ఉర్దూ – తెలుగు బంధం బలపడాలి!

మెహక్ హైదరాబాదీ కలం పేరుతో ప్రసిద్ధులైన పి.వి.సూర్యనారాయణమూర్తి ప్రముఖ ఉర్దూ- తెలుగు అనువాదకులు. విశ్రాంత పాత్రికేయులు. ఇప్పటిదాకా ప్రముఖ ఉర్దూ రచయితల ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కలిపి మొత్తం తొమ్మిది పుస్తకాలు తెలుగులోకి అనువదించారు. ప్రఖ్యాత రచయితలు జిలానీ బానూ కథల సంపుటాలు, ఆమె ఆత్మకథ, అమృతాప్రీతం నవల, సాదత్ హసన్ మంటో కథల సంపుటాలు ఆయన చేసిన అనువాదాల్లో ముఖ్యమైనవి. ఉర్దూలో గజల్స్ కూడా రాశారు. పలు ఉర్దూ పత్రికలకి వ్యాసాలు రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం ఆయన స్వగ్రామం. ఉద్యోగాన్వేషణలో భాగంగా హైదరాబాద్ వచ్చి.. ఉర్దూ నేర్చుకుని ఇప్పుడు ఆ భాషకి సేవచేసే మహదవకాశం పొందారు. కేంద్ర ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ మండలి (ఎన్.సి.పి.యు.ఎల్) సభ్యులుగా ఇటీవల ఆయన నియమితులయ్యారు. ఈ హోదా లభించిన తొలి తెలుగువాడు ఈయనే. సందర్భంగా మెహక్ హైదరాబాదీతో ‘సారంగ’ పక్షాన ఒమ్మి రమేష్ బాబు  ఇంటర్వ్యూ. 
కేంద్ర ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ మండలి (ఎన్.సి.పి.యు.ఎల్) సభ్యులుగా మీరు నియమితులైనందుకు అభినందనలు. దీనిపై మీ స్పందన ఏమిటి?
చాలా ఆనందంగా ఉంది. ఇది నేను అసలు ఊహించనేలేదు. తెలుగువాడినైన నన్ను కేంద్రప్రభుత్వం ఉర్దూ భాషాభివృద్ధి జాతీయ మండలి సభ్యులుగా నియమించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలలో ఉర్దూ అభివృద్ధికి నా వంతు కృషిచేయడానికి ప్రయత్నిస్తాను.
ఉర్దూతో సంబంధంలేని వాతావరణంలో పుట్టి పెరిగిన మీరు ఉర్దూ నేర్చుకుని ఈ స్థాయికి ఎదగడం ప్రతిష్టాత్మకమైన విషయం కదా. మీ పదవీ కాలం ఎన్నాళ్ళు?
ముప్పై ఏళ్ళ క్రితం నేను తొలిసారి ఉర్దూ వర్ణమాల దిద్దినపుడు ఈ భాషను నేర్చుకోవడం వినా నాకెలాంటి లక్ష్యాలూ, అంచనాలూ లేవు. ఉద్యోగం కోసం పట్టుదలతో నేర్చుకున్న ఉర్దూ ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకెళ్లింది. అంతే. నిజానికి నా ఉర్దూ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయ్యిందని భావిస్తున్నాను. ఇది పదవి కాదు. ఒక బాధ్యత. జాతీయ మండలిలో మూడేళ్ళపాటు సభ్యత్వం కొనసాగుతుంది.
ఎన్.సి.పి.యు.ఎల్ విధివిధానాలు చెప్పండి? అందులో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఎక్కడ నుంచి ఎలా పనిచేస్తారు?
 ఇది కేంద్ర ఉన్నత విద్యాశాఖ విభాగంలో ఏర్పాటుచేసిన స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఇందులో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన డైరెక్టర్ ప్రొఫెసర్ ధనుంజయ్ సింగ్ మరో 31 మంది సభ్యులు ఉంటారు. ముగ్గురు ఎంపీలు, ఉర్దూ స్వచ్ఛంద సంస్థల నుంచి ముగ్గురు, ఉర్దూ పండితుల నుంచి నలుగురు, ఉర్దూ అభివృద్ధిపై ఆసక్తి ఉన్న ప్రముఖుల కోటా నుంచి నలుగురు, భాషా మైనారిటీల కమిషనర్ లేదా ఆయన ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వంలోని ఇద్దరు సంయుక్త కార్యదర్శులు, ఉర్దూ భాషీయులు గణనీయంగా ఉన్న మూడు రాష్ట్రాల నుంచి ముగ్గురు, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్, సాహిత్య అకాడెమీ, నేషనల్ బుక్ ట్రస్ట్ ఛైర్మెన్ లు, కేంద్రీయ హిందీ డైరెక్టరేట్, కేంద్రీయ హిందీ సంస్థాన్, భారతీయ భాషల కేంద్రీయ సంస్థ, ఎన్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్లు, యు.జి.సి, ఐ.సి.సి.ఆర్ ప్రతినిధులు తదితరులు సభ్యులుగా ఉంటారు.
జాతీయ మండలి ఉర్దూ, అరబిక్, ఫార్సీ భాషలకు సంబంధించి కోర్సులు, సాంకేతిక కోర్సులు నిర్వహిస్తుంది. కంప్యూటర్ అప్లికేషన్స్, బిజినెస్ అకౌంటింగ్, డిటిపిపై డిప్లొమా, ఉర్దూ, అరబిక్, కేలిగ్రఫీ గ్రాఫిక్ డిజైనింగ్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ లలో డిప్లొమా, అరబిక్, ఫార్సీలో సర్టిఫికెట్ కోర్సులు చదువుకోవచ్చు. వీటి కోసం దేశవ్యాప్తంగా జాతీయ మండలి గుర్తింపు పొందిన వందలాది స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఉర్దూ డిప్లొమా కోర్సును నిబంధనల మేరకు నిర్వహించే సెంటర్లలో పార్ట్ టైమ్ ఉర్దూ టీచర్ కు నెలకు రూ.4,000 గౌరవ వేతనం ఇతర నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ. 700 చొప్పున జాతీయ మండలి చెల్లిస్తుంది. ఇలాంటివి దేశంలో 887 స్టడీ సెంటర్లు దాకా ఉన్నాయి.
ఎన్.సి.పి.యు.ఎల్ పథకాలలో భాగంగా అకడమిక్ స్కీములు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీములు, శాంక్షన్ ఆర్డర్లు అమలుచేస్తుంది. అకడమిక్ స్కీముల కింద స్టడీ సెంటర్ల ఏర్పాటు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ప్రాచీన రాతప్రతుల ప్రచురణకు ఆర్థిక సాయం, భారీస్థాయిలో ఉర్దూ కవులు, రచయితలు, విమర్శకుల పుస్తకాలు, పత్రికలు కొనుగోలు చేస్తుంది. సెమినార్లు, ముషాయిరాలకు ఆర్థిక సాయం అందిస్తుంది.
ఎన్.సి.పి.యు.ఎల్ కార్యక్రమాల అమలులో ఒక సభ్యుడిగా నేను ఆయా సమావేశాలకు హాజరై సలహాలు, నివేదికలు సమర్పించాలి. జాతీయమండలి విధానాలు, కార్యక్రమాల అమలుకు తగిన సూచనలు చేయాల్సి ఉంటుంది. స్టడీ సెంటర్ల ఏర్పాటు, రచయితల పుస్తకాల బల్క్ కొనుగోలు ప్రతిపాదనలకు మేము సిఫార్సు చేయాల్సి ఉంటుంది.
 ఒక మాధ్యమంగా ఉర్దూ భాష గురించి మీ అభిప్రాయం చెప్పండి?
 ఉర్దూను ఒక మాధ్యమంగా ప్రాథమిక స్థాయినుంచి చదువుకొనే విద్యార్థులు గణనీయంగా తగ్గిపోతున్నారు. ప్రపంచీకరణ ప్రభావం, ఇంగ్లిషు ఉపాధినిచ్చే అంతర్జాతీయ భాష కావడం, ఇంకా ఇతర కారణాల వల్ల మాతృభాషలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విద్యార్థులు బాగా తక్కువగా ఉన్నారు. తెలుగులో పరిస్థితి దారుణంగా ఉంటే, ఉర్దూలో ఘోరంగా ఉంది. ఉర్దూ మాతృభాష గల కుటుంబాలవారు తమ పిల్లలను ఇంగ్లిషు మీడియంలో చదివించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. ఈ ధోరణి చాలా ఏళ్ళ క్రితమే ప్రారంభమయ్యింది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఇంగ్లిషు నేర్చుకోవాల్సిందే. కానీ, అదే సమయంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం సరికాదు.
ఏదైనా భాషకు ఇలాంటి భాషాభివృద్ధి సంస్థలు లేదా పీఠాలు ఎలాంటి తోడ్పాటును అందించగలుగుతాయి?
 భాషాభివృద్ధి సంస్థలూ, పీఠాలూ భాషను ప్రోత్సహించే విధంగా వాటి పరిధిలో కార్యక్రమాలు చేస్తాయి. కానీ, పౌర సమాజం, ప్రజలు వాటిని అందిపుచ్చుకోవాలి. తమ భాషను కాపాడుకొని, అభివృద్ధి చేసుకోవాలన్న సోయి, తపన వారిలో కూడా ఉండాలిగా.
గతంలో ఈ సంస్థ ఏ విధంగా భాషాభివృద్ధికి తోడ్పడిందో అధ్యయనం చేశారా?
 1996లో ఎన్.సి.పి.యు.ఎల్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఉర్దూ అభివృద్ధికి మంచి కృషిచేసింది. ఉర్దూ సాహిత్యం, కావ్య విమర్శ, ఆ భాషలో వివిధ సబ్జెక్టులకు సంబంధించి అనువాదాలు అన్నీ కలిపి 1500 దాకా పుస్తకాలను జాతీయ మండలి ప్రచురించింది. ఇవి సబ్సిడీ ధరలకు దొరుకుతాయి. దక్షిణాదిన ఎన్.సి.పి.యు.ఎల్ ప్రచురించిన పుస్తకాలు హైదరాబాద్ చార్మినార్ వద్ద ప్రాంతీయ కార్యాలయంలోని స్టోర్ లో దొరుకుతాయి.
సాంకేతిక ప్రగతికి తగ్గట్టుగా ఆధునిక పరిభాష ఉర్దూలో విస్తరిస్తోందా? ఆ ప్రయత్నం జరుగుతుంటే.. మీకు తెలిసిన విషయాలు చెప్పండి?
విద్యా విషయకపరంగా చూస్తే ఉర్దూలో భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జంతుశాస్త్రం వంటి సైన్స్ సబ్జెక్ట్ లకు పాఠ్యపుస్తకాలు ఉన్నాయి. కానీ, డిగ్రీస్థాయిలో ఉర్దూ మీడియంలో సబ్జెక్ట్ ల బోధన చాలా కొన్ని కాలేజీలకే పరిమితం. ఇక కొత్తగా పుట్టుకొస్తున్న సాంకేతిక పదజాలానికి ఉర్దూలో సమానార్థకాల రూపకల్పన ప్రక్రియ జరగాల్సినంతగా జరగలేదు. మీడియాలో కూడా సాంకేతిక ఇంగ్లిషు పదాలను అట్లాగే ఇంగ్లిషును యథాతథంగా వాడేస్తున్నారు.
ఈ హోదా ద్వారా ఉర్దూ భాషాభివృద్ధి కోసం కృషి చేయడానికి మీరెలాంటి ప్రణాళిక రూపొందించుకున్నారు?
 తెలంగాణలో ఉర్దూని ద్వితీయ అధికారభాషగా ప్రకటించినా దాని అమలు అంతంత మాత్రమే. ఆ నిర్ణయం జీవో కాగితాలకే పరిమితమయ్యింది. సచివాలయం, రాష్ట్రస్థాయి కమిషనరేట్లు, జిల్లా కలెక్టరేట్లలో ప్రజలు ఉర్దూలో అర్జీలిస్తే చదవగలిగి చర్యలు తీసుకునే అధికారులు లేరు. చాలా ప్రాంతాల స్కూళ్ళలో ఉర్దూ మీడియం లేకపోవడం, హేతుబద్ధీకరణ పేరిట కొన్ని స్కూళ్లను ఎత్తేయడంతో అది మాతృభాషగా గల విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు.
టెన్త్ తర్వాత డ్రాప్అవుట్ పిల్లలకు, కనీస విద్యార్హత టెన్త్ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయివుంటే, ఎన్.సి.పి.యు.ఎల్ ఆఫర్ చేసే ఉర్దూలో డిప్లొమా సర్టిఫికెట్ కోర్సులు, సాంకేతిక కోర్సులు చదువుకోవచ్చు. రాష్ట్రంలో మరిన్ని స్టడీ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తాం. ఉర్దూని ఒక వర్గానికి సంబంధించిన భాషగా ముద్రవేయకుండా దాన్ని మెజారిటీ ప్రజలు కూడా నేర్చుకుంటే భాష వికాసం జరుగుతుంది. ఉర్దూ నేర్చుకోడానికి గత కొన్నేళ్లుగా చాలామంది తెలుగువారు ఆసక్తి చూపడం గమనించాను. వీరి కోసం హైదరాబాద్ లో స్టడీ సెంటర్ల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తా. ఏదైనా కొత్త భాష ద్వారా ఉపాధికి అవకాశం ఉంటే దాన్ని ఆసక్తిగా నేర్చుకుంటారు. ఇక సాహిత్యం, కళలు, చరిత్ర, పరిశోధనకు సంబంధించి ప్రామాణిక గ్రంథాలను ఇతర భాషల నుంచి ఉర్దూలోకి అనువదించే వారిని ప్రోత్సహిస్తాను.
*

ఒమ్మి రమేష్ బాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు