బీ.రావు” తో చేసాను. సరదాగా, మాటలూ, ఏవో పాత జ్ఞాపకాలూ, నవ్వులతో బానే గడిచింది.

సాయంత్రం ఇంకో “సీ. రావు”ని కలవాలని ప్లాను. ఈ “సీ.రావు”తో బ్రతుకంతా సెట్టయిపోతూందేమోనని ఆశ.  ఈ సీ.రావునీ ఫోటో చూసిన తరవాతే కలవడానికొప్పుకున్నా కానీ, విచిత్రంగా ఇప్పుడతని మొహమే గుర్తు రావటంలేదు.

ఈ ఆలోచనలతో ఆ సాయంత్రం నేను ఎదురుచూస్తున్నాను. ఇలాటప్పుడు ఆ వాతవరణం జాగ్రత్తగా గమనించి గుర్తు పెట్టుకోవాలి కదా?  అప్పుడు నేను కిటికీ పక్కన నుంచొని బయట వీధివైపు చూస్తున్నా.  కానీ, బయట జరుగుతున్నవేవీ నా కళ్ళు దాటి మెదడులోకెక్కడంలేదు.

నిజానికి “ఏ.రావు” తో కానీ, “బీ రావు”తో కానీ నా ప్రేమ వ్యవహారం గురించి నాకేం పశ్చాత్తాపం లేదు. ఏ ప్రేమా లేకుండా, మనసుకే నొప్పీ లేకుండా బ్రతకడం కంటే, ప్రేమించి, ఓడిపోయి, ఆ నొప్పి భరించడం నయమేమో కదా?  అందుకే,” ఏ రావు”, “ బీ రావు” తో ప్రేమ వ్యవహారాలు ఎంతో నొప్పి కలిగించినా, ఆ అనుభవాలను నేను తక్కువగా అనుకోలేదెప్పుడూ. మరయితే, “సీరావు”ని కలవడానికి ఆసక్తిగానే ఎదురుచూస్తున్నానెందుకు? భయంతో పారిపోవాల్సిన మాట, కదా?

అసలు నేను  జీవిత సహచరుడికోసం వెతికే పద్ధతే తప్పేమో! ఏరావో, బి రావో, సీ రావో, మరో డి రావో, వారిలో నేనేం కోరుకుంటున్నాను? ఒకటో, రెండో, ఇంకొన్నో లక్షణాలు. మనం తాగే టీయో, కాఫీ యో, మరింకేదైనా పానీయంలా.

నిజానికి వెతకాల్సింది లక్షణాలకోసమా? అది పొరపాటేమో. అసలు జరిగేదేంటంటే, మనందరికీ డొక్కలో దిగిన బాకొకటి, ఎవరికీ కనిపించనిది, వుంటుంది. కావాల్సింది ఆ బాకుని పెరికేసి మన నొప్పి తగ్గించి, కొంచెం శాంతిని ప్రసాదించగలిగే సహప్రయాణికుడు! అది, మనమంతా వెతికేది. మిగతావన్నీ పైపై మెరుగులు.

ఆ క్షణంలో నాకు నేనే స్పష్టంగా కనిపించాను. దాదాపు ముప్పై యేళ్ళ యువతి, పరవాలేదు, కొంచెం అందగత్తె అనే చెప్పుకోవచ్చు, ఒక ఏ రావునీ, ఆ తరవాత ఇంకొక బీ రావునీ ప్రేమించి వొదిలేసిన యువతి, అందంగా తయారయి, జుట్టు దువ్వుకోనీ, లిప్‌స్టిక్కూ వేసుకొని, కళ్ళల్లో కాటుకా దిద్దుకోనీ, ఇంకొక “ సీ. రావు” కోసం ఎదురు చూస్తోంది. అసలింతకీ ఇతను “సీ రావు” అయి లెక్కల్లోకెక్కుతాడో  లేక మిగతా అనామకుల్లో చేరిపోతాడో ఇప్పుడే చెప్పలేను.

ఇంకొంచెం దూరంలో ఎక్కడో ఇంకో  కిటికీ దగ్గర నుంచొని, దాదాపు నా అంతే వయసున్న యువకుడు, నాలాగే కిటికీ బయటికి చూస్తూ, జీవితాన్ని గురించీ, సంబంధాలగురించీ ఆలోచిస్తూ వుండోచ్చు. అసలతనికి నేను కూడా, “ఎ.కుమారి”, “బి.కుమారి” కాకుండా, “డీ. కుమారి” నో, మరీ మాట్లాడితే, “జీ.కుమారి”నో, “వై.కుమారి”నో కూడా అయి వుండొచ్చు.

ఇద్దరు అపరిచితులం, ఒకే రకం పరిస్థితుల్లో మా మా హృదయాలని చేతుల్లో పట్టుకొని, ఉద్వేగంతో, ఉత్సాహంతో కలుసుకోబోతున్నాం. తలచుకుంటే కొంచెం వింతగానే వుంది. ఎర్రటి మాంసపు ముద్దల్లాటి హృదయాలని ఒకరికొకరం ఇచ్చి పుచ్చుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఎందుకనో కానీ, నాకు బంతులు ఒకరి మొహానికేసి ఇంకొకరు గురిచూసి కొట్టే ఆట గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేనా  ఆట బాగా ఆడేదాన్ని.

అలా హృదయాలు విసిరేసుకునే కంటే, ఒక్క క్షణం ఆగి, “ప్రియతమా! నా పక్కలో దిగబడ్డ ఈ బాకుని లాగేసి నా గాయానికి మందేయవూ?” అని అడగడం మంచిది కదా? పోనీ, “సీ.రావు”కి ఒక ఫోన్ చేసి అలాగే అడుగుదామని అనుకుంటూండగా- ఎంత విచిత్రం జరిగిందనుకున్నారు?

ఉన్నట్టుండి నా ఎడమ చేయి బరువెక్కింది. ఏమిటా అని చూస్తే, నా ఎడమ అరచేతిలో, ఎర్రగా, దడ దడా కొట్టుకుంటూ, నా హృదయం. ఒక్క క్షణం భయం వేసినా, మళ్ళీ ఎంతో రిలీఫ్‌గా కూడా అనిపించింది. ఎందుకటే, నా హృదయం ముక్కలైపోలేదు. పూర్తిగానే వుంది. హమ్మయ్య!

అయితే, ఒక కొత్త సమస్య వొచ్చి పడింది. నా పక్క డొక్కలోంచి బయటికి వెళ్ళుకొచ్చి ఎడమ పిడికిట్లో నిండి పోయిన నా హృదయాన్నేం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ లోపలికి తోసుకోలేను. చేయి విదిలించినా, అది జారి కిందపడటం లేదు. అసలు అరచెయి నిండా, ఎర్రగా, రక్తం ఓడుతూ, సంకోచిస్తూ, వ్యాకోచిస్తూ, ఎంత అసహ్యంగా వుందో! ఇప్పుడేం చేయడం?

ముందుగా చెత్త బుట్ట దగ్గర నిలబడి చేయి విదిలించి ఆ హృదయాన్ని ఆ చెత్త బుట్టలోకి విసిరేయడానికి ప్రయత్నించాను. ఊహూ, ఆ ఎర్రటి మాంసం ముద్ద నా చేయి వదలనని మొండికేసింది.

అలసిపోయి పక్కనే వున్న కుర్చీలో కూలబడ్డాను, నిస్సత్తువగా! ఒక కవిత మళ్ళీ.

నా చేతిలో వున్న ఈ భారమైన రాయి,

ఆ చెట్టు పైకి విసిరేస్తే,

ఎంత హాయి అది

కానీ ఇది రాయైతే కదా!

కొంచెం ఆలోచించిన పిదప ఒక ఉపాయం తట్టింది. లేచి ఒక పాత దుప్పట్టా అందుకున్నాను. శ్రద్ధగా ఎడమ మోచేయి నుంచీ కిందవరకూ, అరచేతినీ, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎర్రటి హృదయాన్నీ కప్పేసేలా కట్టుకట్టాను. చూసేవారికి చేతికి ఏదో దెబ్బ తాకిందనీ, అందుకని కట్టు కట్టారనీ అనిపిస్తుంది. కట్టుకింద హృదయం కొట్టుకోవడం తెలుస్తూనే వుంది.

ఇక మిగిలింది “సీ.రావు”తో డిన్నర్ ముచ్చట. అతనెలాగూ ఇహ “సీ.రావు” అయ్యే అవకాశం దాదాపు లేనట్టే. అతనికా సంగతి తెలియడం మంచిది.  ఓపిక చేసుకొని ఫోన్ దగ్గరికెళ్ళి “సీ.రావు” నంబర్ డయల్ చేసాను. ఆ రోజు డిన్నర్ కేన్సిల్ అని చెప్పాను. ఏదో జ్వరం అనీ, నోటికొచ్చిన వంక చెప్పాలెండి. ముందు మర్యాదగా నొచ్చుకున్నా, ఆ తరవాత అతని గొంతు చిరాగ్గా అయిందనిపించింది నాకు. ముగించేటప్పుడు ఏదో జోకేసినా, అందులో దాగిన వెటకారం నా దృష్టి దాటి పోలేదు.

“ఏడిసాళ్ళే!” అనుకుని ఫోన్ పెట్టేసాను.

ఆ తరవాత నాలుగు రోజులు ఏ విశేషాలూ లేవు. కిటికీలకున్న పరదాలు లాగి, చీకట్లోనే కూర్చున్నాను. ఆఫీసుకి లీవ్ పడేసాను. చేతికి కట్టిన దుప్పట్టా విప్పేసి నా హృదయం వంకే చూస్తూ గడిపాను. దాని చప్పుడు వింటూ, ఆ హ్రృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఒకటా, రెండా, ముప్ఫై యేళ్ళ కబుర్లు, అంటే దాదాపు ముడొంతుల జీవితం, ఎన్ని కబుర్లుంటాయి.

నా నరాలన్నీ లాగి,

ఎర్రటి వల పేని

జ్ఞాపకాల చేపలని

లాగాలని….

అయితే, నాలుగు రోజులకి అలసిపోయాను. ఎన్ని పాట్లు పడ్డా, నా హృదయాన్ని మాత్రం నా అరచేతినుంచి ఒక్క అంగుళం కూడా కదల్చలేకపోయాను. అది అలాగే అతుక్కుపోయి వుంది. కొంచెం పరీక్షగా చూస్తే కానీ, దానికీ, అరచేతికూ మధ్య వున్న అతుకు కనపడడం లేదు. అసలు అది నా చేతిలోంచే మొలిచిన మాంసపు ముద్దలా వుంది.

అయిదోరోజు ఉదయాన్నే కిటికీ పరదాలని జరిపి బయటికి చూస్తూ నిలబడ్డాను. చాలా విసుగ్గా వుంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు.

వున్నట్టుండి అనిపించింది- బహుశా నేను తప్పు దోవలో ప్రయత్నిస్తున్నానేమో! ముప్ఫై యేళ్ళ జీవితపు జ్ఞాపకాలు తలచుకోవడం వల్ల అది ఇంకా ఇంకా చేతికి అతుక్కుపోయిందే మో| జ్ఞాపకాలు తవ్వుకోవడం మానేసి, కొంచెం సేపలా చల్ల గాలికి తిరిగొస్తే బాగుంటుందనిపించింది. లేచి మళ్ళీ చేతికి దుప్పట్టా కట్టుకట్టి, తల కాస్త దువ్వుకొని, ఫ్లాటు తాళం పెట్టి మెట్లు దిగి బయట వీధిలోకొచ్చా.

కట్టులో వుండి ఎవరికీ కనబడకుండా వున్నా, నా చేయి తలచుకుంటే నాకు చిరాగ్గా వుంది.  చుట్టూ నడుస్తూ వున్న జనం చూస్తే కొంచెం ఇబ్బందిగా, దడగానూ వుంది. వీళ్ళల్లో ఎవరైనా నా అరచేతిలో వున్న నా హృదయాన్నీ చూస్తే ఏమనుకుంటారో! చేయి మెల్లిగా ఎత్తి నా గుండె దగ్గర పెట్టుకున్నాను. చూసేవారికి “పాపం, ఎంత నొప్పిగా వుందో!” అనిపించేలా, ముఖం బాధగా పెట్టాను.  అయితే నా ఇబ్బంది అర్థం లేనిదని మీరూ ఒప్పుకుంటారు. మనం వుంటున్న నగర జీవితంలో చేతికి కట్టుతో కాదు, పూర్తి నగ్నంగా నడిచినా పట్టించుకుని ఆగేవారెవరూ లేరని అందరమూ ఒప్పుకుని తీరాలి.

నడుస్తున్నాకానీ, ఏం చేయాలో అర్థం కాలేదు. పార్కులో నడవనా? ఎక్కడైనా లంచ్‌కి వెళ్ళనా? పోనీ, కొట్టులోకెళ్ళి ఒక డ్రస్సు కొనుక్కుంటే? అలా నడుస్తూ మెట్రో స్టేషన్ దగ్గరకొచ్చాను. సరే,ఊరికే అలా తిరిగొద్దాం అని మెట్రో స్టేషన్‌లో కెళ్ళాను.

వూరికే దిక్కులు చూస్తూ నిలబడ్డ నా ముందు ఒక రైలొచ్చి నిలబడింది. ఏం చేస్తాం! లోపలికొచ్చి పడ్డాను. పెద్దగా జనం లేరు, కానీ అంత ఖాళీగా కూడా లేదు. ఒక ఖాళీ సీటు చూసుకొని కూర్చున్నాను.

రైలు కుదుపుకి కొంచెంగా కన్నంటుకుంది. అంతలో సన్నటి గొంతుతో ఒక పాట వినిపించింది. అది పాటా, లేక కవితా, తెలియడంలేదు.

బంగారు జుంకీలా, బాగున్నాయి చాలా

నిజం, బంగారు జుంకీలు, నాకు చాలా ఇష్టం…

తళ తళా మెరుస్తూ

బంగారు జుంకీలు, ఎంత ఇష్టం.

 ఆమె గొంతులో ఏదొ చిన్న జీర. కళ్ళు తెరిచి ఆ గొంతు వినిపిస్తున్న వైపు చూసాను

ఎవరో ఒకావిడ, పాత చీర కట్టుకోని వుంది. ఆమె చీరా, ఆమె పాటా కంటే, నాకు ఆమె కూర్చున్న విధానం విచిత్రంగా అనిపించింది.

ఆమె కూర్చోవడం అటువైపు వున్న సీట్లో కూర్చున్నా, మొహం భుజం మీదుగా నా వైపు తిరిగి వుంది. ఎందుకో ఏమో మరి! ఆమె కళ్ళు తెరిచే వున్నాయి, కానీ ఆమె ఏదీ చూస్తున్నట్టులేదు. దూరంగా ఎక్కడో చూపు నిలిపి పాడుతోంది.అంత జనం వున్నా, ఆమె ఒంటరిగా వున్నట్టనిపిస్తోంది. చుట్టూ వున్న ఆ జనం ఎవరూ ఆమెకి కనపడుతున్నట్టు లేదు. కొందరు ఆమెని చూసి నవ్వితే, ఇంకొందరు నవ్వాపుకున్నారు. కొందరు కళ్ళతోనే సైగలు చేసుకున్నారు. ఇంకొందరు ఆమెని ఏమీ పట్టించుకోలేదు. ఆమెకి అదేదీ కనబడడం లేదు. తన మానాన తను పాడుకుంటూ పోతోంది.  ఆ పాటలో ఒక రాగమూ, లయా, ఏదీ లేదు. కానీ బిగ్గరగా వినొస్తున్న ఆ గొంతులో ఆమె మనసులో వున్న ఆవేదనంతా తోసుకొని బయటికొస్తున్నట్టనిపిస్తూ వుంది. కాసేపయాక, ఆమె అటు వైపు తిరిగింది.

నాకు తెలుసులే,

నువ్వేమనుకుంటున్నవో,

నాకు తెలుసులే

నీకోసం నేనింకా

ఇంటి దగ్గర ఎదురుచూస్తూంటానని

నువ్వనుకుంటున్నావని

నాకు తెలుసులే

మరయితే బంగారు జుంకీలు

దానికిచ్చావే?

 మళ్ళీ ఆమె భుజం మీదుగా తల తిప్పి అటువైపున్న ఒకతని వైపు అభావంగా చూస్తు పాడసాగింది. మేమందరమూ ఆమె వైపు జాలిగా చూడసాగాము. ఆమె సన్నట్టి విగ్రహమూ, పాలిపోయిన మొహమూ, జాలి గొంతుకా, అందులో ఏదో తెలియని వేదనా, అందరినీ కట్టేసినట్టుగా అయింది. కంపార్ట్‌మెంటంతా ఒకలాటి మౌనం అలుముకుంది. ఆ మౌనంలో ఆమె గొంతు పీలగా, వేదనా భారితంగా

ఇప్పుడు తెలిసిందిలే

నీ గురించంతా

దానితో చెప్పేసాలే,

బంగారు జుంకీల

గురించి నా కంతా

తెలిసిపోయింది

తెలిసిందిలే

 ఇంతలో ఏదో స్టేషనొచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నతను లేచి దిగి వెళ్ళిపోయాడు. నిలబడేవున్న వాళ్ళల్లొ ఎవరూ అక్కడికెళ్ళి కూర్చునే సాహసం చేయలేకపోయారు. అందరం ఆమె వైపు జాలిగా చూస్తూ కూర్చున్నాము. ఆమెతో మాట్లాడాలంటే ఏం మాట్లాడతాం?

“చూడండి మేడం, మీకు ఆరోగ్యం అంత బాగున్నట్టు లేదు. ఇంటికి తీసికెళ్తాను. మీ ఇల్లెక్కడో చెప్పండి. అసలా వెధవ గురించి మరిచిపోండి. వాణ్ణొదిలేయండి,” అననా? అంటే ఆమె యేమంటుంది?

ఘనీభవించిన నొప్పితో ఆమె మళ్ళీ పాట మొదలుపెట్టింది. ఈ సారి ఖాళీ అయిన పక్క సీటు వైపు చూస్తూ,

నాకు తెలిసిపోయిందిలే

బంగారు జుంకీలే కాదు

నా కొత్త మెరుపు చెప్పులు

అవి కూడా దానికే ఇచ్చేసావని

నమ్మక ద్రోహీ

తెలిసిపోయింది నాకు

మూర్తీభవించిన దైన్యం, చల్లటి మంచులాటి దుఃఖం, ప్రేమా, వియోగం, మోసం అన్నీ ఆమెలో ఆమె గొంతులో, చేత్తో తాకేంత దగ్గరగా! ఆమె అక్కడే వున్నట్టే వుంది, కానీ లేనట్టే వుంది. ఆమెపై మాకందరికీ కలుగుతున్న జాలీ, ఏదో అవస్థ గాలిలో. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.

చేతిని కప్పేసి వున్న దుప్పట్టా కింద ఏదో కదిలినట్టయింది. మెల్లిగా తలొంచి దుప్పట్టా కిందికి తొంగి చూసాను. నా హృదయం అర చేతిమీంచి వదులైంది. చటుక్కున ఆ హృదయాన్ని చేతిలోనుంచి మోకళ్ళ మీద పెట్టేసాను. ఇదివరకటిలా వికృతమైన మాంసపు ముద్దలా లేదది. పూర్తిగా, అందంగా, కొట్టుకుంటూ, వేలంటైన్స్ డే కార్డుల్లో ముద్రిస్తారే, అలాగే వుంది. ఈసారి ఆ హృదయాన్ని చూస్తే సంతోషమేసింది.

అందరూ ఆ పాట పాడుతున్న స్త్రీ వైపు  చూడడం మానేసి నా వైపూ, నా హృదయం వైపూ అబ్బురంగా చూడసాగారు. వున్నట్టుండి లేచి నిలబడ్డాను.

ఆ హృదయాన్ని చేతిలో పట్టుకొని నాలుగు అడుగులేసి ఆమె వద్దకు చేరుకున్నాను. ఆమె పక్కన వున్న ఖాళీ సీటుపైన నా హృదయాన్ని పెట్టి పక్కనే నిలబడ్డాను. ఆమె కాసేపు దాని వైపు చూసి, దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంది. ఆ హృదయాన్ని తన గుండెకి హత్తుకుంది.

ఏదో స్టేషనొచ్చింది. అందరూ నా వైపు నవ్వుతూ చూస్తూ వుండగా, తేలిగ్గా రైల్లోంచి దిగిపోయాను. వెనక్కి తిరిగి చూడకుండా, హాయిగా స్టేషన్లోంచి బయటికొచ్చి రోడ్డెక్కాను. ఎంత తేలిగ్గా వుంది! ఆ అందమైన, ఆనందమైన రోజు నా హృదయాన్నిచ్చేసాను. నాకు ఇప్పుడు హృదయమే లేదు. కానీ ఏదో సంతోషం, స్వేచ్ఛా భావన. అడుగు ముందుకేసాను.

ఆ సవ్వడేంటో తెలుసా?

నా నవ్వు,

ఆ నవ్వేది

నేనే !

*

శారద (బ్రిస్బేన్)

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు